Phanikiran AK

Drama

4.7  

Phanikiran AK

Drama

బాల్యమే కానుక

బాల్యమే కానుక

7 mins
23.1K


"చింటూ, చింటూ " 


తల్లి పిలుపుకు ఓ సారి వెనక్కు తిరిగి చూసి, మళ్ళీ బయటకు దృష్టి సారించాడు 8 ఏళ్ళ చింటూ. 

బయట పడుతున్న వర్షాన్ని చూడడంలో మునిగిపోయాడు.


కొడుకు ఎంతకీ పలకకపోయేటప్పటికి ,పకోడీలు వేయడం పూర్తి చేసి ,చేతులు కడుక్కుని కొంగుకు చేతులు తుడుచుకుంటూ వంట ఇంటిలోంచి బయటకు వచ్చిన ప్రవీణ, కిటికీ దగ్గర నుంచుని తదేకంగా పడుతున్న వర్షాన్ని చూస్తున్న తన ఎనిమిదేళ్ల కొడుకు హర్ష ను చూసి ...


"చింటూ ...ఇక్కడే ఉన్నావా.. ఇంకా ఆడుకోడానికి వెళ్ళావ్ ఏమో అనుకున్నా నువ్వు పలకకపోయేటప్పటికి" అని అడుగుతూ దగ్గరికి వచ్చింది.


తలెత్తి తల్లి వైపు ఓ సారి చూసి ,తిరిగి బయట కురుస్తున్న వర్షం చూడడం లో లీనమయ్యాడు చింటూ .


"అదేంట్రా అలా ఉన్నావు... ఆడుకోవడానికి వెళ్లలేదా "అని అడిగింది


దానికి చింటూ..


"ఎవరు ఆడుకోవడానికి రావట్లేదమ్మా" అన్నాడు


"అదేంట్రా రోజు నీ ఫ్రెండ్స్ బోల్డు మంది ఉన్నారు ...రోజూ ఆడుకుంటావు కదా ....ఈరోజు రాకపోవడం ఏమిటి" ఆశ్చర్యంగా అడిగింది


"బయట వర్షం పడుతోందని రామన్నారమ్మ... నేను వెళ్లి అడిగితే రాహుల్ వాళ్ళ అమ్మ అయితే గట్టిగా అరుస్తూ , తిట్టి మొహం మీదనే తలుపులు వేశారు "చెప్పాడు .


"తిట్టడం ఎందుకురా.."


"వర్షం లో ఎవరైనా ఆడతారా ...ఆడితే ఆరోగ్యం పాడై మళ్ళీ స్కూలు మానేస్తారు.... స్కూలు మానేస్తే ఎలాగ అంటూ తిట్టారు అమ్మ" అన్నాడు చింటూ .


"బాగుంది వర్షంలో ఆడితే ఏమవుతుంది ...మహా అయితే జలుబు దగ్గు జ్వరం వస్తాయి ...అంతే కదా దానికి స్కూల్ మానేస్తే ఏమవుతుంది... మహా అయితే రెండు రోజులు... ఈ మాత్రం లోనే ఏమై పోతుంది రా "ఆశ్చర్యంగా అంది ప్రవీణ


"ఏమోనమ్మా ..ఎవరు రాము "అన్నారు దిగాలుగా అన్నాడు చింటూ .


చింటూ వైపు చూసింది ప్రవీణ ....తాము ఈ అపార్ట్ మెంట్ కు వచ్చి ఆరు నెలలు అవుతోంది...


తన భర్త ప్రకాష్ వేరే కంపెనీ లో జాయిన్ అవ్వడంతో ,ఇంతకుముందు ఉన్న ఇంటికి ఈ కంపెనీ దూరం అవడం ట్రాఫిక్ లో రావడానికి చాలా టైం పడుతోంది ...దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు మారి ఈ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కి వచ్చారు ...ఇక్కడకు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉంది తను ... ఎవరు ఎవరితోనూ సంబంధం లేకుండా ఎంతసేపు తలుపులు బిగించుకుని లోపలే ఉండడం, బయట కనపడిన ఏదో మొక్కుబడిగా ఓ నవ్వు నవ్వడం ,అసలు కొంతమందికి పక్క ఫ్లాట్ లో ఎవరున్నారో కూడా తెలియకపోవడం, తనకు కూడా ఒక్కోసారి చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఆ పద్ధతి....

ఇంతకు ముందు వున్నది ఊరికి కొంచెం దూరం అయినా , అక్కడ ప్రైవేట్ హౌస్ కావడం ,ఆ ఇంట్లో ఆరు పోర్షన్ లు ఉండడం ,ఒక పోర్షన్ లో ఇంటి ఓనర్స్ పరంధామయ్య గారి దంపతులు ఉండేవారు. ..మిగిలిన ఐదు వాటాలను అద్దెకి ఇచ్చారు. ...అందరికీ తన కొడుకు ఈడు పిల్లలు ఉన్నారు ...పిల్లలు అందరూ కలిసి స్కూల్ నుంచి వచ్చాక సరదాగా ఆడుకోవడం , ఆపై అందరూ కలిసి చదువుకోవడం చేసేవారు....


ఇక వర్షం వచ్చిందంటే చెప్పక్కర్లేదు... పిల్లలు అందరూ ఎంతో ఆనందంగా గంతులు వేసే వారు... ఆ వర్షంలో తడుస్తూ బోలెడు ఆటలు ఆడేవారు......కాగితంతో చిన్న చిన్న పడవలు చేసి వర్షం వల్ల ఏర్పడిన నీటి గుంటలలో వదిలి అవి గాలికి కదులుతుంటే సంబరపడేవారు. ....దానికి తోడు ఇంటి ఓనర్ పరంధామయ్య గారు కూడా పిల్లలతో పిల్లల్లా కలిసి పోయి ఆ వర్షంలో ఆడుతూ వాళ్ళని ఆడిస్తూ ఎంతో అల్లరి చేసేవారు. ...పరంధామయ్య గారి భార్య శాంతమ్మ గారు కూడా భర్త అల్లరిని మురిపెం గా చూస్తూ పిల్లలకి ఏదో ఒకటి వేడివేడిగా చేసి పెడుతూ ఉండేవారు .....వర్షం లో తడిసి పిల్లలు జ్వరం తెచ్చుకుని స్కూలు మానేసిన ఎవరూ పెద్దగా దాని గురించి ఫీలయ్యేవారు కాదు... కారణం స్కూల్ మానేసిన రెండు రోజుల పాఠాలని పిల్లల్ని కూర్చోబెట్టి పరంధామయ్యగారు చెప్పి వాళ్ల చేత అంతే చక్కగా చదువు కూడా చదివించే వారు ....అక్కడినుంచి వచ్చేస్తుంటే అందరూ చాలా బాధ పడ్డారు ...


కానీ తప్పనిసరిగా ఇక్కడికి రావాల్సి వచ్చింది... ఒక్కసారి కళ్ళముందు ఆ విషయాలు కదిలి కొడుకుని చూస్తే బాధ అనిపించింది ...ఇక్కడ పిల్లల ఆటలు కూడా ఏదో మొక్కుబడిగా అన్నట్టుగా ఉండేది... పోనీ అలా అని పిల్లలు ఏమైనా బాగా చదువుతారు అంటే ఏవో గ్రేడ్స్ వస్తున్నాయి అని చెప్పడమే తప్ప గట్టిగా ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి పిల్లలది ...చదువుతోపాటు లోకజ్ఞానం కూడా ఉండాలనేది పెద్దలమాట ...కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఉంటోంది ఇప్పుడు పిల్లల పద్ధతి...


నిజానికి హర్ష చదివే స్కూలు తాము ఉన్న అపార్ట్మెంట్ కు కొంచెం దూరమైనా ఆ స్కూలు మార్చడం ఇష్టంలేక స్కూల్ బస్సు మాట్లాడి పాత స్కూల్ కే పంపిస్తున్నారు .హర్ష కూడా అంత దూరం వెళ్లి చదువుకోవడమా అని అనుకోవడం లేదు... తన ఫ్రెండ్స్ అందరూ అదే స్కూల్లో ఉండడంతో ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఆడుకుని బుద్ధిగా చదువుకుంటున్నాడు.. చదువు విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదు అని ఆలోచిస్తున్న ప్రవీణ ,హర్ష ను అలా చూడలేక ..


"సరే వాళ్ళు రాకపోతే నువ్వు నేను ఆడుకుందాం పద" అంది


"నిజంగానా అమ్మ "మొహం ఇంత చేసుకుని అడిగాడు హర్ష


"నిజంగానే .. పద మన ఇద్దరం ఆడుకుందాం "అంటూ కొడుకు చేయి పట్టుకుని తాళం తీసుకుని బయటకు వచ్చి తలుపు తాళం వేసి అపార్ట్మెంట్ నుంచి కింద సెల్లార్లో కి వచ్చింది ప్రవీణ.


విశాలంగా ఉండే అపార్ట్మెంట్ కింద కొంత ఓపెన్ ప్లేస్ కూడా ఉండి చుట్టూ చాలా ప్లేస్ ఉండడంతో చాలా అందంగా ఉంటుంది .

కొడుకుతో కలిసి ఆటలు మొదలు పెట్టింది . ప్రవీణ ని, హర్ష ని చూసిన అపార్ట్మెంట్ వాచ్మెన్ పిల్లలు సైతం వాళ్లతో కలిసి ఆటలు మొదలుపెట్టారు...


కాసేపటికి వాచ్మెన్ కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు.


ఇదంతా తమ ప్లాటు కిటికీలోంచి చూస్తూ పిల్లలంతా లోలోపలే బాధపడుతుంటే ,పెద్దవాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు .


కొంతసేపటికి ప్రవీణ వాళ్ళు ఉండే ఫ్లోర్ లోని పక్క ఫ్లాట్ లో ఉండే లలిత తన కొడుకు రాహుల్ ని తీసుకుని కిందకు వచ్చింది.


అదే సమయంలో ప్రకాష్ ఆఫీస్ నుంచి వచ్చి కార్ పార్క్ చేస్తూ ప్రవీణ ,హర్ష వర్షంలో ఆడటం చూసి... త్వరగా కార్ పార్క్ చేసి వచ్చి వాళ్లతో కలిశాడు.

తను పిల్లల్లో పిల్లల్లా కలిసి ఆడుతుంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోయారు ..


అలా దాదాపు ఓ అరగంట పైనే ఆడారు.... ఈ లోపు వర్షం కూడా కొంత తగ్గుముఖం పట్టడంతో ఇక ఎవరింటికి వాళ్లు వచ్చేసి, తడిసిన బట్టలు తీసి ఫ్రెష్ అయ్యి కూర్చున్నారు ...


హర్ష ఆనందానికి అవధులు లేవు .


ప్రవీణ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసింది.. ఆపై చేసిన పకోడీలు హర్ష కి ప్రకాష్ కి పెట్టి వేడి వేడిగా హెర్బల్ టీ పెట్టి ఇద్దరికి ఇచ్చి, తను తాగింది.


హర్ష కాసేపు తండ్రి తో కూర్చుని కబుర్లు చెప్పి, ఆపై తన గదికి వెళ్ళిపోయాడు చదువుకోవడానికి ....


కొడుకు తన గదికి వెళ్లిన తర్వాత అప్పుడు అడిగాడు ప్రకాష్ "ఈరోజు ఏంటి నువ్వు వర్షంలో ఆట మొదలు పెట్టావు" అని


అప్పుడు ప్రవీణ హర్ష అన్న మాటలు చెప్పింది .


నిజానికి ప్రకాష్ కు కూడా ఆ అపార్ట్మెంట్ వాతావరణం నచ్చలేదు..... కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉండాల్సి రావడంతో ఎలాగోలా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాడు


"ఏంటో...ఈ కాలంలో పిల్లల బాల్యానికి కాక చదువు లకే ప్రాముఖ్యత ఇవ్వడం చూస్తుంటే, కాలం గడిచే కొద్దీ రాబోయే తరాలకి అసలు బాల్యం అంటే ఇలా ఉంటుంది అని డాక్యూమెంటరీలలోను, మ్యూజియం లలోను చూపించాల్సిన దుస్థితి వస్తుందేమో అని భయంగా'ఉంది" అంది ప్రవీణ


ఏదో అనడానికి నోరు తెరవబోయిన ప్రకాష్, కాలింగ్ బెల్ మోగడంతో ఆగిపోయాడు. ...


వెళ్లి తలుపు తీసిన ప్రవీణ , ఎదురుగా లలితను , ఆమె భర్త రామ్ ను చూసి, 


"రండి" అంది చిరునవ్వుతో ఆహ్వానించింది.


లోపలకు వచ్చిన వాళ్ళకు సోఫా చూపించి కూర్చోమన్నాడు ప్రకాష్. .


6 నెలలుగా పక్క పక్క ఫ్లాట్స్ లో ఉంటున్నా, ఎప్పుడైనా లలిత ప్రవీణ మాట్లాడుకోవడమే తప్ప ఇప్పటివరకూ ప్రకాష్ , రామ్ లకు పరిచయం లేదు. 


"నా పేరు ప్రకాష్....టెక్ సోలుషన్స్ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని" అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు...


"నా పేరు రామ్....ఇంటీరియర్ డిజైనర్ గా సొంతం గా ఆఫీస్ రన్ చేస్తున్నాను" పరిచయం చేసుకున్నాడు రామ్.


ప్రవీణ లోపలకు వెళ్లి , హెర్బల్ టీ చేసి తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది.


"రాహుల్ ఏడి" అడిగింది ప్రవీణ.


అప్పుడే వచ్చాడు రాహుల్. ..


రాహుల్ కో కప్ లో పోసి టీ ఇస్తుంటే , వద్దన్నది లలిత. 


"ఇది హెర్బల్ టీ....వర్షం లో తడిశాడుగా.....ఇది తాగితే జలుబు అవి రాకుండా కొంత వరకు'పనిచేస్తుంది" అని రాహుల్ కు ఇచ్చి, హర్ష లోపల ఉన్నాడు వెళ్ళమని చెప్పడంతో, రాహుల్ టీ కప్ తీసుకుని హర్ష గదికి వెళ్ళాడు.


"ఏంటో లైఫ్....ఆరు నెలలుగా పక్క పక్కనే ఉంటున్నా ఒకరికొకరు పరిచయం లేదంటే వినడానికే ఏదోగా ఉంది..." అన్నాడు రామ్


"నిజమేనండీ...నేను చాలా సార్లు పరిచయం చేసుకోవాలని ప్రయత్నించినా అందరూ ఏదో బిజీగా ఉన్నట్టుగా మొక్కుబడిగా మాట్లాడుతుంటే, వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను మౌనంగానే ఉండిపోయాను." అన్నాడు ప్రకాష్.


"ఈ రోజు వర్షం కారణంగా ఇలా మీతో పరిచయం చేసుకునే అవకాశం కలిగింది....." అన్నాడు రామ్.


"అవును ప్రవీణ...రాహుల్ కు వర్షం అంటే చాలా ఇష్టం....నిజానికి నాకు, మావారికి కూడా ఇష్టమే...కానీ ఏంటో హెల్త్ పాడవుతుంది అని, పిల్లలు స్కూల్ మానేస్తే ఎలాగా అని మా ఇష్టాలనే కాదు వాడి ఇష్టాన్ని కూడా అణిచేస్తున్నాం....వర్షం పడినప్పుడల్లా మా చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో గడపడమే...ఒక్కోసారి రాహుల్ అడిగే ప్రశ్నలకి మా దగ్గర సమాధానాలు కూడా ఉండేవి కాదు....ఒకసారి అడిగాడు....*మీరందరూ వర్షం లో ఎంజాయ్ చేశారు...వాటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ కిడ్స్ లాగా సంతోష పడుతున్నారు..మరి నన్నెందుకు వద్దంటారు...నాకు అలాంటి మెమొరీస్ ఉండాలిగా అని*.... ఆరోజు వాడు అడిగిన ప్రశ్న కు మేమెంత బాధపడ్డామో, జీవితం అంటే ఎంత చిరాకు వేసిందో చెప్పలేం...ఈ రోజు మిమ్మల్ని చూసి, ధైర్యం చేసి వాడిని తీసుకుని వర్షం లో ఆడడానికి తీసుకొచ్చి నేను చాలా మంచి పని చేశాను అనిపించింది వాడి మోహంలో ఏనాడు చూడని సంతోషం చూశాకా....వాడి పుట్టినరోజున వాడికి ఇష్టమైన వంటకం చేసినప్పుడు కానీ, వాడు అడిగినది కొని గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు గానీ వాడి మోహంలో అంత సంతోషం ఎప్పుడూ చూడలేదు....పిల్లల చిన్న చిన్న సరదాలు కూడా మనం తీర్చలేని స్థితిలో ఉన్నామా అని అనిపించింది...ఎంత సేపు ఆరోగ్యం పాడైతే ఎలా, డాక్టర్లకు పోయాలి, స్కూల్ మానేస్తే ఎలా అనే తప్ప చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకుండా మరీ మనం కూడా యంత్రాల్లా తయారు అవుతున్నామా అని అనిపిస్తోంది" అంది లలిత.


"అవునండీ...లలిత చెప్పింది నిజమే...ఏరోజు లేనిది, ఈ రోజు వాడు నేను రాగానే నాతో కూర్చుని కబుర్లు చెప్తూ, తను , వాళ్ళమ్మ ఎలా వర్షం లో ఎంజాయ్ చేసింది చెప్తుంటే వాడి మొహం లో సంతోషం ముందు, డాక్టర్లకు పొసే డబ్బులు, చదువు ఏమీ గుర్తు రాలేదు...ఆ సంతోషం అలాగే ఉంచే వరం చాలు అనుకున్నా...ఇదంతా మీ వల్లే సాధ్యం అయ్యింది" అన్నాడు రామ్.


"భలేవారే...ఇందులో మేం చేసింది ఏమీ లేదు...నిజమే మందులు కొనాలి , చదువులు ఎక్కడ పాడవుతాయో అని భయపడతాం..కానీ చిన్న చిన్న సమస్యలను తట్టుకోవడం నేర్పకపోతే రేపు పెద్దయ్యాకా వాళ్ళు ప్రతీ దానికి భయపడుతూ బ్రతకాలి....ఆనందం అనేది మచ్చుకు కూడా వాళ్ళ జీవితాలలో కనపడదు...ఈ చిన్న చిన్న ఆనందాలే వారికి రేపు తీయని జ్ఞాపకాలుగా, బాధల నుండి బయటపడడానికి, మర్చిపోవడానికి మందు గా పనిచేస్తాయి...మనకి ఏదైనా బాధ కలిగినపుడు మన బాల్యం తలుచుకుని ఎలా ఊరట పొందుతామో మనం వేరే చెప్పాలా" అన్నాడు ప్రకాష్.


"నిజమే నండీ...ఆ బాల్యం తిరిగి వస్తే ఎంత బాగుంటుందో అని అనుకున్న రోజులు ఎన్నో.....అందుకే మా వాడి బాల్యాన్ని వాడికి మనస్ఫూర్తిగా అనుభవించే అవకాశాన్ని వాడికి కానుకగా ఇవ్వాలని, నిజమైన సంతోషాన్ని వాడిలో చూడాలని నిర్ణయించుకున్నాం మేము. ఆ నిర్ణయానికి మీరే కారణం కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాము. ." అన్నాడు రామ్.


"అయ్యో...ఇందులో మేం చేసింది ఏముంది...మీ వాడికి బాల్యాన్ని ఇవ్వాలన్న మీ నిర్ణయం హర్షించదగ్గదే....నిజానికి అందరూ ఇలా ఆలోచిస్తే, పిల్లపై మానసిక ఒత్తిడి తగ్గి, చిన్న సమస్యలకు కుంగిపోకుండా, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడగట్టుకుని, అనుకున్నది సాధిస్తారు..విజేతలు అవుతారు" అన్నాడు ప్రకాష్.


అది నిజమే అంటూ అందుకు అంగీకారంగా తలలూపారు లలిత, రామ్ లు.Rate this content
Log in

Similar telugu story from Drama