STORYMIRROR

Phanikiran AK

Drama Inspirational Others

3  

Phanikiran AK

Drama Inspirational Others

ఆరంభం...ఒక్క అడుగుతో ప్రారంభం

ఆరంభం...ఒక్క అడుగుతో ప్రారంభం

25 mins
475

వైజాగ్ బీచ్ ...

సాయంకాలం కావడంతో చాలా రద్దీగా ఉంది...అందులోను వేసవికాలం కావడంతో తమ ఇళ్లకు వచ్చిన వేసవి శెలవుల అతిథులను తీసుకుని వచ్చిన జనాలతో కోలాహల౦గా ఉంది ...

ఓ చోట ఇసుకలో కూర్చుని తదేకంగా అలల వైపు చూస్తున్న కౌశిక , తనకు అతిదగ్గరలో వినబడిన కంఠానికి తలతిప్పి చూసింది.

ఓ యువతి , ఎవరో ఓ యువకుడిని చేయి పట్టి లాగుతూ , బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది...ఆ యువకుడు , ఆ యువతీ పట్టు నుండి విడిపించుకుని వేగంగా అలల వైపు పరిగెత్తాడు...

వెనకే ఆ యువతి పరిగెత్తింది.

ఆ యువకుడి ఉద్దేశ్యం అర్ధ౦కావడ౦తో , ఒక్క ఉదుటున కూర్చున్న చోటునుండి లేచి వారి వైపు పరిగెత్తింది కౌశిక.

ఆ యువకుడిని, అలలు లోపలకు లాగే ఆఖరిక్షణంలో ఆ యువకుడి షర్ట్ని బలంగా పట్టుకుని ఒడ్డుకు వస్తున్న కౌశికను చూసి ఇద్దరు యువకులు కౌశికకు సాయంగా వెళ్లారు.

ఒడ్డుకు తీసుకొచ్చి పడుకొబెట్టి, తడిసిన తన కుర్తీని పిండుతూ , తన హ్యాండ్బాగ్ తీసుకుని అక్కడి నుండి కదిలింది కౌశిక.

చుట్టూ జనం గుమికూడారు...ఆ యువకుడిని ఆపాలని చూసిన యువతి ప్రథమ చికిత్స చేయడంతో స్పృహలోకి వచ్చాడు ఆ యువకుడు.

ఓ పక్కగా ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ తీసుకుని, డబ్బులిచ్చి, పేపర్ గ్లాస్ తీసుకుని తాగుతూ అక్కడి నుండి నెమ్మదిగా నడుస్తూ బస్సు స్టాండ్ వద్దకు వచ్చి, ఖాళీ అయిన గ్లాస్ని అక్కడ ఉన్న డస్ట్బిన్ లో వేసి, చేతికున్న రిస్ట్ వాచ్ వైపు చూసింది ..

టైం 10:30 పీఎం అని చూపించింది.

అప్పుడే ఓ స్కూటీ వచ్చి కౌశిక ముందు ఆగింది.

"ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యింది" వచ్చిన యువతి అంది .

"ఇట్స్ ఒకే..పద ' అంటూ వెనక కూర్చోబోతుంటే..

"ఏంటే బట్టలు తడిగా ఉన్నాయి...కొంప తీసి సముద్రలోకి గానీ డైవ్ చేశావా..సూసైడ్ అటెంప్ట్ ఆ " అడిగింది.

"సుధా...సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం నాకేంటి " ప్రశ్నించింది

" అంటే వచ్చిన దగ్గర్నుంచి ఏదో ఆలోచిస్తున్నావు...మౌనంగా ఉంటున్నావు....ఇక్కడి స్టూడియో కు కూడా వెళ్లటంలేదు ..ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఏమో అని డౌట్ ..అందుకే అడిగా"

"సుధా" చురుగ్గా పిలిచింది.

"సారీ సారీ...జస్ట్ కిడ్డింగ్ ...అలా చూడకు...నీ గురించి తెలిసీ అలా జోక్ చేయడం నాదే తప్పు...సారీ..ఇకముందు ఎప్పుడూ అలా జోక్ చేయను..ప్రామిస్..నవ్వవే " బ్రతిమలాడింది సుధ,

"సరే...పద" అని కూర్చోబోతుంటే...

అప్పుడే ఇంతకు ముందు కౌశికకు యువకుడిని కాపాడే టై లో సాయం చేసిన ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు...వాళ్ళల్లో ఒకరు కౌశికను చూసి ...

" హలో మిస్...మీ స్పీడ్ రియాక్షన్ సూపర్" అంటూ పొగిడాడు.

తలతిప్పి చూసింది కౌశిక.

సుధను చూసిన ఆ యువకుడు ..

"హే సుధా ..నువ్వెంటి ఇక్కడ...తను నీకు తెలుసా...నీ ఫ్రెండా" అడిగాడు.

" కిషోర్ ..నువ్వా...తను నీకు తెలుసా" అడిగింది సుధ

" జస్ట్ ఇప్పుడే ఒకరిని కాపాడడం చూశాను" చెప్పాడు కిషోర్.

" ఓ..అందుకేనా తన డ్రెస్ తడిసింది...ఎనీవే తను నా ఫ్రెండ్ కౌశిక ..వారం క్రితమే బెంగుళూరు నుండి వచ్చింది ...నాతో పాటే ఫ్లాట్ లో ఉంటోంది..ఉంటుంది"

"ఓహ్ ...అవునూ ఆ యువకుడు మీకు తెలుసా ?" అడిగాడు

"ఓ ప్రాణం కాపాడడానికి వాళ్ళు తెలుసుండాలా?" ఎదురు ప్రశ్నించింది కౌశిక

"అయ్యో ..నా ఉద్దేశ్యం అదికాదు...జస్ట్ కాజువల్ గా అడిగాను అంతే"....కంగారుగా అన్నాడు

"కాజువల్గా కాదు ...కావాలనే అడిగారు".....సూటిగా అంది

"కావాలనా !?"

"మాటలు పొడిగించడానికి ఏదో ఓ సాకు కావాలిగా మీ అబ్బాయిలకి"

" అయ్యయ్యో ...మీరు నన్ను అపార్ధం చేసుకుంటున్నారు...నేను రాముడు మంచి బాలుడు టైపు అండి "

" ఇంకెప్పుడు మీ గురించి మీరే ఇలా౦టి స్టేట్మెంట్స్ ఇవ్వకండి...డౌట్స్ లేని వాళ్ళకు కూడా డౌట్స్ వస్తాయి" చురుగ్గా అంది కౌశిక.

షాక్ అయ్యాడు కిశోర్ .

"ఏమనుకోకు కిశోర్ ...తన మాటలు కొంచెం సూటిగా ఉంటాయి ..ముందొక మాట, వెనకొక మాట మాట్లాడే అలవాటు లేదు తనకు...అర్ధం చేసుకో " ఆపాలజిటిక్ గా అంది సుధ.

నవ్వాడు కిషోర్ .

"బై ది వే....అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడో తెలుసా" ప్రశ్నించాడు కిషోర్.

"హు... ఓ మనిషిని కాపాడాలంటే ఇన్ని వివరాలు తెలుసుకోవాలని నాకు తెలీదండీ" అమాయకంగా జవాబిచ్చింది.

ఆ మాటలకి అప్పుడే ఫోన్లో సీరియస్ గా మాట్లాడటం పూర్తి చేసి వారివద్దకు వచ్చిన రెండో యువకుడు, కిశోర్ స్నేహితుడు నవ్వాడు.

"ఏరా కిషోర్....అడిగి మరీ చురకలేయించుకునే అలవాటు నీకీ జన్మకు పోదా " అన్నాడు

అతని వైపు చూసింది కౌశిక.

ఏడుపు మొహం పెట్టాడు కిషోర్.

"పద వెళదాం" అన్నాడు ఆ యువకుడు

"ఒక్కనిమిషం...ఇంతకీ అతను ఎందుకు చావాలనుకున్నాడు కిషోర్" అడిగింది సుధ

"ఎందుకేమిటీ ...వాడిని ఇంట్లోకి రానివ్వద్దని తండ్రి అనడంతో, సూసైడ్ చేసుకోలవానుకున్నాడట "

" ఏం ఎందుకు..ఆ తండ్రికి ఏమైనా పిచ్చా" అడిగింది సుధ.

"కాదు ...వీడికే పిచ్చ...వాడు గే అట...అందుకు...అయినా ఇలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో , బ్రతుకుతారో తెలీదు...వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటో అర్ధం కాదు.....సొసైటీ లో తలెత్తుకు తిరగడానికి ఎంత ఇన్సల్ట్ గా ఉంటుంది...అసలు ఏం చెప్తాము ఇలాటి వాళ్ళ గురించి ..ఏ ఉపయోగం ఉండదు .....ఏ ఉపయోగం లేనప్పుడు చావడమే బెటర్ ...అయినా'" కిషోర్ వాగ్ధాటి సాగుతోంది..

సుధ కంగారుగా కౌశిక వైపు చూసింది.

అప్పటికే కౌశిక కళ్ళల్లో కోపం ఎగసిపడుతోంది...

"మీ వల్ల ఏ ఉపయోగం కలిగింది ఈ సమాజానికి .." బాణంలా దూసుకొచ్చింది కౌశిక నుండి ఆ ప్రశ్న.

మాట్లాడటం ఆపి కౌశిక వైపు చూశాడు కిషోర్.

అతని స్నేహితుడు కూడా కౌశిక కంఠంలో వచ్చిన మార్పుని, తన మొహంలో కనపడుతున్న కోపాన్ని గమనించి , కౌశికను అంచనా వేసే పనిలో పడ్డాడు.

"మీవల్ల కనీసం మీవాళ్ళకైనా ఉపయోగం ఉందా " మరో ప్రశ్న వేసింది .

విస్తుపోయి చూశాడు కిషోర్.

"కిషోర్...తర్వాత మాట్లాడదా౦...బాయ్..." అంటూ కౌశిక చేయి పట్టుకుని బలవంతంగా బండి ఎక్కమని, బండి స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సుధ .

వెళుతున్న వాళ్ళని విస్తుపోయి చూశాడు కిషోర్.....కౌశిక మాటల వెనక ఉన్న ఇది అని తెలీని భావాన్ని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు అతని స్నేహితుడు.

వారం గడిచింది..

అదే బీచ్...

ఇసుకలో నడుస్తున్న కౌశిక , తనని ఎవరో పిలిచినట్టు అనిపిస్తే ఆగి , తలతిప్పి చూసింది.

దగ్గరకొచ్చిన వ్యక్తి...

" హలో కౌశిక గారు...నేను కైవల్య...నన్ను గుర్తుపట్టారాండి .."

భృకుటి ముడిచి చూసింది.

" అదేనండీ ..పోయిన వారం...ఇక్కడే కలుసుకున్నాము...ఐ మీన్...కిషోర్ ఫ్రెండ్ని ."

గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించింది కౌశిక.

" మీ ఫ్రెండ్ సుధగారి ఫ్రెండ్ కిశోర్ ...ఆరోజు...ఒకతన్ని మీరు కాపాడారు..ఆ టైములో మీకు హెల్ప్ చేసిన ఇద్దరు యువకుల్లో ఒకర్ని...గుర్తుకొచ్చానా"

"ఓహ్ మీరా...మీ పేరు కైవల్యనా"

" కాబట్టే కదండీ ఆ పేరు చెప్పాను"

"ఓహ్..పరమపథమే అన్నమాట"

షాక్ అయ్యాడు కైవల్య, కౌశిక ముక్కు సూటితనానికి... అదే సమయంలో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి చిన్నగా నవ్వుకున్నాడు.

"మీరు భలే మాట్లాడతారండీ"

"నిజం చెప్పండి...నన్ను తిట్టుకున్నారుగా"

మరోసారి షాక్ అయ్యాడు , అంత ఖచ్చితంగా చెప్పిన కౌశిక అంచనాకి.

"మీరు మరీ ఇంత సూటిగా అడిగితే ఏం చెప్తానండీ " మొహమాటంగా అన్నాడు

నవ్వింది..

ఓ క్షణం ఆ నవ్వుని అలాగే చూశాడు.

కళ్ళు పెద్దవి చేసి చూసింది...

" సారీ..మీ నవ్వు చాలా బాగుంది...అందుకే ...బై ది వే...మీరు ఏం చేస్తారు" అడిగాడు

" ఫ్యాషన్ డిజైనర్ "

"ఓహ్...అయితే మీతో బిజినెస్ చేయచ్చు"

చురుగ్గా చూసింది ..

" అపార్ధం చేసుకోకండి...మాది టెక్సటైల్ బిజినెస్...ఎక్సక్లూసివ్ బ్రాండ్ కె ఎస్ బ్రాండ్ మాదే..అందుకే అలా అన్నాను..సారీ "

"ఓహ్ ..కె ఎస్ అంటే కైవల్యా సుప్రజ్ ..రైట్...సుప్రజ్ అంటే మీ బెటర్ ఆఫా "

"అయ్యయ్యో ...నాకింకా పెళ్ళి కాలేదండీ " గాభరాగా అన్నాడు

" ఓహ్...అయితే మీ మదర్ పేరా "

"కాదు ...మా అన్నయ్య "

"ఓహ్..అన్నదమ్ములదా ...నైస్ టూ హియర్ "

"థాంక్స్ "

"కె ఎస్ బ్రాండ్ ...దేశంలోని టాప్ ఇరవై బ్రాండ్స్ లో ఐ థింక్ టాప్ 10 లో ఉంది..ఐ మీన్ ఉండేది ...ఈ మధ్య దాని ప్లేస్ , వేల్యూ పడిపోయాయి ...కదా"

ఆ మాటకి కైవల్య మొహం మ్లానమైంది .

తనని తాను సంభాళించుకుని తలెత్తి చూసిన కైవల్యకు , పది అడుగుల దూరంలో ఉన్న రాళ్లపై కూర్చుని, వేగంగా వచ్చి, రాళ్ళకు తగిలి ఉవ్వెత్తున ఎగిసిన అలలు చెదిరి తుంపరులుగా పడుతుంటే , ఏమాత్రం చెదరకుండా ఆ తుంపర్లలో తడుస్తూ , తదేకంగా వస్తున్న అలలను చూస్తూ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న కౌశికను చూసి , నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు.

" రండి...కూర్చోండి" చూడకుండానే పిలిచింది.

వెళ్లి మరో రాయి మీద కూర్చున్నాడు.

సముద్రపు హోరు , అలల సవ్వడి తప్ప మరే విధమైన శబ్దం లేదు..

"చెప్పండి"

"ఏమిటి" అర్ధం కాక అడిగాడు.

"మీరు ఏదో అడగాలని , చెప్పాలనే కదా నాతో మాట కలిపారు ...మరి ఆలస్యం ఎందుకు ...కానీయండి "

ఆశ్చర్యంగా చూశాడు కైవల్య..."ఈ అమ్మాయికి ఏమైనా మైండ్ రీడింగ్ వచ్చా" అనుకుంటూ

" నాకే మైండ్ రీడింగ్ రాదు...జస్ట్ కామన్ సెన్స్...ఆ మైండ్ రీడింగ్ వస్తే ఓ జీవితం అంతం అవ్వనిచ్చేదాన్ని కాదు .." గంభీరంగా అంది

"అంటే"

" అంటే....అది వదిలేయండి...మీరేదో మాట్లాడాలని అనుకున్నారుగా ...మాట్లాడండి"

"అది ...అది..."

" మీరు అడగాలని అనుకున్నది నేను నిన్న మీ ఫ్రెండ్ తో మాట్లాడిన మాటల గురించేగా..."

"ఊ...అవును....ఆ క్షణం మీ కళ్ళల్లో బాధ ని, కోపాన్ని , పశ్చాత్తాపాన్ని ఇలా చాలా భావాలని గమనించాను...ఆ యువకుడి గురించి కిశోర్ మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు అంతలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవాలని అనిపించింది"

" అందుకు కారణం" సూటిగా అడిగింది.

" ప్రత్యేకంగా ఏమీ లేదు "

కళ్ళు చిన్నవి చేసి సూటిగా చూసింది

" అంటే.. లేదు అంటే లేదు ..ఉందీ అంటే ఉంది" ఎలా చెప్పాలో తెలీలేదు కైవల్యకు .

"మీరు ఎందుకు సందేహిస్తున్నారో అర్ధం అయ్యింది...ప్రస్తుతం కె ఎస్ బ్రాండ్ ఎందుకు పేరుని పోగొట్టుకుంటోందో , దాని మార్కెట్ వేల్యూ ఎందుకు పడిపోయింది అన్న దానికి మీ మౌనం సమాధానం చెప్తోంది...వచ్చిన వార్తలు వదంతులు కావని, నిజమని మీ మొహం చూస్తే తెలుస్తోంది...దానికి నేను నిన్న మాట్లాడిన మాటలు , ప్రవర్తన మీకు సాయం చేస్తాయేమో అని కదూ మీరు ఈరోజు నేను కనపడగానే మాట కలపడానికి, పరిచయ౦ పెంచుకోవాలని చూడడానికి కారణం ...అవునా"

సూటిగా , స్పష్టంగా ఎలాంటి మొహమాటం లేకుండా అన్న కౌశిక వివరణకు ఓ క్షణం విస్తుపోయినా, అదే నిజం కనుక ఆలస్యం చేయకుండా ఒప్పుకున్నాడు కైవల్య.

" అలా రియాక్ట్ అవ్వడానికి కారణం .."అడిగాడు .

" వాళ్ళ గురించి నాకు తెలుసు ....సమాజం మాట్లాడే మాటలని బట్టి ఒకప్పుడు నేను కూడా వాళ్ళ గురించి అందరూ అనుకున్నట్టే అనుకునే దాన్ని ,,,కానీ వాళ్ళూ మనుషులే అని, వారికీ మనసు ఉంటుందని , దానికి స్పందన తెలుసనీ తెలిసాకా వారంటే ప్రేమ కాకపోయినా, సాటి మనుషులే అన్న అభిమానం పెరిగింది....ఆపై అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను....అలా తెలుసుకోవడం మొదలు పెట్టాక వారి మీద గౌరవం పెరిగింది..అందుకే ఎవరైనా వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడితే నాకు కోపం వస్తుంది అన్నది నిజం ..అందుకు కారణం బహుశా నా జీవితానుభవమే అయ్యుండచ్చు "

ఆ మాటకి కౌశిక వైపు నిశితంగా చూశాడు.

నవ్వింది కౌశిక.

" నా అనుభవం అన్నానే కానీ ,నేను అలాంటి దాన్ని అని అనలేదండి "

చటుక్కున చూపు మరల్చుకున్నాడు .

"సారీ..నా ఉద్దేశ్యం అదికాదు.... మీ వయసు మహా అయితే ఓ ఇరవై రెండు, ఇరవైమూడు అలా ఉంటాయి ...మీ అనుభవం అంటుంటే, ఇంత చిన్న వయసుకే " ఎలా పూర్తి చేయాలో తెలియక ఆగిపోయాడు కైవల్య.

నవ్వింది ...

"సాధారణంగా నేను ఎవరికి నా వివరాలు చెప్పను...తెలీని వారికి నా జీవితం గురించి కూడా చెప్పను...కానీ నా జీవితం నాకు నేర్పిన పాఠం మీకు ఉపయోగపడుతుంది , మీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అన్న కారణంతో మీతో పంచుకుంటున్నాను...." అంటూ గొంతు సవరించుకుని చెప్పటం మొదలుపెట్టింది...

నెమ్మదిగా కౌశిక మాటలు తన ముందు సజీవ చిత్రాలుగా మారి కళ్ళకు కనిపిస్తుంటే వాటిల్లో లీనమైయ్యాడు కైవల్య.


"పద్దెనిమిదేళ్ళ వయసు....చదువు గురించి తప్ప మరి దేని గురించి ఆలోచించని మనసు....ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకుని నాన్న చేత శెభాష్ అనిపించుకోవాలని ఓ పట్టుదల...చదువుకుని ఓ మంచి ఉద్యోగం చేయాలని, నా అభిరుచి అయిన ఫ్యాషన్ డిజైనింగ్ లో కృషి చేయాలని ఓ కోరిక...పాత సంప్రదాయాలను పట్టుకు వేలాడే నా తండ్రికి నేను చదవడం ఇష్టం లేదు....కారణం నేను ఎవరి మోజులో అయినా పడతానేమో అని భయం...కుటుంబం పరువుని ఎక్కడ గంగలో కలుపుతానో అని బెదురు ..

అలాంటి సమయంలో మా బావ అర్జున్ , చదువులో నేను చూపించే ఆసక్తి కి నా తండ్రితో మాట్లాడి నేను చదువుకోవడానికి ఒప్పించాడు అయితే నా తండ్రి ఒప్పుకున్నది నేను అర్జున్ని పెళ్ళి చేసుకునే షరతుతో ....ఆడపిల్ల జీవితం ఎంత విచిత్రమైందో అప్పుడే తెలిసింది....

అలా నా పెళ్లి మా బావతో జరిగింది....మా బావతో కలిసి ముంబైలో అడుగు పెట్టాను... నన్ను కాలేజీ లో జాయిన్ చేశాడు బావ...నాన్న వద్దన్నా వినలేదు...తన భార్య అయ్యాక తనకు సంబంధించిన విషయాల్లో ఎవ్వరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చాలా ఖచ్చితంగా చెప్పాడు బావ..

ఒక్క చదువు విషయంలోనే కాదు , ప్రతి దానిలో నన్ను చాలా ప్రోత్సహించేవాడు బావ...బావ అంటే ఎలాంటి ఫీలింగ్ నాకు లేదు....బహుశా బావ ప్రవర్తన నాలో అలాంటి ఫీలింగ్స్ని కలిగించేలా లేకపోవడం కూడా కారణం అయ్యుండచ్చు...చూస్తూ ఉండగానే డిగ్రీ మూడేళ్ళు పూర్తి అయ్యాయి...ఫ్యాషన్ డిజైనింగ్లో నాకున్న ఆసక్తి ని గమనించి ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ లో నన్ను జాయిన్ చేశాడు ....మరో ఏడాది గడిచింది..ఎంత బిజీగా అంటే కనీసం బావ గురించి పట్టించుకునే టైం కూడా లేనంతగా...బెస్ట్ అనిపించుకోవాలన్న కోరిక , పట్టుదల తప్ప నాతో ఓ మనిషి ఉన్నాడన్న ఆలోచన కూడా వచ్చేది కాదు...బావ కూడా ఏనాడు నన్ను పల్లెత్తు మాట అనలేదు ...మరింతగా నన్ను ఎంకరేజ్ చేశాడు...ఎంతగా అంటే నేను వచ్చేసరికి వంట చేసి రెడీగా ఉంచేవాడు..నేను అలసి తినకపోతే చంటిపిల్లకు తినిపించినట్టు బతిమాలి , బామాలి , బుజ్జగిస్తూ, కథలు చెప్తూ తినిపించేవాడు..నా తండ్రి కూడా నాకెప్పుడూ అలా పెట్టిన గుర్తు కూడా లేదు...నేను కాస్త రావడం ఆలస్యమైతే తల్లిలా కంగారుపడేవాడు ....లాభం లేదని నాకు బండి నేర్పించి , స్కూటీ కొనిచ్చాడు...పేరుకు మాత్రమే మేము భార్యాభర్తలం...కానీ బావ నాకు భర్తగా కంటే కూడా తల్లి, తండ్రి, తోబుట్టువు, స్నేహితుడుగానే అనిపించేవాడు...

నేను బావ గురించి పట్టించుకోవటం లేదు అని అనిపించేది...తీరిక చిక్కినప్పుడు అదే మాట అంటే వెన్నెలంత చల్లగా నవ్వేవాడు...నేను చంటి పిల్లాడిని కాను పట్టించుకోడానికి అంటూ...

నీ భార్యగా నీగురించి నేను పట్టించుకోకపోయినా , నువ్వు నా గురించి పట్టించుకుంటున్నావుగా అని నేను అంటే , అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని, నీ కోర్సు మీద ద్రుష్టి పెట్టమని , మంచి పేరు తెచ్చుకోమని మాట మార్చేవాడు....అది నాకు అర్ధం అయ్యేది కాదు ...

కానీ ఆ మాటల అర్ధం ఏమిటో కొద్దిరోజులలోనే నాకు అనుభవంలోకి వచ్చింది...

అప్పుడే కోర్సు పూర్తి అయ్యి ఓ ప్రముఖ డిజైనింగ్ స్టూడియో లో డిజైనర్గా జాయిన్ అయ్యాను.

ఎప్పుడూ రాత్రి పది పదిన్నరకి గానీ ఇల్లు చేరని నేను, ఆరోజు తొందరగా బయలుదేరాను ...కారణం ఆరోజు బావ పుట్టిన రోజు ..నేను మొదటి సారి ఆఫీషియల్గా నా పేరుమీద తయారు చేసిన డిజైనర్ షర్ట్ని బావకి గిఫ్ట్గా ఇవ్వాలని ....హుషారుగా ఫ్లాట్కి వచ్చిన నేను, నా దగ్గర ఉన్న డూప్లికేట్ కీ తో లాక్ ఓపెన్ చేసి లోపలకు వచ్చాను...బావను సర్ప్రైజ్ చేద్దామని చప్పుడు చేయకుండా మాస్టర్ బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసిన నేను అక్కడ కనపడిన దృశ్యానికి, చూడకూడని స్థితిలో బావని చూడడంతోను షాక్ అయ్యాను...

ఎలా వచ్చి హాలులో కూర్చున్నానో నాకు తెలీదు...బావ ఎందుకు నన్ను దగ్గరకు కూడా తీసుకోడో నాకు అప్పుడే అర్ధం అయ్యింది ..బావకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని , అందుకు కారణం బావ జీవితంలో మరో అమ్మాయి ఉండడమే అని తెలిసి ఎలా స్పందించాలో తెలీలేదు..అయితే నేను ఊహించింది తప్పని, గదిలోంచి వచ్చిన వ్యక్తిని చూసిన నాకు అర్ధం కావడానికి కొంత సమయం పట్టింది...ఆ వ్యక్తి నిశ్శబ్దంగా నిష్క్రమించడం గానీ, మా బావ అపరాధిలా గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడం కానీ నాకు తెలీదు..నా కాళ్ళ కింద భూమి కదిలిన అనుభూతి ....

ఊహకి, వాస్తవానికి ఏంత తేడా ఉంటుందో నాకు మొదటిసారి తెలిసింది..నేను ఊహించింది నిజం కాదని, మన ఊహకు అందని వాస్తవాలు ఉంటాయని, గదిలోంచి ఓ యువతి బదులుగా ఓ పురుషుడు బయటకు వచ్చిన క్షణ౦ నాకు తెలిసింది.

అసలు నేను చూసినది ఏమిటో, ఏం జరిగిందో అర్ధం కావడానికి ,జీర్ణించుకోవడానికి నాకు పదిహేను రోజులు పట్టింది.

ఆ పదిహేను రోజులు బావ నా కంటపడడానికి కూడా ప్రయత్నించలేదు...నేరం చేసిన నేరస్తుడిలా ఎప్పుడో అర్ధరాత్రి దాటాకా రావడం, ఉదయం నేను లేవక ముందే వెళ్లిపోవడం...పదిహేను రోజులూ మా మధ్య మౌనం రాజ్యమేలింది ... పిలవని అతిథిలా వచ్చి చేరింది నిశ్శబ్దం.

నెమ్మదిగా వాస్తవాన్ని జీర్ణం చేసుకున్న నేను నిశ్శబ్దాన్ని ఛేదించడానికి సిద్ధమైయ్యాను.

ఓరోజు మా బావ ఇంటికి వచ్చే సమయానికి మెలుకువగానే ఎదురు చూస్తూ హాలులోనే కూర్చున్నాను...మెలకువగా ఉన్న నన్ను చూసి కంగారుపడ్డాడు .

పదిహేను రోజులుగా గదిలోనే గడుపుతున్న నేను ఆరోజు అలా హాలులోనే కూర్చుంటానని ఊహించలేదు మా బావ..

కింద విధంగా పూర్తి దృశ్యరూపం దాల్చింది కౌశిక చెప్తున్న విషయం కైవల్య కనులముందు.


ఆ రోజు:

"బావా..వెళ్లి ఫ్రెష్ అయ్యి రా..భోజనం చేద్దాం"

కౌశిక మాట సౌమ్యంగా ఉన్నా అర్జున్ కి మాత్రం ఓ శాసనంలా వినబడింది.

మౌనంగా వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు.

టేబుల్పై అన్నీ సిద్ధం చేసి కంచంలో వడ్డించింది...మౌనంగానే వచ్చి కూర్చుని తినడం మొదలుపెట్టాడు..

అర్జున్ని నిశితంగా గమనించింది...

మొహం పీక్కుపోయి ఉంది...కళ్ళు లోతుకు పోయాయి...గడ్డం పెరిగింది..మనిషి చిక్కాడు ..ఆ కళ్ళల్లో కాంతి లేదు...మొహంలో మెరుపు లేదు..ఏదో జబ్బు పడి లేచిన వాడిలా ఉన్నాడు.

మానసికంగా అర్జున్ ఎంతగా నలిగిపోతున్నాడో అర్ధం అయ్యింది కౌశికకు .

" అదేంటి బావా...సరిగా తినటమే లేదు..ఇలా తింటే ఆరోగ్యం పాడవుతుంది...ఉండు..నేను తినిపిస్తాను " అంటూ కంచం తీసుకుని కూర కలిపి ముద్ద పెట్టబోయింది...

తలవంచుకుని కూర్చున్నాడు.

"బావా...ఇటు చూడు ...నోరు తెరు బావా..."

నిశ్శబ్దంగా నోరు తెరిచాడు ...ముద్ద పెట్టింది..

" నీకిష్టమని కష్టపడి చేశాను..యూట్యూబ్ చూసి మరీ...అందుకే నాకు వంట నేర్పించి ఉంటె బాగుండేది..ఇలా రెసిపీల కోసం వెతుక్కోకుండా ఉండచ్చు " చాలా మామూలుగా మాట్లాడుతున్న కౌశిక మాటలు తట్టుకోలేకపోతున్నాడు అర్జున్.

తలెత్తి చూశాడు..

కళ్ళు కన్నీటితో నిండిపోయాయి...బాధ తన మొహంలో కనపడుతుంటే ...

"బావా..ఏమైంది...కూరలో కారం ఎక్కువైందా" కంగారుగా అడిగింది...కంచం టేబుల్ పై పెట్టి , మంచినీళ్ళ గ్లాస్ ఇస్తూ ...

" మమకారం ఎక్కువైంది రా" అంటూ లేచి వెళ్ళి చేయి కడుక్కుని గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు అర్జున్.

చేయి కడుక్కుని వెళ్ళి తలుపు తీసి గదిలోకి అడుగుపెట్టింది ...చీకటిగా ఉంది గది ...

వెళ్లి లైట్ వేసింది.

తలెత్తి చూశాడు సోఫాలో కూర్చున్న అర్జున్.

"ఎందుకు బావా..చీకటిలో కూర్చుని నీ జీవితాన్ని మరింతగా చీకటిలోకి నెట్టుకుంటున్నావు"

"కౌశికా" బాధగా పిలిచాడు.

వెళ్ళి పక్కనే కూర్చుంది.

తానేదో అంటరానివాడన్నట్టుగా దూరం జరిగాడు.

అది గమనించి..

"ఏంటి బావా ఇది" బాధగా అడిగింది.

"నేనేంటే అసహ్యం వేయటంలేదా" దుఃఖంతో పూడుకుపోయిన గొంతు నుండి ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది ప్రశ్న

"అసహ్యమా ..దేనికి బావా"

"నేను చేసినదానికి "

"అది అసహ్యించుకోవాల్సిన విషయం ఏమీ కాదుగా బావా..పుట్టిన ప్రాణికి ఏదో ఓ సమయంలో కోరిక కలగడం చాలా సహజమైన విషయం...దాన్ని తీర్చుకోడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు...బలవంతంగానో లేక బెదిరించో తీర్చుకోవడం నేరం గానీ, ఇద్దరు వ్యక్తులు ఇచ్ఛాపూర్వకంగా ఒక్కటైతే అసహ్యించుకునేంత పాప౦, శిక్షించేంత నేరం ఎందుకు అవుతుంది బావా "

"కౌశికా" అనుమానంగా పిలిచాడు...

"ఏంటి బావా"

"అది...నీకు ....నువ్వు " ఎలా అడగాలో అర్ధం కావటం లేదు అర్జున్ కి .

"ఏంటి బావా...ఓహ్....నీ అనుమానం నాకు అర్ధం అయ్యింది బావా....ఈ విషయాలు నాకెలా తెలుసా అనా...ఈ రకానికి చెందిన వర్గ౦ గురించి, మనుషుల గురించి, వారి ప్రవర్తన గురించి , అలాగే ఇలాంటి అనేక వర్గాలకు చెందిన వారి గురించి తెలుసుకున్నాను బావా...అదీ నీ కోసం...నీకు స్త్రీల మీద ఎలాంటి ఆసక్తి ఉండదని, వారిని చూస్తే నీకెలాంటి కోరికగానీ , వికారాలుగానీ కలగవని , అలాగే రిలేషన్ షిప్ లో నువ్వు ఎంత బాధ్యతగా, నమ్మకంగా ఉంటావో తెలుసుకున్నాను...అదీ నీ గురించి తెలిసిన డాక్టర్ ద్వారా"

ఆశ్చర్యపోయాడు అర్జున్.

"ఇదంతా ఎందుకు చేశావు "

"అదేంటీ బావా...నాకోసం నువ్వు చేయగాలేనిది నేను చేస్తే తప్పేంటి బావా" అమాయకంగా అడిగింది.

ఏమీ లేదన్నట్టుగా అడ్డ౦గా తలూపాడు.

"నీకు నా మీద ద్వేషం లేదా "

"ద్వేషమా..దేనికి బావా"

"నీ జీవితం నాశనం చేశానని "

"బావా బావా...జీవితం ఏమైనా చెట్టా లేక చెత్తా.....నాశనం చేయటానికి .ఎవరి జీవితం వారిదే బావా...నా జీవితము అంతే...నిజానికి నా జీవితం నాశనము చేయలేదు బావా...వివాహం చేసుకునే ఉద్దేశ్యం ఏమాత్రం లేని నువ్వు, నీ గురించి నిజం చెప్పాలని వచ్చిన నువ్వు, నాన్న మూర్ఖత్వానికి, చాదస్తానికి బలవ్వబోయే నన్ను చూసి, బాధ పడి , నన్ను ఆ జైలు నుండి రక్షించడానికి పూనుకుని నాన్నతో మాట్లాడి ఉండకపోయుంటే , ఆరోజు నాన్న షరుతుకి ఒప్పుకోక పోయింటే ఈపాటికి భార్యని అంగడి బొమ్మగా తలిచే ఓ డబ్బున్న మారాజు ఇంట పంజరంలోని పక్షిగా బ్రతకాల్సి వచ్చేది..."

"నీకెలా తెలుసు ఈ విషయం"

"తెలుసుకున్నా బావా..నీ మనసు పంచుకునే నీకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి నుండి తెలుసుకున్నాను "

"అంటే నువ్వు తనని కలిశావా" షాకింగ్ గా అడిగాడు.

"ఊ..."

"ఎందుకు"

"అదేంటి బావా...తెలుసుకోవాలిగా ఎలాంటి వాడో ఏంటో...నీకు సరిజోడో కాదో ...అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాదేకదా బావా.."

"కౌశికా" నమ్మలేనట్టుగా పిలిచాడు ..

తన కళ్ళముందు ఎదిగిన కౌశిక, ఈరోజు వ్యక్తిత్వంలో మేరు పర్వతంలా కనిపిస్తుంటే నమ్మలేనట్టుగా ఉంది...అదే సమయంలో గర్వంగా కూడా ఉంది...అయినా కూడా

"కానీ నా భార్యగా సొసైటీ లో గుర్తింపు ఉన్న నీకు పెళ్లి కాదుకదరా" బాధగా అన్నాడు

"పెళ్ళి...బావా..పెళ్ళే జీవితం కాదు..అది జీవితంలో ఓ భాగం మాత్రమే...విలువైన జీవితాన్ని ఇచ్చావు చాలదా...నీ కారణంగా పెళ్లి కాదు అంటే నాకెలాంటి ప్రాబ్లెమ్ లేదు..జీవితాతం నీ భార్యగా చెలామణి కావడానికి నాకు అభ్యంతరం లేదు..ఈ సొసైటీ ఒప్పుకోదు అంటావా, ఒప్పుకునే సొసైటీలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి.....అక్కడ కెళ్ళి బ్రతుకుదాం "

"నా మీద కోపం లేదా"

"కోపం ...చాలా ఉంది బావా..."

"కౌశిక!?"

"అవును బావా..ఏం బావా ..నాతో చెప్పకూడదు అనుకున్నావా...నాతో పంచుకోవడానికి కూడా నేను పనికిరాలేదా....కనీసం ఓ స్నేహితురాలిగా కూడా నన్ను చూడలేకపోయావా" బాధగా , కన్నీళ్లతో అడిగింది.

చలించిపోయాడు అర్జున్.

"లేదురా...నీతో చాలా సార్లు చెప్పాలనే అనుకున్నాను ..కానీ ఏదో బాధ....నేనేమిటో తెలిసికూడా నీ జీవితం నాశనం చేశానే అన్న గిల్టీ ఫీలింగ్ మనసుని చుట్టేసేది...ఏం బావా నామీద ఏ ఫీలింగ్ లేనప్పుడు ఎందుకు నన్ను పెళ్ళి చేసుకున్నావు , ఎందుకు నా జీవితంతో ఆడుకున్నావు అంటే నా దగ్గర జవాబు లేదు...నీకు ఏం హక్కు ఉందని నా గురించి నిర్ణయాలు తీసుకున్నావు అని అడిగితే సమాధానం శూన్యం...అందుకే నీ కాళ్ళమీద నువ్వు నిలబడ్డాక ఎలాగో నీకు నిజం చెప్పి విడాకులకు అప్లై చేయాలని నిర్ణయించుకున్నాను...కానీ ఈలోగా ఇలా ...." పూర్తి చేయలేకపోయాడు ..

" దొరికిపోతాను అనుకోలేదు కదా' నవ్వుతూ అడిగింది.

నవ్వేశాడు.

" బావా...ఇప్పుడో సమస్య వచ్చింది "

"ఏమిటి"

"గాయిత్రి పెళ్లి కుదిరింది...మనం వూరు వెళ్ళాలి..నాలుగేళ్ళుగా ఏదో ఒక సాకు చెప్తూ వూరు వెళ్లకుండా తప్పించుకున్నావు...ఇప్పుడు వెళ్ళక తప్పదు ..ఎలా"

ఆలోచనలో పడ్డాడు .

"ఈసారి వెళితే తప్పకుండ అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు "

"నన్నా..ఎందుకు బావా..నేనేం చేశాను"

"పెళ్ళై నాలుగేళ్ళయినా ఇంకా నీళ్ళు పోసుకోలేదు అంటూ నానా మాటలు అంటారు"

"ఛీ ఛీ...నాలుగేళ్లు నీళ్లు పోసుకోకుండా ఎవరైనా ఉంటారా బావా....కంపు కొట్టుకుంటూ ..అదేమైనా దీక్షా" చిరాకుగా మొహం పెట్టి అడిగింది.

పకపకా నవ్వాడు అర్జున్.

"బావా..నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి...ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కృంగిపోకూడదు..నీకెప్పుడూ నేను తోడుగా ఉంటానని మర్చిపోకు బావా" అర్జున్ చేతిని చేతుల్లోకి తీసుకుని అంది .

ఓ క్షణం తదేకంగా చూశాడు.

"ఏంటి బావ అలా చూస్తున్నావు "

"ఊరు నుండి రాగానే విడాకులకు అప్లై చేద్దాం....త్వరగానే విడాకులు గ్రాంట్ అవుతాయి నా కారణంగా..ఆపై నీకు ఓ మంచి మనసున్నవాడిని చూసి నేనే దగ్గరుండి పెళ్ళి చేస్తాను ...ఓకే"

"నీలా మంచి మనసున్నవాడు ఈరోజుల్లో చాల అరుదుగా దొరుకుతారు బావా...అయినా నా పెళ్లికేం తొందర....కొన్నాళ్ళు సింగల్ లైఫ్ ని ఎంజాయ్ చేయని .....సరే బావ...మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో బావా...రేపు ఉదయమే లేచి గుడికి వెళ్ళాలి...నీపేరున అర్చన చేయించాలి...ఆ తర్వాత షాపింగ్ కు వెళ్ళాలి...గాయత్రికి గిఫ్ట్ ఏదైనా కొనాలి..మంచి శారీ కొనాలి...చాలా పనులున్నాయి..రేపు ఎలాగూ ఆదివారం కనుక , సంజయ్ని కూడా డైరెక్టుగా గుడికి రమ్మన్నాను..ముగ్గురం కలిసి ముంబై మొత్తం చక్కర్లు కొట్టేయాలి......ఆల్రెడీ నేను బుధవారానికి టికెట్స్ బుక్ చేశాను....శుక్రవారం పెళ్లి.....అయ్యాక శనివారం రావడానికి రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసేశాను...సో ఎవరీథింగ్ ఈజ్ ప్లాన్డ్ " గడగడా చెప్పి లేచి వెళుతున్న కౌశికను పిలిచాడు అర్జున్.

"ఏంటి బావా"

"థాంక్స్ రా..."

" నేను పరాయిదాన్ని కాదు బావా "

నవ్వాడు..

నవ్వింది.

" కౌశికా..ఎలాంటి స్థితి అయినా నీ పెదవులపై ఆ నవ్వు చెదరకూడదు..గుర్తుంచుకో ...అదే నువ్వు నాకు ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ "

"అలాగే బావా...మాట ఇస్తున్నా ...గుడ్ నైట్ " చెప్పి తలుపు లాగి తన గదికి దారి తీసింది.

అర్జున్ ఆనందానికి అవధులు లేవు ...

మర్నాడు కౌశిక ప్లాన్ ప్రకారం ...ఉదయమే లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళారు ..అర్జున్ సోల్ మేట్ సంజయ్ గుడిలో వాళ్ళని కలిశాడు..ముగ్గురు కలిసి షాపింగ్ చేసి, రోజంతా సరదాగా ఎంజాయ్ చేశారు...రాత్రి పదకొండు అవుతుంటే తన కారులో అర్జున్, కౌశికలను వాళ్ళ ఫ్లాట్ దగ్గర దింపాడు సంజయ్..

"ఊరు నుండి రాగానే మ్యాటర్ సెటిల్ చేసి మీ ఇద్దరు ఒకే చోట ఉండే ఏర్పాటు చేస్తాను సంజు..ప్రామిస్" నవ్వుతూ ప్రామిస్ చేసింది

నవ్వేశాడు సంజయ్.

"ఆ నాకిప్పుడు తెలిసింది..నీ నవ్వు చూసే బహుశా మా బావ నీకు పడిపోయుంటాడు..యామ్ ఐ రైట్ బావా' అడిగింది

నవ్వేశారు ఇద్దరూ..గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సంజయ్ .


అనుకున్నట్టుగానే వూరు వెళ్లారు...పెళ్లి బాగా జరిగింది....పెళ్ళి జరిగి అర్జున్ చెల్లెలు గాయత్రిని అత్తారింటికి సాగనంపాక అందరూ కూర్చుని ఉండగా ..

అర్జున్కి వరసకి బామ్మ అయ్యే ఓ పెద్దావిడ...ఆరాలు మొదలుపెట్టింది....విన్న అర్జున్ ఏదో అనబోతే కళ్ళతోనే వారించింది కౌశిక...తాను చూసుకుంటానని భరోసా ఇచ్చింది...ఇక అక్కడ ఉండలేక , వారి మాటలు వినలేక విసురుగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్.

కౌశికను రకరకాలుగా యక్షప్రశ్నలు వేసి , శల్య పరీక్షలు చేశారు..అన్నింటికీ మౌనమే సమాధానంగా వింటూ కూర్చుంది...పల్లెత్తు మాట మాట్లాడలేదు...అర్జున్ విషయాన్ని చెప్పలేదు...

తిరిగి తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చిన అర్జున్ కి కౌశిక కనపడలేదు...అడిగితే గుడికి వెళ్ళిందని చెప్పిన పనిపిల్ల ..అందరూ కౌశికను ఎలా శల్య పరీక్ష చేశారో చెప్పింది...ఆపై అర్జున్ మర్చిపోయి వెళ్ళిన ఫోన్ కు వచ్చిన ఫోటోలను చూసి కౌశికను అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడారని , తన శీలాన్నే శంకించారని , ఎన్ని మాటలాడిన భరించిన అమ్మాయిగారు తన శీలాన్ని గురించి చెడుగా మాట్లాడుతుంటే భరించలేక , మౌనంగా బయటకు వెళ్లిపోయారని చెప్పింది..ఏం మాట్లాడారో, ఎలా మాట్లాడారో అన్నీ వివరంగా చెప్పింది ఆ పనిపిల్ల.

అర్జున్ రావడం చూసి చేరిన ఇంటిల్లిపాదీ, అర్జున్ ఫోన్లోని ఫోటోలను గూర్చి మాట్లాడుతుంటే ,ఫోన్ తీసుకుని చూశాడు ...అవి వూరు రావడానికి ముందు తాను, సంజయ్ ,కౌశిక బయటకు వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్...నిజానికి ఆ ఫొటోస్ని నిశితంగా గమనిస్తే ఎవరు ఎవరితో చనువుగా ఉన్నారో ఇట్టే అర్ధం అవుతుంది..అయితే తప్పులు ఎంచే వారి దృష్టి ఎపుడూ నిజాలను కాంచదు...అందులో సంజయ్, కౌశిక ఉన్న ఫోటోలు మాత్రమే వారి దృష్టిని ఆకర్షించాయి కానీ తాను సంజయ్ ఉన్నవి వారి దృష్టికి మామూలుగా కనిపించాయని అర్ధం అయ్యిన అర్జున్కి కోపం తారాస్థాయికి చేరింది...

వారి మాటలు వింటుంటే తన వాళ్ళు ఓ ఆడపిల్ల గురించి ఇంత హీనంగా మాట్లాడతారా అని మొదటిసారి అనిపించింది ...అంతే

ఆ క్షణం కౌశిక చెప్పిన మాటలు మర్చిపోయాడు అర్జున్....కౌశికను గురించి హీనంగా మాట్లాడుతున్న వాళ్ళ మాటలు మాత్రమే అర్జున్ చెవికి ఎక్కాయి..

"చాలు ఆపండి" కోపంతో అరిచాడు.

విస్తుపోయి చూశారు అందరూ...అర్జున్ని అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు...

"ఏంట్రా ...తప్పు చేసిన దాన్ని వదిలి మమ్మల్ని కోప్పడతావు" అడిగింది అర్జున్ తల్లి.

"అమ్మా...ఇంకొక్క మాట కౌశిక గురించి గానీ , తన క్యారెక్టర్ గురించి గానీ హీనంగా మాట్లాడితే కన్నతల్లివి అని కూడా చూడను " హెచ్చరించాడు.

"బావుంది అల్లుడూ...తప్పుడు మనిషిని దాన్ని వెనకేసుకొస్తూ , కన్నతల్లిని మాటలు అంటున్నావు..ఇదేం విడ్డూరం." కౌశిక తండ్రి అన్నాడు

"మరే ...అదేం మందు పెట్టిందిరా ..ఇలా మాట్లాడుతున్నావు..అయినా నీకు తెలీకుండా నీ స్నేహితుడుతోనే రంకు నడిపే దాన్ని ఏమీ అనకుండా మా మీద ఎగురుతావు...అసలు నీకేం తెలీదని అర్ధం అవుతోంది...అది నిన్నెంత మాయ చేసింది తెలుస్తోంది." తల్లి మాటలకి

"మీరు చూసిందే నిజమని మీ నమ్మకమా... అసలు మీకేం తెలుసు...కౌశిక సంగతి పక్కన పెట్టండి.....మీ కన్నబిడ్డను నా గురించి మీకేం తెలుసు " నిలదీశాడు

"అదేంట్రా మా బిడ్డ గురించి మాకు తెలీదా ..విడ్డూరం కాకపోతే "తల్లి అంది

"విడ్డూరమే...నా గురించి మీకేమీ తెలీదు ..నేనేంటో, ఎలా ఉంటానో, ఎలా ప్రవర్తిస్తానో, అసలు నా స్థితి ఏంటో మీకు తెలీదు ...చెప్తాను వినండి...కౌశిక నేను పేరుకు మాత్రమే భార్యా భర్తలం...అంతే అంతకుమించి మామధ్య ఏవిధమైన సంబంధం లేదు.....మీరు ఎవరిని చూసి కౌశికపై లేనిపోని నిందలు వేస్తున్నారో అతను నా ఫ్రెండ్ మాత్రమే కాదు నా జీవిత భాగస్వామి...అంటే అర్ధం తెలుసా" అంటూ తన గురించి , తనకు సంజయ్కు మధ్య ఉన్న సంబంధం గురించి వివరించాడు .

విన్న అందరూ షాక్ అయ్యారు..

"ఓరి భగవంతుడా..ఎలాంటి బిడ్డని మాకు ఇచ్చావు...ఛీ ఛీ ..ఇలాంటి బిడ్డనా నేను కన్నది..పెరిగి ఇలాంటి వాడు అవుతాడని తెలిస్తే పుట్టిన వెంటనే ఓ వడ్ల గింజ వేసి చంపేసేదాన్ని...ఇంటి పరువు నిలబెట్టేవాడు అవుతాడునుకున్నాం కానీ ఇలా పరువుని నట్టేట్లో కలిపేవాడు అని అనుకోలేదు..పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు గొప్పగా చెప్తున్నాడు...ఈ విషయం తెలిస్తే పదిమందిలో ఎలా తలెత్తుకు తిరగాలి...ఎలా బ్రతకాలి అంతకంటే చావడం నయం..." పెద్దగా ఏడుస్తూ రాగాలు తీయడం మొదలుపెట్టింది అర్జున్ తల్లి..

" మనం చావల్సిన అవసర౦ ఏమిటే...వాడే చస్తాడు...అయినా ఇలాంటి వాడు బ్రతికుండి ప్రయోజనం ఏముంది...మనకు తలవంపులు తేవడానికి తప్ప" తండ్రి అన్నాడు

తాము మాట్లాడుతున్నది తమ బిడ్డతో అని, తమ రక్తం అని, అందులో అతని తప్పు ఏమీ లేదని ఏమాత్రం అర్ధం చేసుకోలేని మూర్ఖత్వం అర్జున్ని ఓ అంటరానివాడిలా చూసేలా చేసింది...తానే నవమాసాలు మోసి, కన్నానన్న విషయం మర్చిపోయి, తన బిడ్డ ఉన్న స్థితికి , అతని మానసిక పరిస్థితికి, తల్లిగా అండగా నిలవాలన్న విషయాన్ని మరిచి అర్జున్ని నానా మాటలు అంది అతని తల్లి....అందరూ నీచంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక, తన బ్యాగ్ తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు అర్జున్.

"మళ్ళీ తమకు కనపడవద్దని , తమ బిడ్డ అని చెప్పుకోవద్దని " ఖరాఖండీగా చెప్పాడు తండ్రి.

సరిగ్గా అర్జున్ అటు వెళ్ళిన రెండో నిమిషంలో ఇంట్లో అడుగుపెట్టింది కౌశిక...

"బావేడి అత్తా" అడిగింది అర్జున్ ఎక్కడా కనపడకపోవడంతో...

ఏదో పురుగును గురించి అడిగినట్టుగా అసహ్యంగా చూసింది అర్జున్ తల్లి...

"అత్తా ఏమైంది...బావేడి "

అంతే కౌశిక కు అన్యాయం జరిగిపోయింది అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టింది...భృకుటి ముడిచి చూసింది కౌశిక.

తలతిప్పి అందరిని చూసిన కౌశికకు అనుమానం వచ్చింది....మంచినీళ్ళు తీసుకుని వచ్చిన పనిపిల్ల వైపు చూసింది ఏమైంది అన్నట్టు...

అది బెదురుగా చూసింది...ఏం జరిగిందో చెప్పమని గదమాయించడంతో జరిగింది చెప్పింది...అందరూ అర్జున్ను ఎలా అవమానకరంగా మాట్లాడారో, ఎలా అసహ్యించుకున్నారో చెప్పింది..

విన్న కౌశిక వదనం కోపంతో ఎరుపెక్కింది.

" మీరసలు మనుషులేనా....అసలు మీ బిడ్డ గురించి అంత నీచంగా మాట్లాడటానికి మీకు మనసెలా వచ్చింది...అది తన తప్పా..కన్నది మీరేగా..ఏం మీ తప్పు కాకూడదా"

" ఏంటే మా మీద పడుతున్నావు...వాడిలాంటి వాడని నీకు ముందే తెలుసా" అడిగింది అర్జున్ తల్లి

"తెలుసు...అయితే"

"అమ్మోఅమ్మో ...ఎంత నాటకం ఆడారే ఇద్దరూ....ఇంటి పరువు గంగలో కలిపారు కదే ...ఛీఛీ...ఇద్దరూ అలా ఎలా తగలబడ్డారు..అంతకంటే ఇంత విషం తిని ఛస్తే హాయిగా ఉండేది..ఇలాంటి దరిద్రాన్ని గురించి వినాల్సిన బాధ తప్పేది "

వాళ్ళ మాటలు వాళ్ళల్లోని మూర్ఖత్వానికి అద్దం పడుతుంటే, లోపలకు వెళ్లి తన బ్యాక్ప్యాక్ తీసుకుని వడివడిగా బయటకు నడిచింది..

"ఎక్కడికి పోతున్నావు"

తన తల్లి ప్రశ్నని వినిపించుకోలేదు కౌశిక..

స్టేషన్కు వచ్చిన కౌశిక బండి కదిలే ఆఖరి క్షణంలో బండి ఎక్కి బోగీలన్నీ వెతికింది..ఆఖరి బోగీలో కనపడ్డాడు అర్జున్.

వెళ్లి ఎదురుగా కూర్చుంది.

"కౌశిక...నువ్వెంటి " ఏమీ తెలీనట్టు అడిగాడు.

" నువ్వెంటి"

" అది ...ఆఫీస్ నుండి కాల్ వచ్చింది అర్జెంట్గా రమ్మని ...అందుకే "

"ఓహ్..నాకూ కాల్ వచ్చింది..అందుకే" అంటూ కిటికీ లోంచి బయటకు చూస్తూ కూర్చుంది..

అర్జున్కు విషయం అర్ధం అయ్యింది ..మౌనంగా కూచున్నాడు.

రాత్రి టీసీ తో మాట్లాడి ఎలాగో ఓ బెర్త్ అలాట్ అయ్యేలా చూశాడు..అర్జున్ని పడుకోమని తాను కూర్చుంది...ఉదయం ఇంటికి వెళుతూనే గబగబా రెడీ అయ్యి ఆఫీస్కు అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్.

అలాగే కూర్చుండిపోయింది కౌశిక....ఆపై ప్రతి గంటకి అర్జున్కి కాల్ చేయడం మొదలుపెట్టింది.

"కౌశికా ..నేను బానే ఉన్నాను...ఒకే....ఎక్కువ ఆలోచించక రెస్ట్ తీసుకో" అనునయంగా చెప్పాడు .

అలాగే అంటూ కాల్ కట్ చేసేది....అర్జున్కి కౌశిక భయం అర్ధం అయ్యింది.

రెండు రోజులు మామూలుగానే గడిచాయి...అర్జున్ ని అనుక్షణం కనిపెట్టుకుని ఉంది కౌశిక...అర్జున్ మామూలుగా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది...

మరో రెండు రోజులు గడిచాయి...ఆఫీస్ కు వెళ్లిన అర్జున్ రాత్రి అయినా ఇంటికి రాలేదు...ఫోన్ రింగ్ అయినా తీయకపోవటంతో దారిలో ఉన్నాడేమో అనుకుంది...ఎదురుచూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారిందో తెలీదు...ఉదయ౦ కాలింగ్ బెల్ శబ్దానికి ఉలిక్కిపడి లేచింది...టైం చూస్తే తొమ్మిది అవుతోంది...అర్జున్ వచ్చు0టాడని గబగబా వెళ్ళి తలుపు తీసిన కౌశిక ఎదురుగా పోలీస్ కానిస్టేబుల్ ని చూసి షాక్ అయ్యింది...అతను చెప్పిన విషయం విని నమ్మలేనట్టుగా చూసింది..

ఉన్నపళంగా అతనితో వెళ్ళింది.....గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో విగత జీవిగా పడున్న అర్జున్ని చూసి నిరుత్తురాలైంది ...ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలకి ఎలా జవాబులు ఇచ్చిందో కూడా తెలీదు...పోస్టుమార్టుమ్ చేసి , ఫార్మాలిటీస్ పూర్తి చేసి అర్జున్ బాడీని కౌశికకు ఇచ్చారు....అసలు ఈలోకంలోనే లేనట్టు ఉన్న కౌశికను చూసి అర్జున్ పనిచేసే ఆఫీస్ వాళ్ళు, అతని బాస్ కలిసి క్రిమేషన్కి ఏర్పాటు చేశారు...ఇంట్లో వాళ్లకి ఇన్ఫోర్మ్ చేశారు...సూసైడ్ అందులోను సముద్రం నీరు కావడంతో ఎక్కువ సేపు ఉంచకూడదని కార్యక్రమాలన్నీ ఆఫీస్ వాళ్ళే పూర్తి చేసి , చితాభస్మాన్ని కౌశికకు అప్పగించారు.

ఎలా ఇంటికి వచ్చిందో తెలీదు ...నిస్తేజంగా సోఫాలో కూలబడింది...చేతిలో చితాభస్మం ఉన్న మట్టిపాత్ర...

అప్పటివరకూ ఘనీభవించిన సంద్రంలా ఉన్న మనసు ఒక్కసారిగా కరిగి కన్నీరుగా మారింది....

"ఎంత పని చేసావు బావా...నేను ఉన్నానన్న విషయాన్ని ఎలా మర్చిపోయావు...నేనేం తప్పు చేశాను ...నన్ను ఇలా ఒంటరిని చేశావు ...జీవితాన్ని ఇచ్చిన నీ ఋణం తీర్చుకునే అవకాశం లేకుండా అందనంత దూరం వెళ్ళావు..ఎందుకు చేశావు బావా" కన్నీరు మున్నీరైంది.

అప్పుడు గుర్తుకొచ్చింది ....ఉన్నపాటుగా లేచి బయలుదేరింది.

పోష్ లొకాలిటీ లో ఉన్న ఇంటిలోకి అడుగుపెట్టిన కౌశిక ఎదురుగా కనపడిన దండవేసి, దీపం పెట్టిన సంజయ్ నిలువెత్తు చిత్రాన్ని చూస్తూనే కుప్పకూలిపోయింది..

తన భుజంపై పడిన చేతి స్పర్శకు తలెత్తి చూసింది...

"ఎవరమ్మా నువ్వు" ఆ ప్రశ్న అడిగిన వృద్దుడిని చూసి లేచి నుంచుంది.

" నా పేరు కౌశిక" చెప్పింది

" ఓ...నువ్వామ్మా...నీ గురించి సంజయ్ చెప్తూ ఉండేవాడు " అంటూ కౌశికను చేయపట్టి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి పక్కనే కూర్చుని చెప్పాడు.

అర్జున్, సంజయ్ ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అని, ఇద్దరూ ఒకేసారి చనిపోయారని....సంజయ్ కి తాను తాత అవుతానని, వారి సంగతి తనకు తెలుసనీ, సంజయ్ తన పేరున ఉన్న ఆస్తిని కౌశిక పేరున రాశాడని, తనవల్ల, అర్జున్ వల్ల కౌశికకు జరిగిన అన్యాయానికి ఇది కేవలం ఓ చిన్న జరిమానా మాత్రమే అని చెప్పాడని , ఆస్తి పేపర్స్ ని కౌశిక చేతిలో పెట్టాడు సంజయ్ తాత...సంజయ్ చిన్నప్పుడే తల్లితండ్రులు పోయారని, తాత ఆలనాపాలనలోనే పెరిగాడని తెలిసింది...సంజయ్ లేనిచోట తాను ఉండలేనని, తను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరతానని చెప్పడంతో, ఆయన్ని తనతో ఉండేలా ఒప్పించి, ఇక ముంబైలో ఉండలేక, వైజాగ్ తనకోసం అని సంజయ్ పెట్టిన డిజైనర్ స్టూడియో చూసుకోవాలని ఇక్కడికి వచ్చింది....సంజయ్ తాతగారు ప్రభాకరంగారు యాత్రలు చేసి వస్తానని చెప్పడంతో ఆయన వచ్చేవరకూ సుధ రూంలో ఉండడానికి నిర్ణయించుకుంది .


చాలా సేపు నిశ్శబ్దం అలుముకుంది ఇద్దరి నడుమ...నెమ్మదిగా గొంతు సవరించుకుని అడిగాడు కైవల్య...

"మరి మీ వాళ్ళు ..."

"అందరినీ శాశ్వతంగా వదులుకుని వచ్చేశాను...మూర్ఖత్వ౦తో ప్రవర్తించి అన్యాయంగా ఓ మనిషి చావుకు కారణమైన వారితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను...బావ ఆత్మహత్యకు కారణం నా తండ్రి మాటలు అని, ఫోన్ చేసి నాకేదో అన్యాయం జరిగినట్టుగా , తనతో బావ వ్యాపారం ...." మాటరాలేదు కౌశికకు....తనని తాను సంభాళించుకుని

"నానామాటలు అనడంతో తట్టుకోలేకపోయిన బావ ఈ నిర్ణయం తీసుకున్నాడని , బావ సంజయ్కు పంపిన మెసేజ్ ద్వారా తెలిశాక ఇక నాకు ఎవరూ అవసరం లేదనిపించింది...అందుకే వారితో తెగతెంపులు చేసుకుని వచ్చేశాను...మనిషిని మనిషిగా చూడలేని వారితోనూ, వారి మనసులను కాంచలేని వారితోనూ నాకు పనిలేదు...ఇలాంటి వారిని సపోర్ట్ చేస్తానని నన్ను వెలివేసే వారితో నాకు అవసరం లేదు...నా జీవిత౦ నాది...ఈరోజు నాకంటూ ఓ జీవితం, నా కాళ్ళమీద నిలబడగలిగే ధైర్యం ఇవన్నీ బావ ఇచ్చినవే...వాటిని సద్వినియోగం చేసుకోవడమే నేను బావకి , సంజయ్కి ఇచ్చే నిజమైన నివాళి ..అది చాలు నాకు "

కౌశిక వ్యక్తిత్వానికి కౌశికపై గౌరవం పెరిగింది కైవల్యకు.

లేచి అక్కడి నుండి బయలుదేరారు...కారు పార్కింగ్కు వచ్చేసరికి...కైవల్య ఫోన్ మోగడంతో ఆన్సర్ చేసిన తన మొహంలో కంగారు చూసి..

"మిస్టర్ కైవల్య..ఏమైంది"

"అది...అన్నయ్య...నేను వెళ్ళాలి " అంటూ కారులో కూర్చుంటున్న కైవల్యను చూసి.

గబగబా అటు వెళ్లి తనూ కారులో కూర్చుంది...

తనవైపు చూసిన కైవల్య మొహంలో సందేహాన్ని గమనించి,

"ముందు పదండి..తర్వాత మాట్లాడదాం" అనడంతో కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు..

వెళ్ళేసరికి మేడమీద ఉన్న సుప్రజ్ గది ముందు ఇంటిల్లిపాదీ చేరి మూసి వున్న తలుపులను బాదుతున్నారు.

ఇంటిపనివాడు కాబోలు...కైవల్యను చూస్తూనే దగ్గరకు వచ్చి ...

"ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరో పెదబాబు గురించి చిన్నతనంగా మాట్లాడరయ్యా....పెద్దయ్యగారు మళ్ళీ పెదబాబుని తిట్టారయ్యా ...దాంతో గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నారు ..అంతే ..ఎంత పిలిచినా పలకటం లేదు బాబు" గాభరాగా చెప్పాడు .

పరుగున మేడమీదకు దారితీసి, అందరిని తప్పించుకుని తలుపులపై కొట్టాడు కైవల్య..

"అన్నయ్యా...అన్నయ్యా..తలుపు తీయి అన్నయ్యా.......ప్లీజ్ అన్నయ్యా ...తలుపు తీయి..."

దుఃఖం వచ్చేస్తోంది కైవల్యకు ..

అక్కడి వారిని చూస్తూనే వారిది ఉమ్మడి కుటుంబం అని అర్ధం చేసుకుంది కౌశిక..

వెళ్ళి తలుపులు బాదుతూ పిలుస్తున్న కైవల్య చేయి పట్టుకుని ఆపింది...

"కైవల్యా...ఈ గదికి వెళ్ళడానికి మరో దారి ఉందా " అడిగింది.

కౌశిక ఏం అడిగిందో అర్ధం కాలేదు కైవల్యకు తన అన్నకు ఏమైందో అనే ఆందోళనలో...

పనివాడు చెప్పాడు....

"ఆ పక్క గది కైవల్యబాబుదే ...ఆ గది బాల్కనీ నుండి కొంచెం కష్టపడితే పెదబాబు గది బాల్కనీలోకి వెళ్ళచ్చు "

మరేం ఆలోచించలేదు కౌశిక...కైవల్య గది తలుపు తీసుకుని వెళుతూ నిచ్చెన తెమ్మని పురమాయించింది...

అప్పటికిగానీ కైవల్యకు కౌశిక ప్లాన్ అర్ధం కాలేదు...మరుక్షణం కౌశిక వెనక వెళ్ళాడు.

తీసుకొచ్చిన నిచ్చెనని, బాల్కనీల మధ్య దూరాన్ని, నిచ్చెన బలాన్ని కనులతోనే అంచనావేసి, నిచ్చెనను రెండు బాల్కనీలను కలిపే వంతెనలా వేసి పైకి ఎక్కుతుంటే...

"కౌశిక ఆగు...నేను వెళతాను" అన్నాడు

"లేదు కైవల్యా...నీ వెయిట్కు నిచ్చెన ఆగకపోతే కష్టం..ముందు నేను వెళతాను." అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నిచ్చెన ఎక్కింది...

నిచ్చెనను గట్టిగా పట్టుకున్నాడు...నెమ్మదిగా అడుగు కదుపుతూ అటు బాల్కనీలోకి దూకింది...ఏమాత్రం అటు ఇటు అయినా అంతే సంగతులు...రెండో అంతస్తు ఎత్తునుండి కింద పడడమే...

పనివాళ్ళు, కైవల్య బాబాయి కొడుకు పట్టుకోడంతో కైవల్య కూడా జాగ్రత్తగా అటు నుండి ఇటు వచ్చాడు.

అప్పటికే బాల్కనీలోని ఫ్రెంచ్ విండో నుండి లోపల ఉన్న సుప్రజ్ స్థితిని గమనించిన కౌశిక లోపలకు వెళ్ళడానికి చూసింది కానీ లాక్ చేసి ఉంది...తన అన్న పరిస్థితిని చూసిన కైవల్యకు మతిపోయింది...బొమ్మలా నిలబడ్డాడు.

కారులో వస్తుంటే చెప్పాడు కైవల్య...తనకు తన అన్న సుప్రజ్ అంటే చాలా ఇష్టమని ,,,తండ్రి కంటే తనకు తన అన్నదగ్గరే చనువు ఎక్కువని, తనని తండ్రిలా చూసుకుంటాడని..ఏదీ కావాలన్నా అన్నను అడిగే అలవాటే తప్ప తండ్రిని అడిగే అలవాటు లేదని, అసలు అడగకుండానే అన్నీ అమర్చడం తన అన్న స్పెషలిటీ అని..

అది గుర్తుకొచ్చి , కైవల్య స్థితి అర్ధమయిన కౌశిక తానే పూనుకుంది...

పిడికిలి బిగించి, తన బలమంతా ఉపయోగించి ఫ్రెంచ్ విండో అద్దాన్ని బద్దలు కొట్టింది...కౌశిక చేతిని గాయపరుస్తూ భళ్ళున బద్దలైంది అద్దం...ఆ శబ్దానికి షాక్ నుండి బయటపడ్డ కైవల్య రక్తసిక్తమైన కౌశిక చేతిని చూసి కంగారుపడ్డాడు.

కైవల్యను వారించి, లోపలకు అడుగుపెట్టింది...

వడివడిగా సుప్రజ్ని చేరి నాడీని చూసింది...బలహీనంగా కొట్టుకుంటోంది ...చేతి నరం కోసుకోవడంతో రక్తం కారుతోంది...

"కైవల్యా...కారు తీయి" చెప్పి, గబగబా అందిన దుప్పటిని చింపి రక్తం కారుతున్న సుప్రజ్ చేతికి కట్టింది...

" మిస్టర్ సుప్రజ్" చెంపమీద బలంగా తడుతూ పిలిచింది...

బలవంతంగా కళ్ళు తెరిచి చూశాడు..

అప్పటికే గది తలుపులు తీసి బయటకు పరిగెత్తాడు కైవల్య...సుప్రజ్ని ఆ స్థితిలో చూసిన అతని తల్లి, బామ్మ ఏడుపు మొదలుపెట్టారు...గంభీరంగా ఉన్నా కన్నకొడుకు పరిస్థితి కలిచివేస్తోందని ఆ తండ్రిని చూస్తేనే తెలుస్తోంది..అవేమీ పట్టించుకోలేదు కౌశిక.

"సుప్రజ్ ...కళ్ళు మూయకండి...నా మాటలు వినండి...నేను చెప్పేదానికి ఊ కొట్టండి...మెలకువగా ఉండండి" అంటూ సుప్రజ్ని స్పృహలో ఉండేలా చూస్తూ ..

పనివాళ్ల సాయంతో సుప్రజ్ని కారులో పడుకోబెట్టి పక్కనే కూర్చుని, స్పృహలో ఉండేలా తన ప్రయత్నం తాను చేస్తుంటే, కారుని ముందుకు దూకించాడు కైవల్య.

హాస్పిటల్ కు వెళుతూనే ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళారు...తెలుసున్న హాస్పిటల్ కావడంతోనూ, డాక్టర్ ,కైవల్య స్నేహితుడే కావడంతోనూ ఎవరూ అబ్జెక్ట్ చేయలేదు...

అందరూ హాస్పిటల్కు చేరారు.

డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో కైవల్య మొహంలోకి వెలుగొచ్చింది..

"స్పృహలో ఉండేలా చూడడం వల్ల సేవ్ చేయడం తేలికైంది ..అదే స్పృహ తప్పుంటే, హెవీ బ్లడ్ లాస్ వల్ల కష్టమైయ్యేది...వెళ్ళి చూడచ్చు ." చెప్పి అతను వెళ్లిపోవడంతో అప్పుడు చూశాడు కౌశిక వైపు ..

వచ్చి చేయి పట్టుకుని,

"ఈరోజు నువ్వే లేకపోతే అన్నయ్య ప్రాణాలతో ఉండేవాడు కాదు కౌశిక" ఉద్వేగంగా అన్నాడు

చేయి పట్టుకోవడంతో బాధగా మూలిగింది...అప్పుడు చూశాడు కౌశిక చేతిని...

"సారీ. " అని తన చేయి పట్టుకుని డాక్టర్ ఫ్రెండ్ రూమ్లోకి తీసుకెళ్ళాడు...వారించినా వినలేదు.

చేతికి డ్రెస్సింగ్ చేయించాక బయటకు వచ్చాడు కౌశికతో...

అక్కడి సిట్యుయేషన్ని చూసి..

"ప్రమాదం తప్పింది కాబట్టి కొంచెం కనిపెట్టుకుని ఉండండి...కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే అంతా సెట్ అవుతుంది....నేను మళ్ళీ కలుస్తాను...ఉంటాను" చెప్పి బయలుదేరింది.


నాలుగు రోజుల తరువాత కైవల్య రమ్మని ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చింది.

సుప్రజ్ కి కౌశికను పరిచయం చేశాడు కైవల్య.

"థాంక్స్ అండి"

"థాంక్స్ చెప్పి నన్ను మునగచెట్టు ఎక్కించకండి...మనిషిగా నేను చేయగలిగిన సాయం చేశాను...అంతే"

"ప్రాణాలు కాపాడిన వారికి ఏమిచ్చినా ఋణం తీరదు కదండీ...నాప్రాణాలు కాపాడి ఋణగ్రస్తుడిని చేశారు"

"మీ ప్రాణాలు కాపాడింది మీకోసం కాదు...మీమీదే ప్రాణాలు పెట్టుకున్న మీ తమ్ముడి కోసం...నిజంగా మీరు ఋణం తీర్చుకోవాలనుకుంటే, భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని జీవించండి...ఎవరో ఏదో అన్నారని బలవంతంగా మిమ్మల్ని మీరు బలి చేసుకోవద్దు...అందరూ కాకపోయినా మీకోసం తపించే వారికి తీరని దుఃఖాన్ని కానుకగా ఇవ్వొద్దు...మరోసారి జీవించే అవకాశం వచ్చింది...అది ఎందుకో తెలుసుకుని జీవించండి ...అదే మీరు నాకిచ్చే అతిపెద్ద కానుక."

కౌశిక మాటలకి , ఆ చిన్నవయసులోని పరిపక్వతకు ఆశ్చర్యపోయాడు సుప్రజ్ .

"అయినా మరోసారి ప్రాణాలు తీసుకునే హక్కు మీకు లేదు సుప్రజ్ గారు..ఎందుకంటె మీ ప్రాణాలు కాపాడింది నేను..సో మీ ప్రాణాలమీద హోల్ రైట్స్ నావే...గుర్తుపెట్టుకోండి....మీరు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే నేను లీగల్ గా అప్రోచ్ అవుతాను...మీతమ్ముడు నాతో బిజినెస్ డీల్ కుదుర్చుకుని బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు...మరి నాతో చేయి కలిపి బిజినెస్ చేస్తారో లేక కేసులు కోర్టు అంటూ తిరుగుతారో మీరే ఆలోచించుకోండి" నవ్వుతూ అన్న కౌశిక మాటలకు నవ్వేశారు అన్నదమ్ములు ఇద్దరూ.

"ఇలాగే మీ ఇద్దరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి...ఇక నేను బయలుదేరతాను" చెప్పి బయలుదేరిన కౌశికను పంపి వస్తానని చెప్పి బయటకు వచ్చాడు కైవల్య.

కౌశిక మాటలు బానే పనిచేశాయి సుప్రజ్ పై ..

వెళుతున్న కౌశికను పిలిచింది కైవల్య తల్లి...ఆగి చూసింది...ఇంటిల్లిపాదీ హాలులోనే ఉన్నారు..కౌశికను ఏమైనా అంటారేమో అని కంగారుపడ్డాడు కైవల్య...తల్లి వైపు చూశాడు.

ఆవిడ దగ్గరకు వచ్చి కౌశిక చేతులు పట్టుకుని ...

"చాలా థాంక్స్ అమ్మ...ఆరోజు నువ్వే లేకపోతే వాడు ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు " కన్నీళ్లతో అంది

తలెత్తి అందరినీ చూసింది...అందరి కళ్ళల్లోనూ అదే భావం...

కైవల్య తండ్రి దివాకరంగారి మొహంలో బాధ స్పష్టంగా కనపడుతోంది...ఆఇంట్లో ఆయనదే పైచేయి అని చూడగానే అర్ధ౦ అయ్యింది కౌశికకు .

"మీరేదో అడగాలనుకుంటున్నారు...అడగండి" దివాకరంను చూస్తూ అంది

ముందు తడబడ్డా , ఆపై కుదురుకుని...

"ఆరోజు హాస్పిటల్లో కౌన్సిలింగ్ ఇస్తే అంతా సెట్ అవుతుంది అన్నావు కదా...నిజంగా వాడు మామూలు అవుతాడా " అడగలేక అడిగాడు.

నవ్వింది...

"కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది మీ అబ్బాయికి కాదు...మీకు " సూటిగా అంది

విస్తుపోయి చూశారు అందరూ అంత సూటిగా మాట్లాడిన కౌశిక పద్దతికి..

"నాకు డొంక తిరుగుడుగా మాట్లాడే అలవాటు లేదు...నా మాటలు మీకు బాధ కలిగించినా నా మాటల్లో వాస్తవం మాత్రమే ఉంటుంది..నేనొకటి అడుగుతాను..సూటిగా సమాధానం చెప్పండి ...నిజంగా మీ అబ్బాయి చనిపోయుంటే మీరేం చేసేవారు ...సంతోషంగా ఉండేవారా "

మౌనంగా ఉండిపోయారు.

"ఉండేవారేమోలెండి..ఎవరూ ఏమీ అడగరుగా...మీరు బాధపడుతుంటే చూసి సంతోషిచే వారికోసం కన్నకొడుకుని త్యాగం చేసిన వారిగా మీకు పేరు ప్రతిష్ట వస్తాయిగా...అవునా"

కౌశిక మాటలు చురకత్తుల్లా వాడిగా తగిలాయి అందరికీ...గిలగిలలాడారు.

"నిజానికి ఇందులో మీ అబ్బాయి తప్పేముందో చెప్పండి..తన కారణంగా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని , తన గురించి తెలిస్తే సమాజం తనని హీనంగా చూస్తుందని తెలిసినా తన స్థితిని నిజాయితీగా చెప్పినందుకు అతనికి మీరు ఇచ్చే కానుక మరణమా.... తన గురించిన నిజం దాచి మీరు చెప్పినట్టే పెళ్ళి చేసుకుని ఓఆడపిల్ల జీవితం నాశనం చేస్తే మీకు సంతోషం...నిజం తెలిసి ఆఅమ్మాయి మీపరువుని అతని జీవితాన్ని బజారులో పెడితే అది మీకు ఆనందం అంతేనా౦డీ"

ఎవ్వరూ మాట్లాడలేదు..

" మీ కొడుకు తన గురించి చెప్పి ,మీతో పంచుకున్నందుకు సంతోషపడండి , ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయనందుకు అభినందించండి...అవకాశం దొరికితే అణగదొక్కాలని చూసే వారికి ధీటైన జావాబు చెప్పండి...ఎదుటి వారు బాధపడుతుంటే మరింతగా బాధపెట్టాలని చూసే వారికి మీరేంటో, మీ వ్యక్తిత్వమేంటో తెలియచెప్పండి.....సమాజంలో బ్రతికే హక్కు , అర్హత మనకెలా ఉన్నాయో వారికి అలాగే ఉన్నాయి...సూటిపోటి మాటల్తో హింసించడం కాదు ..అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోడానికి ప్రయత్నించండి....చేతనైతే చేయి అందించి వారికి తోడుగా ఉండండి...లేదా వారికి నచ్చచెప్పి వారికంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేయండి...ప్రాణం పోశాము కదా అని ప్రాణాలు తీసే హక్కు మాకే ఉందని భావించకండి...ప్రాణం పోయడం వరకే మీ వంతు...భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని జీవించే హక్కు మనకు ఉన్నట్టే ప్రత్యేకమైన వారికి కూడా ఉంది...మీ అబ్బాయి లోపాన్ని వేలెత్తి చూపే వారికి , మీ అబ్బాయి టాలెంట్ ఏంటో చూపించండి..ప్రపంచం పాదాక్రాంత౦ అవుతుంది...చేయెత్తి చూపించిన వాళ్ళే చేతులు కట్టుకు నిలబడతారు...వాళ్ళ బ్రతికే హక్కుని నాశనం చేసి వారిని దూరం చేసుకోకండి....ఆ తరువాత మీరు ఎంత పశ్చాత్తాప పడిన ప్రయోజనం శూన్యం ..ఎంత ఏడ్చినా ఈజన్మకు మీరు ఆ బాధనుండి బయట పడలేరు...వారిని దూరం చేసుకుని జీవితాంతం కుములిపోతారో, లేక అండగా నిలిచి మీకొడుకు అని గర్వ౦గా చెప్పుకుంటారో నిర్ణయం మీదే ...శెలవు" చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కౌశిక..

వెళుతున్న కౌశికనే చూస్తూ ఉండిపోయారు..


ఏడాది తర్వాత :

హోమ్ ఫర్ గాడ్స్ స్పెషల్ క్రియేషన్

బోర్డు సాయంకాలం నీరెండలో తళతళా మెరుస్తోంది...

ఆర్చ్ గేట్ బయట పార్కింగ్ లో ఆగింది లేటెస్ట్ మోడల్ ఆడి కారు...అందులోంచి దిగిన ఫుల్ సూట్లో ఉన్న ఆరడుగుల యువకుడు తలెత్తి బోర్డు వైపు ఓసారి చూసి, డ్రైవింగ్ సీట్లో ఉన్న మరో హ్యాండ్సమ్ యువకుడి వైపు చూసి చిన్నగా తలపంకించి ,ఠీవిగా లోపలకు నడిచాడు.

"మే ఐ కం ఇన్ కౌశిక"

ఆ ప్రశ్నకి , డెస్క్టాప్ స్క్రీన్ మీంచి తలతిప్పి చూసిన కౌశిక , గుమ్మ౦లో కనపడిన యువకుడిని చూసి చిరునవ్వు నవ్వింది

"సుప్రజ్...అక్కడే ఆగిపోయావేం...లోపలకు రా " పిలిచింది

వచ్చి కౌశిక ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు సుప్రజ్.

"ఎలా ఉన్నావు....చాలా రోజులైంది చూసి" అడిగింది.

"నీ కారణంగా చాలా సంతోషంగా ఉన్నాను...ఇప్పుడు ఎవ్వరూ నన్ను వేలెత్తి చూపటం లేదు...ఇంట్లో కూడా అందరూ నాతో చాలా ప్రేమగా, మునుపటిలా ఉంటున్నారు..ఇదంతా నీవల్లే " కృతజ్ఞతగా అన్నాడు.

"నేనేం చేశాను...అది మీవాళ్ళ గొప్పతనం...చిన్నదాన్ని అని నేను చెప్పినదాని గురించి తీసిపడేయకుండా , ఆలోచించారు చూడు అది వాళ్ళ సంస్కారం ..అంతే ...ఏదైనా ఉంటె వాళ్లకు చెప్పు" చిరునవ్వుతో అంది ..

"చేసిన వాటిని చెప్పకపోవడం ఇది నీ గొప్పతనం , సంస్కారం"

"చాలు ..పొగడ్తలు ఎక్కువయ్యాయి." సున్నితంగా అంది

"అది సరే ...డీల్ ఎప్పుడు సైన్ చేస్తావు " అడిగాడు

"నా షరతుకి నువ్వు ఒప్పుకున్నప్పుడు" అంది

"ఏమిటది "

ఓ ఫైల్ తీసి సుప్రజ్ ముందు పెట్టింది చూడు అంటూ సైగ చేస్తూ ..

ఫైల్ తెరిచి చదివిన సుప్రజ్ ఆశ్చర్యపోయాడు ..

"కౌశిక..ఏంటిది "

" డీల్...ఈ హోమ్ ని నాకంటే సమర్థవంతంగా నడపగలిగే అర్హత నీకే ఉంది సుప్రజ్ ..కారణం వారి సాధకబాధకాల గురించి నాకంటే నీకే ఎక్కువగా తెలుస్తుంది...నీ అనుభవం అందుకు ఉపయోగపడుతుంది...నీజీవిత౦ మరో పదిమందికి ఆదర్శంగా మారితే అంతకంటే ఏంకావాలి...నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి , జీవితాన్ని అంతం చేసుకోవాలి అని కాక జీవించాలి అనే ఆశ, పట్టుదల వారికి కలిగితే జీవిత అర్ధం నెరవేరినట్టేగా ..అందుకే ఇలా..ఇప్పడు చెప్పు ఈ డీల్ నీకు ఒకే అయితే బిజినెస్ డీల్ నాకు ఒకే " అంది

నవ్వాడు సుప్రజ్..

"వెల్ ..నేను ఈ డీల్ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు నేను చెప్పే మరో డీల్ గురించి ఆలోచించి నీ నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది"

"మరో డీలా..ఏంటది "

"కౌశిక...నిన్ను చూసిన క్షణమే నీకు మనసిచ్చాడు కైవల్య "

ఉలిక్కిపడింది ఆ మాటకి .

"నీ ప్రవర్తన వింతగా ఉండడం, ఆపై నీ గురించి తెలీడంతో తన ప్రేమ గురించి చెప్తే ఎక్కడ నీమీద జాలితో చెప్తున్నాడని అనుకుంటావేమో అని ఇన్నాళ్లు మౌనంగానే ఉన్నాడు...నీకు దూరంగా ఉండాలని వాడు చేసిన ప్రయత్నం ఫలించలేదు...నిన్ను మర్చిపోలేక, అలా అని నీకు చెప్పలేక వాడు పడే బాధకు నేనే ప్రత్యక్ష సాక్షిని....వాడి బాధ చూడలేక నీతో మాట్లాడాలని వచ్చాను...వాడు వద్దని వారించాడు...కానీ వాడి అన్నగా వాడికి ఏ౦ కావాలో వాడు అడగముందే ఇచ్చే నేను, అన్నయ్యా...కౌశిక అంటే నాకు ప్రాణం కానీ చెప్పలేను ..నాది ప్రేమ కాదు జాలి అని అనుకుంటే తట్టుకోలేను ...అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో తెలీటం లేదు ...ఏం చేయాలి అని వాడు అడిగేసరికి తట్టుకోలేకపోయాను..

కౌశిక...ఒక్కక్షణం ఆలోచించు ...నా తమ్ముడని ఒప్పుకోమనటం లేదు...వాడేమిటో నీకు తెలుసు..ఎలాంటి వాడో కూడా తెలుసు...ప్లీజ్ ...వాడి మోహంలో నవ్వు చూసి చాలా రోజులయ్యింది ...తిరిగి వాడి మొహంలో వాడని ఆ నవ్వులను చూడాలంటే అది నీవల్లే అవుతుంది ....ఆ....ఈవిషయం ఇంట్లో అందరికీ తెలుసు ...నీలాంటి అమ్మాయి ఇంటి కోడలు అవ్వటం కంటే అదృష్టం ఏముంటుందన్నది వారి మాట......కావాలంటే వాళ్ళు కూడా వస్తారు....."

"సుప్రజ్..వాళ్లకి నా గురించి..."

మధ్యలోనే అడ్డుకున్నాడు .

"తెలుసు ..ఆరోజు నువ్వు వెళ్ళిపోయాక నీగురించి చెప్పాడు కైవల్య ..అప్పుడే వాడి మనసులో ఉన్నది కూడా చెప్పాడు "

కొద్దిక్షణాలు మౌనంగా ఉండిపోయింది.

"కైవల్య ఎక్కడ"

"బయట కారులో "

లేచి బయటకు నడిచింది...తనూ లేచి బయటకు వచ్చాడు.

కారు దగ్గరకు వెళ్లి విండో గ్లాస్ మీద తట్టింది..

నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి కిందకు దిగాడు కైవల్య.

కొద్దిదూరంలో ఆగి చూస్తున్నాడు సుప్రజ్.

సూటిగా చూసింది కైవల్యను.

తడబడ్డాడు .

తలతిప్పి సుప్రజ్ వైపు చూస్తూ..

" మీ తమ్ముడికి నువ్వు చెప్పిన ఉద్దేశ్యాలు ఏవీ లేనట్టుగా అనిపిస్తోంది " అంది

కైవల్య ఆశ్చర్యంగా చూస్తే, సుప్రజ్ నవ్వాడు..

" నువ్వు అవునంటావో లేక కాదంటావో అని భయం" అన్నాడు

"అసలు చెప్తేనే కదా ఏమంటానో తెలిసేది "

అంతే ..

"నన్ను పెళ్ళి చేసుకుంటావా " వెంటనే వచ్చింది ఆ ప్రశ్న కైవల్య నుండి.

తలతిప్పి చూసింది ..

"నాతో జీవితం చాలా సూటిగా ఉంటుంది " అంది

"ఇష్టమే " అన్నాడు

"చెప్పినంత తేలిక కాదు నాతో వ్యవహారం "

"భరిస్తాను "

"నాకు రహస్యాలు నచ్చవు "

"ఎలాంటి విషయమైనా పంచుకోడానికి సందేహించను"

"సందర్భాన్ని బట్టి నా మాటలు కొన్ని తట్టుకోలేని విధంగా ఉంటాయి"

"సహిస్తాను "

"నా నిర్ణయాలు ఒక్కోసారి ఒప్పుకోవడానికి కష్టంగా ఉండచ్చు "

"అర్ధం చేసుకుని సహకరిస్తాను "

"ఒక్కసారి కమిట్ అయితే "

"నాలో ఊపిరి ఉన్నంతవరకూ చేయి వదలను...తోడు వీడను " అన్నాడు

"నా గతం జ్ఞాపకాలు నన్ను వీడవు "

" నేను నీతో ప్రయాణిస్తాను...నీకు చేదోడుగా ఉంటాను "

ఆ మాటకి చటుక్కున చూపు తిప్పుకుంది

కొద్దిక్షణాలు నిశ్శబ్దం అలుముకుంది..... కైవల్యకు టెన్షన్ గా ఉంది...

నోరు తెరవబోయి, ఏదో అనుమానం వచ్చినట్టు కళ్ళు చిన్నవి చేసి, కైవల్యను చూసి వెనక్కు తిరిగి సుప్రజ్ వైపు చూస్తూ..

"ఇదుగో...బావగారు అంటూ వరస కలిపి పిలవమంటే కష్టం...పేరుతోనే పిలుస్తాను సుప్రజ్ అని ..అందుకు ఒకే అయితే నాకు ఓకే" అంది

విన్న సుప్రజ్, కౌశిక నిర్ణయం అర్ధం అయ్యి గలగలా నవ్వాడు.

కైవల్యకు ఓ క్షణం పట్టింది కౌశిక అన్నది ఏంటో అర్ధం కావడానికి ..అర్ధం అయ్యిన మరుక్షణం కౌశికను చుట్టేశాడు.

కైవల్య మొహంలో సంతోషాన్ని చూసి తృప్తిగా తలపంకించాడు సుప్రజ్.

"రేయ్...నేనింకా ఇక్కడే ఉన్నాను"

తన అన్న మాటలకి సిగ్గుపడుతూ కౌశికను వదిలి , అన్న దగ్గరకు వెళ్ళి , సుప్రజ్ ని కౌగలించుకుని ..

"థాంక్స్ అన్నయ్యా" అన్నాడు

"రేయ్...నువ్వు నా తమ్ముడివిరా....నీకేం కావాలో ఇవ్వాల్సిన బాధ్యత నాది..నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి...ఎంజాయ్ " చెప్పి తమ్ముడి భుజం తట్టి ..

"పదండి ...అందరూ ఎదురు చూస్తూ ఉంటారు...ఈ శుభవార్త వినడానికి "అంటూ కారు వైపు నడిచాడు సుప్రజ్ .

ఆనందంగా కౌశిక భుజం చుట్టూ చేయి చుట్టి దగ్గరకు తీసుకుంటూ అడుగు ముందుకేశాడు కైవల్య ..

కైవల్య ప్రేమని ఆస్వాదిస్తూ చిరునవ్వుతో కైవల్యతో పాటుగా అడుగు కదిపింది కౌశిక.

******సమాప్తం *****

ఫణికిరణ్@కిరణ్మయిఅనిసింగరాజు 


మీ ఫణికిరణ్.


Rate this content
Log in

Similar telugu story from Drama