Phanikiran AK

Drama Classics Inspirational

4.0  

Phanikiran AK

Drama Classics Inspirational

చిరు కానుక

చిరు కానుక

4 mins
212


సుభద్రకు గత నెలరోజులుగా ఇంటి వాతావరణం పిచ్చెక్కిస్తోంది. 

అందుకు కారణం ఒకటి కరోనా అయితే , మరొకటి ఇంట్లో ఉండే నలుగురు సభ్యుల్లో ముగ్గురు వర్క్ ఫ్ర౦ హోమ్ అని ఒకరు, ఆన్లైన్ కోచింగ్ అని ఒకరు, ఆన్లైన్ క్లాసులు అని ఒకరు గదులకు బందీలు కావడమే. 

కరోనా దెబ్బకు పనిమనిషిని రమ్మనడానికి భయమేసింది. అపార్ట్మెంట్ జీవితంలో ఉండే ఇబ్బంది, పనమ్మాయిని ధైర్యం చేసి ఆహ్వానించడానికి లేకపోవడంతో చచ్చినట్టు ఇంటిపని చేసుకుంటోంది. 

దానికి తోడు సహజంగానే తనకు ఉన్న అనారోగ్య ఇబ్బందులు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.

పోనీ ఇంట్లో వాళ్ళని సాయం అడుగుదామంటే, 

తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకూ వాళ్ళ వర్క్లతోనే టైం సరిపొవట్లేదని గోల చేస్తున్నారు. 

తిండితిప్పలు అన్నీ ఆలస్యమే.

వండి అక్కడ పెడితే, పని పూర్తయ్యి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకుంటే, చల్లారిపోయాయి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చల్లారినవేనా అని సణుగుడు. పోనీ వాళ్ళు తినే టైంకి ముందు చేద్దాము అంటే ఒక్కొక్కరు వారి వారి వీలుని బట్టి తినడానికి రావడంతో నరకం కనపడుతోంది. 

మధ్యలో పిల్లల బాలింత కోరికలు. బయటకు వెళ్ళడానికి లేదుగా అంటూ సన్నాయి నొక్కులు.

"పనమ్మాయి లేదురా " అంటే ,

"మేము సాయం చేస్తాము కదమ్మా. రోజు అడగటం లేదుగా . ఈరోజు ఆదివారం అని అడిగాము " అంటూ పిల్లలు ముద్దుగా అడిగేసరికి, మురిసిపోయి, 

"పోనీలే , నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు" అని అమ్మ మనసు గోల చేస్తుంది.

పిల్లలు సాయం చేయకుండా సాకు చెప్పి తప్పించుకుంటారని తెలిసీ, వారు అడిగినది చేయడం.

తీరా చేశాక సాయం మాట దేవుడెరుగు, బాగుంది అన్న ఓ మెప్పు కూడా దక్కదన్న ఉడుకుమోత్తనం.  

ఇంతకుముందు ఇంటి పని పనమ్మాయి చేసి వెళితే, అందరూ వెళ్ళాక కాసేపు విశ్రాంతి తీసుకుని, తన అభిరుచులకు జీవం పొసే పని చేసేది. మనసు, శరీరం రిలాక్స్ అయ్యేవి. తర్వాత సాయంత్రం వచ్చే పిల్లలకోసం తినడానికి ఏదో ఒకటి రెడీ చేసి, రాత్రి వంట చేయడం, మర్నాటికి కావలసినవి సిద్ధం చేసుకోవడం, అందరూ కూర్చుని టీవీ చూస్తూ, ఆ వచ్చే ప్రోగ్రామ్స్ మీద జోకులు వేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం, అన్నీ సర్దుకుని నిద్రాదేవి ఒడి చేరడంతో రోజు గడవడం పెద్ద కష్టంగా ఉండేది కాదు సుభద్రకు.

ఇప్పుడు పోనీ అలాగే తన అభిరుచులు కొనసాగిద్దామా అంటే ఉన్న రెండు బెడ్ రూమ్స్లో చెరొక దానిలో పిల్లలు కూర్చుంటున్నారు. హాలులో భర్త సుందరం కూర్చుంటాడు. పోనీ అక్కడే కూర్చుందాము అంటే, సుందరానికి వచ్చే ఆఫీస్ ఫోన్లకి, కాన్ఫరెన్స్ కాల్స్, మీటింగ్లు వింటే పిచ్చెక్కుతున్న అనుభూతి కలుగుతుంటే అక్కడ కూర్చోడం మానేసింది. 

ఉదయం లేచిన దగ్గరనుండి పని అయ్యేవరకూ వంటింట్లోనే ఉంటుందేమో , పని పూర్తయ్యేక అటు పక్కకి వెళ్ళాలంటే భయం వేస్తోంది. 

పోనీ డైనింగ్ హాలులో కూర్చోడానికి, తాను అన్నీ సర్దుకుని అక్కడ కూర్చుంటే, భోజనాలు చేయడానికి పిల్లలు, భర్త వస్తే అవన్నీ సర్దాలి. పట్టుమని ఓ అరగంట కూడా కూర్చున్నట్టు ఉండదు. అందుకే అదీ మానేసింది.

****%%%****

వారం రోజులుగా ఏదో ఆలోచిస్తూ కనపడుతున్న భార్యని గమిస్తున్నా, తన వర్క్, ఫోన్ కాల్స్, మీటింగ్లతో భార్యతో తీరికగా మాట్లాడటానికి అవ్వక వూరుకున్నాడు సుందరం.

వర్క్ ఫ్రo హోమ్ అన్న నాటి నుండి ప్రశాంతంగా శని, ఆదివారాలు గడిపింది లేదు. ఏదో ఒకదానికి కాల్స్ రావడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి తప్పనిసరిగా లాగిన్ కావాల్సి రావడంతో కుటుంబంతో కూర్చుని గడిపే సమయం కూడా ఉండటం లేదు.

ఎలాగైనా ఈ ఆదివారం భార్యతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు సుందరం.

***%%%****

ఆరోజు శుక్రవారం.

కిచెన్లో స్టౌ మీద కూర పెట్టి , అక్కడే నుంచుని ఆలోచనల్లో మునిగింది సుభద్ర.

సర్వర్ డౌన్ అవ్వడంతో, ఆఫీస్ వర్క్ కి బ్రేక్ వచ్చి, లేచి వచ్చాడు, సుందరం.

కూర మాడుతున్న వాసన వస్తుంటే, కిచెన్లోకి వచ్చిన సుందరానికి వస్తున్న వాసన కూడా తెలీనంత దీర్గాలోచనలో మునిగిన భార్య కనపడింది.

స్టవ్ ఆపి, 

"ఏమిటోయ్, అంత దీర్ఘ౦గా ఆలోచిస్తున్నావ్?"

"ఆ ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేయాలా అని?" వెటకారంగా అంది

"అదేదో కంపెనీ రేకులు, పేరు గుర్తు రావట్లేదు అవి వేస్తె సరి." హాస్యమాడాడు.

కోపంగా చూసింది.

"ఈ వాడి చూపుల బాణాలకి కారణం ఏమిటో?" సరసంగా అన్నాడు.

" ఆ, లోపల రేగుతున్న తిక్క అనే వేడి." తిక్క రేగి అంది.

"ఓహ్, నీకూ తిక్కుందన్నమాట . అయితే దానికో లెక్క ఉండి ఉండాలిగా. అదేంటో శెలవిస్తే విని తరిస్తాము?"

"తరిస్తారు తప్ప ఆలోచించరు, పరిష్కారం చెప్పరు. అంతేగా."

" బాగుంది. ఆ తిక్కేమిటో తెలిస్తేనేగా దాని గురించి ఆలోచించేది? పరిష్కారం చెప్పేది."

"అయితే వినండి " అని తన తిక్కకి కారణం చెప్పింది.

అంతా విని,

"ఓస్, దీనికే అంత డీలా పడాలా శ్రీమతి ?"

"ఏంటి, మీకిది చిన్న సమస్యగా కనపడుతోందా?"

చిన్నబుచ్చుకుంటూ అంది.

" ఓహో, ఈ చిన్నబోయిన మోము చూస్తే ముచ్చటగా ఉందోయ్." సరదాగా అన్నాడు.

మరింతగా ఉడుక్కుంది.

" ముందు ఇలారా" అని హాలులోకి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి పక్కనే కూర్చున్నాడు.

" ఇది నీ ఒక్కదానిదే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి ఇళ్ళల్లోను ఇంచుమించుగా ఇలాంటి స్థితే ఉంది. నువ్వంటే గృహిణివి. మరి ఉద్యోగం చేసే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటో నువ్వే ఊహించుకో."

ఆ మాటకి ఊహించుకోడానికి కూడా భయపడింది. ఎందుకంటె తను చూస్తోంది తన భర్త పరిస్థితిని.  

"ఆ లెక్కన చూసుకుంటే నువ్వు, నీలాంటి గృహిణులు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. అటు ఇంటిపని, ఇటు ఆఫీస్ పని చేసే స్త్రీ ఉద్యోగుల ఒత్తిడి ముందు నీ ఒత్తిడి చాలా చిన్నది. నిజానికి నువ్వు సంభాళిస్తున్నావు కాబట్టే ఆఫీస్ పని ఒత్తిడి ఎంత ఉన్నా ఇటు నేను, అటు చదువు ఒత్తిడితో సతమతమయ్యే పిల్లలు కాస్తైనా ప్రశాంతంగా ఉంటున్నాము. అయినా ఒత్తిడిని జయించే దివ్య మంత్రాన్ని నేను నీకు చెప్పాలా. నీకు కావాల్సిందల్లా నీకంటూ ఓ ప్లేస్. అంతేగా. రేపు ఎలాగూ ఆదివారం. రేపే ఆ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తాను. సరేనా."

"ఎలా?"

"ఎలా అంటే? సీక్రెట్. రేపు నువ్వే చూడు" ఊరిస్తూ అన్నాడు.

"చెప్పచ్చుగా" గారంగా అంది.

"చెప్తే ఎలాగోయ్? నువ్వు దాని గురించి ఆలోచించవు, నీ ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వవు. అందుకే. నువ్వే ఆలోచించు."

"సరేలెండి."అని లేచి లోపలకు వెళ్ళింది , సుందరానికి వాళ్ళ బాస్ నుండి కాల్ రావడం చూసి.

మర్నాడు సుభద్ర లేచి, అన్ని పనులు పూర్తి చేసుకుని కిచెన్ లోంచి బయటకు రాగానే, పిల్లలు ఇద్దరూ చెరో చెయ్యి పట్టుకుని మాస్టర్ బెడ్ రూమ్లోకి తీసుకెళ్ళారు.

"శ్రీమతి ఒత్తిడి తగ్గడానికి , నీ ఈ కుటుంబ సభ్యులు అందిస్తున్న చిరు కానుక" 

భర్త మాటలకి తలతిప్పి చూసింది. 

తమ మాస్టర్ బెడ్ రూంలోనే కిటికీ పక్కన నిలబెట్టబడి ఉంది ఓ చెక్క అల్మైరా. దానికి ముందు వేసి ఉందొ టేబుల్. పక్కనే పెయింటింగ్ స్టాండ్. ఆ అల్మైరా నిండా చక్కగా సర్ది ఉన్నాయి తన అభిరుచులకు సంబంధించిన అన్ని వస్తువులు. 

భర్త ,పిల్లల వైపు ఆశ్చర్యంగా చూసింది.

"ఎలా ఉంది సెట్ అప్?" 

కళ్ళెగరేస్తూ అడిగాడు.

"ఇవన్నీ ఎప్పుడు , ఎలా....?" అర్ధోక్తిలో ఆగింది.

"అవన్నీ నీకెందుకోయ్. నచ్చిందా లేదా?"

"ఓ , ఇందుకేనా ఇందాకటి నుండీ నన్ను కిచెన్ లోంచి బయటకు రానీకుండా ఈ గడుగ్గాయిలు ఇద్దరూ ఇది కావాలి, అది కావాలి అంటూ నా చుట్టూ ప్రదక్షిణ చేసింది."

ముసిముసినవ్వులు నవ్వారు ముగ్గురూ.

వెళ్ళి ఆ టేబుల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చుని తృప్తిగా అటు ఇటు చూసి, లేచి వచ్చి 

"చాలా బాగుంది. థాంక్స్ అండి." సంతోషంగా అంది.

నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు. 

పిల్లలిద్దరూ తల్లీతండ్రిని చుట్టేసి, 

" ఓ హ్యాపీ సెల్ఫీ" అంటూ ఫోన్లో ఫోటో క్లిక్ మనిపించారు.

తీసిన ఫోటోని చూస్తూ, 

"ఇలా అర్ధం చేసుకుని సహకరించే కుటుంబ౦ ఉంటే ఎవ్వరైనా, ఎలాంటి ఒత్తిడినైనా జయించటం పెద్ద కష్టం కాదు" అనుకుంది. 

*****%%%*****


ఫణికిరణ్

31-03-2023



Rate this content
Log in

Similar telugu story from Drama