STORYMIRROR

Gajula UmaMaheswar

Drama

4.6  

Gajula UmaMaheswar

Drama

భరోసా

భరోసా

14 mins
824


                               

                             


“ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ప్రాణి ఏదో చెప్పగలరా?” ట్రైనర్ వేసిన ప్రశ్నకు లాప్ టాప్ లో మెయిల్స్ చూస్తున్న నేను తలెత్తి చూశాను.

వ్యక్తిత్వ వికాసం గురించిన ట్రైనింగ్ జరుగుతోంది. మనిషిని ఇక్కడ ఉన్నానన్న మాటే గాని మనసంతా మధ్యాహ్నం జరగ బోయే కాన్ఫరెన్స్ కాల్ మీద, దాని తరువాత జరగాల్సిన ప్రోడక్ట్ డెమో మీదే ఉంది. 

 “డైనోసార్”, “చీత”, “లయన్”, “ఎలిఫెంట్” “కుక్క” ఒక్కోరోక్కో సమాధానం చెప్పసాగారు. 

అన్నిటికీ చిరు నవ్వుతో ‘కాదు’ ‘కాదు’ అంటూ తల అడ్డంగా ఊపుతూ అతను చెప్పాడు -  

“ ద ఆన్సర్ ఈస్ ‘హోమో సెపియన్’ - అంటే మనిషి. ఈ ప్రపంచం లో ఎన్నో బలమైన ప్రాణులు ఉండేవి. మీరు చెప్పినట్టే – డైనోసార్ ఒక ఉదాహరణ. కానీ ఇప్పుడు లేవు. అలాగే- మనం చూస్తున్న మిగతా జంతు జాలమైనా........”

‘టుర్ర్’, ‘టుర్ర్’ మని రెండు సార్లు వైబ్రేట్ అయింది - సైలెంట్ మోడ్ లోని మొబైల్ ఫోన్.  

ఎస్‌ఎం‌ఎస్ ,మా సేల్స్ ఆఫీస్ నుండి , ‘డెమో’ గురించి గుర్తు చేస్తూ . 

 టైమ్ చూశాను. పదకొండూ ఇరవై. ఇంకా ఐదున్నర గంటలుంది. 

జయ్ ఈ డెమో గురించి చెప్పి ఖచ్చితంగా 24 గంటలు కూడా కాలేదు. నిన్న ఉదయం తన చాంబర్ లో 

“శారదగారూ,–మనం సూరత్ లో డైమండ్ కట్టర్స్ కోసం ఒక సాఫ్ట్ వేర్ ప్రాజెక్టు చేశాం. గుర్తుందనుకుంటా. అలాంటి అవసరమే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లో ఒక డైమండ్ కంపెనీకి వచ్చిందట. అక్కడి మన సేల్స్ వాళ్ళు మన సాఫ్ట్ వేర్ గురించి వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఆ కంపెనీకి నచ్చిందని చెప్పారట. ఐతే, ఇప్పుడు ఆ కంపెనీ టెక్నికల్ హెడ్, సేల్స్ వి‌పి, ఇంకా ముగ్గురితో కలిసి ఇండియాకు వేరే పని కోసం వచ్చి, ‘రేపు కొంచెం ఖాళీ దొరుకుతుంది , ఆ సాఫ్ట్ వేర్ డెమో ఏమన్నా చూపించడం కుదురుతుందా’ అని మన వాడికి ఫోన్ చేసి అడిగారట . మనతో సంప్రదించకుండానే తను ఓ‌కే చెప్పేసాడట. కెన్ వి డూ ఇట్ మామ్ ?” క్లుప్తంగా ఐనా , క్షుణ్ణంగా చెప్పేశాడు. 

ఇలాంటి సందర్భంలో మరో సమాధానం ఏముంటుంది ? 

“ ఓ‌కే జయ్ , వి విల్ డూ ఇట్ “ చెప్పి బయటకొచ్చాను. 

అప్పట్నుంచీ టెన్షన్ మొదలైంది.  

సూరత్ ప్రాజెక్టు చేసి దాదాపు మూడేళ్లు దాటి పోయింది. ఆ ప్రాజెక్ట్ లో ఎవరు పనిచేశారో తెలుసుకోమని నా ప్రస్తుత టీం లీడ్ పళనికి చెప్పాను. నిన్నమధ్యాహ్నం నుండీ ప్రయత్నిస్తే సాయంత్రానికి కొంచం ఊపిరి పీల్చుకునే మాట చెప్పాడతను. మా దగ్గరే సాయిరాం అనే ప్రోగ్రామర్ ఆ ప్రాజెక్టు లో పని చేసి ప్రస్తుతం బెంచ్ మీద ఉన్నాడని, వాళ్ళ ఇంట్లో వాళ్లెవరికో వంట్లో బాగలేకపోతే చూడ్డానికి వాళ్ళ ఊరు వెళ్లాడని , ఈరోజు ఆఫీస్ కు వచ్చి నాకు కావలిసిన డెమో ఏర్పాట్లు (ప్రస్తుతం ఉన్న ప్రాడక్ట్ ని సౌత్ ఆఫ్రికన్ కంపెనీకి వాళ్ళ అవసరాలకు అనుగుణం గా కొన్ని స్క్రీన్స్ మార్చి చూపించడం, ఎక్కడా సూరత్ వాళ్ళ పేరు లేకుండా చూడడం లాంటివి) చేసి పెడతాడని పళని చెప్పాడు. 

మరి ఈ రోజు సాయిరాం వచ్చాడో , లేదో ? డెమో ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయో ? సేల్స్ హెడ్ మెయిల్ చూడగానే పళనికి ఫోన్ చేశాను. అతని ఫోన్ బిజీ . 

అసలు డెమోకున్న టైమే తక్కువ. దానికి తోడు మధ్యాహ్నం రెండు గంటలకు రెవెన్యూ టార్గెట్స్ రివ్యూ మీటింగ్. మధ్యలో ఈ ట్రైనింగ్ ఒకటి.  

ప్రాజెక్ట్ మేనేజర్ కి ఇరవై నాలుగు గంటలు సరిపోవు. కొత్త కాలెండర్ కనిపెట్టాలి అంటాడు రాఘవ.         

ఈ ట్రైనింగ్ లో కూర్చుంటే పనులు కావు. ఏమయితే అది అదవుతుందని లేచి నా క్యాబిన్ దగ్గరకు వచ్చాను. పోయిన సారి రెవెన్యూ రిపోర్ట్ తీసి మార్పులు చేస్తున్నాను. అలా సుమారుగా ఒక గంట గడిచాక , పర్లేదు ఒక కొలిక్కి వచ్చింది అనుకుని, కొద్దిసేపటి తరువాత మళ్ళీ ఒక సారి చెక్ చేసి రిపోర్ట్ మెయిల్ చెయ్యాలనుకున్నాను. 


పక్కనే ఏదో అలికిడైతే , తిరిగి చూశాను. పళని.  

“ఏంటి పళని ?, సాయిరాం వచ్చాడా ? డెమో గురించి అన్నీ ఏర్పాట్లు అయ్యాయా? అని అడిగే లోపలే చావు కబురు చల్లగా చెప్పాడు. 

“మేడమ్, సాయిరాం ఇంకా రాలేదు. ఒక గంట నుండీ ట్రై చేస్తున్నాను. నో రెస్పాన్స్. ఏం చేద్దాం మేడమ్?”

నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఒక్క సారి జరగబోయే పరిణామాలు తలచుకుంటే కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఏం చెయ్యాలి? ఛ,ఛ, నేను ఉదయం రాగానే దీన్ని గురించి విచారించి ఉంటే బాగుండేది. నేను సాయిరాం తో నిన్న సాయంత్రం మాట్లాడాను . ఆ అబ్బాయ్ చాలా బాధ్యతగానే మాట్లాడాడు. అతను రాకపోతే .... ? అనే ఆలోచనే తనకు తట్టలేదు. ఈ సాయిరాం ఎంత పని చేశాడు ! కనీసం ఫోన్ చేసి తను రాలేనన్న విషయం పొద్దున్నే చెబితే నా తిప్పలేవో నేను పడేదాన్ని కదా ! కిం కర్తవ్యం? ఇంక నా చేతిలో ఏం లేదు. అర్జెంట్ గా మా మేనేజర్ ని కలిసి పరిస్థితి వివరిస్తే ఏదైనా సలహా ఇవ్వచ్చు. 

మా మేనేజర్ కి ప్లాన్ బి అని పేరుంది. ఏ పని చేయాలన్నా ప్లాన్ ఏ తో పాటు ప్లాన్ బి ఎప్పుడూ రెడీ గా ఉండాలని చెబుతుంటాడు. ఒక ట్రైనింగ్ సెషన్ లో ఇలాగే చెబుతూ – భగవంతుడు మనకు రెండు చేతులు , రెండు కాళ్ళు, రెండు చెవులు, రెండు కళ్ళు ఇలా అన్నీ రెండు ఇచ్చాడు – ఎందుకో తెలుసా? దేవుడు కూడా ఈ ప్లాన్ బి అనే కాన్సెప్ట్ ని నమ్ముతాడు కాబట్టి. – అని చెబుతుంటే – వెనుకనుండి ఒక కొత్తపిల్లవాడు – కానీ మెదడు , గుండె మాత్రం ఒకటొకటే ఇచ్చాడు సార్ అన్నాడు – హాలు హాలంతా ఘోల్లుమంది. 

ఈ విషయం చెప్పి చెప్పి నవ్వుకుంటారు అతనంటే గిట్టనివాళ్లు. 

నేనెళ్లేపాటికి ఖాళీగానే ఉన్నాడు – 

విషయమంతా చెప్పాను. ఇప్పుడు ఏమి చేయగలమో సలహా ఇమ్మని అడిగాను. 

“వాయిదా వేయించడం మినహా గత్యంతరం లేదు.” అన్నాడు

నాకు ఆ సలహా నచ్చలేదు. ఒకసారి ఒప్పుకున్నాక చేసి తీరాలి. లేకపోతే మాట తప్పడమే కాదు, ఈ సేల్స్ వాళ్ళ తో పెద్ద గొడవ కూడా. వాళ్లేదో బిలియన్ డాలర్ల ఆర్డర్ తెస్తుంటే, మేము చేతులెత్తేశామని అవకాశమున్న ప్రతి మీటింగ్ లో దెప్పి పొడుస్తూనే వుంటారు. ఇదే మాటే ఆయనతో చెప్పాను. దానికాయన నవ్వుతూ 

“ అదీ నిజమే. ఇంకో పని చేయొచ్చు. మీ టీం లో ఎవడినైనా పిలిచి మొట్ట మొదటి స్క్రీన్ మాత్రం మార్పించు.ఆ అప్లికేషన్ లో ముఖ్యమైన స్క్రీన్స్ అన్నీక్యాప్చర్ చేసి, ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేసుకో. డెమో ప్రారంభమవగానే ముందు మొదటి స్క్రీన్ చూపించు. అక్కడనుండీ రెండవ స్క్రీన్ లోకి వెళ్ళి ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చెయ్యి. మనం మిగతా స్క్రీన్స్ ఏవీ మార్చలేదు కాబట్టి అది పని చేయదు. మన సేల్స్ వాళ్ళ మొహాలు చూడు. నిన్ను కర కరా తినేట్టుగా ఉంటాయి. అప్పుడు చాలా కాజువల్ గా , ఒక నిష్ణాతురాలైన క్రైసిస్ మేనేజర్ లాగా , “ ఓహ్, యిట్ సీమ్స్ దేర్ ఈస్ సం సెక్యూరిటి యాక్సెస్ ఇష్యూ. ఎనీ వే, ఈ హావ్ అల్ దోస్ స్క్రీన్ షాట్స్. లెట్స్ గో ఎహెడ్” అని నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభించు.” అన్నాడు. 

తను చెప్పిన తీరుకు నవ్వు వచ్చినా , ఆ సలహా నచ్చింది. ఈ పరిస్థితిలో అంతకంటే మంచి మార్గం లేదనిపించింది. అనుభవం అంటే ఇదే కాబోలు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి గబ గబా క్యాంటీన్ వేపు అడుగులేశాను. 

అప్పటికే మా బృందమంతా సగం భోజనం పూర్తి చేసి ఏదో అంశం మీద వేడి వేడి గా చర్చించుకుంటున్నారు. 

అదే టేబుల్ లో నేనొక మూల కూర్చుని బాక్స్ విప్పాను. ఇంతలో అమర్ అన్నాడు – 

“మీరు చెప్పండి శారదా, ఈ జనరేషన్ పిల్లల కంటే మనమే బెటర్ గదా?”

నాకు టాపిక్ అర్థం కాలేదు “ఏ విషయంలో?” ఎదురు ప్రశ్న వేశాను. 

“అన్ని విషయాల్లో – ఫరెగ్జాంపుల్ – అలవాట్లలో, పని చేయడంలో, బాధ్యతలలో, నడవడికలో”

అమర్ వివరణ ఇచ్చాడు. 

“శారద పెద్ద టెన్షన్ లో వుంది – తనను డిస్టర్బ్ చేయొద్దు” సుధా రామన్ చెప్పింది 

“ఏమయింది” ఇద్దరు ముగ్గురు ఒకే సారి అడిగారు 

నేను నా సమస్య చెప్పాను. 

అమర్ అందుకున్నాడు – “ చూశావా ? ఇంతకంటే ఉదాహరణ అవసరమా? శారద పాత తరం కాబట్టి ఇంత ఆలోచిస్తోంది. అదే ఈ బచ్చా గాళ్ళకి చెప్పావనుకో – రేపటికెల్లా డెమోనా ? నో వే , నీ దిక్కున్న చోట చెప్పుకో ఫో’ అని బదులిచ్చేవాళ్లు.” అభినయిస్తూ చెప్పాడు అమర్. 

రాఘవ అందుకున్నాడు – 

“ అవున్రా , వాళ్ళకి ఉద్యోగ భయం లేదు. ఇష్టంలేని పని, కష్టమైన పని చెయ్యమని నిర్మొహమాటంగా చెప్పగలరు. నువ్వుగాని, నేనుగాని, శారదగానీ, ఫర్ దట్ మాటర్ మన ఏజ్ గ్రూప్ లో ఎవరైనా ఎందుకు చేస్తామంటే మనకు ముందు నుండీ ఉద్యోగం పట్ల వుండే అభిప్రాయాలూ , భయాలు కారణం కావచ్చు. మనం డాంబికంగా వాటిని బాధ్యత ముసుగులో దాచి మన గొప్ప చెప్పుకుంటాం. అలా అనుకుంటే మన కన్నా మన ముందు తరం ఇంకా కమిటెడ్ గా పనిచేసేవారని వాళ్ళు చెప్పుకుంటారు. మనందరికీ అనుభవమేగా, మన కెరీర్ మొదలైనప్పుడు మనం గూడా మన మేనేజర్ల నుండి ఇలాంటి కామెంట్లే వినేవాళ్లం.” 

“ఉద్యోగమొకటే కాదురా, సమాజం పట్ల , పెద్దలపట్ల ఉండాల్సిన గౌరవం , విలువల పట్ల అవగాహన ఏవీ పట్టించుకోరు బాస్, వాళ్ళ పాటల గొడవ, గేమ్స్ హడావిడి, ఇది తప్ప పక్కవాడి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించిన పాపాన పోరు.”


 “అమర్, ఈ మాటలు నువ్వు చెప్పడం - ఎస్‌పి బాలు, కొత్త పాటల గురించి మాట్లాడినట్టు ఉంది. నీ కులాంతర వివాహం మీ పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. కానీ నీకది తప్పనిపించలేదు. అలాగే, ఈ రోజు నీకు తప్పు అనిపించే చాలా అంశాలు ఈ తరానికి తప్పు కాకపోవచ్చు.  

రాఘవ మాటలను అడ్డుకుంటూ శేఖర్ అన్నాడు – 

“ రేయ్ అమర్, నేను నీలాగే ఆలోచించి, మొన్న మా పెద్ద వాడికి మనం చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి గొప్పగా చెబుతూ వీళ్ళకి అట్లాంటి బాల్యం లేదు కదా అని బాధపడుతుంటే వాడేమో – ‘పాపం నాన్నా, మీకు మొబైల్ ఫోన్స్ లేవు, వీడియో గేమ్స్ లేవు, కంప్యూటర్ గేమ్స్ లేవు. అందుకే ఇసుకలో, మట్టిలో గోళీలు , కబడ్డీ, బిల్లంగోడు, బొంగరాలు ఆడేవాళ్లు కదా? అన్నాడు.’ అందుకేరా ఎవడి బాల్యం వాడికి గొప్ప. ఎవడి తరానికి వాళ్ళ తరం ఆదర్శం. 

రాఘవ మళ్ళీ అందుకున్నాడు, 

“ అంతెందుకు బాస్, మనం పెరిగినట్టుగా మన పిల్లల్ని పెరగనివ్వడానికి మనం రెడీనా ? మనలాగా గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తున్నామా ? మట్టిలో ఆడనిస్తున్నామా ? అంతా మాత్రానికే, మనం గడిపిన బాల్యం ఇప్పుడు లేదని కాదు, దాన్ని ఇంకెవరో గడుపుతున్నారు. కానీ నీకిప్పుడు దాన్ని చూసే సమయం లేదు, నీ స్థాయీ అందుకు అంగీకరించదు.” 

“గయ్స్ , జనాలు టేబుల్ కోసం వెయిటింగ్, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం .” సుధారామన్ సూచనతో అందరూ లేచారు.

నేను త్వరత్వరగా నా టేబుల్ దగ్గరకు వచ్చి, రెండు గంటలకు జరగబోయే రెవెన్యూ మీటింగ్ కు కావలిసిన వివరాలన్నీ మెయిల్ చేశాను. ఈ మీటింగ్ నాలుగు గంటలకెల్లా ముగిస్తే, ఒక గంట లో డెమో తాలూకు పనులు చేసుకోవచ్చు. మా మేనేజర్ చెప్పినట్టు పళనిని పిలిచి మొదటి స్క్రీన్ లో చేయాల్సిన మార్పులు చెప్పాను. అతను వెళుతూ వెళుతూ “ మేడమ్, మీ ఫోన్ సైలెంట్ మోడ్ లో వుందా ? నేనిందాక ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు.” అన్నాడు. 

ట్రైనింగ్ లో వున్నప్పుడు సైలెంట్ మోడ్ లో పెట్టిన విషయం గుర్తొచ్చి బాగ్ లో నుండి ఫోనే తీసి చూస్తే రెండు మిస్డ్ కాల్స్, ఒక ఎస్‌ఎం‌ఎస్ ఉన్నాయి. ఒకటి పళని నుండి, రెండవది జయ్ కాల్. ఎస్‌ఎం‌ఎస్ కూడా జయ్ నుండే. ఓపెన్ చేశాను. 

‘డెమో ఈస్ అరేంజ్డ్ ఎట్ గెస్ట్ హౌస్. డిన్నర్ ఫాలోస్” 

కొంప మునిగింది. మా గెస్ట్ హౌస్ ఆఫీస్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం. కనీసం గంట ప్రయాణం. సాయంత్రమైతే ట్రాఫిక్ వల్ల ఇంకా ఎక్కువ టైమే పట్టొచ్చు. నేను డెమో మీద పని చేసుకునేది ఎప్పుడు? కష్టాలన్నీ కట్ట కట్టుకుని ఒకేసారి వస్తాయంటారు. ఇప్పుడేం చేయాలి? ముందు ఫోన్ నార్మల్ మోడ్ లో పెట్టాను. ఇంక లాభం లేదు. ఈ రెవెన్యూ కాన్ఫెరెన్స్ కాల్ లోనే నా పని పూర్తి చేసుకోవాలి. ఎలాగూ ఇది టెలి కాన్ఫెరెన్స్ కాబట్టి, మనం అవతలి వాళ్ళకు కనిపించము. మన పని మనం చేసుకుంటే సరి. 

పళనిని పంపించేసి , నేను రెవెన్యూ మీటింగ్ కి సిద్ధమయ్యాను . 

రెండు గంటలకు టెలి కాన్ఫెరెన్స్ మొదలైంది. 

. నేను నా పాటికి నా డెమో పనిలో నిమగ్నమయ్యాను.

“మౌనంగానే ఎదగమనీ ....” నా మొబైల్ . అయ్యో , ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం మర్చిపోయాను. చటుక్కున కాల్ తీసి ‘హలో ‘ అన్నాను. 

“ గుడాఫ్టర్నూన్ మేం, నేను అధునా ప్రాపర్టీస్ నుండి కాల్ చేస్తున్నా , మీకు .....” మాట పూర్తి కాకముందే, “ సారీ ‘ చెప్పి, ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టాను. 

మళ్ళీ ఫోన్ టేబుల్ మీద టుర్ర్ , టుర్ర్ మంటూ వైబ్రేట్ అవుతోంది. ఏదో లాండ్ లైన్ , తెలియని నంబర్. కాల్ కట్ చేసి, ఇక లాభం లేదని ఫోన్ తీసి బాగ్ లో వేశాను. 

ఈ లోగా మా రీజియన్ వంతు వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా సమీక్ష ముగిసింది. నేను మళ్ళీ నా డెమో పనిలో పడ్డాను. 

అనుకున్నట్టుగానే సరిగ్గా నాలుగు గంటలకు మా మీటింగ్ ముగిసింది. నేను నా లాప్ టాప్ సర్దుకుని సేల్స్ ఆఫీస్ కి వెళ్ళాను. అప్పటికే అందరూ రెడీ గా నా కోసం వెయిట్ చేస్తున్నారు. 

సేల్స్ హెడ్ ని అడిగాను 

‘ అదేంటి జయ్ , ఉన్నట్టుండి వెన్యూ మార్చేశారు ? ‘ 

దానికతను సన్నగా నవ్వుతూ, 

‘ ఏం లేదు శారదా, ఈ రోజు ఉదయమే బాస్ డిన్నర్ ప్రపోస్ చేశారు – బిజినెస్ లో గతికితే తప్ప అతకదు కదా! కస్టమర్ ప్రస్తుతమున్న ప్లే

స్ మన గెస్ట్ హౌస్ కు దగ్గరగా ఉంది. గెస్ట్ హౌస్ లో ఐతే, డెమో , డిన్నర్ రెండూ అవగొట్టేయొచ్చు కదా, అందుకని అలా డిసైడ్ చేశాం.’ అన్నాడు. 

పది నిముషాల్లో అందరం రెండు ఇన్నోవాల్లో బయలు దేరాము. 

ఈ ఏర్పాట్లు , జయ్ వాళ్ళ బాస్ గూడా ఈ మీటింగ్ కి రావడం, ఇదేదో భారీ ఎత్తుగడ లాగా వుంది. ఇలాంటప్పుడు ఏ చిన్న పొరపాటైనా భూతద్దంలోనుండి చూడబడుతుంది. మా మేనేజర్ చెప్పిన ఐడియా అప్పటికి బాగానే అనిపించింది గాని, ఈ గంభీర వాతావరణం లో , కొత్త కస్టమర్ దగ్గర దాన్ని అమలుపరచడం కత్తి మీద సామే. అయినా ఇప్పుడు చేయగలిగిందేముంది. రోట్లో తల దూర్చి రోకటి పోట్లకు వెరిస్తే ఎలా? సాయిరాం పుణ్యమా అని నిండా మునిగాను. ఇప్పుడిక ఎలా గట్టెక్కాలో ఆలోచించాలి. ఈ ఆలోచనల్లోనే గంట ప్రయాణం గడిచింది. 

అయిదుంబావుకెల్లా గెస్ట్ హౌస్ చేరాము. 

నేను నా లాప్ టాప్ తెరచి, ఇంటర్నెట్ కనెక్ట్ చేసి, వి.పి. ఎన్ ద్వారా మా ఆఫీస్ లోని డైమండ్ కట్టింగ్ సాఫ్ట్ వేర్ ఉన్న సర్వర్ కి లాగిన్ అయ్యాను. 

కస్టమర్ రావడమే ఆలస్యం. 

‘బయలుదేరారు, ఇంకో ఐదు నిముషాల్లో ఇక్కడుంటారు’ అన్నాడు జయ్. 

సేల్స్ వాళ్ళు ఐదు నిముషాలు అంటే దానర్థం కనీసం పదహైదు నిముషాలని మా ఆఫీస్ లో అంతా అనుకునే మాట. ఇప్పుడేం చేయాలి? అప్రయత్నంగానే మౌస్, ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. మధ్యాహ్నం సశేషంగా ముగిసిన రాఘవ, అమర్ ల తరాల చర్చ ఫేస్ బుక్ లో కూడా కొనసాగుతోంది. చివరి కామెంట్ రాఘవ నుండి ....  

“ మన తరువాతి తరం మన కంటే సృజనాత్మకంగా , ఎనెర్జిటిక్ గా ఉంటుంది. ఇది మనం ఒప్పుకుని తీరాల్సిన విషయం. మనం P2 ప్రాసెసర్ల ల మీద, 8MB రామ్ ల మీద పనిచేసి ఒకలాంటి వేచి ఉండే ధోరణికి అలవాటు పడ్డాం. వాళ్ళు పనిచేయడమే పెంటియం ల మీద, 4GB రామ్ ల మీద. సహజం గానే వాళ్ళ అంచనాలు వేరేగా ఉంటాయి. వాళ్ళకు సహనం లేదు, ఓపిక లేదు అని మనం అభియోగాలు మోపుతాం. ఒక పని చేయడానికి మన లెక్కల్లో 6 గంటలు పడితే, వాళ్ళకు వేరే మార్గం లో 2 గంటలే పడుతుంది. మనం వాళ్ళని- ‘ఫలితమొకటే కాదు, విధానం కూడా ముఖ్యమ’ని మొటిక్కాయలు వేయాలని చూస్తాం. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ లాగా ఆలోచించగలగాలి. అలా చేయడానికి మన వయసు , మన అహం అడ్డొస్తాయి. నా దృష్టి లో మనం చెబుతుంటామే – కోర్, GUIగురించి. అలా కోర్ మారనంతవరకూ GUI ఎలా మారినా ఫరవాలేదు.”

రాఘవ చాలా ఆశావాది. మనం తరువాతి తరం లా ఆలోచిస్తాం , కరక్టే !, కానీ అంత మాత్రనికే వాళ్ళు మనలను వాళ్ళలో కలుపుకోరు. అప్పుడు మన పరిస్తితి న ఘర్ కా, న ఘాట్ కా. ఇప్పుడు నా విషయమే తీసుకుంటే, సాయిరాం చేసిందేమిటి? ఒక్క మాట , నాకో, పళనికో ఫోన్ చేసి తనకు కుదరదని చెబితే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా. ఈ పరిస్థితిలో సాయిరాం లాంటి వాళ్ళను ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ బాహ్య స్వభావాల మార్పుల గురించి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగింది – మూల స్వభావంలోని మార్పుల ఫలితమే కదా. ఈ విషయం రాఘవ కు చెప్పినా అతను, ఒకటి రెండు సంఘటనలను బట్టి ఏ నిర్ధారణకు రాగూడదు అంటాడు. 

బయట కొంత హడావిడి. 

కస్టమర్ టీం వచ్చినట్లుంది.  

నేను లేచి నిలుచున్నాను. నలుగురు కొత్తవాళ్లు కస్టమర్ టీం గా పరిచయం చేయబడ్డారు. వాళ్ళలో ముగ్గురు ఆఫ్రికన్స్ , ఒక ఇండియన్ ఉన్నారు. ఆ ఇండియన్ మా కంపెనీ గురించి గొప్పగా పరిచయం చేస్తున్నాడు. మా జయ్ వాళ్ళ బాస్ కూడా అవకాశం దొరికినప్పుడల్లా సమయోచితంగా కథలు వినిపిస్తున్నాడు. ఈ కబుర్లు ముగియగానే నా డెమో మొదలవ్వాలి. ఈ ఆలోచనతోనే ఒక్క సారి అటెన్షన్ లో కొచ్చాను. సాధారణంగా అయితే, చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేస్తానని నాకు పేరుంది. కానీ ఇప్పుడేందుకో గుండె వేగంగా కొట్టుకుంటోంది. నేను కరెక్ట్ గా మొదటి స్క్రీన్ తరువాత మా మేనేజర్ చెప్పినట్టు అబద్దమాడగలనో లేదో, నేను పవర్ పాయింట్ లో ప్రెజెంట్ చేస్తాను అని చెప్పే లోపలే ఎవరన్నా మొత్తం సందర్భాన్ని మార్చేస్తారేమో ! ఈ ఆలోచనల మధ్యలోనే జయ్ గొంతు నా పేరు పలికింది. 

“ ఇప్పుడు శారద ఈ డెమో చూపిస్తారు” అని నన్ను ఆహ్వానించాడు. 

నేను అందరికీ విష్ చేసి , మా గ్రూప్ గురించి, సూరత్ లో మేము చేసిన ప్రాజెక్ట్ ను గురించి కొంత ఉపోద్ఘాతం ఇచ్చాను. ఆ సాఫ్ట్ వేర్ వలన డైమండ్ కట్టింగ్ ఎంత సులభతరమైందో, ఇలాంటి మిగతా కంపెనీల సాఫ్ట్ వేర్ కన్నా, మేము అందించే అదనపు ప్రయోజనాలేమితో వివరించాను. అందరూ చాలా మెచ్చుకోలుగా చూడటం గమనించాను. ఇంకెంతసేపీ సంబరం .....

ఇప్పుడు డెమో చూద్దాం – అంటూ మా సర్వర్ లోని మొదటి స్క్రీన్ ఓపన్ చేశాను. పళని పనితనం కనబడింది. ఫరవాలేదు. అందరూ ఓ‌కే. 

ఇక ఇప్పుడుంది – నాకు ముసళ్ళ పండగ. 

రెండో స్క్రీన్ ఓపెన్ చేశాను. మా మేనేజర్ చెప్పినట్టుగా, నాకు తోచిన ఒక లింక్ మీద మౌస్ క్లిక్ చేశాను. మా మేనేజర్ చెప్పిన డైలాగ్ మననం చేసుకుంటున్నాను. (ఓహ్, యిట్ సీమ్స్ దేర్ ఈస్ సం సెక్యూరిటి యాక్సెస్ ఇష్యూ........)

ఇంతలో - 

ఆశ్చర్యంగా, 

నా కళ్ళను నేను నమ్మ లేనట్టుగా 

ఇది కలా , నిజమా , భ్రమా అని సంభ్రమపడేట్టుగా – 

ఆ లింక్ వేరే స్క్రీన్ ను ఓపెన్ చేసింది. 

నేను పిచ్చి చూపులు చూస్తుంటే, అందరూ నేను రెండో స్క్రీన్ గురించి ఏమి చెబుతానా అని ఎదురు చూస్తున్నారు. 

నా ఆశ్చర్య ప్రపంచం లో నుండి బయటకొచ్చి, నేను రెండో స్క్రీన్ గురించి, దాని ద్వారా ఓపెన్ చేయబడిన మూడో స్క్రీన్ గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్ళి పోతున్నాను. ఇది నాకు కొట్టిన పిండి. ప్రతి స్క్రీన్ ను నేను ఆశ్చర్యం తో చూస్తున్నాను. అన్నీ చక్కగా ఈ కంపెనీకి ఏమి చెప్పాలో అలాగే మార్చబడి , కొండొకచో అందంగా తీర్చి దిద్దబడి వున్నాయి. నేను సంబరంతో , సంభ్రమంతో అన్ని స్క్రీన్స్ పూర్తి చేశాను. 

చివరగా “ థాంక్ యు” స్క్రీన్ వచ్చే వరకూ నేను వేరే ప్రపంచంలో నుండి మాట్లాడుతున్నట్టే అనిపించింది. 

అందరూ ప్రశంస గా చప్పట్లు కొడుతుంటే ఈ లోకం లోకి వచ్చాను.

డెమో అయిపోయింది. జయ్ వాళ్ళ బాస్ దగ్గరకొచ్చి, మెచ్చుకోలుగా “ గుడ్ జాబ్ శారద, రియల్లి యిట్ వెంట్ వెల్” అంటూ అభినందనలు కురిపిస్తుంటే ‘థాంక్స్’ అన్నానే గాని నా మనసు ఆ డెమోలోని మార్పుల మీదకే వెళుతోంది. 

ఎవరు చేసి ఉంటారు?, పళని ? తనకి ఆ సాఫ్ట్ వేర్ గురించి అంతగా తెలియదు. మొదటి స్క్రీన్ చేయడానికే రెండు గంటలన్నా పడుతుందని ముందే వివరణ ఇచ్చుకున్నాడు.  

‘శారదా , డిన్నర్ చేసి వెళ్ళండి , రండి ‘ జయ్ పిలిచాడు. 

పక్క టేబుల్ లో వాళ్ళ బాస్ , కస్టమర్స్ తో కలిసి డ్రింక్స్ ప్రారంభించాడు. 

గబగబా రెండు రోటీలు , పెరుగన్నము తిని, బయటకొస్తుంటే, జయ్ మెట్లు దిగుతూ, 

“థాంక్స్ ఎ లాట్ శారదా, ఇంత తక్కువ టైమ్ లో అంత మేనేజ్ చేయగలిగారు. మిమ్మల్నిఇబ్బంది పెట్టి ఉంటాము. కానీ మీరు మిమ్మల్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.” అంటూ పొగుడుతుంటే నాకు చాలా ఇబ్బంది గా అనిపించింది. థాంక్స్ చెప్పి కారెక్కాను. 

టైమ్ చూశాను. ఎనిమిదిన్నర అవుతోంది. చాలా అలసటగా ఉంది. ఆయన ఊర్లో లేడు. ప్రాజెక్ట్ పని మీద తను ముంబై వెళ్ళి రెండు వారాలవుతోంది. తోడుగా అమ్మని తెచ్చుకున్నాను. 

ఒకసారి అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి. లేకపోతే తను నా కోసం కాచుకుని ఉంటుంది. ఆదిత్య గుర్తొచ్చాడు. ఛ , ఛ , ఏం ఉద్యోగమో, కన్న కొడుకు , నాలుగేళ్ల పసివాడు నా కోసం ఎదురు చూస్తుంటాడనే విషయం కూడా గుర్తు రానంత బిజీ. నాన్న టూర్ల మీద టూర్లు, అమ్మ కి పనుల మీద పనులు. వాడికి అమ్మమ్మ , కార్టూన్ తప్ప వేరే లోకం లేకుండా ఉంది. 

బద్దకంగా ఫోన్ తీశాను – 

అరెరె., ఇదేంటి పది మిస్డ్ కాల్స్. ఎవరి దగ్గర నుండి? ఒకటి రమణ , కింద పళని, హోమ్,సాయిరాం.సాయిరాం ఐదు కాల్స్, కింద రెండు లాండ్ లైన్స్ . 

ఇప్పుడు గుర్తొచ్చాను కాబోలు సాయిరాంకి .  

ముందు అమ్మకి ఫోన్ చేశాను. ఇంటికి రావడానికి ఇంకా గంట పడుతుంది – తిని పడుకొమ్మని చెప్పాను. పళని తో రేపు మాట్లాడొచ్చనిపించింది. సాయిరాం కి కాల్ చేశాను. 

ఫోన్ రింగవుతోంది. ఫోన్ తీయగానే ధన ధనా నాలుగు దులిపేద్దామనుకుంటున్నాను. లిఫ్ట్ చేసిన చప్పుడు. నేను నా గొంతు సవరించుకుంటుండగానే గలగలమని ప్రవాహంలా సాయిరాం -

“ హలో మేడమ్, డెమో ఎలా జరిగింది మేడమ్? సారీ మేడమ్, టైమ్ తక్కువుండడంతో ఎక్కువ బ్యూటిఫికేషన్ చేయలేక పోయాను. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేదు. అప్పటికీ ఉన్నంతలో అన్ని స్క్రీన్స్ కవర్ చేశాను.....మేడమ్, మేడమ్....” 

ఇంకెక్కడ మేడమ్? ఈ రోజేంటో షాకుల మీద షాకులు.

ఎక్కడో ఊర్లో ఉన్న సాయిరాం ఇంత తక్కువ సమయంలో ఇంత పని చేశాడా? నమ్మ శక్యంగా లేదు. కానీ ఫలితం కనబడుతోంది. సాయిరాం కాకపోతే ఇంకెవరికీ ఈ విషయం తెలియనన్నా తెలియదు. నేను , పళని చేయలేదు. సాయిరాం చెప్పింది నమ్మాల్సిందే. కానీ ఎలా? నాకు అతని మీద కోపం పోయి, కుతూహలం పెరిగింది. 

“సాయిరాం, మీరు ఆఫీస్ కి వచ్చారా? మరి ఎందుకు కలవలేదు? కనీసం పని చేస్తున్నానని నాకు కబురందించి ఉండొచ్చు కదా?”

“ సారీ మేడమ్, నేను ఆఫీస్ కి రాలేకపోయాను. నిన్న రాత్రి ఉన్నట్లుండి మా చిన్నన్నకు విపరీతమైన కడుపు నెప్పి వచ్చింది. బాధతో మెలితిరిగి పోతున్నాడు. రాత్రికి తగ్గితే తెల్లవారు ఝామునే బయలుదేరి వద్దామనుకున్నా. కానీ పొద్దున వరకూ తగ్గలేదు. వెంటనే కర్నూల్ కి తీసుకు వచ్చి హాస్పిటల్ లో చేర్పించాల్సి వచ్చింది.. అన్నీ ముగించుకుని, మీకు ఫోన్ చేద్దామని చూస్తే, ఫోన్ లో ఛార్జింగ్ లేదు. నా ఫోన్ లో గేమ్స్ ఉన్నాయి, మా అన్న పిల్లలు మొత్తం ఛార్జింగ్ అయిపోయే వరకూ ఆడేశారని అప్పుడు గాని తెలియలేదు. సరే , ముందు పనవడం ముఖ్యమని దగ్గర్లో ఉన్న ఇంటర్నెట్ కేఫ్ కు వెళ్ళాను. నేను ఇంతకు ముందు ఇదే ప్రోడక్ట్ మీద రిమోట్ సపోర్ట్ ఇచ్చేవాణ్ణి కాబట్టి, ట్రై చేద్దామనుకున్నా. ఎవరూ పాస్ వర్డ్ కూడా మార్చలేదు. ఆ ప్రాజెక్ట్ లో చాలాకాలం పని చేశాను కాబట్టి ఆ మార్పులు చేయడానికి నాకు ఎక్కువ సేపు పట్టలేదు.”

“చాలా చాలా థాంక్స్ సాయీ, నీ సహాయం లేకపోతే, డెమో ఇంత బాగా అయుండేది కాదు. చాలా చక్కగా చేశావు, అదీ, చాలా తక్కువ టైంలో. మరి కనీసం పని పూర్తయాక ఫోన్ చేసి ఉండొచ్చు కదా” నా గొంతులో మెచ్చుకోలుతో పాటూ , తనని నిందించాననే అపరాధ భావన.

“ నేను మూడు గంటల ప్రాంతంలో పక్క నున్న లాండ్ లైన్ నుండి ఫోన్ చేశాను మేడమ్, మీరు కట్ చేశారు. ఆ తరువాత కూడా మూడు నాలుగు సార్లు ప్రయత్నించాను. మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి ఫోన్ చార్జ్ అయ్యాక నా మొబైల్ నుండి కూడా చేశాను.”

నా పొరపాటు అర్థమైంది. కాన్ఫరెన్స్ కాల్ జరుగుతున్నప్పుడు వచ్చిన లాండ్ లైన్ కాల్ సాయిదే అన్నమాట.

“సారీ సాయీ, అప్పుడు ఒక కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నాను. పైగా కొత్త నంబర్. అందుకే కాల్ తీయలేదు.”

“పర్లేదు మేడమ్, మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు.”

“థాంక్స్ వన్సగైన్ సాయీ. మీరు ఆఫీస్ కే రాకపోతే, ఇక చేయలేరనే అనుకున్నాను. కానీ, చాలా ఇన్నోవేటివ్ గా చేశారు. ముఖ్యంగా నా పరువు కాపాడారు.” 

“కోర్ ఏమీ మారలేదు కద మేడమ్, GUI మార్చడమే కదా! అది ఈజీనే. అయినా ఎందుకు చెయ్యను మేడమ్. నిన్న సాయంత్రం చేస్తానని మాట ఇచ్చాక చేయకపోతే ఎలా? మన కంపెనీకి కూడా బ్యాడ్ రిమార్క్ వస్తుంది కద మేడమ్ !”

ఓ‌కే సాయీ, థాంక్ యు అండ్ గుడ్ నైట్.” 

ఫోన్ పెట్టేశాను కానీ, ఆలోచనలను కట్టేయలేక పోతున్నాను. ఆ ఆలోచనల్లోనే రాఘవ మాటలు గుర్తొచ్చాయి. అవును రాఘవే కరెక్ట్. కొన్ని మూల విలువలు మారనంత వరకూ మిగతా విషయాలు ఎలా మారితే తప్పేంటి? ఆ అబ్బాయ్ ఆఫీస్ కి రాకపోతే ఇక పనిచేయలేదని భావించే తరం నాది, చేయాల్సిన పనిని ఎలాగైనా చేసే తరం సాయిది. 

“మేడమ్” అన్న డ్రైవర్ మాటలతో ఇల్లొచ్చిందన్న విషయం గమనించాను. 

కార్ దిగి , లాప్ టాప్ భుజానికి తగిలించుకుని, లంచ్ బాక్స్ చేత్తో పట్టుకుని మెయిన్ డోర్ వరకూ వచ్చాను. డోర్ ముందుకు తోశాను. తెరుచుకుంది. అంటే అమ్మ ఇంకా పడుకోలేదన్నమాట. ఆదిత్య పడుకున్నాడో లేదో! మెల్లగా అడుగులేసుకుంటూ బెడ్ రూమ్ వైపు వస్తుంటే, అమ్మ గొంతు వినిపిస్తోంది. అమ్మ ఏదో కథ చెబుతోంది.అమ్మ ముఖం నాకు కనబడుతోంది. తను నోటి దగ్గర చేయి పెట్టి మాట్లాడొద్దని సైగ చేస్తోంది. 

నేను అడుగులు మరింత మెల్లగా వేస్తూ సగం మూసిన తలుపు వరకూ వచ్చి వాళ్ళని గమనిస్తున్నాను. 

అమ్మ, ‘ఆవు- పులి’ కథ చెబుతోంది

“ ఆ పులితో పుణ్యకోటి చెప్పింది – ‘నేను మళ్ళీ తప్పక వస్తానని మాట ఇస్తున్నాను. ఒక సారి మాట ఇస్తే , దాన్ని తప్పేదాన్ని కాదు’ అని చెప్పి .......

ఈ మాటలు ఇప్పుడే విన్నట్టుగా తోస్తున్నాయి. అవును సాయిరాం కూడా ఇలాగే అన్నాడు ‘మాట ఇచ్చాక చేయకపోతే ఎలా మేడమ్’ 

అమ్మ మాటలు మళ్ళీ -  

“ అప్పుడు ఆ పుణ్యకోటి వేరే ఆవుల దగ్గరికి వెళ్ళి, ‘ నా పిల్లని జాగ్రత్తగా చూసుకోండి. తల్లి లేని పిల్ల అని నిర్లక్ష్యం చేయొద్దు. దానికి ఆకలయినప్పుడు మీలో ఎవరో ఒకరు పాలివ్వండి. మీ పిల్లలతో పాటు ఆడుకోమని చెప్పండి. వేరే ఎద్దులు పొడవడానికి వస్తే మీరే దానిని కాపాడాలి, ’. అని చెప్పి, చివరి సారి దూడ దగ్గరకు వచ్చి ‘అమ్మా, రేపటి నుండి నీకు వీళ్ళందరూ అమ్మలే, వీళ్ళు చెప్పిన మాట విను. ఎవరితో తగవు పెట్టుకోవద్దు. నాకు వేరే పని ఉంది. మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు. నా కోసం నువ్వు ఎదురు చూడవద్దు.” అని నాలుకతో ఒళ్ళంతా నాకి , మొత్తం శరీరమంతా దూడకు రాస్తూ దాన్ని ప్రేమతో ముద్దులాడి . . . .” అమ్మ చెబుతుంటే, ఆదిత్య గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఆ సగం చీకట్లో, వాడు పట్టి పట్టి విడుస్తున్న నిట్టూర్పుల మధ్యన ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఈ కథ విన్న ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది. అయినా వాడికి ఈ కథ ఇష్టం. 


వాడి ఎక్కిళ్ళ మధ్య నిశ్శబ్దమైన ఏడుపు – మానవజాతి గమనానికి మరోతరం ఇస్తున్న భరోసా అనిపించింది. తెలీకుండానే కళ్ళు చెమర్చాయి. 



Rate this content
Log in

Similar telugu story from Drama