Gajula UmaMaheswar

Drama

4  

Gajula UmaMaheswar

Drama

మొదటి పిచ్చుక

మొదటి పిచ్చుక

7 mins
600


                             

ఉస్మానియా యూనివర్సిటి లో జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ సదస్సు జరుగుతోంది. ప్రొఫెసర్ రఘునాథ్ మాట్లాడుతున్నారు. “పదేళ్ళ క్రితం పిచ్చుకలు మొబైల్ టవర్ల నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలవల్ల అంతరించి పోయాయని మేము జరిపిన పరిశోధన లో తెలిపాము. అయితే పదేళ్ళ తరువాత ఇప్పుడు మళ్ళీ విచిత్రంగా పిచ్చుకలు బయట కనబడుతున్నాయి. మేము ఒక జిల్లా ప్రాతిపదికగా మళ్ళీ మా పరిశోధనను కొనసాగించాము. అయితే విచిత్రంగా ఇప్పుడు పిచ్చుకలపైన రేడియేషన్ ప్రభావం కనబడడం లేదు. ఈ ఆశ్చర్యకరమైన మార్పుకు కారణం ఏమిటో మాకింకా అంతుపట్టడం లేదు .............”  

అక్కడే గోడ మీద కూర్చుని ఉపన్యాసం వింటున్న బుల్లి పిచ్చుకకు నవ్వొచ్చింది. అవును , ఆశ్చర్యం కాక మరేమిటి ? ఆ విషపు గాలుల ప్రభావంతో తన జాతి మొత్తం అంతరించిపోయేదే ! పిచ్చుకన్నది ఈ భూమి మీద లేకుండా పోయేదే , ఆ విచిత్రం జరగక పోతే ! 

బుల్లి పిచ్చుక ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లింది.  

****

సుప్రభాత సూర్యకిరణాలు మెల మెల్లగా చీకటిని చిమ్మివేస్తున్నాయి. తుషార వీచికలు కళ్ళాపి చల్లాయి. విశ్వవేదిక ముంగిట తెల్లని ముగ్గు పెట్టినట్టుగా వెలుతురు అలుముకుంటోంది. చెట్ల కొసలు తమకలవాటైన వెచ్చని కిరణాల స్పర్శకు మెలకువ వచ్చి నిక్క బొడుచుకున్నాయి. నగరంలోని ఆ ఉద్యానవనంలో ఒక చెట్టు కొమ్మకు కట్టుకున్న గూట్లోని బుల్లి పిచ్చుక ఈ అలజడి మేలుకొలుపుకి నిద్ర లేచింది. 

ఉదయం లేచీ లేవగానే తనని ముద్దులతో నింపేసే తల్లి కోసం తహతహగా చూసింది. చిట్టి చిట్టి అడుగులతో గూట్లోకి నడచి తల్లి కోసం గూడంతా వెదికింది. కనబడలేదు. చుట్టుపక్కల చూసింది – కనబడలేదు. పైకి కిందకీ చూసింది , కనబడలేదు. కళ్ళలో దిగులు నింపుకుని దిక్కులు చూస్తోంది. రాత్రంతా తన వెచ్చని కౌగిలిలో పొదువుకుని రెక్కలతో వళ్ళంతా నిమురుతూ పక్కనే పడుకున్న తల్లి , ఇంత పొద్దునే తనని వదిలి ఎక్కడికెళ్లినట్టు ?

దానికి గూడుపైనుండి సన్నగా మూలుగులు వినిపించాయి. చిన్నగా గూడు అంచు వరకూ వెళ్ళి మోర పైకెత్తి గూడు పై భాగాన్ని చూడడానికి ప్రయత్నించింది. 

ఎక్కడిదో ఒక పిచ్చుక కొమ్మకు , గూడుకు నడుమ చిక్కుకొని వుంది. శక్తి కొద్దీ లేవాలని ప్రయత్నిస్తోంది. కానీ నడవలేక బాధతో లుంగలు చుట్టుకు పోతూ వుంది. నొప్పితో గిలగిలలాడుతూ , మెడనరాలు బిగుసుకు పోయేలా మెడ సాగదీస్తూ , కళ్ళలో దైన్యం తాండవమాడుతుంటే, ఎంత బాధను అనుభవిస్తోందో ! కళ్ళతో బుల్లి పిచ్చుకను పిలుస్తోంది. కానీ దానికింకా కాళ్ళు రాలేదని, అది ఆ మాత్రం ఎత్తు ఎగరడానికి ఇంకో మూడు వారాలైనా పడుతుందని ఆ పిచ్చుకకు తెలుసు. 

ఇంతలో ఎక్కడినుండో తల్లి పిచ్చుక ఆయాసపడుతూ వచ్చింది. బుల్లిపిచ్చుక చూస్తున్న వైపు తను కూడా దృష్టి సారించి చూసింది. తల్లి పిచ్చుకకి పరిస్థితి అర్థమైయింది. ఆ పిచ్చుక దగ్గరికి వెళ్ళి ముక్కుతో పరామర్శించింది. ఆ పిచ్చుక లేవలేక లేవలేక అక్కడే కూలబడిపోతోంది. మరో రెండు నిముషాల్లో ఆ పిచ్చుక కదలికలు ఆగిపోయాయి. తల్లి పిచ్చుక కడసారి సానుభూతి చూపు చూసి బుల్లి పిచ్చుకను తీసుకుని గూట్లోకి వెళ్లింది. 

దానికి తెలుసు - విషపు గాలి బారిన పడిన ఏ పిచ్చుకా బతికిన దాఖలాలు లేవు. 

బుల్లి పిచ్చుక బిక్కమొహం వేసుకుని బిత్తర చూపులు చూస్తోంది. ఇందాకటి పిచ్చుకకి ఏమయింది ? అదే విషయాన్ని తల్లిని అడిగింది. అప్పుడు తల్లి చెప్పింది. 

‘ఇదంతా విషపు గాలి ఫలితం. ఇప్పుడు గాలిలో విషం చేరుకుంది. మనం ఎగురుతున్నప్పుడు జాగ్రతగా ఉండాలి. మనం గాలిలోని తేడాని గమనించగలిగిన నైపుణ్యాన్ని కలిగిఉండాలి. అప్పుడప్పుడూ విషపు గాలులు మనలను కమ్ముకుంటాయి. వాటి తేడా మనకు అర్థమైపోతుంది. అవి మనకు తగలగానే శరీరంలో వచ్చే మార్పు మనకు తెలుస్తుంది.మనం తక్కువ ఎత్తులో ఎగరితే మంచిది. వాడల్లో తిరిగితే మంచిది. ఉద్యానవనాల్లో , చెట్లు ఉన్న చోట సేదతీరితే మంచిది.పొరపాటున కూడా జనారణ్యాలవైపు వెళ్లకు.’ 

అన్నిటికీ తలవూపింది. తనకు ఎగరడం ఎప్పుడొస్తుందో ? వచ్చినప్పుడు చూద్దాం.   

* * * *

ఆరు నెలలు గడిచాయి. 

ఒకరోజు బుల్లిపిచ్చుక ఆహారం కోసం వెదకుతోంది. 

ఒక ఇంటిముందు వాలి అప్పుడే చెరిగి పోసిన బియ్యం లోనుండి తనకు కావలసినన్ని ఏరుకుని తిన్నది. ఇక గూడువైపు ప్రయాణం సాగించడానికి పైకెగిరింది. కొద్ది దూరం సాగగానే దానికి ఉన్నట్టుండి గాలిలో మార్పు కనబడింది. గాలి మెల్ల మెల్లగా బరువౌతున్నట్టు తోస్తోంది. రెక్కలనెవరో సుతిమెత్తగా వెనక్కి తోస్తున్నట్టు అనిపించింది. అలలు అలలుగా సాగుతున్న గాలిపొరలలో పొసగని వాసనలేవో తగులుతున్నాయి. 

అలవాటు లేని పరిసరాలలోకి అడుగుపెట్టిన అసౌకర్యం తెలుస్తోంది. 

తల్లి మాటలు గుర్తొచ్చాయి. 

ఇవి ఆ విషపు గాలుల లక్షణాలేనా ? మొదటిసారి తను దాడికి గురౌతోంది. తప్పించుకునేందుకు కిందకి, పైకి గిరికీలు కొడుతోంది. కానీ తన ఇబ్బంది తనకు తెలుస్తోంది. రెండు మూడు నిముషాల పెనుగులాట తరువాత తిరిగి తనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్టు భావించింది. 

మరో పది నిముషాల్లో తన గూడు చేరింది బుల్లి పిచ్చుక.

తనకు కలిగిన అనుభవాన్ని పంచుకునేందుకు ఇప్పుడు తల్లి లేదు. విషపుగాలి బారిన పడిన తల్లి ఎక్కడ తుది శ్వాస విడిచిందో తనకు తెలియదు. అప్పటినుండీ బుల్లి పిచ్చుక ఒంటరిదయింది. 

ఈ రోజు తనకు కలిగిన అనుభవం దానికి ప్రాణభీతి కలిగించింది. 

అంటే తనుకూడా ఇంకా కొన్ని రోజుల్లో .... 

ఆ ఆలోచనే భరించలేక పోయింది. కానీ వాస్తవం కళ్ల ముందు కనబడుతోంది. 

ఒకటా , రెండా ? తన కళ్ళముందు ఎన్ని పిచ్చుకలు ?  

పసితనం వీడని బంగారం లాంటి పక్కగూటి పిచ్చుకలు ఇలానే నేల రాయి పోయాయి. మెడకింద గోధుమరంగు మచ్చతో చూడగానే టక్కున ఆకర్షించే మేలైన పిచ్చుకలు మాయమైపోయాయి. ఎగురుతూ ఎగురుతూ రెక్కలనెవరో తుంచేసినట్టు కూలబడిన పిచ్చుకలు, మౌనంగా ఎటో చూస్తూ మరణం పిలిస్తే వెళ్ళిన పిచ్చుకలు, ముక్కున కరచిన ఆహారం పిల్లనోట్లో పెడుతూ మృత్యుదేవతకు ఆహారం అయిన పిచ్చుకలు ........ 

తామే ఎందుకు ? తామే ఎందుకు బలైపోతున్నాయి? 

తమని ఏదో క్షుద్రశక్తి వెంటబడి తరిమి తరిమి కొడుతున్నట్టు, తుదకంటా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టు – తామే ఎందుకు ? 

బుల్లి పిచ్చుక మనసులో ఎన్నో ప్రశ్నలు ! 

కళ్లెదురుగా రాక్షసగద్దలు గగనంలో ఆడుతూనే ఉన్నాయి. పావురాలు రెక్కల గుర్రాల మీద పరిగెడుతూనే ఉన్నాయి. కసిరి కసిరి కొడుతున్నా కాకులు మనుషుల ఇళ్ల మీద ఎగిరెగిరి వాలుతునేవున్నాయి. కోకిలలు , చిలుకలు , సీతాకోక చిలుకలు , మిడతలు , తేనెటీగలు అన్నీ సవ్యంగానే ఉన్నాయి. సౌకర్యంగానే ఎగురుతున్నాయి. పిచ్చుకలు మాత్రం రక్తం కక్కుకుని నేలరాలిపోతున్నాయి.

ఇదెక్కడి ఘోరం ? ఎవరు పెట్టిన శాపం ?  

బుల్లి పిచ్చుక ఏడ్చింది. జాలిగా, బేలగా ఏడ్చింది. తన మనసులోని దుఖ్ఖమంతా ఆవిరైపోయేలా ఏడ్చింది. తన జాతి నిస్సహాయతకు ప్రకృతి ప్రతిస్పందించేలా ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలసి సొలసి నిద్రపోయింది. 

రెండు నెలలు గడచిపోయాయి. 

ఈ లోగా మరో రెండు సార్లు విషపు గాలుల వలయంలోనుండి పయనించింది బుల్లి పిచ్చుక. మళ్ళీ అదే అనుభవం. దానికిమరింత దిగులు హెచ్చింది. తల్లి గుర్తొచ్చింది. తల్లి మరణం గుర్తొచ్చింది. తనూ అంతేనా ? ఏదో ఒక రోజు ఎగురుతూ ఎగురుతూ, ఎగరలేక ఎగరలేక, పైకెగిరి పోవలిసిందేనా? ఊపిరాడని ఉక్కిరి బిక్కిరి పరిస్థితులలో ఊపిరి విడువవలిసిందేనా? 

లేదు. తను చావకూడదు. తాను ఆ విషపు గాలులను తట్టుకొని నిలబడాలి. తన పిల్లలను బతికించాలి. తన జాతిని కొనసాగించాలి. 

ఎలా ? ఎలా ? 

బుల్లి పిచ్చుక ఆలోచిస్తోంది. తన సంకల్పం బలంగా ఉండాలి. సృష్టిలో జరగనిది ఏమీ లేదు. తను సంకల్పించాలి. 

దృఢంగా .... బలంగా... చాలా బలంగా 

తన శరీరం విషపుగాలుల ప్రభావానికి లోనవకూడదని సంకల్పించాలి. 

తన మనసులోని కోరిక నెరవేరేలా, తన శరీర నిర్మాణం తనకు అనుకూలంగా మారేలా, ప్రకృతి ధర్మాలు తనకు సహకరించేలా , గాఢంగా తను సంకల్పించాలి.  

బుల్లి పిచ్చుక కళ్ళు మూసుకుంది. ఆ గాలి తనని తాకిన చోట ఏమి జరిగిందో మననం చేసుకుంది. దాని ప్రభావం వల్ల తన శరీరం లోపల జరిగిన మార్పులను, వైపరీత్యాలను నెమరేసుకుంది. తన రెక్కలు ఎందుకు నిర్వీర్యమౌతున్నవో ఆలోచించుకున్నది. ఊపిరి ఆడడంలో ఇబ్బంది ఏమిటో కనిపెట్టింది. రక్తప్రసరణలోని నిదానాన్ని గమనించింది. ఆ స్థితిలో తన మానసికబలహీనతను నెమరేసుకున్నది. 

జయించాలి ! ఈ ప్రమాదం నుండి బయటపడాలి. 

బుల్లి పిచ్చుక వజ్రసంకల్పంతో బయలుదేరింది. 

తను ఇంతకు మునుపు తిరిగిన ప్రదేశమే తన ప్రయోగశాల చేసుకుంది. తన శరీరాన్నే ఫణంగా పెట్టదలిచింది. ప్రకృతిని తన పర్యవేక్షకుడిగా నియమించుకుంది. 

ప్రయోగం ప్రారంభమైంది. తెలిసి తెలిసి బుల్లి పిచ్చుక విషపు గాలుల వలయంలో ప్రవేశించింది. 

మరుక్షణమే తన రెక్కల నిస్సత్తువ తనకు తెలుస్తోంది. తనకు ముందే తెలుసు కనక స్థిరంగా రెక్కలనాడించడానికే శక్తి కొద్దీ ప్రయత్నిస్తోంది. ఊపిరి తీయడం భారమౌతోంది. ఊపిరి మీద ధ్యాస పెడితే రెక్కల మీద ఒత్తిడి ఎక్కువౌతోంది. రెండిటికీ కావలసినంత శక్తిని అందివ్వలేక పోతోంది. అంత శక్తి తనవద్ద లేదా , తన సామర్ద్యమింతేనా ? తను ఇంతకంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయలేదా ?  అదిగో , తను మానసిక దౌర్బాల్యానికి గురౌతోంది .....  

అంతే ! 

తనకు తెలిసిన గిరికీల విద్యనుపయోగించి ఆ ప్రదేశం నుండి బయటపడి మళ్ళీ గూడు చేరింది. 

బుల్లి పిచ్చుక ఆలోచిస్తోంది. ఆహారం , నీళ్ళు మాని ఆలోచిస్తోంది. 

ఆలోచనలలోనే రెండు రోజులు గడచిపోయాయి. 

ఈ లోగా మరో మూడు సార్లు తన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బుల్లి పిచ్చుకకు పెద్ద సందేహం వచ్చింది. తన శరీరం తన మాట వినదా ? శరీరం గొప్పదా ? ఆలోచన గొప్పదా ? మెదడు ఇచ్చే అన్ని ఆదేశాలనూ శరీరం పాటించాలి కదా ? మరి ఎందుకీ వైఫల్యాలు. ఈ పోరాటంలో తను జయిస్తుందా ? 

మరో వారం రోజుల మానసిక వేదన తరువాత చివరి ప్రయత్నానికి సిధ్ధమయింది బుల్లి పిచ్చుక. 

తను మానసికంగా ఎంతో సంయమనంతో , ప్రశాంతంగా ఉండాలని నిశ్చయించుకుంది. జాగరూకతతో,ఎరుకతో, మానసిక స్పృహ తో శరీరానికి సందేశాలివ్వాలని నిర్ణయించింది. ఓటమిని అంగీకరించగూడదని పంతం పట్టుకుంది. 

రెండు రోజుల విరామం తరువాత మళ్ళీ పరీక్షాస్థలికి చేరుకుంది.

గుండె నిండుగా గాలి తీసుకుని మనోధైర్యంతో ఆకాశాన్నిజయించటానికా అన్నట్టు దీక్షగా పైకెగిరింది. రెక్కలను నిటారుగా వెనక్కి తన్ని బలంగా ముందుకు సాగుతోంది. ముక్కుతో ఆ ప్రదేశాన్ని పసిగట్టే పనిలో వుంది. రెండు సెకన్లు గడిచాయో , లేదో మెల్లగా తన చర్మం వేడి గాలులను స్పర్శించడం తెలుస్తోంది. అది గ్రహించి రెక్కలను తనివితీరా బలంగా ఊపుతోంది. శరీరాన్ని తన వశంలోనే ఉంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. గుండె నిండా ఊపిరి పీల్చి శ్వాస తగ్గిపోకుండా కాపాడుకుంటోంది. 

తనవంట్లో ఏవో మార్పులు జరుగుతున్నాయి. రక్తప్రసరణ మందగిస్తున్నట్లుంది. ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయి. గుండె భారంగా కొట్టుకుంటోంది. నరాలు బలహీనమవుతున్నాయి. 

తయారవుతున్న రక్తం తనలో ఏవో మార్పులవల్ల పూర్తిగా శరీరమంతా ప్రవహించడం లేదు. తనకి తెలుస్తోంది. ఎక్కడో నరాలు ముడుచుకుపోతున్నాయి. రక్త నాళాలు బయట నుండి ఏదో వత్తిడి వల్ల కుచించుకుపోతున్నాయి. 

ఇక్కడే , ఇక్కడే .... 

తన సంకల్పం గట్టిగా నిలబడాలి. తను , తన జాతి అంతరించిపోగూడధు 

గట్టిగా కళ్ళు మూసుకుని తన కోరికను బలంగా మననం చేసుకుంది. తను ఆ విషవాయువుల ప్రభావాన్ని అధిగమించాలి. అంటే ఆ మార్పులను నిరోధించే శక్తి తన శరీరానికి కావాలి. ఇప్పుడు తనకి శక్తి కావాలి. రక్తం కావాలి. ఎముక మూలుగుల్లో ఏదో రసాయన ప్రక్రియ వేగవంతమౌతోంది. శక్తి కేంద్రాలు తమ కణజాలాల అమరికను మార్చుకుంటున్నాయి. మూలాధాతువుల్లో ఏదో మార్పు సంభవిస్తోంది.ముడుచుకుపోతున్న నాళాల లోపలి గోడలు ఎవరో సొట్టలు తీసినట్టు మళ్ళీ తమ పూర్వ స్థితిని సంతరించుకున్నాయి. పిచికారి తో చిమ్మినట్టు రక్తం ఆ నాళాలగుండా రెట్టింపు వేగంతో గుండెను చేరుతోంది. ఊపిరితిత్తులకు ప్రాణవాయువు సరఫరా అవుతోంది. రెక్కలకు సత్తువ చేకూరుతోంది. 

నూతన పరిణామ ప్రక్రియ కొనసాగుతూనేవుంది. 

ఇరవై నిముషాల తరువాత బుల్లిపిచ్చుక నెమ్మదిగా కళ్ళు తెరిచింది. 

తనను తాను పరిశీలించి చూసుకుంది. 

ఆశ్చర్యం !!!

తనకు ఊపిరాడుతోంది. రెక్కలు ఆడుతున్నాయి. తను ఎప్పటిలాగే వుంది. రెక్కలను టపటపా కొట్టింది. స్వేచ్చగా కదులుతున్నాయి. నమ్మలేక మళ్ళీ మళ్ళీ అదే పని చేసింది. రెక్కలపైన ఆ గాలుల ప్రభావం లేదని అర్థమైంది . బుల్లి పిచ్చుక ఆనందంతో ఉక్కిరి బిక్కిరయింది. సంతోషంతో పైకీ కిందికీ , కుడి ఎడమలకీ గిరికీలు కొడుతూ తిరుగింది. ఆకాశవీధిలో ఒంటరిగా వేడుక చేసుకుంది. ఆడి ఆడి అలసి గూడు చేరింది. 

ఒకరోజు గడిచింది. బుల్లి పిచ్చుక మళ్ళీ ఒకమారు తన ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకోదలచింది. 

అదే ప్రదేశంలో మరొకమారు విషపు గాలులలోకి ప్రవేశించింది . పదినిముషాల పెనుగులాట అనంతరం విజయవంతంగా బయటకొచ్చింది. తనలోని మార్పు మెల్ల మెల్ల అర్థమౌతోంది. ఆ మార్పు స్థిరపడాలి అని తీర్మానించుకుంది. . 

నెల రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజూ తనను తాను పరీక్షించుకుంది. తన పెనుగులాట రోజు రోజుకూ తగ్గి తగ్గి , తను ఆ గాలులను తాకుతూ, ఆ గాలుల మధ్య అలవోకగా , ఏ మాత్రం తేడా లేకుండా ఎగరగలిగే స్థాయికొచ్చింది.  

ఏడేళ్లు గడిచాయి. 

బుల్లి పిచ్చుక ఇరవై విడతలుగా దాదాపు నలభై గుడ్లను పొదిగింది. అన్ని పిచ్చుకలూ విషపు గాలుల పరీక్షకు తట్టుకుని , జయించి నిలిచాయి. ఆ గాలులు తన బిడ్డలనేమీ చేయలేకపోయాయి. తన కష్టం ఫలించింది. తన కోరిక నెరవేరింది. బుల్లి పిచ్చుక సంబరపడింది. కొత్తజాతిని తలచుకుని మురిసిపోయింది. 

• *  *

బుల్లి పిచ్చుక జ్ఞాపకాల దొంతరలోనుండి బయటకొచ్చి చటుక్కున తల అటు ఇటు విదిల్చింది. పెద్దగా ఊపిరి తీస్తూ భారంగా నిట్టూర్చింది. ఒక విజయ రహస్యాన్ని మోస్తున్న తన పోరాట గాథను ఈ మనుషులెప్పుడైనా తెలుసుకోగలుగుతారా ? తను అనుభవించిన దుఖ్ఖాన్ని, వేదనని, ఆర్తితో అర్థం చేసుకుంటారా ?   

సభ ముగిసింది. జనమంతా హాల్లోనుండి బయటకు వస్తున్నారు. 

కొత్త పిచ్చుకలు ఈ గొడవంతా పట్టించుకోకుండా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. బుల్లి పిచ్చుకకు తల్లి జ్ఞాపకమొచ్చింది. తల్లితో పాటూ తన పూర్వపు పిచ్చుకలు జ్ఞాపకమొచ్చాయి. దాని కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. అవి కూడా ఇలాగే బతికి ఎగురుతుంటే ఎంత బాగుండేదో అనుకుంటూ గూడు దిశగా ఎగిరిపోయింది బుల్లి పిచ్చుక.  



Rate this content
Log in

Similar telugu story from Drama