Udaya Kottapalli

Drama

4.8  

Udaya Kottapalli

Drama

చదువులమ్మ చెట్టు నీడలో...!!!

చదువులమ్మ చెట్టు నీడలో...!!!

7 mins
858



‘’ ఎంత సేపైందిరా వచ్చి? కోడళ్ళు మనవలు అంతా బాగున్నారా?’’ లోపలికి అడుగు పెడుతూ అడిగారు ప్రియదర్శిని గారు ఇంటి తాళాలు తీసుకుని లోపల కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ముగ్గురు కొడుకుల్ని చూసి.


‘’అరగంట అయిందమ్మా. అంతా బాగున్నారు.ఇంతకీ నువ్వెలా ఉన్నావ్?” అడిగాడు పెద్దవాడు చంద్ర శేఖరం.


‘’నాకేం? పిడిరాయిలా ఉన్నాను.’’ ఆవిడ భుజానున్నహ్యాండ్ బాగ్ తో అలాగే వంటింట్లోకి వెళ్లి కుండలో గ్లాసెడు చల్లటి నీళ్ళు గొంతులోకి పోసుకుంటూ పెద్దకొడుకు తన తమ్ముళ్ళతో అంటున్న మాటలు విననే విన్నారు.


‘’ అమ్మ మాటల్లో నిష్టూరం గమనించావా.”


‘’ మనమే మన్నా ఈవయసులో ఆవిడను తాపత్రయ పడమన్నామా? సుఖం గా మన ఇళ్ళకి వచ్చి కోడళ్ళతో కలిసి మనవలతో హాయిగా ఆడుకుంటూ, కృష్ణా రామా అనుకోమని ఆహ్వానిస్తే , ‘నా పల్లెటూరు, నా పొలం, మా ఆయన జ్ఞాపకం ‘ అని ఇక్కడే ఉండటం ఆవిడకు ఇష్టం. మనమే చెయ్యగలం?’’ అన్నాడు మెల్లగా రెండో కొడుకు శశిధర్.


‘’పోనీలే అన్నయ్యా.ఆవిడ చాదస్తం ఆవిడది. కానీ ఒక్కటి మన మొత్తం కుటుంబం లో ఏ చిన్న విషయం జరిగినా అది ఆవిడ ద్వారా మాత్రమే జరగాలన్న పితకలాటకం నాకూ నచ్చదు. ఎందుకో అంత తాపత్రయం నాకు అర్ధం కాదు. పోనీ లెద్దూ. ఆవిడ విషయం వదిలేసి మనపని తొందరగా అయ్యేలా చూడండి. రేపు సెలవు కూడా లేదు.’’ అన్నాడు మూడవ కొడుకు శంకరం.


ఆమె నేరుగా వచ్చి పిల్లల పక్కన ఖాళీగా ఉన్న ఇంకో కుర్చీలో కూర్చున్నారు.


‘’ వెర్రి నా పుత్రుల్లారా...ఏ చిన్నవిషయం మీ కుటుంబాల్లో జరిగినా నాకు తెలియచేయమని ఎందుకు అంటానో తెలుసా?..మొదటిది నా పిల్లలు నా పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు అని పదిమందికి చెప్పుకోవడం కోసం, రెండు... ఆ విషయంలో నాకు తోచిన సాయం వీలయితే మీకు చెయ్యడం కోసం., మూడు... రేపు మీకు పెద్దరికాలు వచ్చాకా మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించడం కోసం. అర్ధం అయిందా..నా వయసు వచ్చాకా మీ పిల్లలు మిమ్మల్ని తీసి పడేస్తుంటే మీరెంత బాధ పడతారో తెలుసా? ఆ బాధ మీకు కలగ కూడదని నా తాపత్రయం ...సర్సరే. ఇవిగో...పంట డబ్బులు.కాష్ ఈరోజుల్లో తీసుకెల్లడం ప్రమాదం. అసలే ఎలక్షన్స్ జరగబోతున్న రోజులు .ఇవిగో ఎవరి చెక్కులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి. “ అంటూ ఎవరి చెక్కులు వాళ్ళకి ఇచ్చేసారామే.


‘’ చాలా థాంక్స్ అమ్మా.’’ అన్నాడు శశిధర్.


‘’అసలు నువ్ మా ఇళ్ళకు ఎందుకు రావు? నీ కోడళ్ళు నిన్ను ఏమైనా అన్నారా? అదేదో నియమం పెట్టుకున్నట్టు, మా పెళ్ళిళ్ళు అయ్యాకా మొదటి ఆరు నెలలలో ఒకసారి వచ్చి పదిహేను రోజులున్నావ్. మనవలు పుట్టాకా అందరికీ ఇక్కడే బారసాల జరిపించావ్.


వాళ్ళు స్కూళ్ళల్లో చేరకముందు ప్రతీ పండగకీ వచ్చి పడేసి రోజులు గడిపి వెళ్ళేవాళ్ళం. పిల్లలు అందరూ హై స్కూళ్ళ స్థాయికి వచ్చేసారు. వాళ్ళేమో బామ్మని పిలవండి నాన్నా అంటారు. నువ్వేమో ఎంతసేపు ‘పొలం స్వయంగా చూసుకోక, కౌలుకు ఇచ్చేస్తే దళారీలు నాశనం చేసేస్తారు’ అంటావ్. ఎండనకా వాననకా తిరిగేసి మాగాయి బద్దలా ఎలా అయిపోయావో చూడు.ఒక పది రోజులు వచ్చి అందరిళ్ళల్లోను ఉండి వెళ్ళమ్మా.” అన్నాడు చంద్రశేఖరం.


‘’ అవునమ్మా. ఈసారైనా రామ్మా..’’ అన్నాడు శంకరం.


పిల్లల ఆప్యాయతకు ఆమె మనసు ఆర్ద్రత చెంది కళ్ళు చెమర్చాయి.రాబోయే కన్నీటిని బలవంతంగా ఆపుకున్నారామే.


‘’ తప్పకుండా వస్తానర్రా. మా నాన్నగారు నన్ను అగ్రికల్చరల్ బి.ఎస్.సి. ఎందుకు చదివించారు అనుకున్నారు? ‘నేను కట్నం కింద నీకిచ్చే పొలం మూడెకరాలు తొమ్మిది ఎకరాలు చెయ్యాలి నీ స్వశక్తితో...అందుకే నిన్ను ఇంతగా చదివించాను. ఆడపిల్లవు కాబట్టి ఒక అయ్య చేతిలో పెట్టక తప్పట్లేదమ్మా. మీ వారికి ఎలా నచ్చ చెప్పుకుంటావో...నీ ఇష్టం. ‘’ అన్నారు. ఆయన కోరిక మీద త్రిమూర్తుల్లాంటి మీ ముగ్గురికోసం ఆ మూడు ఎకరాలను 12 ఎకరాల స్థాయికి పెంచగలిగాను. ఇది నా గొప్పతనం కాదు. మీ తాతగారి ప్రోత్సాహం,మీ నాన్నగారి సహకారం. నా పిల్లలు వారి వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి. కన్న తల్లిగా ఇదే నా కోరిక. సర్సరే. కాళ్ళు కడుక్కుని అన్నాలకి లేవండి. మళ్ళీ నువ్వే లేటు చేశావమ్మా అని నన్నే అంటారు.’’ అని ఆమె ముగ్గురి కొడుకులనూ బుగ్గలు నిమిరి, వీపులమీద ఆప్యాయంగా రాసి కళ్ళు తుడుచుకుంటూ లోపలికి నడిచారామె.


‘’ మరి ఈ ఇల్లు?’’ అప్రయత్నంగా శంకరం నోటినుంచి వచ్చిన మాటకు ఆమె టక్కున ఆగారు.


‘’ఇపుడా సంగతి ఎందుకురా? ఒక పక్క రేపు సేలవు లేదంటున్నావ్? కదలవా?” విసుక్కున్నాడు చంద్రశేఖరం.


 శంకరం మాటకు హటాత్తుగా ఆగి కఠినంగా అన్నారామె.’’ ఈ ఇల్లు మా అమ్మమ్మ మా అమ్మకు పసుపు కుంకుమ గా ఇచ్చింది. మా అమ్మ నాకు ఇచ్చింది. మీ నాన్నగారి ఇల్లు అమ్మేసి ఆ డబ్బు మీరున్న నగరాల్లో అడ్వాన్సు పేమెంట్ కింద మీరు కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కు ఆనాడే ఇచ్చేశాను. ఈ ఇంటి గురించి అడిగే హక్కు మాత్రం ఎవరికీ లేదు. అవన్నీ తరువాత. ముందు అన్నాలకి లేవండి.’’ ఆమె లోపలి వెళ్ళిపోయారు.


‘’ఒరే. నీకు వయసు వచ్చింది గానీ బుద్ది రాలేదురా శంకరం. మన ఇంట్లో ఆడ పిల్లలు లేరుగా.అమ్మ మనకు కాకపొతే ఎవరికీ ఇస్తుంది చెప్పు.ఇపుడు అడగాల్సిన ప్రశ్నా ఇది గాడిదా?’’ ముద్దుగా కసురుకున్నాడు చంద్రశేఖరం.  


‘’ రియల్లీ సారీ అన్నయ్యా.” నొచ్చుకుని అన్నల వెంట పెరట్లోకి నడిచాడు శంకరం.


                           *   *   *


ఆవూరిలోనే పుట్టి పెరిగి 5 కి.మీ.దూరం లో ఉన్న పట్టణానికి నడిచి వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయునిగా ఆవూరిలోనే తోలి పోస్టింగ్ వేయించుకుని ఇరవై సంవత్సరాలపాటు ఆ గ్రామ ప్రజలందరికీ తలలో నాలికలా మసలిన విజయరామారావు మాస్టారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. వివాహమైన కొద్ది రోజులకే ఆయన భార్య టి.బి. ఎటాక్ అయి గ్రామంలో సరైన వైద్యం దొరకక ప్రియదర్శినికి ఆరవ ఏటనే కన్ను మూసింది. ఎందరు పెద్దలు సూచించినా, సలహాలు ఇచ్చినా ఆయన రెండవ వివాహం చేసుకోకుండా ప్రియదర్శినిని కళ్ళల్లో ప్రేమవత్తులు పెట్టుకుని మరీ పెంచారు. భారత ప్రదానిగా ఎక్కువ కాలం పనిచేసిన జవహర్ లాల్ నెహ్రు గారి స్పూర్తితో తన కుమార్తెకు ఇందిరాప్రియదర్సిని అని పేరు పెట్టుకున్నారు ఆయన. విద్యావంతుడైన ఒక తండ్రి తన కుమార్తె తో స్నేహితునిగా మసలుకోవాలన్న సత్యాన్ని తన పదవతరగతిలో తెలుగు సబ్జెక్ట్ లో సెకండ్ నాన్-డిటైల్డ్ గా జవహర్లాల్ నెహ్రు జీవిత చరిత్రను చదివి గ్రహించిన ఆయన ప్రియదర్సనిని చదువుల తల్లిగా తీర్చి దిద్దారు.


తనకున్న భాషా పరిజ్ఞానాన్ని నూరిపోసారు. ఎక్కడకు వెళ్ళినా ఒక కొత్త పుస్తకం కొని తెచ్చి ఇచ్చి అది చదివాకా దాని సారాన్ని సంగ్రహంగా రాయించి, తప్పులు దిద్ది, భయం పోగొట్టడం కోసం పాఠశాలలో ఆ అంశం మీద ఆ పాప చేత అయిదు నిముషాలు ప్రార్ధనా సమయం లో మాట్లాడించేవారాయన. పదవ తరగతిలో ఆ గ్రామలో మొట్టమొదటి ప్రతిభా అవార్డు అందుకున్న అమ్మాయి ఇందిరా ప్రియదర్శిని. అప్పటికి జూనియర్ కళాశాల గ్రామం లో రావడం తో ఇంటర్ కూడా చదివించేసారు.


తన కష్టార్జితం తో కొనుక్కున్న మూడు ఎకరాలలో వారి పంట పండించేవారు. కూలీలతో కలిసి తానూ ప్రియదర్సినితో సహా అరక దున్నేవారు. నారు పోసేవారు. నాట్లు వేసేవారు. కుప్ప వేసేవారు. పంట నూర్చేవారు.ఆ జమా లెక్ఖలన్నీ కూతురిచేత రాయించేవారు. అలా ఆమెకు వ్యవసాయం మీద ఇష్టం ఏర్పడింది.


‘’ప్రభుత్వ ఉద్యోగం చేసే మీకు ఇంత శ్రమ అవసరమా నాన్నగారూ?’’ అన్న దానికి ఆయన చెప్పిన సమాధానం ఆమెలో వ్యవసాయం పట్లే కాదు...పెంపకం పట్ల కూడా అవ్యాజమైన ప్రేమను పెంచుకునేలా బీజం వేసింది.


‘’చూడమ్మా.ఒక విత్తనాన్ని నేలలో నాటి దానికి నీరు అందించినపుడు కిరణజన్య సంయోగ క్రియతో అది మొలకగా చేతులు జోడుస్తూ ‘నాకు ఈ మొక్క జన్మ ఇచ్సినందులకు మీకు ధన్యవాదాలు’ అన్నట్టుగా ప్రభవించే క్షణం నుంచే దానికి కష్టాలు ప్రారంభమవుతాయి. ఏ జంతువూ ఎపుడు తినేస్తుందో తెలీదు, ఎవడు వచ్చి పీకేస్తాడో తెలీదు,ఏ వాన, తుఫాను ఎపుడోస్తాయో తెలీదు. అనుక్షణం చిగురిస్తూనే, ఇన్ని పరిణామాలను ఎదుర్కొని అది మొక్కై నిలబడి, చెట్టుగా ఎదిగి మొదటి పువ్వు పూసి, మొదటి కాయగా మారి, మొదటి పండుగా మనము ఆస్వాదించినపుడు ఆ చెట్టు జన్మ ధన్యం. అదే జీవ పరిణామం. ఆనాడు మనం పడ్డ ఈ శ్రమ అంతా క్షణం లో మర్చిపోయి ఆత్మానందాన్ని అనుభవిస్తాము. అది ఈ ప్రపంచంలో ఒక్క చేట్టువల్లె సాధ్యమమ్మా.అందుకే ఇస్మాయిల్ అనే మాహాకవి “ చెట్టు “ అనే దీర్ఘ కావ్యం రాసి తన జన్మను ధన్యం చేసుకున్నాడు.’’


ఆ మాటలు ఆమెలో పరిపూర్ణతతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అప్పటినుంచే పొలంలో గట్లమీద ఆయన ఆనప, గుమ్మడి, బూడిదగుమ్మడి, దోస, లాంటివి పండిస్తే, ఇంట్లోకి కావలసిన అన్నిరకాల కూరలూ ప్రియదర్శిని పండించేది. వూరిలో రోజూ ఒక కుటుంబం వారి పెరట్లోని కూరగాయలతో సుష్టుగా భోజనం చేసేవారంటే అతిశయోక్తి కాదు.


ఆమె అభిరుచి, కోరిక మేరకు పట్నంలోని స్నేహితుని ఇంట వుంచి ఆమెను అగ్రికల్చరల్ బి.ఎస్.సి. చదివించారు విజయరామారావుగారు. సరిగ్గా ఆ స్నేహితుని కుమారుడు సత్యదేవ్ గ్రామీణ బ్యాంకు క్లర్క్ గా విజయరామారావుగారి వూరిలో వుద్యోగం రావడం యాదృశ్చికం.దాంతో కూతురు పట్నం వెళ్ళిపోయినా స్నేహితుని కొడుకుని తనతోనే ఉంచుకున్నరాయన. సెలవులకు ప్రియదర్శిని ఇంటికిరావడం ...సత్యదేవ్, ఆమె ల మధ్య సాన్నిహిత్యం పెరగడం, అది ప్రేమగా పరిణమించి స్నేహితులిద్దరి అంగీకారంతో ప్రియదర్శిని సత్యదేవ్ ల వివాహం ఆనందంగా జరిగిపోయింది. ‘’నన్ను నిజంగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా?’’ అడిగింది ప్రియదర్శిని మొదటి రాత్రి.


‘’ఈ చదువులమ్మ చెట్టు నీడలో నా జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందన్న నమ్మకం నాకుంది ప్రియా’’ అన్న అతని మాటలకు ఆమె గువ్వలా అతనిలో ఒదిగిపోయింది.ముగ్గురు కొడుకులు పుట్టారు. ‘అమ్మాయి వద్దా?’ అడిగాడు సత్యదేవ్.


‘’అవసరం లేదండి. దాని బదులు నాకు మీరు రెండు వరాలు ఇవ్వాలి. నాకు ఇష్టమైనప్పుడు కోరుకుంటాను. సరేనా?’’ అంది ప్రియదర్శిని.


‘’ఓహో నువ్వు రామాయణం లో కైకలాగానా?అయితే నేను దశరధుడిని అన్నమాట.’’ ఆనందంగా భార్యను దగ్గరకు తీసుకుని నవ్వేసాడు సత్యదేవ్.


పెద్దవాడు పడవ తరగతి లో ఉండగా విజయరామారావుగారు కాలం చేసారు. వెంటనే పిల్లల పై చదువుల నిమిత్తం సత్యదేవ్ దంపతులు తమ మకాన్ని పట్టణానికి మార్చారు. అయితే ప్రియదర్శిని సీజనులో మాత్రం తానే గ్రామానికి వచ్చి వ్యవసాయాన్ని స్వయంగా పర్యవేక్షించేది.


పిల్లలు కాస్త పడి చదివి ముగ్గురూ మంచి ఉద్యోగాలలో స్థిర పడ్డారు. పెద్దవాడు చంద్ర శేఖరం  పెళ్లి అయిన ఏడాదికి సత్యదేవ్ డ్యూటీ లో ఉండగా గుండెపోటు తో మరణించాడు. మిగతా ఇద్దరకూ వారు ఇష్టపడిన పిల్లలతో పెళ్ళిళ్ళు జరిపించింది ప్రియదర్శిని.


కోడళ్ళు ముగ్గురూ చదువుకున్నవాళ్ళు కావడం తో తానూ వారి ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో తన మీద గౌరవంతో విన్నా, ఆ మాటలు ఆచరణలో పెడచెవిన పెట్టినట్టు గమనించింది ఆమె. ఆ విషయం తన పిల్లలకు చెబితే వాళ్ళ సంసారాలలో చిచ్చు పెట్టిన దానినౌతాననే భావనతో తానూ వ్యవసాయం నిమిత్తం గ్రామంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు పిల్లలకు తెలియచేసి వారెంత వారించినా వినకుండా ఆనాటినుంచి తనకు తానుగా బ్రతుకుతోంది. ఒకవేళ పిల్లల ఇళ్ళకు వెళ్ళినా అందరినీ చూసేసి, ఆ సాయంత్రానికే తన గ్రామానికి చేరుకోవడం ఆమెకు అలవాటైపోయింది. ఎవరికీ ఏ సాయం కావాల్సివచ్చినా ఆత్మబంధువు లా ఆడుకునే ఆమె అంటే వూరందరికీ కొలువు కాని దేవతయే.


                             *  *  *


         ప్రియదర్సినిగారి మరణ వార్త విని వూరు ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె పార్దివదేహం ముందు కూర్చున్న ముగ్గురు కొడుకులు పేగులు తెగేలా రోదిస్తున్న దృశ్యం తో ఆ ప్రాంతమంతా కన్నీటి సాగరమైంది. చంద్రశేఖరం చేతిలోని ఉత్తరం మాత్రం తల్లి అందించిన సందేశ సారంశం మోస్తున్న ఆనందంతో రెపరెపలాడుతోంది. అందులో ఇలా ఉంది:


‘’ నా పిల్లలందరినీ ఆశీర్వదిస్తూ అమ్మ వ్రాయునది.


నాన్నా చందూ.ఇంటికి పెద్దవాడవు నువ్వు. పుట్టిన ప్రతీ మనిషీ గిట్టక మానడు. అందుకే తారీకు వేయకుండా దీనిని రాసి భద్రంగా నా బాగ్ లోనే ఉంచుకున్నాను.


మీకు కొన్ని ముఖ్య విషయాలు తెలియచేద్దామని ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ నాన్నగారు బ్రతికి ఉండగా నేను రెండు వరాలు కోరాను. ఆయన వాటిని విని ఎంతగానో సంతోషించారు. అలా చేస్తే తన ఆత్మ సంతోషిస్తుందని నాకు మాట ఇచ్చారు. మా ఇద్దరిలో ఎవరు ముందు కాలం చేసినా రెండోవారు వాటిని అమలు చేయాలని ఒప్పందం చేసుకున్నాం.


మొదటిది... మీకు బాధ కలిగించవచ్చు. మాకున్న 12 ఎకరాల ఆస్తిని ఒక్కొకరికి 4 ఎకరాల చొప్పున పంచాము. అయితే ఆ ఆస్తిని దాని ఫలాలను మీకు అనుభవించే హక్కుమాత్రేమే. వాటిని మీ పిల్లలు మేజర్లు అయాకా సమానంగా అప్పగించాలి. తాతగారు మీకు ఈ బహుమతి ఇచ్చారు అని వాళ్ళకి తెలియచేయాలి.ఆ బాధ్యత మీది.


మీరు కూడా మీ పిల్లలకు ఆస్తులు ఇవ్వకండి. వాటిని మీ పిల్లలు అనుభవించే హక్కు కలిగించి మీ మనవలకు చెందేలా రాయండి.ఇది కేవలం బాధ్యత నేర్పడం కోసమే.


ఇక రెండవ విషయం. నేను ఉన్న ఇల్లు. నా చిన్నప్పుడు ఈ గ్రామంలో గ్రంధాలయం ఉండేది కాదు. తాతగారు కొన్న ఎన్నెన్నో పుస్తకాలు నా దగ్గర బీరువాలలో భద్ర పరిచాను.అన్నీ నేను చదివినవే. నేను డిగ్రీ లో ఉండగా మన వూరికి గ్రంధాలయం మంజూరు అయింది. అయితే అది శిధిలావస్థ భవనంలో ఇప్పటికీ నడవడం బాధాకరం. ప్రభుత్వానికి ఎన్నెన్నో విజ్ఞప్తులు నేనూ పంపాను. కానీ ఫలితం శూన్యం.మనిషికి ఎంత తింటే సంతృప్తి? అదే వూరికి ఉపయోగపడే ఒక మంచి పని చేస్తే? అందుకే మీ నాన్నగారి అనుమతితో నా పసుపు-కుంకుమ అయిన ఈ ఇంటిస్థలాన్ని గ్రామ గ్రంధాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంతోషంగా దానం ఇస్తున్నాను నాన్న. అ భవనాన్ని మీ అన్నదమ్ములు ముగ్గురు దగ్గరుండి ప్రారంభం చేయించాలి నాన్న.ఈ ‘’చదువులమ్మ చెట్టు నీడలో’’ ఈ గ్రామంలోని పిల్లలందరూ భావి భారత పౌరులై మన గ్రామాన్ని దేశపటం లో నిలబెట్టాలి. అదే మా దంపతుల రెండవ కోరిక నాన్నా. మా ఇద్దరి ఆసీసులూ మీకు ఎల్లపుడూ ఉంటాయి.


ఆశీస్సులతో – అమ్మ.’’


                             సమాప్తం


 


 


 


 


 


 


 


 


 


 


 




 


 




 





Rate this content
Log in

Similar telugu story from Drama