ఉదయబాబు కొత్తపల్లి

Action Classics Inspirational

4  

ఉదయబాబు కొత్తపల్లి

Action Classics Inspirational

"సమాంతర బంధాలు"(కథ)

"సమాంతర బంధాలు"(కథ)

5 mins
470


సమాంతర బంధాలు( కధ ) - కొత్తపల్లి ఉదయబాబు (సికింద్రాబాద్)


 


అమ్మ అబ్దికం. ఈసారి వంతు ఆఖరి తమ్ముడి ఇంట్లో. 


నేను, జానకి లోపలకు అడుగుపెడుతూనే మొహాలు చూసుకున్నాము.


ఆ విశాలమైన హాల్లో సుమారు పదిమంది ఉన్నారు , మమ్మల్ని చూస్తూనే తప్పదన్నట్లు పెద్ద మరదలు ‘’రండి.. రండి బావగారు, రా అక్క’’ అంటూ ఆహ్వానించింది . ఆమెకి వంత పలికింది ఆకలి మరదలు క్షితిజ .


 సోఫాల్లో , డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ ల్లో అందరూ ఎవరి సెల్ఫోన్లతో వారు బిజీగా ఉన్నారు. 55 అంగుళాల టీవీ తన సామర్ధ్యం కొద్దీ పనిచేస్తోంది. ఇష్టమైన వాళ్ళు ‘హాయ్ బాగున్నారా’ అని పలకరించారు. తమ్ముడు కొడుకులు ‘హాయ్ పెదనాన్నగారు’ అంటూ ఏదో పని ఉన్నట్లు తమ గదుల్లోకి వెళ్లిపోయారు. 


 డైనింగ్ టేబుల్ దగ్గర రెండు కుర్చీలు ఖాళీగా అవడంతో నేను జానకి కూర్చున్నాము. తమ్ముడు బావమరిది., అతని స్నేహితులు మరో ఇద్దరు కాబోలు ఎవరెవతో నాకు అంతగా తెలియదు. తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు.


 మరదలు తల్లి వచ్చి మంచినీళ్లు అందిస్తూ’ బావున్నావా’ అని పలకరించింది నన్ను .’’బాగున్నానండి. మీకు తెలియంది ఏముంది? మోకాళ్ళ నొప్పులు. అరికాలి మాటలు. క్రింద కూర్చోలేను. కూర్చుంటే లేవలేను. ఇంటికి పెద్ద కొడుకుగా పితృకర్మలు తప్పు కదా. మీ ఆరోగ్యం బాగుంటోందా” అని అడిగాను.


‘’ఆ ఏదో నడుస్తోంది. తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఏ కూతురు అవసరం ఉంటే వాళ్ళింట్లో వాలాల్సిందే. ఇక మగపిల్లలు అంటావా . ..పెద్దాడు బెంగళూరు. చిన్నోడు వైజాగ్. ఇదిగో ఇక్కడేదో పెళ్లి ఉందని వాడు . వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. కాఫీ తెస్తాను’’ అంటూ వెళ్ళిపోయింది ఆవిడ.


క్షితిజ. జానకి కబుర్లలో పడ్డారు. ఫోన్లో సందేశం రావడంతో నేను సెల్ఫోన్ తీసుకున్నాను చేతిలోకి.


 


మనిషి జీవితంలోకి వైరస్ లా ప్రవేశించి అవసరాన్ని మించి జీవితాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత క్షణక్షణ అవసర సాధనం అది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్న పెద్దల మాటలు నూటికి 150% వర్తించే వస్తువు ప్రస్తుతం ప్రపంచంలో ఇదే.


‘’ మీ అన్నయ్య వదిన వచ్చారు. పలకరించారా?’’ మొగుడిని మోచేత్తో పొడుస్త గుసగుసగా అన్న మాటలు విని ‘హాయ్ రా అన్నయ్య ఎలా ఉన్నావు? ఎలా ఉంది ఒంట్లో? ‘’ అంటూ నా పక్కన జానకి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు తమ్ముడు.


“బాగానే ఉన్నాను’’ ముక్తసరిగా.


‘’ ఏమిటో రా వెధవది. అమ్మ తద్దినం మా ఇంట్లో పెట్టుకునే అదృష్టం వచ్చిందీ అనుకుంటే. భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా దొరకడం లేదు. అలా తయారయ్యాయి ఉద్యోగాలు’’ అన్నాడు.


‘’ఏమైంది’’


‘’ ఏముంది? ఆడిట్ జరుగుతోంది. ఈ వేళ ఆఖరి రోజు. మా  సెక్షన్ ఆఫీసర్ ని ‘ ఈ వేళ మా అమ్మగారి ఆబ్దికం. సెలవు కావాలి’ అంటే ‘ఇంకా ఈ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏంటయ్యా?’’’ అంటాడు. ఒక రెండు గంటలు కార్యక్రమంలో పాల్గొని వచ్చేయ్యి. అంతే తప్ప ఆడిట్ రోజుల్లో సెలవులు ఒప్పుకోరు అని మీకు తెలుసు కదా? అన్నాడు’’


నేను విరక్తిగా నవ్వుకున్నాను. నా ఫోన్లో డిస్ప్లే మీద చిన్నోడి- అంటే నా తర్వాత తమ్ముడు మెసేజ్ .


‘’అన్నయ్య. మీ మరదలికి చికెన్ గున్యా. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకు వచ్చాను. నేను రాలేకపోతున్నాను. ఎలాగూ నీ మీద చేయి వేసి ‘మమ’ అనుకునేవాళ్ళమే. డబ్బు ఆఖరివాది అకౌంట్ కి ఆన్లైన్ లో పంపాను. అన్యదా భావించకు’’.


 


 ఆ సందేశం అలాగే ఆఖరి వాడికి చూపించాను. డబ్బులు ఎకౌంట్లో పడ్డాయి అన్న మాటకి కాబోలు వాడి కళ్ళు మెరిసాయి.’’అయితే చిన్నన్నయ్య రావడం లేదన్న మాట. క్షితీ ! మీ చినబావగారు రావడం లేదు.’’ అన్నాడు నవ్వుతూ.


 ఆ నవ్వులో హేళన నా గుండెను తాకింది.


 ‘’సరుకులు అన్నీ తెచ్చేసారా అమ్మాయి?’’ అడిగాను క్షితిజని.


‘’ అయ్యో ఎక్కడ తెచ్చారు? ఎవరు తెచ్చారు బావ గారు? అవన్నీ నేను చూసుకోవాల్సిందే. పొద్దున పోతారు. రాత్రికి వస్తారు. వస్తూనే ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుని టీవీ ముందు సెటిల్ అయిపోతారు. ఒక కన్ను టీవీ మీద ఒక కన్ను ఫోన్ మీద. ఎవరని పిలిచినా ఉలకరు.. పలకరు ఎవరికి కావలసింది వాళ్ళు తినేసి ఎవరి గదుల్లొకి వాళ్ళు వెళతారు. శనివారం ఆదివారం సెలవు అన్న మాటే గాని ఫ్రెండ్స్ ఇళ్ళకి, సైట్ సీఇంగ్ కి సరిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే గాని - నేను. అక్క ఇప్పుడు వెళ్లి తెచ్చేస్తాము. అంది క్షితిజ.


 


‘’ఆడవాళ్ళు మీచేత పని చేయించడం ఏంటమ్మా? పెద్దవాడిని నేను ఉండగా! ఆ జాబితా ఇస్తే నేను తెచ్చేస్తాను.బైక్ ఖాళీగా ఉందా ఎవరిదైనా?’’ అని అడిగాను.


 


‘ వాళ్ళ అమ్మ తద్దినానికి అన్ని స్వయంగా చూసుకోవడం ఆయనకి ఇష్టం క్షితీ.మన ఇళ్లల్లో సరుకులు మనం తెచ్చుకోపోతే ఈ మగాళ్ళు తెస్తున్నారా ఏమైయినా?అయినా బైక్ మీద అన్నీ సరుకులు ఎలా తెస్తారు?అందరం డబ్బులు వేసుకుంటున్నాం కదా. ఆటోలో వెళ్లి ఆటోలో రండి.’’ అంది జానకి.


 ఎంత వద్దనుకున్నా అత్తగారి మీద ఏదో మూల ఉన్న కసిని నామీద చూపిస్తూ.


 


క్షితిజ రెండు రిలయన్స్ సంచులు, ఒక వైరు బుట్ట పట్టుకొచ్చి ఇచ్చింది.


‘’సరే నేను వెళ్లి వస్తాను. సరుకులు నా వాటా డబ్బులతో తెచ్చేస్తాను.’’ అని లేవబోయాను.


బుల్లోడు అంటే నా మూడో తమ్ముడు ఫోను. ‘’అన్నయ్య! నువ్వు వదిన క్షేమంగా తమ్ముడి ఇంటికి చేరారా? ఈసారి రాలేకపోతున్నాను. మీ మరదలు మేనమామ పోయాడు. మూడు రోజులు పక్షిణి. చూస్తూ చూస్తూ ఇంట్లో కలుపుకోలేము గా. ఆఫీసర్ ని బతిమిలాడితే రెండు రోజులు వర్క్ ఎట్ హోమ్ ఇచ్చాడు ఏడుస్తూ.


మూడో రోజు సెలవు పెట్టేస్తాను. కార్యక్రమం చేయాల్సిందంతా నువ్వేగా. మేము ఎలాగూ ‘మమ’ గాళ్ళమే. డబ్బులు ఆఖరి తమ్ముడి ఎకౌంటు లో నిన్ననే ఆన్లైన్ లో పంపేశాను. అందరికీ అడిగానని చెప్పు. ఉంటా బై’’ అని కట్ చేశాడు.


 


‘’జీవితంలో చెడుకాలం అనేది రాకపోతే పరాయి వారిలో మన వాడెవడో తెలుసుకోలేము - మనవారిలో పరాయి వాడెవడో తెలుసుకోలేము’’ అని ఎక్కడో చదివిన వాక్యము గుర్తుకు వచ్చింది.


 


సంచులు పుచ్చుకుని వెళ్లి కావాల్సిన సరుకులన్ని ఒక్కటి మిస్ కాకుండా చెక్ చేసుకుని మరీ తెచ్చాను.


‘’బ్రహ్మ గారు ఏ టైం కి వస్తామన్నారు?’’ అడిగాను ఇంటికి వచ్చాక క్షితిజని.


 


‘’10 అంటారు గాని 11:30 కు వస్తే గొప్పే బావగారు. బ్రహ్మ గారికి 3000, భోజనం చేసే బ్రాహ్మణులకు పంచె- కండువా తో పాటు ఒక్కరికీ వెయ్యి రూపాయలు..వంటావిడికి 2500, మిగతావి సరుకుల ఖర్చులు.  సాయంత్రం మిగిలినవన్నీ పనిమనిషికి, వాచ్ మన్ కి పంచుకోవడం. ఏంటో? ఎవరు కనిపెట్టారో, ఎందుకు పెట్టారో అర్థం కాదు. చాకిరీ లు చేసి చేసి మరలు ఆగిపోతున్నాయి అనుకోండి. ఏడాదికి ఒక రోజు అయినా అందరికీ శ్రమే.’’


 


 ‘’సమాజం ముందుకు నడవాలి అంటే పెద్దలు అనుసరించిన సంప్రదాయాలు అనుసరించాలి, ధర్మాలు పాటించాలి. అవి ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహించే గంగా ప్రవాహం అంత పవిత్రమైనవి. ‘ ధర్మో రక్షతి రక్షితః’ అన్న పెద్దల వాక్యంలో భగవదారాధన దాగి ఉంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలా మన ధర్మం మనం ఆచరించడమే భగవదారాధన. ఈ విషయం తెలిసి కూడా అనుసరించని పరాన్నజీవుల వంటి చదువుకున్న మూర్ఖులతో ఎటు పోతోందో తెలియడం సభ్యసమాజంలో బతికేస్తున్నాం. ప్రబలుతున్న 

అధర్మం, అవినీతీతో రాక్షసత్వం ప్రబలి సంఘటితంగా ఉండవలసిన ప్రజలు ఒకరినొకరు చంపుకుని సమాజం పతన దిశగా ప్రమాద స్థాయికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు అనిపించింది నాకు.


 


దానికి కారణం సమాజంలో చెప్పేవాడే తప్ప ఆచరించేవాడు లేకపోవడం. తాను చెప్పిందే వేదం. చేసేదే విధానం అనుకుని నియంతృత్వంతో ప్రవర్తించడమే తప్ప స్వయంగా సమాజానికి పనికి వచ్చే దిశగా ఆలోచించలేకపోవడం. అలా ఎవరు చెప్పినా అసలు వినే వాడే లేకపోవడం. ఇదే ఈనాటి సమాజం దుస్థితికి కారణాలు.


 


 ఎవరి ఆలోచన వాళ్లది, ఎవరు ప్రయాణించే దారి వారిది అయినప్పుడు మరి నా దారి కూడా నాదే కదా! నా పెదవుల మీద జీవం లేని నవ్వు చూసింది కాబోలు అడిగింది జానకి.


"వేదాంతం ఆలోచించుకుంటున్నారా... సరే టిఫిన్ చేసి పడుకోండి.  మళ్ళీ నిద్ర చాల లేదంటారు. రేపు మూడు గంటలపాటు శాస్త్రోక్తంగా కార్యక్రమం చేయాల్సింది మీరే. అప్పుడు గానీ మీ అమ్మగారి ఆత్మ సంతోషించదు.’’ అంటూ టిఫిన్ నా ముందు ఉంచింది. తిని హాల్ లోనే దివాన్ కాట్ మీద నిద్రకు ఉపక్రమించాను నేను.


***************


 


నిద్ర పడితే గా! అమ్మ పోయాక అందరూ 13 రోజులు తప్పక, నిప్పులమీద ఉన్నట్టు ఉన్నారు. 13వ రాత్రి ఎవరి వాటా వస్తువులు, డబ్బు అన్ని పూచికపుల్ల వదలకుండా పట్టుకెళ్లారు.


అమ్మ అస్తికలు కాశీలో కలపాలన్న ఒక నిర్ణయంతో స్మశాన వాటిక లోని ఉంచడం జరిగింది. కానీ నెలలోపే గ్రహణం రావడంతో ‘మూడు రోజులు సెలవు పెట్టుకొని రండర్రా’ అని తాను ఎంత చెప్పినా, ఎంత పోరినా మాకు కుదరలేదు అంటే, మాకు సెలవు దొరకలేదు అని ఒక్కతమ్ముడూ రాలేదు. చివరకు పెద్దమామయ్య సలహాతో నేను, జానకి కాశీ ప్రయాణం పెట్టుకుని, కాశీ, గయ, ప్రయాగ, బ్రహ్మకపాలం లలో అన్నిచోట్ల శాస్త్రోక్తంగా పిండప్రదానం నిర్వహించి వచ్చాము.


 


నాకు అర్థమైనది ఏమిటంటే ఈ ‘సమాంతర బంధాల’లో ఎవరికి ఎవరు తోడు రారు అని!


నా తర్వాత చిన్న తమ్ముడు పెళ్ళాం చాలా తెలివైంది. మొదటి సంవత్సరంలో 15 మాసికాలు వచ్చాయి. పెద్ద కొడుకుగా అమ్మ నా దగ్గర ఉండగానే హాస్పిటల్లో మరణించడం వల్ల మా ఇంట్లోనే చేస్తానని అందరికీ చెప్పాను.


 


‘మొత్తం ఖర్చు 4 వాటాలు వేయాల్సిందే. ఒక్కోక్క నెల వంతుల వారీగా ఒక్కొక్కరి ఇంట్లో చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ మూడేసి వేలు వేసి ఎవరి ఇంట్లో ‘వంతు’గా ఆ కార్యక్రమం జరుగుతుందో అక్కడ శాస్త్రప్రకారం జరిపి తగులో మిగులో ఎవరూ లెక్క చెప్పనవసరం లేదు అని తీర్మానించడం తో , దానిని అందరూ ఆమోదించడంతో  మనసులో బాధ పడినా పెద్దరికంగా అంగీకరించాను.


 


నాకు ఆ ఆలోచన మరో కోణంలో నచ్చింది. ఈ వంకతో తమ్ముళ్లు అందరిని కనీసం ఒక్కసారి అయినా చూడవచ్చు అనుకున్నాను. అమ్మ నాన్న తర్వాత క్షేమ సమాచారాలు తెలుసుకోవడం ప్రాథమిక బాధ్యత అనిపించింది. ఈ కార్యక్రమం అమ్మ పోయి నాలుగేళ్లైనా కొనసాగుతోంది . ఈసారి ఆఖరి తమ్ముడు ఇంటికి ఈ విధంగా రావాల్సి వచ్చింది.


***************


 


కార్యక్రమం అంతా సజావుగా జరిగింది. అవసరమైనప్పుడు పైకి లేస్తూ, లేవ లేనప్పుడు మోకాళ్ళమీద ఆనుకుంటూ, నొప్పులు పంటిబిగువునా భరిస్తూ జన్మ ఇచ్చిన అమ్మ పట్ల పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో కార్యక్రమం పూర్తి చేశాను. దాదాపు బ్రాహ్మల భోజనానంతరం చేస్తున్న పిండప్రదానం సమయంలో ఆఖరి తమ్ముడు హడావిడిగా వచ్చి తన వంతు కార్యక్రమాలు ‘మమ’ అనుకుంటూ నిర్వహించాడు.


 


 భోజనాలు పూర్తయ్యేసరికి 4:00 అయింది. అప్పటికే విపరీతమైన నీరసం వచ్చేసింది. మనసులో కన్నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా అనుకున్నాను.


 


‘’ అమ్మా !!! జన్మనిచ్చి నన్ను ఇంతటి వాడిని చేసావు. ఈ జీవితం నువ్వు పెట్టిన బిక్ష. ఎన్నో కష్టాలకు ఓర్చి మమ్మల్ని అందరినీ పెంచి . నాన్న గారి సహకారంతో ప్రయోజకుల్ని చేశావు. తల్లా? పెళ్ళామా? అని చాలా మంది ప్రశ్నించుకుంటూ ఉంటారు . ఈ జన్మ ప్రసాదించిన తల్లే ముందు అంటాను నేను. భార్య మనతో జీవితాన్ని పంచుకుంటుంది.


 


 సహజంగా తల్లిదండ్రులే ముందుగా పిల్లల కంటే పై లోకాలకు వెళ్లిపోతారు. ఆ స్థాయిని నేను చేరుకున్నాను అనిపిస్తోంది . ఇకమీదట ఇంత శాస్త్రోక్తంగా నీ ‘పూజ’ చేయలేకపోతే పెద్ద మనసుతో నన్ను క్షమించి దీవించమని వేడుకుంటున్నాను. మళ్లీ ఆబ్దీకానికి బతికి ఉంటానో... లేదో. అలాంటి సమాంతర బంధాల మధ్య బతుకుతున్న మమ్మల్ని చల్లగా కాపాడు’’.


 


 మరో రెండు గంటలలో మేము ఎక్కిన రైలు మా ఊరి వైపు బయలుదేరింది.


 


 సమాప్తం


 


 


 


 


 


 


 


 Rate this content
Log in

Similar telugu story from Action