అందని ప్రేమ!
అందని ప్రేమ!
ప్రియ నేస్తం,
ఈ రోజు ఎం రాయాలో ఎందుకు రాయాలో తెలియని సందిగ్ధంలో పడేసావు.నేను ప్రేమించినంత ఎదుటివాళ్ళు నన్ను ప్రేమించటం లేదంటే బాధపడతాను.
నీ మీద నా ప్రేమ ఎప్పుడు మొదలైందో ఒకసారి వెనక్కి వెళ్లి నా అక్షరాల్లో వెతుక్కోవాలి.
ఎంత వద్దనుకున్నా నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. నిశ్శబ్దపు చీకటి గదిలో నా ప్రేమ దీపాన్ని వెలిగించి,నీ జ్ఞాపకాల అలల మధ్య ఒంటరిగా కూర్చొని రాసుకుంటా..
ప్రియా,
నీ దోసిలిలో నీటినైనా కాకపోతిని
నీ తనువును ముద్దాడేదాన్ని,
నువు చూసుకునే అద్దం అయిన కాకపోతిని
నాలో నిన్ను చూసుకుంటున్నావని ఆనందపడేదాన్ని,
నువు పీల్చే గాలినైనా కాకపోతిని,
నీ శ్వాసకు ఉపిరి నేనని మురిసిపోయేదాన్ని,
నువు నడిచే దారినైనా కాకపోతిని
నీ పాదస్పర్శ సోకి నా జన్మ ధన్యత పొందిందని సంతృప్తి పడేదాన్ని ..
జీవితంలో నిన్ను కలుసుకునే అదృష్టం నాకు లేకపోయినా,
ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతిరోజు నన్ను పలకరిస్తానని మాట ఇచ్చావు. ఆ మాటను నిలబెట్టుకుంటావని నమ్మకం తోనే ప్రతిరోజు ఎదురుచూస్తాను .. మనిషిని బతికించేది నమ్మకమే కదా నేస్తం. ఆ నమ్మకం లేని రోజు ప్రేమ కు ,బంధాలకు విలువ లేదు.
>
అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను నిన్ను ప్రేమించటం కంటే ప్రేమిస్తున్నాను అనే భావనను ఎక్కువ ప్రేమిస్తున్నానెమో అని. బహుశా నీకు అలానే అనిపించింది ఏమో కదా అందుకే వెళ్ళిపోవాలి అనుకున్నావు. నా హృదయపు కోవెల తలుపులు తెరుచుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడా కోవెల నా కన్నయ్య లేని గుడిలా శిలా ప్రతిమల కళావిహీనం అయిపోయింది.
నా మది కోవెల ద్వారం నీ రాక కోసం ఎప్పుడు తెరిచేవుంటుంది. నీకు స్వాగతం తెలపటానికి నా పంచప్రాణాలు దోసిలోలో నింపుకొని నిన్ను అభిషేకించటానికి జీవితకాలం ఎదుచూస్తూవుంటాను.
నీ ప్రేమను అందుకోవాలని ఆరాటం..
అందుకోలేకపోయాను అనే ఆవేదన ల మధ్యలో
నన్ను నేను కోల్పోతున్నాను.
నేస్తమా ఇన్నాళ్లు నేను నీ హృదయాంతరాలలో ఎక్కడో పదిలంగా ఉన్నాను అనుకున్నాను
నా ఆనందాన్ని.. ఆవేదనను నీతో పంచుకున్నాను. కానీ నీ శ్వాసతో బయటకు నెట్టబడి కరిగి కన్నీటి చుక్కయి నేల రాలి ఆవిరై అనంతవిశ్వంలో కలిసిపోతున్న.. నేను వెళ్ళిపోవటం నీకు ఆనందాన్ని ఇస్తే నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది నేస్తం.
ఇక సెలవా మరి!
శ్రీ...
హృదయ స్పందన.
.