"Tirumalasree" PVV Satyanarayana

Tragedy

5  

"Tirumalasree" PVV Satyanarayana

Tragedy

ఆత్మాహుతి

ఆత్మాహుతి

6 mins
93


ఆత్మాహుతి

రచనః తిరుమలశ్రీ

***

     బాలభానుడి నులివెచ్చని కిరణాల తాకిడికి మెల్లగా కన్నులు తెరచాను. నేను ఈ జగతిలో ఉదయించి ఎంతోసేపు కాలేదు.

    భాస్కరుడి ఉషఃకిరణాలు అంతటా వ్యాపించి ప్రకృతిని ఉత్తేజపరుస్తూంటే…శీతలపవనాలు మేనులను సేదదీరుస్తూంటే…మధురిమలు నిండిన పక్షికూజితాలు వీనులవిందు కావిస్తూంటే…ఆ శీతాకాలపు ఉదయం ఎంతో హాయిగా, పరవశనీయంగా ఉంది.

    ఆనందోత్సాహాలతో పరిసరాలను పరికించాను. రకరకాల పూలమొక్కలతో, రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా ఉంది ఆ వనం. వివిధ జాతులకు చెందిన సుమాలు ఆ వనాన్ని అలంకరిస్తున్నాయి, అలరిస్తున్నాయి.

    నల్లగా నిగనిగలాడుతూ, శరీరధారుఢ్యం ఆపాదించిన పొగరుతో…పరువంలో ఉన్న పూబోణులను పరామర్శించుతూ, వాటికి రసికత్వాన్ని రుచిచూపిస్తూన్న గండుతుమ్మెదల వంక సంభ్రమంతో కన్నులు విప్పార్చుకుని చూసాను. ఆకర్షణీయమైన పంచవర్ణాల ఉడుపులతో వనమంతా తమదేనన్నట్టుగా విహరిస్తూన్న అత్యంత సుందరమైన సీతాకోకచిలుకలు…వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాయా అన్నట్టు అంతటా గెంతుతూన్న పచ్చటి మిడతలూ…భూమిలోంచి వెలుపలికి వచ్చి సూర్యకిరణాల వెచ్చదనాన్ని ఒంటికి దట్టించుకుంటూన్న వానపాములు…కనులపండువుగా ఉంది. అన్ని అందాలను, విశేషాలను ఇముడ్చుకున్న ఆ ప్రకృతి ఎంతో అద్భుతంగా తోచింది నాకు. అంతటి ఆహ్లాదకరమైన ప్రకృతిమాత ఒడిలో నేనూ ఓ బిడ్డనయినందుకు ఎంతో ఉత్సాహంగా, కించిత్తు గర్వంగా అనిపించింది.

     “చామూ!” చుట్టూ నెలకొన్న ఆ రమణీయ ప్రకృతిని నేను మైమరచి ఆస్వాదిస్తూంటే మమ్మీ పిలుపు వినిపించింది.

    ‘చామంతి’ జాతి చిన్నారిని నేను. మమ్మీ ముద్దుగా ‘చామూ’ అని పిలుస్తుంది నన్ను. చుట్టూ – రకరకాల ఛాయలతో, వివిధ ఆకృతులలో, వివిధ వయసులలో ఉన్న నా జాతివారిని గుంపులుగా చూస్తూంటే ఆనందంగా ఉంది నాకు.

     “చామూ!” మమ్మీ మళ్ళీ పిలవడంతో, నా చూపుల్ని తనవైపు మళ్ళించాను. మమ్మీ నా కంటికి అత్యంత సుందరంగా కనిపించింది – ఆ వనంలోని అందరికంటే, అన్నిటికంటేను!

     “ఏం చూస్తున్నావు చిట్టితల్లీ?” మందహాసంతో అడిగింది మమ్మీ.

    “ఈ ప్రకృతి చాలా అందంగా ఉంది మమ్మీ!” అత్యుత్సుకతతో చెప్పాను. “క్రిందకు ఉరికి ఆ పచగడ్డి తిన్నె మీద తనివిదీరా దొర్లాలని ఉంది నాకు. ఆ రమణీయ సీతాకోకచిలుకలతో కలసి వనమంతా విహరించాలని ఉంది. పచ్చటి మిడతలతో పాటు వెచ్చటి కిరణాలతో దుముకుడు ఆట ఆడాలని ఉంది”.

     ప్రేమగా నా బుగ్గలు పుణికింది మమ్మీ. “మనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి బేబీ! భగవంతుణ్ణి, మానవుణ్ణీ అలంకరించడానికీ అలరించడానికీ పుట్టాం మనం. అలా విచ్చలవిడిగా సంచరించే అదృష్టం మనకు లేదమ్మా” అంది మృదువుగా.

     మమ్మీ పలుకులు నా కనులను వెడల్పుచేసాయి ఆశ్చర్యంతో. ఉదయం సమీపం నుండి వినవచ్చిన గంటలు…అవి దేవుడి గుళ్ళోంచి వచ్చాయని మమ్మీ చెప్పడమూ హఠాత్తుగా గుర్తుకొచ్చాయి.

     “గంటగంటకూ నువ్వు వయసు పోసుకుంటున్నావు చిట్టితల్లీ!” మళ్ళీ అంది మమ్మీ.

     “వయసు రాగానే ఆ గుళ్ళోని దేవుడి మెడలోకి నేను చేరతానా మమ్మీ?” అమాయకంగా అడిగాను.

    మమ్మీ చిన్నగా నిట్టూర్చింది. “చెప్పలేమమ్మా. నిన్ను నువ్వు తాజాగా ఆ దేవుడికి సమర్పించుకోవాలనుకున్నా, పోకిరి తుమ్మెదలు నీ పవిత్రతను చెడగొట్టాలని చూస్తాయి. అంతేకాదు…గాలి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా గాలి తాకిడికి రాలి, క్రింద ఉన్న మురికికుంటలో పడి వయసు చెల్లకుండానే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది” హెచ్చరించింది మమ్మీ.

     క్రిందికి తొంగిచూసాను. పెద్ద మురికికాలువ ఒకటి బాగా లోతులో పారుతోంది. నాగుండె ఝళ్ళుమంది. అంతవరకు దాన్ని చూడనేలేదు నేను.

     “అన్నట్టు బేబీ…నీ అక్కయ్యలు కొందరు ఈ రోజు మనకు దూరం కాబోతున్నారమ్మా” అంది మమ్మీ మళ్ళీ.

     “ఎందుకు మమ్మీ? ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళు?” నా గొంతులో కుతూహలం తొంగిచూసింది.

     నిట్టూర్చింది మమ్మీ. “వారి గమ్యం వారి కర్మఫలంతో ముడిపడివుంటుంది” అంది.

     నాకేమీ అర్థం కాలేదు. నా ముఖకవళికలు గమనించిన మమ్మీ వివరించింది – “మన పుట్టుక పరుల సేవ కోసమేనమ్మా. ఆ మాటకొస్తే భగవంతుని సృష్టిలో అందరూ అంతే! అయితే నువ్వు ఎవర్ని సేవించాలన్నది నీ అదృష్టంపైన ఆధారపడివుంటుంది…”

     ఆసక్తితో చెవులు రిక్కించాను.

     “మనవి అత్యంత అల్పజీవితాలు. మానవుడు మనల్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటాడు…” మమ్మీ చెప్పుకుపోయింది. “మనల్ని భక్తితో భగవంతుడికి అర్పించవచ్చును. లేదా రక్తితో తమ స్త్రీల జడలలో ముడవవచ్చును. ఐతే ఎలాంటి స్త్రీ తలకు అలంకరిస్తున్నారన్నది కూడా ఆలోచింపదగ్గ విషయమే. అంతేకాదు, మనల్ని శవాలంకరణలో సైతం ఉపయోగించడం జరగొచ్చును…”

     మమ్మీ చివరి పలుకులు నా శరీరాన్ని గగుర్పొడిపించాయి.

     “అయితే బేబీ…సేవ సేవే! నీ సేవలో నిజాయితీ ఉన్నప్పుడు, నిన్ను నువ్వు పవిత్రమైన మనస్సుతో అర్పించుకున్నప్పుడు – ఎవరి సేవకు అంకితమవుతున్నావన్నది అనవసర ప్రశ్న!”

     మమ్మీ చెబుతూంటే నేను శ్రద్ధగా ఆలకిస్తున్నాను, తన పలుకులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. ఆ తరువాత మమ్మీ నాకెన్నో కొత్త విషయాలు చెప్పింది. ప్రకృతి గురించి, ప్రకృతిలోని జీవుల గురించి, మనుషుల గురించి, వారి నైజాల గురించి…ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతూంటే కుతూహలంతో ఆలకించాను.

     ఆదిగో…అప్పుడే…ఆరంభమయింది హఠాత్తుగా ప్రకృతిలో కంపన! వాతావరణంలో పెనుమార్పు వచ్చింది. చిరుగాలిగా మొదలై క్షణంలో విజృంభించింది – ఆ వనాన్ని గొప్ప క్షోభకు గురిచేస్తూ. చూస్తూండగానే గాలికి పెద్ద వర్షం కూడా తోడయింది. మొక్కలు, వృక్షాలు, పక్షులూ భయాందోళనలతో అల్లాడిపోయాయి. అంతవరకు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉన్న ప్రకృతి భీభత్సానికి గురయింది.

     వర్షంలో తడవడం నాకు సరదాగానే ఉన్నా, గాలితాకిడికి తట్టుకోవడం కష్టంగా ఉంది. క్రింద ఉన్న మురికికాలువలో పడిపోయి చచ్చిపోతానేమోనని భయం వేసింది. గట్టిగా అరచాను – “మమ్మీ! రాలిపోయేటట్టున్నాను. ప్లీజ్! నన్ను కాపాడు…ఐ లవ్ యూ మమ్మీ!”

     మమ్మీ అనునయంగా నన్ను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించింది.

     “నన్ను గట్టిగా పట్టుకో మమ్మీ! నిన్ను విడిచి పోవాలని లేదు నాకు. జీవించాలనివుంది…నా పూర్తి జీవితం…” బ్రతిమాలాను.

     ఆ ఉధృతానికి…మమ్మీ – ఓ పెద్ద చామంతి మొక్క – సైతం ప్రమాదంలో ఉందన్న సంగతి నాకు తెలుస్తూనేవుంది. అయినా తాను ఏమాత్రం ధైర్యం కోల్పోయినట్టు కనిపించడంలేదు. వదనంలో ఎటువంటి ఆందోళనా గోచరించనీయడంలేదు. పైపెచ్చు తన సంతానాన్ని సమాయత్తపరచుకుని వారికి ధైర్యం నూరిపోస్తోంది.

     కొంతసేపటికి ఆ ప్రళయం ఆగిపోయింది. ఆ కాస్త సమయంలో సంభవించిన ఉత్పాదానికి యావత్ ప్రకృతీ నాశనమయిపోయినట్టు అనిపించింది. వనమంతటా భీభత్సం జరిగింది. ఆ ధాటికి తట్టుకోలేని ఎన్నో మొక్కలు నేలకు వాలిపోయాయి. ఎన్నో పూలు రాలి మృత్యువు ఒడిలో ఒరిగిపోయాయి. నా బంధువర్గంలో సైతం ఎందరో అసువులు బాసారు. మమ్మీ వదనం విచారంతో వాడిపోయింది.

     నేనెలాగో నిలద్రొక్కుకుని మనగలిగాను. భయాందోళనలు ముప్పిరిగొనడంతో మమ్మీని గట్టిగా పట్టుకున్నాను. భయంలేదన్నట్టు ప్రేమాదరాలతో నా వెన్ను నిమిరింది మమ్మీ.

     కాసేపటికి నా భయం తగ్గి మనసు నెమ్మదించింది. ప్రకృతి మళ్ళీ తన పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

     అంతలో కొందరు మనుషులు బుట్టలు పట్టుకుని వనంలో ప్రవేశించడం కనిపించింది. వయసొచ్చిన పూలను ఒక్కొక్కటే కోయసాగారు వాళ్ళు. వాటిని వివిధ బుట్టలలో వేయసాగారు. కొన్ని దేవుడికోసం, మరికొన్ని మిగతా ఉపయోగాలకనీ చెప్పింది మమ్మీ.

     నాకు కుతూహలంగాను, విచారంగానూ కూడా అనిపించింది. నా విచారణానికి కారణం – నా అక్కలు కొందరు మానుంచి వేరుకావడమే. మమ్మీ ముఖంలోకి చూసాను జాలిగా. తాను దుఃఖిస్తున్నా, ఆ ఛాయలేవీ పైకి కనిపించడంలేదు. తన కళ్ళలోని విషాదపుచారలు మాత్రం నా దృష్టిని తప్పించుకోలేకపోయాయి.

     హఠాత్తుగా స్ఫురించింది నాకు – నా భవిష్యత్తేమిటి? ఏదో ఓ రోజున నేను కూడా నా ప్రియతమ మమ్మీని విడిచి వెళ్ళిపోక తప్పదు! … ఆ ఆలోచనే నన్ను గొప్ప ఆందోళనకు గురిచేసింది. మమ్మీని గట్టిగా కావలించుకున్నాను. “మమ్మీ! ఐ లవ్ యూ మమ్మీ! నిన్ను విడిచి వెళ్ళను నేను” అన్నాను.

     నా మనసు అర్థంచేసుకున్నట్టు, నా భావోద్వేగాలను గుర్తించినట్టూ మమ్మీ నన్ను ప్రేమతో గాఢంగా తన గుండెలకు హత్తుకుని అనురాగంతో నా తల నిమిరింది. నా వంతు అప్పుడే రాదని ధైర్యం చెప్పింది. అయితే, కాలం ఎవరికోసమూ ఆగదట! కాలం అనుభూతులకు అతీతం కూడానట! ఎరిగున్న భవిష్యత్తుకు మానసికంగా సిద్ధం కావాలేగానీ, భయాందోళనలతో కృంగిపోకూడదట. అందువల్ల జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించలేమట!

     మర్నాడు మళ్ళీ మనుషులు వేళకాని వేళలో తోటలో ప్రవేశించారు పూలుకోయడానికి. వారిని చూసి నేను భయపడుతూంటే మమ్మీ నా వెన్ను తట్టింది. నేనింకా పసిదానినేననీ, నా వంతు ఇంకా రాదనీ హామీ ఇచ్చింది. దాంతో నా గుండెలు కాస్త కుదుటపడ్డాయి.

     అంతలో తుంటరి తుమ్మెద ఒకటి వార్త మోసుకొచ్చింది – ప్రముఖ రాజకీయనాయకుడు ఎవరో ఆ ఊరికి వస్తున్నాడట. అతన్ని స్వాగతించే నిమిత్తం నిలువెత్తు పూదండ ఒకటి తయారుచేస్తారట.

     “పాపం…వీళ్ళెవరికీ దేవుడి కంఠసీమను అలరించే భాగ్యం లేదు కదూ మమ్మీ?” అన్నాను నేను కించిత్తు జాలిగా. “పైపెచ్చు రాజకీయనాయకుడి పరం కావడం దురదృష్టం కదూ?”

     నా వంక అదోలా చూసింది మమ్మీ…”పరులసేవ కోసమే పుట్టాం మనం. భగవంతుణ్ణి చేరే అదృష్టం చేజారిపోయాక, ఎవర్ని సేవిస్తున్నామన్న సంగతి అనవసరం. అది ఇల్లాలైనా సరే…లేదా, మనలాగే పరుల సేవలో కర్పూరంలా కరిగిపోయే వెలయాలైనా సరే! మానవసేవే మాధవసేవ!...” అంటూ వేదాంత ధోరణిలో సాగించింది.

     అంతలో మావైపు వచ్చిన ఓ వ్యక్తి దృష్టిలో పడ్డట్టున్నాను నేను – ‘ఈ చిట్టి చామంతిని చూడరా, ఎంత ముద్దుగా వుందో!’ అన్నాడు ప్రక్కవాడితో, నావంకే అబ్బురంగా చూస్తూ. ఉలికిపడ్డాను నేను.

     రెండోవాడు కూడా నావంక చూసి, ‘ఔను, ఎంచక్కా వుంది’ అన్నాడు.

     ‘దీన్ని కోసి గులాబీల మధ్య గుచ్చితే…ఎంత అందంగా ఉంటుందో!’ అని మొదటివాడు అంటే, ‘నిజమే’ అంటూ వత్తాసు పలికాడు రెండోవాడు.

     వారి సంభాషణ నా గుండెల్ని గుభేలుమనిపించింది. భయంగా మమ్మీ వంక చూసాను.

     వారి పలుకులు మమ్మీ కూడా ఆలకించినట్టుంది, వదనం వివర్ణమయింది.

     “వాళ్ళు నిజంగానే నన్ను తీసుకుపోతారా మమ్మీ?” బేలగా అడిగాను.

     “ఈ మనుషుల పోకడలను గ్రహించడం కష్టం బేబీ!” అంది మమ్మీ నిట్టూర్పును గొంతుకలోనే అణచుకుంటూ. ఓదార్పుగా నన్ను అక్కున చేర్చుకుంది.

     భయాందోళనలతో నా గొంతుక పెకల్లేదు. వయసు పోసుకోకుండానే, నా వంతు రాకుండానే…మమ్మీని, నా వాళ్ళనూ విడిచి వెళ్ళడం నాకు సుతరామూ ఇష్టంలేదు. ముఖ్యంగా, ఓ రాజకీయనాయకుడి కంఠాన్ని అలంకరించడం!

     రాజకీయనాయకులు ఎలాంటివాళ్ళో అంతక్రితం మమ్మీనుంచి ఆలకించివున్నాను నేను. ఇప్పుడొస్తూన్న నాయకుడు నక్కజిత్తుల, కుయుక్తుల, కుసంస్కారి. ప్రజాసేవ పేరిట ప్రజలను దోచుకునే స్వార్థపరుడు, నయవంచకుడు, నీతిమాలిన వ్యక్తి. సమాజానికి చీడపురుగులాంటివాడు. రాజకీయనాయకులలో అధికశాతం అలాంటివాళ్ళే నంది మమ్మీ.

     అటువంటి కుటిలుడిని సేవించడం ప్రజాదోహం అవుతుందనిపించింది నాకు. అతగాడి గళాన్ని అలంకరించబోవడం విపరీతమైన దిగులుకు గురిచేసింది…ఆ రాజకీయనాయకుడంటే నా దృష్టిలో ఓ అంటరానివాడితో సమానం. అలాంటివాడి కంఠానికి అలంకారం కావడం...నా పరువును, మర్యాదను, ఆత్మగౌరవాన్నీ భంగపరచే విషయం. అంతకంటే ఓ శవాన్ని అలంకరించడం నాకు మిక్కిలి సంతోషం కలిగిస్తుంది.

     ఆ విషమస్థితి నుంచి ఎలా బైటపడాలో బోధపడలేదు నాకు. నా బాధ మమ్మీతో చెప్పుకున్నాను. ఆ దుస్థితి నుంచి నన్నెలాగైనా బైటపడెయ్యమని మొరపెట్టుకున్నాను!

     నేను ఆ రాజకీయనాయకుడికి అర్పణ కావడం మమ్మీకి కూడా ఇష్టంలేదు. అలాగని తాను చేయగలిగిందీ ఏమీ లేదు. అదే విషయం చెప్పింది విషణ్ణ వదనంతో.

     నన్ను చూసి ముచ్చటపడ్డ వ్యక్తి నన్ను సమీపిస్తూంటే నాలో దడ ఆరంభమయింది. ఆందోళన అధికమయింది. ఆత్రుత హెచ్చింది. అతని గోటికత్తెర నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. అతని చేయి నా ఒంటి మీద పడకముందే ఏదో ఒకటి చేయాలని ఉంది. కానీ, ఏం చేయాలో తోచడంలేదు. తక్షణమే ఓ నిర్ణయానికి రాకతప్పదు నేను. అది ఎలాంటిదైనా సరే…

     ఆ మనిషి వ్రేళ్ళు నన్ను తాకబోతున్నాయి.

     అదే క్షణంలో – నా నిర్ణయం ఖరారయింది.

     రాజకీయనాయకుడి కంఠసీమ కంటే – మృత్యువు ఒడి ఎంతో గౌరవప్రదమైనది!

     చివరిసారిగా – ప్రేమతో గాఢంగా మమ్మీని ముద్దుపెట్టుకున్నాను. లోకంలో అన్నిటికంటే – నాకంటే కూడా – నేను అమితంగా ప్రేమించింది మమ్మీనే మరి!

     మరుక్షణం – ఏదో మత్తులో ఉన్నదానిలా, మమ్మీ వారించబోతున్నా వినిపించుకోకుండా – నన్ను కోసిన వ్యక్తి వ్రేళ్ళ మధ్య నుంచి చటుక్కున జారి, క్రింద వున్న మురికికాలువలోకి గెంతాను – గౌరవప్రదమైన మృత్యువు కౌగిట్లోకి…!!

                                                           *******


Rate this content
Log in

Similar telugu story from Tragedy