Soudamini S

Drama Tragedy

4.8  

Soudamini S

Drama Tragedy

మీ శివాని

మీ శివాని

2 mins
571


విల్సన్ గారికి


మీ ఈమెయిల్ ఐ.డి నేను ఇంటర్నెట్ నుండి సంపాదించాను. మీరు ఒక కంపెనీ కి సి.ఇ. ఓ అయ్యారని చూసి చాలా ఆనందించాను. ఇంతకీ, నేను ఎవరు అనుకుంటున్నారు కదూ నేను హైదరాబాద్ వాసవి కాలేజీ లో మీతో పాటే ఇంజనీరింగ్ చదివాను. మీకు గుర్తుందో లేదో కానీ నేను మాత్రం ఇప్పటికీ మిమ్మల్ని మరచిపోలేదు. మీకు గుర్తు చేయటానికి ప్రయత్నిస్తాను.


నా పేరు శివాని. నేను కంప్యూటరు బ్రాంచి లో ఉంటే మీరు మెకానికల్ బ్రాంచ్ లో చదివారు. మీరు నా కంటే ఒక సంవత్సరం సీనియర్. నేను, మీరు ఒక సాంస్కృతిక కార్యక్రమానికి కలసి పని చేశాం. నేను అప్పుడు ప్రార్థనా గీతాన్ని పాడి కార్యక్రమాన్ని ప్రారంభించాను. మీరు అప్పుడు ఒక పాటకు చాలా అద్భుతం గా డాన్స్ కూడా చేశారు. అంతే కాదు, మీరు యూనివర్సిటీ టాపర్ కూడా కదా.


మీరు గమనించారో లేదో కానీ నేను మిమ్మల్ని ఆరాధిస్తూ, అనుసరిస్తూనే ఉండేదాన్ని. మీరు కూడా నన్ను అనుసరిస్తున్నారేమో నని నాకు అనుమానం ఉండేది సుమా. నా అభిప్రాయం తప్పు అయితే క్షమించండి. నేను క్లాస్ కి వెళ్ళే సమయానికే నా క్లాస్ బయట రోజూ మీరు ఎదురు చూస్తూ కనిపించేవారు. దూరం గా కిటికీ నుండి నన్నే చూస్తున్నారు అనిపించేది, నేను ఓర కంట మిమ్మల్నే చూసేదాన్ని. నేను లైబ్రరి కి వెళ్ళినప్పుడు మీరు కూడా అక్కడికి వచ్చేవారు. నేను అప్పుడప్పుడు దొంగ చూపులు చూసినప్పుడు దొరికిపోయావులే. నీ కాలేజీ చివరి రోజు నా హాస్టల్ రూమ్ బయట గులాబీ పూలతో తచ్చాడుతూ కనిపించావు. నేను చూసి కూడా చూడనట్లు బయటకు రాలేదు. నా రూమ్మేట్ తో కబురు పెట్టినా నేను రాను అని తిరిగి బదులు పంపించాను. ఎందుకో తెలుసా, సంకోచం. నువ్వు మా మతం వాడివి కాదని మా ఇంట్లో ఒప్పుకోరన్న సంశయం ఒక వైపు, నాడీ ప్రేమ లేక ఆకర్షణ అన్న సంశయం మరొక వైపు. ప్రేమ కంటే తల్లితండ్రుల మీద బాధ్యత గొప్పది అనిపించింది. అందుకే నా ప్రేమని నా లోనే దాచుకున్నాను. నీకు చెప్ప లేదు. కాలేజీ నుండి నువ్వు వెళ్ళి పోయాక నిన్ను చూడాలని అనిపించేది. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటే నేను కూడా చేరాలని ప్రయత్నం చేశాను. కానీ నువ్వు అమెరికా వెళ్లిపోయావని తెలిసింది. నా మనసులో నీ మీద ప్రేమని పూర్తి గా చంపేసుకున్నాను.


మా అమ్మా నాన్నల బాధ్యత నా మీదే ఉంది. అందుకని నేను ఇక్కడే ఉండి పోయా. అమ్మా వాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు కానీ ఎవ్వరూ నా మనస్సు కి చేరువ కాలేక పోయారు. ఉద్యోగం లో చేరిన రెండు సంవత్సరాలకే అమ్మా నాన్న ఒక రోడ్డు ప్రమాదం లో అకస్మాత్తు గా చనిపోయారు. అప్పుడు నాకు ఇంక జీవితం లో ఏం మిగిలింది అని... ఉద్యోగం మీద దృష్టి పెట్టి నన్ను నేను మరల్చుకున్నాను. నా చుట్టూ ఒక గీత గీసుకొని అందులోకి ఎవరినీ రానీయలేదు. అక్కడే ఉంటే ఒంటరి మహిళ అని సమాజం లో చులకన గా చూడటం మొదలు పెట్టారు. ఇద్దరు ముగ్గురు ఆఫీసు లో నాతో వెకిలి గా ప్రవర్తించడం మొదలు పెట్టారు. వాటి నుండి తప్పించుకోవటానికి నేను కూడా ఐదు సంవత్సరాల క్రితం అమెరికా వచ్చేశాను. ఇక్కడ అయినా ఒంటరి జీవితమే కదా.


ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సిగ్గు విడిచి చెప్తున్నాను అనుకుంటున్నావు కదూ. ఇప్పుడు కూడా ఇది చెప్పకపోతే నా ప్రేమ నా మనసు లోనే సమాధి అయిపోతుంది అనిపించింది. నాకు స్టేజ్-4 కాన్సర్ అని డాక్టర్ లు నిర్ధారించారు. ఇంకా ఎక్కువ కాలం బతకను అని చెప్పారు. నాకు ఆఖరి కోరిక ఏదైనా ఉంటే, అది నిన్ను చూడాలని ఉంది. నీది బిజీ జీవితం అని నాకు తెలుసు. నా లేఖ చదివే సమయం ఉంటుందో లేదో కూడా తెలీదు. చదివితే మాత్రం నన్ను ఒక్క సారి కలవటానికి వస్తావు కదూ. నా కోసం అంటూ ఈ జీవితం లో మిగిలింది నువ్వు ఒక్కడివే. కొన్ని బంధాలకు పేర్లు ఉండవు. మన బంధం కూడా అలాంటిదే.


నీ రాక కోసం ఎదురు చూస్తూ,

నీ శివాని.


Rate this content
Log in

Similar telugu story from Drama