Soudamini S

Comedy Drama

4.7  

Soudamini S

Comedy Drama

అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్

అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్

5 mins
176


కరొన వచ్చినప్పటి నుండి నాకు ఎందుకో నచ్చటం లేదు అందరూ నన్ను ఒక వైరస్ లా చూస్తున్నారు. అదేమిటి అంటారా, మీకు తెలియదు కదూ నా పేరు కరుణ.


“మన ఇంట్లో కొన్ని రోజులు ఇడ్లీ, టి బంద్” అని కిరణ్ వంట గది లో నుండి ఉత్తర్వులు జారీ చేశాడు. “ఇవి బాగా అట్టగట్టుకు పోతున్నాయి” అని కారణం కూడా చెప్పాడు. కరొన మొదలైనప్పటి నుండి గిన్నెల డ్యూటి ఆయనదే కదా. భర్త అనే అధికారం చూపించటం కాదు సహకారం ముఖ్యం అని ఉపన్యాసం ఇచ్చి మరీ ఈ డ్యూటి నెత్తిన వేసుకున్నాడు. దానికి తోడు రాజమౌళి గారు స్టార్ట్ చేసిన #రియల్ మ్యాన్ ఛాలెంజ్ ఒకటి. మా రియల్ మ్యాన్ కిరణ్ మాత్రం వీడియొ రికార్డు అయిపోయాక కూడా రోజూ డ్యూటి చేస్తూనే ఉన్నాడు.


“అది సరే గాని మీరు గోరు చిక్కుడు, బీన్స్ తేవద్దు. వొలవటానికి బోలెడు టైమ్ వేస్ట్” అని నా గోడు నేను వెళ్లగక్కుకున్నాను. ఆఫీసు లో తక్కువ శ్రమ తో ఎక్కువ ఫలితాలు సాధించాలని ఇచ్చిన ట్రైనింగ్ ల ఫలితం ఇది. వంట మనిషి రాక ఆ బాధ్యత ను నెత్తిన వేసుకున్న నేను ఆ పనిలో ఎఫిషియెన్సీ ని వెతుకుతూ పడుతున్న కుస్తీలు ఇవి. పెళ్ళయినప్పటి నుండి వంట మనిషి మానేసి ఇన్ని వారాలు ఎప్పుడూ లేదేమో.


అంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎంతో ఉత్సాహంగా చెప్తోంది – నీకోక విషయం తెలుసా, నేను ఒక మాపు ప్రయత్నించాను, అందులో మాపు పిండక్కర్లేదు తెలుసా, చాలా తేలిక గా కూడా ఉంది - నీకు కూడా ఒకటి ఆర్డర్ ఇస్తున్నా అమేజోన్ లో.


ఓకే , కూల్ అని ఫోన్ పెట్టేశా. ఏమిటో ఒకప్పుడు నగలు బాగున్నాయి, డ్రస్ లు బాగున్నాయి అని ఫోన్ చేసే మా ఫ్రెండ్ ఇప్పుడు మాపు బాగుంది, క్రొత్త క్లీనర్ బాగుంది అంటూ ఫోన్ లు చేస్తోంది. ఇప్పుడు చీపుళ్ళే ఆభరణాలు, తుడుపుడు గుడ్డ లే క్రొత్త వస్త్రాలు..


పిల్లాడి ఆన్లైన్ క్లాస్ కి ఇంకా కొద్ది నిమిషాలే టైమ్ ఉంది. వెళ్ళి మా అబ్బాయిని లేపాను. వాడు లేచి పది నిముషాలలో రెఢీ అయిపోతాడు. వాడేదో స్నానం త్వరగా చేయటం లో గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే చటుక్కున వెళ్ళి పుటుక్కున వస్తాడు. ఏదో ఒకటి స్నానం అయినా చేస్తున్నాడు.


ఇప్పుడిక బ్రేక్ఫాస్ట్ రెఢీ చేయాలి. రాత్రి మిగిలిపోయిన అన్నం లో కొంచెం పెరుగు, పండి పోయిన అరటి పళ్ళు వేసి కలిపేశా. ఆ పైన కాసిని జీడి పప్పులు చల్లి - బౌల్ లో సర్ది పిల్లలు ఇద్దరికీ ఇచ్చేశా. “అమ్మా, ఇదేమిటి?” అని నా ఆరేళ్ళ పాప అమాయకం గా అడిగింది. “అది బనానా రైస్ పుడ్డింగ్” అని చెప్పి దాని వైపు వెను తిరిగి చూడకుండా వచ్చేశా. ఈ రోజు కూడా వేస్ట్ లేకుండా ఎలాగో క్రొత్త పేరు పెట్టి మేనేజ్ చేసేశా, శభాష్ అనుకుంటూ నా భుజాన్ని నేనే చరుచుకున్నాను.


కుక్కర్ లో పప్పు, మూకుడు లో కూర పెట్టి ఆఫీసు కి లాగిన్ అయ్యాను. మాడు వాసన వస్తే వంట గది లోకి, ల్యాప్టాప్ నుండి కాల్ నోటిఫికేషన్ వస్తే ల్యాప్టాప్ ముందుకు అలా అటు ఇటు గడియారం పెండ్యులం లా తిరుగుతూ మొత్తానికి వంట పూర్తి చేశాను.


ఇక ప్రశాంతం గా కంప్యూటరు ముందు కూర్చుని మొరాయించిన నా ప్రోగ్రామ్ కోసం జుట్టు పీక్కుంటూ ఉండగా వేరే గదిలో ఆన్లైన్ క్లాస్ వింటున్న మా వాడు నన్ను చేయి పట్టుకు లాక్కెళ్తున్నాడు. “ఏమిటి రా విషయం?” అన్నాను. ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నాడు. “ఇప్పుడు ఏమిట్రా, నా అవతారం చూశావా, ఇప్పుడిది అవసరమా. అసలు నేను నీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎప్పుడు అటండ్ అయ్యనని, నాకు నీ గురించి తెలియదా” అని తప్పించుకునే ప్రయత్నం చేశాను.


“అమ్మా, ఇదివరకు అంటే స్కూల్ కెళ్లాలి అని తప్పించుకున్నావు. ఇప్పుడు ఇంట్లో ఉండి రాలేదేమని మా మేడమ్ అడుగుతారు” అని నన్ను బలవంతం గా వాడి ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టాడు.


అసలే వీడియొ కాల్. పీక్కోవటం వాళ్ళ అస్తవ్యస్తం గా ఉన్న జుట్టుని త్వరగా సర్దుకొని మీటింగ్ కి కూర్చున్నాను. మా వాడు క్లాస్ టైమ్ లో కెమెరా ఆన్ చేయట్లేదని ఆవిడ కంప్లయింట్. నాకు విషయం అర్థమైనా అప్పుడప్పుడు వెబ్ కామ్ పని చేయట్లేదని ఆవిడకు ఎలాగో సర్ది చెప్పాను. ఆవిడ చెప్పిన మిగితా విషయాలన్నీటికి అలాగే అని తల ఊపి త్వరగా ముగించేశాను. ఆన్లైన్ క్లాస్ టైమ్ లో వెబ్ కామ్ ఆన్ చేయకుండా వీడియొ గేమ్ లు ఏమిటని వాడిని మందలించి అక్కడ నుండి బయట పడ్డాను.


ఎలాగో అలాగ లంచ్ తినటం ముగించి ఒక నిమిషం కూర్చోగానే ఆఫీసు టీం మీటింగ్ ఉందని గుర్తొచ్చింది. గబుక్కున వెళ్ళి ఆల్రెడీ ఇస్త్రీ చేసి ఉన్న నాలుగు డ్రెస్సులలో ఒకటి తీసుకొని రెఢీ అయ్యాను. అలాగే వీడియొ కాల్ లో కనిపించ్చేంత మేర ఇల్లు సర్దేశాను. “ఏమోయ్, ఏమిటి స్పెషల్ ఈ రోజు ఇంత రెఢీ అవుతున్నావు” అని కిరణ్ నా మెడ చుట్టూ చేతులు వేసి, కొద్దిగా వంగి అడిగాడు. “ఈ రోజు మా టీం మీటింగ్ వీడియొ కాల్. ఎన్ని రోజులయ్యిందో కదా రెఢీ అయ్యి, అందుకే” అని చిన్న గా నవ్వాను. సరే అని ఉసూరు మనుకుంటూ కిరణ్ కూడా మరొక మీటింగ్ లోనికి దూరాడు. 


టీం మీటింగ్ మొదలైంది. కాసేపు అందరూ ఏ క్రొత్త వ్యాపకాలు నేర్చుకున్నారో చెప్తున్నారు. నేను కూడా నేను రాసిన కాకరకాయ కధలను కూడా చదివి వినిపించాను. తరువాత మా వీడియొ కాన్ఫరెన్సింగ్ ఆప్ లో ఏమి మార్పులు చేయాలో డిస్కస్ చేశాం. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ అమెరికా వాళ్ళకి సరిపోతుందని, ఇండియా కి రెఢీ చేయాలంటే కుక్కల అరుపులే కాకుండా పిల్లల ఏడుపులు, రైలు కూతలు, కుక్కర్ విజిల్ సౌండ్ లు వినిపించకుండా ఆపాలని కొందరు సలహా ఇచ్చారు. అలాగే మేకప్ లేకపోయినా కాల్ లో అందంగా కనపడాలి అని ఒకరు, ఇల్లు సర్దకపోయినా సర్దినట్లు ఉండాలని మరొకరు అలాగ ఎవరి గొంతెమ్మ కోరికలు వాళ్ళు విన్నవించుకున్నాం. వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచించి అనాలిసిస్ చేసి రెఢీ గా ఉంచమని చెప్పి బాస్ ఆర్డర్ వేశారు. అంతటి తో ఈ వారం మీటింగ్ ముగిసింది. 


కాల్ అయిపోగానే హాల్ లోకి వచ్చి ఒకసారి షాక్ తిన్నాను – ఈ వ్యోమగామి ఎవరబ్బా అని. నెమ్మది గా అర్థం అయ్యింది అది సరుకుల కోసం బయటకు వెళ్ళటానికి రెఢీ అయిన కిరణ్ అని. మా పాప కూడా కూడా వెళ్తానని మారాం చేస్తే వద్దని గట్టిగా చెప్పాను. అందుకు అది ఒక మూల చేతులు కట్టుకొని బుంగ మూతి పెట్టుకుని కూర్చుంది. అది చేతులు కట్టుకుందంటే ఏదో బాధ పడుతోందని అర్థం. కిరణ్ వెళ్ళిపోయాక ఏమయ్యింది అమ్మా అని దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను.


“అమ్మా మామూలుగా అయితే ఈ పాటికి సమ్మర్ సెలవులకి వేరే ఊరు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అపార్ట్మెంట్ దాటి వెళ్లటానికే వీలు లేదు. నాకు ఈ కరొన నచ్చలేదమ్మా” అంది.


అప్పుడు మా పాప కి నేనెప్పుడో చిన్నప్పుడు చదివిన కధ చెప్పాను. నన్ను నేను రోజూ సమాధాన పరచుకుంటున్న కధ.


పూర్వం ఒకతను ఒక తన బాధ నుండి ఉపశమనం పొందటానికి ఒక స్వామీజీ ని వెళ్ళి కలిశాడుట.


“స్వామీ నా ఇల్లు చాలా ఇరుకు గా ఉంది, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి” అని అన్నాడుట.


“మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?” అని అడిగాడుట స్వామీ జీ. “మా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, తమ్ముడు, చెల్లెలు అందరం ఒక చిన్న గది లోనే ఉంటున్నాం” అన్నాడుట.


“నీ వద్ద ఇంకా ఏమైనా జంతువులు ఉన్నాయా?” అని అడిగాడుట స్వామీజీ


“4 గేదెలు, 5 గొర్రెలు, 10 కోళ్ళు ఉన్నాయి” అని చెప్పాడుట అతను.


“అయితే ఆ కోళ్లను ఇంట్లో కట్టేయి” అని చెప్పాడుట స్వామీజీ.


అతను భక్తి గా స్వామీజీ చెప్పిన మాట విన్నాడు. ఇల్లు ఇంకా ఇరుకు అయ్యింది .


మళ్ళీ స్వామీజీ దగ్గరకు వెళ్ళి చెప్పాడుట. ఈ సారి స్వామీజీ ఆ మేకలను కూడా ఇంట్లో కట్టేయమన్నారు.


“ఇదేమి స్వామీ జీ అమ్మా ఇలా చెప్తున్నారు. ఇల్లు ఇంకా ఇరుకు అయిపోదు” అన్నది పాప అసహనంగా.


పూర్తి గా విను , అతను గురువు గారి మాట మళ్ళీ విన్నాడు. ఇల్లు ఇంకా ఇరుకు అయ్యింది, ఇంట్లో అందరికీ పడుకోవటమే కష్టం అయ్యింది అని ఒక నిమిషం ఆగాను.


“ఆ తరువాత కధ నేను చెప్తాను ఆ స్వామి మిగిలిన గేదెలను కూడా ఇంట్లో కట్టేయమంటాడు ఇంకేముంది, ఈ అబ్బాయి వింటాడు, ఇల్లు ఇంకా ఇరుకు అయిపోతుంది. సరే మరి తరువాత ఏమవుతుంది, ఇంక అతని దగ్గర జంతువులు ఏమి లేవు కదా” అంది పాప తొందరగా విషయం చెప్పమన్నట్లు గా.


అప్పుడు స్వామి అతన్ని ఇంట్లో ఉన్న గేదె లను, మేకలను, కోళ్లను అన్నింటినీ వదిలేయమని చెప్పారుట . అప్పుడు అతను ఆనందం గా ఇంటికి పరిగెత్తాడుట. అలా విప్పేశాక ఎంతో ఆనందంగా అనిపించిందిట, ఇల్లు విశాలం గా అనిపించిందిట అని నేను కధ ముగించాను.


“ఓ ఇప్పుడు అర్థం అయ్యింది స్వామీ జీ క్రొత్త గా అతనికి జాగా ఇవ్వలేదు కానీ ఉన్నదే ఇప్పుడు పెద్ద గా అనిపింస్తోంది.” అంది పాప జ్ఞానోదయం అయినట్లు.


“అంతే, సరిగ్గా దేవుడు కూడా అంతే. మనకు ఉన్న జీవితం పట్ల సంతృప్తి లేనప్పుడు దేవుడు మధ్యలో ఇలా చిన్న చిన్న కష్టాలు ఇస్తాడు. అవి తీరిపోయాక మనకి ఉన్న జీవితం మునుపటి కంటే సంతోషం గా అనిపిస్తుంది” అని కధను పూర్తి చేశాను.


పాప సరే అని గెంతుకుంటూ వెళ్ళిపోయింది. నిజం గా కధలకు ఎంత శక్తి ఉంది, చిన్నప్పుడు ఎప్పుడో చదివిన కధ ఇప్పుడు ఉపయోగపడింది అనుకుంటూ


డైరీ ఓపెన్ చేసి కధ రాయటం మొదలు పెట్టాను - " కరొన వచ్చినప్పటి నుండి నాకు ఎందుకో నచ్చటం లేదు..


కొద్ది సేపటికి ఎవరో కొట్టిన శబ్దం. అన్నా చెల్లెళ్ల యుద్ధం మొదలైనట్లుంది. ఇంకేముంది ఈ కధ ఇంతటితో అయిపోయింది. నా అష్టావధానం సాఫ్ట్వేర్ మాత్రం పరిగెత్తుతూనే ఉంటుంది.


Rate this content
Log in

Similar telugu story from Comedy