Soudamini S

Drama Inspirational

4  

Soudamini S

Drama Inspirational

రంగుల ఎడారి

రంగుల ఎడారి

4 mins
379


“నెమలి కంఠం లాంటి రంగు ఈ టారకాయిస్ రాయిది. ఇది ధరిస్తే మీ కంఠం కూడా అంతే అందంగా కనిపిస్తుంది.


ఓహో ఇదా, ముదురు కాఫీ రంగులో ఉన్న ఇది టైగర్ ఐ, ఇది ధరిస్తే మీరు కూడా పులి లాగా శక్తివంతంగా కనిపిస్తారు..


ఈ తెల్లటి రాళ్ళని మూన్ స్టోన్ అంటారు, ఇది ధరిస్తే మీరు కూడా చందమామ అంత స్వచ్చంగా అనిపిస్తారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది”


ఇలా ఒకొక్క రాయి గొప్పదనాన్ని వివరిస్తూ, పర్యాటకులతో రంగురాళ్ళు కొనిపించటమే నా ఉద్యోగం.


“మీకు తెలుగు ఇంత బాగా ఎలా తెలుసు?” అని అడుగుతారు.


పుట్టింది తెలుగు నేల మీదే. ఇంటర్ చదివాక, తెలిసిన వాళ్ళు అని నాన్న రాజస్థాన్లో స్థిరపడ్డ బంధువుల అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు.. మా ఆయనకు అంత డబ్బులు లేకపోవచ్చు కానీ బాగా మనసున్నవాడు, నన్ను ప్రాణం గా చూసుకునేవాడు. 


ఆయన రంగురాళ్ళ క్వారీలో పని చేసేవాడు. వీటి గురించి ఆసక్తి అలాగే మొదలయ్యింది.


అందరికీ తెలిసినవి ఎర్రటి కెంపులు, ఇంకా పచ్చలు మాత్రమే. కానీ వెతకాలే కానీ ప్రకృతిలో ఎన్ని రంగుల రాళ్లు?


తాజ్మహల్ శోభ ను రెట్టింపు చేసిన ముదురు నీలం లాపీస్ రాళ్ళు నాకు అన్నింటికన్నా ఎక్కువ ఇష్టం. పెళ్ళి కానుకగా మా ఆయన వేసిన ఈ నీలం పూసల గొలుసు నా మెడలో ఎప్పుడూ ఉండాల్సిందే, నా గుండెకు దగ్గరగా..


ఈ రాళ్ళతో నా అనుబంధం వెలకట్టలేంది. గుండె లేకున్నా, ఈ రాళ్ళు నాకు ఇచ్చిన మనశ్శాంతి, ఆనందం – గుండె ఉన్న మనుషులు ఇవ్వగలిగారా?


సాయంత్రం కావటంతో కొట్టు కట్టేసి ఇంటికి ఇసుకలో అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరాను. రంగు రంగుల తోరణాలు కట్టుకున్న ఇళ్ళు, ఇప్పుడు ఇప్పుడే క్రొత్తగా వెలుస్తున్న చిన్న చిన్న తినుబండారాల దుకాణాలు, రాబోయే అతిధుల కోసం ముస్తాబవుతున్న ఒంటెలు, పర్యాటకులని ఆకట్టుకోవటానికి సంప్రదాయ ఆటపాటలు నేర్చుకుంటున్న అమ్మాయిలు... ఈ సంబరాలు సంవత్సరం పొడుగునా ఉంటే ఎంత బాగుంటుంది?


ఊరంతా రంగులు అద్దుకునేది సంవత్సరంలో ఆ ఒక్క రోజు కోసమే. మా అబ్బాయి రాహుల్ కి కూడా ఎక్కువ పని దొరికేది ఈ సమయం లోనే. హోలీ పండుగ జరుపకోవటానికి దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు ఆ పండుగ శోభను అందంగా చూపించటమే వాడి పని, అందులోనే వాడికి అమిత ఆనందం. 


ఇంటికి వెళ్ళేసరికి రాహుల్ అప్పటికే నా కోసం ఎదురు చూస్తున్నాడు.


“మంచినీళ్ళు తాగావా? వచ్చి ఎంత సేపు అయ్యింది“ అంటూ వంట గది లోకి వెళ్ళాను.


“అమ్మా కూర్చో, నీకో సంగతి చెప్పాలి” అని వినిపించింది.


వెంటనే వాకిలి గది లోకి వచ్చి కూర్చున్నాను.


“అమ్మా, నీకు శైలి తెలుసు కదా...”


“తెలుసు. రెండు మూడు సార్లు మన ఇంటికి కూడా వచ్చింది. ఎప్పుడూ సమాజ సేవ అని తిరుగుతూ ఉంటుంది. అమ్మాయిలను పని మాన్పించి చదివిస్తుంది. చాలా మంచి పిల్ల...  


నువ్వు కొంపదీసి ప్రేమించావా ఏమిటి?”


“మ్..”


“ఎంత మంచి మాట చెప్పావురా, మరి ఆ అమ్మాయికి కూడా నువ్వు ఇష్టమేనా?”


“ఇష్టమేలే…”


“నీ నోరు తీపి చేయాలి. ఉండు” అంటూ వంటగది లోకి వెళ్ళాను.


“మంచి మాటే, మరి పెళ్లెప్పుడు అక్కయ్యా?” అంటూ ప్రక్కయింట్లో ఉండే నా తొడికోడలు గుమ్మం లో అడుగు పెట్టింది.


“రా చెల్లి, సమయానికి వచ్చావు, అమ్మాయి వాళ్ళతో మాట్లాడి ముహూర్తం పెట్టుకుందాం” అంటూ వంటగది లో నుండి రెండు గిన్నెలలో మాలపువా పెట్టుకుని వచ్చాను.


“అమ్మో, నాకు ఎంత పనో ఇంక. పెళ్లి మాటల నుండి పెళ్లి వరకు బాధ్యత అంతా నా నెత్తి మీదే అయితే. నాకు కట్నం ఇప్పించాలి అక్కయ్య ఇప్పుడే చెప్తున్నా”


“వాళ్ళ కట్నం ఎందుకులే గాని నీకు నా కొడుకే డబ్బులు ఇస్తాడు లేవే, ఇంతకీ రేపు వాళ్ళ ఇంటికి వెళ్దామా” అన్నాను కొడుకు ముఖంలోకి చూస్తూ.


“నువ్వు గాని వస్తావా ఏంటి కొంపదీసి! నీకు తెలుసు కదా, నువ్వు ఇలాంటి శుభకార్యాలకు పనికి రావు అని. నువ్వు గుమ్మనగా ఒక మూల కూర్చో. నేను, మన చూట్టాలం, ఇంత మందిమి లేమా ఏంటి? మేము చూసుకుంటాం” అంటూ మాలపువా ముక్క తుంచి నోట్లో వేసుకుంది.


ఈ పరదా లో ఉన్న సుఖం ఇదే, కన్నీళ్లను ఎవరికీ కనిపించనివ్వదు.


నా కొడుకు చటుక్కున లేచి వెంటనే ఇంట్లో నుండి లేచి వెళ్ళిపోయాడు.


“వస్తాను అక్కయ్యా, నాకు అవతల చాలా పని ఉంది” అని నా తోడికోడలు వెంటనే వెళ్ళిపోయింది. 


పిల్లాడికి నష్టం కలిగించే పని నేను ఎందుకు చేస్తాను? ఒక అమ్మ ఎప్పుడూ అలా ఆలోచించదు.


కానీ నేను వాడిని ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసుకున్న అమ్మను, నా కొడుకు పెళ్లి పనులు చేసుకోవటానికే పని చేయను అన్న ఆ మాటే నాకు ముల్లు లా గుచ్చుకుంటోంది.


నాకు ఎప్పుడో గుర్తు లేని, నాకు తెలియని గత జన్మలో ఏదో పాపం చేశానుట. అందుకే నా ప్రాణమైన పెనిమిటి ని పోగొట్టుకున్నాను అని చుట్టూ పక్కల అందరూ అంటారు. 


మా ఆయన క్వారీ లో పని చేయటం వల్ల నెమ్మది నెమ్మదిగా గాలి పీల్చుకోవటం ఇబ్బంది అయ్యేది. ఎంత మంది డాక్టర్ ల దగ్గరకి తిప్పాను? టి.బి అన్నారు, క్షయ అన్నారు... కానీ అసలు మందు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అదేదో మహమ్మారి జబ్బు క్వారీ లో పని చేయటం వల్లే వస్తుందని తర్వాత తెలిసింది. కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ క్వారీ వాళ్ళు కానీ అది ఒప్పుకుంటే కదా.. నాలాగా ఎంత మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, భర్తలను పోగొట్టుకుని, సమాజం నుండి విసిరేయబడి? అందరిదీ ఇదే పరిస్థితి. 


నాకు తెలిసిన కష్టం చేసుకుంటూ, నాకు తెలియనీది నేర్చుకుంటూ లౌక్యం తో రాహుల్ ని పెంచి పెద్ద చేశాను. వాడికి పెళ్లి ఎలాగోలాగ చేసేస్తే ఇంక నా బాధ్యత తీరిపోతుంది. ఇంక అప్పుడు నేనే ఈ సమాజానికి దూరంగా వెళ్లిపోతాను.. 


-------


హోలీ సందడి ఊరంతా మొదలయ్యింది. రాహుల్ ఏర్పాట్ల కోసం రాత్రి నుండి ఇంటికి రాలేదు.


ఇంటి చుట్టూ కోలాహలంగా ఉంది. దేశ విదేశీ పర్యాటకులతో ఊరంతా నిండిపోయి ఉంది. పాత హిందీ పాటలు జోరుగా వినిపిస్తున్నాయి. జనమంతా రంగులలో తడిసి ముద్ద అవుతున్నారు. కుర్రాళ్ళు చొక్కాలు చింపి పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు. ప్రేమికులు, భార్యా భర్తలు రంగుల బుడగలు ఒకరి మీద మరొకరు విసురుకుంటూ ప్రేమను కురిపిస్తున్నారు.


ఇంతలో ఎవరో తలుపు తీసుకుని వచ్చారు. ఆ రంగుల ముఖాన్ని గుర్తు పట్టటం కష్టంగా ఉంది.


“మా జీ ఆయియే” అంటూ నన్ను చేయి పట్టుకుని లాక్కుని వెళ్తోంది.


“శైలి..” నా గొంతు తడబడింది.


బలవంతంగా నన్ను గుమ్మం ముందు నిలబెట్టింది.


నన్ను చూడగానే ఒక్క సారి బయట హోలీ ఆడుతున్న స్త్రీలు ఆగిపోయారు. అన్ని రంగుల మధ్య, రంగులే అంటని తెల్లని దుస్తులలో నేను..


అక్కడే ఉన్న రాహుల్ నా భుజం మీద చేయి వేశాడు.


శైలి పసుపు పళ్ళెం నా చేతికి ఇచ్చి తనకి రాయమంది.


‘ఖుషి మనానే కా హక్ సబ్ కో హై. వహీ అసలీ హోలీ హై.” అని శైలి పళ్ళెం చేతికిస్తూ చెప్తోంది. రాహుల్ నా వైపు చూసి తల ఊపాడు.


“వో విధవా హై, ఐసా కరనా పాప్ హై” అని మా తోడికోడలు గట్టిగా అరిచింది.


“అరె చుప్! మా అమ్మ ఆశీర్వాదం లేకుండా నా పెళ్లి జరగదు. ఈ రోజు నా హల్దీ ఇక్కడే, అమ్మ తోనే మొదలవుతోంది. మేరీ షాదీ మా కీ హాతోన్ సే హీ హోగి” అని రాహుల్ చూపుడు వేలు త్రిప్పుతూ గట్టిగా అరిచాడు.


అప్పటి దాకా నిస్తేజంగా ఉన్న పర్యాటకులు చప్పట్లు కొడుతున్నారు. ఆవేశంతో ఊగిపోతున్న పెద్దమనుషులకు ఏమి చేయాలో పాలుబోవవటం లేదు.


నా కొడుకు, కోడలు ఇచ్చిన ధైర్యం తోనే వాళ్ళకి పసుపు అద్దాను. కోడలు నా మీద గులాల్ చల్లింది. నా మెడ లోని నీలం రంగు దండ కోడలు మెడలో వేసి హత్తుకున్నాను.


చుట్టు పక్కల ఇళ్ళల్లో నుండి తెల్ల చీరలు కట్టుకున్న స్త్రీలు పసుపు పట్టుకుని బయటకు వస్తున్నారు, ఎడారి లో రంగులు నింపుకోవటానికి...


Rate this content
Log in

Similar telugu story from Drama