Soudamini S

Drama Inspirational


5.0  

Soudamini S

Drama Inspirational


ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ?

ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ?

4 mins 589 4 mins 589

భాగ్యం శ్రావణ శుక్రవారం వర లక్ష్మీ వ్రతం పూజ పూర్తి చేసుకుంది. వాయనం ఇచ్చే సమయానికి బెల్ మ్రోగింది. ఐశ్వర్య వచ్చి ఉంటుంది అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. మాస్కుతో ఐశ్వర్య ఎదురుగా నిలచి ఉంది.

"రావే, ఎంత కరొన అయినా మరీ బొత్తిగా ఒక్క ముత్తైదువు ని అయినా పిలవకుండా పూజ చేసుకోవటానికి నాకు మనసొప్ప లేదు. అందుకే నువ్వు అయితే పక్కనే ఉంటావు అని పిలిచాను" అంది శానిటైజర్ చేతికి అందిస్తూ. 

"ఏదో ఒకటి కనీసం పిలిచావు లేవే, నా మనసెమీ బాగాలేదు. ఈ వంకన అయినా బయటకు వచ్చాను" అంది దిగులుగా ఐశ్వర్య. 

"ఏమయ్యింది, పెళ్లి అయ్యి రెండేళ్లు కూడా కాలేదు. ఇద్దరూ హనీమూన్ కపుల్ లా ఉంటారు. నీకు ఏమి సమస్యలే?" అని ఆశ్చర్య పోయింది భాగ్యం. 

ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగి సంభాషణ కు అంతరాయం కలిగింది. బయట బేగం, పనమ్మాయి మాస్క్ వేసుకుని నుంచొని ఉంది. అమ్మా, జీతం కోసం వచ్చాను అంది. 

" నీకు paytm , గూగుల్ పే ఏమైనా ఉన్నాయా" అని అడిగింది భాగ్యం. 

"అమ్మా, నాకు బ్యాంకు ఎకౌంట్ లేదు కదమ్మా, మీకు తెలియంది యేటి" అంది బేగం బుర్ర గోక్కుంటూ.

"నీకు ఎన్ని సార్లు చెప్పా బేగం, బ్యాంకు అకౌంట్ తెరవమని? నువ్వు అసలు వింటేనా, ఉండు చిల్లర వెతికి తెచ్చి ఇస్తాను" అని విసుక్కుంటూ లోపలి వెళ్ళింది భాగ్యం. 

"ఏమి అనుకోకండమ్మా, మీ దగ్గర డబ్బులు ఉంటే బానకీ లో ఉన్నట్టే కదమ్మా. డబ్బులు కొంచెం అర్జెంటు" అంది బేగం జాలి గా ముఖం పెట్టి.

భాగ్యం ఎలాగో చిల్లర కూడబలుక్కుని జీతం తెచ్చి ఇచ్చింది. 

"అమ్మా, ఇలా ఉత్త పున్నానికి జీతం తీసుకోవటం ఇబ్బంది గా ఉంది, తొందరగా పనిలోకి పిలవందమ్మా" అంది బేగం.

"చెప్తానులే, పరిస్థితులు కాస్త సర్దుకోనీ. అయినా నీ మంచి కోసమే చెప్తున్నా, నీకు ఏదైనా సుస్తీ చేస్తే నువ్వు తిప్పలు పడలేవు. అన్నట్టు నువ్వు నా దగ్గర దాచుకున్న మూడు వేలు భద్రంగానే ఉన్నాయి, అర్జెంట్ అయితే చెప్పు" అంది భాగ్యం. 

"అవి అట్టాగే ఉంచండమ్మా , మనవడి ఫీజు కోసం దాచాను. మళ్ళీ నా మొగుడు దాన్ని కూడా తాగి తగలేస్తాడు" అని బేగం డబ్బులు లోపల దోపుకుంటూ.

"సరే లే జాగ్రత్త గా ఉండు" అంది చెప్పి తలుపు వేసింది భాగ్యం. ఈ వయసులో కూడా మనవడి బాధ్యత నెత్తిన వేసుకుంది పాపం అనుకుంది లోపల.

"పని చెయ్యకుండా జీతం ఇస్తున్నావా, అది కూడా శుక్రవారం పూట" అంది ఐశ్వర్య ఆశ్చర్యంగా.

"మనకి ఉన్న దాని ముందు వాళ్ళ జీతం ఎంత పాపం, మనం ఇవ్వకపోతే వాళ్లకు ఎలా గడుస్తుంది? ఇక శుక్రవారం అంటావా, డబ్బులని దాచుకోవటం మన చేతిలో ఉంది కానీ వారాలు ఏమి చేస్తాయి. పాపం అర్జెంటు ట మళ్ళీ ఏమి వస్తుందిలే" అంటూ భాగ్యం దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళింది.

తాంబూలం చేతికి ఇచ్చి వాయనం ముగించింది. ఇద్దరూ సోఫా లో కూల బడ్డారు. 

"ఇంతకీ ఎదో విషయం లో దిగులు అన్నావు, చెబితే నీ బాధ తగ్గుతుంది అనుకుంటే చెప్పు" అంది భాగ్యం. 

"ఏమి లేదే, ఈ నెల జీతం తో నేను బంగారం కొనుక్కుంటాను అంటే మా ఆయన ఇప్పుడు బంగారం రేటు ఎక్కువగా ఉంది, వద్దంటున్నారు. నేను కూడా సంపాదిస్తున్నాను కదే, నాకు ఆ మాత్రం స్వాతంత్ర్యం లేదా, ఎంత సేపు ఏవో స్థలాలు, పొలాలు కొంటాను అంటాడు. ఈ రోజు ఆ విషయం లోనే పెద్ద గొడవ అయ్యింది. ఇందులో నా తప్పేమైనా ఉందా?" అని అసలు గోడు చెప్పుకుంది ఐశ్వర్య.

"అసలు లేదు, తప్పంతా చారుమతి దే" అన్నది భాగ్యం నవ్వుతూ.

"చారుమతి ఎవరు మధ్యలో?" అంది ఐశ్వర్య కోపం గా.

"అదే ప్రతి సంవత్సరం మనం చదువుకునే కధలో హీరోయిన్. వరలక్ష్మి పూజ కధలో ఉండే ఆమె. మనకి చిన్నప్పటి నుండి నగల మీద ఆశ ని పెంచిన కథ అదే కదా" అంది నవ్వును ఆపుకుంటూ.

"ఓహ్ అదా, ఇంతకీ నువ్వేమంటావు? నాకు అర్థం కాలేదు" అంది ఐశ్వర్య సందేహం గా.

"ఏమీ లేదు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను, వాటికి సూటిగా, సుత్తి లేకుండా సమాధానం చెప్పు" అంది భాగ్యం.

"మొదటిది, నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా, నీ ప్రోవిడెంట్ ఫండ్ లో డబ్బులు ఎంత ఉన్నాయో, నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటో నీకు తెలుసా?" అని అడిగింది భాగ్యం.

"ఏమో నే నేను అంత పట్టించుకోను, ఈ డబ్బుల వ్యవహారం పట్టించుకోవటం అంటే ఏమో అసలు ఇష్టం ఉండదు" అని బదులిచ్చింది ఐశ్వర్య.

"సరే, రెండవది. మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, మీ రిటైర్మెంట్ ఖర్చులు, నెల వారి ఖర్చులు ఇవి ఎంత అవుతాయో నీకు అంచనా ఉందా?" మళ్ళీ అడిగింది.


"ఇంటి ఖర్చులు అంతా మగ వాళ్ళవే కదా, నేను ఆ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు" అని చాలా సాధారణం గా చెప్పింది ఐశ్వర్య.

"నేను ఊహించిందే, ఇక చివరిది నువ్వు నీ టాక్స్ రిటర్న్స్ ఎప్పుడైనా ఫైల్ చేసావా?" అని చివరి బాణం సంధించింది.

"ఆమ్మో, అదొక తలకాయ నొప్పి. నాకసలు బుర్ర కెక్కదు. అన్నీ మా ఆయనే చూసుకుంటాడు, అయినా నా సమస్యకి, నీ ప్రశ్నలకి ఏమైనా సంబంధం ఉందా?" అంది ఐశ్వర్య చిరు కోపంగా.

"ఉంది కనుకే అడిగాను. మన కుటుంబ పరిస్థితులు ఏంటి, ఏ సమయం లో ఎంత ఖర్చు కావాలి అని కూర్చుని చర్చించుకోవలసిన అవసరం భార్య భర్తలకు ఇద్దరికీ ఉంది. ఇద్దరూ అందులో సమానం గా భాగస్వాములే. డబ్బులు ఎందులో పెట్టాలి అనే అభిప్రాయ భేదాలు రావటం లో తప్పు లేదు. ఆ సమయం లో కూర్చుని కుటుంబానికి ఏది అవసరమో దానికి ప్రాధాన్యత నివ్వాలి. అందులో మనం కూడా నిస్పక్షపాతం గా నిర్ణయం తీసుకోవాలి అంటే ఆర్ధిక శాస్త్రం గురించి మనకు కూడా కొంత అవగాహన అవసరం. బ్యాంకు డిపాసిట్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం అలా ఏ సమయం లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే అవగాహన మనకు కూడా అవసరం." అని ముగించింది.

"అంటే మా ఆయన చెప్పినదే నిజం అంటావా?" అంది సూటిగా ప్రశ్నిస్తూ. 

"ఈ విషయం లో మగ వారికే ఎక్కువ తెలుసు అని కూడా నేను అనను. ఆడ వారి ఆర్ధిక నిర్ణయాలలో రిస్క్ ఎక్కువ ఉండదు అని పెద్ద ఆర్ధిక సర్వే లలో తేలింది. ఇటువంటి సంక్షోభ సమయం లో అదేగా కాపాడేది. ఇంకా ఆడవారు సంపాదిస్తే సమాజ సేవకు, కళలకు ఎక్కువ ప్రాధ్యానతని ఇస్తారు అని కూడా ఒక నివేదిక చెప్పింది. అందుకే మన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఇద్దరూ అవసరమే. కాక పోతే కుటుంబ ప్రాధాన్యత ను దృష్ఠ్టి లో పెట్టుకుని, కొంచెం వ్యవహార జ్ఞానం పెంచుకుని ఆర్ధిక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్తున్నాను అంతే" అని తాపీగా సమాధానం ఇచ్చింది.

"నీకొక విషయం తెలుసా, విడాకులకు మొదటి కారణం ఈ ఆర్ధిక వ్యవహారాలే. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇది నా డబ్బు, నీ డబ్బు అని కొట్టుకోకుండా మన డబ్బు అని ఆలోచిస్తే సమస్యలే ఉండవు గా" అని ముగించింది భాగ్యం.

ఐశ్వర్య ఆలోచనలో పడింది... 


Rate this content
Log in

More telugu story from Soudamini S

Similar telugu story from Drama