Anguluri Anjanidevi

Drama

5  

Anguluri Anjanidevi

Drama

నీ జీవితాన్ని నువ్వే మార్చుకో.

నీ జీవితాన్ని నువ్వే మార్చుకో.

5 mins
35.3K


రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి.

నీ జీవితాన్ని నువ్వే మార్చుకో-1 (సీరియల్)

నేషనల్ హైవే మీద శ్రీనాద్ నడుపుతున్న కారు వంద స్పీడ్ లో వెళుతోంది.

కారు వెనక సీట్లో కూర్చుని వున్న సుచేత ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండి శ్రీనాద్ మీద కోపంగానే వుంది.

శ్రీనాద్ అది గమనించినా గమనించనట్లే కారును చాలా వేగంగా, జాగ్రత్తగా నడుపుతున్నాడు.

ఆ కారు విజయవాడకి చేరటానికి ఇంకా ఒక గంట టైం పట్టొచ్చు.

త్వరగా వెళ్లి సుచేతను కాలేజీలో వదిలితే ఒక పని అయిపోతుందని శ్రీనాద్ ఆలోచన.

సుచేత ఒక మంచి పేరున్న కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ కాలేజీలో చదవటం సుచేతకు ఇష్టం లేదు. సెలవులివ్వగానే ఇంటికొచ్చింది.

ఇక వెళ్లనని రోజూ అమ్మతో, నాన్నతో చెబుతూనే వుంది. అయినా వాళ్ళు వినలేదు.

‘’అది అలాగే అంటుంది లెండి. దానికేం తెలుసు చిన్నపిల్ల. చదువన్నాక కష్టం లేకుండా వుంటుందా? ఆ మాత్రం కష్ట పడకపోతే ర్యాంకులెలా వస్తాయి? మన అమ్మాయి చదివితే ఆ కాలేజిలోనే చదవాలి. ఆ కాలేజీలో చదివితే నలుగురికి చెప్పుకోటానికి కూడా గొప్పగా వుంటుంది. అదీ కాక ఆ కాలేజీ ర్యాంకులకు పెట్టింది పేరు. అయినా మనం చెప్పినట్లు అది వినాలి కానీ అది చెప్పినట్లు మనం వినటం ఏమిటి? రోజురోజుకి గారాబం బాగా ఎక్కువవుతుంది‘’ అంది సహజ.

‘’నువ్వు చెబుతున్నది కూడా నిజమే సహజా! మనం కూడా మనసును కాస్త గట్టి చేసుకుంటేనే దాని భవిష్యత్తు బాగుంటుంది. అదేదో అక్కడ కష్టపడుతున్నానని చెప్పగానే కరిగిపోతే దాన్ని మనం అనుకున్న స్టేజ్ లో చూడలేము’’ అన్నాడు వర్ధన్ రావు.

వెంటనే శ్రీనాద్ ని పిలిచి సుచేతను విజయవాడలో వదిలిరమ్మని పంపారు.

సుచేత వర్ధన్ రావ్, సహజ ల ఏకైక సంతానం. గారాలపట్టి.

సుచేత మిర్రర్ లోంచి శ్రీనాద్ ను చూస్తూ ‘’డాడీ పిలవగానే ఎందుకొచ్చావ్ నువ్వు. వేరే వాళ్లతో లాంగ్ టూర్ లో వున్నానని అబద్దం చెప్పొచ్చుగా . ఇంట్లోనే ఉండేదాన్ని. నువ్వు రాకుంటే వేరేడ్రైవర్ తో నన్ను పంపేవాళ్లు కాదు. నాకు ఆ కాలేజీకి వెళ్లాలని లేదు. మమ్మీ , డాడీ నన్నెందుకింత బలవంతంగా పంపిస్తున్నారో అర్ధం కాదు. నాకు హైదరాబాద్ లోనే ఉండాలని వుంది’’ అంది.

‘’ఆ కాలేజీలో అయితే బాగా చదివిస్తారని నిన్ను అక్కడ చేర్పించారు. ఇంత మంచి అవకాశం అందరికి రాదు. నువ్వు బాగా చదివి డాక్టర్ కావాలని వాళ్ళ ఆశ’’ అంటూ సుచేతకు ఆమె పేరెంట్స్ ని గుర్తు చేసాడు శ్రీనాద్.

సుచేతను ఎప్పుడు విజయవాడ లో వదిలి రావాలన్నా ఆమెతోపాటు వర్ధన్ రావు, సహజ తప్పకుండా వెళతారు. కారు డ్రైవింగ్ మాత్రం శ్రీనాద్ చేస్తాడు. ఇప్పుడు వర్ధన్ రావుకి అర్జెంట్ పని ఉందని ఆగిపోయాడు. సహజ తను వెళితే తీరా వెళ్ళాక కాలేజిలోపలకి వెళ్ళకుండా మొండికేసి తిరిగి ఇంటికొస్తుందేమో అని ఆ బాధ్యతను శ్రీనాద్ మీద పెట్టారు.

శ్రీనాద్ అయితేనే సుచేతకు నచ్చచెప్పగలడు. ఎలాగైనా కాలేజీలో వదిలి రాగలడు. ఇంతకముందు కూడా అలాగే చేసాడు. అందుకే అతన్ని బాగా నమ్ముతారు.

శ్రీనాద్ సుచేత వైపు చూడకుండా రోడ్డు మీదనే దృష్ఠి నిలిపాడు.

‘’కారాపు నేనిక్కడ దిగి ఎటైనా వెళ్ళిపోతాను. కాలేజీకి మాత్రం వెళ్ళను’’ అంటూ గ్లాస్ డోర్ లోంచి బయటకు చూస్తోంది సుచేత.

అదిరిపడ్డాడు శ్రీనాద్.

‘’ఆపుతావా లేదా?’’అంటూ అరిచింది.

ఇదెక్కడి గోల అని శ్రీనాద్ మనసులో అనుకున్నా పైకి మాత్రం చాలా సహనంగా వున్నాడు.

సుచేత కోపంగా డోర్ కేసి కొడుతోంది.

శ్రీనాద్ కి మిర్రర్ లోంచి సుచేత స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా తింటే కాస్త నెమ్మదిస్తుందేమో అని ఫుడ్ కోర్ట్ కనిపించగానే కారపాడు. సుచేత కార్ డోర్ తీసేలోపలే అతను కారు దిగాడు. సుచేత పారిపోకుండా అతనే డోర్ లాగి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు.

‘’నన్ను వదులు నేను వెళ్ళిపోవాలి’’ అంటూ గింజుకుంది సుచేత.

అతను వదల్లేదు. ఫుడ్ కోర్ట్ దగ్గరకి తీసికెళ్ళాడు.

‘’నీ చేయి కొరికేస్తా! నన్ను వదులు ‘’ అంది.

అతను వదల్లేదు. అలాగే పట్టుకుని లోపలకి తీసికెళ్ళి కూర్చోబెట్టాడు.

ఆ అమ్మాయి చేయి అతని చేతిలోనే వుంది. అందరు చూస్తుంటే గింజుకోవటం ఆపింది.

‘’నా సంగతి నీకు బాగా తెలియదు. మా కాలేజీలో మొన్ననే ఒకమ్మాయిని కొట్టాను’’ అంది.

‘’అందుకేనా ఇప్పుడు వెళ్లనంటున్నావ్?’’ అంటూ వెయిటర్ రాగానే ఆర్డర్ చెప్పాడు.

‘’కాదు’’

‘’అదేలే నాకు తెలుసు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీని తీసుకొస్తుందేమోనని భయపడి వెళ్లనంటున్నావ్! భయపడకు. నేనొచ్చి ఇప్పుడే ఆ అమ్మాయితో మాట్లాడతాను. కావాలంటే వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్లి అయినా మాట్లాడతాను’’

‘’అంత లేదులే వాళ్ళ డాడీకి… ఆయనేమీ మా డాడీ లాగా పెద్ద రిచ్చేమీ కాదు. రోజూ అందరి ఇళ్లకు వెళ్లి పాలు పోస్తుంటాడట’’ అంది చాలా చులకనగా.

‘’అలా చులకన చేసి మాట్లాడటం తప్పు. అంతేకాదు వేరేవాళ్ళ డాడీలను మీ డాడీతో పోల్చి చూడొద్దు. ఎందుకంటే ఎవరి డాడీలు వాళ్లకు గొప్పగా కనిపిస్తారు’’

అన్నాడు.

వెయిటర్ కాజు పకోడీ, బాదం హల్వా తెచ్చి వాళ్ళ ముందు వినయంగా వుంచాడు.

సుచేత వాటిని చూడగానే ప్రేమగా తింటూ ‘’ఇవి నాకు ఇష్టమని నీకెలా తెలుసు?‘’ అంది.

‘’తెలియదు. నేను ఎటు వెళ్లినా స్నాక్స్ టైం లో ఇవే ఇష్టంగా తీసుకుంటాను. నీకు నచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నాడు.

‘’అయితే నేనిప్పుడు కాలేజీకి వెళ్లాల్సిందేనా?’’ అంది. అలా అంటున్న సుచేత కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.

‘’వెళ్ళాలి. భయపడకు. అక్కడ నీకే ఇబ్బంది కలిగినా నేను వెంటనే వచ్చి ఇంటికి తీసికెళ్తాను. కానీ ఈ లోపలే నువ్వు తొందరపడి అమ్మాయిలను కొట్టటం, కొరకడం చెయ్యకు. నేను వస్తానన్నాను కాబట్టి వస్తాను’’ అంటూ నచ్చచెప్పాడు.

‘’మరి నీకు పెళ్లట కదా! రాత్రి మమ్మీ , డాడీ అనుకుంటుంటే విన్నాను. పెళ్లయితే ఎలా వస్తావ్? అప్పుడు కూడా నువ్వు ఈ డ్రైవింగ్ వర్కే చేస్తావా?’’

‘’చేస్తాను. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఈ డ్రైవింగ్ తప్ప నాకు ఇంకో పని రాదు ’’

‘’నువ్వెందుకు చదువుకోలేదు. నీక్కూడా కాలేజీ కి వెళ్లాలంటే భయమా?’’

‘’భయం కాదు. చదువుకోవాలనుకున్న వాళ్లకు అవకాశాలు వుండవు. అవకాశాలు ఉన్నవాళ్ళకి చదువు మీద ప్రేమ ఉండదు. నాది మొదటి రకం. ఇప్పుడు నా వయసు వాళ్లంతా బీటెక్ చేస్తున్నారు. నేనేమో రోజూ ఇలా కారు డ్రైవింగ్ కి వెళ్లి మనీ యర్న్ చేస్తున్నాను. ఎవరి పరిస్థితులు వాళ్ళవి కదా!’’ అన్నాడు చాలా ప్రశాంతంగా.

‘’ఇంత కూల్ గా ఎలా వుంటావు నువ్వు?’’

‘’ఎలా ఉండాలని మనం మన మనసులో అనుకుంటామో అలాగే ఉంటాం. ఇందులో వేరే వాళ్ళ ప్రమేయం కొంచెం కూడా ఉండదు’’

‘’అవునవును’’ అంది సుచేత.

తినటం అయ్యాక బాదంమిల్క్ త్రాగారు.

‘’ఇక వెళదామా?’’ అన్నాడు శ్రీనాద్.

‘’కానీ నువ్వు మళ్ళీ వస్తావా నన్ను తీసికెళ్ళటానికి?’’ అంది సుచేత.

‘’తప్పకుండా వస్తాను’’ అంటూ శ్రీనాద్ లేచి కారు దగ్గరకి వెళ్లాడు.

అతను కారు డోర్ తియ్యగానే కారులో కూర్చుంది సుచేత.

‘’హమ్మయ్యా!’’ అని మనసులో చాలా రిలీఫ్ గా ఫీలై, సుచేతను కాలేజీలో వదిలి ఇంటికెళ్ళాడు శ్రీనాద్.

************

అమూల్య ను చూడగానే ‘’ఎందుకే అలా రొప్పుతున్నావ్? ఎక్కడ నుండి వస్తున్నావ్? పరిగెత్తుకుంటూ వచ్చావా ఏం ? అసలు నువ్వు బయటకెందుకెళ్లావ్ ఇప్పుడు ? సునీల్ ఏడి ఎక్కడున్నాడు ?’’ అంటూ ఒకటే కంగారుపడింది అమూల్య తల్లి సరితమ్మ .

‘’ఆయన పైన గదిలో పడుకుని వున్నారమ్మా! నువ్వు గట్టిగా అరవకు. శ్రేయ ఫోన్ చేస్తే వెళ్ళాను ‘’ అంది అమూల్య.

‘’శ్రేయ ఫోన్ చేసిందా?’’

‘’అవునమ్మా!! శ్రేయకు పెళ్లి చేస్తారట. అదిచెప్పటానికే నన్ను రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను ‘’ అంది అమూల్య.

‘’పెళ్లి చేస్తే మంచిదేగా! దానికిలా రొప్పుకుంటూ రావాలా?’’ అంది సరితమ్మ.

‘’ఎవరితో చేస్తున్నారో తెలుసా?’’

‘’నాకేం తెలుసే…నువ్వు చెబితేగా తెలిసేది ‘’

‘’తెలిస్తే షాకవుతావు‘’ అంది అమూల్య.

‘’షాకయ్యే ఓపిక లేదు. చెప్పు ఎవరితో చేస్తున్నారు శ్రేయ పెళ్లి ?’’

‘’శ్రీనాద్ తో.. ‘’

‘’శ్రీనాద్ తోనా ? మంచిదేగా! నిన్ను కూడా అడిగారు ఆ అబ్బాయికి. నువ్వే చేసుకోనన్నావు. నల్లగా, బక్కగా, ఎత్తుగా వున్నాడని, క్రాఫ్ ఒత్తుగా, రఫ్ గా వుందని. అయినా శ్రేయ నీలాగ పైపై అందాన్ని చూసే పిల్ల కాదులే. పెద్దవాళ్ళు ఎలా చెబితే అలా వింటుంది’’

‘’దాని మొహం. అసలేం బాగున్నాడమ్మా ఆ శ్రీనాధ్? పైగా బాగా లేని కుటుంబం. ఊరి చివర చెరువు పక్కన చిన్న పెంకుటిల్లు. చదువుకూడా పెద్దగా లేదు. ఎవరైనా పిలిస్తే కారు నడపటానికి వెళ్తాడు. పిలవకపోతే అది కూడా లేదు. ఏం చూసిందే శ్రేయ ఆ అబ్బాయిలో…?’’

సరితమ్మ మౌనంగా వింటోంది.

‘’ఎంత వద్దని చెప్పినా శ్రేయ వినటం లేదు. ఏం తింటుందే అతన్ని పెళ్లి చేసుకుని ? నువ్వు చెబితే వింటుందేమో ! రామ్మా శ్రేయ వాళ్ళ ఇంటికి వెళదాం ‘’

‘’వద్దు అమూల్యా! ఆ శ్రీనాద్ మంచివాడు, ఏ అలవాట్లు లేనివాడని విన్నాను. చిన్న వయసు నుండి కారు డ్రైవింగ్ కు వెళుతూ హైదరాబాదులోనే వుంటున్నాడట.

పెళ్లయ్యాక శ్రేయ కూడా అతనితో హైదరాబాదులోనే వుంటుంది. నువ్వు ఎలాగూ చేసుకోనన్నావ్! శ్రేయనైనా చేసుకోనివ్వు. అందం దేముంది ఆనందంగా వుండాలి కానీ’’

‘’ఆనందంగా ఎలా ఉంటుంది? ఆ శ్రీనాద్ దగ్గర లక్షలా, కోట్లా! అయినా రోడ్లు పట్టుకుని ఏ రోడ్డు ఎటు పోతుందో తెలుసుకుంటూ తిరిగే వాడికి ఎలా ఇస్తున్నారమ్మా దాన్ని? నాకు తెలిసి శ్రేయ శ్రీనాద్ ని పెళ్లి చేసుకుంటే ఆనందంగా వుండలేదమ్మా!’’

‘’అదెవరు చూసారు? నీకు నువ్వే ఊహించుకుని మాట్లాడకు. నీకు పెళ్లయి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు. సునీల్ నీకోసం వెతుకుతుంటాడు పైన గదిలో. ముందు నువ్వు పైకెళ్ళు’’

‘’వెళతాను కానీ నువ్వు శ్రేయతో మాట్లాడమ్మా! దాన్ని చూస్తుంటే జాలిగా వుంది. పెద్దవాళ్ళు ఏమైనా అంటారని భయపడుతున్నట్లుంది. ముఖ్యంగా వాళ్ళ వర్ధన్ మామయ్యకు అది బాగా భయపడుతుంది. శ్రీనాద్ ఆయనకు బాగా తెలిసిన డ్రైవర్ అట. అందుకే ఆ భయంతోనే ఒప్పుకుందేమో‘’ అంది అమూల్య.

(ఇంకా వుంది)


Rate this content
Log in

Similar telugu story from Drama