Varun Ravalakollu

Comedy Romance

4.8  

Varun Ravalakollu

Comedy Romance

ఆమెతో నా ప్రయాణం...!!

ఆమెతో నా ప్రయాణం...!!

8 mins
856


లొకేషన్: రాజమండ్రి రైల్వేస్టేషన్ టైం: రాత్రి 9:35

“రాజమండ్రి నుండి సికింద్రాబాద్ వెళ్లబోయే గౌతమీ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరుటకు సిద్దముగానున్నది” అని అనౌన్స్మెంట్ వస్తుంది. తాను ఎక్కబోయే రైలు అదే అయినా కానీ స్టార్ట్ అయ్యాక ఎక్కుదాంలే అనుకుని తన మొబైల్ లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు సంజయ్. ఇంతలో తన ఫ్రెండ్ రఘు నుండి కాల్ వస్తుంది.

రఘు: ఏరా తిన్నావా?

సంజయ్: హా తిన్నాను

రఘు: స్టేషన్ కి వచ్చేసావా?

సంజయ్: వచ్చాను

రఘు: ట్రైన్ ఎక్కాక దాహంగా ఉంటుంది కదా వాటర్ బాటిల్ తీస్కున్నావారా?

సంజయ్: ఒరేయ్ నువ్వింక ఈ కామెడి క్వశ్చన్స్ ఆపుతావా? మీ ఇంటికి వెళ్ళానా, మీ ఇంట్లో వాళ్ళు నీ కోసం ఇచ్చినవన్నీ జాగర్తగా తీస్కొస్తున్నానా అనేది నీ అసలు క్వశ్చన్. కంగారుపడకు అన్నీ తీసుకొస్తున్నాలే.

రఘు: నువ్వు సూపర్ రా బాబు.

సంజయ్: నా సంగతి సరే. మీ ఇంట్లో వాళ్ళే చాలా అవుట్ డేటెడ్ గా ఉన్నారు.

రఘు: అదేంట్రా అలా అన్నావ్?

సంజయ్: మరి లేకపోతే ఏంట్రా, హైదరాబాద్ లో మన రూం దగ్గర వీధికో స్వీట్ స్టాల్ ఉంటది, అయినా సరే మీ అమ్మ జంతికలు సున్నుండలు చేసి పంపుతుంది.

రఘు: అది ప్రేమరా.

సంజయ్: సరే మీ నాన్నేంటి మరి 50,000 కాష్ నా చేతికిచ్చి తీసుకెళ్లమంటాడు. ఆన్లైన్లో వేస్తే అరక్షణంలో వచ్చేస్తాయ్ కదరా బాబు.

రఘు: అది నమ్మకం రా.

సంజయ్: మీ మావయ్య అయితే మరీ ఓవర్ రా బాబు. తను రాసే పిచ్చి కవితలన్నీ మూట కట్టి మరీ ఇస్తాడు. ఎవడికైనా డబ్బులిచ్చి టైపు చేయించి నీకు మెయిల్ చేయచ్చు కదా.

రఘు: అది అభిమానం రా.

సంజయ్: ఓవర్ ఏక్షన్ రా. అయినా మళ్ళీ ఈ మ్యుజియం ఐటమ్స్ అన్నీ నాతో పంపుతారేంట్రా. సరేలే ట్రైన్ స్టార్ట్ అయ్యేలా ఉంది, నేను మార్నింగ్ దిగాక కాల్ చేస్తా.

అలా ట్రైన్ ఎక్కి తన బెర్త్ S4 23 (సైడ్ లోయర్) ఒకసారి చూసుకుని ఫేస్ వాష్ చేసుకుందాం అని బోగి ఎంట్రన్స్ దగ్గర ఉన్న మిర్రర్ దగ్గరికి వెళ్తూ ఉన్న సంజయ్ కి ఒక అబ్బాయి, అమ్మాయి “హాయ్..ఐ యామ్ రాజేష్”, “ఐ యామ్ స్నేహ” అని ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం కనిపిస్తుంది. అది చూసి అలాంటి సిచ్యువేషన్స్ తనకెందుకు రావు అని తనలో తాను పడే బాధపడతాడు.

“ఇక్కడే కలిసినట్టున్నారు ఇద్దరూ, సూపర్ ఉంది ఆ అమ్మాయి. అదృష్టం అంటే నీదిరా రాజేష్ గా” అనుకుంటూ మిర్రర్ దగ్గరికి వెళ్లి మిర్రర్లో తన మొహం చూస్కుని “ఏరా సంజు, ఎప్పుడైనా నీకిలాంటి అమ్మాయి కలిసిందా జర్నీలో” అని ఆలోచిస్తూ ఒకసారి పాత అనుభవాలు రివైన్డ్ వేసుకుంటాడు. అలా ఊహించుకున్నప్పుడు తనకి ఒకసారి ఒక ముసలాయన, ఒకసారి ఒక కారు నలుపుగా ఉన్న అమ్మాయి, ఒకసారి ఒక 6.5 అడుగుల ఎత్తున్న మనిషి, ఒకసారి నడవడానికి కూడా ఓపిక లేని బామ్మ, తన పక్క సీట్లో కూర్చున్న సిచ్యువేషన్స్ గుర్తొచ్చాయ్. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి రియాలిటీకి వచ్చి “బాబోయ్, చరిత్రలో అంతా దరిద్రమే ఉంది” అనుకుని మొహం కడుక్కుని వెనక్కి తిరిగి తన ప్లేస్ దగ్గరికి నడుస్తూ కర్చిఫ్ తో మొహం తుడుచుకుంటూ, “అయినా మన పిచ్చి కానీ మన జాతకానికి ఉప్మాలో జీడిపప్పు తగలడమే కష్టం, అలాంటిది జర్నీలో అందమైన అమ్మాయి ఎక్కడ తగులుద్ది.” అనుకుంటూ తన ప్లేస్ కి చేరుకుంటాడు.

అలా తన ప్లేస్ కి వచ్చిన సంజయ్ కి తను ఏ మాత్రం ఊహించని విధంగా ఒక అందమైన అమ్మాయి తన ప్లేస్ లో కుర్చుని ఏదో హడావుడిగా ఎవరికో కాల్ చెయ్యడానికి ట్రై చేస్తూ చాలా కంగారు పడుతూ కనిపిస్తుంది. సంజయ్ కి అక్కడున్న అమ్మాయి నిజామా కాదా అనే కన్ఫ్యూషన్ కి అసలు ఆ అమ్మాయి ఎందుకంత కంగారు పడుతూ ఉంది, తన ప్లేస్ లో ఎందుకు కూర్చుంది అన్న కన్ఫ్యూషన్ తోడైంది.

కానీ ఈలోపు సంజయ్ రావడాన్ని గమనించిన ఆ అమ్మాయి “ఈ సీట్ మీదా” అని అడుగుతుంది అమాయకంగా,

సంజయ్: అవును (ఆశ్చర్యంగా)

అమ్మాయి: సారీ..సారీ.. కన్ఫ్యూస్ అయ్యాను (అని ఆ ప్లేస్ నుండి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది)

సంజయ్: ఇట్స్ ఓకే… మీ బెర్త్ నెంబర్ ఏంటండి?

అమ్మాయి: ఈ బెర్తే అనుకుని వచ్చాను. కానీ ఏదో మిస్టేక్ జరిగింది. ఇట్స్ ఓకే (అని మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడి అవుతుంది)

సంజయ్: అరె పర్వాలేదు.. కాసేపు కూర్చోండి, ట్రైన్ ఆల్రెడి మూవ్ అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చుని అలోచించి అప్పుడు వెళ్ళండి. ఏం పర్వాలేదు!

అమ్మాయి: మ్మ్ (ట్రైన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇంక చేసేదేమీ లేక ఆలోచిస్తూ కూర్చుంటుంది)

ఆమె పరిస్థితిని అర్ధం చేస్కుని తన బాగ్ లో ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి ఆ అమ్మాయి వాటర్ తాగిన తర్వాత

సంజయ్: మ్మ్… రిలాక్స్ అయ్యారా, ఇప్పుడు చెప్పండి మీ బెర్త్ నంబర్ ఏంటి?

అమ్మాయి: యక్చువల్లీ...సడన్గా మా అన్నయ్య ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అవ్వడం వల్ల నాకు టికెట్ దొరకలేదు. లక్కీగా నా ఫ్రెండ్ స్వాతి ఇదే రోజుకి రిజర్వేషన్ చేయించుకుంది. సో నేను జనరల్ టికెట్ తీస్కుంటే ఇద్దరం కలిసి అడ్జస్ట్ అయ్యి వెళ్ళచ్చు అని చెప్పింది. తను S14 23 చెప్పినట్టు గుర్తు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే తను లేదు. దాంతో నాకు కంగారు వచ్చి తనకి కాల్ చేస్తున్నా కానీ అస్సలు కనెక్ట్ అవ్వడం లేదు. ఈలోపు మీరు వచ్చారు. అప్పుడు అర్ధమయ్యింది నేను రాంగ్ ప్లేస్ కి వచ్చాను అని.

సంజయ్: S14 23 అయితే ఇదే బెర్త్, సో మీరు కోచ్ కానీ బెర్త్ కానీ కన్ఫ్యుజ్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి తనేం చెప్పిందో,

అమ్మాయి: బెర్త్ మాత్రం 23 కన్ఫర్మ్ అండి. ఎందుకంటే తను చెప్పినప్పుడే నేను అనుకున్నాను బెర్త్ నెంబర్ 23 ఈరోజు డేట్ కూడా 23, భలే కోయిన్సైడ్ అయ్యాయే అని.

సంజయ్: ఇంక డౌట్ లేదు. మీరు కోచ్ నెంబర్ మర్చిపోయారు. సరే మళ్ళీ ఒకసారి ఒకసారి ట్రై చెయ్యండి మీ ఫ్రెండ్ కి.

కానీ ఇంకా ‘నాట్ రీచబుల్’ రెస్పాన్స్ వస్తుంది. దాంతో సంజయ్ “మీ దాంట్లో సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. సరే నా ఫోన్ నుండి ట్రై చేస్తా, ఒకసారి నెంబర్ చెప్పండి” అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి తన ఫోన్లో ఉన్న తన ఫ్రెండ్ కాంటాక్ట్ ఓపెన్ చేసి సంజయ్ కి చూపిస్తుంది. సంజయ్ కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో సంజయ్ కి మనసులో ఒక తెలియని ఆనందం మొదలవుతుంది. ఆ అమ్మాయి ఫ్రెండ్, ఫోన్ లిఫ్ట్ చెయ్యనంత వరకు తను ఎక్కడికీ వెళ్ళదు, తనతోనే ఉంటుంది కాబట్టి!

సంజయ్: అయ్యో, సారీ అండి, స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది (పైకి బాధని నటిస్తూ)

అమ్మాయి: అబ్బా ఏంటిది! అసలు ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేసింది (తన పరిస్థితిని తలుచుకుంటూ చిన్నగా తన స్నేహితురాలిని తిట్టుకుంటుంది)

సంజయ్: ఊరు వెళ్ళే హడావుడిలో ఛార్జింగ్ పెట్టి ఉండకపోవచ్చు. ఇప్పుడు అది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండచ్చేమోనండి

అమ్మాయి: నిజమేనండి. నేనున్న బాధలో ఇదేమీ ఆలోచించకుండా అలా అనేసాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. అండ్ షి ఈజ్ మై రూమ్ మేట్ ఆల్సో. అలాంటిది నేనే అపార్ధం చేసుకున్నా తనని. బట్ మీరు భలే ఆలోచించారండి.

ఆ మాటకి చెప్పుకోలేనంత ఆనందాన్ని పొందిన సంజయ్ తనను తానే పొగుడుకుంటాడు మనసులో.

సంజయ్: ఏదో మీ అభిమానమండి (సిగ్గుపడుతూ)

అమ్మాయి: సరే, థాంక్స్ అండి. నెక్స్ట్ స్టేషన్లో దిగి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను.

సంజయ్: దిగి? ఏ కోచ్ లో చూస్తారు?

అమ్మాయి: పక్క కోచ్ లో (కరెక్ట్ ఆన్సర్ లేకపోయినా సరే ఏదో సర్ది చెప్పడానికి)

సంజయ్: పక్క కోచ్ లో కూడా లేకపోతే..?

అమ్మాయి: ఆ పక్క కోచ్ లో చూస్తాను.

సంజయ్: ఈ ట్రైన్ కి మొత్తం పద్నాలుగు బోగీలు ఉన్నాయ్. స్టేషన్ కి ఒక బోగి చూసినా కూడా పద్నాలుగు స్టేషన్లు కావాలి. అప్పటికి మీ ఫ్రెండ్ ఏం ఖర్మ! ఏకంగా ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్’ అన్న బోర్డునే చూడచ్చు మీరు.

అమ్మాయి: ఒకవేళ మధ్యలోనే దొరకచ్చు కదండి (అమాయకంగా)

సంజయ్: ఒకవేళ లాస్ట్ బోగిలో ఉంటే పరిస్థితి ఎంటండి. అందుకే నేను చెప్పేది వినండి. మీ ఫ్రెండ్ ఎలాగా ఛార్జింగ్ పెట్టుకున్నాక మీకు కాల్ చేస్తారు.

అమ్మాయి: ఒకవేళ చార్జర్ తీసుకురాకపోతే.

సంజయ్: ఏవండీ, మీ ఫ్రెండ్ ఏమైనా సూపర్ వుమన్ ఆ ఏంటి? మధ్యలో ట్రైన్ దూకేసి ఎగురుకుంటూ రూంకి వెళ్ళిపోవడానికి. తనైనా సరే సికింద్రాబాద్ లోనే కదా దిగేది. సో అప్పుడు తనని ఎలాగైనా కలవచ్చు. ఏమంటారు?

అమ్మాయి: కానీ ఈలోపు మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది (ఇంకా ఏదో ఆలోచిస్తూ)

సంజయ్: ఇంక మీరేమీ ఆలోచించకండి. నా మాట వినండి. మీకు నిద్ర వస్తే చెప్పండి పక్కకి కుర్చుంటా. బోర్ కొడితే చెప్పండి, కబుర్లు చెప్తా. దయచేసి ఈ టైంలో ఈ రెండూ కాని ఆప్షన్ అడగకండి.

అమ్మాయి: చాలా థాంక్స్ అండి (నవ్వుతూ)

ఆ అమ్మాయి అక్కడ ఉండడానికి ఒప్పుకోవడం సంజయ్ కి ఎక్కడలేని సంతోషాన్నిస్తుంది. “అయ్య బాబోయ్, ఇదేంటి అన్నీ ఇలా కలిసొచ్చేస్తున్నాయ్. నాకెందుకో ఆ దేవుడు నా చేతి వంట తినిపెట్టే అమ్మాయిని పంపిచేసినట్టుగా అనిపిస్తుంది.”

ఈ లోపు పక్కన ఒక ముసలాయన లోయర్ బెర్త్ కింద ఉన్న తన బాగ్ తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటే సంజయ్ అతనికి హెల్ప్ చేస్తాడు.

అమ్మాయి: మీ పేరు ఏంటండి.

సంజయ్: సంజయ్. అంతా సంజూ అని పిలుస్తారు. మీ పేరు?

అమ్మాయి: జ్యోతిప్రియ

అది విన్న సంజయ్ మనసులో “జ్యోతి ప్రియ. అంటే JP. జీడిపప్పు.. JP. అంటే నా ఉప్మాలో జీడిపప్పు ఈ అమ్మాయేనా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిని వదులుకోకూడదు. తింగరి వేషాలు వేసి చెడగొట్టుకోకుండా కాస్త డీసెంట్ గా బిహేవ్ చెయ్యాలి.” అనుకుని మురిసిపోతాడు.

సంజయ్: మీరేం చేస్తూ ఉంటారు?

జ్యోతిప్రియ: TCS లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. మీరు?

సంజయ్: ఇన్ఫోసిస్ అండి.

జ్యోతిప్రియ: గుడ్ గుడ్

సంజయ్: ఇంకా...? మీరు సినిమాలు బాగా చూస్తారా?

ఇలా కాసేపు వాళ్ళిద్దరూ మాటల్లో మునిగిపోతారు. సంజయ్ ఏదో చెప్తూ ఉంటే జ్యోతిప్రియ ఇంటరెస్టింగ్ గా వినడం, నవ్వడం ఇలా తన మాటల్ని చాలా ఎంజాయ్ చేస్తుంది.

ఇంక జ్యోతిప్రియకి నెమ్మదిగా నిద్ర రావడం గమనించిన సంజయ్ “ప్రియా, మీరింక పడుకోండి”

జ్యోతిప్రియ: అహ లేదు. మీరు పడుకోండి నేను కూర్చుంటా. మీరు కాసేపు పడుకున్న తర్వాత నేను పడుకుంటా, అప్పుడు మీరు కుర్చుందురు.

సంజయ్: సూపర్ ఐడియా, కాకపోతే చిన్న చేంజ్. ముందు మీరు పడుకోండి, ఆ తర్వాత నేను పడుకుంటా.

జ్యోతిప్రియ: సరే అయితే, కాకపోతే ఊర్లో ఖర్చైన డబ్బులంతా రాసుకోవాలి. రాస్కుని ఒక 10 మినిట్స్ లో పడుకుంటా. ఒకేనా?

సంజయ్: మీ ఇష్టమండి బాబు.

తన లెక్కలు రాసుకోవడం పూర్తయ్యాక పడుకున్న జ్యోతిప్రియ వంక చూస్తూ కళ్ళు తెరుచుకునే ఏవేవో ఊహల్లో తెలుతూ ఒక పక్కగా కుర్చుని ఉంటాడు సంజయ్.

కానీ పడుకుని ఉన్న జ్యోతిప్రియకి, సంజయ్ తను కంగారు పడుతుంటే వాటర్ ఇచ్చి సర్దిచెప్పడం, ముసలాయన బాగ్ తీసుకోవడంలో కష్టపడుతుంటే హెల్ప్ చెయ్యడం, స్విచ్ ఆఫ్ అయిందని తన ఫ్రెండ్ ని అపార్థం చేసుకుంటే అర్థమయ్యేలా చెప్పడం, ఏవేవో కబుర్లు చెప్పడం, ఆఖరిగా తను కూర్చుని పడుకోవడానికి ప్లేస్ ఇవ్వడం లాంటివి అన్నీ గుర్తొచ్చి సంజయ్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఇలాంటి ఆలోచనలతో జ్యోతిప్రియ నిద్రలోకి వెళ్ళిపోతుంది.

కాసేపటికి ఏదో స్టేషన్ లో ట్రైన్ ఆగుతుంది. అక్కడ అనౌన్సుమెంట్ కి జ్యోతిప్రియకి మెలకువ వచ్చి చూస్తుంది. ఒక మూల చలి వల్ల ముడుచుకుని కూర్చున్న సంజయ్ ని చూసి జాలి వేస్తుంది. వెంటనే లేచి సంజయ్ ని పడుకోమని తను కుర్చుంటా అని అంటుంది.

సంజయ్: లేదు లేదు తర్వాత పడుకుంటా. మీరు ఇంకాసేపు పడుకోండి.

జ్యోతిప్రియ: ప్లీజ్ సంజయ్ గారు. ఇంక నా మాట వినండి. ఇప్పటికే నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇంక మీరేమీ మాట్లాడకుండా పడుకోండి అంతే!

జ్యోతిప్రియ అంతలా చెప్పేప్పటికి ఇంక సంజయ్ “సరే వాష్ రూమ్ కి వెళ్ళొచ్చి పడుకుంటాను” అని వెళ్లాడు.

వాష్ రూమ్ నుండి బయటకొచ్చిన సంజయ్ కి ఎంట్రెన్స్ దగ్గర ఉన్న ఒక నోటీసు బోర్డు మీద ‘అమ్మాయిలను టీజ్ చేసినా హరాస్స్ చేసినా కఠిన కారాగార శిక్ష తప్పదు’ అని ఉండడం చూసి “జ్యోతిప్రియని ఇంప్రెస్ చేసే ప్రాసెస్ లో మనమేమి ఎదవ ఓవర్ ఏక్షన్ చెయ్యలేదు కదా.. అయినా పడుకున్న అమ్మాయి లేచి మరీ పడుకోమంది అంటే ఏమైనా హర్ట్ అయ్యిందా? అసలు తను ఉందా..” అనుకుని ప్లేస్ దగ్గరికి కంగారుగా వెళ్లి చుసిన సంజయ్ కి షాక్ తగులుతుంది. ఎందుకంటే అక్కడ జ్యోతిప్రియ ఉండదు. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. కంగారుగా ట్రైన్ దిగి ప్లాట్ఫార్మ్ మీద అటూ ఇటూ తిరిగి వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. ఒకవేళ తన ఫ్రెండ్ కనిపిస్తే వెళ్లిపోయిందేమో అనుకుని ఆ నెంబర్ కి కాల్ చేద్దాం అని అనుకుంటాడు. కానీ సంజయ్ మొబైల్ లో చార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంక చేసేదేమీ లేక నిరుత్సాహంతో తన ప్లేస్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు.

ఇంత తక్కువ సమయంలోనే అంతగా నచ్చిన జ్యోతిప్రియ వెళ్ళిపోవడానికి కారణం తెలీక మొదట్లో కాస్త బాధపడతాడు. కానీ వీలైతే ఎలాగైనా ట్రైన్ దిగగానే పట్టుకుందాం. ఒకవేళ మిస్ అయినా తన ఫ్రెండ్ నెంబర్ ద్వారా కనిపెడదాం. ఇవేమీ కాకపోయినా TCS ఫ్రెండ్స్ ద్వారా కనిపెడదాం అనుకుని సర్దిచెప్పుకుంటాడు.

జ్యోతిప్రియతో అప్పటి దాకా జరిగిన ఎపిసోడ్ అంతా నెమరు వేసుకుంటూ హ్యాపీగా పడుకుందాం అని అనుకుని ఆ అమ్మాయిని చూసిన క్షణం నుండి గుర్తు తెచ్చుకోవడం మొదలు పెట్టిన సంజయ్ కి, సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. జ్యోతిప్రియని తన ఫ్రెండ్ స్వాతి నెంబర్ అడిగినప్పుడు జ్యోతిప్రియ తన మొబైల్ లో చూపించిన కాంటాక్ట్ నేమ్ ‘రమ్య’ అని చూసినట్టుగా గుర్తొస్తుంది. దాంతో సంజయ్ కి తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది.

“అయినా జ్యోతిప్రియకి స్వాతి అన్న అమ్మాయి అంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు, అండ్ వీళ్ళిద్దరూ రూమ్ మేట్స్ కూడా అయినప్పుడు తన నెంబర్ అడిగితే నోటితో చెప్పగలగాలి కానీ ఫోన్ లో చూడడం ఎందుకు? అసలు తనని నమ్ముకుని వచ్చిన ఫ్రెండ్ ఇంకా తనని కలవలేదని తెలిసి, ఎక్కడ చిక్కుకుందో తెలియని స్వాతి, తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయినా కూడా పక్కన ఎవర్నైనా మొబైల్ అడిగి జ్యోతిప్రియకి కాల్ చెయ్యకుండా మాత్రం ఎలా ప్రశాంతంగా ఉండగలదు. ఎక్కడో తేడాగా ఉంది” అని అనుకుంటూ ఉంటాడు సంజయ్.

ఈ ఆలోచనలలో ఒక్కసారిగా మైండ్ ఆక్టివేట్ అవ్వడం వల్ల, వెంటనే తన బాగ్ లో పెట్టుకున్న డబ్బు కోసం చుసిన సంజయ్ కి ఆ మనీ వాలెట్లో డబ్బుకి బదులుగా ఒక లెటర్ ఉండడం చూసి భయంతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది.

ఆ లెటర్ లో...

“హాయ్ సంజయ్, నీ డబ్బుకి బదులు ఈ లెటర్ చుసిన నీకు ఇప్పటికే మ్యాటర్ పూర్తిగా అర్థం అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా అవకాశం వచ్చినప్పుడు తెలివిగా దొంగతనం చెయ్యడమే నా ప్రొఫెషన్. రాజమండ్రి రైల్వేస్టేషన్లో ఒక మార్బుల్ గట్టు మీద ఒక సిమెంట్ పిల్లర్ కి ఆనుకుని కూర్చున్న నాకు అదే పిల్లర్ కి అవతలి పక్కన కూర్చున్న నువ్వు, నీ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడుతున్నపుడే నీ దగ్గర 50,000 క్యాష్ ఉందని నాకు అర్థమైంది. ఆ తర్వాత నీ బెర్త్ చెక్ చేసుకుని ఎంట్రన్స్ దగ్గర మిర్రర్ దగ్గరకి వెళ్ళొచ్చిన గ్యాప్ లోనే ప్లాన్ వేసి, నీ ప్లేస్ లో కూర్చున్నాను. ఇక ఆ తర్వాత అంతా నీకు తెలిసిందే.

డబ్బు దొబ్బేసినందుకు నేనేమి సిగ్గు పడట్లేదు. ఎందుకంటే అది నా ప్రొఫెషన్. కానీ ఒక్కదానికి మాత్రం నువ్వు నన్ను క్షమించాలి సంజయ్. నీ మంచితనం, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి కోసం నువ్వు పడ్డ తాపత్రయం, ఆ ప్రాసెస్ లో బయటపడ్డ నీ అమాయకత్వం, ఇవన్నీ నిజంగా నాకు చాలా నచ్చాయి. అలాంటి నిన్ను మోసం చేశానే అని బాధగా ఉంది. కానీ ఇదంతా తప్పదు. ఈసారి నుండి ఇలా ప్రయాణంలో పరిచయమైన అమ్మాయి కోసం కాకుండా, నిన్ను అర్థం చేస్కునే అమ్మాయి కోసం నీ ప్రేమని ఉపయోగించు.

బై ది వే, ఆ నెంబర్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నీ టైం వేస్ట్ చేసుకోకు. అల్ ది బెస్ట్ సంజయ్.

ఇట్లు, నిన్ను మోసం చేసినా నీ మంచి కోరుకునే స్వప్న, ఏంటి ఆలోచిస్తున్నావ్? ఇదే నా అసలు పేరు”

***


Rate this content
Log in

Similar telugu story from Comedy