యశస్వి ✍️

Comedy

5  

యశస్వి ✍️

Comedy

కొత్తరకం బ్రతుకుతెరువు

కొత్తరకం బ్రతుకుతెరువు

3 mins
35.1K


"ఏరా..!! రాము ఉదయం నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్లావు పైగా నీకు ఉద్యోగం లేదు సంపాదన లేదు" అని అడిగాడు అప్పారావు.


"ఒరేయ్..!! అప్పిగా నాకు ఉద్యోగం లేదు కరెక్టే, కానీ నేను సంపాదిస్తున్నా, ఎలాగో తెలుసా...! నాలుగేళ్లు కష్టపడి సంపాదించిన డిగ్రీ ఉంది కదా..! ఆ డిగ్రీ మీద మన ప్రభుత్వం వాళ్లు డబ్బులు ఇస్తారంట! అదీ ప్రతీ నెల వెయ్యి రూపాయలు, అది కాకుండా కిలో బియ్యం ఎంత..?రూపాయ్యే కదా...!!. మా కుటుంబం మొత్తానికి ఒక ఇరవై కేజీలు వరకు వస్తాయి. ఈ రెండూ కాకుండా అమ్మకి ఏమో!! వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. తమ్ముడికి ఏమో!! అంగవైకల్యం పెన్షన్ వస్తుంది. నెలకి ముగ్గురికి కలిపి ఒక ఆరు వేల వరకు వస్తాయి, అలాగే మధ్యాహ్నం భోజనం చేయడానికి ఐదు రూపాయల క్యాంటీన్ ఉంది. ఇక బ్యాంకు లో ఉన్న పొలం మీద అప్పులు అంటావా..!! మళ్లీ ఎలక్షన్ వచ్చే టైంకి ఎవరో ఒకరు రుణమాఫీ చేస్తారు. ఇంకెందుకు రా..!! ఉద్యోగం చేయడం" అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రాము.


రాము గాడు చెప్పిన సమాధానంకి అప్పారావు ఖంగుతిని "నీ సంపాదన ముందు అనిల్ అంబానీ కూడా దిగదుడుపే...!!" అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


తర్వాతి రోజు రాము అప్పారావు కలిసి సిటీకి వెళ్లారు. 'వీడు అసలే చాలా పిసినారితనం గా ఉంటాడు, ఇంత ఖర్చుపెట్టి సిటీ కి ఎందుకు తీసుకొచ్చాడు అబ్బా!?' అని ఆలోచిస్తున్నాడు అప్పారావు.


ఇద్దరూ కలిసి ఒక ఫోటో స్టూడియో కి వెళ్లి రాముకి ఒక మూడు ఫోటోలు తీయించుకున్నారు.


"ఒరేయ్ రామూ...!! ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఫోటోలు ఎందుకు తీయించుకున్నావు రా?" అని అడిగాడు అప్పారావు.


అప్పుడు రాము "నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా, అందుకనే ఈ ఫోటోలు!!" అన్నాడు.


అప్పుడు అప్పారావు వెటకారంగా "నువ్వు పెళ్లి కూడా చేసుకుంటావా..!!" అని అడిగాడు.


"అరేయ్ వెర్రి అప్పారావు!! పెళ్లి కూడా ఒకరకంగా డబ్బుకి సోర్స్ రా..!! అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అర్థం కాలేదా చెప్తా విను" అంటూ రాము పెళ్లి గురించి చెప్పడం మొదలుపెట్టాడు."నేను పెళ్లి దగ్గరలో ఉన్న ఒక రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటాను. అలాగే ఒకే ఒక్క కూతురు ఉన్న సంబంధం మాత్రమే చూడమని వాళ్లకి చెప్పాను. పెళ్లి అయిన తర్వాత, ఉదయం తొమ్మిది నుంచి పదకుండు గంటలవరకు మాత్రమే ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓన్లీ ఆ ఫంక్షన్లో టిఫిన్స్ మాత్రమే ఉంటాయి. భోజనాలు ఉండవు, పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరూ చదివింపులు రాస్తారు. అదీ కాకుండా వస్తూ వస్తూ నా భార్య నా గురించి కట్నం తీసుకొస్తుంది, ఎలాగో ఒక్కటే కూతురు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నాకు వస్తుంది. ఇంకా టిఫిన్ ఖర్చు అంటావా...!! నాకు ఒక మూలకు రావు. పెళ్లికి వచ్చిన వాళ్ళు చదివింపులు తో పాటు మిక్సీలు, గ్రైండర్లు, ఉంగరాలు ఇలా ఏవేవో బహుమతులు ఇస్తూ ఉంటారు. ఎటు చూసుకున్నా నా లెక్క పక్కాగా ఉంటుంది. అందుకనే త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వేమంటావ్!?" అని అడిగాడు రాము.


ఈసారి రాము సమాధానం వల్ల అప్పారావుకి కొంచెం మతిభ్రమించింది. ఆ షాక్ నుండి తెరుకోవడంకి అప్పారావు దగ్గరలొ ఉన్న ఒక కూల్ డ్రింక్ షాప్కి వెళ్లి సోడా తాగాడు. అప్పారావు మెదడు కొంచెం కుదుట పడ్డాక బయలుదేరారు.


రాము చెప్పిన ప్రకారము ఒక సంబంధం కుదిరింది. తాను అనుకున్న విధంగానే అన్నీ జరిగాయి. ఇదంతా చూస్తున్న అప్పారావు నవ్వాలో ఏడవాలో అర్థం కాక వచ్చిన అందరూ అతిథులతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు.


దైవం కూడా రాము కి అనుకూలంగా ఉన్నట్లు తన అత్తమామలు బకెట్ తన్నేశారు. ఆస్తిపాస్తులు కూడా రాము చూసుకుంటున్నాడు. ఇప్పుడు రాము సంపాదన నెలకు దాదాపు ఇరవై వేలు దాకా పెరిగింది.


కానీ..!! అప్పారావు ఇంకా ఎనిమిది వేల జీతానికి ఎమ్మార్వో ఆఫీస్ లో క్లర్కుగా పని చేస్తున్నాడు. అదే ఎమ్మార్వో ఆఫీస్ కి రాము తన మామగారి పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులన్నీ తనకు పుట్టబోయే బిడ్డకు చెందే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చాడు.


ఇది చూస్తున్న అప్పారావు తెగులు వచ్చిన కోడి లాగా కొట్టుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాము వాళ్ళ అమ్మ చనిపోయింది. దహన సంస్కారాలు చేస్తే డబ్బులు ఖర్చు అవుతుందని...!, రాము ఆ ఊరి ప్రెసిడెంట్ సహాయంతో వాళ్ళ అమ్మ శవాన్ని దగ్గర్లో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశాడు.ఇలా సొంత అమ్మ శవాన్ని దానం చేయడం వల్ల, తనకు సొసైటీలో మంచి పేరు వచ్చింది.అతను చాలా గొప్ప వ్యక్తి అని ఒక సంఘసంస్కర్తని ఎవరికి వారే ఫేస్బుక్కుల్లో వాట్సాప్ లో ప్రచారం చేశారు.


ఇతని మంచితనాన్ని చూసిన ఆ ఊరి ఎమ్మెల్యే ఇతనికి సన్మానం కూడా చేసేసాడు. ఆ సన్మానంతో రాము ఒక సెలబ్రిటీ గా మారిపోయాడు.ఆ ఊరి గ్రామంలో పంచాయతి ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి రాము చెందిన కులానికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అందువల్ల రాముని ఎలక్షన్స్ లో నిలబడమని కోరారు.

ప్రజలు అందరికీ రాము తెలివితేటలు బాగా తెలుసు, ఇతని సర్పంచిగా చేస్తే పైసా ఖర్చు లేకుండా గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు అని నమ్మి తనని ఊరి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు.

గెలిచిన రెండు రోజుల తర్వాత ఎమ్మార్వో ఆఫీస్ కి పని మీద వెళ్తే అక్కడ అప్పారావు రాముని చూసి అతను సర్పంచ్ అని తెలుసుకుని తన మతిభ్రమించి పిచ్చివాడిగా మారిపోయాడు. మతిభ్రమించిన అప్పారావు వెర్రి కేకలు వేస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ వున్నాడు. అక్కడ ఉన్న జనం అందరూ కూడా అప్పారావు వంక జాలిగా చూడసాగారు.ఎవరో మహానుభావుడు పిచ్చి ఆసుపత్రికి సమాచారం ఇవ్వగా, వాళ్ళు వచ్చి అప్పరావుని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు రాము "అప్పారావు కుటుంబాన్ని తాను పోషిస్తాన్నాని, అన్ని విధాలుగా ఆదుకుంటా" అని జనం ముందు మాట ఇచ్చాడు. అందరూ అప్పారావుని మర్చిపోయి, రాము చెప్పిన మాటలు విని చప్పట్లతో రాముని గౌరవించారు.ఇలా ఎన్నో అనుకోకుండా కలుపుకున్న సంధర్భాలు, రామూని సమాజంలో ఒక గొప్ప గుర్తింపు ఉన్న వ్యక్తిగా చేశాయి.కృషితో నాస్తి దుర్భిక్షం అని ఎవరు చెప్పారో, జీవితాల్లో కృషి ఉంది గాని దానితోపాటు దుర్భిక్షం కూడా ఉంది.

కానీ అది కొందరి జీవితాల్లో మాత్రమే.


ఇంకొంతమంది లోకజ్ఞానంతో లోకాన్ని ముంచేసే తెలివితేటలతో బ్రతికేస్తున్నారు. లోకం పోకడలు తెలుసుకుంటే సంఘసంస్కార్త ఎం ఖర్మ....ఇస్రో ఛైర్మెన్ కూడా అవచ్చు


******

@యశస్వి✍️Rate this content
Log in

Similar telugu story from Comedy