ranganadh sudarshanam

Comedy

3.8  

ranganadh sudarshanam

Comedy

దీపారాధన

దీపారాధన

4 mins
1.2K


....దీపారాధన ....

(సీరియల్ హాస్య కథ)

ఉదయమే ఇంటిముందు భజన సంకీర్తన వినపడగానే అబ్బా ఏంటా... అనుకోని లైట్ ఆన్ చేసి తలుపు తెరుచుకొని బైటికి వచ్చాను..

భవాని మాల దారులు,

అయ్యప్ప మాల దారులు,

ఆంజనేయ మాల దారులు,

రామ భక్తులు,బాబా భక్తులు...

వారితో పాటు నా శ్రీమతి, మా అమ్మ,

మా అత్తగారు,నా చెల్లెలు,మా పిల్లలు ఊరు వాడ ..ఇరుగు పొరుగు పిల్ల.. జల్లా అంతా చక్కగా స్నానాదికాలు ముగించుకొని,శుభ్రoగా పూజా వస్త్రాలు ధరించి,విభూది నామలు,కుంకుమ బొట్లు పెట్టుకొని చేతిలో పూజా ద్రవ్యాలతో, కొందరు చేతులతో తాళాలు కొడుతూ,కొందరు చప్పట్లు కొడుతూ..చెక్క భజనలతో,తప్పెట గూళ్లతో,రకరకాల వాయిద్యాల హోరుతో.. జోరుగా నామ కీర్తనలు పాడతున్నారు.

కొందరు భక్తి పారావశ్యంతో పూనకం వచ్చి ఊగుతున్నారు.

అలా... నోరెళ్ళబెట్టి చూస్తూ వుండగానే ..ఎవరైనా చూస్తే బాగోదు మీరు త్వరగా రండి అంటూ నా శ్రీమతి కొట్టినట్లు ఆజ్ఞా పించింది...

అంతేగా ...

అంతేగా...

అంటూ ..

రెడీ అయి గుంపులో కలిశాను..

చేతిలో దివిటీలతో,నెత్తిన బోనాలతో, వేపకొమ్మలతో శివసత్తులు,పోతరాజులు,కోలాటాలు,శంఖు నాదాలు, భక్తి నాదాలతో పరవశంగా..పాడుతూ,గెంతుతూ అరుస్తున్నారు.

దుమ్మురేగిపోతుంది...

మరో కుంభ మేళాలో ఇరుక్కుపోయానా ఏంటి  అనిపించింది ఒక్క క్షణం.

ఎప్పుడో కానీ గుడి మొత్త తొక్కని నా భార్య పిల్లలను చూస్తే నాకు కళ్ళు తిరిగి పోయాయి.

అబ్బా...భక్తి శ్రద్ధలతో అర్ధ నిమిలిత నేత్రాలతో మైమరచి భక్తి సాగరంలో ఓలలాడుచున్నారు అంతా..

ఇక గుడిలో ఒకవైపు హోమాలు,యజ్ఞాలు,నోములు ,వ్రతాలు అబ్బాబ్బా...చెప్పనలవి కావటం లేదు..

గుడిలో కొందరు పొర్లు దండాలు పెడుతున్నారు,కొందరు హారతి అరచేతిలో వెలిగించుకొo టున్నారు, కొందరు శూలాలు గుచ్చుకుంటున్నారు,మరికొందరు మెట్లకు పూజలు చేస్తున్నారు.....కొందరు రక్తాలు కారుతుండగా మోకాళ్లపై నడుస్తున్నారు...

పూజారిగారు పూజ మొదలు పెట్టారు..

ఒకరిద్దరు కాదు నూటఒక్క పూజారులు...పూజాదికాలు నిర్వహిస్తున్నారు,అమ్మవారికి, రాములవారికి బాబా గారికి పాలతో,పంచామృతాలతో..లక్ష నీటి బిందెలతో అభిషేకం జరుగుతుంది.

విషయం అర్ధం కాక నాకు పిచ్చెక్కుతుంది.

లక్షవత్తుల దీపాలంకరణ..

పదిలక్షల కొబ్బరికాయలు పటేల్ పటేల్ మని పగిలి పోతున్నాయి.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు.. బహుశా కరోన వ్యాధి నుండి ప్రజలను కాపడమని దేవుడిని మొక్కుతున్నారు కావచ్చు అనుకున్నాను...

అవును నిజమే ఇప్పటివరకు మందు కనిపెట్టని ఆ మహమ్మారిని జయించడం భగవంతుడికి తప్ప ఎవరికి సాధ్యం అవుతుంది చెప్పండి, అందుకే కాబోలు అనిపించింది.

అయినా...సందేహ నివృత్తి కోసం...

పక్కనే ఉన్న మా ఆవిడను మెల్లిగా చెవిలో విషయం ఏమిటని అడిగాను.

మా ఆవిడ కసుక్కున నా కాలు తొక్కి , చాల్లే o డి ఎవరైనా వింటే నవ్విపోతారు..ఆ మాత్రం లోక జ్ఞానం లేకపోతే ఎలా, ఆ..... సమస్య కారణంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోఅమౌతున్నాయి తెలుసా..

తలా నిలువుగా అడ్డంగా..అడ్డదిడ్డంగా ఊపాను.. నా భార్యకు ఏమర్ధమైందో కానీ..మళ్ళీ నా మీద విరుచుకు పడింది.

ఆడవాళ్లు ఇండ్లలో...వంటలు చెయ్యడం లేదు

పొయ్యి మీది వంటలు మాడిపోతున్నాయి

అన్నం సహించడం లేదు

భార్య భర్తల విడి పోతున్నారు.

పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి

రాజకీయ నాయకుల మీటింగులు వెలవెల బోతున్నాయి.

జనానికి బీపీలు పెరిగి పిచ్చి లేస్తుంది తెలుసా అంది... నాపై రుస రుడలాడుతూ..

ఖర్మ...ఖర్మ...

ఇంత గందరగోళం జరుగుతున్నా మీకు మాత్రం చీమ కొట్టినట్లు కూడా లేదు కదా ...

అసలు మనిషేనా మీరు...

దేవుడా... ఏo మ్మోగుణ్ణిచ్చావు తండ్రి...బాబా బాబా...అంటూ నెత్తి కొట్టుకుంది.కసురుకుంటూ..

నాకేమి అర్ధం కాలేదు.

నా పక్కనే ఉన్న...ముసలావిడా

త్వరగా పూజ కానివ్వండి పoతులు గారు చచ్చేలా వున్నానయ్యా..నేను చచ్చేలోగా నైనా నా కోరిక నెరవేరాలని గట్టిగా పూజ చెయ్యండయ్యా, ఈ జన్మ కు నా కోరిక నెరవేరే  అదృష్టం ఉందొ లేదో ..దేవుడా... ఈ బాధను త్వరగా తీర్చు తండ్రి అంది.

ఓరి...నియమ్మ..ఇదేంట్రా బాబు అనిపించింది.

నా పక్కనే ఉన్న ..ఓ పెద్ద మనిషిని విషయమేoటా అని కదిపి చూసాను.

కస్సున లేచాడు...నామీద ,

వుండవయ్యా బాబు ...ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.... . మధ్యలో నీ గోలేంటి అని అరుస్తూ.. కరిచినంత పని చేసాడు.

మా ఆవిడ నా వైపు గుడ్లరిమి చూసింది...

ఎందుకొచ్చిన ఖర్మరా బాబు అనుకోని నోరు మూసుకున్నాను.

కానీ....

నాకు మాత్రం ఏమి అర్ధం కాలేదు.

భక్తులందరికి విజ్ఞప్తి...బైట తొక్కిసలాట జరుగుతుంది...అందరూ సంయమనం పాటించాలి...మన కోరిక నెరవేరాలంటే మనం ఈ సమయంలో ఓపికగా ఉండాలి..జై శ్రీరామ్..జై శ్రీరామ్..అంటూ బిగ్గరగా అరుస్తాన్నాడు ఒకా పెద్దాయన దిశానిర్దేశం చేస్తున్నట్లుగా.

మనమేమి చేతకాని వారిము కాదు,

చేతులు కట్టుకొని కూర్చోలేదు, ఇంతటి అన్యాయాన్ని ..ఘోరాన్నీ చూస్తూ ఊరుకుంటామా..చెప్పండి,..

అందుకే..

మనం ఈ విషయాన్ని..త్వరగా తేల్చి, సత్వర న్యాయం జరగాలని కోర్టులో కేసు కూడా వేయబోతున్నాము.

మన మహిళా సంఘాలన్నీ మనకు మద్దతుగా ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు.

అలాగే రేపు సిటీ బంద్ కు పిలుపు నిస్తున్నాము.

ఈ విషయం పై అసెoబ్లీలో తీర్మానం పెట్టాలని ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాము.

అలాగే రేపు రాబోయే ఎన్నికలలో మనకు మద్దతు ఇచ్చిన వారికే మన ఓట్లు వేస్తామని మనం గట్టిగా చెప్పాలి.

ఏంట్రా దేవుడా ఇదేదో పెద్ద విషయమే అయ్యుంటుంది...అనుకున్నాను.

ఈ లోగా అయ్యగారు అర్చన మొదలు పెట్టారు

కార్తీక్ అలియాస్ డాక్టరు బాబు నామ దేహస్య,ధర్మ పత్ని దీప నామ దేహస్య సహా కుటుంబా నామ్ క్షేమ ,స్థైర్య ,ధైర్య,అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభి వృధ్యర్థం....

పంతులుగారు...

అపచారం ..అపచారం ..దీప వ్యవహార నామం వంటలక్క అండి, ఆపేర అర్చన చేయండి...

అవును పూజారిగారు వారిద్దరూ కలిసేలా గట్టిగా మంత్రాలు చెప్పి పూజ చెయ్యండి అన్నారు

అలాగే...అలాగే...అన్నాడు పూజారి.

ఓసో...స్ దీని సిగతరగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా పంతులు....

తల్లి దీనమ్మా..ఆ మోనిత ను దేవత తల్లి ముందు నిలబెట్టి నీ.. యవ్వ...ఎర్రగా కాల్చిన గడ్డపార చేతులతో దూపియ్యాల.. అప్పటికైనా నిజం చెప్పుద్దా సరే సరి.. లేదా నా యాళ్ది నెత్తురు కక్కుకొని చస్తాది....దెబ్బకు దయ్యం వదులుద్దీ అన్నాడు గుంపులో వ్యక్తి.

లేదు ఒక గుండె డాక్టరైయుండి...డాక్టరు బాబు ఒక ఆడదాని గుండె కోతను అర్ధం చేసుకోలేక పోతున్నాడు..అసలు ఆయన గుండె డాక్టరేనా..ఆయన మీద ఒక ఎంక్విరీ వేసి నిజాలు నిగ్గుతేల్చాలి అంది మరో ఆవిడ ఉక్రోశంగా..

ఇవన్నీ మేము నమ్మం...అసలు ఒక డాక్టరైవుండి.. తనకు పిల్లలు పుడతారా లేదా అనే విషయం తెలియ లేదంటే..ఇది ఆ వృత్తికే అవమానం...అందుకే మా విజ్ఞాన సమితి ఆయన మీద డాక్టర్స్ కౌన్సిల్లో...అదేవిదంగా మానవ హక్కుల కమీషనరేట్లో ఫిర్యాదు చేయ బోతున్నాము అన్నాడు ఒక విజ్ఞాన వేదిక సభ్యుడు.

అయ్యా కాస్తా తప్పుకొండయ్యా....గత నెలరోజులుగా మా ఆవిడ డాక్టర్ బాబు వంట లక్కలు కలవాలని ఉపవాస దీక్ష చేస్తుంది...లేవలేక కూర్చోలేక పోతుంది...కాస్తా దానిని ముందుకు రానియ్యండి బాబు మీ అందరిని చూస్తే దానికి కాస్తా గుండె ధైర్య మైనా వస్తుంది...లేకుంటే దానికి నూకలు చెల్లిపోయేట్లు ఉన్నాయి బాబు అన్నాడు దీనంగా ఓ భర్త.

అరె చల్...  ఎందయ్యా పూజలు గీజలు నన్నొదలండి ... దానమ్మా మోనితను ఒక్క వేటుతో రెండు ముక్కలు చేసి జైలుకు పోతా ఎహే... వదలండి అంటు గుంజు కుంటున్నాడు తాళ్లతో కట్టేసిన... బుగ్గమీద పెద్ద కత్తి గాటుతో మొఖమంతా అంబోరు మచ్చలతో... గుబురు మీసాలతో చేతిలో కత్తితో వున్న ఒక రౌడి బాబాయి.

అరె.. భాయ్ ఆ మోనిత తల తెచ్చిన వారికి కోటి రూపాయల ఇనాం ఇస్తా...వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటా అని ప్రకటించాడొక సేట్ చమన్ లాల్జీ

వద్దు వద్దు అలాంటి హింసా మార్గాలు వద్దు.. అహింసా పరమోధర్మహా.. మనమంతా గాంధీ మార్గంలో పోరాడుదాం తప్పక న్యాయం జరుగుద్ది అంతిమ విజయం మనదే ఎవ్వరూ నిరాశ నిస్పృహలకు గురి కావద్దు..ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు అని అందరిని శాంతిప చేస్తున్నాడొక పెద్ద మనిషి.

లేదయ్యా..మన భక్తి నిజమైతే... ఇప్పుడు ఇక్కడ వర్షం పడి తీరాలి..వర్షం పడిందా వంటలక్క డాక్టర్ బాబులు

కలుస్తారు .. లేదా..మాట పూర్తి కాక ముందే...

ఎవరో... మాటకు అడ్డుపడి..

అయ్యో...అయ్యో...

అంత మాటనకయ్యా...

అంత మాటనకయ్యా...

నా ప్యానం పోయేట్టుంది..ఆల్లు కలవాలయ్యా..కలవాలి..

అమ్మా గంగానమ్మ తల్లి

నువ్వు సత్తెo.. గల్ల దేవతవే అయితే...

వాన కురిపించమ్మ..వాన కురిపించు....

గుండు కొట్టించుకొని, యాటపోతును బలిచ్చి ..కల్లార బోసి .. నీ మొక్కు తీర్చుకుంటాను తల్లి ...అంది

ఓ భక్తురాలు.

ఆ...వర్షం పడింది..వర్షం పడింది ..

అంటూ మంచం మీద దొర్లుతున్న నన్ను..

మా ఆవిడ ఏంటి పడేది ..

బారెడు పొద్దెక్కిన లెవటం లేదని మొఖాన నీళ్లు గుమ్మరించాను, అరిచింది చాలు గాని ఇక లేవండి అంది.

అంటే ఇదంతా కలా...

ఓహో...ఇదంతా కార్తీక దీపం సీరియల్ గొడవన్నామాట..

 వంట లక్కను.. డాక్టరు బాబును కలపడానికి ఇదంతా జరుగుతుందా అనుకున్నాను.

ఇంట్లో ఆఫీసులో..ఈ సీరియల్ గొడవ విని విని మైండ్ దొబ్బి... అదే కలగా వచ్చిందన్న మాట అనుకోని నవ్వు కున్నాను.

నవ్వొస్తే ....మీరు నవ్వండి..

ఆహా..హా..హా.

....సమాప్తం....Rate this content
Log in

Similar telugu story from Comedy