Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

PVV Satyanarayana

Thriller


4.7  

PVV Satyanarayana

Thriller


యానివర్శరీ

యానివర్శరీ

8 mins 401 8 mins 401

కథ

యానివర్శరీ

రచనః తిరుమలశ్రీ

***

      రైలు స్క్రీచ్ మని శబ్దం చేస్తూ ఆగడంతో బ్యాక్ ప్యాక్ తో ఆ స్టేషన్లో దిగాను నేను. అక్కడ దిగిన ఏకైక ప్యాసెంజర్ నేనే కావడం విశేషం. అక్కడ ఎక్కేవారు కూడా ఎవరూ లేరు.

     ఉత్తర ఆంధ్రాలో మన్యప్రాంతానికి చెందిన చిన్న రైల్వే స్టేషన్ అది. పేరు భగవతీపురం. పెచ్చులూడిన సిమెంట్ ప్లాట్ ఫామ్…దానిపైన రెండు మూడు విరిగిన పాత చెక్కబల్లలు…వెల్లకు నోచుకోని టికెట్ బుకింగ్ గది…గది బైట సిగ్నలింగ్ పరికరాలు…రైళ్ళ రాకపోకలను గూర్చి తెలియబరచుతూ మ్రోగించేందుకు వ్రేలాడుతూన్న ఓ ఇనుప గంట – ఇదీ దాని స్వరూపం. స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది.

సమీపంలో చిన్న గ్రామం. దాన్ని కలుపుతూ పాములా మెలికలు తిరుగుతూ పోతూన్న ఓ మట్టిబాట. అడవిలో నెలవైయున్న వివిధ గిరిజన తండాలకు ముఖద్వారం లాంటిది భగవతీపురం.

     మిట్టమధ్యాహ్నం. బుకింగ్ రూమ్ వైపు నడచాను. లోపల పొడవుగా రివటలా ఉన్న సుమారు యాభయ్యేళ్ళ వ్యక్తి కూర్చునియున్నాడు. తెల్లటి ప్యాంటు, షర్టులపైన నల్లకోటు ధరించాడు. మెళ్ళో టై ఉంది. స్టేషన్ మాస్టర్ కాబోలు, ఆ స్టేషన్ లాగే అతనూ పాతవాసన కొడుతున్నాడు. బుకింగ్ క్లర్క్, టికెట్ కలెక్టర్, సిగ్నల్ మేన్ – అన్నీ అతనే అయివుంటాడు…ఈజీ చెయిర్లో పడుకుని దినపత్రికను చదువుతూన్న అతను, నా అడుగుల సవ్వడికి తల ఎత్తి చూసాడు.

     “దుర్గారం తండాకి వెళ్ళే రైలు ఎన్ని గంటలకు ఉంది?” అడిగాను నేను. మధ్యాహ్నం మూడు గంటలకని చెప్పాడు. ‘మై గాడ్! మూడు గంటలసేపు అక్కడ ఒంటరిగా గడపాలా?’ అనుకున్నాను. దుర్గారానికి టికెట్ తీసుకుని బైటకు నడచాను. ప్లాట్ ఫామ్ మీద రావిచెట్టు క్రింద ఉన్న బల్ల మీద కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకిస్తూంటే, అనుకోని ఆ ప్రయాణం యొక్క నేపథ్యం నా మదిలో మెదిలింది….

      విజయవాడలో పి.జి. పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూన్న నాకు ఓ రోజున విచిత్ర అనుభవం ఒకటి ఎదురయింది. ప్రతి శుక్రవారమూ కనకదుర్గ గుడికి వెళ్ళడం అలవాటు నాకు. ఆ రోజున గుడి దగ్గర వృద్ధ కొండదొర ఒకడు తారసపడ్డాడు. నన్ను ఆపి నా ముఖం చూస్తూ అయాచితంగా నాగురించి ఏమేమో చెప్పనారంభించాడు.

       ‘నిన్ను కన్నది ఒకరు, పెంచి పెద్ద చేసింది వేరొకరు. నీకు రూపమే కాదు, సరస్వతీ కటాక్షం కూడా పుష్కలంగా ఉంది. పెద్ద చదువులు చదివావు, ఉద్యోగపు వేటలో ఉన్నావు. దుర్గమ్మ తల్లంటే అమిత భక్తి నీకు. అమ్మను నమ్మి చెడినవారు లేరు. నెల తిరక్కుండానే చక్కటి ఉద్యోగం వస్తుంది నీకు. ఇది ఈ కొండదొర పలుకు కాదు, దుర్గమ్మ వాక్కు. ఉద్యోగం రాగానే దుర్గారం తండాలో జరిగే జాతరకు వెళ్ళి అమ్మను దర్శించుకో. నీకు శుభం కలుగుతుంది…’ అంటూ అతను ఏదేదో చెప్పుకుపోతూంటే ఓ పక్క ఆశ్చర్యమూ, మరో పక్క అంతా మమ్మల్నే చూస్తున్నారన్న ఇబ్బందీ కలిగాయి నాకు. త్వరగా బైటపడాలని ఓ వందనోటు అతని చేతిలో పెట్టబోయాను.

      తీసుకోలేదు అతను. “నేను ఇదంతా సొమ్ములకోసం చెప్పడంలేదు, బిడ్డా! నాది సోది కాదు. అమ్మ ఆదేశం. నాకు డబ్బులు వద్దు. ఏడాది తరువాత మళ్ళీ నీకు ఇక్కడే కనిపిస్తాను నేను. నా పలుకులు నిజమైతే ఏకంగా పంచెలసాపే పెడుదువుగాని…’ అంటూ నా నుదుటను బొట్టు పెట్టి దీవించి వెళ్ళిపోయాడు.

      విస్తుపాటుతో జరిగినది నెమరువేసుకుంటూ ఇంటికి చేరుకున్నాను నేను. అమ్మ, నాన్న ఇద్దరూ వైద్యులే. రాత్రి అమ్మ ఇంటికి రాగానే, ఆ రోజు దుర్గ గుడి వద్ద జరిగిన సంఘటనను గూర్చి చెప్పి, “నన్ను కన్నవారొకరు, పెంచినవారు వేరొకరు అంటాడేమిటమ్మా ఆ కొండదొర?” అని అయోమయంగా అడిగాను.

     “డబ్బులకోసం నోటికి వచ్చింది వాగుతారు వాళ్ళు. అవన్నీ పట్టించుకోనవసరంలేదు మనం” అంటూ కొట్టిపడేసింది అమ్మ. నాన్న వచ్చాక అదే ప్రశ్న వేసాను. ఓ క్షణం ఆలోచించి, “చిత్రంగానే ఉందిరా!” అనేసారు.

     కొండదొర చెప్పినట్టే నెల తిరక్కుండానే హైదరాబాద్ లోని ఓ ఎమ్మెన్సీలో నెలకు అరవై వేల రూపాయల జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది నాకు. దాంతో కొండదొర పలుకులపైన విశ్వాసం కలిగింది. దుర్గారం జాతరకు తప్పకుండా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

    గూగిల్ సెర్చ్ ద్వారా దుర్గారం గురించి సమాచారం సేకరించాను…ఉత్తర ఆంధ్రాలోని మన్నెపు ప్రాంతంలో ఉంది ఆ తండా. ఆ ఏజెన్సీ ఏరియాలోని తండాలలో ప్రధానమైనది అది. ఆ తండాలన్నిటికీ ఇలవేల్పు మహంకాళి. ఏడాదికోసారి – వేసవిలో మూడు రోజులపాటు ముమ్మరంగా సాగుతుంది దేవి జాతర. ఆ తల్లి అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఆ జాతరకు దేశపు నలుమూలల నుండీ భక్తులు, దేశ-విదేశీ పర్యాటకులు తరలిరావడం విశేషం. మొక్కులు మొక్కుకునేవారు, మొక్కులు తీర్చుకునేవారితో అత్యంత సందడిగా ఉంటుంది. కీకారణ్యంలోని దుర్గారాన్ని చేరుకోవడానికి కాలిబాట తప్ప సరైన మార్గం లేదు. కార్లు, బస్సుల వంటివి వెళ్ళలేవు. కాలినడకే శరణ్యం. ఏటేటా పెరుగుతూన్న భక్తులను, పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం అడవిలోకి ఓ రైలు మార్గం వేసింది. నేరో గాజ్ పట్టాల పైన నడచే మూడు కంపార్ట్ మెంటుల పాసెంజర్ రైలు అది. భగవతీపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం నుండి, భగవతీపురం మీదుగా దుర్గారం వరకు నడపబడుతుంది. వారం రోజులపాటు నడపబడే ఆ జాతర స్పెషల్, భగవతీపురం నుండి దుర్గారం చేరడానికి సుమారు గంట సమయం పడుతుంది. 

భగవతీపురం రైల్వే స్టేషన్ మెయిన్ లైన్ లోనే ఉన్నా మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ళేవీ ఆగవు అక్కడ – ఒక్క జాతర సందర్భంలో తప్ప. జాతరకు వెళ్ళేవారు అక్కడ దిగి, జాతర స్పెషల్ని పట్టుకోవలసియుంటుంది….

     నా స్నేహితురాళ్ళను తోడు రమ్మంటే, ఆడపిల్లల్ని ఒంటరిగా అడవిలోకి పంపడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందువల్ల ఒక్కతినే బైలుదేరాను – మమ్మీ డాడీల భయాలను త్రోసిపుచ్చి. జాతర ఇంకో రెండు రోజుల్లో ఆరంభం కాబోతోంది.  

    బ్యాగ్ లోంచి బెట్టీ మెహమూదీ ఆటోబయాగ్రఫీ ‘నాట్ విదౌట్ మై డాటర్’ ని తీసి చదవనారంభించాను...అమెరికాలో పనిచేస్తూన్న ఓ ఇరానియన్ డాక్టర్ ని ప్రేమించి పెళ్ళాడి అష్టకష్టాలకు గురయింది అమెరికన్ యువతి బెట్టీ. రెండు వారాల వెకేషన్ కని చెబితే నమ్మి నాలుగేళ్ళ కూతుర్ని వెంటబెట్టుకుని అయిష్టంగానే భర్తతో ఇరాన్ కి వెళుతుంది. ఆ దేశపు సంస్కృతి, ఆచారవ్యవహారాలు, స్త్రీలను బానిసలుగా ట్రీట్ చేసే విధానము, అపరిశుభ్రతా వాతావరణం, అనాగరికపు అలవాట్లు, అమెరికన్ల పట్ల ఆ దేశపు ప్రజలకు గల ద్వేషం, వగైరాలు జుగుప్సను, భయాన్నీ కలిగిస్తాయి ఆమెకు. అమెరికాకి తిరిగివెళ్ళకుండా అక్కడే స్థిరపడిపోవాలన్న భర్త హఠాన్నిర్ణయంతో బెట్టీ ప్రపంచం తలక్రిందులు అవుతుంది. కూతురికి కూడా ఇరాన్ నచ్చదు. తల్లీకూతుళ్ళు ఎప్పుడు అమెరికాకి తిరిగి వెళ్ళిపోదామా అని అర్రులుచాచుతూ ఉంటారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బెట్టీ తండ్రి చావుబ్రతుకులలో ఉంటాడు. ఎట్టి పరిస్థితులలోనూ తాము అమెరికాకి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదంటాడు భర్త. ఎదురు తిరిగిన భార్యను ఒంటరిగా బంధించి చిత్రవధ చేస్తాడు. ‘ఫార్సీ’ మీడియంలో చదువు నేర్పే లోకల్ స్కూలు వాతావరణం నచ్చక వెళ్ళనని మారాము చేసే చిన్నారిని కూడా హింసిస్తాడు. కూతుర్ని తల్లి నుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగైనా కూతురితో ఆ దేశం నుండి తప్పించుకుని అమెరికాకి పారిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది బెట్టీ. కూతుర్ని విడచి తాను తప్పించుకోగల అవకాశం ఉన్నా, కూతురు లేకుండా తాను తిరిగివెళ్ళనని భీష్మించుకుంటుంది....అయాతుల్లా ఖోమిని హయాములోని ఇరాన్ యొక్క రాజకీయ, సామాజిక స్థితిగతులు కళ్ళకు కట్టినట్టు వివరించబడ్డాయి పుస్తకంలో...బెట్టీ చేదు అనుభవాలను, నాలుగేళ్ళ చిన్నారి గురయ్యే శారీరక, మానసిక హింసను గూర్చి చదువుతూంటే ఎంతటివారికైనా కన్నీళ్ళు రాకమానవు...

      “హలో!” అన్న పలుకరింపుతో తలెత్తి చూసాను నేను. ఎదురుగా – చిరునవ్వుతో ఓ యువకుడు.

     పాతికేళ్ళుం టాయి అతనికి. ఆరడుగుల హ్యాండ్సమ్ విగ్రహం. డార్క్ జీన్స్ ప్యాంట్ పైన లైట్ కలర్ షర్ట్ ధరించాడు. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్, కాళ్ళకు బాటా షూస్. వీపుకు బ్యాక్ ప్యాక్, చంకను వీడియో కెమేరా వ్రేలాడుతున్నాయి.

     “మీరు దుర్గారం జాతరకు వెళుతున్నారా?” అనడిగాడు. ఔనని చిన్నగా తల ఊపాను. తానూ అక్కడికే వెళుతున్నట్టు చెప్పాడు. బ్యాక్ ప్యాక్ నీ, కెమేరానీ బల్ల మీద పెట్టి కూర్చున్నాడు.

     నేను మళ్ళీ పుస్తకంలో తల దూర్చబోతే, “ఒంటరితనపు నేస్తాన్ని కాసేపు పక్కను పెట్టి, పక్కనున్న నాతో నేస్తం కలపవచ్చుగా?” అన్నాడు అతను చనువుగా. నిర్మానుష్యమైన ఆ స్టేషన్లో మరో వ్యక్తి తారసపడడం ఓ విధంగా సంతోషం కలిగించింది నాకు. పుస్తకం మూసేసాను.

     “నా పేరు కిశోర్. ఫ్రీలాన్స్ జర్నలిస్టుని. బేస్ కోల్ కత్తా ఐనా, దేశమంతా నాదే. దుర్గారం జాతరను కవర్ చేయడానికి వచ్చాను,” చెప్పాడు అతను. నాకంటె ఓ గంట ముందుగా కోల్ కత్తా నుండి వచ్చాడట. కలుపుగోరు మనిషి కావడంతో ఉత్సాహంగా కబుర్లు చెప్పుకున్నాము మేము.  

     స్టేషన్ మాస్టర్ గంట కొట్టడంతో వాచ్ చూసుకున్నాను నేను. మా ట్రెయిన్ కి ఇంకా సుమారు గంట వ్యవధి ఉంది. మరేదో ట్రెయిన్ వస్తున్నట్టుంది…కాసేపటికి దక్షిణాదినుండి ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి బిలబిలమంటూ దిగారు ప్యాసెంజర్స్.

     అక్కడ దిగినవారు దాదాపు ఇరవై మంది ఉంటారు. వారిలో వృద్ధులు, స్త్రీలు, పిల్లలూ కూడా ఉన్నారు. అదంతా జాతర జనమేనని తెలుస్తూనేయుంది. కావిళ్ళు, అరటిగెలలు, బెల్లపు అచ్చులు, కోళ్ళు, పసుపు గుడ్డలు కట్టిన బిందెలు వగైరాలు ఉన్నాయి. బల్లల పైన కొందరు సర్దుకుంటే, చెట్లనీడల్లో దుప్పట్లు పరచుకుని కూర్చున్నారు మరికొందరు.

     ఓ యువజంట రెండేళ్ళ పాపతో వచ్చి మేము కూర్చున్న బల్లపైన సర్దుకుంది. ఓ వృద్ధజంట ఐదేళ్ళ పిల్లవాడితో మాకు చేరువలో చెట్టు క్రింద కూర్చుంది. నేను, కిశోరూ లేచి వారికి చోటు ఇచ్చాము. పాప ముద్దుగా ఉంది. బుద్ధిగా కూర్చుంది. పిల్లవాడు ఆకతాయిలా ఉన్నాడు. అల్లరి చేస్తున్నాడు. ప్లాట్ ఫాంకి మరో వైపు యువతీయువకులు కొందరు నవ్వులతో కేరింతాలతో సందడి చేస్తున్నారు, జాతరకు వెళుతూన్న సంబరం కాబోలు.

     కిశోర్ బల్లమీద కూర్చున్నవారితో మాటలు కలపబోయాడు. కాని, వారి నుండి స్పందన లేకపోవడం చిత్రంగా తోచింది మాకు. “పద, అక్కడ సందడిచేస్తూన్న యూత్ ని పలుకరిద్దాం” అని కిశోర్ అనడంతో, అటువైపు నడచాము మేము...మమ్మల్ని చూడనట్టు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఆ గుంపును వీడియో తీసి, వారితో మాట్లాడబోయాడు కిశోర్. వారి నుంచి స్పందన కరవయింది.

     “వీళ్ళది సిగ్గో, లేక ఆత్మన్యూనతాభావమో అర్థం కావడంలేదు,” అన్నాడు కిశోర్, భుజాలు ఎగురవేస్తూ. “ఈ వియర్డ్ ఎట్మాస్ఫియర్ లో గడిపే కంటే, అలా బైట తిరిగివస్తే బావుంటుంది”.

     స్తేషన్ నుండి బైటపడి గ్రామం వైపు నడచాము ఇద్దరమూ. ఊరు చిన్నదైనా, పచ్చని ప్రకృతి మధ్య అందమైన పొదరిల్లులా ఉంది. సుమారు వంద గడప ఉంటుంది. అందులో గిరిజనుల సంఖ్యే అధికం. గ్రామం నడిబొడ్డున రావిచెట్టు క్రింద ఉన్న రచ్చబండ మీద కూర్చున్నాం మేము.

     మమ్మల్ని చూసి పరుగెత్తుకు వచ్చారంతా. ఆడ, మగ, పిల్లలూ మా చుట్టూ చేరి నన్నే వింతగా చూడడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. బహుశా నా మోడర్న్ డ్రెస్సే అందుకు కారణమయ్యుంటుంది. నా గురించి వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా జవాబులు ఇచ్చాము మేము. దుర్గారం జాతరను చూడ్డానికి నేను హైదరాబాద్ నుండి ఒంటరిగా వచ్చానని ఆలకించి ఆశ్చర్యపోయారంతా. నాతో కలసి ఫొటోలు, వీడియో దిగారు అంతా. గ్రామస్తుల బ్రతుకుతెరువులను గూర్చి, జీవన విధానాలను గూర్చీ తెలుసుకుంటూ ఆ గ్రామపెద్దను ఇంటర్వ్యూ చేసాడు కిశోర్. ఆ గ్రామాన్ని, ప్రజలనూ వీడియో తీసాడు. వాళ్ళు తెచ్చి ఇచ్చిన కమ్మటి మజ్జిగ త్రాగితే కడుపులో చల్లగా అనిపించింది.

     దూరంలో రైలు కూత వినిపించడంతో టైమ్ చూసి చిన్నగా ఉలికిపడ్డాను నేను. జాతర స్పెషల్ వచ్చే టైమ్ అయిపోయింది. ఆ గ్రామస్తులతో గడుపుతూంటే సమయమే తెలియలేదు. హడావుడిగా వారికి వీడ్కోలు చెప్పి గబగబా స్టేషన్ వైపు నడచాము ఇద్దరమూను.

     మేము స్టేషన్లో అడుగు పెట్టేసరికే ప్లాట్ ఫామ్ ఖాళీ అయిపోయింది. ప్రయాణీకులతో క్రిక్కిరిసియున్న రైలు ప్లాట్ ఫామ్ దాటి వేగం పుంజుకుంది. దాన్ని అందుకోవాలని విఫల ప్రయత్నం చేసాము మేము. నిస్పృహతో వెళుతూన్న రైలునే చూస్తూ ఉండిపోయాము. నెక్స్ ట్ ట్రెయిన్ మళ్ళీ మర్నాటి ఉదయం పది గంటల వరకు లేదు. ఉసూరుమంటూ బుకింగ్ ఆఫీస్ వైపు నడచాము.

     నాలుగు అడుగులు వేసామో లేదో, దూరంలో భారీ ప్రేలుడు శబ్దం వినిపించింది మాకు. అదరిపడి అటువైపు చూసాము. ట్రెయిన్ కి ఏదో ప్రమాదం సంభవించినట్లనిపించింది. మారుయోచన లేకుండా పట్టాల పైన అటువైపు పరుగెత్తాము.

     స్టేషన్ కి సుమారు ఓ కిలో మీటరు దూరంలో ఏటిపైన రైలు వంతెన ఒకటి ఉంది. అక్కడకు చేరుకున్న మా గుండెలు గుభేలుమన్నాయి. ఆ వంతెన కూలిపోయింది. దాని పైన వెళుతూన్న జాతర స్పెషల్ పడిపోయింది. చివరి కంపార్ట్ మెంటులు రెండూ క్రిందనున్న ఏటిలో పడిపోతే...ఇంజను, దాని వెనుకనున్న కంపార్ట్ మెంటూ విరిగిన వంతెన పైన ప్రికేరియస్ గా వ్రేలాడుతున్నాయి. ప్రయాణీకుల హృదయవిదారకమైన ఆర్తనాదాలు ఆ ప్రాంతమంతా మార్మ్రోగుతున్నాయి.

     ఓ క్షణం ఏం చేయాలో తోచలేదు మాకు. తేరుకుని, కంపార్ట్ మెంటులలో చిక్కుకున్న ప్రయాణీకులను కాపాడదామని ప్రయత్నిస్తే, దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయాము.

     “మనం వెంటనే స్టేషన్ మాస్టర్ని ఎలర్ట్ చేయాలి, పద” అని కిశోర్ అనడంతో, మళ్ళీ వెనక్కి తిరిగి పరుగెత్తాము మేము. కొంతదూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగి నావంక చూసాడు కిశోర్. “విధివిలాసం చిత్రమైంది సుమా! మనకింకా ఆయుస్సు ఉండడం వల్లనే రైలును మిస్ చేసాం మనం” అన్నాడు. నిజమేననిపించడంతో, భయంగా గుండె పైన చేయి వేసుకున్నాను నేను.

     మేము రొప్పుతూ అందించిన సమాచారాన్ని ఆలకించిన స్టేషన్ మాస్టర్ (ఎస్సెమ్), “నాకు ప్రేలుడు శబ్దం ఏదీ వినిపించలేదే!” అన్నాడు తాపీగా.

     “మాకు వినిపించింది. సంఘటనాస్థలానికి వెళ్ళి చూసి వచ్చాం మేము. వంతెనతోపాటు రైలు కూడా కూలిపోయింది. ప్రయాణీకులు ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి” అన్నాడు కిశోర్ విసుగ్గా. “వెంటనే రిలీఫ్ టీమ్స్ కోసం ఫోన్ చేయండి. నేను గ్రామస్తులను ఎలర్ట్ చేస్తా ను”.

     “ఆగవయ్యా మగడా! జాతర స్పెషల్ ఇంకా రానేలేదు. దాన్ని మీరి మిస్ చేయడం, అది ప్రమాదానికి గురికావడం...చిత్రంగా ఉంది!” అన్నాడు ఎస్సెమ్. ఆ రోజు జాతర స్పెషల్ ఓ గంట లేటనీ, సాయంత్రం ఐదు గంటలకుగాని రాదనీ అతను చెబుతూంటే అవాక్కయాము మేము.

     “నో! మేము అబద్ధం చెప్పడంలేదు. ఆ ప్రమాదాన్ని మేము కళ్ళారా చూసాము” దాదాపుగా అరచాడు కిశోర్.

     సంశయిస్తూనే మావెంట పరుగెత్తాడు ఎస్సెమ్. ఐతే, సంఘటనాస్థలానికి చేరుకున్న మేము గొప్ప షాక్ కి గురయ్యాము…ఆ వంతెన కూలిపోలేదు! చెక్కు చెదరకుండా ఉంది. రైలు కూడా లేదక్కడ! కిశోర్, నేను అయోమయంగా ముఖాలు చూసుకున్నాము.

     “మీరు హారర్ సినిమాలు ఎక్కువగా చూస్తారా?” మావంక అదోలా చూస్తూ అడిగాడు ఎస్సెమ్.

     “బట్...సర్!...ఇక్కడే...ఈ వంతెన మీదే...ఆ ఘోరదృశ్యాన్ని కళ్ళారా చూసాం మేము” అన్నాడు కిశోర్. ఔనన్నట్టు తలూపాను నేను.

     “ఇట్జ్ నతింగ్ బట్ ఇల్ల్యూజన్,” స్వగతంలా అనుకుంటూ వెనుదిరిగాడు ఎస్సెమ్. అయోమయంగా అతన్ని అనుసరించాం మేము.

     గదికి తిరిగిరాగానే మమ్మల్ని కూర్చోమని సైగ చేసాడు ఎస్సెమ్. ఓ క్షణం మావంక నిశితంగా చూసి అన్నాడు _ “మీకు ఓ విషయం తెలుసా? ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఏ ట్రెయినూ రాలేదు ఇక్కడికి. సో, అందులోంచి ప్రయాణీకులు దిగడమనేది కేవలం మీ భ్రమ!”  నోళ్ళు వెళ్ళబెట్టాం మేము. భ్రమ ఇద్దర్నీ ఒకేసారి ఆవరిస్తుందా...!?

     ఓ క్షణం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. తరువాత “అఫ్ కోర్స్, కొన్ని ఏళ్ళ క్రితం అదే వంతెన పైన ఘోర రైలు ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. కాని, ఆ దృశ్యం ఇప్పుడు మీకు తాజాగా కనిపించడమనేది...ఐ సింప్లీ కాంట్ బిలీవ్”. ఆశ్చర్యంతో చూసాము మేము.

     “అన్నట్టు, ఈ రోజు ఆ యాక్సిడెంట్ యొక్క యానివర్శరీ. అందువల్ల లోకల్ న్యూస్ పేపర్స్ దాని గురించి విపులంగా రాసాయి” అంటూ, ఆనాటి తెలుగు దినపత్రిక ఒకటి తెచ్చి ఇచ్చాడు ఎస్సెమ్.

     ఆ రిపోర్ట్ ని ఆతృతగా చదివాము మేము... సరిగా ఇరవయ్యేళ్ళ క్రితం అదే వంతెన కూలి జాతర స్పెషల్ కి ఘోర ప్రమాదం జరిగింది. అందులో ఇద్దరు చిన్నారులు తప్ప ప్రయాణీకులంతా మరణించడంతో అది గొప్ప సెన్సేషన్ అయింది. ఆరోజు ఇరవయ్యో వార్షికం కావడంతో స్థానిక పత్రికలు దాని గురించి బ్లాక్ బోర్డర్స్ తో ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ఆ దుస్సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో కొందరి ఫొటోలు కూడా ప్రచురింపబడ్డాయి. వాటి వంక చూసిన మేము ఉలికిపడ్డాము.

     వాటిలో – ‘ఎక్స్ ప్రెస్ నుండి దిగి ప్లాట్ ఫాం మీద కూర్చున్నవారిలో కొందరి ఫొటోలు కూడా ఉన్నాయి’. ముఖ్యంగా – మేము కూర్చున్న బెంచ్ పైన ఆశీనులైన యువజంట, వృద్ధజంటలను ఇట్టే గుర్తుపట్టాము మేము. “మాస్టారూ! ఎక్స్ ప్రెస్ నుండి దిగిన జనంలో వీళ్ళూ ఉన్నారు. ఈ జంటలు రెండూ మేము కూర్చున్న బల్లపైనే కూర్చున్నాయి” ఎక్సైటింగ్ గా అన్నాడు కిశోర్. ఔనన్నట్టు తలూపాను నేను.

     ఈసారి ఆశ్చర్యపోవడం ఎస్సెమ్ వంతు అయింది. “అదే నిజమైతే...ఇది గొప్ప అద్భుతమేనని చెప్పాలి. లోగడ పేరా-నార్మల్ ఫోర్సెస్ ని గురించి కొన్ని కథలు చదివాను నేను. మీరు చెబుతున్నది వింటూంటే వాటిని నమ్మాలనిపిస్తోంది సుమా!” అన్నాడు.

     పత్రిక లోపలి పేజీలో ఆ ప్రమాదంలో బ్రతికి బైటపడ్డ పిల్లల ఫొటోలు కూడా ప్రచురింపబడ్డాయి. వాటిని చూడగానే సంభ్రమంతో, “ఓఁ...!” అన్నాను నేను అప్రయత్నంగా. కారణం – ఆ చిన్నారులు మా బెంచ్ పైన కూర్చున్న పాప, బాబే!...ఆ పసివాళ్ళు ఎవరి తాలూకో, ఏ ఊరికి చెందినవారో తెలియక ప్రభుత్వం వారిని చిల్డ్రన్స్ హోమ్ కి తరలించినట్టు రిపోర్ట్ లో ఉంది.

     పత్రిక అంతటితో ఆగలేదు...ఇప్పుడు – ఇరవయ్యేళ్ళ తరువాత – ఆ పిల్లలు పెద్దయి ఎలా ఉంటారోనన్న చిత్రకారుడి ఊహాగానంతో వారి కంప్యూటర్-జెనరేటెడ్ ఫోటోగ్రాఫులను కూడా ప్రచురించింది.

     కుతూహలంతో వాటి వంక చూసిన నేను తృళ్ళిపడ్డాను.

     ఆ ఫోటోలు - నాది, కిశోర్ దీను...!!!

                                                                    ******


Rate this content
Log in

More telugu story from PVV Satyanarayana

Similar telugu story from Thriller