STORYMIRROR

PVV Satyanarayana

Crime Thriller

4  

PVV Satyanarayana

Crime Thriller

త్రెట్ డెస్క్

త్రెట్ డెస్క్

7 mins
597


త్రెట్ డెస్క్

రచనః తిరుమలశ్రీ

***

     ‘హోటల్ డ్రీమ్ ల్యాండ్’ యజమాని భాటియా ఉదయం తన ఆఫీసులో ఉండగా సెల్ ఫోన్ మ్రోగింది. ఆన్ చేసి, “హలో!” అన్నాడు.

     “భాటియా సాబ్?”

     “హాఁ, బోలియే…కౌన్ బాత్ కర్ రహా హైఁ?” అడిగాడు భాటియా.

     “కోవిడ్-19…!” అన్నాడు అవతలి వ్యక్తి. “కౌన్…?” రెట్టించాడు భాటియా.

     “కోవిడ్-19…!” అన్నాడు అవతలి వ్యక్తి మళ్ళీ. “నేను చెప్పేది జాగ్రత్తగా విను…నాకు ఇటలీలో కరోనా వైరస్ సోకడంతో రెండు రోజులక్రితం ఇండియాకి తిరిగొచ్చాను. ఏర్ పోర్ట్ లో హెల్త్ చెక్ సిబ్బంది కళ్ళుగప్పి బైటకు జారుకున్నాను…” “అయితే?” విసుగ్గా అడిగాడు భాటియా.

     “నాకున్న వైరస్ ని నీకు, నీ ఫ్యామిలీకీ అంటించకుండా ఉండాలంటే…నాకు కోటి రూపాయలు చెల్లించవలసివుంటుంది నువ్వు…” చెప్పాడు ఆ వ్యక్తి.

     “అరె, బేవకూఫ్! బంద్ కరో బగ్బాస్…” అంటూ కోపంగా కాల్ కట్ చేసేసాడు భాటియా.

     సెల్ మళ్ళీ మ్రోగింది. “బేవకూఫ్ నేను కాదు, నువ్వే! కోటిరూపాయలు నీకు ఓ లెక్కలోవి కాదు. డబ్బుకోసం చూసుకున్నావంటే నీ హోటల్ అంతా కూడా వైరస్ ని వ్యాపింపజేయగలను. అప్పుడు నీ బిజినెస్ ఏమవుతుందో ఆలోచించుకో” అన్నాడు అవతలి వ్యక్తి తాపీగా.

     “పోలీస్ వాలోంకో బోల్ దూంగా” కోపంగా అన్నాడు భాటియా.

     నవ్వాడు అవతలి వ్యక్తి. “బోలి చూడు. నీకే నష్టం. నన్ను కనిపెట్టడం ఎవరితరమూ కాదు. కరోనా వైరస్ అంటుకోవడానికి సవాలక్ష మార్గాలు ఉన్నాయని మరచిపోకు,” కర్కశంగా అని ఫోన్ డిస్కనెక్ట్ చేసేసాడు ఆ వ్యక్తి.

     సెల్ వంక విభ్రాంతితో చూస్తూవుండిపోయాడు భాటియా. ఆ విషయం పోలీసులకు చెప్పాలా వద్దా అని మదిలోనే తర్కించుకున్నాడు. అందువల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదుకానీ, ఒకవేళ ఆ అజ్ఞాతవ్యక్తి బెదిరింపు నిజమే అయితేనో…? హఠాత్తుగా భయం క్రమ్ముకుంది అతన్ని.

     కాసేపటి తరువాత మళ్ళీ మ్రోగింది సెల్. “ఏం నిర్ణయించుకున్నావ్? డబ్బా? వైరసా??” కటువుగా అడిగాడు అవతలి వ్యక్తి.  “సొమ్ము ఎలా చెల్లించాలి?” అడిగాడు భాటియా.

#

     అదేరోజున బంజారాహిల్స్ లోని ‘శ్యామ్ లాల్ జువెలర్స్’ యజమాని శ్యామ్ లాల్ చంద్ కి ఫోన్ వచ్చింది. “నువ్వు, నీ పరివార్ కరోనా వైరస్ బారిన పడకూడదనుకుంటే కోటిరూపాయలు చెల్లించాలి నాకు” అన్నాడు ఫోన్ లోని అజ్ఞాతవ్యక్తి. తన పేరు ‘కోవిడ్-19’ అని చెప్పాడు.

     “అరె బద్మాష్! మేం ఔలాగాళ్ళలా కనిపిస్తున్నాంబే నీకు?” అంటూ కోపంతొ అరచి డిస్కనెక్ట్ చేసేసాడు శ్యామ్ లాల్ చంద్.

     సెల్ మళ్ళీ మ్రోగింది. “సునో, శేఠ్! చైనాలో కరోనా వైరస్ తగిలించుకుని ఇండియాకి వచ్చేసాను నేను. ఏర్ పోర్ట్ లో అధికారుల కళ్ళుగప్పి బైటపడ్డాను. నువ్విప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు, నీ కుటుంబమూ కరోనాపోజిటివ్ లిస్టుల్లోకి ఎక్కిపోతారు…” కటువుగా అన్నాడు అవతలి వ్యక్తి. “నీకు తెలియకుండానే ఆ వైరస్ ని నీకు సోకించడం ఎంత తేలికో ఆలోచించు”.

     “ఇది జోకూ కాదు, ప్రాంకూ కాదు. పచ్చినిజం!” మళ్ళీ అన్నాడు ఆ వ్యక్తి. “డబ్బు ముఖ్యమో, ప్రాణాలు ముఖ్యమో నువ్వే తేల్చుకో!”

     శేఠ్ కి భయంతో ముచ్చెమటలు పట్టాయి. “బోలో భాయ్! సొమ్ము ఎలా అందజేయాలి నీకు?” అనడిగాడు ఆత్రుతగా.

2

     జంటనగరాలలోని పలువురు ధనికులకు ‘కోవిడ్-19’ నుండి కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న క్లిష్టపరిస్థితులలో ఆ అజ్ఞాతవ్యక్తిని ఎదిరించే మానసిక స్థైర్యము, ధైర్యమూ ఎవరికీ లేవు…వైరస్ సోకి విదేశాలనుండి తిరిగివచ్చిన వ్యక్తులు కొందరు ఎలాగో క్వారంటెయిన్ నుండి తప్పించుకుని తిరుగుతున్నారన్న వార్తలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో ’ఆ వ్యక్తి బెదిరింపు నిజమే అయితేనో…?’ రిస్క్ తీసుకోవడానికి భయంవేసింది అందరికీను. కోటిరూపాయలు ఓ లెక్కలోనివి కావు తమకు…గప్ చుప్ గా ర్యాన్సమ్ ని చెల్లించేసారంతా. 

     ఆ అజ్ఞాతవ్యక్తి టార్గెట్ చేసినవారిలో ‘మోడర్న్ మాల్స్’ చెయిన్ యజమాని సంతోష్ గుప్తా, సూపర్ స్టార్ సుబోధ్, పాప్యులర్ హీరోయిన్ షణ్ముఖి, ఫిల్మ్ డైరెక్టర్ రాకేష్ నందా, ఫిల్మ్ ప్రొడ్యూసర్ భూపతినాయుడు కూడా ఉండడం విశేషం.

     ప్రొడ్యూసర్ భూపతినాయుడికి రాష్ట్ర హోమ్ మినిస్టర్ సహదేవరావు బాల్యమిత్రుడు. ర్యాన్సమ్ చెల్లించిన అనంతరం నాయుడు ఆ విషయం రహస్యంగా హోమ్ మినిస్టర్ చెవిన వేయడం జరిగింది. షాక్ తిన్న హోమ్ మినిస్టర్ డిజిపి ని పిలిపించాడు. అటువంటిది ఏదీ తమ దృష్టికి రాలేదనీ, ఎవరూ ఫిర్యాదు చేయలేదనీ చెప్పాడు డిజిపి. విదేశాలనుండి వచ్చినవారు ఏర్ పోర్ట్ స్క్రీనింగ్ ను తప్పించుకోవడం అసంభవమన్నాడు. భూపతినాయుడు అబద్ధం చెప్పడనీ, ఆ వ్యవహారమేమిటో రహస్యంగా పరిశోధించవలసిందనీ ఆదేశించాడు హోమ్ మినిస్టర్…డిజిపి ఆ కేసును క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించడం జరిగింది.

3

     క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మాధవ్ ముందుగా ప్రొడ్యూసర్ భూపతినాయుణ్ణి రహస్యంగా కలుసుకుని మాట్లాడాడు. అతని సెల్ ఫోన్ లో ‘కోవిడ్-19’ నుండి వచ్చిన కాల్ డేటాను పరిశీలించాడు. ర్యాన్సమ్ సొమ్మును ఓ కొత్త బ్రీఫ్ కేసులో పెట్టి ఫలానా సమయానికి గోల్కొండ ఫోర్ట్ లో ఓ చోట పెట్టమని ఆదేశించినట్టూ, తాను అలాగే చేసి తిరిగి చూడకుండా వచ్చేసినట్టూ చెప్పాడు నాయుడు.

     సూపర్ స్టార్ సుబోధ్, హీరోయిన్ షణ్ముఖిలు కూడా ‘కోవిడ్-19’ కి ర్యాన్సమ్ చెల్లించిన విషయం భూపతినాయుడి ద్వారా తెలుసుకుని…సుబోధ్, షణ్ముఖిలను విడివిడిగా కలుసుకుని ప్రశ్నించాడు ఇన్స్ పెక్టర్. మూడు కేసుల్లోనూ మోడస్ ఆపరేండీ  ఒకేలా ఉండడం గుర్తించాడు. ఐతే ఆ అజ్ఞాతవ్యక్తి ఒక్కొక్కరికీ ఒక్కో దేశం నుండి వచ్చినట్టు చెప్పాడు! ఆ ‘కాలర్’ గొంతుక, మాట్లాడిన తీరుల గురించి ముగ్గురు విక్టిమ్సూ చెప్పిన వివరాలనుబట్టి, బ్లాక్ మెయిలర్ ఒక్కడేనని అర్థమవుతోంది.. ర్యాన్సమ్ ఎమౌంటును అందజేయచేయడానికి వివిధ ప్రాంతాలను ఎంచుకున్నాడు దుండగుడు. ఆ వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ కాల్స్ ను పరిశీలించితే…ఒక్కొక్కరికీ ఒక్కో నంబర్ నుండి వచ్చినట్టూ, అవన్నీ అన్-లిస్టెడ్ నంబర్సనీ తేలింది…వారిలాగే నగరంలోని మరికొందరు బిజినెస్ మెన్ కూడా బ్లాక్ మెయిల్ కి గురయివుంటారని ఊహించినా, వారిని గుర్తించడం అంత సులభం కాదు. అయినా విడిచిపెట్టలేదు మాధవ్. ఆ రెండు మూడు రోజుల్లో తమ కరెంట్ లేదా ఎస్.బి. ఎకౌంట్స్ నుండి కోటిరూపాయలు, అంతకు పైగా క్యాష్ ని విత్ డ్రా చేసినవారి వివరాలను బ్యాంకుల నుండి సేకరించిన ఇన్స్ పెక్టర్, ఓ పదిమందిని కనిపెట్టి వారిని కన్ ఫ్రంట్ చేయడంతో ఒప్పుకోక తప్పలేదు వాళ్ళు.

     ఆ రెండు మూడు రోజుల్లో కోట్ల రూపాయల డిపాజిట్స్ ను చేసిన ఖాతాదారులు ఎవరైనా ఉంటే వారి వివరాలు ఇవ్వవలసిందిగా కూడా బ్యాంక్స్ ని కోరాడు మాధవ్. అంత పెద్ద మొత్తాలు నగదు రూపంలో ఏ బ్యాంకులోనూ, బ్రాంచ్ లోనూ జమకాలేదన్న సమాచారం అందింది.

     మాధవ్ హైదరాబాద్ ఏర్ పోర్టుకు వెళ్ళి, గత వారంరోజుల్లో విదేశాల నుండి వచ్చినవారి వివరాలను సేకరించాడు. అందరికీ థెర్మల్ స్క్రీనింగు, అవసరమైన టెస్టులూ జరిపినట్టు చెప్పారు సంబంధిత సిబ్బంది. అనుమానంగా ఉన్నవారిని హాస్పిటల్ క్వారెంటెయిన్ కీ, మిగతావారిని హోమ్ క్వారెంటెయిన్ కీ పంపినట్టు చెప్పారు. ఏఒక్కరూ తప్పించుకోవడానికి అవకాశం లేదన్నారు. అయితే, పొరుగు రాష్ట్రాల ద్వారా నగరంలో ప్రవేశించినవారు ఒకటీ అరా ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉందని ఒప్పుకున్నారు.

     అంతలో హోమ్ మినిస్టర్ నుండి పిలుపు రావడంతో, వెళ్ళి కేసులో అంతవరకు సాధించిన ప్రోగ్రెస్ ని బ్రీఫ్ చేసాడు ఇన్స్ పెక్టర్ మాధవ్. “సర్! దుండగుడు నిజంగానే కరోనా అఫెక్టెడో కాదో తెలియదు. కానీ, త్రెట్ డెస్క్ ను ఓపెన్ చేసి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది…” అన్నాడు.

     “త్రెట్ డెస్క్ అంటే?” ప్రశ్నించాడు హోమ్ మినిస్టర్.

     “వాళ్ళలో కింగ్ పిన్ ఓ సెంట్రల్ ప్లేస్ నుండి ఆపరేట్ చేస్తుంటాడు. వాడు తన విక్టిమ్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తూంటే, వాడి అనుచరులు ర్యాన్సమ్ ని వసూలుచేసుకోవడం వంటి లాజిస్టిక్స్ చూసుకుంటారు…” వివరిం

చాడు ఇన్స్ పెక్టర్.

     చిన్నగా నిట్టూర్చాడు హోమ్ మినిస్టర్. “ఓపక్క కరోనా వంటి మహమ్మారికి భయపడి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతూంటే…దాన్ని కూడా క్యాష్ చేసుకోజూసే నీచులు కూడా ఉండడం మిక్కిలి దురదృష్టకరం. కరోనా కంటే ప్రమాదకరం వాళ్ళు. త్వరగా పట్టుకోకపోతే ఇంకా ఎందరో బలయిపోయే ప్రమాదం ఉంది” అన్నాడు.

     “ఎస్, సర్! త్వరలోనే ఈ కేసులో బ్రేక్ త్రూని సాధిస్తానన్న నమ్మకం నాకుంది” అన్నాడే కానీ, తన మాటలు తనకే పేలవంగా తోచాయి ఇన్స్ పెక్టర్ కి.

#

     ఇన్స్ పెక్టర్ మాధవ్ ని అచ్చెరపాటుకు గురిచేస్తూ ‘కోవిడ్-19’ నుండి ఫోన్ వచ్చింది – “ఇన్స్ పెక్టర్! నా ఆపరేషన్ కి త్రెట్ డెస్క్ అని పేరు పెట్టినందుకు ధన్యవాదాలు. కానీ, నా వ్యవహారంలో మరీ లోతుగా వెళ్తున్నావు నువ్వు. కరోనా వైరస్ కి నిన్ను, నీ ఫ్యామిలీనీ ఎక్స్ పోజ్ చేసుకోవడం నీకు ఇష్టముండదనే నమ్ముతున్నాను. ఎంతైనా ప్రాణం తరువాతే కదా, డ్యూటీ!”

     ఆ వ్యక్తి తిన్నగా పోలీసులకే ఫోన్ చేసే సాహసం చేస్తాడని ఊహించలేదేమో, మాధవ్ అవాక్కయ్యాడు. తేరుకునేలోపునే ఫోన్ డిస్కనెక్ట్ అయింది…స్క్రీన్ మీద నంబర్ పడలేదు. ట్రూ కాలర్ కూడా వివరాలు చెప్పలేకపోయింది. మునుపటివాటిలాగే అదీ ఓ అన్-లిస్టెడ్ ప్రైవేట్ నంబర్ అయ్యుంటుందని గ్రహించాడు…ఐతే ఆ కాల్ అతనిలో కొత్త ఆలోచనలకు తెరలేపింది…

     రెండు రోజుల తరువాత హోమ్ మినిస్టర్ పి.ఎ. రాంబాబు ఇన్స్ పెక్టర్ మాధవ్ కి ఫోన్ చేసాడు. “సార్! రెండు రోజులుగా నన్నెవరో రహస్యంగా వెంబడిస్తున్నట్టు అనుమానంగా ఉంది. భయంవేసి సార్ తో చెబితే, మీ దృష్టికి తీసుకురమ్మన్నారు” అన్నాడు. అతని గొంతుకలో భయాందోళనలు!...రాంబాబుకు ఇంచుమించు ముప్పయ్యేళ్ళుంటాయి. గత ఐదేళ్ళుగా సహదేవరావు దగ్గర పనిచేస్తున్నాడు.  

     “డోంట్ వర్రీ. ఐ విల్ లుక్ ఇంటూ ఇట్,” అంటూ రాంబాబుకు హామీ ఇచ్చాడు మాధవ్.

#

     మూడు రోజుల తరువాత – తెల్లవారుఝామున మూడు గంటలకు మెహదీపట్నంలోని ఓ అపార్ట్మెంట్ మీద రెయిడ్ చేసాడు ఇన్స్ పెక్టర్ మాధవ్. అందులో నిద్రిస్తూన్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నాడు. వారిలో ఒకడికి ముప్పయ్యేళ్ళుంటాయి. మిగతా ముగ్గురూ అతనికంటే రెండు మూడేళ్ళు చిన్నవాళ్ళు. ఎదురుచూడని ఆ రెయిడ్ కి ఖంగుతిన్నారు వాళ్ళు. అపార్ట్మెంటులోంచి ఓ ల్యాప్ టాప్, సెల్ ఫోన్లు, పలు సిమ్ కార్డ్ లు, వగైరాలను సీజ్ చేసారు పోలీసులు. అంతేకాదు, లాకర్లో ఐదువందల నోట్ల రూపంలో ఉన్న కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

     “వెల్, మిస్టర్ సింహాద్రీ! నీ త్రెట్ డెస్క్ పగిలిపోయింది. నీ ఆట కట్టింది!” అంటూ వారిలో కింగ్ పిన్ అయిన పెద్దవాణ్ణి చెంప ఛెళ్ళుమనిపించాడు ఇన్స్ పెక్టర్ మాధవ్. “డ్యూటీయా, ప్రాణమా అంటూ బెదిరించావు కదూ నన్ను? నాకు డ్యూటీయే ముఖ్యం!”. 

4

     హోమ్ మినిస్టర్ నివాసంలో సహదేవరావు, డిజిపి, ఇన్స్ పెక్టర్ మాధవ్, పిఎ రాంబాబు సమావేశమయ్యారు. అరెస్ట్ చేయబడ్డ యువకులు నలుగురూ కూడా హాజరుపరచబడ్డారు.

     “కోవిడ్-19 పేరుతో నగరంలోని ధనికులను గజగజలాడిస్తూన్న ముఠా…పట్టుమని ముప్పయ్యేళ్ళు కూడా లేని ఈ యువకులేనంటే నమ్మశక్యంకాకుండావుంది సుమా!” అన్నాడు సహదేవరావు విస్తుపాటుతో.

     ఆ కేసు మిస్టరీని ఇన్స్ పెక్టర్ మాధవ్ విడదీస్తూంటే కుతూహలంతో ఆలకించారంతా…

     “ఈ ర్యాకెట్ వెనుకనున్న మాస్టర్ మైండూ, కింగ్ పిన్నూ ఐన సింహాద్రిది శ్రీకాకుళం. బి.కామ్. పాసై, కంప్యూటర్స్ లో సర్టిఫికేట్ కోర్స్ చేసాడు. సరైన ఉద్యోగం దొరక్క ఏవేవో చిల్లరమల్లర పనులు చేసేవాడు. ఏడాది క్రితం హైదరాబాద్ వచ్చి తన ఊరివాడైన ఓ స్నేహితుణ్ణి కలుసుకున్నాడు. అతని సాయంతో ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ గా ఉద్యోగంలో చేరాడు…ఇంతలో కరోనా వైరస్ సమస్య ఉత్పన్నమయింది. కోవిడ్-19 పేరు చెబితే ప్రపంచమంతా ఒణికిపోతోంది. అప్పుడే వచ్చింది సింహాద్రికి ఆ ఆలోచన – ప్రజల భయాన్ని ఎన్ క్యాష్ చేసుకోవాలన్న నీచపుటాలోచన!

     ఓ స్కూటర్ గరేజ్ లో మెకానిక్ గా పనిచేసే మల్లేశం, ఓ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ భాస్కర్, ఓ ఫ్రెష్ లో పనిచేసే మూర్తిలతో సింహాద్రికి స్నేహమయింది. వారి సాయంతో తన ఆలోచనను అమలులోపెట్టేసాడు. ధనికులను తాను ‘కోవిడ్-19’ పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూంటే, మిగతావారు వివిధ ప్రాంతాల నుండి ర్యాన్సమ్ సొమ్మును కలెక్ట్ చేసుకుని వస్తుంటారు…నిజానికి ఈ నలుగురిలో ఎవరికీ కరోనా వైరస్ లేదు…”

     ఆగి, నేరస్థుల వంక చూసాడు మాధవ్. తలలు వంచుకున్నారు వాళ్ళు.

     “సింహాద్రి ఆ సొమ్ములో ఆ ముగ్గురికీ తలో పదిలక్షల చొప్పున ఇస్తుంటాడు. హఠాత్తుగా అబ్బిన ఆ సిరితో జల్సాలు చేయనారంభించారు నలుగురూ. ఓ డార్మిటరీలో ఉండే సింహాద్రి మెహదీపట్నంలోని ఓ ఖరీదైన అపార్ట్మెంటుకు మకాం మార్చాడు. సిటీబస్ లో తిరిగేవాడు కాస్తా ఖరీదైన కారు కొన్నాడు. పాత సైకిళ్ళపైన తిరిగే ఆ ముగ్గురూ సరికొత్త మోటార్ బైక్స్ కొన్నారు. నలుగురూ బ్రాండెడ్ డ్రెసెస్ నే ధరించసాగారు …” చెప్పుకుపోయాడు ఇన్స్ పెక్టర్.  

     “నగరంలోని ఇతర ధనికులు కొందరిని కలిసి బ్లాక్ మెయిలర్ గురించి హెచ్చరించాను నేను. కాల్ వస్తే నాకు తెలియపరచమని చెప్పాను. ఐతే ఎవరి ప్రాణభయం వారిది! నా లిస్టులోని నలుగురు నాతో చెప్పకుండానే ర్యాన్సమ్ చెల్లించేసారు. మిగతావారు కూడా అలా చేయరన్న గ్యారంటీ లేదు. ప్రజల సహకారం లేకపోతే పోలీసుల టాస్క్ కష్టతరమవుతుంది…నేరస్థుడు నిర్లక్ష్యంతో కానీ, దుర్విశ్వాసంతో కానీ ఏదో ఒక పొరపాటు చేయకమానడు. అదే అతన్ని పట్టియిస్తుంది. ప్రతి పరిశోధకుడూ ప్రాథమికంగా వెదికేది ఆ పొరపాటు కోసమే.

     ఓ రోజున హోమ్ మినిస్టర్ గారికి కేసు గురించి బ్రీఫ్ చేస్తూ, త్రెట్ డెస్క్ అన్న పదం వాడాను నేను. ఆశ్చర్యంగా రెండురోజుల తరువాత కోవిడ్-19 నుండి నాకు కాల్ వచ్చింది. తన ఆపరేషన్ కి త్రెట్ డెస్క్ అని పేరు పెట్టినందుకు నన్ను అభినందిస్తూనే, ఆ కేసులోంచి విరమించుకోవలసిందిగా బెదిరించాడు…”

     ఆగి, పి.ఎ. రాంబాబు వంక చిరునవ్వుతో చూసాడు మాధవ్. “నేను హోమ్ మినిస్టర్ గారి వద్ద త్రెట్ డెస్క్ గురించి ప్రస్తావించినప్పుడు అక్కడ ఉన్న మూడో వ్యక్తి రాంబాబు ఒక్కడే. అందుకే నా అనుమానం అతనిపైకి వెళ్ళింది. అతని మీద నిఘా పెట్టాను. ఆ కేసుతో అతనికి సంబంధంలేదని తేలినా, అతని స్నేహితుల గురించి ఆరా తీస్తే సింహాద్రి గురించి తెలిసింది. వారానికోసారైనా మిత్రులిద్దరూ కలుసుకుంటుంటారు. మాటలలో రాంబాబు ఆ కేసు గురించీ, త్రెట్ డెస్క్ గురించీ సింహాద్రితో చెప్పాడు…సింహాద్రి బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తే, ఇటీవల అతని లైఫ్ స్టైల్ హఠాత్తుగా మారిపోయినట్టు తెలిసింది. అతనికి మిగతా ముగ్గురితోగల స్నేహం గురించీ, వాళ్ళ లైఫ్ స్టైల్స్ లో కూడా వచ్చిన మార్పు లను గురించీ బైటపడింది. నా అనుమానపు ముల్లు సింహాద్రి వైపు మొగ్గింది. అతని నివాసం మీద రెయిడ్ చేయడంతో నలుగురూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వారి పాస్ట్ విక్టిమ్స్, వుడ్-బీ విక్టిమ్స్ యొక్క లిస్టులు వగైరా ఇంక్రిమినేటింగ్ డాక్యుమెంట్సు, వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చుపెట్టగా మిగిలిన సొమ్ములూ దొరికాయి. మల్లేశం, భాస్కర్, మూర్తిల నివాసాలు కూడా సోదాచేయగా వారివద్ద మిగిలియున్న సొమ్ములు దొరికాయి…నేరస్థులు తమ నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు…” చిక్కటి నిశ్శబ్దం ఆవరించుకుంది అక్కడ.

     దాన్ని ఛేదించుతూ మళ్ళీ అన్నాడు ఇన్స్ పెక్టర్ మాధవ్ – “హోమ్ మినిస్టర్ వంటి బాధ్యతాయుతులైన ఓ మంత్రిగారి దగ్గర పి.ఎ. గా పనిచేసే వ్యక్తి తన విధులలో గోప్యతను పాటించుతూ అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. రాంబాబు యొక్క ఇండిస్క్రెషన్ ఈ కేసులో నేరస్థుల్ని కనిపెట్టాడానికి ఉపకరించినా…అతన్ని తమ వద్ద కొనసాగించాలా వద్దా అన్నది మంత్రిగారే నిర్ణయించుకోవలసియుంటుంది…”

     తన పొరపాటును గ్రహించిన రాంబాబు తల వంచుకున్నాడు.

                                                              సమాప్తం


Rate this content
Log in

Similar telugu story from Crime