Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Sudheer Kaspa

Crime

5.0  

Sudheer Kaspa

Crime

విహంగం-5

విహంగం-5

13 mins
506


జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ ...కాన్ఫరెన్స్ హాల్......

హాలు నిండి పోయింది.సుమారు వంద కుర్చీలుంటాయి.జర్నలిస్టులు మైకులు సిద్ధం చేస్కుంటున్నారు.కెమెరామెన్ పొజిషన్ పక్కా చేస్కొని క్లిక్ క్లిక్ మంటూ ట్రైల్స్ వేసుకుంటున్నారు.

హాలు తలుపు తెరుచుకుంది.యూనిఫాంలో గంభీరంగా ఉన్న దీక్ష వచ్చింది.లేచి నిల్చున్నారు అందరూ....అందరి కళ్ళలోనూ ఆత్రుత.ఏం బాంబు పేలుస్తుందో ఈమె. ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా ఇలా ఇంత అర్జెంటుగా ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలవలేదు ఆమె. సివంగిలా ఆమె అలా నడుచుకుంటూ వస్తుంటే అలా చూస్తూ నిలబడిపోయారు.డయాస్ పైన కుర్చీలో కూర్చుంది.కూర్చో మన్నట్టు చేత్తో సైగ చేసింది......

“వెల్కం ఆల్ ....స్ట్రైట్ గా పాయింట్ కే వస్తా.....కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసిన కేసు వర్షిణి మర్డర్ మిస్టరి.ఈరోజు నేను అసలు కేసులో జరిగిన పాయింట్ టు పాయింట్ డెవలప్మెంట్స్ గురించి అందరికీ క్లియర్ గా చెప్పడానికి ఇక్కడికి పిలిచాను.”

“కానీ మేడం ....మిమ్మల్ని ఆ కేసు నుంచి తప్పించి స్పెషల్ టీం కి అప్పగించారు కదా ?” అడిగాడు ఒక కుతూహల రావు .

“నేను చెప్పింది వినడానికి మాత్రమే పిలిచాను....మిమ్మల్ని అడగమనలేదు....If you still want to ask questions, you may leave this place and go on with your questions anywhere else.”

ఆమె తూటాల్లాంటి మాటలు విని ఇక అటు వైపు నుండి సౌండ్ లేదు.హాల్ మొత్తం నిశ్శబ్దం.

“సో ...కమింగ్ టు ది పాయింట్ ....

ఆ రోజు సాయంత్రం నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ .....”మేడం ప్లీజ్ హెల్ప్ ....ఇక్కడొక మర్డర్ జరిగింది.చాలా భయంగా ఉంది” అని...

డయాస్ పక్కనే దివాకర్ నిల్చొని ఆసక్తిగా చూస్తున్నాడు.అతడి మొఖం చాలా రోజులకి ప్రశాంతంగా ఉంది. ఆఖరి వరుస కుర్చీలో శివమూర్తి ఆందోళనగా చూస్తున్నాడు.

దీక్ష కొనసాగిస్తుంది....” ఒక మర్డర్ ...అది కూడా విపరీతమైన భయంతో వణుకుతున్న ఓ అమ్మాయి నుండి ఫోన్ రావడంతో నేనే స్వయంగా అటెండ్ అవ్వాలని డిసైడ్ అయ్యా వెంటనే ఆమె ఉన్న స్థలంకి చేరుకుకున్నా .....ఒక బస్టాప్ లో వణుకుతూ ఏడుస్తూ కనిపించింది.చేరదీసి ధైర్యం చెప్పా ..ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో వివరం కనుక్కున్నా ...అక్కడ నుండి మొదలైంది ఈ వేట ....ఆ వేట ఈరోజుకి ఒక ముగింపుకి రాబోతుంది .”

దివాకర్ కి సైగ చేసింది .....

రూంలో వెయిట్ చేస్తున్న లేడి కానిస్టేబుల్ ని రమ్మని కాల్ చేసాడు.......

తలుపు తెరుచుకుంది .....

లోపలికి అడుగు పెట్టింది కానిస్టేబుల్ ఓ అమ్మాయిని వెంటబెట్టుకొని....

ఒక్కసారిగా కెమెరాలు అటువైపు తిరిగాయి ....క్లిక్ క్లిక్ క్లిక్ ..క్లిక్ క్లిక్..........కెమెరాల షట్టర్ చప్పుళ్ళతో హాలు మార్మోగి పోయింది. ఫ్లాష్ లైట్ల మెరుపులతో కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయ్....

ఆ అమ్మాయి ఆ ఫ్లాష్ వెలుగులకి తట్టుకోలేక మొఖానికి చెయ్యి అడ్డు పెట్టుకొని డయాస్ దగ్గరికి వచ్చింది....

“మీరు ఇన్నాళ్ళు జపం చేసిన పేరు .....వర్షిణి .....ఇదిగో మీ ముందు ఉంది “ వర్షిణి ని పట్టుకొని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది.”

అమ్మా.....తల్లీ ......బంగారూ............అంటూ వెనుక నుండి కుర్చీలు దాటుకుంటూ ...పరిగెత్తుకుంటూ ...ఒక్కసారిగా వరూని హత్తుకున్నాడు శివ మూర్తి ........ .అతని గుండెలలో ఇన్ని రోజులుగా పేరుకున్న బాధ,గుండెకోత ఒక్కసారిగా ఆనకట్ట బద్దలైనట్టు కన్నీళ్ళ రూపంలో తన్నుకొచ్చేసాయి. సంభ్రమాశ్చర్యమో ఇంకేదోనో ....నరకంలోంచి ఒక్కసారిగా స్వర్గంలో పడినట్లు అతని ఆనందానికి అవధులు లేవు.

శివమూర్తి మొఖంలో ఆ ఆనంద తాండవం చూసి దివాకర్ గుండెల్లో ఏదో తెలియని సంతృప్తి, అతని మొఖంలో చిరునవ్వై విరబూసింది.నిన్న రాత్రే విషయం తెలిసినా శివకు చెప్పకుండా దాచినందుకు ఓ చిన్న గిల్టీ ఉన్నా....ఈ అపురూప దృశ్యం చూసాక దివాకర్ మనసు తేలిక పడింది.

“మేడం!! మేడం!! .....వర్షిణి ....ఇన్ని రోజులు ఎక్కడ ఉంది ? మరీ ఆ శవం ఎవరిది?? ఇన్ని రోజులు ఎందుకు దాచారు ??”మీడియా వాళ్ళ బుర్రలు ఆ షాక్ నుంచి తేరుకొని ఆత్రుత,టెన్షన్ల లోకి షిఫ్ట్ అయ్యాయి.

“ప్లీజ్ ..కాసేపు కాం గా ఉండండి” దివాకర్ వారించాడు.

“నేనెందుకు చెప్పడం.ఆమే చెప్తుంది వినండి...వరూ ....మొత్తం నీ మనసులో ఉన్నదంతా ....ఏం భయం లేకుండా ప్రతి చిన్న విషయం చెప్పు నీకేం భయం లేదు.” వరూ భుజంపై చెయ్యేసి దీక్ష ....

“నేను వర్షిణి......నాకు ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.....ఏదో చదువు,భరతనాట్యం,కాలేజి,ఇల్లు తప్ప పెద్దగా లోకం చూడలేదు. ఆ రోజు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు ....

మా కాలేజి Annual day celebrations.

నాకు చాలా నెర్వస్ గా,ఆనందంగా కూడా ఉంది.

ఎనిమిది సంవత్సరాలుగా నేర్చుకున్న భరతనాట్యం...నా మొదటి ప్రదర్శన....అంతకు ముందు చిన్న చిన్న ప్రదర్శనలు చేసినా కూడా.....మా కాలేజిలో ...మా పెద్ద ఆడిటోరియంలో వేల మంది ప్రేక్షకుల మధ్య నా షో... It’s really a big day అనుకున్నా....

మొదటి ప్రోగ్రాం నాదే......చక్కగా రెడీ అయ్యా.....ప్రారంభించా...........ఒక్క నిమిషం కూడా పూర్తిగా కాలేదు.

నేను అస్సలు ఉహించలేదు......

“ఆపేయండ్రో....దాన్ని ..ఆపేయండి ....అబ్బా.....జండు బాం......జండు బాం.....అని కేకలు .....

ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ ఐపోయింది..

నా కన్నీళ్ళు నా కంటి కాటుకను కరిగిస్తూ నా బుగ్గలను తాకుతున్నట్టు నాకు తెలుస్తుంది. నా లయ తప్పుతుందని నాకు అర్ధం అవుతుంది.

చంద్రముఖి .......అని అరిచాడు ఎవడో ....ఆ వెకిలి నవ్వులు ....వెర్రి కూతలు ....నా గుండె బద్దలైపోయింది....మధ్యలోనే ఆపేసి దిగిపోయాను.

నేను మధ్య తరగతి అమ్మాయిని చిన్న చిన్న వాటికి ఏడ్చే రకాన్ని కాదు.కానీ ఆరోజు ఏడ్చినంతగా జీవితంలో ఎప్పుడూ ఏడవలేదు. ఒక కళని కనీసం గౌరవించలేని జనాల మధ్యలో బతకడం కంపరంగా అనిపించింది.మీకు నచ్చకపోతే లేదు.ఒక్క ఐదు నిముషాలు భరించలేనంత భారం కాదుగా భరతనాట్యం?ఆ తర్వాత ప్రోగ్రాంలలో ఐటెం సాంగులకి వేస్తున్న డాన్సులకి ఈలలు,చప్పట్లు,ప్రశంసలు చూసి నా మనసు ముక్కలైపోయింది.కావాలనుకుంటే నేను అవి వెయ్యగలను.కానీ వాళ్ళు నాలా వెయ్యలేరుగా??అయినా ఎవడికీ అక్కర్లేని ఈ తొక్కలో నాట్యాలు,సంప్రదాయాలు నాకు మాత్రం అవసరమా అనిపించింది.ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు.

డైరీ రాస్కోని,YOUTUBE వీడియోలు చూస్తున్నా

“ఓ విహంగమా !! స్వేచ్చ లోకం పిలుస్తోంది రా“ అని టైటిల్ తో ఒక వీడియో కనపడింది.క్లిక్ చేశా ..

“అడుగు తీసి అడుగేస్తే ఆంక్షలు, ఆరు బైట నవ్వితే తప్పు,నచ్చిన బట్ట కడితే తప్పు,నచ్చిన గుడికి వెళితే తప్పు,కూర్చుంటే తప్పు,నిల్చుంటే తప్పు.....ఊ కొడుతూపొతే ఉరేసే దాకా వదలరు” ఆవేశంగా చెప్తోంది ఓ మహిళ.

ఇదేదో బాగుందని చూసా...వరుసగా వస్తూనే ఉన్నాయి వీడియోలు అదే మహిళవి..ఎంత బాగా మాట్లాడుతుందో..ఒక్క రోజులోనే ఆమెకు ఫ్యాన్ ఐపోయా...ఆ కింద కాంటాక్ట్ నెంబరు కూడా ఉంది.నిజానికి ఆమె అంత ఫేమస్ అని అప్పటి వరకు నాకు తెలీదు.మరుసటి రోజు వెళ్లి కలుద్దాం అనుకున్నా .......వింధ్యా బెనర్జీ .....కొన్ని వేల జీవితాలను మార్చిన ఒక లివింగ్ లెజెండ్.

ఆమె గురించి తెలిసిన ఎవరికైనా ఆమె NGO లో పని చేయాలని ఉబలాటం కలుగుతుంది.నేను కూడా అలానే జాయిన్ అయ్యా గ్లోబల్ గ్రీన్ సంస్థలో. ఆమె నా జీవితాన్ని మార్చేసింది ఎన్ని విషయాలో నేర్చుకున్నా.డైరెక్ట్ గా ఎపుడూ కలవకపోయినా కూడా, ఆమె రాసిన పుస్తకాలూ సాహిత్యం ఎంత మందినో ప్రభావితం చేసాయి. ఎన్నో పోరాటాలలో పాల్గొన్నా ...పర్యావరణంకి ప్రమాదం అంటే గ్లోబల్ గ్రీన్ అక్కడ వాలిపోవాల్సిందే.ఇవే కాదు ఎందరో అనాధ పిల్లలకి,వృద్ధులకి సాయం చేసే గొప్ప పనులు కూడా చేయించేవారు.నేను కూడా ఒక తాత గారిని చక్కగా చూస్కునే దానిని.నాకు మా సంస్థ అప్పగించిన బాధ్యత అది.

ఓ రోజు సడెన్ గా నేను ఉహించని మనిషి NGO లో కనపడింది..షాలిని.....

షాలిని అంటే నాకు ఏదో ఇష్టం ఉండేది.నాకే కాదు ఆమె డ్రెస్సింగ్,ఆటిట్యూడ్ అంటే క్లాస్ లో అమ్మాయిలు అందరికీ ఒక రకమైన మోజు అనొచ్చు.కానీ బైటకి మాత్రం తనని ఓ రెబెల్ అనీ, కొందరైతే బిచ్ అని కూడా అనేసేవారు. ఎపుడూ అవేం కేర్ చెయ్యలేదు ఆమె.కావాలనుకున్నప్పుడు లంగావోణి వేస్తుంది లేకపోతే చిన్న షార్ట్స్ వేస్కొని బైటకి వెళ్ళిపోతుంది. సంప్రదాయంగా ఉన్న రోజు పట్టీలు వేస్కోనేది.. తన భావాలు నాకు నచ్చేవి నచ్చితే చెయ్యాలి లేదంటే లేదు అంతే కానీ పాత చింతకాయ పచ్చడి రూల్స్ ని పట్టుకు వేలాడదు.కానీ ఈ అమ్మాయి సేవ కూడా చేస్తుందా అనే అనుమానం. తనొక పెద్ద ఇండస్ట్రీ పై పోరాటం చేస్తున్న టీం లో పని చేస్తున్నా సో మా పేర్లు వివరాలు బైటకి తెలియకూడదు.తెలిస్తే రిస్క్ ఎవరికీ చెప్పొద్దూ ..కాలేజిలో కూడా మనం ఇక్కడ పని చేస్తున్నట్టు తెలియకూడదు.అని చెప్పింది. కానీ తనపై ఉన్న ఇష్టం వలనేమో పెద్దగా అనుమానం రాలేదు తక్కువ కాలంలోనే ఫ్రెండు ఐపోయింది. కొన్నిసార్లు తన మోడరన్ డ్రెస్సులు వేస్కోమని ఇచ్చేది.మనసు లాగేది కానీ.వేస్కోలేదు ఎపుడూ..తనలా అనుకరించడం నాకు తెలియకుండానే అలవాటు ఐపోయింది. తనలా ఉండటానికి తెగ ట్రై చేసేదాన్ని కానీ అంత ధైర్యం లేదు.తనతో ఉన్నంత సేపు రెక్కలు కట్టుకొని స్వేచ్చగా ఎగిరే పక్షిలా అనిపించేది.

నాకు కూడా నీలా ఉండాలని ఉంది అన్నా.....ఓరోజు

నాలా ఉండటం నీ వల్ల కాదులే అంది.

ఏం ఎందుకు కాదు??

ఐతే ఒక పందెం నాతో ఒక ప్రోగ్రాంకి వస్తే ...నువ్వు కూడా నా మోడరన్ థాట్స్ కి దగ్గరగా రాగలవు అని ఒప్పుకుంటా...

ఏం ప్రోగ్రాం?

కిస్ ఆఫ్ లవ్ అనీ.......

ఆరోజు ఆ ప్రోగ్రాం ...అదొక కొత్త ఫీలింగ్ ....ఆ ముద్దుల సంగతి పక్కన పెడితే.....అక్కడ వాళ్ళిచ్చిన స్పీచ్ సూపర్ గా అనిపించింది.”మన హక్కుల కోసం మనం ఏదైనా చెయ్యొచ్చు అని అర్ధం ఐంది.మనిషి స్వేచ్చా జీవి.అతన్ని అడ్డుకోనేది ఏదైనా, ప్రభుత్వ విధానం అయినా,మతాచారాలు అయినా అవి విషం తో సమానం.మనం మన హక్కుల కోసం పోరాడాలి.” అని ఒక కొత్త లోకం లోకి దూరినట్లు అనిపించింది.”

వరూ మాటలు చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు శివమూర్తి.తన మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయా?ఇంట్లో కనీసం ఒక్క మాట కూడా బయటకి చెప్పదు.ప్రతి కూతురిలో తండ్రికి కనిపించని మరో కోణం ఉంటుందా?? భారమైన హృదయంతో ఆమె మోఖంలోకే చూస్తూ ఆమె మాటలు వింటున్నాడు.

“ ఓ సారి టాటూ వేయించుకుందాం రా అంది.నాన్న తిడతారు అనే భయం ఉన్నా తన మాట కాదనలేక వెళ్లి వేయించుకున్నాం.అక్కడే పరిచయం అయ్యాడు.కార్తిక్. టాటూ ఆర్టిస్ట్ కార్తిక్. ఒక మనిషితో అంత త్వరగా ప్రేమలో ఎలా పడతారో నాకు ఇప్పటికి అర్ధం కాదు.అతని క్రియేటివిటీ,ఆలోచనలు నచ్చాయట కొద్ది రోజుల్లోనే బాగా దగ్గరైపోయారు.అతను కూడా బాగానే చూస్కునేవాడు.కొన్ని రోజులకే పెళ్లి కూడా చేసేస్కున్నారు.షాలిని ఇంట్లో ఒప్పుకోలేదు. బైటకొచ్చేసారు.కానీ నేను చూసిన వాటిలో బెస్ట్ జంట వాళ్ళదే అన్నట్టు ఉండేవారు.

ఎప్పటిలాగానే ఆ రోజు గ్లోబల్ గ్రీన్ ఆఫీసులో కలిసాం నేనూ, షాలిని. ఆరోజు చాలా అందంగా రెడీ అయ్యింది.చీర కట్టుకొని....చుస్తే నేనే చూపు తిప్పుకోలేకపోయా.బ్లూ లో సూపర్ ఉన్నావ్ అన్నా..ఇది బ్లూ కాదు ఇంగ్లిష్ కలర్ అంది.ఓ అదొక కలర్ ఉందా అనుకున్నా.

“ సాయంత్రం గుడికి వెళ్దాం అన్నాడు మావోడు అందుకే ఈ డెకరేషన్” నవ్వుతూ చెప్పింది షాలిని.”చిన్న వర్క్ ఉంది చూస్కొని వెల్లిపోదాం.మీ ఇల్లు ఆ గుడికి వెళ్ళే దారిలోనేగా డ్రాప్ చేస్తా నా కార్లో” అంది.ఓకే అని వెయిట్ చేశా...

అరగంట తర్వాత వచ్చింది.

మొఖంపై చెమటలు ఉన్నాయ్....ఏ.సి రూంలో ఏంటి దీనికి చెమటలు?? అనుకున్నా ....

“వెళ్దామా” అంది .తన మొఖంలో కాస్త జోష్ తగ్గినట్టు అనిపించింది ఎందుకో.

బయల్దేరాం.చేతిలో ఉన్న పేపర్స్,హ్యాండ్ బ్యాగ్ వెనక సీట్లో పడేసింది. కార్ డ్రైవ్ చేస్తోంది కానీ ఏదో పరధ్యానంగా ఉంది.

“ఏంటి అంత ఆలోచన??”

సర్రున వెనుక సీట్లో నుండి పేపర్లు కిందకి జారాయి.మెల్లగా వెనక్కి వంగి చేత్తో తీసా కిందపడిన ఆ పేపర్స్.

“మన ఆఫీస్ లో కంప్యూటర్లకి పెన్ డ్రైవ్ ,సిడి కి యాక్సెస్ ఎందుకు ఇవ్వడు?? అంత సీక్రెట్స్ ఏముంటాయి అందులో “ డ్రైవ్ చేస్తూ రోడ్ వైపు చూస్తూనే అడిగింది.

“ఏమో డేటా ఎక్కడా లీక్ అవ్వకూడదు అని అనుకుంటా..ఏం నీకెందుకు పెన్ డ్రైవ్ లో సినిమాలు ఎక్కించుకుంటావా ఏంటి? ఇంట్లో నెట్ లేదా “అడిగా తింగరి దానిలా ...నా బుర్ర అంతవరకే పనిచేసింది మరి.

“హ్మ్....అదేం కాదులే వదిలేయ్ ..అయినా నాకెందుకు?? హ్యాపీ గా రేపు బాలి కి ఎగిరిపోతా ఒక వారం రోజులు ఫుల్ ఎంజాయ్”. అంది.

ఏంటి??అసలికే తను ఒక పెద్ద ఇండస్ట్రీ పై చేస్తున్న పోరాటంలో ఇంపార్టెంట్ మెంబర్ ....అవతలి వాడికి అమ్ముడుపోయిందా?ఏదో చిన్న డౌట్ మనసులో.

షాలిని ఫోన్ రింగ్ ఐంది .....ఎవరో ఏంటో తెలీదు....ఓకే...హ్మ్ ..ఓకే.... అని మాత్రమే మాట్లాడింది.

కార్ ఆపింది ...

“సారీ వరూ......ఆ నెక్స్ట్ వచ్చే జంక్షన్లో నేను వెయిట్ చెయ్యాలి కార్తిక్ వస్తా అన్నాడు...ఏదో వర్క్ ఉండి ఇటు వచ్చాడంట..ఓ అరగంట ఇక్కడే వెయిట్ చేస్తే కలిసి గుడికి వెళ్దాం అన్నాడు. సో.....నువ్వూ.......ఆటోకి వెల్పోతావా??”

చుట్టూ చూసా .....అసలు అది ఏం ఏరియా కూడా నాకు తెలియలేదు.ఇది నేను రోజు వచ్చే రూట్ కాదు.ఇక్కడికి అసలు ఆటో దొరికేలా లేదు.ఓలా,ఉబర్ కూడా ఈ లొకేషన్ లో ఏం క్యాబ్స్ చూపించటం లేదు.అయినా ఇదేంటి బొత్తిగా మొహమాటం కూడా లేకుండా దిగిపో అంటుంది?? ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.సర్లే దీనికేం పని పడిందో ఇక్కడ అనుకుంటూ దిగేసా......బై చెప్పేసి..

తన కార్ మెల్లగా ఆ పక్క సందులో టర్న్ తీసుకొని ఆగడం నేను గమనించాను.కాస్త అలా ముందుకి నడిచా ...

ఏదో ఒక ఆటో రాకపోతుందా ....పది నిముషాలు ఐంది ఒక్క మనిషి కూడా కనపడలేదు..చీ చెత్త మొహంది అనవసరంగా దీనితో వచ్చా ....హ్యాండ్ ఇచ్చి పోయింది ...చేతిలో పేపర్స్ తో ...కాలిపై కొట్టుకున్నా చిరాకొచ్చి....

అప్పుడు గుర్తొచ్చింది ఇవి దాని పేపర్స్ కదా ...ఆ సందులోనే ఉండి ఉంటుంది ....

మెల్లగా నడిచా ....సందులోకి తొంగి చూసా..హమ్మయా కారుంది...ఏమనుకుంటే అనుకుంది దీన్నే డ్రాప్ చెయ్యమని అడుగుదాం. కార్ దగ్గరకి వెళ్ళా....

కార్లో లేదు.....

చుట్టూ జన సంచారమే లేదు......ఎక్కడో ఏవో చప్పుళ్ళు మాత్రం వినిపిస్తున్నాయి ....దూరంగా ఓ పాత గోడ ఉంది.మెల్లగా వెళ్లి దాని వెనుక తొంగి చూసా.....

నా గుండె ఆగినంత పనైంది.....

నలుగురు మనుషులు .....

ఒక తందూరి పొయ్యి లోపలకి ఎవర్నో తోస్తూ నిప్పు పెట్టారు...

ఆ కాళ్ళు ......ఆ ఇంగ్లీష్ కలర్ చీర ......

.అది కచ్చితంగా షాలిని ......

గట్టిగా అరవాలనుకున్నా ....

గొంతు పెగలలేదు....

అరిచినా ఎవరూ వచ్చే పరిస్థితి లేదు....

షాలిని కొంచెం కూడా కదలటంలేదు కింద నిప్పు సెగ తాకుతున్నా కూడా... ......

నాకు పిచ్చెక్కిపోతోంది ... ఒళ్ళంతా చెమటలు .......కళ్ళు తిరుగుతున్నాయి......మెల్లగా వెనక్కి అడుగులు వేస్తూ...పక్కకోచ్చేసా....పరిగెత్తా....4 కిలోమీటర్లు ...ఒక బస్టాప్ చేరాకా ....పోలీస్ కంట్రోల్ రూం ద్వారా దీక్ష మేడంకి ఫోన్ చేశా.... ఇదీ జరిగింది......

వరూ ..వెక్కి వెక్కి ఏడుస్తుంది. దీక్ష భుజం పై చెయ్యి వేసి అనునయించింది. కళ్ళలో నీళ్ళతో శివమూర్తి...ఇంతకీ ఎవరు చంపారు అనే అయోమయంలో మీడియా జనం.

గొంతు సవరించుకొని దీక్ష

“అవును చనిపోయినది షాలిని.....కానీ చంపినది మాత్రం ఎవరో కాదు ....మనమే.... కూతురిని అతి గారాబంతో కోరింది ఇచ్చి పెంచిన ఆమె తల్లిదండ్రులు ఆమె ఎలాంటి నిర్ణయాలు తీస్కుంటుందో గమనించక మొదటి తప్పు చేసారు,తర్వాత ఆమె పెళ్లి అయ్యాక ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఆమెని పూర్తిగా పట్టించుకోక మరో తప్పు చేసారు.ఒక విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు.ఇప్పుడు పోయిన కూతురు కోసం ఏడుస్తున్నారు.మనమే చంపేం అని ఎందుకన్నాను అంటే దాదాపు అందరం ఇదే దారిలో ఉన్నాం.

వరూ నుంచి ఫోన్ రాగానే ఆమెని చేరదీసి నా కస్టడిలో ఉంచా సేఫ్టీ కోసం.టెన్షన్ తో ఆమె చేతిలో నలిగిన ఆ పేపర్లను గమనించాను. సంఘటనా స్థలంకి చేరే లోపే మీ మీడియా వాళ్ళు హడావిడి చేసి ఏవేవో కథలు అల్లేశారు. ఒకేలాంటి కాలి పట్టీలు,టాటూ చూసి వరూ తండ్రి పొరబడ్డారు.షాలినిని అనుకరించే వరూ ఆమె వేస్కున్న మోడల్ పట్టీలు కొనిపించుకుంది.ఇద్దరూ కలిసి ఒకటే డిసైన్ టాటూ ఒకటే చోట వేయించుకున్నారు.ఇదే ఆ కన్ఫ్యూజన్ కి కారణం ఐంది. ఆ పేపర్లలో నేను చూసిన ఒక క్లూ ...ఆ సమయంలో నన్ను నిజం దాచేలా చేసింది.ఒక్క రోజు ఆగితే క్లారిటీ వస్తుందని ఊరుకున్నాను.కానీ శివమూర్తి గారి పరిస్థితి చూస్తే భయం వేసింది.అందుకే ఆయన్ని అను క్షణం గమనిస్తూ ఫాలో చెయ్యమని మా కానిస్టేబుల్ని నియమించా. కాస్త ఎమోషనల్ గా ఉన్న దివాకర్ ని ఈ ఆపరేషన్ కి కాస్త దూరం పెట్టా. ఇందులో పెద్ద తలలు ఇన్వాల్వ్ అయ్యాయని ఎందుకో చిన్న డౌట్ ఉంది అపుడే.అఫ్కోర్స్ దివాకర్ ఎప్పటిలాగానే అద్భుతంగా పనిచేసాడు.వెల్డన్ మిస్టర్ దివాకర్ కానీ మిమ్మల్ని ఈ భారీ కుట్ర నుండి కాపాడటానికి నా తల ప్రాణం తోకకొచ్చింది.

దివాకర్ చిరునవ్వుతో తలాడిస్తున్నాడు.

మరుసటి రోజుకి ఆ పేపర్లో ఉన్న క్లూ ద్వారా ఇది సాధారణమైన హత్య కాదని వేల కోట్ల మాఫియా అని అర్ధం ఐంది.కొన్నాళ్ళు ఈ హత్యని వరూ హత్యగా మిస్లీడ్ చేస్తే నేరస్తుల నిర్లిప్తత దర్యాప్తుకి సాయం అవుతుంది అనిపించింది. ప్లాన్ ప్రకారం వరూ తల్లిని అరెస్ట్ చేసాం. ఆమెని జైల్లో పెట్టలేదు ఆమె సేఫ్ గా వరూతోనే ఉంది. సారి శివ గారూ పాపం మిమ్మల్ని మాత్రం చాలా హింస పెట్టాం తప్పలేదు. దివాకర్,శివమూర్తిలను రెగ్యులర్ గా ఫాలో అవుతూనే వస్తున్నాం.కానీ దివాకర్ దర్యాప్తులో దూకుడు చూపిస్తూ నేరస్తులకి అనుమానం వచ్చేలా దూసుకెళ్ళాడు.అందుకే అతడ్ని కట్టడి చేయాల్సి వచ్చింది.కానీ దివాకర్ వెళ్లి వెళ్లి దొంగ చేతిలో తాళం పెడతాడని నేను ఉహించలేదు......

యెస్ ......ఈ కేసులో ప్రధాన నిందితుడు .....కాదు నిందితురాలు ......వింధ్య బెనర్జీ......

తమకున్న అపారమైన ధన,జన బలంతో ధర్నాలు చేయించి ప్రభుత్వాన్ని ఒత్తిడిలో నెట్టి తమకు అనుకూలమైన అధికారులతో స్పెషల్ టీం ని నియమించుకునేలా చేసింది.

ట్రింగ్ ట్రింగ్.......దీక్ష ఫోన్ మోగింది.......

Excuse me……..hello …sir.

“నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా...నా పెర్మిషన్ లేకుండా అసలు ప్రెస్ మీట్ ఎలా పెడతావ్.... నీ అంతు చూస్తా మళ్ళి యూనిఫాం వేస్కోలేవ్.....ఇపుడే మీట్ క్లోజ్ చేసి బైటకి రా....నీ మెంటల్ కండిషన్ బాగాలేదు అని చెప్పి నా పాట్లు ఏవో నేను పడతాను ....డు ఇట్ నౌ .....” రంకెలేస్తున్నాడు పై అధికారి.

ఫోన్ కట్ చేసింది.....

మా డిపార్ట్మెంట్లో ఇలాంటి వెధవలు ఉండటం మాకే కాదు మొత్తం దేశానికే సిగ్గుచేటు.ఇలాంటి వాళ్ళకి భయపడితే ఇక ఈ యూనిఫాంకి విలువేముంది. కమింగ్ టు ది పాయింట్....

వరూ ఒక హత్య చేసింది .........

వాట్..మేడం .....?? మీడియా వాళ్ళలో మళ్ళి కలకలం......

అవును......

గ్లోబల్ గ్రీన్ సంస్థ పేరు చెప్తే ... సేవ,స్వేచ్చ,పెద్ద పెద్ద స్కూళ్ళు,హాస్పిటళ్ళు,పోరాటాలు,హక్కులూ,ఉద్యమాలూ ఇవే గుర్తొస్తాయి కదూ !!

బయట నుండి చూసేందుకు అన్ని బాగానే ఉంటాయి.పాపం ఈ మెరుగులు చూసి వేల కొద్ది అమాయక యువత వాలంటీర్లుగా పని చేస్తూ తాము చేసే సేవ చూస్కొని మురిసిపోతుంటారు. వరూ లాగానే చాలా మందికి వృద్ధులకు సేవ చేసేందుకు నియమిస్తారు.వారితో చక్కగా మెలిగేందుకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.వృద్ధుల కోసం వారానికొకసారి పళ్ళు,జ్యూస్ లు కూడా సప్లై చేస్తారు. ఇలాంటి మరో వెయ్యి మందికి మనం సాయం చెయ్యాలంటే ఒక పని చేయాల్సి ఉందని చెప్తారు వాలంటీర్లకు. ఆ ఒంటరి వృద్ధులను ఒప్పించి వారి తదనంతరం వారి ఆస్తి మొత్తం NGO కు చెందేలా రాయిస్తారు.పాపం ఆ ఒంటరి తనంలో తోడున్న సంస్థను నమ్మి వారూ రాసేస్తారు. కొన్ని రోజులకు గుట్టు చప్పుడు కాకుండా ఆ వృద్ధులను హత్య చేస్తారు.కనీసం అడిగే వాళ్ళు కూడా లేని ఒంటరి వాళ్ళని టార్గెట్ చేస్తారు.ఇదీ వీళ్ళ ప్లాన్.పాపం ఇవేమీ వాలంటీర్లకు తెలియదు.వరూ కలుస్తున్న వృద్ధుని గురించి ఆరా తీస్తే అతను చనిపోయాడని,అతని ఆస్తులు మొత్తం గ్లోబల్ గ్రీన్ సంస్థకి బదిలీ చేయబడి ఉన్నాయి.అనుమానం వచ్చి ఆ నెలలో గ్లోబల్ గ్రీన్ పేరున జరిగిన ఆస్తి బదిలీ లావాదేవీలు అన్ని చెక్ చేసాం. ఒక్క నెలలోనే నలుగురి ఆస్తులు బదిలీ అయ్యాయి.”

విలేఖర్లు అందరూ నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు. వారి బుర్రల్లో సవా లక్ష ప్రశ్నలు...రాసే చెయ్యి వాగే నోరు ఆగవు కదా ....అయినా మాట్లాడితే కొట్టేటట్టు ఉంది ఈవిడ ....

“ఆ ఆధారాలతో నాలో అనుమానం బలపడింది.ఇంతలో స్పెషల్ టీం కి కేసు బదిలీ అయింది.చెప్పానుగా మాలో ఉన్న చీడపురుగులే కొన్ని వింధ్యకి సపోర్ట్ గా ఆధారాలను మాయం చేయడం మొదలు పెట్టారు.సో రికార్డ్ రూం ఫైర్ అయ్యిందని చెప్పాల్సి వచ్చింది.ఆన్ని రికార్డ్స్ సేఫ్...అండర్ మై కస్టడి.

ఈ క్రమంలో ఇంకో కుర్రాడిని మెచ్చుకోవాలి....చాలా రిస్క్ చేసి ఏవేవో కనిపెట్టాడు.అఫ్కోర్స్ అతను మమ్మల్ని కూడా నమ్మలేదు.కానీ పోలీసుల సాయం లేకుండా ఇలాంటివి చేయడం మిమ్మల్ని మీరు రిస్క్ లో పెట్టుకోవడమే. గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని వెయ్యి కళ్ళు గమనిస్తుంటాయి.అతను సంపాదించిన బాండ్ పేపర్ మరియు హత్య విషయం తెలిసి నిందితులు జాగ్రత్త పడ్డారు.అతడ్ని అరెస్ట్ చేయించి ఆ పేపర్స్ మాయం చేసారు. నేరం అతడిపై నెట్టే ప్రయత్నం చేసారు.అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు.అఫ్కోర్స్ ఈ మీట్ తర్వాత అతను ఇంక బయటపడ్డట్లే.అండ్ మిస్టర్ దివాకర్ మీ జీప్ డ్రైవర్ నిందితులకి ఇన్ఫార్మర్ గా పనిచేసాడు.ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకొని జైల్లో ఉన్నాడు.”

నమ్మిన వాడు మోసం చేసాడు అని తిట్టుకున్నదుకు శివ పశ్చాత్తాప పడ్డాడు. హర్షాని క్షమించమని మనసులోనే వేడుకున్నాడు.

ఇక అసలు విషయం ....ఈ హత్య ఎందుకు చేసారు ???

మనదరికి తెలిసిన విషయమే ....న్యూస్ ఛానెల్ పెడితే చాలు రోజుకొక ఉద్యమం కనిపిస్తూ ఉంటుంది. ఒక రోజు ఒక ఫంక్షన్ చేయాలంటే తడిసి మోపెడు అవుతుంది మనకి.కానీ రోజుకొక నిరసన సభ,వాళ్ళకి భోజనాలు,ట్రాన్స్పోర్ట్ వీటన్నిటికి డబ్బు ఎక్కడిది.ఎవరైనా ఆలోచించారా??కొన్ని వేల కోట్ల విదేశీ నిధులు, విదేశీ సంస్థలు,వ్యక్తుల నుండి ప్రవహించే నిధుల ప్రవాహం.వాళ్ళకి మన దేశంపై ఏంటి అంత ప్రేమ..సేవ కావాలంటే వాళ్ళ దేశంలో చేసుకోవచ్చుగా. ఇక్కడ చేసే ప్రతి నిరసన వెనుక ఎవరివో ప్రయోజనాలు దాగి ఉంటాయి. ప్రతి పండుగకు ఏదో ఒక నెగెటివ్ ప్రచారం చూసే ఉంటాం.ఇక్కడ వ్యవస్థను దెబ్బ తీస్తే అక్కడ డాలర్లు కురుస్తాయి వాళ్లకి. కులమతాల మధ్య చిచ్చులు, ఉత్తర భారతం,దక్షిణ భారతం మధ్య వైషమ్యాలు... ఒక్కటేంటి విద్వేష పూరితమైన ప్రతి ఆందోళన వెనుక భారీ కుట్రలు ఉంటాయి.ధన ప్రవాహం ఉంటుంది.సూత్రధారులు ఎక్కడో ఉంటారు.జనంలో ఉంటూ జనం కోసం ఉన్నామని చెప్పుకుంటూ వీటిని నడిపేది కొన్ని NGO లు. ఈ గ్లోబల్ గ్రీన్ కూడా అటువంటి ఒక సంస్థే ...ఏం వరూ !! మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే కాలుష్యం అని నీటి వృధా అని ఏవేవో కబుర్లు చెప్తూ పండగలపై పడే మీ NGO office లో విద్యుత్తును,నీటిని ఆదా చేసే విచక్షణ ఉందా ఎవరికైనా,లేదా ప్లాస్టిక్ వాడకుండా నిషేధం ఏదైనా??లేక జంతువుల కోసం ఏదైనా చేస్తున్నారా? మీ జీవితాల్లో మీరు అలాంటివేమైనా పాటిస్తున్నారా ఖచ్చితంగా?

లేదు అన్నట్టు తల దించుకొని అడ్డంగా ఊపింది. వరూ

మరీ ఎన్నడూ పాటించని సూత్రాలు పండగ నాడు రోడ్దేక్కి అరిస్తే వస్తుందా మార్పు? మీ మీడియాలో కూడా కొందరికి ఇందులో ఖచ్చితంగా భాగం ఉంది.

ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ...ఈ NGO లు అక్కడితో ఆగలేదు ...షాలిని పనిచేసే ఆ విభాగం ఒక కర్మాగారానికి వ్యతిరేకంగా పని చేస్తుంది.అది భారత ప్రభుత్వం నిర్మిస్తున్న ఆయుధ కర్మాగారం. మనకి తెలిసిన విషయమే.. భారత్ లో ఇప్పటివరకు ఆయుధాల తయారీ అంతంత మాత్రమే.మనమే ప్రపంచంలో అతి పెద్ద దిగుమతిదారులం. విదేశాలతో కొన్ని లక్షల కోట్ల వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి ఈ దిగుమతులకి.ఇప్పుడు ఈ కర్మాగారం వస్తే ఆ దేశాల వారికి భారీ నష్టం.కాబట్టి వారికి అలవాటైన విద్యనే ప్రదర్శించారు ఇక్కడ కూడా.గ్లోబల్ గ్రీన్ కి భారీ ఎత్తున నిధులు సమకూర్చి జనాల్ని రెచ్చగొట్టేలా చేసారు.ఆ ప్రదేశంలో కాలుష్యం పెరిగిపోతుందని,అక్కడి ప్రజలు నిర్వాసితులు అవుతారని రకరకాల కారణాలతో నిత్యం అగ్గి రాజేస్తూనే ఉన్నారు. ఐదు సంవత్సరాల క్రితమే రావాల్సిన కర్మాగారం ఇప్పటికి పునాది కూడా పడలేదు. ఈ విదేశీ ఫండ్స్ వివరాలపై షాలిని కి వచ్చిన అనుమానం ఆమె ప్రాణం తీసింది. ఆమెకి లాగిన్ ఐ.డి ఎలా దొరికిందో మనకి ఇన్ఫర్మేషన్ లేదు కానీ గ్లోబల్ గ్రీన్ సంస్థకు విరాళాల రూపంలో కోట్ల రూపాయలు విదేశాల నుండి వస్తుండటం ఆమెకు అసాధారణంగా అనిపించింది.మొత్తం డేటా ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రయత్నించి విఫలం ఐంది. ఎవరికీ అనుమానం రాకుండా ఒకొక్క రోజు కొంచెం కొంచెంగా రహస్యంగా ప్రింట్స్ తీసుకొని స్టడీ చేసింది.అలాంటి కొన్ని పేపర్లే వరూ దగ్గర దొరికాయి.వరూ చెప్పిన ఆధారాలతో విచారించాం.కార్తిక్ గురించి.వాడి తాగుబోతు స్నేహితుల నుండి విషయం రాబట్టడం పెద్ద కష్టం కాలేదు మాకు. నమ్మిన వాడే ఆమెని ముంచేసాడు. ఆమె ప్రాణాన్ని బేరం పెట్టేసాడు. ఆమె డబ్బుని చూసి వల వేసాడు.కానీ ఆమెని ఇంటి నుండి వెల్లగొట్టడంతో ఇక ఉపయోగం లేదనుకొని ఈ రహస్యాలని,ఆమె ప్రాణాన్ని బేరం పెట్టాడు.కానీ అంతర్జాతీయ కుట్రదారులకు వీడొక లెక్కా? షాలిని చనిపోయిన మరుసటి రోజే డబ్బు పట్టుకొని ఇండోనేషియా ఎగిరిపోదాం అనుకున్న కార్తిక్ ఎయిర్ పోర్టు దారిలో ఆక్సిడెంట్ లో చనిపోయాడు.షాలిని ఇంట్లో మరిన్ని ఆధారాలు దొరికాయి.

మా పోలీసుల్లో,ప్రభుత్వంలో దొంగలు ఉన్నట్టే నిజాయితీ పరులు కూడా ఉన్నారు. హర్షాని స్పెషల్ టీం అరెస్ట్ చేసాక ఇక ఎవర్నీ రిస్క్ లో పెట్ట దలుచుకోలేదు.దివాకర్ ఈ కేసుని చేదించేలా ఉన్నాడని అతనికి ప్రమాదం తలపెట్టే చాన్స్ ఉందని అతన్ని ఈ కేసు నుండి బైటకి పంపే ప్రయత్నం చేశా. ప్రాసెస్ వేగం పెంచాం ఉన్న కొద్ది పాటి ఆధారాలను ప్రభుత్వం నమ్మింది. ED దాడులతో పూర్తిగా విషయం బైట పడింది. గ్లోబల్ గ్రీన్ ఆస్తులు సీజ్ చేసాం.కానీ ఈ కుట్రని చేదించడంలో తొలి అడుగు వేసిన షాలిని మాత్రం మన మధ్య లేకపోవడం దురదృష్టం.

స్వేచ్చ పేరుతో హక్కుల పేరుతొ వీళ్ళు సృష్టించే విధ్వంసం కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు ఇది దేశ భద్రత మరియు మనందరి ఆర్ధిక సమస్యగా గుర్తించండి. స్వదేశి పద్దతులు అన్నీ అనాగరికం విదేశీ పద్దతులు ఆధునికం అనుకునే మూర్ఖత్వాన్ని వదలండి.ప్రతి NGO ఇలా ఉంటుందని నా ఉద్దేశం కాదు కానీ మీరు సమర్ధించే సంస్థ అయినా,వ్యక్తి అయినా వారి మూలాలు ఎక్కడ ఉన్నాయి అని గుర్తించండి.

యువతరం స్వేచ్చగా విహరించే విహంగాలు కావాలని కోరుకుంటారు తప్పులేదు.కానీ .....

సప్త సముద్రాలు,ఖండాంతరాలు దాటి ఎగిరి వచ్చే విహంగాలు కూడా గుంపుగానే వస్తాయి ...గుంపు నుండి పక్కకు పోయే విహంగం వేటగాడికో,క్రూర మృగానికో చిక్కడం ఖాయం.”

దీక్ష సభని ముగించింది. వింధ్యా అరెస్ట్ ఐంది. హర్షా విడుదల అయ్యాడు.శివమూర్తి గారి కుటుంబం మళ్ళి కొత్త జీవితం మొదలు పెట్టింది.ఈ సారి వరూ కోసం ఎక్కువ సమయం ఇస్తున్నారు ఇద్దరూ. దివాకర్ ప్రత్యేక అభినందన పత్రంతో పాటు మెడల్ కూడా అందుకున్నాడు.

“చిన్నూ .... మన పనమ్మాయి గోరింటాకు రుబ్బి తెచ్చింది.....పెట్టుకుంటావా ??

“Ewww…..This is 21st century maa….ఇది మెహేంది కోన్స్ కాలం ....అలా పేడలా ఉంటే ఎలా చీ ..”

“కోన్స్ లో chemical preservatives ఉంటాయి చిన్నూ.....ఇది మంచిది ....సైంటిఫిక్ గా ప్రూవ్ కూడా ఐంది”

“పో మా ఎప్పుడూ ఏదో సోది. కావాలంటే నువ్ పెట్టుకో ..బై”

“కూతురుని చూస్తూ ఆలోచనలో పడింది దీక్ష”......................

సుధీర్.కస్పా

౮౯౮౫౦౨౧౦౫౫

పాఠకులకు మరియు నా రచనలను ఆదరించి అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరునా వికారి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కథలో ప్రస్తావించిన ప్రతి అంశం నిజంగా బైట జరిగిన,జరుగుతున్న విషయాలే. సాధారణంగా నా కథలలో చాలా వరకు నేను చూసిన/ చదివిన వాస్తవ సంఘటనలనే ప్రస్తావిస్తూ కథగా అల్లుకుంటూ ఉంటాను.కొన్ని దారుణమైన విషయాలు మన మీడియాలో మెరుపు తీగల్లా ఇలా వచ్చి అలా మాయం ఐపోతుంటాయి.కానీ మన పండుగ రోజున న్యూస్ చానెళ్ళు పెడితే పండుగను అవమానిస్తూ వాదోపవాదాలు చేసే మహానుభావులే రోజంతా కనిపిస్తారు. మన చుట్టూ జరుగుతున్న విషయాలను వాస్తవిక దృక్పదంతో అవలోకనం చేస్కుంటే ఈ వాణిజ్య యుద్ధం, మన జీవితాలపై వాటి ప్రభావం మనకి సులువుగానే అర్ధం అవుతాయి .కథ పరిథి మేరకు చాలా విషయాలను ఇందులో చర్చించలేకపోవడం నాకు కొంచెం అసంత్రుప్తిగానే ఉంది.ఎందుకంటే ఈ కథ పుట్టిందే ఆ చర్చ కొరకు.అందుకే మరికొన్ని విషయాలతో “విహంగం కథావస్తువు” పేరుతొ త్వరలోనే ఒక చిన్ని వ్యాసం విడుదల అవ్వబోతోంది.చదివి ఎక్కువ మంది ప్రజలకు చేరవేస్తారనే నమ్మకంతో మీ సుధీర్.కస్పాRate this content
Log in

More telugu story from Sudheer Kaspa

Similar telugu story from Crime