Sudheer Kaspa

Inspirational Drama

4.0  

Sudheer Kaspa

Inspirational Drama

అయ్యప్ప టీ స్టాల్

అయ్యప్ప టీ స్టాల్

17 mins
915


పిర్ర్.ర్ర్.ర్.ర్.ర్....

‘రండి బాబూ....సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మీల్స్,చపాతీ పరోటా,బిర్యానీ,వెజ్ నాన్ వెజ్ కర్రిస్. ఆల్ వెరైటిస్....’

హైవే పక్కన ఒక స్టూలు వేస్కొని,చేతిలో ఒక రెడ్ లైటు పట్టుకొని అరుస్తున్నాడు అప్పయ్య.

మెడలో వేలాడుతున్న ఒక తాడు, దాని చివర ఒక విజిలూ.........

పిర్.... పిర్ ... అని విజిలు ఊదుతూ వచ్చి పోయే వాహనాలకు అక్కడున్న హోటల్ కు పిలుచుకుపోయే ఉద్యోగం అతడిది.వాహనాలను పార్కింగ్ చేసే స్థలం చూపించడం కూడా అతడి పనే.

పండు జుట్టు.బక్కపలచని శరీరం.బోసి నోరు. వదులుగా ఉన్న మాసిన చొక్కా....పాదాల పైకి మడత పెట్టిన ఒక జీను ప్యాంటు, కన్నాలు పడిన టోపీ ....ఇదీ గత కొన్ని సంవత్సరాలుగా అతడి వాలకం.ఎవరో వాడేసి ఇచ్చిన బట్టలు అని స్పష్టంగా తెలుస్తుంది.

“అయ్యా ...హి.హి... మీ సంతోషం ...... “ అంటూ భోజనాలు చేసి వస్తున్న వాళ్ళ దగ్గర, ఒక నకిలీ నవ్వుని మొఖాన వేస్కొని తలకాయ ఊపుతూ, కనీ కనిపించకుండా చెయ్యి చాపుతున్నాడు అప్పయ్య.

అర్ధమైన వాళ్ళు చేతిలో అంతో ఇంతో చిల్లర పెట్టి వెళ్తున్నారు.అర్ధం కాని వారూ.....కానట్టు నటించిన వారూ, ఎగా దిగా చూసి వారి వారి వాహనాలు ఎక్కి వెళ్ళిపోతున్నారు.రాత్రి పదకొండు ...ఆరోజుకి డ్యూటీ ముగించుకొని ..హీరో సైకిల్ పై నట్టుతూ నట్టుతూ ...ఇల్లు చేరాడు,డెబ్బై ఏళ్ల నవ యువకుడు అప్పయ్య.

చిన్ని రేకుల షెడ్డు ...దానిలో ,చుట్టూ రెక్కల పురుగులతో ఒక బల్బు.....

“ఏం కూర వండేవే??” చలికి వణుకుతూ అప్పయ్య..

“ఏదో వండేన్లే...దొండకాయ....ముందు ఈ వేడి నీళ్ళు తాగు చలి పట్టిపోనావ్......వడ్డిస్తా కూకో......ఖేళ్ళు...ఖేళ్ళు....మని దగ్గుతూ రంగమ్మ...

“ఏంటే...ఇదీ ..దొండకాయ ఇలా కోస్తారటే ఎవరైనా? సక్కగా చక్రాల్లా కొయ్యకుండా బద్దల్లా కోసేవేటే.....?” కూర తపేలా మూత తీసి చూస్తూ అప్పయ్య.

“బాగుంది సంబడం ...వంకలకేం తక్కువ లేదు....నాకే ఓపిక లేదాయే!! ....ఓ పెద్ద ఒటేలు లో పని సేత్తన్నావు అన్న మాటే గానీ ఏనాడు ఒక కూర పొట్లం తెచ్చినావు కాదు.మిగిలిపోయిన కూరలు పొట్లం కట్టి అట్టుకురావచ్చుగా ..వండలేక సత్తన్నా....”

“చస్..ఊర్కోయే.... ఒటేలోళ్ళు మిగిలిపేన కూరలు అవీ ఫ్రిజ్జి లోన ఎట్టి మర్నాడు అమ్మేత్తారే! మనకి ఇత్తారేటి ?సర్లే గానీ దగ్గుతూనే ఉన్నావ్ మందులేస్కున్నావా ..ఆ సంచిలో టానిక్కు ఉంది... రాసేడుగా డాక్టరు! అది తాగు”

“డబ్బులెక్కడియి? నెలాఖర్లో ఎందుకు ఈ కర్చులు?’

“నీకెందుకే......మొగోల్లకి బోల్డు యవ్వరాలుంటాయ్...పై రాబడులుంటాయ్...అయన్నీ అడక్కూడదు .....” హోటల్ దగ్గర చాపిన చేతిని చూస్కుంటూ ..గుటకలేస్తూ..అప్పయ్య.“పెద్ద కలక్టేరువి మరీ!! పై రాబడట ...!!”దెప్పి పొడుస్తూ .....

హటాత్తుగా ఆగి ....”ఏమయ్యా చెయ్యి సాపుతున్నావా ....??” అంది జీరబోయిన గొంతుతో ...మొఖం దించుకున్నాడు అప్పయ్య....”తప్పలేదే ...మందులకి కావాలిగా ....??”

“ఎట్టా బతికినోడివి ఎట్టా ఐపోనావు ....వ్యవసాయంలో పైసలు లేకపోయినా గౌరవం గా బతికేటోల్లం...దాని పెళ్ళికి, వాడి చదువుకి ఉన్న నాలుగెకరాలూ అమ్మేసావ్.వద్దని నేను సెప్తూనే ఉన్నా కూడా.... .కడ దాకా ఒక ముద్ద ఎట్టక పోతారా అనుకున్నావ్....సూడు ఎట్టాంటి పరిస్థితి దాపురించిందో.....చీర కొంగుతో కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ రంగమ్మ.“ఆళ్ళు పెట్టిదేటే .....ఎవడిక్కడ? తండేల.అప్పయ్య!! ఏం?? నేను పోషించుకోలేనా నా పెళ్ళాన్ని ....??పల్లకొని తిని పడుకోవే....గయ్యిమన్నాడు అప్పయ్య...

“అయ్యా ....నాకు మందులూ వద్దూ ఏమి వద్దు .....చెయ్యి సాపకయ్యా....నాకు తలచుకుంటేనే కట్టం గా ఉంది ...” ఎంగిలి పళ్ళేలు తీసి చాప పరుస్తూ రంగమ్మ.

అప్పయ్య ఏం పలకలేదు.... పడుకున్నట్టు నటిస్తూ కళ్ళు మూస్కున్నాడు.

***

సిటీ దాటగానే హైవే పై ఉన్న మంచి హోటల్ అదొక్కటే....దగ్గరలో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉండటం వల్ల నిత్యం రద్దీ గానే ఉంటుంది.

హైదరాబాదు నుండి బెంగళురు వెళ్ళే బస్సు....

జనాలు భోజనాలకి దిగుతున్నారు.

ఓ కుర్రాడు కుడా దిగేడు.తిత్తిరి బిత్తరి గా అటూ ఇటూ చూస్తున్నాడు.

తన జుట్టుని చేత్తోనే దువ్వుతూ....”ఎక్కడకి పోయింది ....ఇంతలోనే ....??ఓయ్ తాతా! ఎల్లో డ్రెస్ వేస్కున్న అమ్మాయిని చూసావా??పసుపు... పసుపు రంగు డ్రెస్సు తాతా!!!”

ఆ మూల ఉన్న టేబుల్ వైపు చూపించాడు అప్పయ్య....

‘థాంక్స్ తాత....’....ఏదో ప్రైజు గెలిచినంత ఆనందం అతడి మొఖంలో ....

ఫ్రేమ్ లెస్ కళ్ళద్దాలు పెట్టుకొని,ఏదో మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు ఆడిస్తూ...మెనూ కార్డ్ కింద నుండి పై వరకూ చూపుడు వేలుతో తడుముతూ ......ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి......

“మే ఐ సిట్ హియర్ “ అమాయకత్వం నటిస్తూ ఆ కుర్రోడు అడిగాడు ఎల్లో డ్రెస్ పిల్లని,ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ.....

“ఊ....”అన్నట్టు తలూపింది.

“థాంక్స్....ఐ యాం....ప్రతీక్ ....” అడగకుండానే పేరు చెప్తుంది అనే ఎక్స్పెక్టేషన్ తో ఉత్సాహంగా షేక్ హాండ్స్ కోసం చెయ్యి చాపేడు.

“ఓహో” అన్నట్టు తలూపి మెనూ కార్డ్ చూస్తుంది.చెయ్యివ్వలేదు.

“నేను ఇక్కడే ఐ.బి.ఎం లో చేస్తున్నా ....మీరూ ??”అన్నాడు.దీనికైనా రెస్పాండ్ అవుతుందేమో అని ఆశ తో.

“హ్మ్మ్..అని ఓ నవ్వు నవ్వి...మెనూ కార్డ్ లో మునిగిపోయింది.

“ఛి ..ఏంటి ఈ పిల్ల మరీ ఓ.ఏ చేస్తుంది ....ఇప్పుడు దీనికి మెనూ కార్డు పై ఎగ్జాం ఏమైనా పెడతారా తెగ చదివేస్తుంది?”మనసులోనే రుసరుస లాడేడు ప్రతీక్.

వెయిటర్ వచ్చాడు ...

“ చికెన్ బిర్యాని అండ్ థమ్స్ అప్ “ ఆర్డరు ఇచ్చాడు ప్రతీక్ఒకే సార్ టు చికెన్ బిర్యాని అండ్ టు థమ్సప్ ..అని చెప్పి రాస్కున్నాడు ..వెయిటరు“హలో బాసూ ....మేడం మన ఫ్యామిలీ కాదు ...ఆమె వేరు మనం వేరు ....ఆవిడ ఆర్డరు వేరే తీస్కోండి....”“సారి మేడం... ఆర్డర్ ప్లీజ్ ...” ఆమె వైపు తిరిగి అడిగాడు వెయిటరు.మెనూ కార్డ్ వైపు చూపించింది ...వన్ అన్నట్టు చూపుడు వేలుతో సైగ చేసింది.

ఒకే మేడం వన్ కర్డ్ రైస్....అని రాస్కోని వెళ్ళబోయాడు...

“ఓసినీ !! ...ఈ కర్డ్ రైస్ కోసం ఇంత సేపు చదివావా మెనూ కార్డు??”మనసులోనే తిట్టుకుంటున్నాడు ప్రతీక్ ...అతడ్ని ఆమె కనీసం లెక్క చేయకపోవడంతో కాలుతుంది ఎక్కడో...

వెయిటరు వెనక్కి తిరిగి ...”సార్ మినరల్ వాటర్ సార్??”

“ఏం బాబూ ....మీ హోటల్ లో గ్లాసులు కడగరా?ఇంత పెద్ద హోటల్! ఆర్.ఓ వాటర్ ఉండే ఉంటుందిగా? గ్లాసులో పోసి తీస్కుని రా”

ఓకే సార్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు వెయిటరు.

“హమ్మా...నీళ్ళకి కూడా బిల్లు వేసేద్దామనే..మళ్ళి కిన్లే గిన్లె లాంటివి పెట్టడం మానేశారు ...అన్ని డెబ్బై ఎనభై రూపాయల బాటిల్సే... సాఫ్ట్ వేర్ కంపెనీల పక్కనున్న హోటల్ అంటే చాలు.రసం పిండేస్తారు. అక్కడికి మేమేదో అంబానీకి బ్రదర్స్ లాగా.. హమ్మా...ప్రతీక్ గాడ్ని ఎవడూ మోసం చెయ్యలేడు.... ” బైటకే అనేసాడు ఈ సారి...

పెదవులు బిగించి,తల కిందకి దించింది ఆ అమ్మాయి.... నవ్వు ఆపుకుంటున్నట్టుంది ....

తినడం పూర్తయిపోయింది ఇద్దరిదీ ....మాటలు మాత్రం లేవు ....

“ఏమండి!! నోటిని కేవలం తినడానికే ఉపయోగిస్తారా మీరు ?పావుగంట నుండి ముందే కూర్చున్నా ఒక్క మాటాడితే అరిగి పోతారా??”ఆగలేక అడిగేసాడు.

పెదవుల వైపు చూపుడు వేలు చూపిస్తూ..... లేదు అన్నట్టు చెయ్యి ఊపింది.

అలా చూస్తూ ఉండిపోయాడు.ఈమె మూగదా?? ఇంత అందమైన అమ్మాయికి ఏంటి పాపం ఈ లోపం ...అతడి హృదయం ద్రవించింది.ఒక్క సారిగా మూడ్ మొత్తం మారిపోయింది.

ఐ యాం సారీ...అన్నట్టు చేతులతో తన చెవులు పట్టుకొని సైగ చేసాడు

నాకు మాట్లాడటం మాత్రమే రాదు.బాగానే వినిపిస్తుంది అని సైగలతోనే బదులిచ్చింది.

పిప్పీప్.....పిప్పీప్.....బస్సు వాడు హారన్ కొట్టేడు ...

బస్సు బయల్దేరుతున్నట్టుంది పదండి అని బిల్ పే చేసి కదిలారు ఇద్దరూ....

అతనికి కాస్త వెనుకగా నడుస్తుంది ఆమె ...

తనపై కలిగిన జాలి ఎఫెక్టేమో ....అక్కడ కూర్చున్న అప్పయ్య బక్క చిక్కిన దేహం,నోటిలోపలికి కూరుకుపోయినట్టున్న బుగ్గలు చూసి చలించిపోయాడు ప్రతీక్ .అప్పయ్య చెయ్యి చాపకుండానే ఒక వంద నోటు తీసి ఇచ్చేసాడు ప్రతీక్. అప్పయ్య ఆశ్చర్యంగా చూస్తున్నాడు.ఇప్పటి వరకు అలా ఒకడు వంద నోటు ఇవ్వడం అదే మొదటి సారి.

బస్సు దగ్గరకెళ్ళి క్లీనర్ కుర్రాడిని “సీట్ నెంబర్ 6 అమ్మాయి పేరేంటి చూసి చెప్తావా?”అని అడిగాడు డల్ గా మొఖం పెట్టి.

‘ఏంటి సార్....ఆ...ఆ.....ఆ........”కొంటెగా కన్నుగీటుతూ ఆ కుర్రోడు.

“అదేం లేదురా బాబూ చెప్పు” నా బాధలో నేనుంటే వీడి గోల ఒకటి అన్నట్టు చిరు చిరాకుతో ప్రతీక్.

“సీట్ నెంబర్ ర్.....ఆరు......హనీ ...హనీష సార్...”లిస్టు చూసి చెప్పి ....సార్....అని బుర్ర గోక్కుంటున్నాడు క్లీనరు కుర్రాడు నవ్వుతూ ....

“డబ్బులు లేకుండా ఏ పని జరగదు కదరా లోకంలో” మనసులోనే అనుకొని ఓ ఇరవై రూపాయలు తీసిచ్చాడు ప్రతీక్.

కుర్రోడు ఇరవై నోటుని అటూ ఇటూ తిప్పి, ప్రతీక్ ని ఎగా దిగా చూసి ఏంటి సా.....ర్ అని సాగదీసాడు.

“సరే నాకు 6 పక్కన సీటు ఇప్పించు వంద ఇస్తా...”

ఓ దానిదేముంది సార్?? ఆ అమ్మాయి ఒప్పుకుంటే ..... నవ్వేసి దిగిపోయాడు క్లీనర్ ....బెంగ్లోర్ బస్సు అండి రావాలి రావాలి .....భోజనాలకు దిగిన వాళ్ళందరిని కేకేస్తూ ......“హనీ.....షా .....ఎంత బాగుంది పేరు ....అమ్మాయి కూడా చక్కగా ఉంది,చూస్తుంటే బాగానే చదువుకున్నట్టు తెలుస్తుంది.కానీ పాపం ఏంటో ...ఇలా .. ప్రతి ఒక్కడికి ఎక్కడో ఒక దగ్గర లోపం పెట్టేస్తాడు దేవుడు శాడిస్ట్....తన సీట్ లో అలా చారబడుతూ.....సీటు మారుదామా? ఆ అమ్మాయిని అడిగితే?తప్పుగా అనుకోదు కదా?అయినా ఏం మాట్లాడతాం తను ఏమీ బదులివ్వదుగా !!! ఏంటి తనింకా బస్సు ఎక్కలేదు?”బస్సు తలుపు వైపే చూస్తూ ప్రతీక్.

హనీషా బస్సు వైపు చూసింది ... ప్రతీక్ బస్సు ఎక్కేసాడని కన్ఫర్మ్ చేస్కున్నాకా....

హోటల్ లోనే షాపుకి వెళ్లి

“మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వండి” అడిగింది హనీషా ఇరవై నోటు తీసి ....

“హిమాలయ కంపెనీవే ఉన్నాయండి అర లీటరు బాటిల్ అరవై రూపాయలు “

“దట్స్ ఓకే ఇవ్వండి”వంద తీసి ఇచ్చింది...బాటిల్ పట్టుకొని గబా గబా బస్సు ఎక్కేసింది.అప్పయ్య ఆశ్చర్యంగా చూస్తున్నాడు.....ఆ మూలనున్న టేబుల్ నుంచి అన్ని మాటలూ స్పష్టంగా వినిపిస్తాయి అతడు కూర్చునే స్థలంకి. మూగది అని అబద్దం చెప్పాల్సిన అవసరం ఏంటి ఈమెకి?మనకెందుకులే !!

పిర్ర్ ర్ ర్ .....నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ మీల్స్ .........................*****

“ఏం కూర వండేవే ??”

“ఆ వండుతారు కోడి కూర ...నేనెక్కడి నుంచో అట్టుకోచ్చినట్టు...నువ్వేటి తెస్తే అదే వండుతానుగా ..కొత్తగా ఏటి వండేవే అంటావేమయ్యా ..కేజీ రెండు రూపాయలే అని ఐదు కేజీల టమాటాలు తెచ్చి పడేసావుగా.. ఇంకో వారం వరకు అదే” కోడికూర తిని ఎన్ని నెలలైందో.....” నిట్టూరుస్తూ రంగమ్మ.

“ఏదో అడిగేనులేవే ....వడ్డించు ఆకలౌతుంది.......”

పళ్ళేలు కడుక్కు రావడానికి రంగమ్మ బైటకెళ్ళింది.

గబగబా ... ఆ ఒక్క గదిలోనే ఓ మూలకి పేర్చిన బట్టల సంచుల దగ్గరకి వెళ్ళాడు అప్పయ్య.ఏదో డబ్బి తీసి మెల్లగా గోడ సందులో దాచేడు.మళ్ళి బట్టల సంచులు అలాగే పేర్చేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు.

“ఒసేయ్ అసలు రోటి పచ్చడి ఎలా చెయ్యాలో నీకు నేర్పించాలి ఒక రోజు ....అలా రోట్లో రుబ్బుతుంటే ఆ వాసనకి పక్కింటోడి నోరూరిపోవాలి .” గిన్నెలో ఉన్న పచ్చడిని నాకుతూ అప్పయ్య .

“ ముసలోడికి రుచులెక్కువ అన్నట్టుంది యవ్వారం ...ఏదో ఒకటి తిని పడుకోకుండా ...పాపం ముసలిది ఏదో కట్టపడి సేస్తంది అని జాలి కూడా లేదు ..ఏదో ఒక వంక ఎట్టకపోతే నిదరట్టదు ముసిలోడికి ....హూ అని మూతి తిప్పుకుంది రంగమ్మ.”

తిని పడుకొనే సరికి రాత్రి పన్నెండున్నర. లేవటం ఉదయం పదిన్నర తరువాతే ....అందులోనూ ఒక సూత్రం ఉంది,పదిన్నరకి లేచి ఓ పన్నెండుకి తింటే ఒక పూట భోజనం ఖర్చు మిగులుతుందని....... ఇక ఉదయం తిండి ఖర్చు ఉండదు. పేదరికం చాలా తెలివితేటల్ని ఇస్తుంది మరీ.

పదకొండు గంటలకి అప్పయ్య బయల్దేరాడు..

కిర్రు కిర్రు మంటూ సైకిలు మీద .....

వణుకుతూ చికెను కొట్టు ముందు ఆగాడు .........

“బాబూ ఒక ఇరవై రూపాయలకి మాంసం కట్టు అయ్యా...” ఇరవై రూపాయల నోటు పట్టుకున్న ఆ ముడతలు పడిన చెయ్యి వణుకుతూ ఉంది.

“ఇరవై రూపాయలకేం వస్తుంది తాతా?? పావు కేజీ నలభై ..కనీసం పావు కేజీ ఐన లేకపోతె ఎలా “జాలిగా మొఖం పెట్టి ఆ కొట్టు వాడు

“అయ్యా ...మా ఆడది తినాలని ఆశపడింది...అసలు ఎప్పుడు ఏది అడిగి ఎరగదు...కాస్త చూడయ్యా....ఇరవై రూపాయలకి ఎంతొస్తే అంత ఇవ్వు అయ్యా...”

అప్పయ్య కళ్ళలో భార్య పై మమకారం చూసి కొట్టు వాడు ముచ్చటగా నవ్వుకున్నాడు పావుకేజి కట్టేశాడు ....

“ఓ పిల్లా చూసేవా ఏటి తెచ్చేనో ....ఈరోజు రాత్రికి కోడికూర .....తండేల అప్పయ్యా మజాకా ...” కాలరు ఎగరేసి గొప్పలు పోతున్నాడు పెళ్ళాం దగ్గర.

చేతిలో ఆ పొట్లంతో అతడి గెంతులు చూసి మురిసిపోతూ నవ్వుకుంది రంగమ్మ ...

కొసరి కొసరి తినిపిస్తూ ...పాత రోజులు నెమరేసుకుంటూ ఆ రోజు గడిపేసారు వృద్ధ కపోతాలు.

****రోజులు దొర్లిపోతూనే ఉన్నాయ్ ....నెల రోజుల తర్వాత

అదే హోటల్ ముందు ఓ కార్ ఆగింది ......

అప్పయ్య చూస్తూ ఉన్నాడు ....

చేతిలో చెయ్యేసుకొని ఓ జంట...హా వాళ్ళే వంద ఇచ్చిన పిల్లోడు, మూగ పిల్ల ..... వీళ్ళు ఏంటి కలిసొస్తున్నారు?

నేరుగా మళ్ళి అదే టేబుల్ దగ్గర కూర్చున్నారు...మాటలు వినిపిస్తున్నాయి అప్పయ్యకి.

“హేయ్...మన ఫస్ట్ మీటింగ్ ప్లేస్ ఇదే కదా!! “కళ్ళలో ఓ మెరుపుతో హనీషా..

“హా నువ్వు నన్ను బకరా చేసిన ప్లేస్ ఇదే”

“మా టెస్టింగ్లు మాకుంటాయి బాబూ...మనం బస్సు లో కలిసిన ముందు రోజే నీ ఫోటో చూపించింది మమ్మీ, నాకు నచ్చితే మీ వాళ్ళని అప్రోచ్ అవుతామని ...అందులోకి మీ వాళ్ళు మా డాడ్ కి బాగా తెలుసు. అన్నీ సెట్ ఐతే నువ్ నన్ను చేస్కోబోయేవాడివి అని నాకు అప్పుడే తెలుసుగా....నువ్ బిత్తిరి సత్తిలా నన్ను చూసినప్పుడే అనుకున్నా నా ఫోటో నువ్వింకా చూడలేదని ”

“ఐతే మాత్రం అలా ఆడుకోవాలా?”

“లేకపోతె వచ్చి ఎవరో అమ్మాయిని సైట్ కొడుతున్నోడ్ని ఎలా నమ్మను?”నవ్వుతూ హనీ

“ఎవరో ఏంటే ??నిన్నేగా??”

“అప్పుడు నేను నేను కాదుగా ...ఇలా ఎంత మందిని గోకేవో?” చిలిపిగా కన్ను గీటింది.

“హనీ పాపా నువ్వే ఫస్టు ..లాస్టు ...”

“హా...నమ్మేసాన్లే....అయినా ఒక మూగ అమ్మాయితో కూడా మాట్లాడతావో లేక మనకెందుకురా బాబు అని తప్పుకు పారిపోతావో చూద్దామనిపించింది ” మూతి తిప్పుతూ హనీ .

“అంటే బస్లో నేను మాట్లాడి ఉండకపోతే ఇక అంతేనా ...?”కళ్ళు ఇంతలేసి చేసి అడిగాడు.

‘హా ...అంతే.....నో చెప్పేసే దాన్ని ”పకపకా నవ్వింది హనీ ...

“హనీ ! యూ ఆర్ సో బ్యూటిఫుల్ కళ్ళలోకి చూస్తూ “ప్రతీక్

నవ్వుతో విచ్చుకున్న ఆమె పెదవులు కాస్తా ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకున్నాయి ...ముసి ముసిగా నవ్వుతూ చూపు కలిపింది.

ప్రతీక్, టేబుల్ పై తన చేతి వేళ్ళను మెల్లగా ముందుకు పోనిస్తూ ఆమె మునివేళ్లను తాకాడు.

సిగ్గుతో పెదవులు ఆడిస్తూ అతని వేళ్ళను తన వేళ్ళతో అందుకుంది.

“చుట్టూ అందరూ ఉన్నారు గానీ.... లేకపోతేనా!!” ఆమె కళ్ళలోకే మత్తుగా చూస్తూ ప్రతీక్.

“ఉంటే ఏంటి” కనుబొమ్మలు ఎగరేసి ఓ చిలిపి నవ్వు విసిరింది.

“హా.....అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ ...ఆశ్చర్యంగా చూసాడు ప్రతీక్

అతని చేతిని తన చేతిలోనికి తీస్కోని ,సుతిమెత్తని తన పెదవులతో ముద్దాడింది.

సడెన్ గా ఆమె చేసిన పనికి చిన్న షాక్ కి గురైనా త్వరగానే తేరుకొని తన ముని వేళ్ళతో ఆమె పెదవులను తాకేడు...

సిగ్గుతో ముడుచుకుంది హనీ ...ఆమె పెదవులు వణుకుతున్నాయి....

సా....ర్ ఆర్డర్ ప్లీజ్ ....బొంగురు గొంతేసుకొని వెయిటర్....

గతుక్కుమన్నారు ఇద్దరూ.....ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టైంది.

“ఏదోకటి ...అదే ఐస్ క్రీం ... ఐస్ క్రీం ..వెనిలా....రెండు ...”తత్తరపడుతూ ప్రతీక్.

చీ ....వాడు చూసేసాడా.....ఇద్దరూ సిగ్గుతో చచ్చిపోయేలా మొహాలు మూస్కున్నారు...

“అన్ని సవ్యంగా జరిగితే వచ్చే నెల ఈరోజుకల్లా మనం వైఫ్ అండ్ హస్బెండ్ గా వస్తాం.”విచ్చుకున్న పెదవులతో ఎరుపెక్కిన బుగ్గలతో హనీ....

“ఏం? అప్పుడు ముద్దు పెట్టుకోవడానికి లైసెన్స్ ఇస్తాడా ఈ హోటల్ వాడు ....??” కొంటెగా నవ్వేడు ప్రతీక్, ఐస్ క్రీం తింటూ....

పకపకా నవ్వుతూ ....”సరే గానీ ..మనం కూడా కార్డు పై కొత్తగా పేరు వెయ్యిద్దాం. విరాట్ +అనుష్క = విరుష్క ఐనట్టు ప్రతీక్+హనీష =ప్రనీష అని ఓకేనా ? “నవ్వుతూ హనీ ...

“హహః...డబల్ ఓకే”

ఇద్దరూ లేచి కదిలారు ...”ఈ ప్లేస్,ఈ టేబుల్ మనకి లక్కీ అండ్ లవ్లీ ప్లేస్. మంచి మెమొరీస్ ఉన్నాయిక్కడ .హేయ్ దిస్ ఓల్డ్ మాన్ ....ఆరోజు నిన్ను చూపించింది ఇతనే .”అప్పయ్య ని చూసి ఆనందంగా ప్రతీక్ ...“థాంక్స్ తాతా ....” అని అతడ్ని హత్తుకొని ఒక యాభై రూపాయలు తీసిచ్చాడు.కారు తీసి బయల్దేరారు.****

చొక్కా తీసి కొక్కేనికి తగిలించాడు....కాళ్ళు,చేతులు కడుక్కోడానికి బైటకెల్లేడు...

చొక్కా జేబు నుండి యాభై నోటు బయటకి కనిపిస్తుంది.రంగమ్మ కంట పడింది.

నిశ్శబ్దంగా వడ్డించింది ...

అప్పయ్య చతుర్లు,కుళ్ళు జోకులూ ఆమె చేత ఒక్క మాట కూడా మాటాడించలేకపోయాయి.

“ఏటైనాదే ? ఏటి పల్లకున్నావు మాటాడవే “అని అప్పయ్య బుజ్జగించినా ఆమె పలకలేదు.

అడిగి అడిగి విసిగిపోయి అప్పయ్య పడుకున్నాడు.అలసిన శరీరం కదా గుర్ర్....గుర్ర్....అని గురకలు పెడుతున్నాడు.

పక్కనే రంగమ్మ .....ఆమె కళ్ళలో నీరు, చెంపలు దాటి తలగడని తడిపేస్తోంది.

“ఇతగాడి జీతం నెలకి మూడు వేలు.నెల తిరిగితే గానీ జీతం రాదు ..జీతాలు వచ్చే రోజులు కూడా కాదు ...ఈ యాభై రూపాయలు ఎలా వచ్చాయిపుడు..అంటే .....నా రోగిష్టి బతుకు కోసం నా పెనిమిటి చెయ్యి చాపి బతకాల్సి వస్తుంది.ఎంత సెప్పినా ఇనట్లేదు.ఘనమైన మారాజులా బతికినోడు ...ఇలా చూడటం కంటే నేను చావడం మేలు...దీనికి రేపే పరిస్కారం సూపిత్తాను......కన్నీళ్ళు తుడుచుకుంది.అప్పయ్య లేచాడు ...

పక్కన రంగమ్మ లేదు ....

గదిలో చూసాడు .....కనిపించలేదు.....

“ఉదయానికే ఎటేల్లిందిదీ?”

రంగి....రంగి.....

ఓ రంగమ్మా......!!

బైటకెళ్ళి చూసాడు ......

ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాడు ....

కళ్ళు ఇంతలేసి చేసి అలా నిలబడిపోయాడు......

చెట్టు కొమ్మకి వేలాడుతుంది .....అయ్యప్ప టీ స్టాల్ “ అని రాసున్న బోర్డు, ఆ పక్కనే రంగమ్మ ....

తెల్లటి అట్ట పై బొగ్గు ముక్కతో రాసిన అక్షరాలు.......

“ఒసేయ్ ఏటే ఇదీ??” ఆశ్చర్యం నుండి తేరుకొని అడిగాడు అప్పయ్య.

“ఎందుకలా అరుత్తన్నావు??ఈ దగ్గరలో ఎక్కడా టీ కొట్టు లేదు కదేటి?అందరూ మీలాటి పెద్ద ఒటేలులో కొనుక్కోలేరుగా ...నా బోటి జనం కూడా టీ తాగాలి కదా అని ఎట్టెను టీ కొట్టు..... ఏటి తప్పా??”“నీకేందుకే ముసిలిదానివి ఈ వయసులో ఇవన్నీ” ఆందోళన గా అప్పయ్య.“ఏదో నీ మీద బయం బక్తి తో నీ పేరేట్టుకొని యాపారం మొదలెడితే తిడతావేటి” ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది రంగమ్మ ...యాభై ఏళ్ళ సర్వీసు మరీ.


“సర్లే...... అయ్యప్ప టీ స్టాల్ అని ఎట్టి నా పేరు అంటావే??”

“మరీ!! అప్పయ్య టీ కొట్టు అంటే ఎవడైనా ఒత్తాడా?? అందుకే నీ పేరునే తిరగా మరగా చేసి అయ్యప్ప టీ స్టాల్ అని పెట్టా...”

“ఇన్ని తెలివి తేటలు ఎక్కడియే నీకూ??”

“ఏమయ్యోయ్ ...మా ఊర్లో ఆ రోజుల్లో ఆరో తరగతి వరకు సదివిన పిల్లని నేనొక్కదానినే తెల్సా” వంగిపోయిన ఆ నడుమును వయ్యారంగా తిప్పింది రంగమ్మ.

పెళ్ళాం తెలివి తేటలు చూసి మురిసిపోతూ ......బోసి నవ్వులు చిందిస్తూ సైకిలు పై బయల్దేరాడు అప్పయ్య.ప్రతి శుక్రవారం సాయంత్రం, ఆ హోటల్ ప్రనీషాలకి (ప్రతీక్+హనీష) కంపల్సరీ మీటింగ్ ప్లేస్ గా మారిపోయింది.పెళ్లి అయిన తర్వాత అదింకా ఎక్కువైంది.వాళ్ళ ఇద్దరి ఆఫీసులకి వెళ్ళే రోడ్డులు రెండూ ఒక్కటిగా కలిసే జంక్షన్ లో ఉంది ఆ హోటల్.రోడ్డులే కాదు వారి మనసులూ,మనుషులూ కలిసే చోటు కూడా అదే అయ్యింది.

ప్రతీక్ ఆఫీస్ బస్ లో వెళ్తాడు.హనీ సొంత కారులోనే వెళ్తుంది.ఇద్దరికీ ఆ హోటల్ వరకు ఒకటే దారి.అక్కడ నుండి వేర్వేరు రోడ్లుగా చీలుతుంది ఆ రోడ్డు. రోజు ఎవరి మటుకు వారు వెళ్ళిపోయినా శుక్రవారం సాయంత్రం మాత్రం ప్రతీక్ హోటల్ జంక్షన్ లో బస్సు దిగి కారులో వచ్చే హనీ తో పాటు హోటల్లో టైం గడపటం రూల్ గా పెట్టుకున్నారు.వారికి అది అచ్చొచ్చిన,ప్రేమనిచ్చిన స్థలం మరీ.

క్రమంగా వారితో అప్పయ్యకి కూడా అనుబంధం పెరుగుతూ వస్తుంది. వారి కోసం ప్రత్యేకమైన ఆ టేబుల్ ని ప్రతి శుక్రవారం రిజర్వు చేసి ఉంచడం అప్పయ్యకి అలవాటు ఐపోయింది. వారిచ్చే పదో ఇరవయ్యో కోసం కాదు.వారిని చూస్తూ వారి మాటలు చాటుగా వింటూ తన గతాన్ని నెమరేసుకోవడం అప్పయ్యకి బహు ఇష్టంగా మారిపోయింది.తాతా ఇదిగో ఈ చొక్కా తొడుక్కో అని తన పాత చొక్కా ఇచ్చాడు ప్రతీక్.అప్పయ్యకి అది లూజుగా లొడలొడ లాడుతున్నా ....అబ్బురంగా తొడుక్కొని ..అబ్బా భలేగా ఉందయ్యా...వంగపండు రంగు .... అన్నాడు రెండు చేతులతో చొక్కాను తడుముకుంటూ .....

చొక్కా సంచిలో పెట్టి సైకిలు పై ఇంటికెళ్ళిపోయాడు....చలికి వణుకుతూ .....కొత్త చొక్కా మరీ ...రోజూ ఏసేస్తే ఎలా??

“ఏవయ్యోయ్....సుసినావా ఏటి తెచ్చేనో ....?? ఇక చలికి నువ్వు వనకక్కర్లేదు. శాలువా లాంటిది తీసింది బైటకి ”రంగమ్మ ఆనందంగా ......

“ఏటే? నాలుగు రూపాయలు సేతిలో పడగానే దుబారా చేస్తన్నావే??గయ్యిన లేచాడు అప్పయ్య...

నీకోసమే కదా అయ్యా!! చలి పట్టిపోతే జబ్బు పడతావని ...సైకిలు మీద రగ్గులు అమ్మే రాజస్తాను అబ్బి వచ్చేడు. వాడి దగ్గర కొన్నాను.మొదటి సంపాదన ..తిట్టకయ్యా ...

“ఎంత సంపాదించావేటి?”

“నూట యాభై”

హా సరే సరే ......అన్నమెట్టు ....

“నా కంటే యాభై ఎక్కువే!! ఎంతైనా ఇది ఘటికురాలు !!నేనూ ఉన్నాను.... చీర కొని ఎన్ని సంవత్సరాలైందో,,ఆ చింకి చీరలే కడతాంది పాపం.”మనసులోనే పెళ్ళాం ప్రేమకు అబ్బుర పడిపోయాడు . శాలువా కప్పుకొని మురిసి పోతున్నాడు.

“నేను ఏసుకుంటే నీ శాలువాకి అందమొచ్చిందే...”బొక్కి నోరేస్కోని నవ్వుతున్నాడు అప్పయ్య..

“ఆ.... బయల్దేరాడు శోభన బాబూ ......”

“ఆ శోభన బాబే ....ఆ రోజుల్లో నా మరదలు సరోజా నేనంటే పడి సచ్చేది కదేటి!!..”

“ఆ అది ఎపుడో సచ్చి ఆ చింత చెట్టు మీద కూకుంది ...వెళ్లి ఉయ్యాల ఊగు దానితో “ ఉడుక్కుంది రంగమ్మ. బట్టల మూట లు సర్దుతూ..

చిన్న డబ్బి బైట పడింది.తెరిచి చూసింది.డబ్బు ......చాలా డబ్బు......ఓ పదివేలు పైనే ...

“ఏంటయ్యా ఇదీ “ కోపంగా అడిగింది

“అదెందుకు తీసావే? నా ఖర్చుల కోసం దాసుకున్న డబ్బు లోపలెట్టు”

“’నీ’ ఖర్చులా ?”

“ఆ.....చుట్టా బీడి ఖర్చులుండవా ??పడుకోవే అన్నీ సెప్పాలా నీకూ??

ఆమె ఇంకేమి మాట్లాడలేదు మౌనం గా పడుకుంది.ఆమెకి తెలుసు పెళ్ళాం మందుల కోసం తన గౌరవాన్నే తాకట్టు పెట్టిన ఘనమైన తండేల అప్పయ్య, చుట్టా బీడిలకి రహస్యంగా డబ్బు దాచడు.అతడు పోతే ఆమెకి దిక్కుండదని పైసా పైసా కూడబెట్టి దాచేడు.ఆ విషయం చెప్తే ఆమె ముందే కుదేలైపోతుందని ఏవో సాకులు చెప్పేడు.యాభై ఏళ్ళ సర్వీసు మరీ ...మొగుడి మనసు తెలియదా ఆమెకు ??....పైట కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ పడుకుంది రంగమ్మ.గోడ మీద వెంకన్న బాబు కి దండం పెట్టుకుంది “పోతే ఇద్దర్నీ ఒకేసారి తీస్కెల్లిపో తండ్రీ !!”

***ఎందుకో తెలియదు ఈ మధ్య ప్రనిషాల రాకపోక తగ్గింది.వచ్చినా ఏదో ఎడమొహం పెడమొహం గా ఉన్నారు. ఆ టేబుల్ కాక ఏది దొరికితే దానిలో కూర్చొని వెళ్ళిపోతున్నారు. అప్పయ్యని బొత్తిగా పలకరిచడం కూడా మానేశారు.గువ్వపిట్టల్లా ప్రేమించుకోడానికి వచ్చేవారు...ఇప్పుడు పందెంకోళ్లలా ఎగబడుతున్నారు.అప్పయ్యకి వాళ్ళ మాటలు వినబడటం లేదు కానీ పరిస్థితి అర్ధం అవుతోంది.

ఓ రోజు మాత్రం మళ్ళి పాత టేబుల్ కే వచ్చి చేరారు ....

“చూడు హనీ ...ఇక చాలు ..ఈ గొడవలు ఇక ఆపేద్దాం ,ఇంతకు ముందులా హ్యాపీగా ఉందాం ప్లీజ్ “

‘నాకేమైనా సరదానా ??ముందు నీ పిసినారి బుద్ధి వదులుకో అన్ని సెట్ అవుతాయ్”మొహం అటువైపు తిప్పుకుంది హనీ

“నేను పిసినారి ఏంటి..మీలాగా డబ్బు విరజిమ్మటం నాకు నచ్చదు అంతే....నాకు ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలుసు ఎకనమిక్ డిసిప్లిన్ అంటారు దాన్ని.” సంజాయిషీ లా చెప్తున్నాడు ప్రతీక్.“కమాన్ ..ప్రతీక్ ..ఖర్చు చేస్తేనే ఇంకా సంపాదించాలని కోరిక పుడుతుంది నీలా పిసినారిలా బ్రతికితే అక్కడే ఉండిపోతావ్. లెక్కలేస్కోని ఇలా బ్రతకడం నా వల్ల కాదు. “ చిరాగ్గా మొహం పెట్టింది హనీ.“ఆ మాట కొస్తే ఇల్లు నీ పేరున తీస్కొని లోన్ నా శాలరీ నుండి కడుతున్నా ...నీ డబ్బు ఏం చేస్తున్నావ్ ఎపుడైనా అడిగానా లెక్కలు ??” ప్రతీక్ స్వరం పెరుగుతుంది

“ఏం? కారు ఇ.ఎం.ఐ ఎవడు కడుతున్నాడు నీ బాబా ?”“ఏంటే ఎక్కువ వాగుతున్నావ్?నోరు అదుపులో పెట్టుకో..నీ సోకులకే కారు ..నేనెప్పుడూ వాడలేదు దాన్ని”“అవును పిసినారోడివి అందుకే బస్సులో వెళ్తావ్...అయినా ఖర్చులు గురించి మాట్లాడుతున్నావ్?మొన్న మీ అమ్మ నాన్న వచ్చినప్పుడు పదిహేను వేలు ఖర్చు ఐంది నాకు. వాళ్ళని అటూ ఇటూ తిప్పడానికి ....నువ్వేమో సెలవు దొరకలేదని ఆఫీసుకి పోయావ్ ....నిన్ను అడిగానా నా డబ్బులు ఇవ్వమని ?”“అమ్మా నాన్నల కోసం చేసినది కూడా లెక్కేస్తున్నావా? చీ నువ్ మనిషివే కాదే...దెయ్యానివి డబ్బు పిశాచివి”“నోర్ముస్కోని ఉండు ఎక్కువ మాట్లాడకు ...నీ మాటలు అలా ఉంటే నావి కూడా అంతే ...ప్రతి దానికి లెక్కలేస్తావ్ ....ఆరోజే నేను గుర్తించాల్సింది. ఒక్క వాటర్ బాటిల్ కొనడానికే చేతులు రాలేదు నీకూ ...”“హేయ్ జస్ట్ షటప్ .....నేను ఎక్కడ ఖర్చు పెట్టాలో నాకు బాగా తెలుసు .... ఆ తాత కి వంద ఇచ్చా ...నీళ్ళ కోసం హోటల్ వాడికి ఇవ్వడం ఇష్టం లేదు నాకు ....

“అహే ఆపు పెద్ద సోది గాడిలా ఏదేదో చెప్తావ్ ...చిన్న చిన్న వాటికీ ఇలా ఉంటే చాదస్తం అంటారు .”“నోటికి ఏదొస్తే అది వాగటమే..దీనికంటే నిజంగా మూగ పిల్లవే అయ్యుంటే బాగుండేది”“చాల్లే..నోర్ముయ్ ....ఇవన్నీ కాదు ఈ బిహేవియర్ మారకపోతే ఇక మనం కలిసి బతకడం కష్టం”“వాట్ .....ఇంత చిన్న దానికి విడిపోతావా? అనుకున్నానే ఎవడితోనో పోదామని ప్లాన్ చేసుంటావ్?”నోరు జారేసాడు .....హనీ దిగ్గున లేచింది ...ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయ్.ముక్కు పుటాలు ఎగరేస్తుంది. పళ్ళు బిగించి.....టేబుల్ పై ఉన్న గ్లాసు ప్రతీక్ పై విస్సిరి కొట్టింది ....

హోటల్లో జనమంతా వారి వైపే చూస్తున్నారు.

“నీలాంటి కుక్కతో ఇన్నాళ్ళు ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా .....గో టూ హెల్ “

దడ దడా నడుచుకుంటూ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళింది .....బరువైన ఊపిర్లు తీస్తుంది ....

కారు తీసింది సర్రున ....

బి.పీ హై లో ఉన్నట్టుంది....బుర్ర గిర్రున తిరుగుతుంది ఆమెకు ..మసక మసకగా కనిపిస్తుంది .

పార్కింగ్ నుండి బైటకి తీసింది కారు,వాయు వేగంతో

కన్ను మూసి తెరిచే లోగా

...ఎదురుగా ఓ పిల్లాడు ....

హేయ్....ఒక్క ఉదుటున కళ్ళు మూస్కోని ఎడమ వైపుకి స్టీరింగ్ తిప్పింది ....పిర్ర్ర్ర్. అని విజిల్ సౌండ్ మధ్యలోనే ఆగిపోయింది .....

కారు చక్రాల కింద విజిలు ముక్కలైపోయింది ......

స్టూలు అంత దూరం ఎగిరి పడింది.

తండేల అప్పయ్య బక్క శరీరం కారు టైర్ల కింద నలిగి పోయింది....

హెక్...హెక్....హెక్ ......ఊపిరి కోసం కొట్టుకుంటున్న అప్పయ్య .....

పరుగు పరుగున జనం ......

ఏం జరిగిందో కూడా తెలియని షాక్ లో హనీ......****

ఆమె మొఖము ముడతలలో వంపులు తిరిగిన కన్నీటి జాడలు .....

ఆకాశాన్ని చూస్తున్న ఆమె గాజు కళ్ళు ......

వెనకున్న గోడకి వాల్చిన ఆమె తల ...గాలికి ఎగురుతూ నెరిసిన జుట్టు .....

చేతిలో ఒడిసి పట్టుకున్న అప్పయ్య డబ్బుల డబ్బి .....

హాస్పిటల్ బైట బెంచి పై రంగమ్మ .....

“అమ్మా..పోలీసు కేసు అవీ ఎందుకమ్మా ఖర్చులకి మేమిస్తాం సరేనా?”హనీ వాళ్ళ నాన్న తెగ తాపత్రయ పడుతున్నాడు రంగమ్మ దగ్గర,తన కూతురికి ఏం ఇబ్బంది కాకూడదని......

ఆమె పలకలేదు ....నిజానికి అతడి మాట కూడా ఆమెకు వినిపించలేదు.

పరుగు పరుగున వెళ్లి కౌంటర్లో డబ్బు కట్టేశాడు ...”ఇంకా అవసరమైతే ఈ నెంబర్ కి ఫోన్ చెయ్యండి.బిల్లు నేను కట్టేస్తా..” చిన్న సైజు పొగరు ధ్వనిస్తుంది అతని గొంతులో ...

“హనీ !! వెళ్దామా ..ఇంకేం సమస్య ఉండదులే ...భయపడకు ..”.కూతురు చెయ్యి పట్టుకు లేపాడు.

“నాన్నా ..అతని పరిస్థితి ఏంటో చూసీ..........” రంగమ్మ వైపు చూస్తూ హనీ.

“అమ్మా...సినిమాల్లో చూపించినంత మంచిగా ఉండరు ఈ పేదోళ్ళు...ఇంకాసేపట్లో ఓ వంద మంది చేరుతారు ...నానా న్యూసెన్సు ....అలా డబ్బు పిండుతారు ....ఏం పర్లేదులే పద ...ఇపుడే కాదు తర్వాత కూడా ఎప్పుడూ వీళ్ళని కలవకు ......ఆమె చెయ్యి పట్టుకొని వేగంగా నడుస్తున్నాడు.బైట తల పట్టుకుని కూర్చున్న ప్రతీక్ ఒక్కసారిగా వారి వైపు తలెత్తి చూసాడు ...అతని కళ్ళలో కనిపిస్తున్న అసహ్యం హనీ మనసుని పిండేస్తుంది .”ఇక ప్రతీక్ నా మొఖం కూడా చూడడు.....” ఆమె కంటి నుండి కన్నీటి బొట్టు రాలింది.

హనీ తండ్రి కొర కొరా చూస్తున్నాడు ప్రతీక్ వైపు ...మొత్తం నీ వల్లే అన్నట్టు .....

చెయ్యి పట్టుకొని లాక్కెళుతున్న తండ్రిని కాదనలేక వెనక్కి ప్రతీక్ వైపు చూస్తూ ముందుకి నడుస్తూ పోయింది.......*****

“ఇంకా అలానే డల్ గా ఉంటే ఎలా అమ్మా ..సర్రు సర్రున దూసుకెళ్ళే దానివి ..ఏదో ఒక్కసారి చిన్న తప్పుకి ఇంత కుదేలైపోతే ఎలా ....చూడు నీకోసం నేను రోజూ ముప్పై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నా రెండు సార్లు ....నిన్ను ఆఫీసులో డ్రాప్ చెయ్యడానికి.

నెల రోజులైంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా??ఇంక ఆ మూడీ ఫేస్ మార్చురా తల్లీ” కారులో డ్రైవింగ్ చేస్తూ వెనుక సీట్లో ఉన్న హనీతో ఆమె నాన్న.

ఏం జవాబు లేదు.

కిటికీ లోంచి చూసింది.

నెల రోజులుగా చూస్తూనే ఉంది.

ఆ హోటల్ దగ్గరకొచ్చే సరికి ఆమె గుండెను పిండి మెలేసినట్టు అయిపోతుంది.

పిర్ర్ ర్ ర్ అంటూ తాత వేసే ఈల ఇక వినపడదు ..

ఆ బోసి నవ్వు ఇక కనపడదు .....

ఎంత ఆపినా ఆగని కన్నీరు తన మాట వినదు.

“చిన్న విషయం ...

ఆ చిన్న గొడవ ....

నా ప్రేమ పొదరింటిని ధ్వంసం చేసింది.ఆ తాత కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.”

ఆమె కన్నీరు జలజలా పారుతుంది.......పిర్ర్ ...ర్ర్...ర్ర్.....ర్ర్.......దిగ్గున తల తిప్పి చూసింది ....నాన్నా కారు ఆపండి ......కెవ్వున కేక వేసింది ...

అద్దిరిపడి సడెన్ బ్రేకు వేసాడు .

ఆ విజిలు శబ్దానికి ఆమె మొఖం మతాబులా వెలిగి పోయింది.

ధడేలున కారు డోర్ తెరిచి రోడ్డు క్రాస్ చేసుకుంటూ పరిగెత్తింది హోటల్ వైపు ........

ఒక్కసారిగా .........

చూస్తూ నిలబడిపోయింది ......“భోజనాలండి ......వేడి వేడి భోజనం సార్ ......రండి .....”

పిర్ర్.ర్ర్.ర్ర్.........ఆ పిలుపు తాతది కాదు .....

ఆ గొంతూ అతడిది కాదు .........

ఒంటి పై చొక్కా....వంగపండు చొక్కా ..... మాత్రం ప్రతీక్ ఇచ్చినదే .....

చీర పై చొక్కా తొడుక్కొని ....అదే చిరుగులు పడ్డ టోపీ పెట్టుకొని .........

నోట్లో విజిలుతో .....

వంగిన నడుముతో .....

రంగమ్మ ...........కుప్ప కూలిపోయింది హనీ ....

రంగమ్మ ముందు నిలబడే ధైర్యం కూడా చెయ్యలేకపోయింది.

హోటల్ లో పనిచేసే ఓ కుర్రాడు వచ్చి లేపాడు హనీ ని .....

హనీ తండ్రి కారును వదిలి పరుగు పరుగున రోడ్డు దాటి హనీ దగ్గరకు వస్తున్నాడు.

ఆ కుర్రాడు ఏదో చెప్పాడు .....

బైకు తీసాడు, వెనకే ఎక్కింది హనీ ....

హనీ తండ్రి పరిగెత్తుకొని కారులో బయల్దేరాడు వారి వెనకే ......బైకు ఆగింది

అయ్యప్ప టీ స్టాల్ ....బోర్డు వేలాడుతుంది .....“లేసింది నిద్ర లేసింది మహిలా లోకం ...దద్దరిల్లింది పురుస పెపంచం .....ఏం పాట పాడిసేడు!!? ఎన్టి వోడు !! “లోపల నుండి ఓ గొంతు వినిపిస్తుంది.

మెల్లగా తొంగి చూసింది .....

“అసలైన రోటి పచ్చడి ఎలా ఉంటాడో దీనికి రుచి సూపియ్యాల ఈరోజు ....తండేల అప్పయ్యా మజాకా ....అనుకొవాల...” ఓ పక్క, ఉన్న ఒక్క కాలు మడిచి మఠం వేస్కొని రోట్లో పచ్చడి రుబ్బుతూ అప్పయ్య .......

మరో పక్క , మరుగుతున్న టీ .....అప్పయ్యని బతికే ఉన్నాడని తెలిసిన ఆ క్షణం లెక్కలేనంత ఆనందం ... వెనువెంటనే ఆ ఆనందాన్ని వెక్కిరిస్తూ అతడి పోయిన కాలుని చూసి భరించలేని విషాదం.

బైటే నేలపై కూర్చొని ఆనందం దుఖం కలగలిసిన భావోద్వేగంలో వెక్కి వెక్కి ఏడ్చింది హనీ.....

ఫోన్ తీసింది ....

“ దేవుడు నాకు ఒక తాత మామ్మలను ఇచ్చాడు ... ప్రతీక్ !నువ్వొప్పుకుంటే వాళ్ళు మనతోనే ఉంటారు .. డబ్బులు చాలకపోతే నేను కారులో వెళ్ళడం మానేస్తా బస్సులో వెళ్తా.....షాపింగ్ కూడా మానేస్తా.....”

“నీ చిన్న చిన్న సంతోషాలు నువ్వేం మానేయ్యక్కర్లేదు .....మనసుంటే మార్గం ఉంటుంది .అక్కడే ఆనందం కూడా ఉంటుంది. వచ్చేయ్ తొందరగా వెయిట్ చేస్తుంటా.....వృద్ధ కపోతాలను ఎగరేసుకోచ్చేద్దాం .........

హనీ మొఖంలో చిరునవ్వు ....

“రామ్మా!!అక్కడే నిలబడిపోయావ్....”లోపలి నుండి అప్పయ్య

మెల్లగా లోనికి వచ్చింది.మోకాలిపై కూర్చొని అప్పయ్య సగం కాలిని ముట్టుకుంది.....ఆమె కళ్ళలో నీటి తెరలు ..

తల్లీ ...మరేం పర్లేదమ్మా....ఈ కాలు లేకపోతె ఏం ? నాకు ఆసరా మా ముసలిది ఉందిగా ....బోసి నవ్వులు చిందిస్తున్నాడు అప్పయ్య.....

“అమ్మా మీరు సదువుకున్నోల్లు...మీకు సెప్పేటంతటోడిని కాదు ......కానీ తల్లీ.....బతుకే ఒక యుద్ధం ..మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి దాన్ని గెలవాలి కానీ ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటే ఎలా అమ్మా...... “తాత మాటలకి తల దించుకుంది హనీ.

“ఇందాక బైట నీ మాటలు విన్నా............ నేనూ మా ముసలిది ....దానికి నేనూ , నాకు అది. జీవితానికి ఇది సాలమ్మా.....పైవాడి పిలుపు కోసం ఎదురు సూస్తూ కాలం గడిపెయ్యడానికి.మీతో రాను అంటున్నా అని తప్పుగా అనుకోకు.మీ ఇద్దరూ అంటే నాకు ఎంతో ఇష్టం ...మీ అభిమానం ఎపుడూ కోరుకున్నవాడిని .....చల్లగా ఉండడమ్మా ...”హనీ తలపై చెయ్యేసి నిమిరాడు.

“ఇదిగో ఇది రుచి చూడు ....” రోట్లో పచ్చడిని హనీ అరచేతికి రాసేడు .....

“హ్మ్మ్.....అద్భుతం ......”కళ్ళు మెరిపిస్తూ హనీ .

“మరేటనుకున్నావ్..!! తండేల అప్పయ్యా మజాకా !!!” బోసి నవ్వుల అప్పయ్య ..

అప్పయ్య జీవితం ఆమెకి ఒక గ్రంధంలా అనిపించింది. లేచి బైటకి కదిలింది మోహంలో ఓ చిరునవ్వుతో “అవున్లే ఈ ప్రేమ పక్షులకి మా బంగారు పంజరం అవసరం ఏముంది?”...

బైట నిలబడిన హనీ తండ్రి సిగ్గుతో తలదించుకున్నాడు తన ప్రవర్తన తలచుకొని ....

కారు తీసి బయల్దేరారు ఇద్దరూ ....ప్రతీక్ ఇంటికి ....ప్రతి శుక్రవారం ప్రనీషా ల కంపల్సరీ మీటింగ్ ప్లేస్ ..ఇక నుంచి ....అయ్యప్ప టీ స్టాల్

****సమాప్తం *****Rate this content
Log in

Similar telugu story from Inspirational