Sudheer Kaspa

Crime

4.8  

Sudheer Kaspa

Crime

విహంగం-3

విహంగం-3

9 mins
581


అక్కడే పడి ఉన్నాడు....రెండు రోజుల నుండి….

శివమూర్తి పోలీస్ స్టేషన్ ముందే కూలబడి ఉన్నాడు.

తిండి తిప్పలు లేవు నెరిసిన గెడ్డం మాసిన బట్టలు .......

ఎవడికి పట్టింది??అతడి పక్క నుండే జనం వస్తూ పోతూ ఉన్నారు కానీ ఒక్కరూ అతడిని కనీసం చూడలేదు.చూసిన వాళ్ళు కాస్తా ఎవడో తాగుబోతు వెధవ అని చీదరించుకొని పోతున్నారు.

“శివ మూర్తి గారూ!!”మెల్లగా వచ్చి లేపాడు దివాకర్.....శివ పరిస్థితి చూస్తే అతని గుండె తరుక్కు పోతుంది.ఎందుకో ఆమె ఈ హత్య చేసి ఉండదు అని మనసు చెప్తుంది.శివమూర్తిని మెల్లగా నడిపిస్తూ పక్కనే ఉన్న హోటల్ కి తీసుకు వెళ్ళాడు.

“శివ గారూ మీరు చేయాల్సింది చాలా ఉంది.ఇలా డీలా పడిపోతే ఎలాగండి?కాస్త తినండి ” అతని చేతిపై చెయ్యి వేసి దివాకర్.

శివ కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తున్నాయ్...ముద్ద దిగటం లేదు ....పళ్ళెం లో అన్నం మెతుకులను నలుపుతున్నాడు.

“చూడండి శివ గారూ మనం నమ్మిన నిజం కోసం కొన్నిసార్లు లోకం మొత్తాన్ని ఎదిరించాల్సి వస్తుంది.మీకు ఇప్పుడా పరిస్థితి వచ్చింది.గుండె దిటవు చేస్కొండిఎందుకో మీకు సాయం చేయాలనిపిస్తుంది.నేను మీకు తోడుంటా.” దివాకర్ మెల్లగా చెప్పాడు.

శివ కళ్ళలో చిన్న ఆశ ...

“అసలు పూర్తిగా వివరాలు చెప్పండి మీ అమ్మాయి అలవాట్లు,స్నేహితులు అన్నీ.....మీకు చిన్న విషయం అనిపించేవి కూడా కొన్ని సార్లు పెద్ద ఆధారాలు అవుతాయి.”

“నా చిట్టి తల్లి ....ఎప్పుడూ చదువే లోకం,ఎప్పుడూ ఎదురు చెప్పదు,ఈ కాలం పిల్లల్లా కాకుండా పద్దతిగా పెంచాను. భరతనాట్యం కూడా నేర్పించాను.కాలేజికి వెళ్ళడం,డాన్సు క్లాసుకి వెళ్ళడం,అపుడపుడు సేవా కార్యక్రమాలు చెయ్యడం అంతే ఇంకేం తెలియదు దానికి.ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది లేరు.”

“సేవా కార్యక్రమాలా ??ఎక్కడ ఎలాంటివి ?”

“గ్లోబల్ గ్రీన్ సంస్థలో వాలంటీర్ గా పనిచేసేది అపుడపుడు.”

“మరీ.....మీ భార్యతో రిలేషన్ లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు?” కాస్త ఇబ్బంది పడుతూనే అడిగాడు దివాకర్.

“సార్ ప్లీజ్ ....ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నాను.నా గుండెని ఇంకా ముక్కలు చెయ్యకండి.తను నిప్పు.తనకి ఇలాంటివి అంటగడుతున్నారు. ఏం అపకారం చేసాం సార్ మేము ?? నా కూతురు పోయింది నా భార్యని అన్యాయంగా అరెస్టు చేసారు.లేనిపోని ప్రచారంతో నా పరువు తీసారు.నా భార్యని కాపాడుకోవాలన్న ఒక్క ఆశతో బతుకుతున్నాను.లేకపోతే ఈ సరికి నా శవాన్ని చూసేవారు”కన్నీరు మున్నీరు అయ్యాడు శివమూర్తి.

“ఐ యాం రియల్లీ సారి శివ గారు .....కానీ సాక్ష్యం మాత్రం మీకు వ్యతిరేకంగా ఉంది”

ఏం సాక్ష్యం అన్నట్టు తలెత్తి అనుమానంగా చూసాడు శివ.

ఎంత మోసం?? ఇన్నాళ్ళ ప్రేమ ఒక నాటకం. ఎవడితోనో తిరగడానికి నన్ను వదిలించుకోవాలనుకుంటుంది.అమ్మ అనే పదం వింటేనే అసహ్యంగా ఉంది “ ఇదీ సార్ మీ అమ్మాయి డైరీ లో ఆఖరి వాక్యాలు. అది తన చేతి రాత అని కన్ఫర్మేషన్ కూడా వచ్చింది.ఇపుడేమంటారు??” కాస్త మృదువుగానే అడిగాడు దివాకర్.

“అయ్యో దేవుడా ..ఎంత పని చేశావయ్యా ......”తల పట్టుకు కూర్చున్నాడు. ఆరోజు రాత్రి వాళ్ళు ఆడిన చిన్న నాటకం వలన వరూ టెన్షన్ లో రాసుకున్న డైరీ,ఇప్పుడు ఇంత పెద్ద ముప్పు తెచ్చింది.మొత్తం విషయం దివాకర్ కి వివరించాడు శివ.

“ఓహ్ షిట్ ...ఇప్పుడు ఇదంతా చెప్పినా నమ్మే పరిస్థితి లేదు.కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లోజ్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇపుడేం చెయ్యాలి? తలపట్టుకొని కూర్చున్నాడు దివాకర్.

ఫోన్ రింగ్ ఐంది ......

“సార్ ...నేను కానిస్టేబుల్ రంగనాథ్ ....సార్ షబ్బీర్ ఊర్లోకి వచ్చాడు సార్ ..ఇన్ఫర్మేషన్ పక్కా”

“వెరీ గుడ్ రంగనాథ్ ...అక్కడే ఉండు వస్తున్నా “

వెంటనే బయల్దేరాడు శివని కూడా తీస్కొని ......

****

“రేయ్....నువ్వు తప్పు ఒప్పుకొని లొంగిపోతే సరే!! జైల్లో అయినా బతికే ఉంటావ్ ....లేకపోతె నీకు ఖచ్చితంగా ఉరి శిక్షే” షబ్బీర్ కాలర్ పట్టుకొని సూటిగా కళ్ళలోకి చూస్తూ గద్దించాడు దివాకర్.

“సాబ్ మా కీ కసం .... నాకేం తెల్వదు సాబ్ ...ఆ పిల్ల వెంటబడ్డా ...ఆ పిల్లేంటి చాలా మంది వెంటబడ్డా.ఊరికినే చూసి ఆనందించడమే తప్ప ఎపుడూ ఎవరితోనూ మాట్లాడలే సాబ్ ....నిజం చెప్తున్నా నన్ను వదిలేయండి”

“మరెందుకురా ఊరు వదిలి పారిపోయావ్?? “

“బెట్టింగ్ సాబ్ ...ఐ.పీ.ఎల్ క్రికెట్ బెట్టింగ్ లక్ష రూపాయలు పోయినయ్..కట్టకపోతే చంపేస్తారు....డబ్బు సెట్ అయ్యేవరకు పారిపోయి దోస్తుల కాడ అప్పు పట్టుకొచ్చి ఇక్కడ తీర్చా సాబ్ ...అంతే నాకేం తెల్వద్ సాబ్ ...”

“కహానీలు బాగా చెప్తున్నావురా”

“సాబ్ ...ఖుదా కసం ....కావాలంటే నేను చెప్పిన చోటుకి రాత్రి వెళ్లి చూడండి ..మస్తు దందా నడుస్తుంది ఆడ ....బెట్టింగ్ దందా...ఆడ ఎంక్వయిరీ చెయ్యండి ..నమ్మండి సాబ్....” కాళ్ళా వేళ్ళ పడ్డాడు షబ్బీర్.

వీడికి మర్డర్ చేసేంత సీన్ లేదనిపిస్తోంది,పైగా మర్డర్ చేసిన వాడి కళ్ళలో బెరుకు కనిపెట్టడం అతని పోలిస్ బుర్రకి కొత్త కాదు.

“ఆ అమ్మాయి గురించి నీకేం తెల్సు చెప్పరా “

“ఏముంది సాబ్ మంచి పిల్ల,పద్దతిగా ఉండిద్ది... .....నోవా కాలేజి కి వెల్లుద్ది రోజు... ఓ ముసలాయనకి సేవ చేసుద్ది.....ఇంకా ....”

“రేయ్ ఆగాగు ...!! ముసలాయనకి సేవ చేస్తుందా? ఎవరతను ? ఎక్కడ ఉంటాడు.”

“ఊరు చివర సార్ ...హైవే కి దగ్గరలో ...మంచి గిరాకీ సార్ ....కొంచెం వెయిట్ చెయ్యిస్తాది కానీ డబ్బు దండిగా ఇస్తాది.నేనే ఎక్కువగా వెళ్ళేవాడ్ని ఆ గిరాకీకి.ఇంత దూరం ప్రయాణం అయినా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు ఆ పిల్ల.ఓసారి బంగ్లాలోకి మెల్లగా తొంగి చూసా ముసలోడికి కాళ్ళు పడుతూ ఉంది.”

“అబ్బా ...ఈ ఊరు చివర బంగ్లా విషయం ఎలా మర్చిపోయానబ్బా .....”మనసులోనే తిట్టుకున్నాడు.

“రారా జీపెక్కు ....”

ముగ్గురూ కలిసి బయల్దేరారు.

“మీకు ఈ ముసలి వ్యక్తి తెలీదా ? “అడిగాడు దివాకర్

“ఏంటో సార్ అంతా వింతగా ఉంది.అతనెవరో తెలీదు ఏదో NGO లో సేవ అంటే “సేవ్ వాటర్ “ సేవ్ ఎన్విరాన్మెంట్ “ ఇలాంటి ర్యాలీలు వాటికి వెళ్తుందని తెలుసు. ఇలా ఒక ముసలాడికి కాళ్ళు పడుతుందని నాకెప్పుడు చెప్పలేదు.అది కూడా ఇంత దూరం!! ఆటో వాడికి ఇవ్వడానికి అంతంత డబ్బు కూడా నేనెప్పుడూ ఇవ్వల్లేదు.” అయోమయంగా శివమూర్తి.అతని మనసు అల్లకల్లోలంగా ఉంది.ఇంకేమీ మాట్లాడకుండా ఆలోచనల్లో కొట్టుకుపోతున్నాడు.

“ఈ కాలంలో ముసలోళ్ళని కూడా అనుమానించకుండా ఉండలేం.వీడు ఏమైనా చేసాడా?? అయినా అంత రహస్యం ఏంటి ??”మనసులోనే వెయ్యి కారణాలు వెతుకుతున్నాడు దివాకర్.

బంగ్లా కి దూరంగా జీప్ ఆపేసారు ....

దివాకర్ మరియు శివ మాత్రమే జీప్ దిగి నడుచుకుంటూ బయల్దేరారు.షబ్బీర్ నీ, డ్రైవర్ని అక్కడే ఉండమన్నారు.

“ఇంత దూరంగా ఇల్లెందుకు కట్టుకున్నాడు వీడు?”

తుమ్మ చెట్ల మధ్యలో నుంచి ముళ్ళను మెల్లగా పక్కకి తప్పిస్తూ కింద ఉన్న బురదను మెల్లగా దాటుకుంటూ ఆ బంగ్లా దగ్గికి చేరారు.

“ష్....” శబ్దం చేయకుండా రమ్మని సైగ చేసాడు దివాకర్.

చుట్టూ చూసాడు ఎవరూ కనపడలేదు.

మెల్లగా ఆ బంగ్లా కిటికీ కి ఉన్న కన్నం నుంచి లోపలికి చూసాడు.అంతా చీకటి.

కాలింగ్ బెల్ కొట్టాడు.పని చేస్తున్నట్టు లేదు.

తలుపు కొట్టాడు లోపలి నుండి ఏ అలికిడి లేదు.

లోపల ఎవరూ ఉన్నట్టు లేరు.బైట తలుపు కూడా డోర్ లాకింగ్ సిస్టం.తాళం కప్ప కూడా లేదు.

“ఛ ఏదోక క్లూ దొరుకుతుందని అనుకున్నా ఇదేంటి ఇలా ఐంది ?” గెడ్డం గోక్కుంటూ చుట్టూ చూస్తున్నాడు దివాకర్. అతడి కంట పడింది. పరీక్షగా చూసాడు.

పాద ముద్రలు ...బురద లో నడిచొచ్చిన షూ అడుగు జాడలు..

ఇంకా తడిగానే ఉన్నాయ్....

మెల్లగా ఫాలో అయ్యాడు ...

బంగ్లా కుడి పక్క వైపు వంచి ఉన్న కిటికీ ఊచలను చూసాడు.

“ఎవరో వచ్చారు ఇక్కడికి. మీరు ఇక్కడే ఉండండి” మెల్లగా కష్టపడి ఆ ఊచలు మధ్యలో నుంచి దూరాడు లోపలికి.

ఇంకా వాడు లోపలే ఉన్నాడా ....తుపాకీ తీసి పట్టుకున్నాడు కుడి చేత్తో .....

ఎడమ చేత్తో మొబైల్ ఫోన్లో టార్చి లైటు వేసి మెల్లగా ఒకొక్క గదికి వెళ్తున్నాడు.బంగ్లా వెనక వైపు వెళ్ళాడు మెల్లగా .... కిటికీ నుండి చూసాడు బైటకి.

ఎవడో ఒకడు దూరంగా పరిగెత్తి పరిగెత్తి రోడ్డుపై ఉన్న బైకు తీస్కొని హడావిడిగా వెళ్తున్న దృశ్యం.

“అరె ఎవడు వీడు ..ఒక్క క్షణం షాక్ లో అలా చూస్తూ ఉండిపోయాడు.వాడ్ని వెంబడించే టైం కూడా లేదు మన జీపు అవతలి వైపు ఉండిపోయింది .ఛా ....ఒక్క ఐదు నిమిషాలు ముందే వచ్చి ఉంటే ఖచ్చితంగా మంచి క్లూ దొరికేది.ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది!!.ఈ ముసలాడు ఎక్కడికి పోయినట్టు??” అన్ని గదులూ తెగ వెతికాడు.ఇల్లంతా చెత్తా చెదారం. ఇల్లు ఖాళీ చేసి పారిపోయాడా ముసలోడు. అంతా చిందరవందర. ఎన్ని వెతికినా ప్రయోజనం శూన్యం. నిరాశగా వెనుదిరిగాడు. తన కాలి దగ్గర పడున్న ఒక్క కాగితం ముక్క మాత్రం అతని దృష్టిని ఆకర్షించింది.అదేదో బాండ్ పేపర్ జిరాక్స్ కాపీ ముక్కలా ఉంది.ఇదేమైనా మనకి హెల్ప్ అవుతుందా?? ఏమోలే అని మడత పెట్టి జేబులో పెట్టుకొని బయల్దేరాడు.

జీప్ ఎక్కారు .....ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగ్ అయ్యింది ....

“హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం “

“ఏంటి ఎస్సై గారూ..ఎక్కడున్నారు ??” దీక్ష గొంతులో ఆ వెటకారం దివాకర్ మనసుని పిన్నుతో పొడుస్తున్నట్టుంది.ఆమె గారూ అని సంభోదించడం చాలా అరుదు మరి.

“ఆ మేడం అదీ...డ్యూటీ పైనే బైటకొచ్చా మేడం “

“చాలా బాగా చేస్తున్నారు .......డ్యూటీ ........మీలాంటి మంచి డెడికేటెడ్ వర్కర్లకి నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ చేస్తే మీ సేవలు అక్కడ ఇంకా బాగా అందిస్తారు అనిపిస్తుంది.”

“మేడం ???” దివాకర్ మొఖం మాడిపోయింది.

“వైఫ్ ప్రెగ్నెంట్ అనుకుంటా ఎస్సై గారూ .....డెడికేషన్ కాస్త ఇంటి పై కూడా పెట్టండి.ఈ టైం లో ట్రాన్స్ఫర్లు అవీ అంటే ......ఆలోచించండి మరి”

“మేడం !! ఓకే మేడం ......అలాగే మేడం thankyou మేడం “ఫోన్ పెట్టేసాడు.

దివాకర్ కి విషయం బాగా అర్ధం ఐంది. ఈ కేసు మామూలు కేసు కాదు.ఎవడో బిగ్ షాట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు.ఈవిడ వాళ్ళని తప్పించడానికి పాపం వరూ అమ్మని ఇరికిచింది.దీర్ఘంగా శ్వాస తీస్కున్నాడు.

“సారీ..శివ గారూ ఇక నేను మీకు డైరెక్ట్ గా సాయం చేయలేకపోవచ్చు.నేను ఒక సాధారణ ఎస్సైని.ఏటికి ఎదురీదలేను.కానీ నా సపోర్ట్ మీకు ఎపుడూ ఉంటుంది.టచ్ లోనే ఉంటాను.కానీ ప్రొఫెషనల్ గా ఇక ఏం చేయలేను.”దిగులుగా మొఖం పెట్టి దివాకర్.

“సార్ మీరే అలా అంటే ఇక నాకు దిక్కెవరు ?” శివ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయ్.

దివాకర్ ఏం మాట్లాడలేదు ...మౌనంగా మొబైల్ లో ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నాడు వరూ ప్రొఫైల్ .....

వరుసగా ఫోటోలు.... కాలేజిలో తీసుకున్నవి, ఇంట్లో , రోడ్డుపై ప్లకార్డు పట్టుకొని ....జూమ్ చేసి చూసాడు ...”SAY NO TO CRACKERS” తరువాతి ఫోటో చూసాడు అదే పోజు, నినాదాలు ఇస్తున్నట్టుగా “lets celebrate WATERLESS HOLI” తరువాతి ఫోటో “పండుగ అంటే ప్రాణాలు తీసేది కాదు కోడిపందేలు,జల్లికట్టు అంటే రాక్షసత్వం” ,పరిశ్రమ వద్దు పర్యావరణం ముద్దు ఇలా చాలా పోస్ట్లు చూస్తున్నాడు తదేకంగా.ఈ అమ్మాయి మంచి Environmental activist తనని చంపాల్సిన అవసరం ఎవరికుంది?? మదిలో మదనపడుతున్నాడు.

సడెన్ గా రోడ్డు వైపు చూసారు ఇద్దరూ .......

పెద్ద సమూహం ....ఓ ఐదు వందల మంది ఉంటారు.కాలేజి స్టూడెంట్స్.ప్లకార్డులు చేతబట్టి,నినాదాలతో ఊరుని హోరెత్తిస్తున్నారు. JUSTICE FOR VARSHINI ....కావాలి నిజం ,జరగాలి న్యాయం ....అంటూ రోడ్డు పై బైఠాయించారు.మీడియా ఉరుకులు పరుగులపై అక్కడికి చేరారు.

“ముగిసింది అనుకున్న కేసుపై అనుమానాలు ....వర్షిణి తల్లిని బలిపశువు చేసారా?? దీని వెనక పెద్దల హస్తం ఉందా ??” టి.వి చానెళ్ళు మళ్ళి మోగటం మొదలు పెట్టాయి.

వారిని చూడగానే శివ మూర్తి కళ్ళలో మెరుపు....నా వరూ మంచితనమే మాకు న్యాయం జరిగేలా చూస్తుంది.నేను కూడా వెళ్తా వారితో అని జీపు దిగబోయాడు.

“శివ గారూ ...తప్పుగా అనుకోకండి ....ఈరోజుల్లో మంచితనాలు చూసి ఎవరూ హెల్ప్ చెయ్యరు....ఎవరో పనిగట్టుకు రెచ్చగొడితేనో లేక డబ్బు పంచితేనో తప్ప ఫ్రీగా సహృదయంతో చేసే ఉద్యమాలు లేవు ఈరోజుల్లో..చూద్దాం ఈ కుర్రాళ్ళలో వేడి ఎంత కాలం ఉంటుందో.కానీ ఒక్కటి మాత్రం నిజం మీకు ఎవరో అజ్ఞాతవ్యక్తి సహాయం చేస్తున్నారు.కానీ మీరు కలవాల్సిన వ్యక్తీ ఇంకొకరున్నారు.” శివ చెయ్యి పట్టుకొని ఆపేడు దివాకర్.

దివాకర్ మనసులో పట్టుదల పెరుగుతుంది ఈ కేసుని ఎలాగైనా సాధించాలని కానీ నిస్సహాయత కమ్ముకుంటుంది.జీపు రోడ్డుపై కాకుండ సందులలో పోనివ్వమన్నాడు. షబ్బీర్ నీ డ్రైవర్ని దించేసి ,తనే డ్రైవ్ చేస్కుంటూ నేరుగా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆపేడు.

గ్లోబల్ గ్రీన్ NGO ఆఫీసు అది.

***

“థాంక్స్ వింధ్యా గారూ ...అపాయింట్మెంట్ లేకుండానే కలవనిచ్చారు.”

“You are always welcome Mr.Diwakar ..ఏంటి ఏమైనా ఎంక్వయిరీ నా ?”అడిగింది గ్లోబల్ గ్రీన్ CEO వింధ్యా బెనర్జీ.కాన్ఫిడెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉంది ఆమె మొఖం.ఎన్నో వందల స్కూళ్ళు,హాస్పిటల్స్ తో పాటు సామాజిక ఉద్యమాలను ఒంటి చేత్తో నడిపిస్తున్న సత్తా ఆమెది.

“No No ....I need your help madam ….అదే వర్షిణి కేసులో” ఒద్దికగా అడిగాడు.

“హ్మ్ ...విన్నాను ..ఆ అమ్మాయితో డైరెక్ట్ గా పరిచయం లేదు కానీ మాకున్న వేల మంది వాలంటీర్లలో ఆమె కూడా ఉందని తెలుసు.I feel really sorry about her.నేను లీడ్ తీస్కుందాం అనుకున్నా కానీ ఏవేవో రూమర్స్ వినిపించాయిగా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో డిస్టబెన్స్ వల్ల చనిపోయిందని తెలిసి కాస్త దూరంగా ఉన్నా ఈ ఇష్యూ కి “

“లేదు మేడం ..ఈ కేసుపై చాలా అనుమానాలున్నాయి.ఎవరో బిగ్ షాట్ ఉన్నాడు దీని వెనుక అందరూ ఏదో దాస్తున్నారు.పాపం అన్యాయంగా ఆవిడని అరెస్టు చేసారు...మీకున్న పలుకుబడికి,పవర్ కి మీరైతేనే ఎదిరించగలరు అని ఇలా వచ్చా ...You are my last ray of hope madam.”

“మీరు అంతగా అడగక్కరలేదు దివాకర్ గారూ...తెలుసుగా నా గురించి ఎక్కడ మహిళలకి అన్యాయం జరిగినా అక్కడ నేనుంటా ...సరిగా విషయం తెలియక వర్షిణి విషయంలో లేట్ చేశా....ఇక ఆగను.You don’t worry I will take care of that”నవ్వుతూనే కొండంత ధైర్యాన్ని నింపింది.

ఆమె భరోసా శివ,దివాకర్ ల మనసులలో కొత్త ఊపిరులూదింది. రాష్ట్రంలో ఎక్కడ మహిళా సమస్యలున్నా ,పర్యావరణానికి ముప్పు వాటిల్లినా అక్కడ వాలిపోతుంది.అపర కాళికలా విరుచుకుపడుతుంది.మీడియా ద్వారానైనా,కోర్టుల ద్వారా అయినా ఆమెకు సమస్యలను డీల్ చెయ్యడంలో తిరుగులేదు.ఆమె ఆదేశంతో రాష్ట్రం మొత్తం అట్టుడుకింది.ఎక్కడ చూసినా ధర్నాలు,ర్యాలీలు.మీడియా సపోర్ట్ విస్తృతంగా దొరికింది.జనం కూడా క్యాండిల్స్ తో వీధులలో ర్యాలీలు చేస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు.సోషల్ మీడియా ఆధారంగా విస్తృత ప్రచారం జరిగింది. జస్టిస్ ఫర్ వర్షిణి అంటూ హాష్ ట్యాగ్ లతో ఎక్కడ చూసినా ఇదే టాపిక్.ఒక్కరోజులో పరిస్థితి మొత్తం మారిపోయింది.వింధ్యా బెనర్జీ తన ప్రసంగాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించి దిగి వచ్చేలా చేసింది.ఆమె డిమాండ్ మేరకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.దీక్షని ఈ కేసు నుండి తప్పించారు.వింధ్య శాంతించింది.రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి.కానీ వరూ కాలేజి విద్యార్ధులు మాత్రం మెట్టు దిగలేదు ఆమెని విడుదల చేసే వరకు పోరాటం ఆపేది లేదని కూర్చున్నారు.

మారుతున్న పరిస్థితులతో కాస్త ధైర్యం వచ్చింది దివాకర్ మరియు శివలకు.పోలిస్ స్టేషన్ కి దూరంగా ఒక టీ స్టాల్ లో కలిసారు.

“సార్ మీరే కనక లేకపోతె నా పరిస్థితి ఏమయ్యేదో ..మీ ఋణం ఈ జన్మకి తీరేది కాదు సార్ “ దివాకర్ చేతులు పట్టుకొని శివ.

“ఇదీ నా డ్యూటీ లో భాగమేనండి..అయినా ఇంకా జరగాల్సినది చాలా ఉంది.”

శివ ఫోన్ మోగుతుంది ....

“హలో ...ఎవరండి?”

“నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు కొంచెం పక్కకి వచ్చి మాట్లాడండి.మీ సమస్యకి పరిష్కారం చూపే ఆధారం నా దగ్గర ఉంది” చెప్పాడు అజ్ఞాత వ్యక్తి.

“ఐతే చెప్పండి “

“ఇపుడున్న పరిస్థితిలో ఎవర్నీ నేను నమ్మను దివాకర్ని కూడా “

ఎవడు వీడు అనే అయోమయంలో పక్కకొచ్చాడు శివ.

“చూడండి శివ గారూ ....`మీరు వెళ్ళిన ఇంట్లో ఉండే ముసలాడు చచ్చిపోయాడు ....కాదు చంపేశారు “

“ఏంటి ?? ఏంటి మీరు చెప్పేది ?? మీకెలా తెలుసు ?”

“ఇపుడు సమస్య నాకెలా తెలుసని కాదు...ఎవరు చంపేరని??”

“ఎవరూ??”

“వరూ .....మీ కూతురు “

“నో నేను నమ్మను .....నా వరూ అలా చెయ్యదు”శివ గొంతు వణుకుతుంది.

“నమ్మినా నమ్మకపోయినా ....అదే నిజం ...అక్కడికి మీ అమ్మాయి తప్ప ఇంకెవరూ వెళ్ళలేదు గత ఆరు నెలలుగా”

శివ నోట మాట రావటంలేదు....అసలు ఇది అంత రహస్యంగా ఎందుకు వెళ్ళింది...మర్డర్ చెయ్యటం ఏంటి ....తిరిగి తనే శవం అయిపోవడం ఏంటి ?? ఏదైనా అఘాయిత్యం జరిగిందా తనపై ...తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది....కన్నీళ్ళు ఆగటంలేదు...

“హలో ....హలో..... నా దగ్గర ఇంకొన్ని ఆధారాలున్నాయి ఈ కేసులో మీ భార్యని విడిపించేందుకు సహాయ పడొచ్చు .మీరు ఒంటరిగా నేను చెప్పిన చోటికి వస్తే ఇస్తా “

“ఒంటరిగానా !!“

“హా ..అవును నాకు పోలీసులపై నమ్మకం లేదు.ఎక్కువ సేపు మాట్లాడను .సాయంత్రం మళ్ళి చేస్తా ఉంటా “ఫోన్ కట్ చేసాడు.

శివమూర్తి మనసులో ఎన్నో ప్రశ్నలు ..దివాకర్ కూడా నన్ను మోసం చేస్తాడా?? అసలు ఇప్పుడు ఫోన్ చేసిన వాడు ఎవడూ?? ఎంత వరకు నమ్మొచ్చు ??

మెల్లగా దివాకర్ పక్కకి వెళ్ళాడు

“ఏంటి ఎవరు ఫోన్ ?” దివాకర్ అడిగాడు అనుమానంగా..శివ మొఖంలో ఆందోళనను అతని పోలీస్ కళ్ళు పట్టేసాయి.

“అదీ..అదీ....మా ఆఫీసు నుండి ...సెలవు పొడిగిస్తావా ...జాయిన్ అవుతావా అని.....” ఇబ్బందిగానే అబద్దం చెప్పేసాడు.

హడావిడి గా వచ్చాడు జీపు డ్రైవర్ .....”సార్....కాస్త ఇటు వస్తారా ?” ఆని పక్కన నిలబడి సైగ చేసాడు..

దివాకర్ వెళ్ళగానే “సార్ ...ఆన్లైన్ లో ఒక వీడియో వైరల్ ఐపోయింది సార్ ....వర్షిణి లిప్ లాక్ సీన్ సార్ ....”గుసగుసగా శివమూర్తికి వినపడకూడదు అన్నట్టు చెప్పాడు డ్రైవర్.

“ఏంటి???? ఇలా ఇవ్వు ...అతని చేతిలో మొబైల్ లాక్కున్నాడు ....

దివాకర్ దిమ్మతిరిగి పోయింది. వర్షిణి లిప్ లాక్ చేస్తున్న దృశ్యం .....

తేరిపార అవునో కాదో అని చూసాడు ..అవును అది వర్షిణే....

అటు వైపు ఉన్నవ్యక్తి ఒక అమ్మాయి .....

ఇద్దరు అమ్మాయిల అధర చుంబనం..

.ఆ అమ్మాయి ....

షాలిని .

కాలేజిలో ఎంక్వయిరీ సమయంలో ఎవర్నీ వదలలేదు అతను.షాలిని వివరాలు అన్నీ చెక్ చేసాడు.ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా..

వీడియో బ్యాక్ గ్రౌండ్ క్లియర్గా లేదు.కనపడకుండా ఎడిట్ చేసినట్లు తెలుస్తుంది.

దివాకర్ కి ప్రపంచం మొత్తం తలకిందులైనట్లు అనిపించింది.

అసలు షాలిని తో ఏంటి ఈ పని. వీళ్ళు ఇంత క్లోజా .....??

ట్రింగ్ ...మెసేజ్ వచ్చింది

“షాలిని అనే పేరుతొ గత వారం రోజుల్లో ఇండోనేషియా వెళ్ళిన వాళ్ళు ఇద్దరు.కానీ వాళ్ళలో మీరు చెప్పిన షాలిని డీటెయిల్స్ మ్యాచ్ అవ్వలేదు “ అది మెసేజ్ సారంశం.

తన పరిచయాలు ఉపయోగించి ఎయిర్ పోర్ట్స్ దగ్గరి డేటా కోసం కనుక్కున్నాడు ఇంతకు ముందే దివాకర్.

అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో,ఏం చేయాలో దిక్కు తోచని గందరగోళం లో దివాకర్.

ఫోన్ లో వాడు చెప్పింది నిజమేనా ?? దివాకర్ కి చెప్పనా వద్దా అనే ధీర్ఘాలోచనలో శివమూర్తి

షాలిని.......

ఈమెకి వరూ కి ఏంటి సంబంధం ......

అందరికీ ఇండోనేషియా అని చెప్పి ఈ షాలిని ఎక్కడకి వెళ్ళినట్లు ???

తరువాయి భాగంలో ........


సుధీర్.కస్పా

8985021055Rate this content
Log in

Similar telugu story from Crime