కిల్లర్
కిల్లర్


(రెండు వారాల ముందు...)
"మీకెందుకు ఇబ్బంది హోటల్లో రూమ్ తీసుకుంటాను కిరణ్ గారు "అని మాటవరసకి అన్నాడు వరుణ్.
"బలే వారే! నాకేం ఇబ్బంది లేదు సార్.మీరు రండి..."అంటూ బైక్ స్టార్ట్ చేసాడు కిరణ్.
బస్ స్టాండ్ నుండి హైవే వైపు బండి స్పీడ్ గా వెళ్ళింది.
నాలుగు గంటల జర్నీ అంత పరిచయంతోనే వరుణ్ ని ఇంటికి పిలుస్తాడు కిరణ్.
ఊరి చివరికి చేరుకుంటారు.హైవేకి దగ్గరలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లోకి వెళ్తుంది బైక్.
"చాలా ప్రశాంతమైన ప్లేస్ కదా సార్ చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ చూస్తూ "అంటాడు వరుణ్.
చిన్నగా నవ్వి "అవును సార్ నైట్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ సౌండ్ కాస్త ఇబ్బంది"అంటాడు కిరణ్, బైక్ పార్క్ చేస్తూ.
ఇద్దరు లిఫ్ట్ లో వుంటారు.వరుణ్ ఎదురుగా ఉన్న లిఫ్ట్ యొక్క గ్రిల్స్ డోర్ ద్వారా దాటుతున్న ఒక్కో ఫ్లోర్ ని అబ్సర్వ్ చేస్తాడు.దాదాపు గా అన్ని ఖాళీ గానే ఉంటాయి.లిఫ్ట్ అప్పుడూ ఫోర్త్ ఫ్లోర్ లో ఆగుతుంది.డోర్ తీసుకుని కారిడార్లోకి వస్తారు ఇద్దరు.ఒకే ఒక ఫ్లాట్ ముందు మాత్రమే లైట్ వెలుగుతూ ఉంటుంది.
లాక్ వేసున్న తలుపుల్ని చూసి," ఎంత అరిచినా వినడానికి ఇక్కడ ఎవరు లేరు కదా కిరణ్ గారు "అంటూ కిరణ్ వెనక నడుస్తూ వస్తాడు వరుణ్.
"హా..అరిచే అంతగా ఏముంటుంది సార్...దెయ్యాలా!" అని నవ్వుతాడు కిరణ్.
"అంటే మీకు భయం అనిపించదా?" అంటాడు వరుణ్.
"భయం ఎందుకు సార్....నన్నెవరు పీక్కు తినరుగా" అని కిరణ్ అనగానే వరుణ్ పెద్దగా నవ్వుతాడు.
ఆ నవ్వు కొంచెం విచిత్రంగా వున్నా అది కిరణ్ గమనించడు.
******
(ప్రస్తుతం)
టైం 5:45PM...
జీప్ దిగి చుట్టూ చూస్తుంది S.I.పూజిత.
అక్కడక్కడా అపార్ట్మెంట్లు....చాలా వరకు కన్స్ట్రక్షన్ స్టేజి లోనే ఉంటాయి.జనం ఉండేది కూడా తక్కువే.
వున్నా కొద్ది మందికి ముగ్గురి ఫోటోలు(వాటిలో ఒకటి వరుణ్ ఫోటో కూడా) చూపించి "వీళ్ళని చూసారా?" అని అడుగుతారు కానిస్టేబుల్స్.
అందరు చూడలేదు అని చెప్తారు.
హైవేకి కొంచెం దూరంలోవున్నా వైన్ షాప్ లో అడుగుతుంది S.I.పూజిత.
"తెలీదు" అంటాడు కౌంటర్ దగ్గర వున్నతను.
కానీ,అతని వెనకున్న అతను "ఆ లాస్ట్ అతన్ని నేను చూసాను మేడం అని అంటాడు.
"ఇతన్నా?" వరుణ్ ఫోటో చూపించి అడుగుతుంది S.I.పూజిత.
అవునన్నట్టుగా తలూపాడు ఆ కుర్రాడు.సీరియస్ గా వాడి వైపు చూసి బయటకు రమ్మని సైగ చేస్తుంది.
"ఎప్పుడు చూసావ్?" అని అడుగుతుంది.
"మొన్న నైట్ మేడం.షాప్ మూస్తున్న టైంకి వచ్చి రెండు బీర్లు తీసుకున్నాడు.."
అతన్ని మధ్యలో ఆపుతూ,
"రెండా?...అతనితో పాటు ఇంకెవరైనా వున్నారా?" అని గట్టిగా అడుగుతుంది.
"వున్నాడు మేడం!" అంటాడు.
"అతనెవరో తెలుసా?" అని అడుగుతుంది.
"తెలీదు మేడం...." అంటాడు.
"నిజం చెప్పు లేకపోతే తాట తీస్తా" అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది.
"నిజం మేడం.... వాళ్ళెవరో నాకు తెలీదు.అప్పుడే ఫస్ట్ టైం చూసాను"అని కంగారుగా చెప్తాడు.
ఒక్క నిమిషం ఆ కుర్రాడి వైపు చూస్తుంది,
"తీసుకుని యెటు వెళ్ళారు?" అని మామూలుగా అడుగుతుంది S.I.పూజిత.
"ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళారు మేడం"అని తనకి లెఫ్ట్ సైడ్ వున్నా,రోడ్డుకి అవతల వున్న ఒక అపార్ట్మెంట్ని చూపిస్తాడు ఆ కుర్రాడు.
"వీడి డీటెయిల్స్ తీసుకోండి" అని కానిస్టేబుల్స్ తో చెప్పి అపార్ట్మెంట్ వైపు వెళ్తుంది S.I.పూజిత.
*******
(రెండు వారల ముందు)
టైం 12:30AM....
వరుణ్ కి గెస్ట్ రూమ్ ఇచ్చి,కిరణ్ తన బెడ్ రూంలో పడుకుంటాడు.
బాగా నిద్రపోతున్న కిరణ్ని చూస్తూ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు వరుణ్.కొద్దిసేపు తర్వాతా డైనింగ్ టేబుల్ వైపు తల తిప్పుతాడు.దాని పైనున్న కత్తి మీద వరుణ్ కన్ను పడుతుంది.
****
(ప్రస్తుతం)
ఆ అపార్ట్మెంట్కి వంద మీటర్ల దూరంలో ఒక్క ఇల్లు కూడా ఉండదు.కంప్లీట్ అయ్యి రెండు నెలలు అయినా ఎవరు చేరి వుండరు.
లాక్ వేసున్న వాచ్ మెన్ రూంని చూస్తూ స్టెప్స్ ఎక్కుతుంది S.I.పూజిత.
"దీని ఓనర్ అమెరికాలో వుంటాడంట మేడం.అతని బావ అన్ని పనులు చూసుకునేవాడంట.కానీ,కొద్ది రోజులుగా ఇక్కడికి రాలేదంట.ఒక్క వాచ్ మెన్ మాత్రమే ఉంటున్నాడు అని ఆ వైన్ షాప్ లోని పెద్దాయన అన్నాడు"అని చెప్తూ S.I.పూజిత వెనక నడుస్తాడు కానిస్టేబుల్.
ఫస్ట్ ఫ్లోర్....
అన్ని ఫ్లాట్లకి లాక్ వేసుంటాయి.కారిడార్ మొత్తం మట్టి,బూజు.
సెకండ్ ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉంటుంది.
థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ముందు ఆగుతుంది S.I.పూజిత.
ఫ్లాట్ నెంబర్ 302....
బయట లైట్ వెలుగుతూ ఉంటుంది.అన్ని ఫ్లాట్లలా కాకుండా క్లీన్ గా ఉంటుంది.
కాలింగ్ బెల్ కొడుతుంది.తలుపు తెరుచుకుంటుంది.
S.I.పూజిత ఎదురుగా కిరణ్.
సడన్ గా పోలీస్ని ఇంటి ముందు చుస్తే వుండే కంగారు కిరణ్ మోహంలో ఉండదు.
కిరణ్ని తోసుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది S.I.పూజిత తన వెంటే కానిస్టేబుల్ కూడా.ఇల్లంతా ఒకసారి బాగా చూసి "కూర్చో" అంటుంది డైనింగ్ టేబుల్ని చూపిస్తూ.
"ఇతన్ని చూసావా?" వరుణ్ ఫోటో చూపించి అడుగుతుంది S.I.పూజిత.
"లేదు" ఫోటో వైపు సరిగ్గా చూడకుండానే చెప్తాడు కిరణ్.
ఓ నవ్వు నవ్వి,కానిస్టేబుల్ వైపు చూసి "సర్చ్" అంటుంది.
"ఈ ఫ్లాట్ మీదా?" అని ఫోన్ వాడుతూ అడుగుతుంది.
"నో....నేను ఇక్కడ వాచ్మెన్ " కిచెన్ వైపు చూసి అంటాడు.
"వాచ్మెన్! మరి ఈ ఫ్లాట్లో ఎందుకు వున్నావ్?" అని అడుగుతుంది S.I.పూజిత.
"రెంట్ కి వుండే వాళ్ళు ఊరెళ్ళారు..." కిరణ్ మాట పూర్తి కాకుండానే...
"ఆ స్మెల్ ఏంటి....వంట చేస్తున్నావా?" అని అడుగుతుంది.
"హా...నాన్ వెజ్ "కిరణ్ కళ్ళలో ఆనందం చూస్తుంది S.I.పూజిత.
"నాన్ వెజ్!....యేది తీసుకురా"అని చెప్పి కానిస్టేబుల్ ని చూసి సైగ చేస్తుంది.
అతను అడ్డంగా తల ఊపుతాడు.
కిరణ్ నాలుగు చికెన్ ముక్కలని ప్లేట్లో పెట్టుకుని వచ్చి S.I.పూజిత ముందు ఉంచుతాడు.
అప్పుడే S.I.పూజిత ఫోన్ మోగుతుంది.
"యస్.పి గాడు...." అని మనసులో అనుకుని "షూ..." సైలెంట్ గా ఉండమని సైగ చేస్తుంది.
"సార్!....హా...సార్!..వరుణ్ లాస్ట్ కాల్ తెలుగుగంగ కాలనీ టవర్ కి కనెక్ట్ అయ్యి వుంది సార్.
సార్..సార్..అవును సార్ ఆ ఏరియాలోనే వున్నాను సార్.సార్..సరే సార్"అని భయం నటిస్తుంది S.I.పూజిత.
ఫోన్ కట్ చేసి "నీళ్ళు తీసుకో"అని కానిస్టేబుల్తో అని
చికెన్ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది....
ఇంతలో "మేడం" అంటూ కేక...
****
(రెండు వారాల ముందు..)
స్లోగా కత్తి దగ్గరకు వెళ్తాడు వరుణ్.తన రైట్ హ్యాండ్తో కత్తి పక్కనే వున్న వాటర్ బాటిల్ తీసుకుంటాడు.అది ఖాళీగా ఉంటుంది.మొత్తం చూసి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు.ఖాళీగానే ఉంటుంది.
డీప్ ఫ్రిడ్జ్ కూడా తెరుస్తాడు.అందులో ఒక వైట్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది.దాన్ని బయటకు తీస్తాడు.ఎర్రగా ఉన్నట్టు అనిపించినా,చీకటిలో అందులో ఏముందో సరిగ్గా కనపడదు వరుణ్ కి.దానికి వున్న ముడి తీసి మొహం దగ్గర పెట్టుకుంటాడు.
సడన్ గా లైట్ ఆన్ అవుతుంది.
అంతే బయపడి పోయి కవర్ని దూరంగా విసిరి,మెయిన్ డోర్ వైపు పరిగెత్తబోయి డైనింగ్ టేబుల్ తట్టుకుని కింద పడిపోతాడు.వెనక్కి తిరిగి చుస్తే కిరణ్,అతని కాళ్ళ దగ్గర కవర్,అందులోనుండి బయటపడిన మనిషి అరచేయి!
కిరణ్ సైలెంట్ గా అరచేయిని కవర్లో వేస్తాడు.దానిని ముడివేసి,ఫ్రిడ్జ్ లో పెడతాడు.ఒక తడి గుడ్డ తీసుకుని ఫ్లోర్ తుడవడం స్టార్ట్ చేస్తాడు.
వరుణ్ భయంతో కదలకుండా ఉండిపోతాడు.అతని ఊపిరి సౌండ్ మాత్రమే ఆ రూంలో వినిపిస్తుంది.అది ప్రతి సెకండ్కి భయంగా,పెద్దగా అవుతుంది.
ఫ్లోర్ తుడిచాక,అది క్లీన్ గా ఉండడం చూసి ఆనందిస్తూ,వరుణ్ని చూసి "ఒక్క నిమిషం"అని బెడ్ రూంలోకి వెళ్తాడు.
వెంటనే ఒక్క ఎమర్జెన్సీ డోర్ దగ్గరకి చేరుకున్న వరుణ్...దాన్ని తీస్తాడు.ఓపెన్ అవుతుంది కూడా కానీ,అది కాకుండా ఐరన్తో చేసిన గ్రిల్స్ వున్న సంగతి మర్చిపోతాడు.దాన్ని లాగుతాడు కానీ రాదు.గడి దగ్గర చూస్తాడు,కానీ లాక్ వేసుంటుంది.
"సేఫ్టీ ఫస్ట్ వరుణ్ గారు" పెద్ద గొంతు వినిపించగానే తల తిప్పి చూస్తాడు.
చేతిలో గొడ్డలితో ఆకలితో తన వైపు వస్తున్నా కిరణ్ని చూసి "హెల్ప్...హెల్ప్" అంటూ అరుస్తాడు వరుణ్.
"డోన్ట్ యాక్ట్ లైక్ యే ఫూల్ మిస్టర్ వరుణ్.ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్"అంటూ గొడ్డలిని గట్టిగా పట్టుకుని వరుణ్ మీదకి పరిగెడతాడు కిరణ్.
రెండు సెకండ్లలో,భయంతో కళ్ళు పెద్దవి చేసి,గట్టిగా ఊపిరి తీసుకుంటున్న వరుణ్ణి చేరి గొడ్డలితో అతని తల పైన వేయడానికి ట్రై చేస్తాడు.
"టంగ్" అని సౌండ్.
కిరణ్ మొహంలో నిరాశ.గొడ్డలి వేటు తలుపు పైన పడుతుంది.
కొంచెం దగ్గరలో తప్పించుకున్న వరుణ్ బెడ్ రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ వేసుకుంటాడు.ఫోన్ కోసం హడావిడిగా వెతుకుతాడు.
ఇంతలో తన ఫోన్ రింగ్ వినిపిస్తుంది..డోర్ కి అటువైపు నుంచి.
"హౌస్...మాట్లాడతారా?" అని అడుగుతాడు కిరణ్.
కాసేపు సైలెన్స్...
గొడ్డలిని ఫ్లోర్ మీదా ఈడుస్తున్న సౌండ్ వినపడుతుంది..
"మాట్లాడరా?..." అంటాడు కిరణ్.
మళ్ళీ సైలెన్స్...
రాయిలా నిలబడిపోయి,తనకే తెలీకుండా వణుకుతున్న చేతులతో స్క్రూడ్రైవర్ పట్టుకుని నిలబడతాడు వరుణ్.
"మీ ఇష్టం.." అని జాలిగా అంటాడు కిరణ్.
మరో సెకండ్లో బెడ్రూమ్ డోర్ పైన గొడ్డలితో వేటు చేస్తాడు.
అరగంట తర్వాత,
ఫ్లోర్ పైన వున్న రక్తాన్ని తుడిచి...
ఒక ప్లాస్టిక్ కవర్ని ఫ్రిడ్జ్ లో పెట్టి....
నీళ్ళు తాగి, పడుకుని నిద్రపోతాడు కిరణ్.
****
(ప్రస్తుతం)
"ఏమైంది?" అని కంగారుగా అడుగుతుంది S.I.పూజిత.
ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా వున్న బాడీ పార్ట్ లను చూపిస్తాడు కానిస్టేబుల్.
అది చూసి కంగారులో చెమటలు పట్టేస్తాయి S.I.పూజిత కి ,మెల్లగా ఆలోచించడం మొదలుపెడుతుంది.
"అంటే వరుణ్ ప్రాణాలతో లేడన్నామాట " అని మనసులో అనుకుంటుంది.
వెంటనే, వాడిని పట్టుకోమని కానిస్టేబుల్ తో చెప్తుంది.
కిరణ్ వాళ్ళ నుంచి తప్పిచుకోవాలని చూస్తాడు,అందర్నీ దోసేస్తూ పారిపోదామని ట్రై చేస్తాడు.
అందర్నీ కొట్టి పారిపోతున్న కిరణ్ని పట్టుకోడానికి తన గన్ తీసి కిరణ్ బుజం మీద షూట్ చేస్తుంది.
తనని అరెస్ట్ చేసి సెల్లో పడేస్తుంది.
తన గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేసి కేస్ రిపోర్ట్ రెడీ చేసి యస్.పి కి సబ్మిట్ చేయడానికి రెడీ అవుతుంది.
*****
(కిరణ్ని అరెస్ట్ చేసిన
రెండు రోజుల తరువాత.....)
"కిరణ్.
వయసు 24
తెలుగుగంగ కాలనీ లోని అపార్టుమెంట్లో వాచ్మెన్గా పని చేస్తూ ఉంటాడు.
ఇతను ఒక సైకో.
తిరుపతి నుండి నెల్లూరు వెళ్ళే లాస్ట్ బస్సు కి ఎక్కుతాడు.నాన్ లోకల్ వాళ్ళతో మంచిగా మాట్లాడి పరిచయం చేసుకుంటాడు.నెల్లూరులో దిగగానే తన ఇంటికి రమ్మని పిలుస్తాడు.
వచ్చిన వాళ్ళని గొడ్డలితో నరికి చంపుతాడు.వాళ్ళ బాడీలని ముక్కలు ముక్కలుగా చేసి వండుకుని తింటాడు." అని S.I.పూజిత ,యస్.పి కి కేస్ రిపోర్ట్ చెబుతూ ఉండగా అరెస్ట్ అయ్యి సెల్ లోపల కూర్చున్న కిరణ్ ప్రశాంతంగా నవ్వుతూ చూస్తుంటాడు.
***** ది ఎండ్ *****