PVV Satyanarayana

Crime

5.0  

PVV Satyanarayana

Crime

కుడి ఎడమైతే…

కుడి ఎడమైతే…

8 mins
273


కుడి ఎడమైతే…

రచనః తిరుమలశ్రీ

***

     ఆ భవంతి పేరు ‘లక్ష్మీనిలయం’. అందులో డెబ్బయ్యేళ్ళ పురుషోత్తమరావు, అరవై అయిదేళ్ళ లక్ష్మీదేవి, ఆరేళ్ళ మనవరాలు ‘గుడ్డీ’ ఉంటారు. పురుషోత్తమరావు బిజినెస్ లో బాగా ఆర్జించాడు… లక్ష్మీదేవి సన్నగా వుంటుంది. సమానమైన ఎత్తు. చామనచాయ. పైపెదవికి ఎడమవైపున పెసరగింజంత పుట్టుమచ్చ ఉంటుంది. ’గుడ్డీ’ బార్బీ డాల్ లా ముద్దుగా ఉంటుంది. కాన్వెంట్ లో సెకండ్ క్లాసు చదువుతోంది…మూడేళ్ళ క్రితం కొడుకు, కోడలూ కారు యాక్సిడెంటులో పోవడంతో, మనవరాలి బాధ్యత వారిపైన పడింది.

పాపను చూసుకోవడానికి సులోచన ఆయాగా నియమించబడింది. ముప్పయ్ అయిదేళ్ళుంటాయి ఆమెకు. ఔట్ హౌస్ లో ఉంటుంది. పాపను బాగా చూసుకుంటుంది. అక్కడ చేరిన కొద్ది కాలంలోనే వారికి తలలో నాలుక అయిపోయింది…సులోచన తమ్ముడు శ్రీహరి ఆమధ్యే దుబాయ్ నుండి తిరిగొచ్చాడు. అక్కతోనే ఉంటున్నాడు…..

ఆ రోజు ‘లక్ష్మీనిలయం’ లో భయంకర నిశ్శబ్దం అలముకుంది. కారణం - కోటిరూపాయల విలువచేసే వజ్రాలహారం మాయమయింది…!

శనివారం రాత్రి ఓ ముఖ్యమైన పార్టీకి వెళ్ళొచ్చారు పురుషోత్తమరావు, లక్ష్మీదేవి. పార్టీకోసం బ్యాంక్ లాకర్లో ఉంచిన వజ్రాలహారాన్ని తెచ్చి ధరించింది లక్ష్మీదేవి. తిరిగివచ్చాక దాన్ని బీరువాలో పెట్టింది. సోమవారం దాన్ని తీసుకువెళ్ళి బ్యాంక్ లాకర్లో పెట్టేయవచ్చునని చూస్తే కనిపించలేదు!!

ఆ ఇంట్లో పైవాళ్ళు సులోచన, ఆమె తమ్ముడూను. కానీ, వారిని అనుమానించలేకపోతున్నారు దంపతులు. ఆ హారం ఇన్ ష్యూర్ చేయబడింది. క్లెయిమ్ సబ్మిట్ చేయాలంటే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వకతప్పదు.

క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ లావణ్యకు ఇరవయ్ ఎనిమిదేళ్ళుంటాయి. పేరుకు తగ్గట్టే లావణ్యం ఆమె సొంతం…వజ్రాలహారం చోరీ గురించి ఫిర్యాదు అందగానే తన సిబ్బందితో లక్ష్మీనిలయానికి వెళ్ళిందామె,

భవనమంతా తిరిగి క్లూస్ కోసం వెదికింది. సులోచన ఉంటున్న ఔట్ హౌస్ నీ, పరిసరాలనూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇంటి బైట పాసేజ్ లో సగం కాల్చిపడేసిన సిగరెట్ కనిపించింది. చేతిరుమాలుతో దాన్ని తీసి జేబులో వేసుకుందామె.

వజ్రాలహారం పెట్టబడినట్టు చెబుతూన్న బీరువాని, అరనూ ఫోటోలు తీసింది, వాటిపైనున్న వ్రేలిముద్రలను సేకరించింది. అలాగే ఆ ఇంట్లోని వ్యక్తులందరి వ్రేలిముద్రలూ తీసుకుంది… అనంతరం ఒక్కొక్కరినే విచారించడానికి పూనుకుంది.

#

సులోచన సుమారు ఏడాదిగా పనిచేస్తోందనీ, చాలా నమ్మకస్తురాలనీ చెప్పింది లక్ష్మీదేవి. శ్రీహరి గురించి కూడా మంచిగానే చెప్పింది…పురుషోత్తమరావు భార్య అభిప్రాయాన్ని బలపరచాడు…ఒంట్లో బావుండకపోవడంతో ఆదివారం రాత్రి తాను నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నట్టు చెప్పింది లక్ష్మీదేవి.

“పురుషోత్తమరావు గారూ! ఇన్ ష్యూరెన్స్ మనీ కోసం ఆ హారాన్ని దాచేసి చోరీ జరిగిందని చెప్పడంలేదు కదూ మీరు?” సూటిగా అడిగింది లావణ్య

హర్టయినట్టు చూసాడు అతను. “ఇన్స్ పెక్టర్! కోట్ల ఆస్థి కల నేను కేవలం కోటిరూపాయల కోసం కక్కుర్తిపడతాననుకున్నారా?” అన్నాడు నిష్ఠూరంగా.

“సారీ! ఇది కేవలం వృత్తిపరంగా వేసిన ప్రశ్నే తప్ప, మీ నిజాయితీనీ శంకించడం నా ఉద్దేశ్యం కాదు” అందామె.

తనకు స్మోక్ చేయడం అలవాటు లేదనీ, ఆదివారం రోజున ఇంటికి విజిటర్స్ ఎవరూ రాలేదనీ చెప్పాడు అతను.

తరువాత సులోచనను విచారించింది లావణ్య…చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సులోచన, ఆమె తమ్ముడు శ్రీహరీ బంధువుల దగ్గర పెరిగారు. ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ వరకూ చదువుకున్నారు. సులోచన కొంతకాలం ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్ గా పనిచేసింది. ఏడాది క్రితం ఎవరో సిఫారసు చేయగా, గుడ్డీకి ఆయాగా చేరింది. పురుషోత్తమరావు, లక్శ్మీదేవీ తనను స్వంతమనిషిలా చూసుకుంటారని చెప్పింది…శ్రీహరి స్నేహితులతో కలసి దుబాయ్ వెళ్ళాడు. రెండేళ్ళ తరువాత ఇటీవలే తిరిగివచ్చాడు.

శనివారం రోజున లక్ష్మీదేవి వజ్రాలహారాన్ని మెళ్ళో వేసుకుని పార్టీకి వెళ్ళడం తాను చూసానంది సులోచన. వాళ్ళు పార్టీనుండి తిరిగిరావడం కానీ, హారాన్ని బీరువాలో పెట్టడం కానీ తనకు తెలియదంది. తనకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరనీ, ఆదివారం తన గదికి ఎవరూ రాలేదనీ చెప్పిందామె…తన అనుమతి లేకుండా ఊరు విడచి వెళ్ళొద్దని సులోచనతో చెప్పింది ఇన్స్ పెక్టర్.

శ్రీహరి ఇంటరాగేషన్లో కొత్త విషయాలేవీ తెలియలేదు. ‘తాను అసలు ఆ వజ్రాల హారాన్నే చూళ్ళేదని చెప్పాడతను. అతను స్మోక్ చేస్తాడని తెలుసుకుని, పాసేజ్ లో దొరికిన సిగరెట్ పీకను చూపించింది. అది తనది కాదనీ, తాను ‘చార్మినార్’ బ్రాండే వాడతానని చెప్పాడు… దుబాయ్ లో ఉన్నప్పటి అతని వివరాలను, చిరునామానూ అడిగి నోట్ చేసుకుంది లావణ్య. తన అనుమతి లేకుండా ఊరు విడచి వెళ్ళొద్దని చెప్పింది.

ఆ ఇంటికి సంబంధించినంత వరకు ఆ ఐదుగురితోపాటు కారు డ్రైవర్ నూకరాజు, మెయిన్ గేట్ దగ్గర త్రీ షిఫ్ట్ లలో పనిచేసే ముగ్గురు వాచ్ మెన్ కూడా ఉన్నారు…నూకరాజుకు పాతికేళ్ళుంటాయి. ఆర్నెల్ల క్రితమే చేరాడు. ‘వెల్-డిసిప్లిన్డ్’ అంటూ కితాబు ఇచ్చాడు పురుషోత్తమరావు. నూకరాజు ఆదివారం నుండి మూడురోజులు సెలవు తీసుకున్నాడు. కనుక అనుమానితుల జాబితానుండి అతన్ని తొలగించింది లావణ్య.

వాచ్ మెన్ పేర్లు – పరమేశం, కొండలరావు, రాజయ్య. షిఫ్ట్ టైమింగ్స్ …8 am-4 pm, 4 pm-మిడ్ నైట్, మిడ్ నైట్-8 am. ప్రతి ఆదివారమూ షిఫ్ట్స్ మారతాయి.

ఫస్ట్ షిఫ్ట్ వాచ్ మేన్ రాజయ్య ద్వారా తెలిసిన సమాచారం ఇది - ‘ముందురోజు మధ్యాహ్నం లక్ష్మీదేవి చెల్లెలి కొడుకు శంకరం ఆ ఇంటికి వచ్చి వెళ్ళాడు. నలభయ్యేళ్ళ శంకరం అప్పుడప్పుడు హీరో హోండా మీద వస్తూంటాడు. ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి, అరగంట తరువాత తిరిగి వెళ్ళిపోయాడు’.

తిరిగి ఇంట్లోకి వెళ్ళింది లావణ్య. “లక్శ్మీదేవి గారూ! నిన్న మీ ఇంటికి మీ నెవ్యూ శంకరం వచ్చి వెళ్ళినట్టు ఎందుకు చెప్పలేదు?” అనడిగింది.

 “నిజంగానే మాకు తెలియదు. మధ్యాహ్నం భోజనం చేసాక నిద్రపోయి సాయంత్రం నాలుగున్నరకు లేచాం మేము” అందావిడ. “గుడ్డీ కూడా నా పక్కలోనే పడుకుంది” అంటూ, పాపను పిలిచి అడిగింది. శంకరం అంకుల్ రాలేదంది గుడ్డీ.

సెల్ లో శంకరం కి ఫోన్ చేసింది లక్ష్మీదేవి. రెస్పాన్స్ లేదు. శంకరం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడనీ, అతని ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేననీ, అప్పుడప్పుడు వచ్చి తమను పరామర్శిస్తుంటాడనీ చెప్పిందావిడ.

“శంకరం అరగంటసేపు ఇక్కడే ఉన్నాడు. ఆ సమయంలో బీరువా తెరచి హారం తస్కరించడం కష్టం కాదుగా?” ప్రశ్నించింది లావణ్య. అతను అలాంటివాడు కాదన్నారు దంపతు లిద్దరూ ముక్తకంఠంతో.

#

సెకండ్ షిఫ్ట్ వాచ్ మేన్ పరమేశానికి యాభయ్యేళ్ళుంటాయి. ఎక్స్-సర్వీస్ మేన్. తన షిఫ్ట్ లో ఎవరూ ఇంటికి రాలేదని చెప్పాడు.

థర్డ్ షిఫ్ట్ వాచ్ మేన్ కొండలరావుకు నలభయ్ ఐదేళ్ళుంటాయి. “నిన్న సాయంత్రం నుండీ నా భార్యకు జ్వరం. అందువల్ల రాత్రి డ్యూటీ ఎక్కిన అరగంటకు ఇంటికి వచ్చేసాను, మేడమ్! ఆ సమయంలో ఎదురింటి వాచ్ మేన్ ఏడుకొండలిని చూసుకోమని చెప్పాను. పదకొండు గంటలకు తిరిగి వెళ్ళాను,” చెప్పాడు. ఏడుకొండలు మంచివాడేననీ, తమ మధ్య అప్పుడప్పుడు అలాంటి అడ్జెస్ట్ మెంట్స్ మామూలేననీ చెప్పాడు.

అనంతరం ఏడుకొండల్ని ప్రశ్నించిన ఇన్స్ పెక్టర్ కి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి…ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పురుషోత్తమరావు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ కారులో బైటకు వెళ్ళాడు…అతను వెళ్ళిన కాసేపటికి సులోచన ఆటోలో ఎక్కడికో వెళ్ళింది. పురుషోత్తమరావు రాకముందే, వెళ్ళిన ఆటోలోనే తిరిగి వచ్చేసింది…పురుషోత్తమరావు తిరిగి వచ్చిన కొన్ని నిముషాలకు శ్రీహరి బైటకు వెళ్ళాడు. ఎప్పుడు తిరిగొచ్చాడో తెలియదు…అలవాటు ప్రకారం సులోచన వెళ్ళొచ్చిన ఆటో నంబర్ ని చూసిన ఏడుకొండలు, లావణ్య అడగడంతో గుర్తుచేసుకుని చెప్పాడు…

ఆ ఆటోని పట్టుకుని, ఆదివారం రాత్రి సులోచన ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్న లావణ్య ఆశ్చర్యానికి మేరలేకపోయింది.

#

మర్నాడు మధ్యాహ్నం ఇన్స్ పెక్టర్ ‘లక్ష్మీనిలయానికి’ వెళ్ళేసరికి పురుషోత్తమరావు ఇంటివద్ద లేడు. లక్ష్మీదేవి కునుకు తీస్తోంది. గుడ్డీ తన గదిలో ఆడుకుంటోంది.

“గుడ్ ఆఫ్టర్ నూన్, ఆంటీ!” అంటూ ఎసురొచ్చిన గుడ్డీని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది లావణ్య. పాప గదిలో కూర్చున్నారిద్దరూ. పాప తన స్కూల్ కబుర్లూ, ఫ్రెండ్స్ గురించీ గలగలా మాట్లాడేస్తూంటే, మురిపెంగా చూసింది లావణ్య. ఆల్బమ్ ఒకటి తెచ్చి చూపిస్తూ, “ఈ ఫొటోలన్నీ నేనే తీసాను, ఆంటీ!” అంది పాప. పెర్ఫెక్ట్ గా వచ్చిన ఆ ఫోటోలను చూస్తూంటే, ఆరేళ్ళ ఆ చిన్నారి ట్యాలెంట్ కి ఆశ్చర్యపోయిందామె. పాప తన కెమేరా తెచ్చి చూపించింది. ఫారిన్-మేడ్ హై-డెఫినిషన్ మినీ కెమేరా అది. ఫోటోలో డేటు, టైమూ కూడా పడతాయి.

లావణ్య చూపులు ఆల్బమ్ లోని లక్ష్మీదేవి ఫొటో మీద పడ్డాయి…గదిలో బీరువా దగ్గర నిలుచుని ఉందావిడ. వజ్రాలహారం దాచిన బీరువా అది. ఫొటో మీద ఆ ఆదివారపు తేదీ, రాత్రి తొమ్మిదింబావు సమయమూ ప్రింట్ అయ్యాయి. ఆవిడ పైపెదవి మీద ఎడమభాగంలో స్పష్టంగా కనిపిస్తూన్న పుట్టుమచ్చ ఫొటోగ్రఫీలో గుడ్డూకి ఉన్న నైపుణ్యతను చాటుతోంది.

“నాన్నమ్మకు ఫొటో తీయించుకోవడం ఇష్టం ఉండదు. ఆ రాత్రి తాను బీరువాను తెరుస్తూండగా, ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించిన తన రూపాన్ని తనకు తెలియకుండా క్లిక్ చేసేసాను” అంది గుడ్డీ నవ్వుతూ. “గుడ్ వర్క్!” అని మెచ్చుకుంది లావణ్య. “ఫొటో బావుంది. దీన్ని నేను తీసుకోనా?” అనడిగింది. “నా దగ్గర ఇంకో కాపీ ఉంది” అంటూ, దాన్ని తీసిచ్చింది గుడ్డీ.

తనకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ లో ప్రైజులు వచ్చాయంటూ, ఆ ప్రైజులను, తాను వేసిన వేషాల ఫొటోలనూ ఉత్సాహంగా చూపించింది గుడ్డీ. తనను సులోచన ఆంటీ తయారుచేసేదని చెప్పింది.

లక్ష్మీదేవి నిద్రలేవడంతో హాల్లోకి వెళ్ళింది లావణ్య. ఆవిడ ఇచ్చిన కాఫీ త్రాగుతూంటే, పురుషోత్తమరావు కూడా వచ్చాడు. “హారం ఆచూకీ ఏమైనా తెలిసిందా?” అనడిగాడు.

లేదనీ, కొన్ని క్లారిఫికేషన్స్ కోసం వచ్చాననీ చెప్పింది లావణ్య. ఇద్దరూ స్టడీరూమ్ లో కూర్చున్నారు… ఆదివారం రాత్రి లక్ష్మీదేవి నిద్రమాత్రలు తీసుకున్న విషయం ప్రస్తావించింది ఆమె. తానే భార్యకు పిల్స్ ఇచ్చినట్టూ, ఆమె వాటిని మ్రింగి మంచినీళ్ళు త్రాగి పడుకున్నట్టూ చెప్పాడు అతను.

“ఆదివారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళారు మీరు?” హఠాత్తుగా ప్రశ్నించిందామె.

ఆమె వంక ఆశ్చర్యంగా చూసాడతను. “ఆ విషయం మీకెలా తెలిసింది?” అనడిగాడు. నవ్విందామె. “నేను ఓ పోలీస్ ఆఫీసర్ని అని మరచిపోకండి” అంది.

‘పురుషోత్తమరావు తమ్ముడి కుటుంబం ఆ ఊళ్ళోనే ఉంటోంది. ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఆ కుటుంబాన్ని భార్యకు తెలియకుండా ఆదుకుంటున్నాడు అతను. ఆరోజు రాత్రి మరదలికి మెడికల్ ఎమెర్జెన్సీ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి, తమ్ముడు అతనికి ఫోన్ చేసాడు. పురుషోత్తమరావు వెళ్ళి కొంత డబ్బు ఇచ్చివచ్చాడు…’

“కారణాంతరాలవల్ల మా కుటుంబాల మధ్య సఖ్యత లోపించింది. తమ్ముడి కుటుంబానికి సాయంచేయడం నా భార్యకు ఇష్టముండదు. అందుకే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాను,” అన్నాడు పురుషోత్తమరావు. అతని తమ్ముడి వివరాలు, హాస్పిటల్ పేరు అడిగి నోట్ చేసుకుందామె.

తరువాత లక్ష్మీదేవిని పిలిచింది లావణ్య. “మీకు నిద్రలో లేచి తిరిగే అలవాటుందా?” అనడిగింది. లేదన్నదావిడ.

“ఆదివారంరోజు రాత్రి నిద్రమాత్రలు వేసుకుని పడుకుని, మర్నాడు తెల్లవారేంత వరకు లేవలేదన్నారు మీరు. కానీ, అదే రాత్రి తొమ్మిదింబావుకు హారం దాచిన బీరువాను ఎలా తెరచారు?” ఆవిడ ముఖకవళికలను గమనిస్తూ అడిగింది లావణ్య. “మీరు బీరువా తెరుస్తూండగా తీయబడ్డ ఫొటో నా వద్ద ఉంది”.

ఆశ్చర్యంగా చూసిందావిడ. “నా కొడుకు, కోడలూ పోయాక నేను ఫొటో దిగడం మానేసాను. ఎందుకంటే, మేమెంతో ముచ్చటపడి ఫ్యామిలీ అంతా స్టూడియోకి వెళ్ళి ఫొటో తీయించుకున్న మూడోరోజునే ఆ ప్రమాదం జరిగింది” బాధగా అందావిడ. “కనుక నా ఫొటో మీదగ్గర ఉందంటే నేను నమ్మను”. గుడ్డీ తీసిన ఫొటోని ఆవిడకు చూపించలేదు లావణ్య.

అక్కడనుండి ఔట్ హౌస్ కి వెళ్ళింది ఇన్స్ పెక్టర్. సులోచన ఇంట్లోనే ఉంది. శ్రీహరి బైటకు వెళ్ళాడంది. “అమ్మగారి హారం ఆచూకీ ఏదైనా తెలిసిందా, మేడమ్?” అనడిగింది.

“ఇంకా లేదు. ప్రతి నేరస్థుడూ ఏదో ఒక పొరపాటు చేయకమానడు. అది చిన్నదైనా సరే. ఆ పొరపాటు కోసమే గాలిస్తున్నాను” అంది లావణ్య. “అన్నట్టు, పురుషోత్తమరావు గారి డ్రైవర్ ఎలాంటివాడు?”.

మంచివాడేననీ, తన పనేదో తనదేకానీ, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోడనీ చెప్పింది సులోచన…లావణ్య శ్రీహరి కోసం వెయిట్ చేయలేదు. అతని గురించి ఆల్రెడీ విచారించింది. దుబాయ్ లో ఓ గొడౌన్లో పనిచేసేవాడతను. యజమాని సక్రమంగా జీతం చెల్లించకుండా ఎక్స్ ప్లాయిట్ చేస్తూండడంతో, ఇండియాకి తిరిగివచ్చేసాడు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదు…ఆదివారం రాత్రి పక్కవీధిలో చివరగా ఉన్న ఇంటికి వెళ్ళాడతను. ఆ ఇంట్లోని సర్వెంట్ మెయిడ్ తో అతనికి అక్రమ సంబంధం ఉంది. అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకుంటూంటారు ఇద్దరూ.

తమ్ముడి గురించి పురుషోత్తమరావు చెప్పింది నిజమేనని విచారణలో నిర్ధారణ చేసుకుంది లావణ్య… శంకరం ఆదివారం రోజున తాను లక్ష్మీనిలయానికి వెళ్ళినట్టూ, అందరూ పడుకోవడంతో కాసేపుండి తిరిగివెళ్ళిపోయినట్టూ చెప్పాడు. సిగరెట్ కాలుస్తూ హాల్లోనే కూర్చున్నాడనీ, హారం సంగతీ తనకు తెలియదనీ చెప్పాడు. వెళ్ళిపోతూ కాలుస్తూన్న సిగరెట్ ని ఆర్పేసి కిటికీలోంచి బైటకు విసిరేసినట్టు చెప్పి, ఇన్స్ పెక్టర్ చూపించిన సిగరెట్ పీక తనదేనని ఒప్పుకున్నాడు.

#

లావణ్యకు పాతసినిమా పాటలంటే ఇష్టం. ఇంట్లో - రికార్డర్ లో వస్తూన్న దేవదాసు సినిమాలోని పాటలు వింటూ, కేసు పేపర్స్ ని స్టడీ చేస్తోంది.

‘జగమే మాయా…’ పాట అయిపోగానే, ‘కుడి ఎడమైతే…పొరపాటు లేదోయ్…’ మొదలయింది.

తన్మయత్వంతో ఆలకిస్తూన్న లావణ్య, ఉన్నట్టుండి ఉలికిపడింది. హఠాత్తుగా గుడ్డీ చెప్పిన విషయం ఒకటి స్ఫురణకు వచ్చింది. ‘ఎస్! ఈ కేసులో నేను ఎదురుచూస్తూన్న బ్రేక్ త్రూ ఇదే!’ అనుకుంటూ చటుక్కున లేచి కూర్చుంది.

#

తిన్నగా గుడ్డీ గదిలోకి వెళుతూన్న ఇన్స్ పెక్టర్ని చూసి విస్తుపోయారు పురుషోత్తమరావు, లక్ష్మీదేవిలు. “గుడ్డీ! ఆ రోజు నువ్వు తీసిన నాన్నమ్మ ఫొటో మిర్రర్ ఇమేజ్ అన్నావు కదూ?” అనడిగింది లావణ్య. ఔనంది ఆ పిల్ల.

లక్ష్మీదేవిని బీరువా వద్ద గుడ్డీ చెప్పిన విధంగా నిలుచోమంది లావణ్య. తాను గుడ్డీ గదిలో నిలుచుని చూసింది. నిలువుటద్దంలో ఆవిడ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. హుషారుగా గుడ్డీ బుగ్గమీద ముద్దాడింది.

#

రాత్రి తొమ్మిది గంటలకు మల్కాజ్ గిరి లోని ఓ ఇంట్లోంచి బైటకు వచ్చారు ఓ యువతి, యువకుడూను. పైటచెంగు ముఖానికి కప్పుకుందామె. అతని తలమీద ఫెల్ట్ హ్యాట్ ఉంది. చేతిలో ట్రావెల్ బ్యాగ్ ఉంది. ఓ పాత అంబాసడర్ కారులో కూర్చున్నారు. అతను డ్తైవ్ చేస్తూంటే, ఆమె అతని పక్కను కూర్చుంది… కారు సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ని చేరుకోగానే దిగి స్టేషన్ లోకి వెళ్ళారు వాళ్ళు. క్లోక్ రూమ్ కి వెళ్ళి రశీదు ఇచ్చి, చిన్న బ్రీఫ్ కేసు ఒకటి తీసుకున్నారు. అనంతరం కదలడానికి సిద్ధంగా ఉన్న నరసాపూర్ ఎక్స్ ప్రెస్ ని ఎక్కబోయారు.

వెనుకనుండి ఎవరో చేయి పట్టుకుని లాగుతున్నట్టనిపించి తిరిగిచూసిన ఆ యువకుడు, మఫ్టీలో ఉన్న ఇన్స్ పెక్టర్ లావణ్యను చూసి ఖంగుతిన్నాడు. అతను పారిపోబోతూంటే, చేతిని చాకులా బిగించి అతని మెడపైన కొట్టింది లావణ్య. గిలగిలలాడుతూ నేలను కరచాడు అతను.

ఆమె, అతని చేతిలోని బ్రీఫ్ కేసును లాక్కుని, ప్లెయిన్ క్లోత్స్ లో ఉన్న తన మనుషులకు సైగచేయడంతో, అతనికి అరదండాలు తగిలించడమే కాక, ఆ యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

పెట్టె తెరచి చూసిన లావణ్య కన్నులు మెరిసాయి.

2

‘లక్ష్మీనిలయం’ లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది ఇన్స్ పెక్టర్ లావణ్య. వజ్రాలహారంతోపాటు నేరస్థులను కూడా హాజరుపరచింది.

“దురాశ బహుచెడ్డది. సులోచన నిజాయితీపరురాలే ఐనా డ్రైవర్ నూకరాజు ప్రోద్బలంతో ఆ చోరీకి పూనుకుంది. గతరాత్రి ఇద్దరూ వజ్రాలహారంతో ఉడాయించబోతూంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది” అంది లావణ్య.

“అసలు మీ అనుమానం సులోచనపైకి ఎలా వచ్చింది?” ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తమరావు.

‘ఆదివారం రాత్రి లక్ష్మీదేవి నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయింది. కానీ, అదే రాత్రి తొమ్మిదింబావుకు ఆవిడ హారాన్ని దాచిన బీరువాను తెరుస్తూండగా అద్దంలో చూసి ఫొటో తీసింది గుడ్డీ… ఒడ్డూ పొడవూ ఇంచుమించు లక్ష్మీదేవి లాగే ఉంటుంది సులోచన. ఎవరికీ అనుమానం రాకుండా ఆవిడలా వేషం వేసుకుంది. పెదవి మీది పుట్టుమచ్చను దిద్దుకోవడం కూడా మరచిపోలేదు. బీరువా తాళపుచెవులు లక్ష్మీదేవి తలగడ క్రింద ఉంటాయన్న సంగతి ఆమె ఎరుగును. తాళపుచేతులను సంగ్రహించి బీరువా తెరచి హారాన్ని దొంగిలించింది. తరువాత వేషం మార్చుకుని దాన్ని తీసుకువెళ్ళి నూకరాజుకు ఇచ్చి వచ్చింది… అతని వలపులో చిక్కుకున్న సులోచన అయిష్టంగానే అతని పథకాన్ని అమలుపరచింది…’

“కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్…అన్నాడు ఓ సినీకవి. కానీ అది ఘోరమైన పొరపాటని ఈ కేసు నిరూపించింది…గుడ్డీ తీసిన ఫొటో నా పరిశోధనలో అత్యంత కీలకమైన క్లూ అయింది…నేరం చేసే సమయంలో ఆ వ్యక్తి యొక్క మానసికస్థితి నార్మల్ గా ఉండదు. అందువల్ల ఏదో ఒక పొరపాటు చేయకమానడు. సులోచన విషయంలోనూ అదే జరిగింది…” చెప్పింది లావణ్య. “పుట్టుమచ్చను ఎడమ వైపుకు బదులు కుడివైపు పెట్టుకుందామె. అందుకే అద్దంలో అది ఎడమవైపు కనిపించింది. అదే ఆమెను పట్టిచ్చింది…అండ్ ద క్రెడిట్ గోస్ టూ ద లిటిల్ గుడ్డీ!”.

హాల్లో చప్పెట్లు మార్మ్రోగుతూంటే…సులోచన ఖిన్నవదనంతో తల వంచుకుంది.

                                                        *******


Rate this content
Log in

Similar telugu story from Crime