అందరూ దొంగలే!
అందరూ దొంగలే!
అందరూ దొంగలే!
రచనః తిరుమలశ్రీ
***
ఉదయం పదిన్నర గంటలు అవుతోంది.
మందవల్లిలో సిటీబస్ దిగింది ఓ నడివయస్కురాలు. ఛుడీదారు, కుర్తా ధరించి, పైన చున్నీ వేసుకుంది. చేతిలో ఓ బ్రౌన్ కలర్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాన్ని చున్నీతో కప్పుకుంది.
ఎప్పటిలాగే మందవల్లి వీధులు రద్దీగా ఉన్నాయి. విండో షాపింగ్ చేసుకుంటూ మైలాపూర్ వైపు నడవసాగింది ఆమె. సాధారణంగా స్త్రీలు తమ హ్యాండ్ బ్యాగ్స్ ని అందరికీ కనిపించేలా పట్టుకుని తిరుగుతారు. చెంగు క్రింద దాచుకోరు.
ఆమె అతిజాగ్రతే ఝాన్సీ దృష్టిని ఆకర్షించుకుంది. ఝాన్సీ పోలీసు కుక్కలాంటిది. ఏ పర్సులో ఎంతుందో, ఏ హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో ఇట్టే పసిగట్టేస్తుంది. హ్యాండ్ బ్యాగ్ లో విలువైనదేదో ఉందనిపించింది. అంతే! ఆమెను నీడలా వెంబడించింది.
ఝాన్సీకి పాతికేళ్ళుంటాయి. చామనచాయ, అథ్లెటిక్ బాడీ. ఆకర్షణీయంగా ఉంటుంది. వైట్ లెగ్గింగ్స్ మీద ఆరెంజ్ కలర్ టాప్ తొడుక్కుంది. ఆమెను చూస్తే ‘పిక్ పాకెట్’ అనుకోరు ఎవరూను.
అనాథాశ్రమంలో పెరిగిన ఝాన్సీ టెన్త్ పాసయింది. ‘సెల్ఫ్-ఎంప్లాయ్ మెంట్’ పథకం క్రింద ఆ ‘వృత్తి’ ని ఎంచుకుంది. ఆమె దృష్టిలో దొంగిలించడం తప్పుకాదు! జేబుదొంగలు జనాన్ని దోచుకుంటే, పోలీసులు పిక్ పాకెట్స్ కష్టాన్ని దోచుకుంటారు. ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల్ని దోచుకుంటుంది. ఉన్నవాడు, లేనివాణ్ణి దోచుకుంటాడు. చివరకు, దేవుడనుకునే కృష్ణుడు సైతం ఇరుగుపొరుగుల పాలు పెరుగు వెన్నలే కాక, గోపికల వలువలను సైతం దొంగిలించేవాడు!
ఆ స్త్రీ యొక్క హ్యాండ్ బ్యాగ్ పైనే ఉన్నాయి ఝాన్సీ చూపులు. పురుషుల పోకెట్స్ నయితే ఈజీగా పిక్ చేసేది. కానీ అది హ్యాండ్ బ్యాగ్… దారిలో అదే కలరు, మోడలూ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొంది.
ఆ స్త్రీ మైలాపూర్ లోని కపాలీశ్వరర్ కోవెలకు వెళ్ళింది. ప్రవేశద్వారం వద్ద పాదరక్షలు విడవాలి. హ్యాండ్ బ్యాగ్ ని పక్కనున్న చెక్కపెట్టె మీద పెట్టి, వంగి షూస్ విప్పుకోసాగింది.
ఆ ఒక్క క్షణం చాలు ఝాన్సీకి. అత్యంత లాఘవంగా బ్యాగ్స్ ని మార్చేసింది!
రోడ్ మీదకు వచ్చి, అప్పుడే కదలబోతూన్న సిటీ బస్ ని ఎక్కేసింది ఝాన్సీ. మెరీనా బీచ్ మీదుగా ప్యారిస్ వెళుతుందది. మెరీనాకి టికెట్ తీసుకుని, మధ్యలో ఐస్ హౌస్ స్టాపులో దిగిపోయింది.
బస్ స్టాప్ ఖాళీగా ఉంది. ఓసారి అటూ ఇటూ చూసి, హ్యాండ్ బ్యాగ్ ని తెరచింది ఝాన్సీ…ఆమె కళ్ళు మెరిసాయి. అందులో – రెండువేలు, ఐదువందల రూపాయల నోట్ల దొంతర్లు ఉన్నాయి. మొత్తం ముప్పైవేల రూపాయల పైనే ఉన్నాయి. తన అదృష్టానికి మురిసిపోయింది. ఆ రాత్రి తన బాయ్ ఫ్రెండ్ ని బార్ కి తీసుకువెళ్ళాలని అప్పటికప్పుడే నిశ్చయించేసుకుంది.
హ్యాండ్ బ్యాగ్ లో ఓ ‘నవటాల్’ తాళపుచెవీ, కొన్ని విజిటింగ్ కార్డ్సూ కనిపించాయి. ఆ కార్డ్స్ అన్నీ ఒకే వ్యక్తివి. అందులో ఆమె పేరు, చిరునామా ఉన్నాయి.
‘ఆమె పేరు మహేశ్వరి, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, అడయారులో గాంధీనగర్ ఫోర్త్ మెయిన్ రోడ్ లో ఉన్న ‘సమతా అపార్ట్మెంట్స్’ లో 302 నంబరు ఫ్లాట్ లో ఉంటోంది’.
ఆ చిరునామా, తాళపుచెవీ ఝాన్సీలో కొత్త ఆలోచనలకు తెరలేపాయి…అది ఇంటి తాళపుచెవి లాగే ఉంది. ఆమె ఇంటికి తాళం వేసుకుని వచ్చిందంటే…ఒంటరిగా ఉంటోందనీ, ఇంట్లో వేరెవరూ లేరనీ అర్థమవుతోంది.
గబగబా ఆలోచించింది ఝాన్సీ…తన హ్యాండ్ బ్యాగ్ మారిపోయినట్టు మహేశ్వరి గ్రహించడానికి కొంత సమయం పడుతుంది. గుళ్ళోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చాకగాని తెలియకపోవచ్చును. ఆరోజు సోమవారం కావడంతో భక్తుల క్యూ పెద్దగానే ఉంది. దర్శనానికి చాలా టైమ్ పడుతుంది. ఆ తరువాత ఆమె టెన్షన్ పడుతూ హ్యాండ్ బ్యాగ్ ని వెదకడంలో మరికొంత సమయం తీసుకుంటుంది. ఆ లోపున తాను అడయారు వెళ్ళి ఆమె ఫ్లాట్ ని ‘చక్కబెట్టుకుని’ రావడం అసాధ్యమేమీ కాదు…వెంటనే ట్యాక్సీని పిలిచి ఎక్కేసింది.
#
అడయారులో గాంధీనగర్ ఫోర్త్ మెయిన్ రోడ్ లో ఉన్న సమతా అపార్ట్మెంట్స్ ఐదంతస్థుల బిల్డింగ్. ఫ్లాట్ నంబర్ 302 మూడవ అంతస్థులో ఉంది. లిఫ్ట్ ని ఎవాయిడ్ చేసి, వెనుక పక్కనున్న మెట్లగుండా పైకి వెళ్ళింది ఝాన్సీ.
ఆ ఫ్లాట్ కి పెద్ద నవటాల్ లాక్ వేసుంది. తన ఊహ నిజమైనందుకు సంతోషించింది ఆమె. హ్యాండ్ బ్యాగ్ లోంచి తాళపుచెవి తీసి తాళం తెరచింది. లోపల ప్రవేశించి తలుపు గెడ పెట్టేసింది…మూడు గదులు, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, బాల్కనీ తో కూడిన విశాలమైన ఫ్లాట్ అది. ఇల్లంతా తిరిగిచూసింది.
ఆలస్యం చేయకుండా పనిలోకి దిగింది. మాస్టర్ బెడ్ రూమ్ లో ఉన్న స్టీల్ బీరువా తెరచింది. అందులో వార్డ్ రోబ్ వుంది. మంచి మంచి డ్రెసెస్ ఉన్నాయి. లాకర్ కి తాళం వేసుంది. వంటింట్లోంచి సుత్తి తెచ్చి దానితో ఓ దెబ్బ వేయడంతో లాకర్ తెరచుకుంది. అందులో కనిపించిన నగలను చూడగానే ఆమె కళ్ళు జిగేలుమన్నాయి. రెండువేలు, ఐదువందల రూపాయల నోట్ల కట్టలు పలుకరించాయి….గదిలో ఉన్న బ్రీఫ్ కేసులో ఏవో కాగితాలు ఉంటే, వాటిని తీసేసి అందులో నగలూ డబ్బూ సర్దేసింది.
ఆదే సమయంలో డోర్ బెల్ మ్రోగడంతో అదిరిపడిందామె. మహేశ్వరి అంత త్వరగా తిరిగివస్తుందనుకోలేదు! గబగబా బ్రీఫ్ కేసును బెడ్ క్రిందకు త్రోసేసి, దుప్పటి కప్పేసింది.
అంతవరకూ జేబుదొంగతనాలే తప్ప, ఎప్పుడూ ఇళ్ళలో చొరబడి దోపిడీలు చేయలేదు తాను. అది తన తొలి ప్రయత్నం. ఆ సొమ్ములను వదులుకోవడం ఇష్టంలేదు. అవసరమైతే, మహేశ్వరిని ఎటాక్ చేసైనా బ్రీఫ్ కేసుతో ఉడాయించాలనుకుంది…వెళ్ళి తలుపు కొద్దిగా తెరచి చూసింది.
గుమ్మంలో - ఇద్దరు యువతులు!
ఇంచుమించు ఒకే వయసువాళ్ళు. ఇరవయ్యేళ్ళుంటాయి. జీన్స్ పాంట్స్ లో చెక్డ్ షర్ట్స్ టక్ చేసారు. ఒకామె సన్నగా పొడవుగా వుంటే, ఇంకొకామె కొంచెం ఒళ్ళు ఉండి, పొట్టిగా ఉంది.
“ఎవరు మీరు?” నొసలు చిట్లించింది ఝాన్సీ.
“మీరు బ్యాంకాక్ నుండి వచ్చారని ఆలకించాం. మేమూ త్వరలో బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాం. అందుకే మీ సలహాలు తీసుకోవడానికి వచ్చాం, మేడమ్!” అంది పొట్టిపిల్ల.
“నాకు మీతో మాట్లాడే టైమ్ లేదు. వెళ్ళండి” అంటూ తలుపు మూసుకోబోయింది ఝాన్సీ.
జబర్దస్త్ గా లోపలికి త్రోసుకువచ్చారు వాళ్ళు. ఝాన్సీ తెల్లబోయి చూస్తూంటే పొట్టిపిల్ల తలుపు మూసి గెడపెట్టేసింది. పొడుగుపిల్ల ప్యాంటు జేబులోంచి ఇనుపగూటం తీసి ఝాన్సీ తల వెనుక గట్టిగా కొట్టింది. ఝాన్సీ క్రిందపడిపోయింది.
“మహేశ్వరికి తెలివి వచ్చేలోపునే మన పని కానిచ్చేయాలే” అంటూ, ఝాన్సీని సాయంపట్టి ఓ గదిలో పడేసారు వాళ్ళు. తరువాత ఇల్లంతా తిరుగుతూంటే ఓ గదిలో డ్రింక్స్ కనిపించాయి.
‘”వావ్! ఫారిన్ సరుకే. ముందు వీటితో మజా చేసుకుందాం” అని పొట్టిపిల్ల అనడంతో, క్యాబినెట్ లోంచి డ్రింక్ బాటిల్స్, సోడా, గ్లాసులు తీసుకుని నేలపైనే చతికిలబడ్డారు
ఇద్దరూ.
ఆ యువతులు చిల్లరదొంగలు. ఇటీవల మహేశ్వరి అనే ఓ ఎన్నారై మహిళ బ్యాంకాక్ నుండి తిరిగివచ్చిందనీ…అడయారులోని సమతా అపార్ట్ మెంట్సు లో ఒంటరిగా ఉంటోందనీ…ఫారిన్ నుండి బంగారం. డబ్బూ బాగా తెచ్చిందనీ…వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూంటే ఆలకించారు వాళ్ళు. ఆ సొమ్ములను ఎలాగైనా దొంగిలించాలని నిశ్చయించుకున్నారు.
మహేశ్వరి పగటి పూట బైటకు వెళుతుందనీ, సాయంత్రానికి కానీ తిరిగిరాదనీ తెలుసుకున్నారు. తాళం పగులగొట్టి ఇంట్లో ప్రవేశించవచ్చుననుకున్నారు. కానీ, ఇంట్లో ఝాన్సీని చూసి మహేశ్వరిగా పొరపడి, ఎటాక్ చేసారు. అయితే, డ్రింక్స్ వారి బలహీనత. ‘మహేశ్వరి’ అప్పట్లో స్పృహలోకి రాదన్న ధీమాతో, డ్రింక్స్ సెషన్ వేసుకున్నారు.
#
ఆ తోడుదొంగలు మొదటి పెగ్గు నోటి దగ్గర పెట్టుకున్నారో లేదో, డోర్ బెల్ గట్టిగా మ్రోగింది.
ఉలికిపడి స్నేహితురాలి వంక చూసింది పొడుగుపిల్ల.
“మహేశ్వరి కోసం ఎవరో వచ్చుంటారు” అంది పొట్టిపిల్ల.
“మహేశ్వరి కోమాలో ఉంది కదా! ఇప్పుడు ఎలాగే?” కంగారుగా అడిగింది పొడుగుపిల్ల.
పొట్టిపిల్ల ఓ క్షణం ఆలోచించింది. “మేడమ్ ఇంట్లో లేదని చెప్పి పంపేద్దాం” అంది.
వెళ్ళి తలుపు తెరిచారు.
గుమ్మంలో ఓ మహిళ. ముప్పయ్ అయిదేళ్ళుంటాయి. చిరుబొజ్జ ఉంది. ఖాకీ రంగు చీరలో ఉంది.
“మేడమ్ ఇంట్లో లేరు” అంది పొట్టిపిల్ల, ఆమె అడక్కుండానే.
“యార్ నీంగే?” అరవంలో అడిగిందామె.
“మహేశ్వరి మేనకోడళ్ళం” తోచిందేదో చెప్పేసింది పొట్టిపిల్ల. స్నేహితురాలి వంక ఆశ్చర్యంగా చూసింది పొడుగుపిల్ల. “మీరెవరు?”
“ఇం పేర్ తంగం. సైదాపేట పోలీస్ స్టేషన్ ఎ.ఎస్సయ్ ని” చెప్పిందామె.
స్నేహితురాళ్ళు ఉలిక్కిపడ్డారు. “నిజంగా మీరు పోలీసేనా?” అడిగింది పొట్టిపిల్ల.
“ఇన్నోడె ఐ.డి. పాకరియా?” అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరవబోయిందామె.
“వేండిదిల్లై. మీ ఆకారమే మీ ఐడెంటిటీ. ఈ వయసులోనే బొజ్జ వచ్చిందంటే…మీరు ఖండిపా పోలీసే దా అయ్యుండాలి!” అంది పొట్టిపిల్ల. పొడుగుపిల్ల కిసుక్కున నవ్వింది.
ఆ మహిళ కోపంగా చూసింది. “ఇన్నికి ఉదయం సైదాపేట రైల్వే స్టేషన్ కిట్టే పార్క్ చేసిన కారులోంచి తన హ్యాండ్ బ్యాగ్ ని యారో దొంగిలించారంటూ…మహేశ్వరి మేడమ్ మా పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ కుడతాంగ. ఆ దర్యాప్తు సందర్భంగా ఆవిడతో పేసరదికి వందిటే” అందామె, తెలుగు- అరవం కలిపి మాట్లాడేస్తూ. “సాయంత్రం రండి” అనేసి తలుపు మూసేయబోయింది పొట్టిపిల్ల.
ఆ మహిళ వాళ్ళను త్రోసుకుని, లోపలికి వచ్చింది. “ఇంద వెయ్యిల్లో మళ్ళీ ఏం వెళ్ళొస్తాను! మీ ఆంటీ వచ్చేంతవరకు ఇంగెదా వెయిట్ పన్రే” అంటూ సోఫాలో చతికిలబడింది.
ప్యానిక్ అయిన స్నేహితురాళ్ళు కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. ఎ.ఎస్సయ్ చూపులతోనే హాలంతా పరికిస్తూంటే, పొడుగుపిల్ల ఝాన్సీని కొట్టినట్టే వెనుక నుండి ఆమె తల వెనుక ఇనుపగూటంతో గట్టిగా కొట్టింది. ఆమె తల వాల్చేసి పక్కకు ఒరిగిపోయింది.
స్నేహితురాళ్ళు తలుపుకు గెడ పెట్టేసి, ఆమెను గదిలోకి ఈడ్చుకువెళ్ళి ఝాన్సీ పక్కను పడేసారు.
అనంతరం తమ డ్రింక్ సెషన్ ని రెజ్యూమ్ చేసారు చీర్స్ చెప్పుకుంటూ.
#
ఝాన్సీకి హఠాత్తుగా స్పృహ వచ్చింది. పక్కనే ఓ మహిళ పడివుంది. పక్క గదిలోంచి అమ్మాయిల గొంతుకలు ముద్దముద్దగా వినవస్తున్నాయి.
మెల్లగా లేచి అటువైపు వెళ్ళింది. ఆ యువతులు ఇద్దరూ నేలపైనే కూర్చుని డ్రింక్ చేస్తున్నారు. ఆ గది తలుపు మూసి బైట గెడ పెట్టేసింది ఝాన్సీ. వాళ్ళ అరుపులను పట్టించుకోకుండా మాస్టర్ బెడ్ రూమ్ కి వెళ్ళి బ్రీఫ్ కేస్ తీసుకుని గుమ్మం వైపు పరుగెత్తింది.
తలుపు తెరవగానే గుమ్మంలో ప్రత్యక్షమైన స్త్రీలను చూసి ఖంగుతింది ఆమె.
ముసలావిడకు అరవయ్యేళ్ళుంటాయి. తెల్లగా, పొడవుగా ఉంది. కాంజీవరం పట్టుచీర కట్టింది… రెండవ స్త్రీకి నలభయ్యేళ్ళుంటాయి. పెద్దావిడకంటే రంగూ, ఎత్తూ తక్కువే. పోలీస్ డ్రెస్ లో ఉంది.
“ఎవరు నువ్వు?” పోలీసామె కటువుగా ప్రశ్నించింది ఝాన్సీని.
“మీరెవరు?” ఎదురు ప్రశ్నించింది ఝాన్సీ, తడబాటును అణచుకుంటూ.
ముసలావిడ ఆ ఫ్లాట్ యజమానురాలు మహేశ్వరి. రెండవ స్త్రీ ఆవిడ మేనకోడలు ఎ.సి.పి. వాసంతి.
“ఇవాళ ఉదయం సైదాపేట రైల్వే స్టేషన్ దగ్గర రంగనాథన్ స్ట్రీట్ లో పార్క్ చేసిన నా కారులోంచి నా హ్యాండ్ బ్యాగ్ ని ఎవరో దొంగిలించారు. అందులో ఇంటి తాళపుచెవి కూడా ఉంది…”
ముసలావిడ చెబుతున్నది ఆలకించి తెల్లబోయింది ఝాన్సీ. ‘అంటే, అది తిరుట్టు (దొంగ) మామీయా!? ముసలావిడ హ్యాండ్ బ్యాగ్ ని దొంగిలించిన దొంగ నుండి, తాను కొట్టేసిందన్నమాట! భలే త్రిల్లింగ్ గా ఉంది…’ నవ్వు వచ్చిందామెకు. ‘అనుకుంటాంకానీ, అందరూ దొంగలే!’ అనుకుంది.
“హ్యాండ్ బ్యాగ్ ని దొంగిలించింది నువ్వేగా? అందులో ఉన్న కీతో ఇంటిని దోచుకోవడానికి వచ్చావు. ఔనా?” గద్దించింది ఎ.సి.పి.
“నేను కాదు!” అంది ఝాన్సీ కంగారుగా. తాను ఓ సేల్స్ గాళ్ ననీ…ఎవరో అమ్మాయిలు ఆ ఫ్లాట్ తాళం పగులగొడుతూంటే చూసి, అనుమానంతో వారిని అడ్డగించబోయిందనీ…వాళ్ళు తనను కొట్టి గదిలో పడేసారనీ…స్పృహలోకి రాగానే తప్పించుకు పారిపోతోందనీ…ఓ కథ అల్లి చెప్పింది. నమ్మించేందుకు తన తలపైనున్న గాయాన్ని చూపించింది. గదిలో తనలాగే మరో మహిళ కూడా స్పృహతప్పి పడివుందని చెప్పింది.
“వాళ్ళింకా లోపలే ఉన్నారా?” అడిగింది ఎ.సి.పి.
“లోపల చేపల్లా త్రాగుతున్నారు” అంది ఝాన్సీ.
ఆమెను అక్కడే ఉండమని చెప్పి, లోపలికి వెళ్ళింది ఎ.సి.పి.
“సారీ, మేడమ్!” అంటూ అక్కణ్ణుంచి జారుకోబోయింది ఝాన్సీ.
“ఎక్కడికి వెళుతున్నావ్? నా బ్రీఫ్ కేసును నేను గుర్తించలేననుకున్నావా?” అంటూ అడ్డుకుంది మహేశ్వరి.
“మనిషిని పోలిన మనుషులే ఉన్నప్పుడు…పెట్టెను పోలిన పెట్టెలు ఉండవా ఏమిటీ!…” అంటూ ఆవిడను త్రోసుకుని వెళ్ళబోయింది ఝాన్సీ. ఇద్దరి మధ్యా పెనగులాట జరిగింది. పెట్టెను వదలకుండా గట్టిగా పట్టుకుని, “వాసంతీ!” అంటూ అరచిందావిడ.
అదే సమయంలో యువతులు ఇద్దర్నీ కొట్టుకుంటూ తీసుకొస్తోంది ఎ.సి.పి.
ఆమెను చూడగానే బ్రీఫ్ కేసును వదిలేసి మెట్లవైపు పరుగెత్తింది ఝాన్సీ - ‘బైటపడితే పది జేబులు కొట్టుకునైనా బతకొచ్చును. ఆ ఎ.సి.పి. చిక్కితే నా పని చిత్తడి చిత్తడే!’ అనుకుంటూ.
***