PVV Satyanarayana

Drama Tragedy

5  

PVV Satyanarayana

Drama Tragedy

దత్తుడుగారి బుల్లెబ్బాయి

దత్తుడుగారి బుల్లెబ్బాయి

9 mins
653


దత్తుడుగారి బుల్లెబ్బాయి

రచనః తిరుమలశ్రీ

***

     అత్తిలిలో ఉండే దత్తుడిగారి బుల్లెబ్బాయి మహా గొప్ప అందగాడు. ఆరడుగుల ఎత్తు. ఎత్తుకు తగ్గ పర్శనాలిటీ. పండిన జాంపండులా తెల్లగా ఉంటాడు. పున్నమి చంద్రుడులాంటి ముఖం, నుదుటి మీద పడే వంకీల జుత్తు, సన్నని మీసకట్టు…నవమన్మథుడిలా ఉంటాడు. మనిషి గాంభీర్యం, మాట నెమ్మదీను. ఎప్పుడూ పాలనురగలాంటి దుస్తులలో, చల్లటి చిరునవ్వుతో చూపరులను ఇట్టే ఆకర్షించుకుంటాడు. డిగ్రీ పాసై ఉద్యోగం చేయకుండా సొంత పొలము, తోటలూ చూసుకుంటున్నాడు.

అత్తిలి మొత్తం మీద పెద్ద భూకామందు, మోతుబరీనైన సుబ్బారాయుడికి సంతానం లేకపోతే అరవయ్యేళ్ళ క్రితం బంధువుల పిల్లాడు రాంబాబును దత్తతకు తీసుకున్నాడు. అందువల్ల రాంబాబు పేరు మరుగునపడిపోయి దత్తుడిగా మారిపోయింది.

     దత్తుడికి కొడుకు పుడితే సుబ్బారాయుడి తండ్రి పేరైన బుల్లెబ్బాయి పేరు పెట్టుకున్నారు. అనంతరం వందల ఎకరాల మాగాణీ, కొబ్బరి తోటలు, పళ్ళతోటలూ, దొరల బంగళాలాంటి పెద్ద బంగళాని దత్తుడికి వారసత్వంగా ఇచ్చి సుబ్బారాయుడు, అతని భార్య కాలం చేసారు. కాలక్రమాన ఆ ఆస్తిని మరింత పెంచాడు దత్తుడు. పదేళ్ళక్రితం ఏభై ఏళ్ళ వయసులో అతను పరమపదించడంతో అతని భార్య శ్రీలక్ష్మమ్మ, కొడుకు బుల్లెబ్బాయీ యావదాస్తికీ వారసులుగా మిగిలారు.

     కొడుకు అందం చూసుకుని తెగ మురిసిపోయేవారు దత్తుడు, శ్రీలక్ష్మమ్మాను. ఆ ఊళ్ళోని కన్నెపిల్లల కలలన్నీ అతని చుట్టూనే పరిభ్రమించేవంటే అతిశయోక్తికాదు. చుట్టుపక్కల ఊళ్ళలోని చిలుకలెన్నో వచ్చి అతని ఒళ్ళో వాలిపోవాలని కన్న కలలు కల్లలుగానే మిగిలిపోవడం విశేషం.

     అలాంటి బుల్లెబ్బాయికి ముప్పయ్యేళ్ళు వచ్చినా పెళ్ళికాలేదు. అతని అందం, ఆస్తి చూసి ఎక్కడెక్కడినుంచో గొప్ప గొప్ప సంబంధాలు ఎన్నో వచ్చాయి. ఒక్కటీ నచ్చలేదన్నాడు. అసలు తనకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పమంటే చెప్పలేకపోయాడు. బ్రతికి ఉన్నన్నాళ్ళూ కొడుకు పెళ్ళి చేయాలని తండ్రి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దత్తుడు పోయాక శ్రీలక్ష్మమ్మ లంకంత ఆ కొంపను ఒక్కతే సంబాళించలేకపోతున్నానంటూ నెత్తీ నోరూ మొత్తుకుంది. ఏదో ఒక సంబంధం ఒప్పుకుని తనకు తోడుగా కోడలిని తీసుకురమ్మని పోరింది… ఆ అందగాడికి ఏ వంకా పెట్టలేని ఊరి జనం – సంబంధాలన్నీ కట్నం చాలక కొన్నీ, అంతస్థులు కలవక మరికొన్నీ పోతున్నాయని చెప్పుకునేవారు.

     ఓసారి ఆచంట నుంచి శ్రీదేవి సంబంధం వచ్చింది. అమ్మాయి చదువుకున్నదీ, అందగత్తేనూ. బాగా ఆస్తిపాస్తులు ఉన్నఆ ఊరి పెద్దకాపు కూతురు. ఇద్దరు అన్నల ముద్దుల చెల్లెలు. తల్లిపోరు పడలేక పెళ్ళిచూపులకు వెళ్ళిన బుల్లెబ్బాయిని ఆకట్టుకుంది ఆ పిల్ల. తన అందంతో సరితూగే ఆమెకు పెట్టడానికి ఏ వంకా దొరకలేదు…అతను ఎటూ నిశ్చయించుకునే లోపునే పెద్దలు తాంబూలాలు పుచ్చేసుకోవడము, నిశ్చితార్థమూ జరిగిపోయాయి. మూణ్ణెల్ల తరువాత దత్తుడిగారి బుల్లెబ్బాయి పెళ్ళి శ్రీదేవితో ఆడంబరంగా జరిగిపోయింది.

     శోభనపు రాత్రి - రతీదేవిలా అలంకరించుకుని పాలగ్లాసుతో గదిలో అడుగు పెట్టిన భార్య సౌందర్యానికి ముగ్ధుడయిపోయాడు బుల్లెబ్బాయి. ఆమె పరువాలు తనను ఆహ్వానిస్తున్నట్లనిపించింది.

     ప్రేమగా ఆమెను అక్కున చేర్చుకున్నాడు. పళ్ళూ, స్వీట్లూ తింటూ కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరూ. అనంతరం ఆమెను తమకంతో ఆలింగనం చేసుకుని పూలపాన్పు పైన పవళింపజేసాడు…అతని ధాటికి పందిరిమంచం అదిరిపోతుందంటూ స్నేహితురాళ్ళు ఆడిన సరసోక్తులు గుర్తుకువచ్చి మదిలోనే నవ్వుకుంది శ్రీదేవి. ఆ సుందరాంగుడు చేయబోయే వీరంగాన్ని తలచుకుని మనసూ, తనువూ పులకించడంతో మత్తుగా కన్నులు మూసుకుంది.

     నిముషానికే తనమీంచి లేచి నిస్సహాయంగా వెల్లకిలా పడుకుండిపోయిన భర్త వంక ఆశ్చర్యంతో, అపనమ్మకంగా, అసంతృప్తితో చూసిందామె.

     బుల్లెబ్బాయికి తల కొట్టేసినట్టయింది. అతని మదిలో గతం మెదిలింది…అయిదేళ్ళ క్రితపు మాట. పాలేరు వీరయ్య కూతురు రంగికి ఇంచుమించు తన వయసే ఉంటుంది. పెళ్ళి కూడా అయింది. చామనచాయలో యవ్వనంతో పిటపిటలాడుతుండేది. అప్పుడప్పుడు వచ్చి తమ ఇంట్లో పనులు చేస్తుండేది. ఓసారి అది ఒంటరిగా చిక్కడంతో మనసు ఆపుకోలేక గట్టిగా దాన్ని కౌగలించుకున్నాడు తాను. ఒద్దు వద్దంటూనే లొంగిపోయిందామె.

     ఐతే క్షణంలో నీరుకారిపోయిన తన వంక అదోలా చూసింది రంగి. చీర కట్టుకుంటూ, ‘ఇంతటి అందగాడు, బలమైనవాడు…సంసారానికి పనికిరాడంటే నమ్మకం కలగడంలేదు. ఓపాలి డాక్టర్ని కలుసుకో, చిన్నబాబూ!’ అని అంటుంటే, సిగ్గుతో తల వాలిపోయింది.

     డాక్టర్ని కలవలేదు. తాను పెళ్ళయితే పెళ్ళాన్ని సుఖపెట్టలేనేమో, అపహాస్యం పాలవుతానేమోనన్న భయం పట్టుకుంది. ఏదో సాకుతో వచ్చిన సంబంధాలన్నీ చేజార్చుకుంటున్నాడు అప్పట్నుండీను…

     మూడు రాత్రులూ అదే వరుస కావడంతో శ్రీదేవి అయోమయంలో పడిపోయింది. మూడు నిద్రలైతే చేసారు కాని, అసలు కార్యం జరుగనేలేదు. బుల్లెబ్బాయికి భార్య కళ్ళలోకి చూడడానికి ముఖం చెల్లడంలేదు. అందగాడు, ఆజానుబాహువైన తన భర్త నపుంసకుడని ఆమె అనుకోలేకపోతోంది. నపుంసకుడిలో కోర్కెలు ఉండవు. కాని, అతని కళ్ళలో కోర్కె ప్రస్ఫుటమవుతోంది. అతనిలో ఏదో చిన్న లోపమే ఉందనిపించింది. కొత్త మూలంగా సుఖపెట్టడంలో విఫలుడయ్యాడని కూడా అనుకుంది. లోపమే ఉంటే వైద్యసహకారంతో దాన్ని సరిచేసుకోవచ్చుననుకుంది.

     శ్రీదేవి చదువుకున్నదీ, పెద్దింటి పిల్లాను. తొందరపడి అల్లరి చేసుకోలేదు. తన సమస్య ఎవరికీ చెప్పుకోలేదు. చివరికి, కన్నవారికి కూడా. భర్త, తాను లోకువయిపోతారన్న భయం. అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. అనునయంగా అతని తల నిమురుతూ కావలించుకుని పడుకునేది…నాలుగో రోజున అత్తిలి వెళ్ళిపోయాడు బుల్లెబ్బాయి.

     పెళ్ళయిన మూణ్ణెల్లకు అత్తవారింటికి వచ్చింది శ్రీదేవి. ఆ మధ్యలో ఒక్కసారీ ఆచంటలో అడుగు పెట్టలేదు బుల్లెబ్బాయి. బావమరదులు ఎన్నిసార్లు వచ్చి పిలిచినా, పనులు ఉన్నాయని తప్పించుకునేవాడు.

భర్తలో మార్పు వచ్చివుండవచ్చునని ఆశించిన శ్రీదేవికి నిరాశే ఎదురయింది. ఆమె ఎంత ప్రోత్సహించినా సెక్స్ లో విఫలమవుతూనే వచ్చాడు బుల్లెబ్బాయి. నవమన్మథుడికి ఆ అవకరం ఏమిటో బోధపడక తన దుస్థితికి లోలోపలే కుమిలిపోయిందామె. మదిలో అశాంతి రేగింది. యవ్వనపు కోర్కెలు అల్లరి చేస్తుంటే, ఆమెలో నానాటికీ అసహనం పెరిగిపోసాగింది. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదు. చివరకు, అత్తగారితో కూడా! పరుల దృష్టిలో భర్తను కించపరచడం ఆమెకు ఇష్టంలేదు. పైగా ఆ ఒక్క విషయంలో తప్పితే, అతను తనను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు.

చివరకు సిగ్గు విడచి ఆ సమస్యను భర్తతో చర్చించింది. వైద్యనిపుణులను సంప్రదించమని సూచించింది. ఐతే అతనికి తన సమస్యను వైద్యులతో చెప్పుకోవడానికి అహం అడ్డువచ్చింది. అది నలుగురికీ పాకి నవ్వులపాలవుతానన్న భయం. భార్య సంతృప్తికోసం అబద్ధం చెప్పాడు - డాక్టర్ని సంప్రదించినట్టూ, కొన్నాళ్ళపాటు ట్రీట్మెంటు తీసుకుంటే నార్మల్ కి వస్తాడన్నాడనీ, కవిటం మందు వాడుతున్నాననీను!...

బుల్లెబ్బాయి, శ్రీదేవిల మేరేజ్ యానివర్శరీ వచ్చేసింది. వారి దాంపత్యసుఖంలో మాత్రం మార్పులేదు. బుల్లెబ్బాయితోపాటే వేటమాంసం, చికెన్ ఫ్రై, బొమ్మిడాయిలు-జెల్లల పులుసు, వంజరం-రొయ్యల ఇగురు, పచ్చిరొయ్యల కూర, గోదావరి పులసల పులుసూ…శ్రీదేవి కూడా తింటోంది. ప్రతిపూట నీచు లేనిదే ఆ ఇంట ముద్ద దిగదు. అలా ఉప్పు, పులుపు, కారము తినే శ్రీదేవికి యవ్వనపు కోర్కెలను అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు.

భర్త కవిటం మందు వాడడం అబద్ధమన్న నిజం ఓ రోజున బైటపడడంతో అవాక్కయిందామె. హైదరాబాదు వెళ్ళి సమరం గారిని కలుద్దామంది. అది తనకు ఇష్టం లేదంటూ పెద్ద సమరమే చేసాడు అతను. శ్రీదేవికి విపరీతమైన ఆగ్రహం కలిగింది అతని పైన మొదటిసారిగా! పెట్టె బేడా సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది.

నెల్లాళ్ళ తరువాత శ్రీదేవి నుంచి వచ్చిన విడాకుల నోటీసు బుల్లెబ్బాయిని ఖంగు తినిపించింది. శ్రీలక్ష్మమ్మ షాక్ కి గురయింది.

శ్రీదేవి మంచి పిల్ల, పద్ధతైనదీను. కొడుకు ఆమెను ఎంతో బాధపెడితే తప్ప కోడలు విడాకుల వరకు వెళ్ళదనుకుంది ఆమె. తరచి తరచి అడిగినా కొడుకు కారణం చెప్పలేదు. తక్షణమే వెళ్ళి శ్రీదేవికి నచ్చజెప్పి కాపురానికి తీసుకురమ్మంది. బుల్లెబ్బాయి కదలలేదు. నిరతమూ శ్రీదేవిని బాధపెడుతూ తాను పడే హింసకంటే విడాకులే నయమనిపించింది. ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తన గిల్టీనెస్ కొంతవరకైనా తగ్గవచ్చుననుకున్నాడు. వ్యతిరేకించి గుట్టు రట్టు చేసుకునేకంటే నిశ్శబ్దంగా అంగీకరించడమే మేలనుకుని విడాకుల పత్రాల మీద సంతకాలు చేసేసాడు. అంతటితో ఆ ఘట్టం ముగుస్తుందనుకున్నాడు.

ఫ్యామిలీ కోర్ట్ దత్తుడిగారి బుల్లెబ్బాయికి, శ్రీదేవికి విడాకులు మంజూరుచేసింది. అయితే ఆ తరువాత పరిణామాలు బుల్లెబ్బాయిని, అతని తల్లినీ తల్లడిల్లజేసాయి. ఎలా పొక్కిందో… బుల్లెబ్బాయి సంసారానికి పనికిరాడనీ, అందుకే అతని భార్య అతనికి విడాకులు ఇచ్చేసిందనీ పుకారు ఊళ్ళమ్మట షికారు చేసింది!

అది బుల్లెబ్బాయి ఎదురుచూడని మలుపు. శ్రీదేవి మీద, అత్తవారి మీద కోపం వచ్చింది అతనికి. నిజం ఎరుగని శ్రీలక్ష్మమ్మ కూడా అసత్యపు వార్తలు ప్రచారం చేస్తోందని శ్రీదేవిని తప్పుపట్టింది. ఆమె తల్లిదండ్రులను దుమ్మెత్తిపోసింది.

బుల్లెబ్బాయికి మునుపటిలా బైట తిరగాలంటే ఇబ్బందిగా ఉంటోంది ఇప్పుడు. అంతా తనవంక వింతగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. అవతలివారు మామూలుగానే పలుకరించినా, పరిహాసం చేస్తున్నారేమోనన్న భావన.

ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోయిన శ్రీలక్ష్మమ్మ, కొడుక్కి మళ్ళీ పెళ్ళిచేసి ఆ పుకారుకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. బుల్లెబ్బాయి ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆమె వినిపించుకోకుండా నరసాపురం దగ్గర రుస్తుంబాదలో ఓ దిగువ మధ్యతరగతికి చెందిన కౌసల్యను కోడలిగా ఎంపిక చేసుకుంది. పేదపిల్ల కనుక పడుంటుందనీ, భార్యంటూ ఒకతె ఉంటే లోకుల నోళ్ళు మూతపడతాయనీ పునరాలోచనలో పడ్డ బుల్లెబ్బాయి మౌనమే అంగీకారం చేసాడు.

ఈసారి బుల్లెబ్బాయి పెళ్ళి ఆర్భాటంగా చేయలేదు శ్రీలక్ష్మమ్మ. ప్రజల దిష్టి తగిలే మొదటి వివాహం ముక్కలయిందన్న నమ్మకంతో కొద్దిమంది దగ్గర బంధువులతో వెళ్ళి అన్నవరంలో పెళ్ళి జరిపించింది.

సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కౌసల్యది కూడా ఇంచుమించు శ్రీదేవి వయసే. అయితే ఆమె అంతటి అందగత్తె కాదు. చామనచాయ రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. నెమ్మదైన మనిషి. అణకువతో నడచుకుంటుంది.

తొలిరాత్రి శ్రీదేవికి అయిన అనుభవమే కౌసల్యకూ అయింది. మూడు నిద్రలు చేసేసరికి భర్తలో ఏదో లోపం ఉందని అర్థమయిపోయింది ఆమెకు. అలాగని, తాను బయటపడలేదు. ఆమె ఆ ఊసు ఎత్తుతుందేమోనని ఎదురుచూసిన బుల్లెబ్బాయికి ఆమె నోరు మెదపకపోవడం ఆశ్చర్యంతోపాటు కొంత ఊరట కలిగించింది.

కౌసల్య మనసులో ఏమున్నదో తెలియదు. రోజూ మామూలుగానే అతన్ని కౌగలించుకుని, మీద కాలు వేసుకుని మరీ పడుకుంటుంది. అయితే లోలోపల దహించివేస్తున్న కామాగ్నిని చల్లార్చుకునేందుకు తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానం చేయడం అలవరచుకుంది.

శ్రీదేవి మూలంగా వచ్చిన అపప్రథ మరచిపోని శ్రీలక్ష్మమ్మ, కౌసల్యను చాటుగా పరిశీలిండం మొదలుపెట్టింది. కాని, మచ్చుకు కూడా ఆ పిల్ల ముఖంలో అసంతృప్తి చాయలు కానరావడంలేదు. ‘ఏడాది తిరిగేసరికి పండంటి బిడ్డను నా ఒళ్ళో పెట్టాలి సుమా!’ అంటూ నర్మగర్భంగా ఆవిడ అంటే, కౌసల్య నవ్వేసి ఊరుకుంది. ఆ పిల్ల ప్రవర్తన అత్తగారి అనుమానాలను బలపరచలేకపోయింది.

బుల్లెబ్బాయిని మాత్రం అపరాధ భావన ఏదో మూల తొలుస్తూనే ఉంది. కన్నెవయసు కోర్కెలతో తనకు అర్థాంగి అయినందుకు ఆ అమాయకురాలికి అన్యాయం చేస్తున్నందుకు బాధగానే ఉంది. తనను కాదని బలవంతంగా ఆ పెళ్ళి జరిపించిన తల్లిమీద కోపంగా కూడా ఉంది. శ్రీదేవి గొప్పింటి బిడ్డ కనుక విడాకులు తీసుకుని తన దారి తాను చూసుకుంది. కాని, కౌసల్య పేదింటి పిల్ల. అలాంటి పని చేయలేదు. తెగించి బైటపడలేదు కూడా…ఆమె పట్ల నానాటికీ జాలి, సానుభూతీ పెరిగిపోతుంటే ఆమెను ఇతరత్రా సంతోషపెట్టడానికి ప్రయత్నించేవాడు.

దత్తుడి హయాం నుంచి పనిచేస్తున్న పెద్ద పాలేరు ముసలివాడైపోవడంతో వాడి స్థానంలో వాడి కొడుకు కృష్ణుడు చేరాడు ఆ మధ్యనే. ఇరవయ్యేళ్ళుంటాయి. చామనచాయలో, దృఢంగా ఉంటాడు. పనివాళ్ళందరిలోనూ భిన్నంగా కనిపిస్తాడు. ఎనిమిదో తరగతి చదువుకున్నాడు. క్రాపు దువ్వుకుని, శుభ్రమైన దుస్తులు ధరిస్తాడు.

ఓసారి శ్రీలక్ష్మమ్మ ఊళ్ళో లేదు. చుట్టాల పిల్ల ఎవరో ఈడుకు వచ్చిందని గణపవరం ఫంక్షన్ కి వెళ్లింది. రెండు, మూడు రోజుల వరకు తిరిగిరాదు. పొలం పనులు ఉండడంతో రెండు రోజులుగా రాత్రింబవళ్ళు పొలంలోనే గడుపుతున్నాడు బుల్లెబ్బాయి. తెల్లవారాక ఇంటికి వచ్చి స్నానం చేసి, బట్టలు మార్చుకుని, ఫలహారం చేసి మళ్ళీ పొలం వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం, రాత్రి భోజనం క్యారియర్లు వెళ్తాయి.

ఆ రోజు మునిమాపు వేళ బాత్ రూంలో సినిమా తారలు వాడే లక్స్ సోపుతో స్నానం చేసి, ఒంటికి టవల్ చుట్టుకుని బైటకు వచ్చింది కౌసల్య. బెడ్ రూమ్ లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ కట్టుకోవడానికి చీర అందుకోబోయింది. పెద్ద బొద్దింక ఒకటి ఎగిరి ఆమె మీద పడింది. బొద్దింకలంటే భయం ఆమెకు. కెవ్వున అరుస్తూ, దాన్ని వదిలించుకునే ప్రయత్నంలో గదంతా గెంతులు వేసింది.

అదే సమయంలో బుల్లెబ్బాయికి డిన్నర్ క్యారేజ్ తీసుకువెళ్ళడానికని వచ్చిన కృష్ణుడు, కౌసల్య అరుపులు విన్నాడు. ఏం జరిగిందోనని అక్కడికి పరుగెత్తాడు.

టవల్ ని అంటిపెట్టుకుని ఉన్న బొద్దింక వదలకపోవడంతో టవల్ విప్పేసి నగ్నంగా గెంతులు వేస్తున్న కౌసల్య, లోపలికి వచ్చిన కృష్ణుణ్ణి ఢీకొట్టడం, వాణ్ణి కావలించేసుకోవడం జరిగాయి.

హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకు నిశ్చేష్టుడయ్యాడు కృష్ణుడు. అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో, కడిగిన ముత్యంలా ఉందామె. శరీరం వెచ్చగా ఉంది. పిటపిటలాడే పరువంతో కవ్విస్తున్న ఆమె ఎద ఎత్తులు మెత్తగా హత్తుకుంటుంటే శరీరమంతా విద్యుత్తు ప్రవహించినట్లయింది. ఆమె ముఖం తన ముఖానికి రాసుకుంటూ, ఆమె వెచ్చటి ఊపిరి తన మెడకు సోకుతుంటే…ఆమె బాహువులు తన వీపుచుట్టూ పెనవేసుకుని ఆమె నగ్నదేహం తనను హత్తుకుంటుంటే…ఉక్కిరిబిక్కిరయ్యాడు వాడు. వాడి యవ్వనం బుసలు కొట్టింది…తనకు తెలియకుండానే చేతులు రెండూ చుట్టూ వేసి ఆమెను కౌగలించుకున్నాడు. ఆమె ముఖంపైన, మెడపైన, వక్షంపైన తమకంతో ముద్దుల వర్షం కురిపించాడు.

కృష్ణుడి స్పర్శతో కౌసల్య స్త్రీత్వం హఠాత్తుగా మేల్కొంది. వాడి బిగికౌగిలి ఆమెకు ఊపిరి ఆడకుండా చేసింది. చనుగుబ్బలు పొంగాయి. వాడి చుంబనలు ఆమె పరువాన్ని రెచ్చగొట్టాయి. తన నడుంమీద, పిరుదులపైన వాడి చేతులు నర్తిస్తుంటే నరాలు జివ్వుమని శరీరం తీయగా మూలిగింది. తాను నగ్నంగా పరపురుషుడి కౌగిలిలో బందీ అయిన వైనం మరచిపోయి, ఆర్తిగా వాణ్ణి అల్లుకుపోయింది…

ఆ తరువాత చాలా రాత్రులు, అవకాశం దొరికినప్పుడు పగలూ ఆ అనుభవాన్ని పంచుకుంటూనే ఉన్నారు ఆ ఇద్దరూ. పరువాల పందిట్లో ఆటలాడుకుంటున్నారు. భర్త పక్కలో విరహంతో కాలిపోయే దేహం, కృష్ణుడి కౌగిట్లో ఉపశమనం పొందసాగింది…

ఆ రోజు సంక్రాంతి పండుగ. ఉన్నట్టుండి వాంతి చేసుకుంది కౌసల్య. శ్రీలక్ష్మమ్మ అడిగితే, కడుపులో వికారంగా ఉన్నదంది. ఆవిడ వెంటనే డాక్టర్ని పిలిపించింది. కౌసల్యను పరీక్షించిన డాక్టర్ ఆమెకు మూడోనెల గర్భం అని చెప్పింది.

శ్రీలక్ష్మమ్మ ఆనందానికి మేరలేకపోయింది. దాంతో తన బిడ్డ మీద పడ్డ అభాండం భాండమై బ్రద్దలైపోతుందన్న సంతోషం ఓ పక్కా, తమకు వారసుడు రాబోతున్నాడన్న ఆనందం మరోపక్కా పెనవేసుకుని ఆమెను నిలవనీయలేదు. పొలం వెళ్ళిన కొడుక్కి కబురు పెట్టింది.

ఐతే కౌసల్య గర్భిణీ అన్న వార్త బుల్లెబ్బాయిని అవాక్కుణ్ణి చేసింది. వాస్తవం తనవంక తేరిపార జూస్తుంటే నిస్సత్తువ కమ్ముకుంది. ఒకవేళ తన సెక్స్ సామర్థ్యం పెరిగి నార్మల్ గా అయ్యాడనుకుందామంటే, తాము ఏనాడూ కలవనేలేదు! అటువంటప్పుడు కౌసల్య గర్భవతి ఎలా అవుతుందన్నది అతణ్ణి తేలుకొండిలా పొడుస్తూన్న ప్రశ్న. తల్లి నవ్వుతూ నోట్లో పెట్టిన మైసూర్ పాక్ చేదుగా అనిపించింది.

గదిలో కౌసల్యను నిలదీసాడు బుల్లెబ్బాయి, “ఇది నిజమేనా? నిజమే అయితే మనం కలవకుండా గర్భం రావడం ఎలా సాధ్యం?” అంటూ.

“మీ అనుమానం నేను అబద్ధమనడంలేదు. మనం అసలు కలుసుకోనేలేదన్న నిజం మీకు, నాకే తెలుసు. ఇతరులకు తెలియదుగదా! సంక్రాంతిపూట రంకు గురించి నన్ను నిలదీసి నేను బొంకేలా చేయకండి” అందామె నవ్వుతూ.

“ఏమిటీ నీ ఉద్దేశ్యం?”

“నా ఉద్దేశ్యం అడిగితే…ఇన్నాళ్ళుగా నా హృదయంలో గూడుకట్టుకున్న బాధంతా కట్టలు తెంచుకున్న వరద గోదారిలా బైటకు ఉరుకుతుంది. దానికి ఆనకట్ట వేయడం మీకు సాధ్యం కాదు” అంది.

“సంప్రదాయ కుటుంబానికి చెందినదానివని చేసుకున్నాం. బరితెగిస్తావనుకోలేదు,” అతని కోపం చెలియలకట్ట త్రెంచుకుంది.

అంతే! కౌసల్య మనోవేదనకు గండిపడింది. ఇన్నాళ్ళుగా గుండెల్లో అణచుకున్న ఆవేదనంతా పొంగి పొరలింది. “మీరు శ్రీమంతులు. మీకు అందం ఉంది కాని, మగతనం లేదు. అయినా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇద్దరు అమాయకపు యువతులను వంచించారు. మొదటి పెళ్ళి తెలియక చేసుకున్నారని సరిపెట్టుకున్నా…రెండోసారి తెలిసీ నన్ను చేసుకున్నారు. నా కలలు కాలరాసారు. పేదరాలు కదా ఏం చేస్తుందిలే అన్న ధైర్యం, ధీమాను మీవి. మీ లోపానికి వైద్యం చేయించుకోవాలన్న కనీసపు ఆలోచన కూడా చేయరు మీరు. అది మీ పరువుకు భంగం. మీ గుట్టు రట్టవుతుందన్న భయం…”

అవసరమైతే తప్ప నోరు మెదపని కౌసల్య…అత్తగారిని, భర్తనూ దైవంలా భావించే కౌసల్య…నోటి నుండి ఆ రోజు అలా వాడిగా వేడిగా మాటలు వస్తుంటే తెల్లబోయి నోరు తెరచాడతను.

“మీలాగే నేనూ ఉప్పూ పులుపూ తింటున్నాను. కోర్కెలతో రగిలిపోయే వయసు నాది. అందుకే…అనుకోని పరిస్థితిలో తెలియకుండానే తప్పు జరిగిపోయింది…అందుకు బాధ్యత మీరే వహించవలసియుంటుంది…”

“ఎంత తెగించి మాట్లాడుతున్నావ్! ఈ క్షణమే ఇంట్లోంచి గెంటేస్తే నీ బతుకు ఏమవుతుందో తెలుసా?” కోపంగా అన్నాడు.

“భార్య పరాయి మగాడిని మరిగిందంటే కట్టుకున్నవాడు చేతకానివాడని అర్థం చేసుకుంటుంది లోకం”.

ఆమె దెప్పిపొడుపు బాధించడంతో తల దించుకున్నాడు అతను.

“నోరు జారితే నన్ను క్షమించండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి…నన్ను అల్లరిపెట్టి మీరు ఇంటినుండి గెంటేస్తే నాకంటే ఎక్కువ నష్టపోయేది మీరేనని తెలుసుకోండి. మీ లోపం బైటపడుతుంది. ఇంతవరకు పుకారుగా ఉన్నది నిఖార్సైన నిజంగా తేలిపోతుంది. మగసిరి లేని మగాడికి ఆలిగా ఉండేకంటె నింద మీద వేసుకుని వెళ్ళిపోవడమే మేలు”.

“బెదిరిస్తున్నావా?”

“లేదు. వాస్తవాన్ని గుర్తించమంటున్నాను” అందామె. “ఈ రహస్యం మన ఇద్దరి మధ్యే ఉంటే మీ మీద జరిగిన ప్రచారం తప్పనుకుంటారంతా. మీరూ మగవారేనని బోర విరుచుకుని తిరగవచ్చును. మీకు ఓ వారసుడో, వారసురాలో కూడా దొరుకుతారు”. అవాక్కయ్యాడు బుల్లెబ్బాయి. ఆమె అలా తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని ఊహించలేదు. కొద్దిసేపు తల పట్టుకుని ఉండిపోయాడు. “ఎవడు వాడు?” నెమ్మదిగా అడిగాడు కొంతసేపటికి.

“చెప్పను. ఈ విషయం మన ముగ్గురిలోనే ఉండిపోతుంది. అయితే బిడ్డ పుట్టేసరికి ఈ రహస్యం తెలిసినవాళ్ళు ఇద్దరే ఉంటారు” అంది.

తెల్లబోయాడతను. ఇప్పుడు ఆమెలో ఓ కొత్త మనిషిని చూస్తున్నాడు…

పది నెలలకు పండంటి మగబిడ్డను ప్రసవించింది కౌసల్య.

ఆ మధ్య కాలంలో బుల్లెబ్బాయి ఆమెను ఏమీ అనలేదు. మొదట్లో కొన్నాళ్ళు ఆమెతో ముభావంగా ఉన్నా, క్రమేపీ వాస్తవానికి అలవాటు పడిపోయాడు. అందుక్కారణం – తమకు వారసుడు పుడుతున్నాడన్న ఆనందం తల్లిలో వెల్లివిరియడమే. తన కొడుకు పైన అపనిందలు వేసిన శ్రీదేవిని తిట్టుకోవడం మరచిపోలేదు శ్రీలక్ష్మమ్మ.

పిల్లాడు తల్లి పోలికతో బావున్నాడు. ముద్దు వస్తున్నాడు. శ్రీలక్ష్మమ్మ వాణ్ణి క్షణం వదలడంలేదు. బారసాల రోజున పిల్లాడి ఒళ్ళంతా బంగారం దిగేసి, ఊరంతా భోజనాలు పెట్టించింది. పిల్లాడికి దత్తుడి అసలు పేరైన ‘రాంబాబు’ పేరు పెట్టారు.

 చంటాణ్ణి చూసుకుని తల్లి పడే ఆనందం చూస్తే బుల్లెబ్బాయికి కూడా ఉత్సాహం కలిగింది. పిల్లాణ్ణి ఎత్తుకుని త్రిప్పాడు. అది చూసిన కౌసల్యకు సంతృప్తి, సంతోషమూ కలిగాయి.

పంక్తి భోజనాలు పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. అలసిపోయిన శ్రీలక్ష్మమ్మ ఓ కునుకు తీయడానికని మంచం ఎక్కింది. బుల్లెబ్బాయి ఊళ్ళోకి వెళ్ళాడు.

గొడ్ల చావడిలో పాలు పితుకుతున్నాడు కృష్ణుడు. పనివాళ్ళందరికీ కొత్తబట్టలు కుట్టించింది శ్రీలక్ష్మమ్మ. కొత్తబట్టల్లో నిండుగా ఉన్నాడు వాడు. వాడి వదనంలో మెరుపు స్పష్టంగా కనిపిస్తోంది. తీక్ష్ణంగా వాడి వంక రెప్పవేయకుడా చూసింది కౌసల్య. తనకు ప్రేమను పంచి యవ్వనపు రుచిని చవిచూపించి, స్త్రీత్వానికి అర్థం చెప్పి, తనను తల్లిని చేసిన మగాడు వాడు. తన మనసుకు నచ్చినవాడు…అభిమానపు వెల్లువ ఆమె మదిలో పొంగి పొర్లింది. అంతలోనే అంతరాళాలలో నుండి గాఢనిశ్వనం ఒకటి దాన్ని తాకింది.

పాలు పితికి పట్టుకువచ్చిన కృష్ణుణ్ణి గదిలోకి తీసుకువెళ్లింది కౌసల్య. ఉయ్యాల తొట్టెలో చంటాడు నిద్రపోతున్నాడు. “నీ కొడుకు!” అంది మురిపెంగా.

ఆ మాటలతో వాడి ఛాతీ పొంగింది. పసివాడి పైన ప్రేమ పొరలింది. వాణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. మెరిసే కళ్ళతో ఆమె వంక చూసాడు.

ఏదో మిషతో చూపులు త్రిప్పుకుందామె. “తోటలో ఉన్న మల్లెపందిరి దగ్గర నుంచి పూలు కోసుకురా” అంటూ పురమాయిమ్చింది. అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు…

తెల్లవారేసరికి తోటలో మల్లెపందిరి దగ్గర కృష్ణుడు పాముకాటుతో చచ్చిపడున్నాడన్న వార్త దిగ్భ్రాంతుల్ని చేసింది అందరినీ.

‘బిడ్డ పుట్టేసరికి ఈ రహస్యం తెలిసినవాళ్ళు ఇద్దరే ఉంటారు!’ అన్న భార్య పలుకులు హఠాత్తుగా గుర్తుకు రావడంతో అయోమయంలో పడిపోయాడు దత్తుడిగారి బుల్లెబ్బాయి.

                                                        ******Rate this content
Log in

Similar telugu story from Drama