PVV Satyanarayana

Drama Inspirational Thriller

5.0  

PVV Satyanarayana

Drama Inspirational Thriller

మాతృదేవోభవ

మాతృదేవోభవ

8 mins
710


మాతృదేవోభవ

రచనః తిరుమలశ్రీ

***

"అమ్మా!" అన్న పిలుపుతో ఉలికిపడి ఇహలోకానికి వచ్చిన సావిత్రి చటుక్కున కన్నీళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగింది. గుమ్మంలో కూతురు కవిత…ఇరవయ్యేళ్ళ ప్రాయంలో యవ్వనం తెచ్చిన మెరుపులతో నిగారింపుగా, నూతన వధువు అలంకరణలో నిండుగా కనులపండువుగా ఉంది.

కూతుర్ని కనులారా చూసుకుని మురిసిపోయింది ఆమె. అంతలోనే కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.

"అమ్మా!" అంటూ ఒక్క ఉరుకున వచ్చి తల్లి కౌగిటిలో వాలిపోయింది కవిత.

తల్లీకూతుళ్ళ ప్రేమాభిమానాల పరిష్వంగనలో వారి భుజాలు తడిసి ముద్దవుతూంటే...అప్రయత్నంగా గతం తాలూకు చిత్రాలు సావిత్రి మనోఫలకం పైన కదలాడాయి.....

#

ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న సావిత్రి కట్నం ఇచ్చుకోలేని కారణంగా రెండో పెళ్ళివాడికి భార్య అయింది. భర్త శివాజీకి ముప్పై రెండేళ్ళు ఉంటాయి. ఆమె కంటె దాదాపు పదేళ్ళు పెద్దవాడు. ఆటోరిక్షా నడుపుతుంటాడు. రెండవ కాన్పులో మొదటి భార్య చనిపోవడంతో పిల్లల కోసమని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరూ ఆడపిల్లలే. సావిత్రి పెళ్ళినాటికి పెద్ద పిల్ల సరితకు నాలుగేళ్ళైతే, చిన్న పిల్ల కవిత ఆర్నెల్లది. సవతి తల్లి అంటే సామాన్యంగా ఉండే భయాలకు భిన్నంగా సావిత్రి పిల్లలిద్దర్నీ కన్నతల్లి కంటె ఎక్కువ ప్రేమాభిమానాలతో సాకుతుండేది.

ఓ రోజున కవితను అరుగుపైన కూర్చోపెట్టి పనిచేసుకుంటోంది సావిత్రి. అది ఎత్తరుగుల ఇల్లు. చంటిది ఆడుకుంటూ మెట్ల మీదుగా దొర్లుకుంటూ క్రింద పడిపోయింది. అది చూసి సావిత్రి పరుగెత్తుకు వచ్చింది. పిల్ల ఏడవడం లేదు. అచేతనంగా పడి ఉంది. ఊపిరి కూడా ఆడుతున్నట్లు లేదు.

చటుక్కున చంటిదాన్ని పైకి లేవదీసి కూర్చోబెట్టింది సావిత్రి. వెన్ను పైన గట్టిగా తట్టింది. దాంతో పిల్ల కాస్త ఊపిరి తీసుకుంటున్నట్లనిపించింది. ఆ క్షణంలో అలా తోచి చేసిందే తప్ప, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియదు ఆమెకు. ముఖం పైన నీళ్ళు చిలకరించినా పిల్ల కళ్ళు తెరవలేదు.

ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని, పిల్లను చేతుల్లో ఎత్తుకుని పూనకం వచ్చినదానిలా బైటకు పరుగెత్తింది సావిత్రి. సరాసరి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్ కి వెళ్ళింది. ఎటెండర్ అడ్డుపెడుతున్నా వినిపించుకోకుండా ఛాంబర్లో చొరబడింది. "డాక్టరమ్మా! నాబిడ్డ మెట్లమీంచి పడిపోయింది. ఉలుకూ పలుకూ లేదు. రక్షించమ్మా!" అంది కంగారుగా.

పేషెంటును పరీక్షిస్తూన్న లేడీ డాక్టర్ సాదాసీదా దుస్తుల్లో ఉన్న సావిత్రి వంక తీక్ష్ణంగా చూసింది. "ఏయ్, ఎవరు నువ్వు? బైటకు వెళ్ళు!" అంటూ కసరింది. జరిగింది చెప్పి, తన బిడ్డను వెంటనే చూడమని అర్థించింది సావిత్రి. "నేను ఇప్పుడు ఓ ముఖ్యమైన కేసు చూస్తున్నాను. మరో డాక్టర్ ఎవరి దగ్గరకైనా తీసుకువెళ్ళు" అంది.

"ఆలస్యమైతే నాబిడ్డ నాకు దక్కదు. నువ్వే పుణ్యం కట్టుకో తల్లీ!" ప్రాధేయపడింది సావిత్రి.

"ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులకు రిపోర్ట్ చేయందే పేషెంట్ ని చూడడం కుదరదు" అంది డాక్టర్ చిరాకుగా.

పోలీసులు, రిపోర్టులు అంటూ జాప్యం చేస్తే బిడ్డ దక్కదు. ఏదో తెలియని ఆవేశం పెనవేసుకుంది సావిత్రిని. చటుక్కున డాక్టర్ యొక్క కోటు కాలర్ ని పట్టుకుంది. "నువ్వు నా బిడ్డకు వైద్యం చేసేంతవరకు నేనిక్కణ్ణుంచి కదలను. నీ కారణంగా నా బిడ్డ చనిపోతే నీ ప్రాణం తీయకుండా ఉండను" అంటూ అరచింది. అంతటి సాహసము, తెగింపూ ఎలా వచ్చాయో ఆమెకే తెలియదు.

ఎదురుచూడని ఆ చర్యకు డాక్టర్ తెల్లబోయింది. సావిత్రి వెనుకే లోపలికి వచ్చిన ఎటెండర్ ఆమెను బైటకు లాక్కుపోవడానికి విఫల ప్రయత్నం చేసాడు.

“#మీరు సూటిగా మాట్లాడండి. చెప్పండి, నేను పేదరాలిననే కదా అలా అంటున్నారు?” అడిగింది సావిత్రి. “మీరు బాధ్యతాయుతమైన ఓ డాక్టర్ అని మరచిపోవద్దు”.

చిత్రంగా సావిత్రి పలుకులు డాక్టర్ మీద పనిచేసాయి. పాపను బెడ్ మీద పడుకోబెట్టమని చెప్పి పరీక్షించింది. అది హోప్ లెస్ కేసని అనిపించడంతో, "#నేను సూటిగానే మాట్లాడుతున్నాను. పిల్ల బ్రతకాలంటే, వెంటనే పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళు. అక్కడ అన్ని సదుపాయాలూ ఉంటాయి" అని చెప్పింది.

పాపను కాపాడడం ఆమె వల్ల కాదని గ్రహించిన సావిత్రి మరి జాప్యం చేయలేదు. పిల్లను తీసుకుని బైటకు పరుగెత్తింది. రోడ్ పైన వెళ్తూన్న ఖాళీ ఆటోని ఆపి పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పింది. సెల్ ఫోన్లో భర్తకు విషయం వివరించింది.

ప్రభుత్వాసుపత్రి వద్ద ఆటో ఆగగానే బిడ్డతో లోపలికి పరుగెత్తింది సావిత్రి. ఏడుస్తూ ఆమె చెబుతూన్నదాన్ని ఆలకించిన డ్యూటీ డాక్టర్ పాప నాడి వగైరాలు పరీక్షించాడు. పెదవి విరుస్తూ, "లాభంలేదు. ఇంటికి తీసుకుపో" అన్నాడు. సావిత్రి గుండెలు అవిసిపోయాయి.

అదే సమయంలో పిల్లకు ఊపిరి ఆడడం మానేసింది. సావిత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. దుఃఖం ముంచుకురావడంతో బల్ల మీద నిస్సత్తువగా చతికిలబడింది. అంతలో అంతర్వాణి చెప్పినట్టు హఠాత్తుగా ఏదో ఆలోచన మెదిలింది ఆమెలో. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది. పసిదాని మెడను వెనక్కి వంచి, దాని నోట్లో నోరు పెట్టి గాలి ఊదనారంభించింది. కొద్ది క్షణాలకు పాప భారంగా ఊపిరి పీల్చనారంభించింది! సావిత్రి డెందం ఆనందంతో పురి విప్పుకుంది. తన బిడ్డ బ్రతుకుతుందన్న ఆశ చిగురించింది ఆమెలో.

అంతలో శివాజీ అక్కడికి పరుగెత్తుకు వచ్చాడు. భర్తను చూడగానే ఏడ్చేసింది సావిత్రి. "ఈ డాక్టర్ల మాట మీద నాకు నమ్మకంలేదు. నేను దీని తల్లిని. నాబిడ్డ నన్ను విడిచి వెళ్ళిపోదు" అంది, ఉట్టిపడే ఆత్మవిశ్వాసంతో. "ఎంత ఖర్చయినాసరే...ఇంకా పెద్ద హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. నాతల్లిని బతికించుకుందాం".

ఓ సూపర్ స్పెపెషాలిటీస్ హాస్పిటల్ కి వెళ్ళారు దంపతులు.

డాక్టర్స్ సావిత్రి చెబుతూన్నది వింటూనే చంటిదాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. వాళ్ళు చెప్పిన సంగతులు సావిత్రిని, ఆమె భర్తనూ విభ్రాంతికి గురిచేసాయి. ’పాప కోమాలో ఉంది. పడిపోవడం వల్ల పుర్రె ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ మూలంగా తల వాచిపోయింది. బ్రతికే అవకాశాలు చాలా తక్కువ’.

"ఆపరేషన్ చేస్తే నాబిడ్డ బతకదా, డాక్టర్?" అనడిగింది సావిత్రి.

"మేజర్ సర్జరీని తట్టుకునే శక్తి ఆ పసిదానికి ఉండదమ్మా. మందులతో మా ప్రయత్నం మేం చేస్తాం. ఆనక మీ అదృష్టం!" అన్నారు డాక్టర్స్. పాపను వెంటిలేటర్లో పెట్టి డ్రిప్స్ ద్వారా మందులు ఇవ్వనారంభించారు.

రెండు రోజులయింది. పిల్ల పరిస్థితిలో మార్పు లేదు. సావిత్రి ఇంటికి వెళ్ళకుండా ఆసుపత్రిలోనే ఉండిపోయింది. నిద్రాహారాలు మరచిపోయింది. ఆమె కోర్కె, ఆర్తి ఒక్కటే - ’తన బిడ్డ బతకాలి! తప్పక బతుకుంది. తన ప్రేమే చంటిదాన్ని బతికిస్తుంది!’ బలీయమైన ఇచ్ఛతో అనుక్షణమూ ఇష్టదైవానికి ఆమె చేసుకుంటూన్న వేడుకోలు అదే!

ఇంట్లో ఉన్నదంతా ప్రోగుచేసి తెచ్చి హాస్పిటల్ చార్జెస్ కట్టాడు శివాజీ. పాప కోలుకునేసరికి చాలా సొమ్ము అవుతుందని తెలుసు. తనకు అద్దెకిచ్చిన ఆటో యజమాని సాయం కోరాడు. అలాగే బంధుమిత్రులు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. చంటిదాన్ని చూడ్డానికి వచ్చిన వారంతా పాప బతకదనే నిర్ధారించేసారు.

పిల్ల తల వాపు తగ్గలేదు. డాక్టర్స్ ఆ కేసు విషయమై తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. సావిత్రి మాత్రం ధైర్యం కోల్పోలేదు. తన బిడ్డ తప్పక బతుకుందన్న ఆశ ఆమెను వీడడంలేదు. అందరిలాగే శివాజీకి లోలోపల ఆశ సన్నగిల్లుతున్నా, భార్య మనోధైర్యం చూస్తే ఊరట కలుగుతోంది.

ఐదవ రోజున డాక్టర్స్ సావిత్రిని, శివాజీనీ పిలచి, పాప కోమాలోంచి బైటపడే సూచనలు లేవనీ, ఆ పసిదాని లేత నరాలు డ్రిప్స్ నీడిల్స్ ని ఎక్కువ కాలం తట్టుకోలేవనీ...బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కాకుంటే, డ్రిప్స్ తీసేయడం వల్ల డీహైడ్రేషన్ సంభవించి పిల్ల చనిపోవడం తథ్యమనీ స్పష్టం చేసారు.

సావిత్రి నిశ్చేష్ఠురాలయింది. అంతలోనే తేరుకుని, "అంటే చంటిదానికి లిక్విడ్స్ అవసరమన్నమాట" అంటూ, బైటకు పరుగెత్తింది. కొంతసేపటికి పాలసీసాతో తిరిగివచ్చింది. డాక్టర్స్ అవాక్కై చూస్తూంటే, పాలపీకను చంటిదాని పెదవుల మధ్య జొనిపింది. కొన్ని సెకనుల అనంతరం చిత్రంగా పాపలో సన్నటి కంపన కలిగింది. చిట్టి పెదవులు మెల్లగా కదలాయి. ఓ క్షణం తరువాత అవి పాలపీకను చిన్నగా చప్పరించనారంభించాయి.

కోమాలో ఉన్న పిల్ల బాటిల్ తో పాలు త్రాగుతోంది!...ఆ అద్భుతానికి డాక్టర్స్ చిత్తరువులే అయ్యారు.

“నేను పాప తల్లిని, సార్! నాబిడ్డ గురించి నాకంటె బాగా ఇంకెవరికి తెలుస్తుంది!" అంది సావిత్రి మెరిసే కన్నులతో.

ఆ సంఘటనతో - పాపను బ్రతికించడం వైద్యులవల్ల కాదనీ, తల్లిగా అది తనకే సాధ్యమనీ అనిపించింది సావిత్రి మనసుకు. అది తల్లీబిడ్డల బంధం! తమది ప్రేగుబంధం కాకపోవచ్చును. కాని, పెంచిన మమకారం, అనుబంధం అంతకంటె గొప్పవి!

పాప కోమాలోనే ఉంది. డాక్టర్స్ మెడికేషన్ ఇస్తున్నారు. ఆ స్థితిలోనే ఫీడింగ్ బాటిల్ ద్వారా పాలు త్రాగుతోంది. అంతకంటె అద్భుతం - పాప తల వాపు తగ్గి నార్మల్ సైజ్ కి వచ్చేసింది!

వైద్యులు ఇక చేయగలిగిందేమీ లేదన్న విషయం తెల్లమయిపోయింది సావిత్రికి. పాపను ఇంటికి తీసుకుపోయి తన ప్రయత్నాలు తాను చేయాలనుకుంది.

"ఈ స్థితిలో పిల్లని ఆసుపత్రినుండి కదలించడం సాహసమే అవుతుంది, జాగ్రత్త!" అన్నారంతా. శివాజీకి మాత్రం భార్య జడ్జ్ మెంట్ పట్ల విశ్వాసముంది. డాక్టర్స్ మందులు రాసిచ్చి, సూచనలిచ్చారు.

సానుభూతితో హాస్పిటల్, చార్జెస్ లో కొంత రాయితీ ఇచ్చింది. అప్పుచేసి తెచ్చిన సొమ్ముతో బిల్ కట్టేసాడు శివాజీ. చిన్నారి కవితను ఇంటికి తీసుకొచ్చేసారు.

సావిత్రి కవిత గొడవలో పడి సరితను సరిగా చూసుకోవడం వీలుపడడంలేదు. అందువల్ల సావిత్రి తల్లిని తీసుకొచ్చి పెట్టాడు శివాజీ. ఓ పక్క సరితను, మరోపక్క ఇంటినీ చక్కబెట్టుకోసాగింది ఆవిడ. సరిత బిక్కుబిక్కుమంటూ అమ్మమ్మ కొంగు పట్టుకుని వదలడంలేదు. శివాజీ రేయింబవళ్ళు ఆటో నడపనారంభించాడు. లేకుంటే అటు అప్పులు తీరవు, ఇటు ఇల్లు గడవదు మరి.

సావిత్రికి కవితే లోకమయిపోయింది. కొద్ది నెలలలో దాని రెండో పుట్టినరోజు రాబోతోంది. అప్పటికి అది కోమాలోంచి బైటపడాలి! అందుకు తాను ఏదో ఒకటి చేయాలి. తానే చేయాలి!

రేయింబవళ్ళు పాపనే అంటిపెట్టుకుని ఉండేది. టైమ్ ప్రకారం పాలు పట్టించేది. పడుకుని ఉండడం వల్ల వీపంతా పుళ్ళు పడకుండా, పిల్లను తరచు అటు ఇటు ఒత్తిగిలజేసేది. శానిటైజర్ తో ఒళ్ళంతా తుడిచేది. నిరతమూ ఆమె మదిలో మెదిలే తలంపు ఒక్కటే - పాపను కోమాలోంచి బైటకు తేవాలి!

‘కోమా’ అంటే గాఢనిద్ర. ఆ నిద్రను చెడగొట్టాలంటే ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించింది... పాపకు అర్థమైనా లేకున్నా, దాంతో ఏదో ఒకటి మాట్లాడసాగింది. ఏవేవో ఊసులు చెప్పేది. కథలు చెప్పేది. పాటలు పాడి వినిపించేది. ఓతల్లి పసిబిడ్డతో ఏమేమి చేస్తుందో అవన్నీ చేసేది. ఆవిధంగా పిల్ల శాశ్వతనిద్రలోకి జారుకోకుండా చూడాలన్నది ఆమె ఆలోచన.

నిద్రాహారాలు లేక చిక్కి శల్యమైన కూతుర్ని చూసి సావిత్రి తల్లి భయపడేది. కాని, తన ఆరోగ్యం గురించి సావిత్రికి బెంగలేదు. చంటిదాన్ని కోమాలోంచి బైటపడేయడమే ఆమె ఏకైక ధ్యేయం. అప్పుడప్పుడు అపరాధభావన ఆమె మదిని కలచివేస్తుండేది - ఆరోజు తాను పిల్లను అరుగుమీద కూర్చుండబెట్టకపోయుంటే దానికి ఆ దుస్థితి సంభవించేది కాదుగదా అని!

’అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకోకు. అంతా విధి లీల!’ అంటూ భార్యను మందలించేవాడు శివాజీ.

ఓరోజు రాత్రి పున్నమి వెన్నెల పుడమిని ప్రకాశింపజేస్తోంది. చల్లటి గాలి కూడా వీస్తోంది. మనసు, శరీరమూ అలసిపోయిన సావిత్రికి చానాళ్ళ తరువాత కాసేపు బైట తిరిగిరావాలనిపించింది. తల్లిని పిలచి పాప దగ్గర కూర్చోబెట్టి బైటకు వెళ్ళింది...కాని, పాపను విడచి ఎక్కువసేపు ఉండలేకపోయింది.

కూతురు తిరిగి రాగానే, "నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే చంటిది రెండు మూడు సార్లు ’అమ్మ’ అన్నట్టు అనిపించిందే నాకు" అంటూ తల్లి ఎక్సైటెడ్ గా చెబుతూంటే, అవాక్కయి చూసింది సావిత్రి.

"ఔనమ్మా. ఇరవై నాలుగ్గంటలూ దీన్నే అంటిపెట్టుకునుంటావు కదా. నువ్వు కనిపించకపోయేసరికి, నువ్వు దగ్గర లేవన్న సంగతి గుర్తించి పిలిచి వుంటుంది" అందావిడ మళ్ళీ.

ఒక్క ఉరుకులో పాప దగ్గరకు వెళ్ళి నోటి దగ్గర చెవి పెట్టిoది సావిత్రి - ’అమ్మ...అమ్మ...’ అంటున్న చిట్టి స్వరం అతి మెల్లగా వినవచ్చింది. అంతే! ఆనందం పట్టలేక భోరున ఏడ్చేసింది సావిత్రి. ’పాప మనుషుల్ని గుర్తుపడుతోంది. మాట్లాడుతోంది. దానికిక ప్రాణభయం లేదు’ అన్న తలంపు ఏనుగంత బలాన్ని ఇచ్చింది.

పాపతో ఇంటరేక్షన్ ని మరింత ముమ్మరం చేసింది. రెండు మూడు రోజుల్లో తల్లి పలుకులు తనకు అర్థమవుతున్నాయన్నట్టు, కన్నులు తెరవకపోయినా పెదవులు కదిపేది పాప. మరో ఐదు రోజులకు కనురెప్పలు మెల్లగా కదలనారంభించాయి. చివరికి ఓ రోజున కనులు తెరచింది! కోమాలోంచి బైట పడింది!... అందరి గుండెల్లోనూ పాలు పోస్తూ.

ఆ తరువాత మెల్లగా లేచి కూర్చోవడం, నిలుచోవడం, తప్పటడుగులు వేయడం ఆరంభించింది!!

కవిత రెండో పుట్టినరోజున సంబరంగా చేసుకున్నారు. పాపను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళారు దంపతులు. డాక్టర్స్ పాపను చూసి అవాక్కయ్యారు. ఆపిల్ల రికవరీకి సావిత్రి అవలంబించిన పద్ధతులను గూర్చి శివాజీ వివరిస్తూంటే అప్రతిభులయ్యారు. ఖచ్చితంగా చనిపోతుందనుకున్న పాప మందుల సాయం లేకుండానే అలా డ్రమెటిక్ గా కోమాలోంచి బైట పడడం వైద్య చరిత్రలోనే కని విని ఎరుగని మహాద్భుతంగా అభివర్ణించారు.

కవిత కోమాలోంచి బైటపడ్డా, ప్రమాదానికి ముందు నేర్చుకున్న విషయాలన్నీ మరచిపోవడమేకాక, నడకలో కూడా స్వల్ప తేడా గమనించినట్టు చెప్పింది సావిత్రి. తలకు తగిలిన గాయం వల్ల కావచ్చుననీ, క్రమేపీ నార్మల్సీకి రావచ్చుననీ అభిప్రాయపడ్డారు డాక్టర్స్.

కవిత నడకలో తేడాయేకాక, ముఖ్యంగా నడుస్తున్నప్పుడు మాట తడబడడం కూడా గమనించింది సావిత్రి. చేయి పట్టుకుని నడిపించినా మెట్లు ఎక్కలేకపోయేది. అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వచ్చేవి. చూపు బాగానే ఉన్నా, ఒక్కోసారి కనులు మసకబారి కనిపించేవికాదు. అన్నిటికీ మించి, తుమ్మినప్పుడు విపరీతమైన బాధతో తల పట్టుకుని ఏడ్చేసేది…

పిల్లను మళ్ళీ హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది సావిత్రి. డాక్టర్స్ పరీక్షించి, ఆరంభంలో స్ట్రాంగ్ మెడికేషన్ ఇవ్వడం అందుకు కారణం కావచ్చుననీ, వయసుతోపాటు నయమైపోతాయనీ అన్నారు. బ్రెయిన్ కి ఎమ్మారై స్కానింగ్ చేసి, తుమ్మినప్పుడు మెదడులోని ఓ భాగం తీవ్ర ఒత్తిడికి గురై విపరీతమైన నొప్పిని కలిగిస్తోందని గుర్తించారు. సర్జరీతో దాన్ని సరిచేసారు.

కవితకు ఐదో ఏడు రాగానే బళ్ళో వేసింది సావిత్రి. ఆమె తీసుకుంటూన్న ప్రత్యేక జాగ్రత్తలతో పిల్ల పెరుగుదల నార్మల్ గానే ఉన్నా, కాంప్లికేషన్స్ అలానే ఉన్నాయి. ఫిట్స్ రావడం మానినా...చూపులోని లోపం, అక్షరాలను గుర్తుపట్టడంలోని అశక్యత కొనసాగాయి. ఓసారి కవిత సమస్యను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్, "పిల్లలో డైస్ లెక్సియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎందుకైనా మంచిది ఓసారి పరీక్ష చేయించండి" ఆంది సావిత్రితో.

సంబంధిత మెడికల్ సెంటర్ కి కవితను తీసుకువెళ్ళింది సావిత్రి. అక్కడ పరీక్షలు జరిపి, ఆ పిల్ల ‘డైస్ లెక్సియా’ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ చేసారు. అలాంటి పిల్లల కోసమే నడిపే ఓ ప్రత్యేక స్కూల్లో చేర్పించమని సలహా ఇచ్చారు. కవితను ఆ స్కూల్లో చేర్పించింది సావిత్రి. కాని, కొద్ది రోజులు అయేటప్పటికి సమస్య జటిలమయినట్టు అనిపించింది. పిల్ల క్లాసులో సరిగా ఉండడంలేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. హైపర్ యాక్టివ్ కావడమే కాక, బడంటే భయపడుతోంది. పుస్తకాలంటే ఎలర్జీని పెంచుకుంది.

మానసిక వికలాంగులైన పిల్లలకోసం నడిపే బడి అది. ’తన కూతురు మానసిక వికలాంగిని కాదు. అందుకే ఆ వాతావరణంలో ఇమడలేకపోతోంది’ అనుకుంది సావిత్రి. అడపాదడపా తలయెత్తే చూపు సమస్యా, అక్షరాల గుర్తింపు సమస్య తప్పితే కవిత నార్మల్ చైల్డ్. తైలమర్దనాలు, ఎక్సర్ సైజులతో నడక సమస్య చాలామటుకు నయమయింది.

కవితను బడి మాన్పించేసింది సావిత్రి. ఇంటి దగ్గరే ఆటపాటలతో, కథలతో, బొమ్మల పుస్తకాలతో మెల్లగా చదువు చెప్పసాగింది. ఉదయం నీరెండలో త్రిప్పేది. సాయంత్రం పార్క్ లో త్రిప్పి తీసుకువచ్చేది. మొక్కలు, పక్షులు, జంతువులను చూపించి వాటి గురించి వివరించేది. ప్రకృతి గురించి చెప్పేది…

ఆవిధంగా పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి కవిత చక్కని బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేయడం నేర్చుకుంది. వంట చేయడమేకాక, అల్లికలు, కుట్టుపనులూ నేర్చుకుంది. చూపు సమస్య చాలామటుకు నయమయింది. చదవడం, రాయడం మాత్రం అంతంత మాత్రమేగా మిగిలిపోయాయి. మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకువెళ్తే, కవిత రికవరీని చూసి డాక్టర్స్ అబ్బురపడ్డారు…పదహారేళ్ళకు బంగారుబొమ్మలా తయారయింది కవిత. తల్లంటే పిచ్చి ప్రేమ.

సరితకు డిగ్రీ చదువుతూండగానే పెళ్ళి చేసేసారు. ఆపిల్ల పెళ్ళైన ఆర్నెల్లకే శివాజీ ఓ రోడ్ ప్రమాదంలో మరణించడం జరిగింది. భర్త అకాలమరణం సావిత్రికి అశనిపాతమే ఐనా, కవితకోసం గుండె రాయిచేసుకుంది. ఇంటి దగ్గరే తనకు చేతనైన చిన్న ఫాస్ట్ ఫుడ్ అంగడి పెట్టుకుంది. కవిత వంటపనిలో తల్లికి సాయం చేసేది.

ఏడాది తరువాత కవితను వెదుక్కుంటూ పెళ్ళి సంబంధం వచ్చింది. కుర్రాడు సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆస్తిపరులు. ఎప్పుడో ఎక్కడో కవితను చూసాడట. ఆపిల్లనే పెళ్ళాడుతానంటూ, వివరాలు తెలుసుకుని, తల్లిదండ్రులతో ఇంటికి వచ్చాడు...పసిదనంలో కవితకు జరిగిన ప్రమాదం గురించీ, రికవరీకి ఆమె పడిన బాధల గురించీ, ప్రమాదం ద్వారా ఆమె సంతరించుకున్న కాంప్లికేషన్స్ గురించీ ఏదీ దాచకుండా వివరంగా వారికి చెప్పింది సావిత్రి.

"వైద్యుల్ని కాదని కోమాలో ఉన్న పిల్లను ఇంటికి తెచ్చుకుని చాలా సాహసమే చేసావమ్మా. ఏమాత్రం అటూ ఇటూ ఐనా, సవతి తల్లి మూలాన పాపను నిర్లక్ష్యం చేసావన్న అపవాదును మోయవలసివచ్చేది నువ్వు" అన్నారు వాళ్ళు అభినందిస్తూ. "అలనాటి సావిత్రి యముణ్ణి ఎదిరించి భర్త ప్రాణాలు కాపాడితే...ఈ సావిత్రి విధిని ధిక్కరించి కూతుర్ని బ్రతికించుకుందన్నమాట!"

కట్నం తీసుకోకపోవడమే కాక, పెళ్ళి కూడా స్వంత ఖర్చుతోనే జరిపించారు వాళ్ళు. అలాంటి మంచి కుటుంబంలోకి వెళుతుందన్నందుకు కూతురి అదృష్టానికి మురిసిపోయింది సావిత్రి.

వివాహతంతు ముగిసింది. అంపకాల పర్వం మొదలయింది...డాక్టర్స్ బతకదని కొట్టిపారేసిన తన చిన్నారి ఇప్పుడు పెళ్ళికూతురుగా కనులపండుగ చేస్తూంటే సావిత్రి డెందం ఆనందం పట్టలేకపోయింది. భర్త ఫోటో ఎదుట నిలుచుని సజలనయనాలతో తన ఆనందాన్ని పంచుకుంది. కూతురు వెళ్ళిపోతోందంటే...తన శరీరంలోని ముఖ్యభాగం ఏదో దూరమవుతున్నట్టు ఆక్రోశించింది ఆమె మనసు.....

#

"అమ్మా...!" అంటూ తల్లిని చుట్టుకుపోయింది కవిత. "నువ్విక్కడ ఒక్కదానివీ ఎలా ఉంటావమ్మా?" అంటూంటే ఇరువురి కళ్ళమ్మటా నీళ్ళు జలజలా రాలాయి.

"పిచ్చితల్లీ! నన్ను చూడ్డానికి అక్కలాగే నువ్వూ అప్పుడప్పుడు వస్తుంటావుకదా!" అంది సావిత్రి.

పెద్ద కూతురు వచ్చి తల్లి కన్నీటిని తుడిచింది.

"నీకు అమ్మను చూడాలనిపించినపుడల్లా వద్దువుగానిలే, బంగారూ!" అన్నాడు కవిత భర్త అనునయంగా.

కారు వెళుతూంటే కన్నీటితో చేయి ఊపింది కవిత. సజలనయనాలతో తానూ చేయి ఊపింది సావిత్రి. ఆ నీటితెరలలో - దాగుడుమూతలు ఆడుతూ, ’అమ్మా! ఇక్క...’ అంటూ చేయి ఊపే చిన్నారి కవితే -కనిపించింది ఆమెకు.

*******Rate this content
Log in

Similar telugu story from Drama