STORYMIRROR

Sudheer Kaspa

Crime

4.8  

Sudheer Kaspa

Crime

విహంగం-4

విహంగం-4

12 mins
564


“ఈ వైరల్ వీడియో సంగతి శివమూర్తికి చెప్పనా?వద్దా ? ఇప్పుడున్న పరిస్థితిలో అతడి గుండె తట్టుకోలేదు.వద్దు.విషయం తేలేవరకు నాలో ఉంచుకోవడమే నయం.షాలిని ఎందుకు పరారిలో ఉంది?అసలు ఆరోజు బంగ్లా బైట పరిగెత్తిన వాడెవడు??షాలిని మొగుడా? అసలు కాలేజిలో ఎవరికీ అసలు షాలినిని పెళ్లి చేస్కున్నవాడు ఎవడో తెలియక పోవడమేంటి ?ఎక్కడున్నట్టు వీళ్ళు? మొత్తం జల్లెడ పట్టేద్దామంటే డిపార్ట్మెంట్ నుండి హెల్ప్ అందటం లేదు.ఏం చెయ్యాలి “ తల పట్టుకొని కూర్చున్నాడు దివాకర్.

“చెప్పెయ్యనా వద్దా ...ఇతన్ని కూడా నమ్మొద్దు అన్నాడు కదా ఆ ఫోన్ వాడు!! అసలు వాడిని ఎందుకు నమ్మాలి.ఇంతవరకు ఎస్సై గారే లేకపోతె ఇంత దూరం వచ్చేవాడినా? సాయం చేసిన వాడినే నమ్మకపోతే దేవుడు కూడా మనల్ని కాపాడడు .నమ్మినోడే దెబ్బేస్తే ఇక దేవుడ్ని కూడా నమ్మక్కర్లేదు. ఏదైతే అది అయింది. చెప్పేస్తా “ ఒక పక్క శివమూర్తి అంతర్మధనం.

పక్కపక్కనే కూర్చున్నా ఎవరి ఆలోచనల సుడిగుండాల్లో వాళ్ళు మునిగి ఉన్నారు.

“సార్......సారీ సార్ ..నేనొకటి దాచాను” ఇక ఆగలేక కక్కేసాడు.

“ఏంటి” అన్నట్టు తలపైకెత్తి చూసాడు దివాకర్ .ఒక్కసారి ఆలోచనల్లోనించి బైట పడి.

“ఇందాక ఒకడు కాల్ చేసి ఏదో సిక్రెట్ చెప్తా అన్నాడు.సాయంత్రం మళ్ళి చేసి ఒంటరిగా రమ్మన్నాడు సార్ “

“ఓ అవునా ఈ సారి చేస్తే లౌడ్ స్పీకర్లో పెట్టి మాట్లాడండి.ఈరోజంతా స్టేషన్లోనే నా పక్కనే ఉండండి.నాకు చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయ్.” అతి సాధారణంగా చెప్పాడు.

“ఏంటి ఇతను? నేను ఇంత టెన్షన్ పడి చస్తుంటే ఇంతలా తీసి పడేసాడు”అని మనసులోనే నొచ్చుకున్నాడు.”మనకి కొత్త గానీ అతను ఇలాంటివి చాలా చూసుంటాడులే “ అని తనకి తానే సర్దిచెప్పుకున్నాడు.

ట్రింగ్ ట్రింగ్ ....ఇంతలోనే మోగేసింది ఫోను ........

“సార్ సార్ అదే నెంబరు “ ఆందోళనగా శివ.

“ఊ మాట్లాడండి అన్నట్టు సైగ చేసాడు దివాకర్.”

“హలో ....నేనే ......మీరు ఒంటరిగా ఊరు చివర ఉన్న బంగ్లా.....అదే ఆ ముసలాడి బంగ్లా ...అక్కడికి రండి.ఒక్క అరగంటలోపు.మళ్ళి చెప్తున్నా ఒంటరిగానే రావాలి.” కట్ చేసేసాడు.

“ప్రతి వాడు సినిమాలు చూసి నేర్చుకున్న జ్ఞానం ........ నిమిషం కన్నా తక్కువ మాట్లాడి కట్ చేసేస్తే పట్టుకోలేం అని ... ....పిచ్చ ఎదవలు ...వీడి సినిమా తెలివి తేటలు చూస్తుంటే వీడు ఖచ్చితంగా టీనేజ్ పిల్ల బచ్చా గాడు అని తెలుస్తుంది .కానిస్టేబుల్!! మన CYBER CELL శీను కి చెప్పి ఉంచాను, IMEI నెంబర్ ట్రాక్ చేసి అరగంటలో తెచ్చి లోపలెయ్యండి వాడ్ని. మహా ఐతే ఐదు ఆరు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు.జాగ్రత్త ఇది అన్ అఫీషియల్ ..” తనకి బాగా నమ్మకస్తులైన వాళ్ళని పంపేడు.

అరగంట గడిచింది ...

ఒకడ్ని ఈడ్చుకొచ్చి దివాకర్ ముందు నిలబెట్టారు పోలీసులు .....

ఆశ్చర్యంగా చూసాడు దివాకర్ “నువ్వా .........నువ్వు ఈ పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు నేను....నీ పేరేంటి హర్షా కదూ ??”

తల దించుకొనే ఉన్నాడు హర్షా .

“చెప్పు ఏం ఆధారం ఉంది నీ దగ్గర??”

“మీకు చెప్పను నాకు ఆ అవసరం లేదు. ఆధారాలు వెతుక్కునే పని మీది..మీకు చేతకాకపోతే నేనేం చెయ్యను? నాకు దొరికింది.కానీ మీకు చెప్పను “ తల పొగరుగా హర్ష

“రేయ్ పిల్లోడివి అని ఊరుకుంటున్నా పిచ్చి వేషాలెయ్యకు” దివాకర్ కు అసహనం కట్టలు తెచ్చుకుంటుంది.

“ సార్ మీ పోలీసులని నేను నమ్మను “

“బాబూ! చూడటానికి మంచోడిలా ఉన్నావ్ .మనకి అసలు సమయం లేదు దయచేసి ఏం ఉన్నాయో చెప్పు "బతిమాలుకున్నాడు శివ.

“హ్మ్ ..సరే ఇక్కడ కాదు వేరే చోటకి వెళదాం.నేనేం దొంగని కాను నన్నిలా ఇక్కడ స్టేషన్లో పెట్టి చెప్పమంటే చెప్పను.”

“ఏంటి వీడి తల పొగరు ?? ఈ జెనరేషన్ మొత్తం ఇంతేలా ఉన్నారు “ బయటకి సీరియస్ గా ఉన్నా మనసులోనే నవ్వుకున్నాడు దివాకర్ సరే పద అని ఒక పార్కు లో కూర్చున్నారు.జీప్ డ్రైవర్ని పార్కు బయటే వెయిట్ చెయ్యమన్నాడు దివాకర్

“సార్ ...వరూ ఒక ముసలివాడి దగ్గరకి వెళ్తుందని నాకు ముందే తెలుసు.ఒకట్రెండు సార్లు ఫాలో చేశా.దొంగచాటుగా చూసా.ఆమె అతడికి సేవ చెయ్యడం.చక్కగా కూర్చొని మాట్లాడటం నాకు చాలా బాగా అనిపించేది.వరూ పై నా ప్రేమని రెట్టింపు చేసింది.”

వీడు నా కూతుర్ని ప్రేమించాడా అన్నట్టు ఇబ్బందిగా ఓ చూపు చూసాడు శివ.

“వరూ చనిపోయాక ఆ ముసలాయన్ని ఓ సారి చూసి వద్దాం పాపం అనిపించి వెళ్ళా అక్కడికి. ఎవరూ లేరు.అటువైపుగా ఓ గొర్రెల కాపరి వెళ్తుంటే అడిగా.ఈ ఇంట్లో ఎవరూ లేరా అని.

”లేరు బాబూ ఆ పెద్దాయన ఉండేవాడు.వారం క్రితం.బాగానే ఉండేవాడు ఏమైందో ఏమో!! ఉన్నట్టుండి సచ్చిపోయాడు.దగ్గిరోల్లు ఎవరూ రాలేదు. ఆఖరికి ఎవరో పుణ్యాత్ములు జరగవలిసిన కార్యం జరిపించేరు.అతనికి ఎవరూ లేరు.ఒక పిల్ల మాత్రం చూసి పోతుండేది.ఆ పిల్ల కూడా రాలేదు ఎందుకో మరి. ఆ పెద్దాయన మేనల్లుడు అట ఎవడో వచ్చాడు రెండ్రోజుల తరువాత. ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని దొబ్బుకుపోయాడు .” అని చెప్పాడు.

“ఎందుకో అనుమానం వచ్చింది.వారం క్రితం అంటే వరూ చనిపోయిన మూడు రోజుల ముందు పోయాడు ఇతను.........ఎందుకో లోపలికి వెళ్లి చూడాలి అనిపించింది.”

“అంటే ఆరోజు మేం బంగ్లాకి వచ్చినప్పుడు పారిపోయినది నువ్వేనా ??” దివాకర్ అడిగాడు గుంభనంగా ....

“నేనే ...” వెంట తెచ్చుకున్న బ్యాగ్ లో మొహం పెట్టేడు......ఒక ఖాళీ ఫ్రూట్ జ్యూస్ డబ్బా తీసాడు.

“ఇదే..... ఈ జ్యూస్ తోనే అతడ్ని చంపేరు.....ఇందులో ******* అనే మెడిసిన్ ఉంది.ఇది రక్తనాళాలు బ్లాక్ అయిన వారికి ఇచ్చే మందు.ఏ సమస్య లేనివాళ్ళకి ఓవర్ డోస్ ఇస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువై గుండె ఆగిపోయి చచ్చిపోతారు. ఈ జ్యూస్ లో అదే కలిపారు.ఇక్కడికి జ్యూస్లు, పళ్ళు తెచ్చేది కేవలం వరూ మాత్రమే.”

“నీకు ఇవన్నీఎలా తెలుసు ?” దివాకర్ అడిగాడు ఆశ్చర్యంగా

“మా అన్నయ్య ఫోరెన్సిక్ మెడిసిన్ లో పీ.జి.... నేను ఆ బంగ్లా కి వెళ్ళినపుడు ఒక గదిలో మూలగా సగం తాగిన జ్యూస్ డబ్బా కనిపించింది.ఎందుకైనా మంచిదని అలాగే పట్టికెళ్ళి మా అన్నకి చూపించి టెస్ట్ చేయించా... దయచేసి ఈ విషయం బైటకి లీక్ చేసి చనిపోయిన వరూ పరువు తియ్యకండి అందుకే పోలీసులకి చెప్పను అన్నాను.కానీ వరూ ఒక మనిషిని చంపేంత దారుణంగా ఉండదని నా నమ్మకం.”

“శివ గారూ బైట జీప్ లో ఒక ఫైల్ మర్చిపోయా తీసుకొస్తారా కొంచెం?? ప్లీజ్ ..ఏమనుకోకుండా....”మెల్లగా అడిగాడు దివాకర్.ఏదో ఆలోచిస్తూనే లేచి వెళ్ళాడు శివ.

శివ పూర్తిగా బైటకి వెళ్ళాక దివాకర్ మాట్లాడటం మొదలుపెట్టాడు .“చూడు! నువ్వూ నేను ఆమె గురించి మంచిగా అనుకుంటే చాలదు.ఇప్పుడు జనాలకి ఆమెపై ఉన్న అభిప్రాయం వేరు.ఆ వీడియో వల్ల బాగా చెడ్డ పేరు వచ్చేసింది.ఇంత వరకూ సపోర్ట్ చేసిన మీ కాలేజి కుర్రాళ్ళు కూడా వీడియో చూసాక వరూ కారెక్టర్ పై అనుమానంతో ధర్నాలు ఆపేశారు.ఇప్పుడు నువ్వు చెప్పింది వింటే ఆమె నిజ స్వరూపం వేరే ఉందేమో అనిపిస్తుంది.”

“సార్ ..ధర్నా చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి.వాళ్ళని కెలికి రెచ్చగొట్టింది నేనే. వరూ కులంకి చెందిన స్టూడెంట్స్ వాళ్ళందరూ....పక్కనున్నోడి ప్రాణం పోతున్నా పట్టించుకోని జనం, మన కులపోడుకి ఏదైనా ఐతే మాత్రం ఎగబడి ఎగబడి వస్తారు . దాన్నే వాడుకున్నా..మళ్ళి వాళ్ళని కెలకడం నాకు పెద్ద పనేం కాదు..అయినా ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందో....సార్ ....నా వరూ బంగారం సార్ ....ఆ వీడియో లో ఉన్నది .....”కిస్ ఆఫ్ లవ్ “ అని ఒక ప్రోగ్రాం ...కావాలంటే నెట్ లో వెతికి చూడండి. ఆ ప్రోగ్రాం జరుగుతున్నపుడు అక్కడే ఉన్నా నేను. మగాళ్ళకి మగాళ్ళు, ఆడాళ్ళకి ఆడాళ్ళు,ఆడా మగా తేడా లేకుండా మూతి ముద్దులు పెట్టుకుంటున్నారు.ఒక వంద జంటలున్నాయి అక్కడ.మీలాగే నేను కూడా చీదరించుకున్నా అది చూసి.ఇలాంటి ప్రోగ్రాంలో వరూని చూసి చాలా బాధ పడ్డా.కానీ, అది ‘ఎల్లలు లేని ప్రేమ’కి నిదర్శనంగా అలా చేసారట.ప్రేమకి ఎటువంటి బంధనాలు అవసరం లేదు అని ఏదో ఆధునిక భావాలు అన్నారు అక్కడ స్పీచ్ ఇచ్చిన వాళ్ళు.నాకేం అర్ధం కాలేదు కానీ బాగుందని అనిపించింది.వరూ ఏం చేసినా కరక్టే చేస్తుంది. ఆ వీడియోలో వెనుక చాలా మంది ఉన్నారు.కానీ కనపడకుండా ఎడిట్ చేసేసారు.గమనించారా ??”

“కిస్ ఆఫ్ లవ్” ?? ఇదేం పైత్యం వీళ్ళకి??నెట్ లో వెతుకుదాం అని ఫోన్ తీసాడు దివాకర్.

ట్రింగ్ ట్రింగ్ .........ఫోన్ రింగ్ ఐంది ఇంతలోపు ....

“సార్ ...మీకు ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ ఐంది సార్ ....రేపట్లోగా జాయిన్ అవ్వమని ఆర్డర్.మీరు స్టేషన్కి వచ్చి త్వరగా రిలీవ్ ఆర్డర్స్ తీస్కోమని డి.ఎస్.పీ గారు చెప్పారు .“చెప్పింది అటువైపు గొంతు.

ఒక్కసారిగా దివాకర్ మొఖం మాడిపోయింది. “ నిజాయితీగా పని చేస్తే కుక్క కన్నా హీనం ఐపోయింది బతుకు...తనకి ఏడో నెల ఇప్పుడు హాస్పిటల్ కి ఎలా ?? అమ్మానాన్న హెల్త్ కూడా అంతంత మాత్రం...ఏం చెయ్యాలి ....మనకి సాయం చేసేవాడు ఎవడు ?? వెళ్లి ఎస్.పీ గారి కాళ్ళు పట్టుకుందామా?? చీ వెధవ బతుకు ...వెధవ ఉద్యోగం .....రిజైన్ చేసి పడేసి ఊర్లో వ్యాపారం పెట్టుకుందామా ...?”సవా లక్ష ఆలోచనలతో ఒక ట్రాన్స్ లో లేచి వెళ్ళిపోయాడు దివాకర్.

సార్ సార్ అని వెనుక నుండి హర్షా పిలుపులు అతని చెవులను చేరలేదు.ఫైల్ పట్టుకొని ఎదురుగా వస్తున్న శివని కూడా పట్టించుకోకుండా “డ్రైవర్!! బండి తియ్ ...అని వెళిపోయాడు.

అయోమయంగా శివ,హర్షా ఇద్దరూ మొఖాలు చూస్కున్నారు..

ఏం జరిగింది? ఇపుడేం చెయ్యాలి?అనే అయోమయం కంటే తనకి దొరికిన డాక్యుమెంట్ కాపీ గురించి మాట్లాడక ముందే ఇతను వెళ్ళిపోయాడే అని ఆందోళనే ఎక్కువగా ఉంది హర్షా మనసులో.

శివమూర్తి ఫోన్ తీసి దివాకర్ కి కాల్ చేసాడు.

“ఇక ఎటువంటి హెల్ప్ చెయ్యలేను శివ గారూ ..నన్ను ట్రాన్స్ఫర్ చేసారు ...ఐ యాం సారీ ...ఈ కేసుని ఎలాగైనా ఛేధించాలి అనుకున్నా... నా శక్తి చాలలేదు ...నాదేముంది ఒక చిన్న ఎస్సై ని, జీవితంలో మొదటిసారి నా చేతగానితనానికి సిగ్గుగా ఉంది.నేనే ఒక పెద్ద పొజిషన్లో ఉండి ఉంటే మీకు కచ్చితంగా న్యాయం చేసేవాడ్ని. ఐ.యాం సారీ... డి.ఎస్.పీ దీక్ష, ఈ కేసులో నా అనుమానితుల్లో మొదటి పేరు.కచ్చితంగా ఆమెకి నిజం తెలుసు.ఇది మాత్రం చెప్పగలను.ఇక ఉంటా “ దివాకర్ గొంతులో ఆవేదన తెలుస్తుంది.

ఇక పోరాడాల్సింది మనమే అని హర్ష,శివలకి అర్ధం ఐంది.

బ్యాగ్ లోంచి ప్లాస్టర్ అతుకులతో ఉన్న డాక్యుమెంట్ తీసాడు.”ఇది ముక్కలుముక్కలుగా దొరికింది ఆ ఇంట్లో నేనే అన్ని ఒక ఆర్డర్లో సరి చేసి ప్లాస్టర్ వేసా”చూపించాడు హర్ష .

జెరాక్స్ కాపి అవ్వడం వలన సరిగా కనపడటంలేదు పైగా అతుకులు ....శివ మూర్తి మనసు మాత్రం విలవిల లాడుతుంది.నా కూతుర్ని నేను సరిగా గమనించలేదా?? తను హత్య చేసిందా?? ఏదైనా తప్పుడు పని చేస్తుందా ఇన్నాళ్ళూ?? “ మనసు వికలం అయిపోతుంది.హర్షా చూపిస్తున్న కాగితం పై మనసు నిలవటం లేదు అతనికి.

“బాబూ!!నీకు మా అమ్మాయి గురించి బాగానే తెల్సినట్టుంది.తను ఏమైనా తప్పుడు దారిలో వెళ్ళిందా?? పిల్లలు, తల్లిదండ్రులతో కంటే కాలేజిలో స్నేహితులతో గడిపే సమయమే ఎక్కువ.మాకంటే మీకే బాగా తెలుస్తుంది.చెప్పు బాబూ నేనేం అనుకోను”

“లేదండి ....నాకు తెలిసి అలాంటిదేం లేదు.కానీ ఎప్పుడూ ఏదో బాధ పడుతూ ఉంటుంది.మొహం ఏదోలా పెట్టుకుంటూ కనిపించేది.షాలిని అనే అమ్మాయితో పరిచయం అయ్యాక కొంచెం ఆనందంగా ఉండేది.కానీ కాలేజిలో పెద్దగా మాట్లాడుకునే వారు కాదు.బయట ఎక్కువగా కలిసేవారు. మీరేం అనుకోకండి మీ అమ్మాయిని నేను చాలా ఎక్కువగానే ఫాలో అయ్యేవాడ్ని.సో.. వాళ్ళు బయట కలిసి తిరగటం చాలా సార్లు చూసా.”

“షాలిని ఏంటే ఎవరు ఆ వీడియో లో ఉన్న అమ్మాయా ??”

మీరూ చూసారా ?? అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు హర్ష.

“పిల్లలు ఏవేవో చేస్తుంటారు బాబూ ...ఉత్సాహంతోనో,కొత్తదనం కోసమో, ఏది ఏమైనా మీ అమ్మానాన్నకి ధైర్యంగా చెప్పగలిగే పనులే చేస్తే జీవితంలో ఏ ఇబ్బందులూ రావు....దాస్తున్నారంటే అది తప్పు అని మీ మనసుకి తెలిసినట్లేగా“

“సార్ మీరు అనుకున్నట్లు ఏం లేదు ఆ వీడియొలో ..అది వేరు అది ఒక ప్రోగ్రాం”

“సర్లే ....మనిషే పోయాక ఏది ఏమైతే ఏముంది ??” శివ మూర్తి కళ్ళలో నిస్పృహ.

ఆ అతుకుల బొంత డాక్యుమెంట్ లో తలలు పెట్టి కుస్తీలు పడ్తున్నారు.ఇద్దరూ.

****

“దేశానికి స్వతంత్రం వచ్చినా సాధారణ మధ్యతరగతి ఉద్యోగి జీవితాలకు మాత్రం ఇంకా రాలేదు. ఎప్పటికీ రాదు కూడా.అధికారులు ఏం చెప్తే అది చేయాల్సిందే.కాదు కూడదు అంటే మన జీవితాలనే తలకిందులు చేసే సత్తా ఉంటుంది పై వాళ్ళకి.ఇదేం స్వతంత్ర దేశమో....ఇదేం సిస్టమో.... “చేసేదేమీ లేదని అర్ధం ఐంది దివాకర్ కి. తిట్టుకుంటూ బ్యాగ్ ఊపుకుంటూ రైల్వే స్టేషన్ చేరాడు.మర్నాడు ఉదయమే కొత్త స్థలంలో రిపోర్ట్ చెయ్యాలి మరి.

ఒళ్ళు విరుచుకుంటూ అలా తల పైకెత్తి చూసాడు. టి.వి లో బ్రేకింగ్ న్యూస్

“వర్షిణి కేసులో కీలక మలుపు .......వర్షిణి ప్రియుడే హంతకుడు .....అరెస్ట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం....

గత రెండు రోజులుగా హర్ష అనే యువకుడి కదలికలపై కన్నేసిన టీం, కొద్ది నిమిషాల క్రితం అరెస్ట్ చేసింది.ఇతను వర్షి

ణి ప్రియుడిగా విశ్వసనీయ వర్గాల సమాచారం “

“ మై గాడ్ ......”తల పట్టుకొని కూర్చున్నాడు దివాకర్...హర్షా గాడు దెబ్బ కొట్టేడా? ఇంత తేలికగా ఎలా నమ్మేను వాడిని? అసలేం జరిగింది?ఇది మళ్ళి నా మెడకి చుట్టుకోదు కదా ??” మొఖంపై చెమటలు తుడుచుకున్నాడు.

గబగబా ఫోన్ తీసి శివమూర్తి కి చేసాడు. ............స్విచ్ ఆఫ్.....ఏంటిది ఎందుకు స్విచాఫ్ చేసాడు?ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా? స్టేషన్లో కానిస్టేబుల్ కి చేసాడు.

“అవును సార్ ....స్పెషల్ టీం కదా సార్ ...తొందరగానే పట్టేశారు.స్ట్రాంగ్ ఆధారాలే ఉన్నాయట.డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా ఏం లీక్ లేకుండా జాగర్త పడుతున్నారు. మనలో మన మాట, ఈ కేసుకి సంబంధించి మనం రికార్డు చేసిన ఏ ఎవిడెన్సు కూడా స్పెషల్ టీంకి దొరకలేదట. మన రికార్డ్ రూంలో ఫైర్ ఆక్సిడెంట్ ఐంది. అంటే...... దీక్ష మేడం కొన్ని ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ని మాయం చెయ్యడానికి రికార్డ్ రూం ఫైర్ చేయించారని గుస గుస లు వినపడ్తున్నాయ్ ఎంత వరకు నిజమో తెలీదు. హర్షాని అరెస్ట్ చేసిన సమయంలో ఒక ఫైల్ ఉందట వాడి దగ్గర.మరి అందులో ఏమైనా ఉన్నాయేమో “అని సమాచారం మొత్తం ఊదేసాడు కానిస్టేబుల్.

“సరే ఇంకేదైనా అప్ డేట్స్ ఉంటే చెప్పు సరే ఉంటా “ అని ఫోన్ పెట్టేసాడు.

“హర్షా దగ్గర ఫైల్ ఉందా?? ఏం ఫైల్ అబ్బా ......” సడెన్గా వెలిగింది బల్బు....తను అక్కడి నుండి వస్తున్నపుడు శివని తెమ్మని చెప్పిన ఫైల్.....దాన్ని చూసి బైట మనోళ్ళు ఏదో ఊహించుకున్నారేమో ....అది ఒక సాధారణ దొంగతనం కేసు ఫైల్...శివ ముందు అతని కూతురి గురించి తప్పుగా మాట్లాడితే బాగోదని ఆ వంకతో పక్కకి పంపించా అంతే.. ఆ ఫైల్ గురించా వీళ్ళు అనుకుంటున్నది.??” ఏదో తెలియని గందరగోళం ....ఈ గోలంతా తనకి చుట్టుకుంటుందని భయం పట్టుకుంది దివాకర్ కి.

పక్కనే వచ్చి కూర్చున్నాడు ఎవరో......

“హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యూ “ నవ్వుతూ పలకరించాడు ఓ పెద్దాయన.

ఒక్క క్షణం మైండ్ రిఫ్రెష్ చేసి ఆలోచించాడు ....”ఓహ్....ప్రొఫెసర్ పాత్రో ... ఐ యాం ఫైన్ హౌ ఆర్ యూ??”

“ఐ యాం గుడ్…ఏంటి ఊరికి వెళ్తున్నారా ?”

“లేదండి నాకు ట్రాన్స్ఫర్ ఐంది.కొత్త ప్లేస్ కి వెళ్తున్నా ...”

“నేను అనుకున్నా ఆరోజు మీ ఇన్వెస్టిగేషన్ స్టైల్ చూసినప్పుడే “

“అవునా!!!అదెలా??”

“ఎక్కువ సిన్సియర్ గా ఉంటే దొరికే గిఫ్టులు అవేగా !!!అతి ఆవేశం పనికి రాదు.” ఓ రకమైన నవ్వుతో ...

పుండు మీద కారం చల్లినట్టు ఈయనేంటి ఇలా ....అసలికే చిరాగ్గా ఉంటే ...మనసులోనే విసుక్కున్నాడు ...ఇంకేం మాట్లాడలేదు.

“నేను మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నా. ట్రైను లేట్ అంట అరగంట “ మళ్ళి అతడే మాట కలిపాడు.

“ఓహ్...నైస్...” మొహం పక్కకి తిప్పుకున్నాడు దివాకర్.

“కేసు ఎంత వరకు వచ్చింది మధ్యలోనే వెళ్లిపోతున్నారే!!”

“ఏంటి సార్ మధ్యలో వెళ్ళిపోయేది....మీ స్టూడెంట్ చచ్చిపోయింది.చంపినోడు మీ స్టూడెంటే. ఇపుడే అరెస్టు చేసారట...మీ ఇంకో స్టూడెంట్ చచ్చిపోయిన దానితో మూతి ముద్దులు పెట్టుకొని ఎక్కడికో పారిపోయింది.అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. వీడు ఎందుకు చంపేడో తెలీదు.వీళ్ళకి మళ్ళి ఆధునిక భావాలు కిస్ ఆఫ్ లవ్ లూ.....ఈ పిల్ల వెధవలకి మా డిపార్ట్మెంట్ నుండి అంత సపోర్ట్ ఏంటో నాకర్ధం కాదు “ అణచుకున్న ఫ్రస్త్రేషన్ మొత్తం వెళ్ళగక్కేసాడు.

“ఏమన్నారు ? కిస్ ఆఫ్ లవ్ ఆ...అదెందుకు వచ్చింది మధ్యలో ??”

“ఏం మీకు తెలుసా అది.మీ స్టూడెంట్స్ అందులో పాల్గొన్నారట....నేను ఇలాంటిది మొదటి సారి విన్నా...పబ్లిక్ గా ఆడామగా ఎవరికీ ఎవరైనా మూతి ముద్దులు పెట్టుకోవడం.అదేదో పెద్ద హక్కు అన్నట్టు ప్రచారం ఒకటి” దివాకర్ కోపం రెట్టింపు అయిపోతుంది.ఎప్పుడూ ఇలా కేసు కొంచెం కూడా సాల్వ్ చెయ్యకుండా వదలలేదు.పైగా ఈ ట్రాన్స్ఫర్ ఒకటి.ఒళ్ళు మండిపోతుంది .

“నేనొకటి అడుగుతా చెప్తారా ప్రశాంతంగా ??”

“హ్మ్...అడగండి “ కాస్త తమాయించుకున్నాడు.

“ మీరు వేలంటైన్స్ డే అనే పదం మొదటి సారి విని ఎన్ని సంవత్సరాలు ఐంది ??”

“నా కాలేజి రోజుల్లో విన్నా...వినడమే తప్ప అప్పుడు ఏం గొప్పగా చేసేవారు కాదు.పైగా మాది విలేజి.ఇప్పుడు అక్కడ కూడా అందరికీ తెలుసు.ఏం ఎందుకు అడిగారిప్పుడు?

“ఓ ఇరవై సంవత్సరాల క్రితం అసలు పెద్దగా తెలియని వేలంటైన్ ఇప్పుడు ఇంతగా ఎందుకు పాపులర్ అయ్యాడు.?అతడు ఏమైనా ఇపుడే పుట్టేడా? ఎపుడో క్రి.శ.496 లో మొదటి సారి చేసారట వాలెంటైన్స్ డే .మరీ ఇన్నాళ్ళు లేనిది గత ఇరవై సంవత్సరాలలో ఎందుకు ఇంత పాపులర్??”

“సార్ అవన్నీ నాకేం తెలుసు ? ఇప్పటికే చాలా ప్రశ్నలు ఉన్నాయ్ నా దగ్గర.నాకింకా ఆలోచించే శక్తి లేదు మీరే చెప్పండి”

“మార్కెటింగ్ బాబూ....మార్కెటింగ్ .....”

“సార్ ...కిస్ ఆఫ్ లవ్ గురించి చేప్తారనుకుంటే ఏవేవో చెప్తారేంటి?”

“వస్తున్నా .....ఒక్క వాలెంటైన్స్ డే రోజు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది తెల్సా??చాక్లెట్లు,బ్రాండెడ్ గ్రీటింగులు,గిఫ్టులు .....వేల కోట్ల వ్యాపారం....అన్నీ ఫారిన్ కంపెనీలే ....తెలుసుగా ...పెద్ద పెద్ద చాక్లెట్,కూల్ డ్రింకు కంపెనీలు అన్ని విదేశాలవే...ప్రేమ కోసం ప్రత్యేకంగా ఒక రోజు పెడితే వేల కోట్ల వ్యాపారం.అందుకే కొన్ని సంవత్సరాలుగా ఈ రోజుని బాగా ప్రచారం చేసి విజయం సాధించారు. మధ్యలో కొందరు ఛాందసులు ఇది మన కల్చర్ కాదు దీన్ని బహిష్కరించాలి అని గోల పెట్టారు,బెదిరించారు. మరి వారికి భయపడి జనం వాలెంటైన్స్ డే మానేస్తే?? ఎన్ని కోట్ల నష్టం ? సో అపుడే వాళ్ళు తెచ్చిన ఆలోచన కిస్ ఆఫ్ లవ్ ...బహిరంగంగా ముద్దులు పెట్టుకొనే స్వేచ్చ....మనుసుకి నచ్చినది ఏదైనా చేసే స్వేచ్చ ....కట్టుబాట్లను తెంచుకొని ఎగిరే స్వేచ్చ .....ఆచారాలను తుంగలో తొక్కే స్వేచ్చ ......బాగుంటాయి ఇవన్నీ .....అందుకే జనం కూడా బాగా ఇష్టపడతారు ఇలాంటి వాటిని.కానీ స్వేచ్చ ముసుగులో ఉన్నది వ్యాపారం.”

“ఏంటి సార్ ఇదీ నాకేం అర్ధం కాలేదు ...వ్యాపారం అన్నారు బాగుంది ..కట్టుబాట్లు,ఆచారాలకి దీనికి ఏంటి లింకు?”

“బాబూ..నూతన సంవత్సరం ఏ డేట్ న పడింది కొంచెం ఫోన్లో క్యాలెండరు చూసి చెప్తావా?”

“ఏ డేట్ ఏంటి ఎపుడైనా న్యూ ఇయర్ జనవరి 1 నే వస్తాది ..కామెడీలు చెయ్యకండి”

“నేను అడిగింది ఉగాది గురించి ..మర్చిపోయావు కదూ.....నీ పండగని నువ్వు మర్చిపోయినపుడే పక్క వాని పండగకు డబ్బులొచ్చేది మరి.సరిగ్గా సంక్రాంతి చేస్కొని ఎన్నేళ్ళు అయింది గుర్తుందా బాబూ!!”

“అవును నిజమే సార్....చిన్నప్పుడు చేస్కున్నట్టు పండగలు లేవు ఇప్పుడు.అంత టైం లేదు కదా ..”

“లేనిది టైం కాదు మిత్రమా...న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి టైం ఉంటుందిగా మరీ? ఒకొక్కటిగా మెల్లగా మన ఆచారాలను ధ్వంసం చేసే కుట్రలో పావులు అయిపోయాం అంతే.నీ ఆచారాన్ని,నీ ఆహారాన్ని మార్చి కోటానుకోట్లు వెనకేసుకోవడమే ఇప్పటి మహా వాణిజ్య యుద్ధం. పూర్వం బ్రిటిష్ వాడు ప్రపంచాన్ని ఏలినా ,అమెరికా వాడు యుద్ధాలు చేసి దేశాలను గెలిచినా దాని వెనుక ఉన్నది వాణిజ్య దురాక్రమణే. ధన మూలమిదం జగత్.ఇప్పుడు అంత ప్రయాస పడటంలేదు.మన లాంటి దేశాల్ని మానసిక బానిసలుగా చేసి డబ్బు సంపాదిస్తున్నారు.”

“నమ్మశక్యంగా లేదు సార్....ఎక్కడో ఉండే కంపెనీలు మన మనసుల్ని ఎలా ప్రభావితం చెయ్యగలవు?”

“చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుంది.సింపుల్ గా ఒకటి చెప్తా.....కొన్ని శతాబ్దాలుగా ఉత్తర భారతంలో ఆవనూనె,దక్షిణంలో వేరుశనగ.కొబ్బరి నూనెలే వంటలలో వాడే వాళ్ళం. ఈ కంపెనీలు వచ్చే వరకు...కొలెస్ట్రాల్ పెద్ద భూతం అన్నారు గుండెకి మంచిది కాదు అన్నారు సన్ ఫ్లవర్ ని పరిచయం చేసారు.ఇదే సర్వ హృద్రోగ నివారిణి అన్నట్టు ఊదరగొట్టేసారు. ఇప్పుడు పూర్తిగా అందరూ అదే వాడుతున్నాముగా.అసలు ఆ పంట మనది కాదు.వాటి విత్తనాలను అమ్మే కంపెనీలు అన్ని విదేశీ కంపెనీలే.వేల కోట్లు పోగేసుకున్నాయి.పోనీ దేశంలో హార్ట్ పేషెంట్లు తగ్గిపోయరా అంటే అదీ లేదు.మా తాతలు ఉక్కులా ఉండేవారు.మేము డొక్కులా ఉన్నాం.మీరైతే ఇక చెప్పక్కర్లేదు.కొన్ని విషయాలను ప్రశ్నిస్తే పిచ్చోడు అంటారేమో అన్నంత బలంగా నాటేస్తారు మన మనసుల్లో.”

“అవును సార్ నిజమే మీరు చెప్తుంటే అనిపిస్తుంది,కానీ డాక్టర్లు కూడా అదే చెప్పారు కదండీ ”

“అమాయకుడా వరల్డ్ హెల్త్ అర్గనైసేషన్ లాంటి పెద్ద సంస్థలే ఈ చదరంగంలో పావులు ఐనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు?”

“మన పండగలను,నమ్మకాలను,ఆచారాలను అలవాట్లను దెబ్బ తీసి దారి మళ్ళించడం తెల్లోడి మాయ ,మన మూర్ఖత్వం. “కొత్త ఒక వింత, పాత మహా రోత “ అని మనం అనుకుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని వాడు తెలుస్కోని మన బంగారం దోచుకుపోతున్నాడు.”

“పండగల్ని ఎలా దెబ్బతీస్తారు సార్ అసలు ??”

“ఏముంది దీపావళి అంటే కాలుష్యం,హోలీ అంటే నీటి వృధా,వినాయక చవితి జలకాలుష్యం,సంక్రాంతి కోడి పందెం జల్లికట్టు అంటే జీవహింస అంటారు. మామూలు ఆదివారాల్లో లక్షల కోళ్ళు,మేకలు.ఆవులనీ తెగనరుకుతారు అది పర్వాలేదు.డుర్రు డుర్రు మంటూ ప్రతి చిన్న పనికి వాహనాలు వాడేస్తారు.పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం పై నోరు మెదపలేరు.కానీ ఒక్క పండుగ రోజే ప్రపంచం అంతం అయిపోతుంది వీళ్ళకి.నిజమే పండుగలను పాత కాలంలా కాకుండా కొన్ని తప్పుడు విధానాలో చేస్తున్నాం.అవి మారాలి ఒప్పుకుంటా.కానీ పూర్తిగా పండుగ అంటేనే అనాగరికం అన్నట్టు ప్రచారాలు చేస్తారు.ఇప్పుడు కొత్తగా రాక్షసులకి కూడా కులాలు ఆపాదించి పలానా వాడు మన కులం వాడే కాబట్టి వాడ్ని మనం పూజించాలి అని ప్రచారం చేస్తున్నారు.ఇవన్నీ ఒక పద్దతి ప్రకారం చేస్తున్న విధ్వంసం.”

ట్రింగ్ ట్రింగ్..........దివాకర్ ఫోన్ ...కానిస్టేబుల్ చేస్తున్నాడు మళ్ళి ఏం కొంప మునిగిందో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాడు.

“సార్....దీక్ష మేడం ఈ సారి గట్టిగా దెబ్బ కొట్టింది సార్ ......గ్లోబల్ గ్రీన్ ngo పై ED(enforcement directorate) వాళ్ళు

దాడి చేసారు సార్....అన్ని హాస్పిటల్స్,సేవా కేంద్రాలు సీజ్ చేసారు. వింధ్య బెనర్జీ పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యేలా ఉంది. ఎంత కక్ష సాధింపు సార్.మనం అనుకున్న దానికంటే దారుణమైన,పవర్ ఉన్న వ్యక్తీ సార్ దీక్ష మేడం.”

దివాకర్ దిమ్మ తిరిగిపోయింది.రాష్ట్రంలో అతి పెద్ద NGO, మోస్ట్ పాపులర్ యాక్టివిస్ట్ వింధ్యని సైతం లెక్కచేయలేదు .ఏంటి ఇంత ఆరాటం దీక్ష మేడం కి. అంటే హర్ష గాడు ఈమెకి ఏమైనా చుట్టమా???అయినా మనకెందుకు ఇక మన కేసు కాదు అది.ఆ హర్ష గాడిని కలిసినందుకు నా మీదకి ఏమీ రాకుండా ఉంటే అది చాలు ”

“ఐ యాం సారి సార్..మీ ఫ్లో దిస్టబ్ చేశా చెప్పండి చెప్పండి “ పాత్రో వైపు తిరిగి దివాకర్

“మీరు మీ ఫోన్లో పడి విన్నట్టు లేరు ...అనౌన్స్మెంట్ వచ్చింది ట్రైన్ వచ్చేలా ఉంది పదండి వీలైతే ఒకే దగ్గర కూర్చొని రాత్రంతా చెప్పుకుందాం ” లేచాడు నవ్వుతూ.

ట్రైన్ వస్తుంది .......

“పండుగలపై దాడి ?? ఇదెక్కడో విన్నట్టు ఉందే!! అని ఆలోచిస్తూ బ్యాగ్ పట్టుకొని లేచాడు దివాకర్ ఫోన్ ట్రింగ్ అంది ...మెసేజ్ చూసాడు ......

“సర్ I have to leave now ..నేను మళ్ళి కలుస్తా మిమ్మల్ని ...బై బై...”అన్నాడు ప్రొఫెసర్ తో హడావిడి గా

“అదేంటి ట్రైన్ ఎక్కరా??రావటం లేదా ??”

“లేదు సార్ నా ప్రోగ్రాం చేంజ్ అయింది.బై బై బై ...నేను వెళ్ళాలి అర్జెంట్ ...మళ్ళి కలుస్తా ...Thankyou sir …..”హడావిడిగా స్టేషన్ బైటకి కదిలాడు.

***

“ముద్దుగా పెంచుకున్న కూతురు పోయింది,భార్యని రక్షించుకోలేని చవటని అయ్యాను.సాయం చేసిన ఎస్సై దూరం ఐపోయాడు.నమ్మిన హర్షా గాడు ద్రోహం చేసాడు.నాకు అండగా నిలబడిన వాళ్ళు కూడా కుప్ప కూలిపోతున్నారు ఎందుకు ఈ బ్రతుకు ....దేవుడా ఏం అన్యాయం చేసాను నేను ....దేని కోసం బతకను ఇంక?? “ నిర్వేదంలో శివ

తాడు సిద్ధం చేసాడు ......

ఫ్యానుకి వేసాడు......

స్టూలు తెచ్చాడు......

ఆఖరుసారి పర్సులో ఉన్న కూతురు భార్య ఫోటోని చూసాడు.....

ప్రేమగా తడిమాడు......

ముద్దు పెట్టుకున్నాడు.......

స్టూలు ఎక్కబోతూ...

భుజంపై ఓ చెయ్యి పడింది.....

వెనక్కి తిరిగాడు........

చూడగానే అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.....

“ఏం ప్రశాంతంగా చచ్చే అవకాశం కూడా ఇవ్వవా...ఎందుకు ?? ఇలా చంపుకు తింటున్నావ్??మేమేం అన్యాయం చేసాం నీకూ ??ఎవడ్ని కాపాడటానికి ఇన్ని ఘోరాలు చేస్తున్నావ్??నీ ఉద్యోగానికైనా న్యాయం చెయ్యకుండా ఏం సాధిస్తావ్ ,..పురుగులు పడి చస్తావ్ ..దీక్షా.....చెప్పు ఎందుకు నీకు అంత పగ మేమంటే చెప్పు” నిప్పులు కురిపిస్తున్నాడు శివ.

“ఎందుకంటే నీ కూతురిని ఎవడూ హత్య చేయలేదు కాబట్టి” ప్రశాంతంగా దీక్ష.

“ఏంటి ? ఎవడూ చంపకపోతే ..ఆత్మహత్యా ?? నా కూతురికి ఏంటి అంత అవసరం ?? ఎందుకు సూసైడ్ చేస్కుంది?”పిచ్చెక్కినట్టు అరుస్తున్నాడు.

“తెలుస్తుంది రేపు.అప్పటి వరకు బతికుండు. “ వెనక ఉన్న కానిస్టేబుల్ ని ఇక్కడే ఉండు అన్నట్టు సైగ చేసి అక్కడి నుండి కదిలింది దీక్ష.


అసలు దీక్ష నిజమే చెప్తుందా ?

నిజమే ఐతే వరూ అసలు ఎందుకు ఆత్మహత్య చేస్కున్నట్టు ???

ఆఖరి భాగంలో చదవండి.

సుధీర్.కస్పా

8985021055



Rate this content
Log in

Similar telugu story from Crime