Sudheer Kaspa

Crime

5.0  

Sudheer Kaspa

Crime

విహంగం

విహంగం

8 mins
1.0K


విహంగం

చక్కగా సున్నిపిండి,కుంకుడుకాయ రసంతో స్నానం చేసి,కురుల నుండి జాలువారుతున్న నీటిని విదిలిస్తూ బీరువా తీసి నలుపు రంగు సల్వార్ తీసింది వర్షిణి .వద్దులే ఈ రోజు..నలుపు రంగు శనివారం కాకుండా ఇంకెప్పుడు వేస్కున్నా, అమ్మ నుంచి తిట్లు పడతాయని తెలుసు వర్షిణికి.దాన్ని లోపల పెట్టేసి నెమలి కంఠం రంగు చుడిదార్ వేసుకొని జుట్టు ఆరబెట్టుకొని జడ వేసుక్కొని,చేత్తో పుస్తకాలు పట్టి చూపు నేలపైనే పెట్టి బయల్దేరింది. తన అడుగుల చప్పుడుకు లయబద్దంగా తాళం వేస్తున్నట్టు చిన్ని శబ్దం చేస్తున్న తన కాలి పట్టీలు చూసుకొని చిన్న నవ్వు నవ్వింది.

పక్కింటి మధుప్రియ వస్తుంది వెనకనే.తనని చూసికూడా చూడనట్లే వడివడిగా అడుగులేస్తుంది వర్షిణి.

“ఏమే వరూ! రోజూ ఒకే టైం కి వెళ్తాం కదా, ఇద్దరూ కలిసే వెళ్దాం అంటే ఊకొడతావు,కానీ ఒక్కరోజూ వెయిట్ చెయ్యవ్ నాకోసం?” వరు భుజం పై చరుస్తూ అంది మధు (మధుప్రియ).

“అబ్బా ఎంత బాగుందిధీ!! సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు దీనిముందు. అయినా దానికంటే నేనే బాగుంటా అంటారు అందరూ. కానీ దీనికే ఇంత ఫాలోయింగ్ ఏంటబ్బా??”ఒకింత కుళ్ళుతో మధుప్రియ వైపు ఎగాదిగా చూసింది వరు(వర్షిణి)

“హి హి!! అదేం లేదే టైం అవుతుందిగా!!” అని మొహమాటంగా పైకి అంటున్నా, “దీని పక్కన నడిస్తే ప్రతివాడి చూపూ దీని పైనే! ఎందుకో నాపై నాకే ఇన్ఫీరియారిటీ వచ్చెస్తుంది” అని మనసులోనే అనుకుంది.ఇద్దరూ కలిసి నడుస్తున్నారన్న మాటే కానీ వరూ చూపు మొత్తం మధు డ్రెస్ పైనే ఉంది.తను వేస్కున్న మోడల్ని ఏమంటారో కూడా వరూకి తెలీదు. కానీ ఆ మోడరన్ ఔట్ఫిట్ లో మెరిసిపోతున్న మధూని చూసి కుళ్ళు తన్నుకొచ్చేస్తుంది.

తన వంక తనే చూస్కుంది ఓసారి.డబ్బాలా లూజుగా ఉన్న పాతకాలం చుడిదార్.ఒక్కసారిగా అమ్మపై కోపం మండిపోయింది.అన్నిటికి చెత్త రూల్స్ పెడుతుంది. చీ!! నేనూ,నా బట్టలూ... ఇలా ఉంటే ఎవడు చూస్తాడు?మొఖం దించుకుని తన ఫీలింగ్స్ మధుకి కనపడకుండా తెగ తాపత్రయపడుతుంది .

సర్రున ఒక ఆటోవాలా ఆగాడు వాళ్ళ ముందుకొచ్చి.

“హ్మ్ వీడొక్కడే నన్ను ఒక అమ్మాయిలా చూస్తాడు.వీడు చూస్తుంటే ఒకింత ఆనందంగా చిన్న గర్వంగా ఉంటుంది ఎందుకో నేనోచ్చే టైం వీడికెలా తెలుస్తుంది?ఫాలో చేస్తున్నాడా? ఏదైతే ఏం లే ఎవడో ఒక్కడైనా చూస్తున్నాడని ఆనందపడటమే ”అనుకుంది మనసులోనే.

ఇద్దరూ ఆటో ఎక్కి కాలేజీకి చేరిపోయారు.క్లాస్లో కూర్చుందే గానీ ఆటోలో జరిగినదే గుర్తొస్తుంది.

ఎప్పుడూ తనకేసి చూసే ఆటోవాడు ఈరోజు మధుని అద్దంలో చూసి ముసిముసిగా నవ్వడం ఇది తెగ మురిసిపోడం,ఒళ్ళుమండిపోతోంది వరూకి.ఐనా వాడితో నాకేంటి అని సముదాయించుకున్నా మనసుకి చాలా కష్టంగా ఉంది.ఆలోచనలు కుదురుగా ఉండనివ్వట్టం లేదు.కళ్ళు మాత్రం బోర్డువైపు నిలబెట్టి ఆలోచనల్లో మాత్రం ప్రపంచం మొత్తాన్ని చుట్టేసే విద్య స్టూడెంట్స్ కి బాగానే తెలుస్తుంది.అదే విద్య ప్రదర్శిస్తుంది వరూ ఇప్పుడు.క్లాసుకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా గమనించలేదు ఆమె.మనసుని ఏదో కట్టి పడేస్తున్నట్టు ఒకటే దిగులు.

లంచ్ బ్రేక్ కూడా వచ్చేసింది.

“హేయ్ వరూ ఏంటే అలా ఉన్నావ్ ??భుజం పై చెయ్యేసి అడిగింది శ్రావ్య.

“హ్మ్ ..ఏం లేదు కొంచెం హెల్త్ బాలేదు “ముభావంగా వరూ

“కొయ్..కొయ్...నాకు తెలుసులే నీ లవ్ స్టోరీ...ఏం హర్ష ఏమైనా తిట్టేడా అలా బుంగ మూతి పెట్టుకున్నావ్??”

“లవ్ స్టోరీ యా నా మొఖానికి ఇప్పుడు అదొక్కటే తక్కువ “ కూర్చున్న సీట్లోనుంచి లేచి క్లాసు బైటకి వెళ్తుంది.

“ఒసేయ్ నా దగ్గరెందుకే దాస్తావ్? మీ ఇద్దరూ లవర్స్ అని కాలేజ్ మొత్తం కోడై కూస్తుందే”

“నాకంత సీన్ లేదులే అయినా ఆ టుమ్రి గాడే దొరికాడా ..నాకు లింక్ పెట్టడానికి ?” బైటకి అలా అంటున్నా ఈ హర్షా గాడికి నేనంటే ఇష్టమా కొంపతీసి?ఎపుడూ అలా కనపడలేదే? ఈ టాక్ ఎలా పుట్టుకొచ్చిందబ్బా?? అనుకుంటుంది మనసులో.

ఇద్దరూ మాట్లాడుకుంటూ క్యాంటీన్ దగ్గరికి వచ్చారు.

అందరూ షాలిని చుట్టూ చేరి కబుర్లు చెప్తున్నారు గుంపుగా. షాలిని క్లాసులో ఓ సెలబ్రిటీ ఇప్పుడు. అవును మరీ!! ఎంత దైర్యంగా అమ్మ నాన్న ఒప్పుకోకపొయినా వెళ్లి పెళ్లి చేసేసుకుంది సూపర్ అసలు ఇదీ!

ఇప్పుడంటే ఈ షాలిని ఒక సెలెబ్రిటి కానీ ,వరూకి మాత్రం ఆమె ఎప్పటి నుండో ఒక రోల్ మోడల్ లాగా.ఆమె డ్రెస్సింగ్,ఆటిట్యూడ్,ఆమె అందం,మాట్లాడే విధానం ఒక్కటేంటి షాలిని అంటే చచ్చేంత ఇష్టం వరూకి.కానీ ఆమెతో పెద్దగా మాట్లాడదు.ఆమెతో మాట్లాడితే తనని కూడా రెబెల్ అనుకుంటారేమో అని భయం వరూకి. కానీ తనకి తెలియకుండానే తను షాలిని ని చాలా విషయాల్లో అనుకరిస్తూ ఉంటుంది.

“హేయ్! ఉన్నది ఒక్కటే జీవితమే! అమ్మ ఏడ్చిందనో, నాన్న కొడతాడనో కాంప్రమైజ్ అయ్యి బతికే కంటే నచ్చినది చేయడమే కరెక్ట్ .”హీరొయిన్ లెవెల్ లో స్టేట్మెంట్లు ఇస్తుంది షాలిని.

“నిజమేనే,కానీ ఒక వేళ వాడు మంచోడు కాకపోతే? మనవాళ్ళ సపోర్ట్ ఉండదు కధే?” అమాయకంగా అడిగింది గుంపులో గోవిందమ్మ .

“ఏంటే ఏ కాలంలో ఉన్నావ్? ఏం నువ్వు చదువుకోలేదా? వాడు మంచోడు కాకపోతే డివోర్స్ తీసుకోని ఇంకొకడ్ని చేస్కుంటాం. నీ ఉద్యోగం,నీ సంపాదన నీకున్నంత కాలం ఎవడికీ బయపడక్కర్లేదు. ఒసేయ్ ఈ పద్ధతులు పొట్లకాయలు పట్టుకు వేళ్ళాడే రోజులు ఎప్పుడో పోయాయి.ఏం మీ నానమ్మలు లాగా మీ అమ్మలు ఉంటారా??అంత పద్దతులు పాటించేవారే ఐతే అన్నిట్లో ఉండాలి.వారికి నచ్చితే పద్ధతి, నచ్చనివి బరితెగింపా? వాళ్ళు అలానే అంటారు ఎవడి లైఫ్ వాడికీ నచ్చినట్లు ఉండాలి ”ఉపన్యాసం దంచేసింది షాలిని.

ఆ మాటలు ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అందరికీ. కళ్ళప్పగించి చూస్తున్నారు.వరూ ఐతే ఇంకానూ. ఇంటికొచ్చాక కూడా వరూ మదిలో అవే మాటలు రింగురింగుమంటున్నాయి.ఇంటిలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే అలవాటులేదు. అమ్మ నాన్న ఎప్పుడూ వాళ్ళ ఉద్యోగం,వాళ్ళ ఫ్రెండ్స్ ఇదే గోల.పట్టుమని పది నిమిషాలు కూడా సరిగ్గా మాట్లాడిందే లేదు.డైరీ తీసింది, తనకున్న నేస్తం అదొక్కటే మరీ.

“నచ్చినట్లు బతకడం,స్వేచ్చా ప్రపంచం. నిజమే అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు నచ్చేదేంటో నాకు కూడా తెలియదు. ఈ కట్టుబాట్లు అన్నీ తెంచుకుని రెక్కలు కట్టుకు ఎగిరిపోవాలని ఉంది. ఈ కుళ్ళిపోయిన కట్టుబాట్లు,పాచిపోయిన పద్ధతుల నుండి దూరంగా స్వేచ్చా ప్రపంచంలో విహరించాలని ఉంది. ఆనందంలోనే జీవితం ఉంది. నాకు నచ్చినట్లు ఉంటా రేపటి నుండి.ఎవడో ఒకడికి ప్రొపోజ్ చేస్తాను.ఎవడో ఏంటి ఆ ఆటో వాడికే చేస్తాను.ఎవడైతే ఏం ?నన్ను ప్రేమించేవాడు ఐతే చాలు.నాకు ఇప్పటి వరకు దొరకని ప్రేమను నేనే వెతుక్కుంటాను. “

“వరూ!!” అని పిలుపు వినిపించింది. నాన్న పిలుపు.గబుక్కున డైరీ మూసేసి బీరువాలో పెట్టి హాల్లోకి పరిగెట్టింది .

“వరూ !రెడీ అవ్వమ్మా. మా ఫ్రెండు కూతురి రిసెప్షన్కి వెళ్దాం మనిద్దరం “. మీ అమ్మ ఎలాగో రాదు అని ఓ పుల్లవిరుపు సౌండ్ ఇచ్చాడు నాన్న.అమ్మ మొహం తిప్పుకుని మొబైల్ వంక చూస్తుంది.

“రెడీ అంట రెడీ!! అన్నీ ఆ పాతకాలం డ్రెస్సు లేగా!” మనసులో కుమిలిపొతూ దొరికినదేదో వేస్కుని బయల్దేరింది వరూ. “ఏంటి ఈ మద్య అమ్మ నాన్నలు సరిగ్గా ఉన్నట్లులేరు !?” అమ్మ మొఖంలోకి చూస్తూ అనుమానంగానే బయల్దేరింది నాన్నతో .

అంతా వెలుగు జిలుగులు. అందరూ నగలు సింగారించుకుని పట్టుచీరల్లో మెరిసిపోతున్నారు. బాగా ఉన్నవారేమో! చాలా కాస్ట్లీ పెళ్లి.ఎటు చూసినా మెరుపులే వారి మొఖాల్లో తప్ప. ఏదో తేడా కనిపిస్తుంది వారి మొఖాల్లో. అడిగేసింది నాన్నని. ‘ఏంటి అందరు ఏదోలా ఉన్నారు?’ అనీ .

“ ఆ అమ్మాయి పారిపోయి గుళ్ళో పెళ్లి చేస్కుంది.మరో గత్యంతరం లేక తెచ్చి రిసెప్షన్ ఇస్తున్నారు అందుకే అలా ఉన్నారు.”దీనంగా మొఖం పెట్టి నాన్న.

“నచ్చిన వాడ్ని చేసుకుంది!! ఎందుకలా ఏడ్చి చస్తారు? కాస్త హ్యాపీగా బ్రాడ్ మైండ్ తో ఉండొచ్చుగా.ఎవడి లైఫ్ వాడు బతుకుతాడు మధ్యలో ఈ ఏడుపు లేంటి??”అనేసింది బయటికే.

ఆశ్చర్యంగా చూసాడు నాన్న . “ఏంటిది ఇంతమాట అనేసింది? అసలు నోట్లో నాలికే లేనట్లుండేది?”అనుకున్నాడు మనసులోనే.

భోజనాలు ముగించుకుని ఇల్లు చేరారు ఇద్దరూ. అమ్మ అదే ప్లేసులో ఉంది ఇంకా! అన్నం కూడా తిన్నట్లు లేదు. ఏమైందో అడుగుదామా? చెప్పదులే ఎందుకు అడగటం అనుకొని వెళ్లి బెడ్ రూమ్ లో దూరింది వరూ.

ఒక పది నిమిషాలు తర్వాత అమ్మ వచ్చి పక్కన కూర్చుంది.”వరూ నీకో విషయం చెప్పాలి “.

“చెప్పమ్మా”

“నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని భయంగా ఉంది కానీ తప్పదు. నేను నిర్ణయం తీస్కున్నాను”

“ఏంటమ్మా! పర్లేదు చెప్పు “

“చూడమ్మా నాకు పందొమ్మిదో ఏట పెళ్లి చేసారు అంటీ సరిగ్గా నీ వయసు. అప్పుడు ఏమీ తెలియదు కానీ ఒక వయసొచ్చాక తెలిసింది మీ నాన్న నాకు సరిపోయే వ్యక్తి కాదని. కానీ నీ కోసం ఆగాను. ఇప్పుడు నాకు నచ్చిన తోడు దొరికింది . నా కొలీగ్. మా ఇద్దరిది ఒకే ఆలోచనా విధానం.నలభై ఏళ్ళు అసంతృప్తితో ఐపోయాయి. ఇంకా మహా అయితే పాతికేళ్ళు . ఉన్న రోజులైనా ఆనందంగా బతకాలనుకుంటున్నా. నువ్వు మాతో ఉండొచ్చు లేదా మీ నాన్నతో ఉంటానన్నా నాకేం అభ్యంతరం లేదు నిర్ణయం నీ ఇష్టం. అని చెప్పి తలుపేసి వెళ్ళిపోయింది .

వరూ బుర్ర తిరిగిపోయింది.

గుండెలో ఏదో తెలియని నొప్పి.

అమ్మేనా ఇపుడు మాట్లాడి వెళ్ళింది? చాలా సేపటివరకు నమ్మలేకపోయింది.

“నాన్నని వదిలి వేరేవాడితో వెళ్ళిపోవడం ఏంటి? నన్ను కూడా వదిలేయ్యడానికి రెడీ ఐపోయింది!! నేనెక్కడ ఉన్నా అభ్యంతరం లేదు అంట!! నాపై ఇన్నాళ్ళు చూపిన ప్రేమ నటనా?? ఈ వయసులో అవసరమా అమ్మకి ? ఛి చీ అందరూ ఏమనుకుంటారు?? చుట్టాలందరూ వెక్కిరిస్తారు.మా క్లాస్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా ?? మొహం ఎక్కడ పెట్టుకోను? కనీసం నా గురించి ఒక్క క్షణం ఆలోచించాలి అనిపించలేదా??” ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగుతున్నాయి.దుఖం కోపం కలగలిసి ఏడుపు తన్నుకొచ్చేస్తోంది.

అదాటున లేచి వెళ్లి అమ్మానాన్నల బెడ్ రూమ్ తలుపు తట్టింది.

తియ్యలేదు..

మళ్ళి కొట్టింది.

పలకలేదు.

”చీ ఎలా నిద్ర పడుతుంది అసలు.పక్కనే నాన్నని పెట్టుకొని ఎలా నిద్రపోతోందో మహా తల్లి.అసలు నాన్నకి తెలుసో లేదో?? “ రకరకాల ఆలోచనలతో బుర్ర పిచ్చెక్కుతుంది.

తలచుకుంటేనే కంపరంగాఉంది....... రాత్రంతా నిద్ర పట్టలేదు.

ఏవేవో పిచ్చి ఆలోచనలు....ఉదయం నాలుగైందేమో..మెల్లగా నిద్రలోకి జారుకుంది.

పడుకున్న రెండు గంటలకే మెలకువ వచ్చేసింది.లేచి బైటకొచ్చింది.

కళ్ళు ఎర్రబడి ఉబ్బిపోయి ఉన్నాయి.మొఖం పై పడుతున్న వెలుగుని తట్టుకోలేక మొహం చిట్లిస్తూ ఆతి కష్టం మీద కిచెన్ లోకి చూసింది.

ప్రశాంతంగా కూరగాయలు తరుగుతుంది అమ్మ.

దడదడా నడుచుకుంటూ వెళ్ళింది అమ్మ దగ్గరికి.”అమ్మా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు.నాకిష్టం లేదు. నువ్వు ఇలా చేస్తే నేను తట్టుకోలేను.రేపు నేనేదైనా చేస్కుంటే నీదే ఆ తప్పు అవుతుంది గుర్తుపెట్టుకో.”

అమ్మ అసలు పలకలేదు.అ మౌనం వరూని పిచ్చెక్కిస్తుంది.

“నేను నీతోనే మాట్లాడుతున్నా....”సీలింగ్ ఎగిరిపోయేలా అరిచింది వరూ

అటునుండి సమాధానం లేదు

ఫ్రిజ్ పై ఉన్న పింగాణి బొమ్మని తీసి ఫాట్ మని విసిరింది.అది హాల్లో పడి పెళ్లున ముక్క చెక్కలై చెల్లాచెదురై కాళ్ళ ముందర ఆగాయి.అపుడే వచ్చిన నాన్న కాళ్ళ ముందర. ఒక్కసారిగా నాన్నని చూసి పరుగెత్తుకు వెళ్లి హత్తుకుని బోరున ఏడ్చేసింది.

నాన్న హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ తలపై నిమురుతూ “తల్లీ!! ....ఇపుడు అర్ధమైందా?? నచ్చినట్లుగా బ్రతకడానికి నచ్చిన వారికోసం బ్రతకడానికి తేడా?ఇన్నాళ్ళ మా జీవితంలో నాపై మీ అమ్మకి మీ అమ్మపై నాకు ఎన్నో సార్లు కోపాలు చిరాకులు వచ్చి ఉండొచ్చు. కానీ ప్రేమ,బంధం ముందు అవన్నీ చిన్నవైపోతాయి.నిజమే నాకు నచ్చినట్టు,నాకే నచ్చినట్టు బ్రతకడం చాలా బాగుంటుంది.రెక్కలు కట్టుకొని స్వేచ్చా ప్రపంచంలో విహరించాలని మీ వయసు పిల్లలకే కాదు భూమిపై బ్రతికే ప్రతి మనిషికి ఉంటుంది.ఎంత ఎగిరినా ఒక చోట సేద దీరేందుకు ఒక గూడు కావాలనిపిస్తుందిగా? ఆ గూడు పేరే కుటుంబం.మనం ఎగిరే దారిలో ఎన్నో గుడ్లగూబలు,రాబందులు ఉంటాయమ్మా.వాటి నుండి రక్షణ ఇచ్చేది కేవలం మన కుటుంబం మాత్రమే.ఎందుకంటే వాళ్ళ కంటే ప్రేమించే వారు లోకంలో ఇంకెవరూ ఉండరు కాబట్టి. మీ వయసులో మీకు అమ్మానాన్నలు విలన్లుగానే కనిపిస్తారు.వయసు ప్రభావమే కాదు,మీ వయసులో ఉన్న ప్రతివాడి తల్లితండ్రి మీ భవిష్యత్తు కోసం ఏవేవో కలలు కంటూ దానికోసం కష్టపడుతూ మీతో గడిపే సమయాన్ని కూడా అటు వైపుకి మళ్ళిస్తాం.నిజమే మా తప్పు కూడా ఉంది.నిన్న నీ డైరి అమ్మ చదివి ఉండకపోతే నీ ఆలోచనలు ఎటు వెళ్ళేవో కదూ?? నువ్వు అడిగావుగా నిన్న రిసెప్షన్లో ఎందుకు అలా మొహాలు మాడ్చుకున్నారు అని. కొన్ని దెబ్బలు తగిలినప్పుడు ఇదిగో ఇపుడు నువ్వు రియాక్ట్ ఐనట్టే మేం కూడా. ఎంత అనుభవం ఉన్నా కొన్ని తట్టుకోవడం కష్టంరా బంగారం.మీ స్వేచ్చకి అడ్డు తగిలే తల్లిదండ్రులు పెద్దగా లేరు ఈరోజుల్లో. కానీ నీ తోడుగా ఎగిరేది జంట పావురమో లేక మారు వేషంలో ఉన్న రాబందో తెలుసుకోవాల్సిన బాధ్యత మాదే కదూ?”వెక్కి వెక్కి ఏడుస్తున్న వరూ తలపై నిమురుతూ మొఖంపై చిరునవ్వుతో సాంత్వనగా చెప్పేడు నాన్న

నాన్న కౌగిలిలో తన వేదన మొత్తం దిగిపోయాక,అమ్మ చెప్పినది మొత్తం ఒత్తి మాటలే అని అర్ధమయ్యాక ఏదో భయంకరమైన పీడకల నుండి లేచిన ఫీలింగ్.ఇంత కాలం ఎంత తప్పుగా ఆలోచిస్తున్నానో అర్ధమైంది తనకి.ఒకింత కోపం కూడా వచ్చింది అమ్మపై. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తనవైపు చూస్తున్న అమ్మని చూసి మూతి తిప్పుకుంది వరూ. అయినా అమ్మపై కోపం ఎంత సేపు? జరిగినది మొత్తం తలచుకుంటూ హాయిగా నవ్వేసుకున్నారు ముగ్గురూ.

నిద్ర మొహంతోనే కాలేజికి వెళిపోయింది.

సాయంత్రం 6 అయింది.ఇంటికి ఇంకా రాలేదు ....అమ్మ ఎదురుచూస్తుంది ....ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ అని వచ్చింది...

ఎనిమిది ఐంది ....ఇంకా రాలేదు ....నాన్న టెన్షన్ పడుతూ అందరికీ ఫోన్లు చేస్తూ ...వరూ ఫ్రెండ్స్ ఇళ్ళకి పరిగెడుతున్నాడు......కాలేజి ..బస్టాపు .....వచ్చే దారిలో ఐస్క్రీం పార్లర్లు,నెట్ సెంటర్లు అవి ఇవి అన్ని వెతికేసాడు....చెమట్లు పట్టి చొక్కా తడిచిపోయింది.....ఎక్కడా ఏమీ సమాచారం లేదు.

పదిన్నర ఐంది .......

మొహం వేలాడేస్కోని....పోలిస్ స్టేషన్ దగ్గరకి వచ్చాడు ....

గుండె దడ దడ లాడుతుంది ..

ఎప్పుడూ పోలిస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు ....

ఒక్కసారి పోలిస్ స్టేషన్ కి వస్తే నా పిల్ల బతుకు బజార్లో పెట్టినట్టే ....అసలు ఏం వార్త వినాల్సి వస్తుందో.....లోపలి వెళ్ళే లోపు ఫోన్ రింగ్ అయ్యి నాన్నా నేను ఇంటికొచ్చేసా గాబరా పడకండి అని చెప్తే బాగుండు...దేవుడా అనుకుంటూ లోపలికి వెళ్తున్నాడు.

గబుక్కున అతడ్ని తోసుకుంటూ ఒక కానిస్టేబుల్ లోపలి పరుగెత్తాడు ....

“సార్.....ఊరు చివర స్లం ఏరియాలో ఒక తందూరి పొయ్యి లో అమ్మాయి శవం ఉంది సార్....పూర్తిగా బొగ్గులా ఐపోయింది ..కేవలం పాదాలు మాత్రం బైటకి ఉండిపోయాయ్.....రోడ్డుపై పెట్రోలింగ్ కి వెళ్తున్నపుడు అక్కడ రోడ్డుపై చెత్తేరుకునే పిల్లలు భయంతో పరుగెడుతుంటే ఆరా తీస్తే విషయం తెల్సింది...పాదాలు చూసి అమ్మాయి అని గుర్తుపట్టా...”రొప్పుతూ చెప్తున్నాడు కానిస్టేబుల్.....

ఆ మాటలు వినగానే సగం ప్రాణం పోయింది అతడికి.....

ఎస్సై హుటాహుటిన పరుగెడుతూ పోలిస్ వెహికల్ ఎక్కుతున్నాడు.......

ఎస్సై పక్కగా వెళ్లి “సార్ ...మా అమ్మాయి........” అని నసుగుతున్నాడు. అతడి కళ్ళలో నీళ్ళు జలజలా రాలుతున్నాయి......

ఎస్సై అతడి మొఖంలోకి చూసాడు ....విషయం అర్ధమైంది ...వెహికల్ ఎక్కండి ...అన్నాడు ...సర్రున దూసుకెళ్ళింది వెహికల్....

తందూరి పొయ్యి .....

పాదాలు మాత్రమే బైటకి కనిపిస్తున్నాయ్.........అవి కూడా సగం సగం కాలి ఉన్నాయి....మిగిలిన శరీరం బొగ్గులా కాలిపోయింది....

పోలీసులు మరియు క్లూస్ టీం జాగ్రర్తగా చూస్తున్నారు.........

వెహికల్ నుండి దిగడానికి వరూ నాన్నకి ధైర్యం చాలలేదు ..ఇది నా వరూ ఎందుకౌతుంది ....ఈ వర్క్ ఐపోగానే కేసు రాస్కోడానికి రమ్మనుంటాడు ఎస్సై అంతే....తనకి తానే ధైర్యం చెప్పుకుంటున్నా గుండెలో ఏదో మూల భయంకరమైన భయం గూడు కట్టుకొని ఉంది.

అతని చేతిపై ఓ చెయ్యి పడింది ...గతుక్కుమన్నాడు ....

కానిస్టేబుల్ వచ్చాడు .....”సార్ రమ్మంటున్నారు”

అడుగు లో అడుగు వేస్కుంటూ ....మెల్లగా సంఘటనా స్థలంకి వెళ్ళాడు ......ఆ పాదాలు......

గుర్తుపట్టేలా లేవు.....

పాదాలకు అతుక్కొని ఉన్న ఆ పట్టీలు.......ఆ పట్టీలు

కుప్ప కూలిపోయాడు......ఐదు షాపులకి తిరిగి అవే మోడల్ పట్టీలు కావాలని చేయించుకుంది వరూ.... ...

భోరుమని ఏడ్చాడు .......”అమ్మా వరూ.........” గుండెలు పగిలేలా ఏడ్చాడు .....

“ప్లీజ్ ....ఆ మోడల్ చాలా మందికి ఉండొచ్చు కన్ఫర్మ్ గా చెప్పలేం ..ప్లేజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ “ భుజం పై చెయ్యేసి అనునయించాడు ఎస్సై.

ఆ పాదాలను దగ్గరగా వెళ్లి చూసాడు ......ఎడమ కాలి బొటనవేలుపై యాంకర్ సింబల్ టాటూ......అతని గుండె ఆగినంత పనైంది ......ఆ టాటూ వెయించుకుందనే ఒక రోజంతా తిడుతూనే ఉన్నాడు అతడు వరూని...మూడు నెలల క్రితం.....ఇపుడు అదే తన చిట్టి తల్లిని గుర్తుపట్టే ఏకైక గుర్తు అవుతందనుకోలేదు అతడు........

బోరు బోరున ఏడుస్తూ కూలబడ్డాడు వరూ తండ్రి....

“మేడం బాడి ఐడెంటిఫై చేసాం ....క్లూస్ టీం వచ్చారు “ఫోన్లో చెప్పాడు ఎస్సై ...

“ఓకే ఐ యాం కమింగ్ “ బయల్దేరింది డి.ఎస్.పీ. దీక్ష

వరూని చంపినది ఎవరు?? వినీలాకాశంలో విహంగమై ఎగరాల్సిన ఆమె జీవితాన్ని చిదిమేసిన కారణాలేంటి వచ్చే భాగంలో చదవండి


Rate this content
Log in

Similar telugu story from Crime