Sudheer Kaspa

Inspirational

4.6  

Sudheer Kaspa

Inspirational

అద్దాల మేడలో గబ్బిలం

అద్దాల మేడలో గబ్బిలం

10 mins
7.0K


ఎపుడో పది సంవత్సరాల క్రితం పేపర్లో అతడిని చూడటమే..ఐ.ఐ.ఎం విద్యార్థికి 70 లక్షల వేతనం,అమెరికాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో కొలువు అని.అక్కడ నుంచి అతడు ఇండియా వచ్చిందే లేదు.అమ్మానాన్నతో కూడా రోజుకి 5 నిమిషాలు వీడియో కాల్ అంతే..

అతడి పేరు ధీరజ్

17 ఏళ్ళకి ఐ.ఐ.టి సీటు .....

21 కి ఐ.ఐ.ఎం లో ఎం.బి.ఏ సీటు......

23 కి 70లక్షల జీతంతో ప్రపంచంలోనే బెస్ట్ బ్యాంక్లో కొలువు.....

ఇవే కాదు, అతడు అతడి గురించి గొప్పగా చెప్పుకునే విషయాల్లో ఇంకొకటి కూడా ఉంది.

47 పెళ్లి సంబంధాల రెజెక్షన్...

హా..అవును...

పొట్టిగా ఉందని ఒకటి ...

పొట్టి బట్టలేసుకుందని ఇంకొకటి....

పొగరుగా ఉందని ఒకటి...

పోష్ గా ఉందని ఇంకొకటి....

చదువు సరిపోదని ఒకటి......

చనువు ఎక్కువ తీసుకుందని ఇంకొకటి ....

ఇలా అన్నీ రిజెక్ట్.. రిజెక్ట్....

వీడియో కాల్ లోనే అన్నీ....

వయసు 33 దాటింది..

ఈసారి ఈ వీడియో కాల్ లతో కుదిరే పని కాదు గాని..ఈ సారి ఎలాగైనా ఇండియా రావాల్సిందే అని అమ్మ పట్టుబడితే తప్పేది లేక 30 రోజుల్లో అన్నీ పూర్తిచేస్కొని వెళ్లే కండిషన్ పై నిన్ననే ఫ్లయిట్ దిగేడు ధీరజ్.

నాన్న పేరు మోసిన పెద్ద డాక్టర్ .... సొంత హాస్పిటల్...అందుకేనేమో ధీరజ్ తరచుగా వాడే మాట

"సక్సెస్ నా డి.ఎన్.ఏ లోనే ఉంది."

"మామ్!ఎందుకు ఈ టైం వేస్ట్...ఒకవేళ నచ్చకపోతే??నా షెడ్యూల్స్ అన్నీ ఎంత డిస్టర్బ్ అవుతున్నాయి తెలుసా??"

"ధీరూ!!నెగెటివ్ గా స్టార్ట్ చేస్తావేంటి?త్వరగా రెడీ అవ్వు ఫ్లైట్ కి టైం అవుతుంది."అంది అమ్మ.

"అన్నట్టు మర్చిపోయా మన ముసలిది ఉండాలి ఏది??"

"ఏయ్! ఏంట్రా ఆ మాటలు నానమ్మని పట్టుకొని??...ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైంది.దగ్గరుండి చూసుకున్నాం 3 నెలలు.మీ బాబాయ్ ఉన్నాడుగా!!ఆస్తి మొత్తం కాజేయ్యడానికి సేవ చేసినట్లు నాటకాలు ఆడుతున్నాం అని ఏవేవో మాటలు అన్నాడు..డాడీ ఏం పట్టించుకోలేదు కానీ పాపం పెద్దావిడ ఎందుకు గొడవలు అనుకుందో ఏమో ..పోతే సొంత ఊరిలోనే పోతాను అని వెళ్లిపోయారు.నెల రోజులైంది. ఫోన్లు చేస్తున్నాం, కానీ డాక్టర్ అయ్యుండి అమ్మని దగ్గరుండి చూడలేకపోతున్నా అనే బెంగ ఉంది మీ డాడీకి."

"చచ్చిపోవడానికి సొంత ఊరు అయితే ఏంటి ఎక్కడ అయితే ఏంటి బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్ మా...ఇక్కడ ఉంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరికేదిగా??సర్లే బయల్దేరు టైం అయ్యింది" నాకెందుకులే ఆ గొడవ అనే ధోరణి వినిపిస్తుంది అతడి గొంతులో.

హైద్రాబాద్ నుంచి వైజాగ్ కి విమానంలో వెళ్లి అక్కడ నుండి విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరు వెళ్ళాలి కారులో..అదీ వాళ్ల ప్రోగ్రాం..అతడు రిజెక్ట్ చేసిన 47 , పెద్ద పెద్ద సిటీ సంబంధాలు. M.L.A ల కూతుర్లు కూడా ఉన్నారు ఆ లిస్టులో. మనోడి టేస్టుకి ఇక పల్లెబాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు తండ్రి.ఈ సంబంధం ధీరజ్ ని ఆకర్షించడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి.

ఫ్లైట్ దిగి కారులో విజయనగరం చేరుతుండగా...

"ఏమండీ కాస్త ఆగమనండి. వినాయకుడు గుడిలా ఉంది దండం పెట్టుకొని వెళ్దాం"

అమ్మానాన్న దిగి దర్శనం చేసుకొని వచ్చారు

ధీరజ్ కారులోనే ఉండిపోయాడు.

"ఏంటో !!డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ దండాలేంటో..శివ లింగాలపై పాలు పొయ్యడాలు,పాముల్ని,చెట్లని పూజించడాలూ..... ఏ కాలంలో ఉన్నారు డాడ్??ఇండియన్స్ ఇక మారరా??" మొఖం చిట్లిస్తూ ధీరజ్...

వీడితో వాదించటం కంటే మౌనంగా ఉండటం మంచిదని ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు నాన్న.

***

"నీ పేరేంటి?"

"సింధు" సిగ్గులు ఒలకబోస్తూ చెప్పింది.

"సీ సింధూ... నా గురించి నీకు తెలిసే ఉంటుంది ఈ సరికే చెప్పే ఉంటారు.."అని తన ఐఐటీ ఐఐఎం ట్రాక్ రికార్డ్ తో పాటు 47 రిజెక్షన్స్ ఆల్ టైం రికార్డ్ కూడా చెప్పేసాడు..

"నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఏదైనా ప్యూర్ గా,పర్ఫెక్ట్ గా ఉండాలి"అంటూ తన ఉపోద్ఘాతం చెప్పుకెళ్తున్నాడు తప్ప ఆమె మొఖం కూడా సరిగా చూడలేదు.

అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ..

"ఇంత మంది సిటీ సంబంధాలను వదిలి ఇంత దూరం ఎందుకొచ్చినట్టు?"సున్నితంగా అడిగింది సింధు..

"హేయ్.. లెట్ మీ బీ ఫ్రాంక్....

సారీ నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది ..సరే నిజం చెప్పాలంటే నేనొక పెద్ద బిసినెస్ ప్లాన్ లో ఉన్నా...ఎంత పెద్ద జాబ్ అయినా ఒకడి దగ్గర పనిచేసే ఖర్మ నాకు లేదని నా ఫీలింగ్....

నా సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ స్కిల్ తో ఒక కంపెనీ పెట్టాలని....

ఆఫ్టర్ ఆల్ సక్సెస్ నా డి.ఎన్. ఏ లోనే ఉంది.

ఇండియా ....

చాలా పెద్ద వ్యాపార స్థలం.....

ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడిపోతున్నారు..సో నేను ఎంచుకున్న బిజినెస్... రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్స్ కంపెనీ. నా సాఫ్ట్వేర్ కంపెనీ ఈ లావాదేవీల్ని ఈజీ చేస్తుంది.ఎవరైనా ఎక్కడ నుండైనా ఆర్డర్ ఇవ్వొచ్చు..కానీ పండించడానికి నాకు భూములు కావాలి,వర్కర్ల కంటే నమ్మకస్తులైన రైతువారి జనం కావాలి....సో...

ఎటువంటి కలుషితం లేనివి పల్లెల్లోనే దొరుకుతాయి ...పొలమైనా... పెళ్లికూతురైనా.....

సాఫ్ట్వేర్ లో చూస్తున్నాగా.. అమ్మాయిలంటేనే భయమేస్తోంది..ఏ రోజు ఎవడితో ఉంటారో వారికే తెలియదు..పొట్టి బట్టలు,మందు పార్టీలు...వీళ్లు చూడటానికే గాని చేసుకోడానికి పనికి రారు..." నిర్లక్ష్యంగా నవ్వుతూ ధీరజ్.

సింధు మనసు చివుక్కుమంది....ఆమె ఇంకేం మాట్లాడలేదు.

పెద్దల అంగీకారాలు,మాటలు అన్నీ క్షణాల్లో అయిపోయాయి.మొత్తానికి ధీరూ పెళ్లి ఫిక్స్ అయ్యింది.అమ్మ మొఖం వెయ్యి కాండీల్స్ బల్బ్ లా వెలుగుతుంది.కారులో తిరుగు ప్రయాణం.....

"ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే..ఈ ఐడియాతో అసలు ఇండియాలోనే అతి పెద్ద కంపెనీగా ఎదగాలి.ధీరజ్ పేరు మారుమోగిపోవాలి.."

కారు కిటికీ నుండి పచ్చని పొలాలను చూస్తూ ఎడతెగని ఆలోచనల్లో మునిగిపోయాడు ధీరజ్. పెళ్లి గురించి సంతోషం కంటే తన ప్రాజెక్ట్ గురించే ఆలోచన అంతా.అతని వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే.

వ్యవసాయంలో రసాయనాలు తక్కువగా వాడే ఒక పల్లె.ఆ పల్లెలో 500 వందల ఎకరాల రైతు ఏకైక కూతురు.ఇంట్లో 10 మంది పాలేర్లు.. ఎప్పుడు కావాలంటే అపుడు దొరికే కూలీలు.ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయాలు వేరే దగ్గర దొరకవు.పైగా అతని అభిప్రాయానికి తగిన "స్వచ్ఛమైన" పల్లె పడుచు....ఇంకేమింకేమింకేం కావాలే....అని పాడుకుంటుకుంటున్నాడు.

ఫోన్ రింగ్ అయింది.

"ధీరజ్???నేను సింధు ...మీతో కొంచెం మాట్లాడాలి"

"హా.. చెప్పు"

"నిజం చెప్పాలంటే నాకూ......."

"హా..నీకూ??"

"అర్ధమైందనుకుంటా..."

"ఏంటి అర్ధమయ్యేది?? సరిగా చెప్పు"

" పెళ్లి ఇష్టం లేదు"

ధీరజ్ మొఖం లో రంగులు మారిపోయాయి..

"వాట్!?....పెళ్లి ఇష్టం లేదా? లేక 'ఈ పెళ్లి' ఇష్టం లేదా?నేను ఇష్టం లేదా?" అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నట్టున్నాయ్...స్వరం తీవ్రత పెరిగింది.

"నో..అలా కాదు..నాకూ....."

"ఏంటి కాదు...నీకు కూడా ఎఫైర్స్ ఉన్నాయా??లేకపోతే ధీరజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరుకుతాడా నీకు?నా టైం ఎందుకు వేస్ట్ చేశావ్ ..నీ ఎఫైర్లు మీ నాన్నకి చెప్పి ముందే ఆపొచ్చుగా??"

జీవితం లో మొట్టమొదటి సారి రిజెక్షన్ ..ఓటమి... అది కూడా ఓ అమ్మాయి తనని రిజెక్ట్ చెయ్యడం..తట్టుకోలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో అతడికి కూడా తెలియని స్థితి.

"షటప్ ధీరజ్...జస్ట్ షటప్....నోటికొచ్చినట్టు వాగకు."

"హా..చెప్పు అయితే చెప్పు ...వన్ రీజన్ ఎందుకు ఇష్టం లేదు ...చెప్పు"

"ఎందుకంటే నువ్వొక గబ్బిలానివి....

అద్దాల మేడలో బ్రతికే గబ్బిలానివి....

తాను తలకిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉందనుకునే గబ్బిలానివి...

పాతకాలపు గుహలో,పాడుబడిన కొంపలో బ్రతకాల్సిన గబ్బిలం అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బతుకుతుంది అంతే..

నీ బిజినెస్ పై ఉన్న ధ్యాస నా బయోడేటా పై లేదు నీకు..నేను పల్లెలో పుట్టినా పట్నంలోనే చదువుకున్నా ..ఇపుడు చెప్పు నువ్వు అనుకునే అమ్మాయిలలానే నేను కూడానా??

పట్నంలో పొట్టిబట్టలు వేసుకున్న ప్రతీది పడుకోడానికి సిద్ధం ఐపోదు, పల్లెల్లో పరికిణి వేసుకుంటే పతివ్రతా ఐపోదు.

నువ్వంటావే....డి.ఎన్.ఏ.. ఒకే తల్లి బిడ్డలే ఒకేలా ప్రవర్తించరు..ఇక అందరినీ ఒకే గాటన ఎలా కట్టేస్తావ్??

నీ ప్రాబ్లెమ్ ఏంటో చెప్పనా నువ్వు నిన్ను తప్ప ఎవర్నీ నమ్మవు,ప్రేమించలేవు..

మనసులో ఇంత చెత్త పెట్టుకొని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా??

వ్యవసాయంతో వ్యాపారం చేయొచ్చు కానీ వ్యాపారం తప్ప లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది?వ్యవసాయాన్ని వ్యాపారం చేసేద్దామనుకుంటున్నావ్ ...నీ జన్మలో నీకు సాధ్యపడదు.."మనసులో ఉన్న కోపం మొత్తం ఉదృతంగా మాటల వరదయింది.

"స్టాప్ దిస్ నాన్ సెన్స్...ధీరజ్ కి సాధ్యపడక పోవడమా...యెస్ ఇట్స్ ఎ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ...కానీ నీ సంబంధం కాకపోతే ఇంకోటి.... బట్ ఐ విల్ డూ ఇట్" తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని అదిమిపెట్టి అరుస్తున్నాడు ధీరజ్.

"సరే ...దీని సంగతి తర్వాత.. ముందు కారు దిగి ఒక మామూలు సగటు మనిషిలా ఒక రైలులో కేవలం 500 రూపాయలతో మీ ఇంటికెళ్లు ఫస్ట్ తర్వాత నీ సక్సెస్ఫుల్ డి.ఎన్. ఏ గురించి మాట్లాడొచ్చు" వెటకారంగా అంది సింధు.

"ఏం అదేం పెద్ద కష్టమా? నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఓకే డన్!!ఇంటికెళ్లాక ఫోన్ చేస్తా నేను చెయ్యలేనిది ఏదీ లేదు ఇదో పెద్ద లెక్కా?? ఇది నాకోసం నేను తీసుకున్న ఛాలెంజ్ నిన్ను ఇంప్రెస్ చెయ్యడానికి కాదు. యూ ఆర్ ఆల్రెడీ రిజెక్టడ్ "అని ఫోన్ కట్ చేసేసాడు.

తదేకంగా అదే ఫోన్ నంబర్ ను చూస్తున్నాడు.అతడి రక్తం మరిగిపోతుంది.ఇన్ని మాటలు ఎపుడూ ఎవరూ అనలేదు.దిగ్గున లేచాడు పర్సు నుండి 5 వంద నోట్లు తీసి జేబులో పెట్టుకున్నాడు.పర్సు అమ్మ చేతిలో పెట్టి 'అమ్మా మీరు వెళ్ళండి.నేను వస్తా మెల్లగా' అని కారు దిగేడు,ఫోన్ కూడా ఇచ్చేసాడు మధ్యలో టెంప్ట్ అయ్యి ఆన్ లైన్ పేమెంట్ చేసేస్తానేమో అని.'రేయ్ బాబు ఎక్కడికి?' అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు.

****

ఇక్కడ నుండి విజయనగరంకి ఆటో, అక్కడి నుండి హైద్రాబాద్ కి ట్రైన్ కి జనరల్ టికెట్ ,రాత్రి భోజనం,అక్కడ దిగేక మళ్ళీ ఆటో .....ఇలా వెంటనే ప్లాన్ గీసుకున్నాడు, ఖర్చు లెక్కేసాడు.500 తో ఈజీ గా వెళ్లిపోవచ్చు పిచ్చి సింధు....అనుకున్నాడు..

షేర్ ఆటో ఎక్కాడు పక్కనే గొర్రెలు కాసుకునే వారు కూర్చున్నారు సీట్ వెనక గొర్రె పిల్ల...ఆ గొర్రె వాసనకి అతనికి వాంతి అయినంత పనైంది.స్టేషన్ దగ్గర దిగేడు. హమ్మ...ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటర్ అని చుట్టూ చూసాడు.

'ఓహ్!! వాటర్ బాటిల్ ఖర్చు లెక్కేయలేదే..

సరే ఆ హోటల్ వాడిని అడుగుదాం...'

అక్కడ టేబుల్ పై ఉన్న వాటర్ మగ్ తీసుకొని గడగడా తాగేసాడు.ఇక్కడే తినేస్తే ఖర్చు తగ్గుతుందేమో అని ఒక 3 మైసూరు బోండా తెప్పించుకుని తిన్నాడు.పరిసరాలు అసహ్యంగా ఉన్నా పంతం నెగ్గాలిగా తప్పదు మరి.

ట్రైన్ ఇంకా 2గంటల టైం ఉంది.ఇంత పెద్ద లైన్ ఉంది జనం తగ్గేక తీసుకుందాంలే టికెట్, అని కూర్చున్నాడు.టైం అవుతుంది లైన్ మాత్రం తగ్గలేదు .ఇక తప్పదు అనుకొని నిల్చున్నాడు.

ఎపుడూ మినరల్ వాటర్ తాగే ప్రాణం, బైట నీరుకి, తిండికి తట్టుకున్నట్టు లేదు.ఏదో తేడాగా ఉంది కడుపులో, కళ్ళు తిరుగుతున్నాయి..ఏదోలా ఉంది పరిగెత్తుకు వెళ్లి భళ్ళున వాంతి చేసాడు..అక్కడ ఫ్లోర్ మొత్తం పాడుచేసినందుకు తనకే సిగ్గుగా అనిపించింది.అక్కడ నుండి వెళ్లి వాష్ బేసిన్ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు..

ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది....

కళ్ళు తిరుగుతున్నాయి.....

ఏడుపు వస్తుంది ఇంతకు ముందు ఎపుడూ ఇలా జరగలేదు..

"అన్నా !!ఏమైందన్నా ?? నీరు తాగుతావా?"

తలెత్తి చూసాడు..

ఒక అమ్మాయి బక్కపలచగా ఉంది చంకలో ఒక పిల్లోడు..బాటిల్ అందించింది.

నీరసంగా ఉన్నట్టున్నావ్ ఉండు అని స్టేషన్లోనే ఉన్న మెడికల్ షాపులో ఓ.ఆర్.ఎస్ పేకెట్ కొని తాగించింది...

"సరే అన్నా ..జాగర్త! నా ట్రైన్ టైం అయ్యింది మీ వాళ్లేవారికైనా ఫోన్ చెయ్యనా?"

"థాంక్యూ!! పర్లేదు..నేను ఓకే... అది ఎంత అయ్యింది? అని తన జేబులో చెయ్యి పెట్టాడు.."

"అయ్యో!!పర్వాలేదు దానిదేముంది .. నా వంతు సాయం నేను చేశా ..జాగర్త అన్నా.....వస్తా "

చిన్న పిల్ల, ఒక ఇరవై ఉంటాయేమో..అపుడే ఒక పిల్లాడు..ఈ ఊరిలో ఏదో ఉద్యోగం చేస్తుందేమో.. దారిన పోయే వాడు ఎలా పోతే ఆమెకెందుకు?ఎంత మంచి పిల్ల..నేనైతే ఇలా చేసేవాడిని కాదు.అనుకునే లోపు ట్రైన్ అనౌన్స్మెంట్.....ఉన్న కాస్త శక్తి కూడదీసుకొని ఎక్కేసాడు ట్రైన్...

ట్రైన్ కిట కిట లాడుతోంది...

కూర్చోడానికి సీట్ లేదు..

నిల్చోడానికే ఖాళీ లేదు..

మెల్లగా ఇరుక్కున్నాడు ....

నిలబడే ఓపిక లేదు. డోర్ దగ్గర మెల్లగా సందు చూసుకొని కూర్చున్నాడు...

ఇంతకుముందు ఇలా కూర్చునే వాళ్ళని తిట్టిన సందర్భం గుర్తొచ్చింది అతనికి.....

సడెన్ గా గుర్తొచ్చింది.....

టికెట్ కొనలేదు.....

చచ్చానురా దేవుడా..టికెట్ కొనకుండా ప్రయాణం...ఇపుడు చెకింగ్ కి వస్తే ఎంత సిగ్గు సిగ్గు...

రానే వచ్చాడు చెకింగ్ కి....

"ఏమయ్యా! చూడటానికి చదువుకున్నోడిలా ఉన్నావ్ టికెట్ లేకుండా ఎలా ఎక్కావు వెయ్యి ఫైన్ కట్టు"

"సార్ నా దగ్గర డబ్బులు లేవు..ప్లీజ్ "

అతడికి మొఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు.చాలా గిల్టీ గా ఉంది.

"హ్మ్.. సరే సరే...300 ఇవ్వు .."

"హమ్మయ్య అనుకొని 3నోట్లు చేతిలో పెట్టి..'సార్ రసీదు!?'అన్నాడు.

"రసీదు కావాలంటే వెయ్యి కట్టు" అని పెడసరంగా చెప్పి వెళ్లిపోయాడు టి.టి

"సింధూ.....ఎంత ఫిట్టింగ్ పెట్టావే నా జీవితంలో ఎపుడూ చెయ్యని పనులన్నీ చేస్తున్నా...."

మెల్లగా డోర్ దగ్గర సర్దుకుపోయాడు..టాయిలెట్ కంపుకి ముక్కు అదిరిపోతోంది.ఏం ఖర్మ రా బాబు...

వైజాగ్ దాటింది ట్రైన్...ఒళ్ళు హూనం అయిపోయింది అపుడే...కళ్ళు మూతలు పడుతున్నాయి.....

ఏయ్ బాబు ఓయ్..భుజం పై తట్టేరు ఎవరో..

"టికెట్ ..టికెట్ తియ్యు.."చెకింగ్ ఇన్స్పెక్టర్.

"సార్ టి.టి కి విజయనగరంలో ఫైన్ కట్టేను సర్.."బిక్క మొహం వేసాడు ధీరూ....

"రసీదు ఏది?"ఏవో పేపర్లు చూసుకుంటూ పైకి చెయ్యి చాపేడు..

ధీరూకి చెమటలు పట్టేయి... ఇంతకంటే అవమానం ఎక్కడా ఉండదు..ఎందుకు ఒప్పుకున్నానా ఈ ఛాలెంజ్ అని కోపం వస్తుంది.

"అయ్యగారు!ఆ బాబు ఫైన్ నేను కట్టేదా? అయ్యా??" వెనుక సీటు నుండి ఓ పెద్దాయన...తెల్లని లాల్చీ,పంచె కట్టులో ఉన్నాడు...

"ఎవరైతే ఏంటి ఫైన్ ఇంపార్టెంట్ కట్టు పెద్దాయనా"

"సర్ ప్లీజ్ వద్దు...నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా ప్లీజ్ వదిలేయండి..."అని దండం పెట్టాడు ధీరజ్.అతని కళ్ళలో ఓటమి భారం,అవమాన భారం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి.

ఏమనుకున్నాడో ఏమో "హ్మ్ నెక్స్ట్ స్టేషన్లో వచ్చి చూస్తా ఉన్నావంటే పోలీస్లు పట్టుకెళ్తారు" అని వెళ్లిపోయాడు.

పెద్దాయన కాస్త పక్కకి జరిగి బాబూ ఇలా రా ఇక్కడ సర్దుకుందాం..

"థాంక్స్ తాత గారు"

"ఏం అయ్యా!పెద్దోళ్ల పిల్లాడిలా ఉన్నావ్ ఏంటి ఇలా?"

ధీరూ ఏం మాట్లాడలేదు ..ఇలాంటి అవమానం తనకి జీవితంలో ఎపుడూ ఎదురవ్వలేదు...కోపం,ఏడుపు,ఉక్రోషం తన్నుకొస్తున్నాయి..ఒక అమ్మాయి విసిరిన చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిల పడటం...ఘోర అవమానం..

"ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అయ్యా...ఏదో నాకు తోచిన సాయం చేద్దామని అడిగా అంతే"

"అదేం లేదు తాత..నా పేరు ధీరజ్...ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందెం...అని మొత్తం చెప్పాడు"

"హహః...భలే పిల్ల దొరికింది నీకు..ఆ పిల్లని మాత్రం వదులుకోకు...హహః..."

"ముసలోడికి అనవసరంగా చెప్పా సాయం చేస్తా అని ఎగతాళి చేస్తాడేంటి??"ఎక్కడో కాలింది ధీరుకి...

"సారీ. సారీ... కోపమొచ్చిందేమో నీకు...అయ్యా నువ్వు ఇంకా గెలవొచ్చు..నువ్వు ఓడిపోలేదు.."

"ఏం గెలిచేది? స్టేషన్ కి ముందే 50 అయిపోయింది.టి.టి కి 300 ...తిన్నది కాస్త బైటకి పోయింది, టిక్కెట్టు కూడా లేకుండా పోయింది...ఇంకా 150 తో తినాలి, చాలా దూరం వెళ్ళాలి.."

"అయ్యా రోజుకి 100 రూపాయలతో జీవితాలు లాగేస్తున్న కుటుంబాలు ఉన్నాయి దేశంలో చాలా...అపుడే ఓడిపోతే ఎలా ..ధీరుడా... ??" చిరునవ్వుతో చెప్పాడు తాత..

అతడి కళ్ళలో ఒకరకమైన వెలుగు కనిపిస్తుంది ధీరుకి..మనిషి బక్కపలచగా ఉన్నాడు ఓ డెబ్భై ఏళ్ళుంటాయి అయినా ముత్యాల్లాంటి పలువరస,సమ్మోహనమైన నవ్వు... ఏదో ఉంది ఈ మనిషిలో అనుకున్నాడు.

"వచ్చే స్టేషన్ సామర్లకోట..నేను దిగేది అక్కడే..నీకు ఎలాగో తప్పదు దిగాల్సిందే ..హహ్హా... నాతో రా నిన్నొక చోటికి తీసుకెళ్తా..."

"ఈ తాత మంచోడిలానే ఉన్నాడు కానీ ఆ నవ్వే ...ఎందుకు అంత ఎగతాళి? సరే... ఓడిపోయా...అయితే ఏంటి నవ్వాలా?"ఉడుక్కున్నాడు ధీరూ మనసులోనే ..."సామర్లకోట ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది...."

సామర్లకోటలో దిగి ఆటో ఎక్కి ఒక చోట దిగారు.

"అయ్యా..పందెం పందెమే నీ పది రూపాయలు ఇవ్వు...ఆటోకి"

"ఏంటిది గుడికి తెచ్చారు ...నాకిష్టం లేదు నేను ఇవ్వను పది రూపాయలు" హమ్మా నా దగ్గర పది రూపాయలు కొట్టేద్దామనే ....అనుకున్నాడు మనసులో

"ఓహ్ అలా అంటావా!!సరే కానివ్వు..పద లోపలికి ఇదే భీమేశ్వర ఆలయం...చాలా ఫేమస్"

"నాకు ఇంట్రస్ట్ లేదు తాత మీరెళ్లండి"

"రావయ్యా బాబూ... మంచి భోజనం దొరుకుతుంది లోపల"

ఇదేదో బాగుందని బయల్దేరాడు ధీరూ....

తాత రోజూ వస్తాడేమో ఇక్కడికి చాలా మంది పలకరిస్తున్నారు.

ఓహో... సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు తాత ,దేవుడికి..ఎందుకు ఈ వయసులో ఈ ఫీట్లు ...దేవుడు ఏమైనా అడిగాడా..హిహి..నవ్వుకుంటున్నాడు...

తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో.. ఒక టేబుల్ పై భోజనం పెట్టారు ఇద్దరికి....బ్రహ్మాండంగా ఉంది వేడిగా ఉంటే ఇంకా బాగుండేది..ఐనా పర్వాలేదు సరిగ్గా తిని ఎంతో కాలం ఐపోయినట్టు అనిపిస్తుంది ధీరుకి చక చకా లాగించేసాడు.

తాత రెండు వేల రూపాయల నోటు తీసిచ్చి అన్నదానం రసీదు తీసుకున్నాడు...

"ఏంటి తాతా 2 భోజనాలకి 2వేలా???అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును"

"చూడయ్యా ...మేము పాత కాలం వాళ్ళం ..ఆకలికి విలువ కట్టలేం..ఓ పది నిమిషాల వరకు ఆకలితో తల్లడిల్లిన నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం.మరికొంత మంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు నా వంతు నేను చెయ్యాలిగా...

అన్ని దానాల్లో కొంచెం అహం కనిపిస్తుందేమో.

అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది.

గుడిలో పెడితే అన్నమే ప్రసాదం అవుతుంది. ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్న ప్రసాదం.రాత్రి అన్నప్రసాదం పెట్టే స్థోమత ఈ దేవాలయంకి లేదట.మనలాంటి వాళ్ళు తలా ఓ చేయి వేస్తేనేగా జరిగేది అందుకే....

అన్ని మంచి లక్షణాలను పూలు అనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి...

మీ జనరేషన్ పిల్లలకి అర్ధం కాకపోవడం దురదృష్టం. సరేలే పద ..భోజనం అయ్యింది.. నీకో 50 రూపాయలు మిగిల్చాను.నా వంతు సాయం నేను చేసాను..ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్.ఓడిపోకు... ఆ పిల్లను మాత్రం వదులుకోకు...హహః నవ్వుతూనే బయల్దేరాడు తాత.నన్ను కలవాలంటే ఇదే ఊర్లో రామకృష్ణ మఠంకి రావచ్చు....

ఈసారి తాత నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది.

సామర్లకోట.... చిన్నపుడెపుడో వచ్చినట్టు గుర్తు ..హా..నాన్నమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనే ఎక్కడో...ఏంటబ్బా అది....ఏదో ఉందే... బిక్కమోలు ...అనుకుంటా ...

వెళదామా వద్దా? ఉన్నవి 150 ఇపుడు ఇది అవసరమా...మనసు ఎందుకో లాగుతుంది .మనసు చెప్పింది వినడమే బెటర్ 150తో ఎలానో వెళ్లలేను హైద్రాబాద్.చూద్దాం ఏం అవుద్దో...

"బాబూ బిక్కమోలు ఎంత దూరం ఇక్కడికి?"

"ఆయ్.. బిక్కవోలు అండీ దగ్గిరేనండి..ఆటో పట్టుకొని ఎలిపోచ్చండీ.. షేర్ ఆటోలు తిరుగుతాయండి...."

"థాంక్స్ అండీ"

అబ్బా ఇండియాలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఆటోనే..మాక్స్ ఒక 20 రూపాయల కంటే ఎక్కువ అవ్వదు... బయల్దేరాడు.

"నానమ్మకి ఏమైనా తీసుకెల్దామా? డబ్బు లేదుగా? పోతే పోయింది, ఒట్టి చేత్తో ఏం వెళతాం.."30 రూపాయలు పెట్టి ద్రాక్ష పళ్ళు కొన్నాడు.

వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు చేరాడు ..

ఇంటి వాకిట్లో జనం ...

వింతగా చూస్తున్నారు ధీరూ వైపు...

ఆ పక్కన ఏదో కడుతున్నారు ..కర్రలకి..

గంభీరంగా ఉన్నారు అందరూ....

ఒక ముసలి అవ్వ ధీరు నుదుటి పై చెయ్ వేసి "నాన్నా నువ్ పార్వతమ్మ గారి మనవడివే కదూ??"

"అవునండి నానమ్మ ఎక్కడ?"

"సమయానికి వచ్చావ్ బాబూ ...నానమ్మ మనకిక లేదు..మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు...నువ్వే ఏదో చెయ్యాలి బాబూ..."

బైట నానమ్మ శవం ...

లోపల నుండి అరుపులు కేకలు...

"మీరు బాగానే సంపాయించారుగా ..మాగాణి మాకు వదిలెయ్యండి ఏం పోయేటప్పుడు పట్టుకుపోరుగా..."అరుస్తున్నాడు ధీరూ బాబాయ్.

"అమ్మ బంగారం పై మాదే పూర్తి హక్కురా అన్నయ్యా..ఇందులో ఎవరూ వేలు పెట్టడానికి వీలు లేదు" గద్ధిస్తున్నారు అత్తయ్యలు.

"ఏం !!మాకు ఆడపిల్లలు ఉన్నారు సమాన వాటా మాకూ కావాల్సిందే" పిన్ని గదమాయించింది...

ధీరజ్ అమ్మ నాన్న ఎటూ తేల్చలేక నిస్సహాయులుగా ఓ మూల కూర్చున్నారు.

"విషయం తేలే వరకు శవం తియ్యడానికి వీలు లేదు..."బాబాయ్, అత్తలు భీష్మించుని కూర్చున్నారు...

జనం తండోప తండాలుగా వస్తున్నారు..

"చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చిందే ...రక్తం ధారబోసి పెంచింది కదే పిల్లల్ని ...పిశాచాలుగా మారిపోయారేంటీ" ఘొల్లు మంది ఓ అవ్వ...

వేలాది మంది జనం బోరు బోరున విలపిస్తున్నారు...పార్వతమ్మ గారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ... పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కొడుకువి అని కూడా చూడము..పెద్ద బాబూ మీరు కానివ్వండి మీకు తోడు మేముంటం రండి...

"బాబాయ్!! బంగారం మొత్తం అత్తలకి ఇవ్వండి ...మా వాటా భూమి మీరు తీసుకోండి ..చేసింది చాలు ఇక అడ్డు తప్పుకోండి"ఒక్క మాటతో తేల్చేశాడు ధీరజ్.

*******

స్మశాన వైరాగ్యం అలముకుంది ధీరజ్ ని

రామకృష్ణ మఠం.....

ధీరూ కంట కన్నీరు ...

అతని గుండెని కరిగించింది

ఆమె మరణమే కాదు

ఆస్తి కోసం జరిగిన రణం కూడా

చద్దన్నం ముద్దలేదు అమ్మ కడుపు నింపగ

దండలేసిన ఫోటోలకు గారెలతో పండగ

అంగారకునికి నిచ్చెనేసే ఆధునిక సమాజం

అమ్మకోసం అర నిమిషం ఆగలేని చేదునిజం

అమ్మకి బాలేదని కబురొస్తే డాక్టర్ గుర్తుకురావాలి కానీ లాయర్ గుర్తొచ్చే కొడుకులు కూతుర్లు ఉన్న ఈ లోకం లో ఎంత ఉంటే ఏం లాభం....

తాతా ఈ ఒక్క రోజు జీవితంలో వింతలెన్నో చూసా ...

నా వంతు సాయం అంటూ చేయందించిన అపరిచితులను,

లంచగొండి ఆఫీసరుని,

తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూసా,

చిన్నతనంలోనే భర్త పోయినా గుండె ధైర్యం తో పిల్లల్ని గొప్పవాళ్ళని చేసిన మా నానమ్మని కూడా ఇప్పుడే చూసా,

డబ్బుకోసం తల్లి శవం దగ్గర బేరం పెట్టే మా సొంత డి.ఎన్. ఏ ని కూడా ఈరోజే చూసా...

ప్రతి దాంట్లో డబ్బు ఉంది ...

డబ్బు లేని వాడు ఆనందాన్ని పంచుతున్నారు

డబ్బున్న చోట బంధాల్ని తుంచుతున్నారు...

నాకు అసలైన ఆనందం కావాలి ...

నా సంపాదన మొత్తం మీ ఆశ్రమానికి రాసేస్తున్నా

నాన్నా..ధీరూ ...

డబ్బున్న చోట దుఃఖం కాదు,ప్రేమ లేని చోట దుఃఖం...నరకం...

ఎగురు ధీరుడా పైకెగురు ....

నీ సైన్యానికి తోడువై ,నీ బంటులకు నీడవై......

తత్వం బోధపడింది.....

గెలవాల్సిన పందెం వేరే ఉంది.

తన మొత్తం సంపాదనతో 100 ఎకరాల భూమిని కొన్నాడు..దానికి తోడు ఊరిని మొత్తం స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం వైపు నడిపాడు.. అందరిని భాగస్వాములను చేస్తూ...తన కొత్త వెంచర్, రైతుల కోసం, రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రియ వ్యవసాయ బాట.

"నీ పందెం ఓడిపోయాను సింధూ....."

"నన్ను గెలిచావుగా చాలులే...."


The End

*******


ఏవండోయ్ మనమందరం అద్దాల మేడల్లో గబ్బిలాలమే.చీకటిలో ఉండే వాటికి ఏ మేడ ఐతేనేమి.వెలుగులోకి వద్దాం .చుట్టూ ఉన్నవాళ్లను కాస్త గమనిద్దాం కష్టాలలో చేయూతనిద్దాం..అందరితో పాటు మనమూ ఎదుగుదాం.....



Rate this content
Log in

Similar telugu story from Inspirational