Parimala Pari

Inspirational

4.2  

Parimala Pari

Inspirational

ఇంటర్నెట్ లేని ప్రపంచం

ఇంటర్నెట్ లేని ప్రపంచం

4 mins
1.8K
సాంబ మూర్తి గారు పదవీ విరమణ చేసి ఉన్న ఊర్లోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అది పల్లెటూరు కావడం వల్ల ఇంకా పూర్తిగా టెక్నాలజీ అభివృద్ధి కాలేదు.


మూర్తి గారి కొడుకు, కూతురు మంచి ఉద్యోగాలు సంపాదించి సిటీ లలో స్థిరపడి పోయారు. ఆయన మాత్రం భార్య రుక్మిణీ తో కలిసి ఆ ఊర్లోనే ఉంటారు.


ఒకరోజు కొడుకు ప్రకాష్ ఫోన్ చేసి తనకి అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది అని, ఆ విషయం తన తండ్రి తో చెప్పాలని అంటాడు. ఫోన్ తీసిన రుక్మిణీ మీ నాన్న గారు బ్యాంక్ కి వెళ్లి ఇంకా రాలేదు. మధ్యాహ్నం అవుతోంది ఆలస్యం అయ్యేలా ఉందేమో అంటుంది.


సరే అమ్మా నేను సాయంత్రం చేస్తాను. నాన్న గారు వచ్చిన తర్వాత నువ్వు ఈ విషయం చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు కొడుకు ప్రకాష్.


మూర్తి గారు మధ్యాహ్నం ఎండలో బ్యాంక్ నుంచి తిరిగి రాగానే భార్య, కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటుంది.


భోజనం చేస్తూ ఈరోజు బ్యాంక్ లో చాలా మంది ఉన్నారు పాపం, మేనేజర్ రంగారావు గారు నన్ను ముందు మీరు వెళ్లిపోండి అన్నా కానీ, అందరూ ఉన్నారు కదా అని నేను కూడా అలాగే లైన్ లో నుంచున్నా. అందుకే ఇంత లేట్ అయ్యింది అంటారు మూర్తిగారు..


ఏమండీ మన ప్రకాష్ ఫోన్ చేశాడు, మీరు బ్యాంక్ కి వెళ్ళినప్పుడు. వాడికి అమెరికా వెళ్లే అవకాశం వచ్చిందట, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాడు దాని గురించి పాపం మీతో చేపుదామని ఫోన్ చేశాడు. సాయంత్రం మళ్లీ చేస్తాను అన్నాడు.


మీరు ఇంట్లోనే ఉండండి అంటుంది రుక్మిణీ గారు.

సరే అని భోజనం ముగించి కాసేపు నడుం వాల్చి సాయంత్రం అయ్యేసరికి లేచి టీ తాగుతూ కూర్చుంటారు.


ఉదయమే లేచి వాకింగ్ చేసి, స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతారు. ఆ తర్వాత భార్య చేసిన టిఫిన్ తిని టీవీ లో వార్తలు చూస్తూ కూర్చుంటారు.


ఈలోగా ఎవరైనా ఏదైనా పనికి సాయం రమ్మని అడిగితే వెళ్తారు. మధ్యాహ్నం వేళకి ఇంటికి వస్తారు. భార్య తో కలిసి భోజనం చేసి కాసేపు అలా పడుకుంటారు.


సాయంత్రం స్కూల్ అవ్వగానే పిల్లలు అందరూ వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో చేరి క్రికెట్ లాంటి ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు మూర్తి గారు.

ఎవరికైనా ఏదైనా గాయం అయితే వెంటనే ప్రథమ చికిత్స చేసి, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. తర్వాత ఆయన స్నేహితులతో కాసేపు పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటారు కావాల్సిన సరుకులతో...

అది ఆయన దిన చర్య.


ఆరోజు సాయంత్రం ప్రకాష్ మళ్లీ ఫోన్ చేసి తండ్రికి తన అమెరికా ప్రయాణం సంగతి చెప్తాడు. నాన్నగారు వచ్చే నెలలో వెళ్లాల్సి ఉంటుంది. ఏమంటారు అని అడుగుతాడు. మీ ఇష్టం అని చెప్తారు మూర్తి గారు.


సరే నాన్న గారు కానీ మీకు స్మార్ట్ ఫోన్ ఉంది, లాప్ టాప్ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంది. హాయిగా ఇంట్లో కూర్చుని బ్యాంక్ పనులు, మార్కెట్ పనులు అన్ని ఫోన్ లో చేసుకోక ఇంకా ఉత్తరాలు అంటూ పోస్ట్ ఆఫీస్ కి, బ్యాంక్ లో డబ్బులు కట్టడానికి మీరే ఎందుకు వెళ్తున్నారు. అమ్మ కంగారు పడుతోంది మీరు ఈరోజు లేట్ గా వచ్చేసరికి అన్నాడు ప్రకాష్.


భార్య వంక చూస్తారు మూర్తి గారు. ఆవిడ తక దించుకుంది. మూర్తిగారు ఇలా అంటారు.

టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈరోజుల్లో అన్ని ఫోన్ లో, ఆన్లైన్ లో అయిపోతున్నాయి రా, కానీ మా చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళం.


వాటిలో ఉండే ఆత్మీయత ఫోన్ లో మాట్లాడినా ఉండదు. ఇప్పటికీ సైన్యం లో ఉన్నవారికి, సహాయం అవసరం అయిన వారికి నేను ఉత్తరాలు రాస్తూ ఉంటాను ఎందుకంటే, వాళ్ళు ఆ ఉత్తరాలు చదివి ఎంతో సంతోషిస్తారు.


ఇక మార్కెట్, బ్యాంక్ కి వెళ్ళటం అంటావా, ఇంట్లో ఖాళీ గ కూర్చుని ఏం చేయాలి రా నేను. కాసేపు ఏదో ఒక పని మీద అలా వెళ్తే సరదాగా నలుగురిని కలిసి నట్టు ఉంటుంది. ఊర్లో విషయాలు తెలుస్తాయి.


మొన్నా మధ్య నేను నీరసం అని రోడ్డు మీద పడిపోతే ఆ రిక్షా సాంబయ్య అదే నా పేరే అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉండేవాళ్ళం కదా సాంబయ్య నే నన్ను తీసుకు వచ్చింది ఇంటికి. ఒకసారి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మన డాక్టర్ గారిని తీసుకుని వచ్చింది మన పని మనిషి లచ్చి.నేను టైఫాయిడ్ జ్వరం తో లేవలేని సమయంలో కిరణ షాప్ సేటు వచ్చి నా ఆరోగ్యం గురించి విచారించి సరుకులు తనే వచ్చి ఇచ్చాడు. టీ కొట్టు రంగయ్య వచ్చి కావాల్సిన కూరలు, మందులు తీసుకుని వచ్చాడు.


ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఆరోగ్యం గా ఉన్నప్పుడు అలా తిరిగి వల్ల అందరినీ పలకరిస్తూ ఉంటాను, కాబట్టి నేను రాని రోజు నాకు ఏమయ్యిందో అన్న అనుమానంతో మన ఇంటికి వచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న నాకు అన్నిట్లో సాయం చేశారు.


అదే నేను ఎప్పుడూ ఇంట్లో కూర్చొని, ఫోన్ లో మాట్లాడుతూ, అన్ని ఫోన్ లో చేసుకుంటూ ఉంటే నన్ను ఎవరు పట్టించుకుంటారు రా. మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అవసరానికి మనం తోడు పడకపోతే మనకి మాత్రం ఎవరు సాయపడతారు?


అందుకే నాకు ఇలాగే బాగుంది. రోజు బయటకి వెళ్లి అన్ని పనులు చూసుకొని రావటం. ఇంకా మీ అమ్మ సంగతి అంటావా, నేను ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది. పక్కింటి పంకజం గారితో, పని మనిషి లచ్చి తో, ఎదురింటి వర్ధనమ్మ గారితో కాలక్షేపం కబుర్లు బాగానే చెప్పుకుంటుంది. నేను వచ్చేశా ఇంకా ఇద్దరమే కదా ఇంట్లో. ఊర్లో విషయాలు అన్ని తనకి నేను, నాకు తను చెప్పుకుంటూ ఉంటాం..


చివరగా మీ లాగా ఫాస్ట్ ఫుడ్ తిని, ఫాస్ట్ కల్చర్ లొ మేము బ్రతకలేము రా. అందుకే ఓపిక ఉన్నంత కాలం మేము ఇక్కడే కాలం గడిపేస్తాం. ఆ తర్వాత సంగతి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు అంటాడు.


కొడుకు ప్రకాష్ కి కూడా తండ్రి మాటల్లో ఆవేదన, నలుగురి కోసం ఆయన చెప్పే మంచి విషయాలు అర్థం చేసుకుంటాడు.


మీ ఇష్టం నాన్న, కానీ మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా మాకు వెంటనే కబురు చేయండి. అంతే కాదు నేను నా అమెరికా ప్రయాణం కూడా కేన్సిల్ చేసుకుంటున్నాను. నెలకి ఒకసారి వచ్చి అక్కడ మీతో గడుపుతాను. మీకు దూరంగా విదేశాలకి వెళ్ళలేము అంటాడు.


ఆ మాటలకి సంతోషం తో ఆనంద భాష్పాలు చేరతాయి మూర్తిగారికి. రుక్మిణీ గారు కూడా ఎంతో సంతోషిస్తుంది.


పల్లెటూరులో ఉండే ఆప్యాయతలు, అనుబంధాలు ఇప్పటికే చేదిరిపోతున్నాయి. టెక్నాలజీ మత్తులో పడి పూర్తిగా చుట్టు పక్కల ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోవటం మానేస్తే మన అవసరాలకి ఎవరు ఉండరు.


కాబట్టి ఆ అనుబంధాలను అలాగే ఉంచుదాం. ఎంతవరకు అవసరమో అంతవరకే ఇంటర్నెట్ వాడకం మంచిది.


మితి మీరితే తిప్పలు తప్పవు.

ఇంటర్నెట్ లేని ప్రపంచం బంధాలు, అనుబంధాలతో ఉంటుంది.Rate this content
Log in

Similar telugu story from Inspirational