Parimala Pari

Abstract Inspirational Others

4.7  

Parimala Pari

Abstract Inspirational Others

రాఖీ

రాఖీ

3 mins
396


"పెళ్ళయ్యాక ఇది మొదటి రాఖీ పండుగ, ఇప్పటివరకూ ఏ సంవత్సరం భయ్యా కి రాఖీ కట్టడం మానలేదు. కానీ ఈ సంవత్సరం నేను ఇక్కడ ఉన్నాను, భయ్యా ఎక్కడో ముంబై లో ఉన్నాడు. తను రాలేడు, నేను వెళ్ళలేను. ఇక ఈ సంవత్సరం భయ్యాకి రాఖీ కట్టడం కుదరదేమో?" అని దిగులుగా ఉంది అంజలి. అంతే కాకుండా అది తన పుట్టినరోజు కూడా కావడంతో మొదటి పుట్టినరోజు భర్త తో ఇంట్లోనే జరుపుకోవాలి అనుకుంది.

"అంజూ, ఎంతసేపు ఇంకా కిందకి రా త్వరగా! స్వీటీ వెయిట్ చేస్తోంది" అంటూ పిలిచాడు భర్త వికాస్.

"ఇదుగో వస్తున్నా" అంటూ వెంటనే వచ్చింది అంజలి.

"హాయ్ వదినా హ్యాపీ బర్త్ డే, లవ్ యూ" అంటూ ముద్దు పెట్టింది స్వీటీ, అంజలి కి.

"ఒసేయ్, రాక్షసి, ముందు నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వవే" అంటూ మూతి తిప్పుకున్నాడు వికాస్.

"హ్యాపీ బర్త్ డే అంజూ, సాయంత్రం నీకొక సర్ప్రైజ్ ఉంది. రెడీ గా ఉండూ!" అన్నాడు.

"థాంక్యూ సో మచ్ ఇద్దరికీ" అని చెప్పి, పక్కనే కూర్చుంది అంజలి.

అన్నకి రాఖీ కట్టింది స్వీటీ. వికాస్ ఒక కొత్త లాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చాడు స్వీటీకి. చాలా సంతోషించింది స్వీటీ. అన్నా చెల్లెళ్ల ఇద్దరినీ చూసి కొద్దిగా బాధపడింది అంజలి, తనకి అలా రాఖీ కట్టడానికి సొంత అన్న ఎవరూ లేరు అని.

"ఈరోజు బర్త్డే బేబీకి వంట నుంచి రెస్ట్, స్పెషల్ ఐటమ్స్ అన్నీ నేను చేస్తా" అంటూ వంటింట్లోకి వెళ్ళింది స్వీటీ.

రూమ్లో ఆలోచిస్తూ కూర్చుంది అంజలి. తనకి చిన్నప్పటి నుంచి రాఖీ కట్టడం అంటే చాలా ఇష్టం కానీ తనకి తమ్ముడూ లేడు, అన్నా లేడు. వాళ్ళింటి ఎదురుగా ఉండే అహ్మద్ అంజలి నాన్న రాముకి మంచి స్నేహితుడు. అహ్మద్ కొడుకు అన్వర్, రాము నీ రాము చాచా అంటూ పిలిచేవాడు చిన్నప్పటి నుంచి. అంజలి కూడా అన్వర్ నీ భయ్యా అనేది.

ఒక రాఖీ పండుగ రోజు అంజలి బాధగా ఉండటం గమనించి ఏమిటని అడిగాడు అన్వర్. తనకి రాఖీ కట్టడానికి ఎవరూ లేరు అని బాధపడింది అంజలి.

"దానికే అంత బాధ ఎందుకు అంజలి, నేను మీ నాన్నను చాచా అని పిలుస్తాను, నువ్వు నన్ను భయ్యా అని పిలుస్తావు కదా, అంటే నేను నీకు అన్న నీ కదా అయ్యేది. మరి రాఖీ నాకే కట్టచ్చు కదా!?" అన్నాడు అన్వర్.

అంజలి చాలా సంతోషించింది. అప్పటినుంచి ప్రతి ఏడు అన్వర్ కి రాఖీ కట్టడం అలవాటు అయిపొయింది. అన్వర్ వెనుకే భయ్యా అంటూ తిరిగేది, తనతోటే ఆడేది అంజలి. అంజలి పెళ్ళిలో బావమరిది గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బావగారిని బ్రతిమాలాలి అంటే, అంజలి కి అన్న, తమ్ముడూ వరస అయ్యేవారు ఎవ్వరూ లేకపోతే అన్వర్ ఆ పని కూడా తనే చేస్తా అన్నాడు.

అలా చెయ్యకూడదు అని అందరూ అన్నా, "మతాలు వేరైనా మనమంతా ఒక్కటే!" అంటూ అంజలికి అన్నలా అన్నీ తానే చేశాడు అన్వర్. అలాంటిది పెళ్ళయ్యాక మొదటి పుట్టినరోజు అన్వర్ దగ్గర లేకపోవటం, రాఖీ కట్టకపోవటం చాలా బాధగా అనిపించింది అంజలికి.

ఇలా ఆలోచిస్తూ ఉన్న అంజలికి సమయం తెలియలేదు.

"అంజూ, పార్టీకి టైం అవుతోంది, ఇదుగో ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు తొందరగా" అంటూ తన చేతిలో ప్యాకెట్ పెట్టాడు వికాస్.

తనకి ఇష్టం అయిన లేత గులాబీ రంగు జార్జెట్ చీర, దాని మీద లేస్ వర్క్. తనకోసం ఎంతో ఆలోచిస్తాడు వికాస్, తనంటే ఎంతో ప్రేమ, తను మూడిగా ఉండి వికాస్ నీ బాధ పెట్టకూడదు... అనుకోని రెడీ అయ్యి కిందకి వచ్చింది అంజలి.

అంజలి అమ్మా నాన్నలు కూడా వచ్చి, అందరూ రెడీగా ఉన్నారు అప్పటికే. వాళ్ళని చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి అంజలికి. పుట్టినరోజు పాపాయి ఏడవకూడదు అని అందరూ తనని నవ్వించారు. కేక్ కట్ చెయ్యబోతు ఉండగా, ఆగు అంజలి, నీకొక సర్ప్రైజ్ అన్నాను కదా! అసలైన గెస్ట్ రాకుండా కేక్ కట్ చేసేస్తావా?" అన్నాడు వికాస్.

అర్థం కానట్టు చూసింది అంజలి.

అప్పుడే వచ్చాడు అన్వర్ "హ్యాపీ బర్త్ డే అంజలి బహెన్" అంటూ...

అన్వర్ నీ చూడగానే పరుగున వచ్చి చేతులు పట్టుకుని అన్వర్ భయ్యా, వచ్చావా? ఈ సంవత్సరం నీకు రాఖీ కట్టలేనేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు, చాలా సంతోషంగా ఉంది నాకు!" అంది ఆనందంగా.

"ఆ క్రెడిట్ అంతా బావగారిదే అంజలి, నీకు సర్ప్రైజ్ చెయ్యాలని నన్ను ఇలా ప్లాన్ చేసి పిలిపించారు. ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం నువ్వు నీ చేతులతో నాకు రాఖీ కట్టాల్సిందే!" అన్నాడు అన్వర్.

"తప్పకుండా భయ్యా" అంటూ వికాస్ నీ చూసి, "థాంక్యూ వికాస్, ఐ లవ్ యూ" అని కన్నీళ్ళతో చెప్పింది అంజలి.

"ఊరుకో అంజూ, నీకు ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం కదా! మరి నీకోసం ఈ మాత్రం చెయ్యలేనా?" అన్నాడు వికాస్.

**మతాలు వేరైనా, అన్వర్ అంజలి మనసుతో, మమతతో అన్న చెల్లెలుగా మారిన వాళ్ళ ఇద్దరినీ చూసి మానవత్వంతో హర్షించారు అందరూ.


Rate this content
Log in

Similar telugu story from Abstract