SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4.5  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"ప్రేమ లేఖ - 1"

"ప్రేమ లేఖ - 1"

6 mins
1.0K


"సార్ పోస్ట్..!"

అంటూ బయట నుండి అరుస్తున్నాడు ఓ పోస్ట్ మ్యాన్.

"కావ్యా..!

కావ్యా ....!" అంటూ కావ్యను పిలిచింది వాళ్ళమ్మ కిచెన్ నుండి,

"ఏంటమ్మా..!" అంటూ బదులిచ్చింది కావ్య టీవీ చూస్తూ.

"బయట నుండి, ఆ పోస్ట్ మన్ అరిచేది నీకేం వినిపించడం లేదా..!

ఆ టీవీ ఆఫ్ చేసి, కాస్త అదేంటో చూడు!" అంటూ కావ్య వాళ్ళమ్మ అనగానే,

"అబ్బబ్బా...

ఒక్క నిమిషం ఉండమ్మా..!

కథ క్లైమాక్స్ కి వచ్చేసింది." అంటూ టీవీలో మూవీ చూస్తూ అందులో మునిగిపోయిన కావ్య బదులిచ్చింది.

"నీ టీవీ పిచ్చి తగలడిపోను..!

ఆ సినిమా పిచ్చిలో పడి, ఈ ప్రపంచం ఏమైపోతుందోనని కూడా పట్టించుకోవెంటే," అంటూ అదే వంటిట్లో నుండి విసుగ్గా అరిచింది కావ్య వాళ్ళమ్మ.

"అమ్మా...

పోస్ట్..!" అంటూ బయటి నుండి మళ్ళీ అరుస్తున్నాడు ఆ పోస్ట్ మ్యాన్.

"నీకు చెప్పాను చూడు,

నాది బుద్ధి తక్కువ..!" అంటూ ఆ వంటింట్లో నుండి హాల్లో ఉన్న కావ్యను తిట్టుకుంటూ, తనని దాటుకుంటూ అలా వీధిలోకి వెళ్లి, చివరికి తనే... వచ్చిన ఆ పోస్ట్ ను తీసుకుంది కావ్య వాళ్ళమ్మ.

కావ్య అలా సినిమా క్లైమాక్స్ కోసం టీవీలో ఆతృతగా ఎదురుచూస్తున్న టైంలో, సరిగ్గా అప్పుడే పవర్ కట్ అవ్వడంతో ...

"ఛ..!

కరెక్ట్ టైంలో తీసేసాడు. అసలు వీడిని..." అంటూ ఆ పవర్ కట్ అవ్వడానికి కారణమైన వారిని తిట్టుకుంటుండంగా..

బయటినుండి ఆ పోస్ట్ కవర్ ను పట్టుకుని, దానిని అలానే చూస్తూ వస్తున్న వాళ్ళమ్మను చూసి,

"లెటర్ ఎవరి దగ్గరి నుండి వచ్చిందమ్మా ?

కొంపతీసి మొన్న నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్లేమైనా, నేను నచ్చలేదని రాశారా..?" అంటూ వెటకారంగా ప్రశ్నించింది కావ్య.

"హా...

ఎవరైతే నీకెందుకే ?"

అసలు ఇంట్లో అంత పనిలో నేనుంటే,

నాకు సాయ పడాల్సింది లేదు,

పోనీ వెళ్లి ఆ పోస్ట్ లెటర్ అయినా తీసుకోవే అంటే

కథ, క్లైమాక్స్ అంటూ ఆ టీవీకి అతుక్కుపోతావా..?

అంత కొంపలు మునిగిపోయెంత విషయం ఏముందే ఆ పిచ్చి సినిమాలో...?" అంటూ కావ్య మీద కోప్పడుతుంది వాళ్ళమ్మ.

" ఏముందా..?

అసలేం మాట్లాడుతున్నావ్ అమ్మా..!

సినిమా అంటే పిచ్చో.. సరదానో.. కాదమ్మా...!

ఆ కథను రచయిత నడిపించే తీరు...

దర్శకుడు క్రియేటివిటీ...

అందులో ఆర్టిస్టుల నటనా నైపుణ్యం..

చివర్లో కన్నీళ్లు తెప్పించే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్...

అబ్బబ్బా...!

అసలు ఒకరికి తెలియకుండా ఒకరు అలా లెటర్స్ రాసుకోవడం,

పదాల ద్వారా మాత్రమే వాళ్ల ప్రేమను పంచుకోవడం,

ఆ రచయిత ఏం చెప్పాడమ్మా..!

చివర్లో వాళ్ళు కలుస్తారా లేదా?

వాళ్ల ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా? అన్నది తెలుసుకునే టైంకి పవర్ కట్ అయిపోయింది.

ఛ ..!" అంటూ కావ్య నిరాశగా అంటుంటే,

"పీడ విరగడయ్యింది!

అసలు నీకిదెం పిచ్చే..!

నీ తోటి వాళ్ళందరూ ఎంచక్కా పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడ్డారు. కొందరు జాబ్ లో సెటిల్ అయ్యారు.

నువ్వేమో చదువు పూర్తిచేసి, చేస్తే ఆ గవ్నమెంట్ జాబ్ యే చేస్తాను అంటూ ఇంకా ఇంట్లోనే ఉన్నావ్.

పోనీ నాకేమైనా సాయపడుతున్నవా? అంటే అది లేదు.

ఎంతసేపు ఆ ప్రేమ సినిమాలు చూడడం, అందులో ఆ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయ్యి ఏడవడం...

మళ్ళీ నాకు, మీ నాన్నకు ఆ స్టొరీ చెప్పిందే చెప్తూ... అరిగిపోయిన కాసెట్టులా మా దగ్గర దాన్ని ఒకటే వాయించడం.

పెళ్ళి చేసి, బాధ్యత తీర్చుకుందాం అని నేననుకుంటుంటే,

అప్పుడే ఈ పెళ్లి గిల్లి వద్దంటావ్..?

ఎవరో ఏంటో తెలియకుండా... అప్పటికప్పుడు హడావిడిగా ఒకర్నికొరు చూసుకుని, రెండు జీవితాలని ముడేసే 

ఈ అరేంజ్డ్ మారేజ్ లా మీద నమ్మకం లేదు అంటావ్.

పోనీ, అంత ఇదిగా ఆ ప్రేమ సినిమాలు చూస్తున్నావు,

ఏదైనా ప్రేమ లో ఉన్నావా అంటే అది లేదంటావు.

పైగా ఈ కాలంలో కుర్రాళ్ళు మంచి వారు కాదు, 

వాళ్ల ప్రేమలలో నిజాయితీ ఉండదు.

అని ఎప్పటికప్పుడు మాతో వితండవాదం చేస్తావ్..!

ఇంకెలాగే నీతో వేగేది, పడేది.

అయినా నిన్నని ఏం లాభం లే, నిన్నింత గారం చేసి, నా నెత్తిన పడేసిన మీ నాన్నననాలి." అంటూ కావ్యను, తనతో పాటు కావ్య వాళ్ళ నాన్నను కూడా వాళ్ళమ్మ ఫన్నీగా తిడుతుంటే,

"ఇదిగో నాగలక్ష్మి...!

అంటే నన్నేమైనా అను, అంతేగాని మా నాన్నని ఏమైనా అన్నావో...!" అంటూ వాళ్ళమ్మ మీద ఫన్నీగా విరుచుకుపడుతున్న కావ్య తో

"హా... ఏం చేస్తావే..!"

ఏం చేస్తావ్...! అంటూ వాళ్ళమ్మ కూడా అంతే ఫన్నీగా కావ్య మీద మీదకి వస్తుంది.

"నిన్నేమ్ చేయనమ్మా..!.

మా నాన్నకి ఇంకో పెళ్లి చేసి, మా ఇంటికి ఇంకో కొత్తమ్మని తీసుకొస్తాను..!" అంటూ తనని ఎగతాళి చేస్తూ బదులివ్వడంతో,

"ఓసి, నీ ఆలోచనలు పాడుగాను..!

(గెడ్డం దగ్గర చెయ్యి పెట్టుకుని)" అంటూ కావ్య తల మీద చేతిలో ఉన్న గిన్నేతో ఒక మొట్టికాయ వేసి, ఆ లెటర్ అక్కడే ఒక టేబుల్ మీద పడేసి తన పనిలోకి తను వెళ్ళిపోతుంది కావ్య వాళ్ళమ్మ నాగలక్ష్మి.

పాత్రల పరిచయం...

(కావ్య...

ఆ సంవత్సరమే డిగ్రీ కంప్లీట్ చేసి, మంచి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఒక నిరుద్యోగి.

ఇంట్లో పెళ్లి గిల్లి అని వాళ్ళమ్మ తొందర పెడుతుంటే, అప్పుడే ఇలాంటి రిలేషన్స్ ఏమీ ఇష్టం లేని కావ్య,

తనకు వచ్చిన సంబంధాలను వాళ్ల నాన్న సాయంతో ఎప్పటికప్పుడు చెడగొడుతుంది.

కావ్యకి సినిమాలంటే మహా పిచ్చి, లవ్ స్టోరీస్ అంటే ప్రాణం. మళ్ళీ అవి ఈ కాలంలోలా టైం పాస్ కి చేసేవి కాదండోయ్..

తనకి కావాల్సినవి సైలెంట్ సాగిపోయే అలనాటి మూగ ప్రేమ కథలు.

అలాంటి ప్రేమ కోసమే...

తను కూడా ఎదురు చూసి చూసి, అలాంటివి ఇక ఈ కాలంలో దొరకవని ఫిక్స్ అయ్యి, అసలు పెళ్ళంటేనే విరక్తి పెంచుకున్న ఓ గొప్ప అంకిత భావమున్న తెలుగింటి అమ్మాయి.

కావ్య నాన్న గారి పేరు నారాయణ స్వామి. ఆయన ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కగానొక్క కూతురు కావడంతో, చిన్నప్పటి నుండి కూతురు అంటే కొంచెం గారం చేశారు ఆయన.

ఇక, తల్లి నాగలక్ష్మి...

ఇల్లాలు..

పెళ్ళీడోచ్చిన కూతురుకి త్వరగా పెళ్లి చేసి, తననొక ఇంటిదాన్ని చేసి బాధ్యత తీర్చుకుందామని, అందరి తల్లిలాగే కంగారు పడుతుంటుంది. కూతుర్ని పెళ్లికి తిందరపెడుతుంటుంది.

చూద్దాం... వేరు వేరు అభిప్రాయాలున్న వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఎలా ఇమడగలుగుతున్నారో..!

చివరికి కావ్య పెళ్లి ఏమవుతుందో..?)

ఇక కథలోకి వచ్చేద్దాం..

అసలే పవర్ ఆఫ్ అయ్యి ఏం చెయ్యాలో తెలియక నిరాశగా కూర్చున్న కావ్యకి,

అలా తన తల్లి నాగలక్ష్మి అక్కడున్న టేబుల్ పై లెటర్ పెట్టీ వెళ్ళడం గమనించింది.

వాళ్ళమ్మకి తెలియకుండా ఆ లెటర్ తీసుకుని చూడగా..

ఆ పోస్ట్ కవర్ మీద,

టు అడ్రస్ దగ్గర

"To

లేఖ .." అని

దాని కింద వాళ్ళింటి(అదే ఇప్పుడు కావ్య వాళ్ల ఫ్యామిలీ ఉంటున్న ఇంటి) అడ్రస్ ఉండి,

ఆ లెటర్ కింద భాగంలో ఫ్రమ్ అడ్రస్ దగ్గర

"From ...

యువర్స్ ప్రేమ్.." అని రాసి, దాని కింద వేరే అడ్రస్ ఉంది. అంటే, ఆ లెటర్ ఎక్కడి నుండి వచ్చిందో ఆ అడ్రస్ అన్నమాట.

"ఈ "లేఖ" ఎవరబ్బా...!

అని కావ్య తనలో తాను అనుకుంటూ

"అమ్మా..!

ఈ లెటర్ ఎవరో లేఖకి వచ్చింది అంట, ఎవరమ్మా ఆ లేఖ, పైగా ఇందులో మన ఇంటి అడ్రస్ ఉంది." అంటూ ఆ హాల్లో నుండి వంటిట్లో కి ఉన్న వాళ్ళమ్మ కి వినిపించేంత గట్టిగా అరిచింది కావ్య..

"అబ్బబ్బా..

ఇంతకుముందు ఈ ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ల అమ్మాయి అంట, ఆ పోస్ట్ మ్యాన్ చెప్పాడు.

(అవును... కావ్య వాళ్ల ఫ్యామిలీ ఆ ఇంట్లోకి అద్దెకి వచ్చి, అప్పటికి 3 రోజులు మాత్రమే అయ్యింది. వాళ్ల నాన్న గారు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో 3 రోజుల క్రితమే ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు.)

అయినా నువ్వెందుకు తీసావ్ ఆ లెటర్. నిన్ను ముట్టుకోవద్దని చెప్పానా..?" అంటూ వాళ్ళమ్మ తనని మందలించే సరికి...

"అయ్యో...

పిచ్చి అమ్మా .!

నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు ఈ లెటర్ని, చూసి చదివి అలా డస్ట్ బిన్ లో పాడెయ్యడం తప్ప..!" అంటూ బదులిస్తుంది కావ్య.

"ఎదుటివాళ్ళకి వచ్చిన లెటర్స్...

అలా తెరిచి చదవడం తప్పే!"

అంటూ కావ్య వాళ్ళమ్మ అంటుంటే,

" హా... !

ఇప్పుడేంటి ఆ లేఖని వెతికి పట్టుకుని, ఈ లేఖను తనకు అందజేస్తావా...?" అంటూ కావ్య ఆవిడని అడుగుతుంది.

దానికి బదులుగా

"పక్క వాళ్ళని అడిగితే వాళ్ళేక్కడున్నారో తెలుస్తుంది గా..!" అంటూ నాగలక్ష్మి

"హా..

ఇక్కడికి వచ్చింది మొదలు,

చుట్టూ పక్కలా అందరినీ అడిగావ్..!

ఇంతకుముందు ఇక్కడ ఈ ఇంట్లో ఉండేవాళ్ళ గురించి,

కానీ అందరూ వాళ్ల గురించి ఏమీ తెలియదు అని మాత్రమే బదులిచ్చారు." అంటూ కావ్య

"అయినా ఆ లెటర్ లో వాళ్లకి సంబంధించి, అసలెంత ముఖ్యమైన విషయం ఉందో ..?

సిగ్గులేకుండా చదవడం కాకుండా, మళ్ళీ చదివి డస్ట్ బిన్ లో పడేస్తాను అని బుద్ధి లేకుండా చెప్తున్నావ్..!" అంటూ కావ్య వాళ్ళమ్మ నాగలక్ష్మి అంటుంటే,

"అందుకే అంటున్నా అమ్మ..!

పాపం వాళ్ళకి సంబంధించిన ఈ లెటర్ లో

అంత ముఖ్యమైన విషయం ఏముందో...?

అది ఇలా వేస్ట్ గా పడుండే బదులు,

కనీసం మనమైన ఆ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలిగా..

రాసినవారి పెట్టుబడికి చదివి మనం న్యాయం చెయ్యాలి కదా!" అంటూ ఆ లెటర్ ఓపెన్ చేస్తుంది కావ్య.

ప్రియమైన,

లేఖ గారికి...

"నా కవితల తోటలో

విరబూసిన ఓ పారిజాత పుష్పమా!

నా ఆశల లోకంలో

వికసించిన ఓ వేకువ కిరణమా!

నా ఊహల పల్లకిలో

మోస్తుంది నీ ఊసుల జ్ఞాపకాలే

నా రాత్రుల కనులలో

కంటుంది నీ రూపపు కలలే..."

అంటూ అందులో కంటెంట్ ని కావ్య చాలా ఇంటరెస్ట్ గా అలా చదువుతుంటే,

ఒక్కసారి గా తన చేతిలోంచి ఆ లెటర్ లాక్కుంది అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళమ్మ,

"ఇలా ఇవ్వమ్మా...?" అంటూ కావ్య బ్రతిమాలుతుంటే,

"చెప్పానా ..!

ఇలా ఎదుటివారి లెటర్ చదవడం తప్పని, అయినా నువ్వు అలా మామూలుగా చెప్తే వినవు,

అసలే నాన్నగారు వచ్చే టైం అయ్యింది. వెళ్ళు... వెళ్లి ఇప్పటికైనా ఆ బుక్ తీసి చదువు" అంటూ కావ్యను మందలించింది వాళ్ళమ్మ.

చేసేదేం లేక నిరాశగా అక్కడి నుండి వెళ్లిపోయింది కావ్య..

"ఆ లెటర్ లో ఇంకేముంది?

ఎవరా ప్రేమ్..?

ఎవరా లేఖ..?

వాళ్ల మధ్యనున్న ఆ సంబంధం ఏమిటి..?"

తర్వాతి భాగం

"ప్రేమ లేఖ - 2"

లో మిగిలిన కథను కొనసాగిస్తాను.

అప్పటివరకూ మీ విలువైన అభిప్రాయాలను సమీక్షలతో తెలపండి. నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి ఈ కథను మరింత ఉత్తేజంగా రాయడానికి దోహదపడతాయి.

పాఠకులకు గమనిక:

ఇప్పటివరకూ యోధ కథతో మీ మెదళ్ళని ఉతికేసానుగా, మళ్ళీ అలాంటి కంటెంట్ తో మిమ్మల్ని విసిగించడం నాకిష్టం లేదు. అందుకే, ఈ సరికొత్త ప్రేమ కథ "ప్రేమ లేఖ" తో మీ మనసులను కొంచెం ఆహ్లాదపరచడానికి ఓ ఈ చిన్ని ప్రయత్నంగా మీ ముందుకు వస్తున్నాను.

ఎప్పటిలాగే ఈ కథను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...

చదువుతున్న పాఠకులందరికీ నా కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract