Dinakar Reddy

Abstract Drama Inspirational

4.5  

Dinakar Reddy

Abstract Drama Inspirational

వివస్త్ర

వివస్త్ర

3 mins
620


ఒక్కసారి ఆ ఫిగర్ ని చూడు. ఆ బాడీ ఎలా చేశాడ్రా బాబూ. ఒక్కోటీ ఐదు కిలోలు.. రోడ్డు మీద నడుస్తున్న అమ్మాయిని తనదైన శైలిలో వర్ణిస్తూ ఉన్న గిరిధర్ మాటలు కారు సడెన్ బ్రేక్ పడేసరికి ఆగాయి.


రేయ్. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇలాంటివి మాట్లాడొద్దు అని చెప్పాను కదా. చిరాగ్గా అన్నాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న భార్గవ్. ఇంకాస్తయ్యుంటే ఏదో ఒక బండిని గుద్ది మనం స్పృహ తప్పేవాళ్ళం అని గిరిధర్ చెప్పిన అమ్మాయిని చూస్తూ బండిని ముందుకు పోనిచ్చాడు భార్గవ్.


అయినా ఎప్పుడూ అదే యావ ఏంట్రా బాబూ నీకు. నోరు అదుపులో పెట్టుకో. లేకుంటే ఏదో చిక్కుల్లో పడతావ్ అని హెచ్చరించాడు భార్గవ్.


నువ్వొకడివి దొరికావురా బాబూ. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం ఇలా. అసలు మన కవులు, రచయితలు స్త్రీ దేహాన్ని ఎలా వర్ణించారో తెలుసా అంటూ ఏదో క్లాస్ మొదలు పెట్టబోయాడు గిరిధర్.


హా. ఎలా. కేజీల మాంసంలాగానా. చెప్పు. చెప్పు. దేవుడు నోరిచ్చాడు. నాలాంటి సన్నాసి దొరికితే ఏదో ఒకటి చెప్పడానికి రెడీ అయిపోతారు అని సీరియస్ గా బండి గేరు మార్చాడు భార్గవ్.


ఇప్పుడు నువ్వెందుకు సీరియస్ అవుతున్నావ్ అన్నాడు గిరిధర్.


సీరియస్ కాదు. నేను చెప్పేది ఒకటే. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక వయసును బట్టి కోరికలు, మరో వయసులో వైరాగ్యం రెండూ ఉంటాయి. నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండిపోవు. కవులైనా రచయితలైనా సందర్భాన్ని బట్టి స్త్రీ పురుషుల దేహాల్ని అందంగా, దృఢంగా వర్ణించి ఉండొచ్చు. శరీరం ఇచ్చే అవస్థల్ని దగ్గరగా చూస్తే ఆ తరువాత అందరినీ ఒకే విధంగా చూడలేవురా. కాబట్టి కొన్ని ఫీలింగ్స్ ఇంకా కొన్ని మాటలు అదుపులో ఉంటేనే నీకు మంచిది అని బండిని ఒక అపార్ట్మెంట్ ముందు ఆపాడు భార్గవ్.


అయ్యా భార్గవ రామా. ఏదో ఒక్క కామెంట్ చేసినందుకు నాచేత భగవద్గీత చదివిస్తావా ఇప్పుడు అంటూ కారులోంచి బైటకి దిగాడు గిరిధర్. 


సర్లే జాగ్రత్త అంటూ తన ఇంటి వైపు వెళ్ళిపోయాడు గిరిధర్.


భార్గవ్ అపార్ట్మెంట్ వైపు నడుస్తూ రోడ్డు వారగా ఎవరో కూర్చుని ఉండడం చూశాడు. మసక వెలుతురు. ఆ సమయంలో అందరూ నిదురపోతున్నారు. పరీక్షించి చూస్తే ఆమె ఒక ముసలమ్మ. నెరిసిన జుట్టూ, ముడతలు పడిన ఒళ్ళు. చిరిగిన పాత గుడ్డలు అల్లినట్లు ఉంది ఆమె ఒంటి మీదున్న వస్త్రం. జాకెట్టు లేదు. ఎడమ వైపు ఎద భాగాన్ని కప్పుకునేందుకు ప్రయత్నించి వదిలివేసినట్టుంది. పూర్తిగా శరీరాన్ని కప్పుకోవడానికి ఆ అతుకుల గుడ్డ సరిపోలేదు.


ఆమె ఎడమ వక్షోజం తోలుతిత్తిలా అనిపించింది అతనికి. బహుశా దాని వెనుక ఉన్న గుండె కనిపించిందో ఏమో.

పొద్దున్నే రోడ్డు మీద వెళుతున్న అమ్మాయిని వివస్త్రగా ఊహించి ఆమె వక్షోజాల బరువును, నునుపుదనాన్ని అంచనా వేసిన ఆలోచన. అతనికి ఒకలాంటి జుగుప్స కలిగింది. తన మీద. తన ఆలోచనల మీద. మళ్లీ అంతలో నవ్వు వచ్చింది. అప్పటికప్పుడు నేనేమన్నా అవతార పురుషుడినా అస్సలు అలాంటి ఫీలింగ్స్ లేకుండా 

ఉండడానికి. వయసు అలాంటిది మరి. మరెందుకీ ఓవర్ యాక్షన్. ఇంత ఆలోచన. 


కేవలం వయసేనా. భార్గవ్ మాటలు గుర్తొచ్చాయి. చుట్టూ చూశాడు. దూరంగా షాపింగ్ మాల్ ప్రకటన ఉన్న హోర్డింగ్ ఉంది. కత్తిలా ఉంది ఆ అమ్మాయి డ్రెస్ లో. ఆమె ఎద భాగం లోపల ఉన్న నిధికి దారి చెబుతున్నట్టు సన్నటి గీత.


అలాంటి దేహాన్ని అతను చూశాడు. అవును. మొబైల్లో చూశాడు. సినిమాలో చూశాడు. గంటలు గంటలు అలాంటి ఫోటోలు వెతుకుతూ చూస్తూ గడిపాడు. నేను చూస్తున్నానా. లేదా నా ఆలోచనల్ని, నేను ఇలాగే ఆలోచించాలి అని ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా? 

వయస్సు ఒక్కటే కారణమా ఈ భావనలకు?


మరి వయసు తేడా లేకుండా మాట్లాడే మాటలు?


 సినిమా, టీవీ, పుస్తకాల అట్టలు, వీడియోలు.. ఎక్కడ చూసినా అదే ఎద భాగం. అందంగా మత్తెక్కిస్తూ పర్వతద్వయాల్లాంటి వక్షోజాలు. ఎవరైనా పిల్లల మీద, టీనేజర్స్ మీద వీటి ప్రభావం ఆలోచిస్తున్నారా? అయినా నాకెందుకు? ఇదంతా ఎప్పటి నుంచో ఉన్నదే కదా! అందరూ నాలానే ఉండరు కదా? అంటే నేను చెడ్డ వాణ్ణా? మిగతా వాళ్ళు అందరూ సరిగ్గానే ఆలోచిస్తున్నారా? మరెందుకు ఇన్ని ఘోరాలు.. బట్టలు..ఎవరి శరీరం వారిది అయినప్పుడు మనమెందుకు ఇలా మరొకరి శరీరాన్ని వస్తువులా భావించే స్వేచ్ఛ తీసుకుంటున్నాం. ఎవరిస్తున్నారు ఈ స్వేచ్ఛని మగవాడికి.. అతనిలో అంతర్మథనం కొనసాగుతోంది.


ఎప్పుడేం జరిగినా ..

అంటే ఇప్పుడు అమ్మాయిల తప్పంటావా.

మరి నువ్వు వేసే బట్టల మాటేమిటి. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ చూసే కామెంట్ చేసావా పొద్దున. లేదే.

వాళ్ళ డ్రెస్సుల గురించి కామెంట్ చేస్తే నిన్ను మామూలుగా కొట్టరు. లోపల్నుంచి అంతరాత్మ హెచ్చరించింది. సంకుచిత మనస్తత్వం అని నీకో ట్యాగ్ లైన్ వస్తుంది అని మళ్లీ అంది.


అలా అని కాదు. ఎవరిష్టం వాళ్ళది. నా తప్పేనా. మార్కెటింగ్ తప్పా. అందరం ఇంతేనా.. అంటూ ఏదో నసిగాడు. ఈ సోది వదలి ఆ ముసలమ్మను చూడమంది అంతరాత్మ.


ఆమె చుట్టూ సగం తిని వదిలేసిన అన్నం పొట్లాల పార్సిళ్లు , వాటిని పంచుకుంటున్న ఈగలూ కుక్కలూ. కళ్ళు మూస్తూ తెరుస్తూ ముసలమ్మ. ఇంకాసేపు ఉంటే ఆమె పరిస్థితి ఏమవుతుందో. వెంటనే తనకు తెలిసిన వృద్ధుల సేవా సంస్థకు ఫోన్ చేశాడు. 


ఆ సమయంలో కూడా వాళ్ళు వెంటనే వచ్చి ఆమెను వ్యానులో తీసుకెళ్లడం అతనికి ఒకలాంటి తృప్తినిచ్చింది.


వెళ్ళే ముందు ఆ ముసలమ్మ కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళలో ఏ భావమూ లేదు.

ఆ ముసలమ్మ శరీరం మీద అతని చలి కోటు. దాన్ని భద్రంగా పట్టుకున్న ఆమె చెయ్యి. అంతే. అతని కళ్లలోంచి కన్నీరు ఒలికింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract