ఒక్క పూట అన్నం
ఒక్క పూట అన్నం
అమ్మా! టిఫిన్ పెట్టు. తొందరగా.. వినోద్ కేకలు వేస్తున్నాడు.
సునీత టిఫిన్ హాట్ ప్యాక్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అమ్మా! ఈ రోజు టిఫిన్ ఏంటి? బ్రెడ్ ఆమ్లెట్ వేసావా? లేక ఉప్మా పెసరట్టు .. అంటూ హాట్ ప్యాక్ తెరిచి ఆగాడు.
సునీత నిన్న రాత్రి మిగిలిన అన్నం చిత్రాన్నం ( లెమన్ రైస్) చేసి పెట్టింది చూశాడు.
ఏంటమ్మా లెమన్ రైస్ చేశావ్ మళ్లీ అని నసిగాడు.
నువ్వు నిన్న అన్నం తినలేదు. మొన్న కూడా తినలేదు. బయటే తిని వస్తున్నట్లు ముందే చెప్తే అన్నం తక్కువ వండే దాన్ని కదా. అన్నం పడేసి వేస్ట్ చేయడం ఎందుకు? అందుకే చిత్రాన్నం చేసాను. తప్పేముంది అంది.
మరి మీకో? నేను వేడిగా పెసరట్టు వేసుకుంటా అంది సునీత.
రామ్మూర్తి నవ్వుతూ సునీత వైపు చూసాడు. భార్య మనస్సులోని ఆలోచనను గ్రహించి నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
నాన్నా చూడు. అమ్మ వేడిగా పెసరట్టు వేసుకుని తింటుందట. నాకేమో రాత్రి అన్నం లెమన్ రైస్ చేస్తోంది రోజూ అని వినోద్ వాళ్ళ నాన్నకు కంప్లయింట్ చేసాడు.
అవునా. రోజూ నువ్వెందుకు బయట తింటున్నావ్ నాన్నా? అని అడిగాడు రామ్మూర్తి.
ఫ్రెండ్స్ తో కలిసి మొన్న ట్యూషన్ అయిపోయాక ఫ్రైడ్ రైస్ తిన్నాం. నిన్న మసాలా పూరీ రెండు ప్లేట్లు తినేసరికి ఆకలి అవలేదు. అంతే నాన్నా అన్నాడు వినోద్.
చూడు వినోద్.
ఫ్రెండ్స్ తో కలిసి తినద్దు అని చెప్పను. కానీ అమ్మ మన కోసం వండింది వృథా చేయకూడదు కదా. ముందే చెబితే తను తక్కువ వండుతుంది. లేదు ప్లాన్ చేయకుండా అలానే బయట తినేస్తాం అంటే చెప్పు. పాకెట్ మనీ కట్ చేస్తాను అన్నాడు రామ్మూర్తి.
వినోద్ ముఖం అటు తిప్పి అమ్మ వైపు చూసాడు. అమ్మా! మొన్న నువ్వు చెప్పినప్పుడే బయట తినకుండా ఉంటే సరిపోయేది. ఇప్పుడు పాకెట్ మనీ లేదు. ఇంట్లో టిఫిన్ లేదు అని డీలా పడ్డాడు.
అబ్బో. అంత యాక్షన్ ఎందుకులే కానీ, నీకూ పెసరట్టు చేస్తాను. కానీ కొంచెం రైస్ కూడా తినాలి అంది. అలానే పాకెట్ మనీ ఏమీ కట్ చేయకండి మీరు. బయట తింటే కొద్దిగా తిను. నేనూ రైస్ వండకుండా నీకూ చపాతీ పిండి కలుపుతాలే. నువ్వు తింటానంటే చేస్తా. లేదంటే ఏమీ వృథా కాదు అంది రామ్మూర్తి వైపు చూస్తూ.
ఒక్క పూట అన్నం విలువ నీకు తెలియాలి అనేదే మా ఉద్దేశ్యం. రాత్రి అన్నం అని అంటున్నావ్ ఆ అన్నం ఎంత విలువైనది నీకు తెలియాలి ఇలా నువ్వడిగిన టిఫిన్ పెట్టకుండా ఉన్నాను. అంతే.
సరే అమ్మా అన్నాడు వినోద్.
సునీత అతడి తల నిమిరింది.
వినోద్ సంతోషంగా మా అమ్మ ఎంతైనా అండర్స్టాండింగ్ లో గ్రేట్ అన్నాడు.
మొత్తానికి కొడుక్కు మంచి అయిపోతావ్ అన్నాడు రామ్మూర్తి.
పాఠం నేర్పేటప్పుడు కటువుగా ఉంటాను. మంచి కోసమే కదా. అర్థం చేసుకున్నాక కరిగిపోవడం మన వంతే కదా అని వేడి వేడి పెసరట్టు మీద ఉప్మా పెట్టింది సునీత.