"త్రివర్ణపతాకం నవ్వింది" '(కథ)
"త్రివర్ణపతాకం నవ్వింది" '(కథ)
"త్రివర్ణపతాకం నవ్వింది ''(కథ)
‘అమ్మకానికో అమ్మ కావాలి!’ తాను తిన్న ఇడ్లీ పొట్లం కాగితాలను ఉండలా చుట్టబోతున్న ముక్తాంబ కళ్ళజోడును సవరించి చూసుకుని ఆ ప్రకటన ఉన్న వార్తాపత్రిక కాగితాన్ని మాత్రం తీసి తన పక్క మీద పెట్టి మిగతా చెత్తను డస్ట్- బిన్ లో పడేసి వాష్ బేసిన్ లో చెయ్యి కడుక్కుంది. తీరికగా వచ్చి తనమంచం మీద కూర్చుని మొత్తం ప్రకటన చదివింది.
“మేమిద్దరం ఉద్యోగస్తులం. మాకు పెద్దదిక్కుగా ఉంటూ మేము లేని సమయంలో మా ఇంటిని పర్యవేక్షిస్తూ ఉండే ఒక అమ్మ కావాలి. ఎవరికైనా తమ తల్లిని పోషించడం భారమైతే ఆ అమ్మను మాకు 'అమ్మ'వలసిందిగా కోరుతున్నాము. అయితే ఈ విషయం లో ఆ అమ్మ పరిపూర్ణ అంగీకారంతో మాత్రమే ఆమెను మా కుటుంబం లో చేర్చుకుంటామని, భవిష్యత్తులో ఎటువంటి గొడవలూ రాకుండా లాయరుగారి ద్వారా మాత్రమే ఆమెను స్వీకరించగలమని తెలియపరచుచున్నాము. ఈ నియమాలకు అంగీకరించినవారు ఈ దిగువ సెల్ ఫోన్ నంబర్స్ ను సంప్రదించ వలసినదిగా తెలియచేయడమైనది.” అన్న వాక్యాలకింద సెల్ ఫోన్ నంబర్స్ ఇవ్వబడ్డాయి.
“ఏమిటి వదినా ? అంత దీర్ఘంగా చదువుతున్నావ్?” అడిగింది పక్క మంచం మీద అప్పుడే నడుము వాల్చిన తాయారమ్మ.
ముక్తాంబ ఆ ప్రకటన చదివి వినిపించి “ఎంత విడ్డూరం గా ఉందో చూడు వదినా? ఈవేళ చదువులు సమాజాన్ని ఎలా మార్చేసాయో చూసావా? నిన్నటివరకు పిల్లలు లేని దంపతులు గర్భాలు అద్దెకు తీసుకుని, ఖర్చంతా వాళ్లే భరించుకుని పిల్లలని తీసుకెళ్లడమే చూసాను.ఈవేళ నవమాసాలు మోసి నానా బాధలూ పడి పిల్లలను కని పెంచి పెద్దచేసి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా చేసే ‘అమ్మ’కూడా అంగడి సరుకైపోయింది. ఇలా అమ్మని అమ్ముకునేవాళ్ళు కొనుక్కునే వాళ్ళూ కూడా ఉంటారన్నమాట లోకంలో. ” అంది ముక్తాంబ.
“ పోనీలే వదినా. మనకెందుకు? మన పిల్లలు మనల్ని అమ్ముకోకుండా ఇంకా ఇక్కడ బతకనిస్తున్నారు. అందుకు సంతోషించు. అనవసరమైన ఆలోచనలు మానేసి పడుకో.ఈ వయసులో మనం విశ్రాంతి తీసుకుంటూ కృష్ణా రామా అనుకోగలిగితే చాలు.నాకు నిద్ర వస్తోంది. పడుకుంటున్నా.లైటు తీసేయ్.అదుంటే నాకు నిద్ర పట్టి చావదు.” అని అటు తిరిగి పడుకుంది.
ముక్తాంబ లైట్ తీసేసి మంచంమీద వాలింది.
తెలుగు పండితురాలిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్ అయిన తాను అటు నడివయసులో భర్తను పోగొట్టుకుని, ఇటు బిడ్డలు లేక తమ్ముడి కూతురిని పెంచి పెద్దచేసి చదువు చెప్పించి పెళ్లి చేస్తే, అల్లుడితో కలిసి తనకు సరైన తిండి పెట్టక ,తన ఉద్యోగ విరమణ అనంతరము వచ్చిన లక్షలన్నీ తీసేసుకుని తనను హత్య చేయడానికి పధకం రచించినట్టు తెలియగానే తానే ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించినపుడు వాళ్ళు తనని ఈ వృద్ధాశ్రమంలో చేర్పించి అపుడపుడు పర్యవేక్షించడం వలన ఇపుడు ప్రశాంతంగా బతుకుతోంది.
వాళ్ళు అపుడపుడు వచ్చి ‘అమ్మా.బాగున్నారా?’ అని పలకరించినప్పుడు తన హృదయం మాతృప్రేమతో పొంగి పోతుంది.’మీరే లేకుంటే ఈ అమ్మే ఉండేది కాదు బాబు’ అని తను సమాధానమిచ్చేది.
భార్య అనే జీవిత భాగస్వామి రాగానే ఈ కుర్రాళ్ళు ఎందుకు తమ తల్లితండ్రులను అలక్ష్యం చేస్తున్నారో అర్ధం కాదు.ఆమెకి తన తల్లితండ్రులగురించి తెలియకపోవచ్చు.కానీ అతనికి తెలుసుకదా వాళ్ళు తనను ఎంత కష్టపడి పెంచారో. ఆ కనీస జ్ఞానం లేని పిల్లలు సమాజంలో తయారు కాబట్టే ఈనాడు వృద్ధాశ్రమాల అవసరం వచ్చింది.వాటి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
పిల్లలపట్ల అవధులు లేని ప్రేమ, వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలనుకునే ఆత్మత్యాగం తల్లితండ్రుల వైపునుంచి కారణాలైతే, తెలియని ప్రపంచాన్ని చూడాలని, తామిద్దరూ సంపాదించి అంతులేని సుఖాలు చూడాలని, తామూ కోటీశ్వరుల జాబితాలో చేరాలనే అత్యాశ వంటి కారణాలు పిల్లలవైపునుంచి కలగడమే ముఖ్య కారణం.
అయితే బాధ్యతగా వ్యవహరించవలసిన ప్రసారమాధ్యమాలు, వ్యాపారధోరణిలో మాత్రమే కోకొల్లలుగా వస్తున్న చలన చిత్రాలు, పదవిలో ఉన్నంతకాలం తనవారికోసం మాత్రమే పాటుపడే రాజకీయపాలన సమాజంపై తీవ్రప్రభావం చూపించి ఎటుపోతోందో సమాజం అన్నరీతిలో వ్యవహరించడం విచారకరం.అయినా అదేం ప్రకటన? “అమ్మకానికో అమ్మకావాలి” ట.
ఆ అవకాశం మరుసటిరోజే తనను వెతుక్కుంటూ వస్తుందని తెలియని ముక్తాంబ దైవ ప్రార్ధన చేసుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది .
* * *
మరుసటి రోజు మధ్యాహ్నం భోజనంచేసి నిద్రకు ఉపక్రమిస్తుండగా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు మాణిక్యాంబగారు తనని రమ్మన్నారని ఆయమ్మ కబురు తెచ్చింది. మళ్ళీ పెంపుడు కూతురు, అల్లుడు ఏదైనా గొడవ తీసుకువచ్చారా అనుకుంటూ ముక్తాంబ ఆఫీస్ గదిలోకి వచ్చింది. వస్తూనే మాణిక్యాంబగారికి నమస్కరించింది. ఆమె ప్రతి నమస్కారం చేసి ముక్తాంబ ను కూర్చోమని కుర్చీ చూపించారు.ప్రశాంతంగా కూర్చున్న అనంతరం ముక్తాంబ ఆ గదిలో ఇంకా ఎవరెవరున్నారని పరిశీలించింది.
‘అమ్మా.బాగున్నారా?నేను రాజారాంని.” తనను గుర్తు చేసాడు ఎస్.ఐ.
“బాగున్నాను బాబు.”
“మీ ఆరోగ్యం ఎలా ఉంటోంది?”
“ బాగానే ఉంది బాబు మీ దయవల్ల...అమ్మగారి కరుణవల్ల.” అంది ముక్తాంబ మాణిక్యాంబగారిని చూపిస్తూ.
“నాదేముందమ్మా? మీ నెలవారీ ఖర్చులకు ప్రతీనెలా మీ పించనులోంచి మీరే ఆశ్రమానికి కట్టుకుంటున్నారు.మీ మందులు మీరే కొనుక్కుంటున్నారు. మీరిక్కడ సంతోషంగా ఉంటున్నారా లేదా అన్న పర్యవేక్షణే మాది. ఇకపోతే మిమ్మల్ని వాళ్ళ కోరికమీద ఒకమాట అడుగుదామని పిలిపించాను.” అన్నారామె నవ్వుతూ సుమారు ముప్పై సంవత్సరాలలోపు యువ జంటను చూపిస్తూ. వారు ముక్తాంబకు నమస్కారం చేసారు. ముక్తాంబ ప్రతినమస్కారం చేసింది.
సబ్-ఇన్స్పెక్టర్ అన్నాడు.
“ఈ దంపతులు మూడు రోజులక్రితం ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు మేడం.”అమ్మకానికో అమ్మ కావాలి” అని.ఆరోజునుంచే వీరికి సుమారు నిన్నటి వరకు పద్దెనిమిది మంది తమ అమ్మను అమ్ముతామని ఫోన్ చేసారట.కొందరు లక్షలు డిమాండ్ చేస్తే, కొందరు నెలనెలా ఇరవైవేలకు తక్కువకాకుండా డబ్బు తమ అక్కౌంట్ లలో జమచేయ్యాలని అన్నారట.చుట్టాలు బంధువులు ఆమెను చూడటానికి వస్తే అనుమతించాలట. అవసరమైతే రెండు మూడురోజులు ఉంచుకోవాలట. ఈ లావాదేవీలన్నీ భరించలేక ఏ బాదరబందీ లేని ఒక అమ్మ దొరికితే చాలని ఉదయం మన స్టేషన్ కి వచ్చారు.
నాకు మీరు గుర్తుకు వచ్చారు. మీ అమ్మాయి, అల్లుడు మీజోలికి రారు. ఒకవేళ వస్తే వెంటనే అరెస్ట్ చేయమని వారెంట్ ఉంది.మీకంటూ ఎవరూ లేరు. వారికి పెద్దదిక్కు అవసరం.వారికి కులమతాలతో పనిలేదు. మీరు చదువుకున్నవారు.మిమ్మల్ని సర్వవిధాల చూసుకుంటారు.మీ ఆలనా పాలనా కోసం ఒక ఆయమ్మను కూడా వారే పెడతారు.పెద్దదిక్కుగా మీరు వారింట్లో ఉంటే చాలు. మీరు అన్ని వివరాలు ఆ దంపతులతో మాట్లాడండి.మీకు ఇష్టమైతే లాయరు ద్వారా అగ్రిమెంట్ అటు మేడం, ఇటు మా సమక్షంలో వ్రాసుకుందాము. మీరు అక్కడ అడ్జెస్ట్ కాలేకపోయినా, ఏమాత్రం ఇబ్బంది పడినా వెంటనే తిరిగి ఈ ఆశ్రమానికి వచ్చేయచ్చు.
ముక్తాంబ మరేమీ ఆలోచించలేదు. ”ఉద్యోగం లో చేరినప్పటి నుంచి నేను కొత్త ప్రదేశాలనేవి చూడలేదు.కొత్త వాతావరణం అన్నా, కొత్త మనుషులన్నా నాకు చాలా ఇష్టం. వారినుంచి మనం తెలుసుకునే విషయాలు అనేకం ఉంటాయి. నాసాహచర్యం వాళ్లకి ఉపయోగపడుతుంది అంటే, అంతకన్నా అదృష్టం నాకులేదు.పేకాట ఆడేటప్పుడు మనకు అవసరం లేని ముక్కను తీసిపడేస్తాం.దానితో మన పక్కవాడికే ‘షో’ కావచ్చు.ఈలోకంలో మనకు కావలసినదానిగురించి తాపత్రయపడటం, అక్కర్లేనిది నిరభ్యంతరంగా వదిలేయడమే మానవ నైజం. అన్ని విషయాలు మాణిక్యాంబ గారు, మీరు చూస్తారు.నాకేమీ అభ్యంతరం లేదు.”
అందరూ తీవ్రంగా చర్చించి ఒక ఒప్పందానికి వచ్చాకా లాయరు గారి సమక్షంలో అగ్రిమెంట్ మీద ఆ యువదంపతులు , ముక్తాంబ సంతకాలు పెట్టారు.ఎస్.ఐ., మాణిక్యాంబగారు సాక్షి సంతకాలు చేసారు.
“అమ్మా” అంటూ వచ్చిన అతని పక్కనే “ఆంటీ” అంటూ ఆ అమ్మాయికూడా వచ్చి ముక్తాంబ పాదాలకు నమస్కరించారు.
“మీతో కొత్తజీవితం మనందరికీ ఆనందంగా ఉండాలని కోరుకుందాం బాబు”అని మనస్పూర్తిగా ఆశీర్వదించింది ముక్తాంబ.
అనంతరం ఆమె సామాను వారిద్దరూ స్వయంగా సర్ది తీసుకుని కారులో పెట్టారు. తన గదిలో తనకు ఉన్న ఒక్కగానొక్క తోడు ఇలా హఠాత్తుగా వెళ్లిపోతూండడంతో తారాయమ్మ ముందు నిర్ఘాంతపోయి తర్వాత శూన్యమైన మనసుతో ముక్తాంబకు వీడ్కోలు చెప్పి కన్నీళ్ళతో అంది.
“ఎపుడైనా నన్ను తలుచుకో వదినా.నేనెలాగూ రాలేను.నువ్వు అపుడపుడు వస్తూ ఉండు.” ఆప్యాయంగా ఆమె కన్నీళ్లు తుడిచి మనసారా కౌగలించుకుని వాళ్లతో బయల్దేరింది ముక్తాంబ.
* * *
ముక్తాంబ వాళ్ళ ఇంటికి వచ్చి పదిహేను రోజులు దాటింది.అందమైన,విశాలమైన డ్యూప్లెక్స్ హౌస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో దేవుడి గది పక్కన ఆమెకు గది ఏర్పాటు చేసారా దంపతులు. వాళ్ళు పైన ఉంటారు.ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులే.
ఉదయం లేస్తూనే అతను జాగింగ్ కి వెళ్తాడు.ఆమె లేచి పూజ చేస్తుంది.వచ్చాకా అతను స్నానం చేసి పేపర్ చదువుతాడు.ఆమెకు టిఫిన్ తయారుచేయడం లోను, వంటలోను సాయం చేస్తాడు.
“నేను చేస్తాను బాబు.”అని ముక్తాంబ అంటే...” ప్రతీ పండుగ రోజున మీదే ఆ అవకాశం అమ్మా.” అనేసారు ఇద్దరూ. ఆమెకోసం ఒక ప్రత్యేక ఆయాను పెట్టారు. ఆమె ఉదయమే వచ్చి ముక్తాంబ గది పక్కబట్టలు మార్చి, గదంతా అద్దంలా శుభ్రం చేసి, ఆమెకు తోడుగా సాయంత్రం ఆ దంపతులిద్దరూ ఆఫీస్ నుంచి వచ్చాకా మాత్రమే వెళ్తుంది. ఒకవేళ లేటయితే అతను కారులో తీసుకెళ్ళి ఆమె ఇంటి దగ్గర దింపుతాడు.పనమ్మాయి వాళ్ళు ఆఫీస్ కు వెళ్ళిపోయాక వచ్చి అంట్లు తోమేసి, మిగత ఇల్లంతా శుభ్రపరచి వెళ్ళిపోతుంది.ఇదంతా ఆయమ్మ పర్యవేక్షణలో జరుగుతుంది.
సాయంత్రం ఆ దంపతులు వచ్చాక ఒకరోజు గుడికి, ఒకరోజు పార్కుకు, సినిమాకు , ఒకరోజు రవీంద్రభారతిలో సంగీత, సాహిత్య కార్యక్రమాలకి తీసుకువెళ్తారు.ఎవరికీ ఆ కార్యక్రమం నచ్చకపోయినా ఇంటికి వచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళు రావడం లేటయితే ఆరోజు మాత్రమే భక్తీ, శ్రీ వెంకటేశ్వర భక్తీ చానెల్ కార్యక్రమాలు చూస్తుంది ముక్తాంబ.
“టి.వి. సీరియల్స్ చూడవచ్చు కదా అమ్మా?”ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన అతను అడిగాడు.
“ వద్దు నాన్నా.అవిచూస్తే కలిసి ఉందాం అనుకుని అగ్రిమెంట్ పత్రాలు కూడా రాసుకున్న మనం ఖచ్చితంగా విడిపోతాం.”ముక్తాంబ మాటలకు అతని కళ్ళెందుకో చమర్చాయి.
“బాబూ.నిన్ను బాధపెట్టానా నాన్న?” అంది ఆమె ఆతురతతో అతని దగ్గరగా వచ్చి.
“లేదమ్మా.లేదు.” అంటూ ఆమెను రెండు జబ్బలు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి అతను నేలమీద కూర్చుంటూ “అమ్మా.ఒక్క పదినిముషాలు మీఒళ్ళో తలపెట్టుకుని పడుకోవచ్చా అమ్మా?” అని అడిగాడు.
“బాబూ. ఎంతమాట. రా నాన్న.రా.!” ముక్తాంబకు మాతృహృదయంలో నిగూఢమైన ప్రేమ ఒక్కసారిగా పొంగుకు వచ్చింది. అతను ఆమె ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.బట్టలు మార్చుకు వచ్చిన ఆమె అతని పక్కన కూర్చుని తలనిమురుతూ అంది.
” పాపం.ఆఫీస్ రాజకీయాలతో ఈమధ్య చాలా బాధపడుతున్నారు ఆంటీ.కష్టపడి పనిచేస్తున్నా కూడా తోటివాడు ఓర్వలేకపోతున్నాడు. పైరవీలు చేసి పై అధికారులచేత తిట్టించడం నేర్చుకున్నారు. కొందరైతే ‘నువ్వోక్కడి వేనా పనిచేసే పోటుగాడివి ‘ అని కొందరు ముఖం మీదే అంటున్నారట. నేనైతే అక్కడే సమాధానం చెప్పేస్తాను. ఊరుకోను.కానీ ఈయన చిన్న బాధను కూడా తట్టుకోలేరు పాపం.”అంది అతనిని జుట్టులోకి వెళ్ళు సున్నితంగా పోనిచ్చి తల నిమురుతూ.
“పోనీలేమ్మా.ఏ కర్రని నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది.మనం నిర్వర్తించే ధర్మంలో లోపం ఉండకూడదు.” అంది అతని వీపు రాస్తూ.పది నిముషాలు అన్న అతను అరగంట అలాగే ఉండిపోయాడు. ముక్తాంబకు కాళ్ళు తిమ్మిరేక్కుతాయేమో అని ఆమె అతన్ని మెల్లగా లేపింది.
అతను మెల్లగా కళ్ళు తెరిచి “ అమ్మ ఒడిలో ఉండే ఈ హాయిని దూరం చేసుకునేవాళ్ళు చాల దౌర్భాగ్యులమ్మా” అని నెమ్మదిగా లేచి తనగదిలోకి వెళ్ళిపోయాడు ఆమె చేయి పట్టుకుని.
ప్రతీరోజు ఉదయం సరిగ్గా అయిదు గంటలకు ప్రశాంత వాతావరణంలో ‘అల్లాహో అక్బర్” అని వినిపించే మసీదులోని ఆ ప్రార్దన ముక్తాంబకు చాలా ఇష్టం.అలాగే ప్రతీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు దగ్గరున్న చర్చ లోంచి వినిపించే మధుర భక్తీ గీతాలు, ఫాదర్ సందేశం కూడా.
ఒకరోజు అడిగింది అతన్ని.
” నాన్న.రూపాలెన్నైనా భగవంతుడొక్కడే. ఒక్కసారి మసీదులో ప్రార్ధననీ, చర్చిలోజరిగే నమాజ్ ని కళ్ళారా చూడాలని ఉందయ్యా.”
ఆ ఆదివారమే ఆ దంపతులు చర్చిలో ప్రార్ధనా కార్యక్రమానికి ఆమెను తీసుకువెళ్ళారు.ప్రశాంత వాతావరణంలో సాగిన ఆకార్యక్రమాన్ని వీక్షించి చివరగా దక్షణ కూడా వేసి ఏసు ప్రభువుకు నమస్కరించుకుంది ముక్తాంబ.
“మసీదులో జరిగే ప్రార్ధనకు స్త్రీలకూ ప్రవేశం ఉండదమ్మా.ఆ కోరిక తీర్చలేనందుకు మన్నించు.”అన్నాడతను. దాని బదులు చార్మినార్ దగ్గరున్న మహాలక్ష్మి గుడికి తీసుకెళ్ళి చూపించాడు.జీవితంలో మరెక్కడకి తిరగనేమో అనుకున్న తన గొంగళిపురుగు జీవితానికి సీతాకోక చిలుకలాంటి జీవితమిచ్చిన ఆ దంపతులను సర్వదా కాపాడు తల్లీ అని లోకమాతను మనస్పూర్తిగా ప్రార్దించింది ఆవిడ.
మార్చి నెలలో ఉగాది నాడు ఉగాది పచ్చడితో పాటు గారెలు ఆవడలు చేసింది ముక్తాంబ.ఏప్రియల్ నెలలో అన్నవరం సత్యదేవుని కల్యాణానికి వెళ్లారు.మే నెలలో హనుమజ్జయంతి నాడు అప్పాలు చేసింది.జూన్ నెలలో రంజాన్ పండుగ నాడు న్యూస్ పేపర్ లో చూసి ముస్లిం వంటకాలు చేసింది.శ్రావణ మాసంలో ఆమె చేత మంగళ గౌరీవ్రతం పట్టించి అయిదుగురు ముత్తయిదువలకు నాలుగు వారాలూ సెనగల వాయనం ఇప్పించింది.
ఆగస్ట్ 14 సాయంత్రం షాపింగ్ కు తీసుకువెళ్ళి తమ ముగ్గురికి కొత్త బట్టలు కొన్నాడతను.వాటితో పాటే జాతీయపతాకం, డెకరేషన్ చేయడానికి కలర్ పేపర్స్,బుడగలు అన్నీ కొన్నాడు.
ఆ రాత్రి ఇంటికి వచ్చాకా టిఫిన్లు చేసి తమ గదిలోకి వెళ్ళబోతున్న వారిద్దరిని పిలిచింది.”నాన్న.మిమ్మల్ని ఒక్కమాట అడగవచ్చా?”
“అడగండమ్మా.” అన్నాడతను.ఆమె రెండు కుర్చీలు తెచ్చి వేసింది. వాటిల్లో కూర్చున్నారిద్దరూ.
“మన ఇంటికి ఎవరూ రారా? అదే.నీ తరపున గాని అమ్మాయి తరపున గాని బంధువులు ?” అడిగింది ముక్తాంబ.
అతను ఆమె ముఖం కేసి చూసాడు.ఆమె సొట్టలున్న బుగ్గలు నొక్కులు పడేలా మనోహరంగా నవ్వింది.
”రారు ఆంటీ.మాకెవరూ లేరు.మేము అనాధలం.” ఆ ఒక్కమాటకే ముక్తంబ కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగిపోయాయి.
“బాబూ.నిజమా?” అని అతని చెంప ఆప్యాయంగా నిమిరింది. అతను అన్నాడు
“అవునమ్మా. ‘ మా ఎస్సీ కాలనీలో పెళ్లి కాకుండానే పుట్టిన ఈ అక్రమ సంతానం మాకొద్దు’ అని పుట్టిన నాడే నిర్దాక్షిణ్యంగా అనాధాశ్రమంలో వదిలివేయబడ్డ ఆడబిడ్డ తను.అదే అశ్రమం లో అంతకు రెండేళ్ళ ముందు ‘ప్రేమించానని చెప్పి అనుభవించి గర్భవతినైన నన్ను పెళ్లి చేసుకోమంటే తన నలుగురు స్నేహితులచేత రేప్ చేయించి నీ దిక్కున్న చోట చెప్పుకో ఎవరూ కాపాడకపోతే అల్లాకు మొరపెట్టుకో ‘అని నాకులపు వాడే నన్ను జీవచ్చవాన్ని చేసాడు”అని అనాధాశ్రమంలో చేరి పురుడు వచ్చాకా వాతం కమ్మి మరణిస్తూ ‘నా బిడ్డకు మీరే దిక్కు’ అని పైలోకాలకు వెళ్ళిపోయిన తల్లికి పుట్టిన అనాధను నేను.
అక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నా, తనతో నాకు బాగా స్నేహం కుదిరింది.స్కూల్లో చేరాకా పొటీ పడి చదివాము. పదవతరగతిలో ప్రతిభా అవార్డ్ లు వచ్చిన మాకు బహుమతి ప్రదానం చేయడానికి వచ్చిన ఒకాయన ఎంతవరకు చదువుకుంటే అంత ఖర్చూ తానూ భరిస్తానని చదివించారు.ఆయన మాటలు నిలబెట్టుకుంటూ మేమిద్దరం ఐ.ఐ.టి.లో సీటు సాధించాం.చదువు పూర్తి అవకుండానే మాకు కాంపస్ సెలక్షన్ వచ్చింది.తాను చేసిన దాతృత్వానికి తగిన ఫలితం లభించిందని ఏంతో సంతోషపడిన ఆమహానుభావుడు ‘అన్ని విధాలా ఒకరికొకరు పరిపూర్ణంగా అర్ధం చేసుకున్న మీరు వివాహం ఎందుకు చేసుకోకూడదు?’ అని ప్రశ్నించారు.
ఆయన సమక్షంలోనే మేము పెరిగిన అనాధాశ్రమంలోనే మా పెళ్లి జరిగింది.మా దురదృష్టం.పెళ్లిఅయిన నెలలోనే ఆయన కేన్సర్ తో కన్ను మూశారు.అయిదేళ్లుగా సంపాదిస్తున్న మాకు లేనిది అమ్మ ప్రేమ ఒక్కటే.అందుకే ఆ ప్రకటన ఇచ్చాము.మిమ్మల్ని అమ్మగా పొందాము. ఈ కధంతా ఆరోజే చెబుదామని అనుకున్నాం,కాని మీరు వెంటనే మరే ఆలోచనా లేకుండా మాతో రావడానికి ఇష్టపడటంతో ఆ మాటే మరిచిపోయాం.ఇదమ్మా మా కధ.మీరు ఇక్కడకి వచ్చాకా మేము జీవితం లో పొందలేమనుకున్న తల్లిప్రేమను ఆరు నెలలుగా పొందుతున్నామన్న సంతృప్తితో ఎంతో ఆనందంగా ఉన్నామమ్మా.” అన్నాడతను ముక్తాంబ చేతులు పట్టుకుని.
ముక్తాంబ తల్లి మనసు పులకించిపోయింది.నోట మాట రాక ఆమె హృదయం మూగబోయింది. ”బాబూ.అమ్మా.ఇది ఏ జన్మ బంధంరా?”అని మాత్రం అనగలిగింది. ఆరాత్రి ఆమె హాయిగా నిద్రబోయింది.
అయిదుగంటలకే లేచి స్నానం చేసి గదిలోంచి బయటకు వచ్చిన ముక్తాంబ ఆశ్చర్యపోయింది.ఇల్లంతా రంగుల రంగుల పేపర్ కటింగ్స్ తో, బుడగలతో అలంకరించబడి ఉంది.అందమైన రంగవల్లులతో ఆవరణఅంతా కళకళ లాడిపోతోంది.ఆయమ్మ కూడా రావడంతో ముక్తాంబ కిచెన్ లో పనిలో పడింది.సరిగ్గా పది నిముషాలతక్కువ ఏడుకి ‘అమ్మా రండి.ఆయా.నువ్ కూడా.” అని ముక్తాంబ భుజాలు పట్టి వీధిలోకి తీసుకువచ్చాడు అతను. అప్పటికే ఆయా చేతిలో పువ్వులున్న పళ్ళెంతో వాకిలిలో సిద్ధంగా ఉంది.మెట్లపక్కన ఉన్న జాగాలో ‘మీరు చేసే పతాక ఆవిష్కరణ కు నేను సిద్దం’అన్నట్లు ఒక ఇనుపకమ్మీకి పైన ముడుచుకున్న జాతీయపతాకం కనిపించింది.
సరిగ్గా ఏడు గంటలకు ముక్తాంబచేత పతాకావిష్కరణ చేయించాడు అతను.సర్వీసులో ఉండగా కూడా పొందని అదృష్టం.జాతీయగీతం ఆలపించి సాల్యూట్ చేసారందరూ.అక్కడ కుర్చీలో ఉన్న జాతీయనాయకుల పటాలముందు పూలు చల్లారు .ఆమె అందించిన కలాకండ్ వారిద్దరి నోటికందిస్తూ “మంచి శుభవార్త తొందరలో చెప్పాలి నాన్నా.” అంది ముక్తంబ నవ్వుతూ.
“ఎపుడో ఎందుకమ్మా. ఇపుడే వినండి.మీరు వచ్చిన వేళావిశేషం.మీకోడలికి ఇపుడు మూడోనెల.”నవ్వుతూ ఆమె బుగ్గలు చిదిమిన ముక్తాంబతో పాటు ఎక్కడెక్కడో పుట్టి ఒకరికోసం ఒకరు బతుకుతున్న వారిని చూసి జాతీయ పతాకం నవ్వుతూ ఎగరసాగింది.
సమాప్తం