STORYMIRROR

kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 29 వ భాగం

మనసు చేసిన న్యాయం - 29 వ భాగం

3 mins
8

మనసు చేసిన న్యాయం - 29 వ భాగం

వదిన ఇంటి నుంచి బయలుదేరి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సీతాఫల్మండి కూరలు తేవడంకోసం బయలుదేరుతున్నారు అంకుల్.

" రా వైభవ్ రా!" అంటూ ఆహ్వానించారు.

" మీరు కూరలకి బయల్దేరారేమిటి అంకుల్ పనివాళ్ళు ఉండగా."అన్నాను.

"ఆ కూరలు ఒక్కటి స్వయంగా తెచ్చుకుంటేనే ఆయనకు తృప్తి నాయనా"అన్నారు ఆంటీ.

" ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం ఇలా మీతో వచ్చాను. మళ్లీ కుదరకపోవచ్చు. సరదాగా మీతో నేను వస్తాను అంకుల్ "అన్నాను.

అంకుల్ నవ్వేశారు.

" బాగానే గుర్తుందన్నమాట. సరే పద!" అని స్కూటర్ తీశారు .నేను వెనకాల కూర్చున్నాను.

సీతాఫల్మండి వెళ్లి వారానికి సరిపడా కూరల్ని కొని తీసుకొచ్చాము.

ఆంటీ వద్దంటున్నా వినకుండా టిఫిన్, కాఫీ  ఇచ్చారు.

"పల్లవి మేడం ఇంట్లో ఉంటున్నది వదినే అంకుల్.ఈవిధంగా ఆమెను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంకుల్"

"పల్లవి అన్ని విషయాలు చెప్పిందయ్యా."అన్నారు.

"రేపు శుక్రవారంతో శిక్షణ పూర్తి అవుతోంది అంకుల్.మరి వెళ్ళొస్తాను "అని అంకుల్ కి, ఆంటీకి చెప్పి బయలుదేరాను.

*******

రూమ్ కి వచ్చాక చంద్రికతో మాట్లాడాను. రోజూ ఎస్సైన్మెంట్స్ ఉండడంవల్ల కేవలం నా క్షేమసమాచారాలు తెలుపుతున్నానేగాని వివరంగా మాట్లాడటం కుదరలేదు. ఈవేళ చంద్రికతో చాలా హాయిగా మాట్లాడాను. అయితే వదిన విషయం అమ్మకు నాన్నకు చెప్పవద్దని చెప్పాను. రేపు శుక్రవారమే నేను బయలుదేరి వస్తున్నాను అని పిల్లలతో చెబితే వారికి కావలసిన బొమ్మల జాబితా చెప్పారు. వీలైతే తప్పక తెస్తానని చెప్పాను.

ఈ ఇరవై ఒక్క రోజుల శిక్షణా కార్యక్రమం నాలో కొత్త ఉత్సాహాన్ని ఊపిరిని తెచ్చింది.

మన ప్రాచీన నాగరికత మూలాలు, కళలు, సాంస్కృతిక జీవనం, సంగీతం, నృత్యం, రంగస్థల నటన, చిత్రలేఖనం, శిల్పకళ, హస్తనైపుణ్యాలు, సృజనాత్మక రచన, సాహితీపరమైన కళలు మొదలైన రంగాల్లో వారు అందించిన సమాచారం సందర్భోచితంగా పాఠ్య బోధనలో చొప్పించి విద్యార్థులకు వాటిపట్ల అభిరుచి బీజం వేయడం ద్వారా రేపటి తరాలకు అందించే బహత్తర ప్రణాళికకు ఈ కార్యరూపం నాకు చాలా చాలా నచ్చింది.  

నేను హైదరాబాద్ లో ఉన్నపుడు కూడా చూడని సాలార్ జంగ్ మ్యూజియం, నెహ్రు జూలాజికల్ పార్క్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, వనమూలికలు కేంద్రం, గోల్కొండ కోట,,,వంటి ప్రదేశాలలో నేను సేకరించుకుని నోట్స్ రాసుకున్నాను. 

నావరకు నేను నా పాఠశాల ఈజీవితంలో చదువుకోలేని అపురూపమైన విజ్ఞానాన్ని పొందాను. సంస్థవారు అందించిన ప్రశంసా పత్రం, శిక్షణా కార్యక్రమపత్రం, వారు పాఠశాలకు ఉచితంగా అందించిన అత్యంత విలువైన మెటీరియల్, స్లయిడ్ ప్రొజెక్టర్, స్లైడ్స్, మా చేత ప్రాజెక్టు వర్క్ లో భాగంగా చేయించిన వివిధ కళారూపాలు అన్నింటినీ సిద్ధం చేసుకున్నాను.

నేను అనుకున్న శుక్రవారము రానే వచ్చింది. అంకుల్ కి పల్లవి మేడమ్ కి వెళ్లి వస్తాను అని ఫోన్ లో చెప్పి హైదరాబాద్ కు తాత్కాలికంగా వీడ్కోలు చెప్పి రైల్వే ఎక్కేసాను.

********

పెళ్లి అయ్యాక దాదాపు ఇరవై ఒక్క రోజులు చంద్రికను గాని, పిల్లలు పుట్టాక వాళ్ళని వదిలిపెట్టిగాని నేనుఒక్కడినే ఒంటరిగా ఇన్ని రోజులు ఉండలేదు. ఇంట్లోకి వచ్చిన వెంటనే వాళ్లు నన్ను అల్లుకుపోయారు. ముఖ్యంగా నా పిల్లలకన్నా సాత్విక అయితే నా మెడచుట్టూ చేతులు వేసి 'చిన్నాన్న.. ఎంతకాలమైంది చిన్నాన్నా....నిన్ను చూసి'అని కళ్ళు తుడుచుకుంటుంటే నా మనసు చలించిపోయింది. చమర్చిన కళ్ళు తనకి కనబడనీయకుండా నెమ్మదిగా పిల్లలు ముగ్గుర్ని చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళ కోసం తెచ్చిన బొమ్మలని వాళ్ళకిచ్చేసాను.వాటితో ఆడుకునే సంతోషంలో పడిపోయారు వాళ్ళు. తర్వాత నాన్నగారిని అమ్మను పలకరించి డ్యూటీ కి వెళ్ళిపోయాను.

సాయంత్రం ఇంటికి వచ్చాక అమ్మ, నాన్నలతో అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాను. నాన్నగారు అమ్మ కంటిచూపు తప్ప నోట మాటరానివారిలా ఉండిపోయారు.

"ఆ అమ్మాయి మంచిదిరా.నాకు ముందునుంచీ తెలుసు.వాళ్ళ బామ్మ, మా అమ్మ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు.కానీ ఏంచేస్తాం.పిల్లల్ని కనగలం గాని రాతల్ని కనలేము."అని వాపోయింది అమ్మ.

ఆరాత్రి నా పిల్లలు పడుకున్నాకా సాత్వికను పిలిచి తన చదువు గురించి అడిగాను.

"ఎప్పటికప్పుడు అప్డేట్ గానే అన్నాను చిన్నాన్న. ఈసారి కూడా నేను ఎస్టిమేషన్ చేసుకున్న మార్కులే వచ్చాయి. మామూలుగానే మొదటి ప్లేస్ లోనే ఉన్నాను"అంది.

నాకు తనలో నచ్చిన గుణం అదే.ఒక పరీక్ష రాసాకా ఎన్ని మార్కులు వస్తాయో నిక్కచ్చిగా చెప్పే పద్ధతి మొదటినుంచి అలవాటు చేసాను.

"అందుకే నీకు ఈ బహుమతి"అని తనకి ఒక పాకెట్ ఇచ్చి ఓపెన్ చెయ్యమన్నాను.

ఏ కోణంలోంచి చూసినా మెరిసిపోతున్న ఆబొమ్మలోని సజీవత్వాన్ని చూసి ముద్దుపెట్టుకుని తన గుండెలకు ఆనించుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది సాత్విక.

చమరించిన కళ్ళతో "కృతజ్ఞతలు చిన్నాన్న"అని మాత్రం అంది ఆ లేత హృదయం.

బిడ్డని గుండెల్లో పొదువుకుని మాతృత్వపు ప్రేమను అనుభూతి చెందుతున్న 'అమ్మ' బొమ్మ అది.

చంద్రికకూడా 'చాలా కళాత్మకంగా ఉందండీ'అంది.

*******

'అమ్మ ఎవరికి అమ్మ' అనే అంశంపై

జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలలో పాఠశాల తరపున పాల్గొన్న సాత్వికకి ద్వితీయ స్థానం వచ్చింది.

మా ఇంటిల్లిపాది ఆనందానికి హద్దులు లేవు.నాన్నగారు అమ్మ అన్నయ్య ఎంతగానో సంతోషపడ్డారు.

ఆ వ్యాసం చదివాను నేను.

అమ్మ స్పర్శలోని అనుభూతిని తనకు తెలిసిన చిన్ని పదాలతో వర్ణించిన తీరు చదివితే మనసున్న ఏమనిషికైనా హృదయం ద్రవించాల్సిందే. కేవలం 500 పదాలలో ఆమె ప్రయోగించిన భావజాలం అనుభూతి చెందుతూ చదివితే మంచుపలకలమీద జారుతూ మానస సరోవరంలో కలువబాలల మధ్య స్నానమాడినంత తాదాత్మ్యానికి లోనయ్యాను నేనైతే.

"మీ తెలుగు టీచర్ బాగా రాయించారమ్మా"అన్నాను.

"లేదు చిన్నాన్న. అమ్మ ఒడిలో నేను వెచ్చగా పడుకుని ఉన్నట్టు ఊహించుకుంటే నాకు ఏ వాక్యాలు మనసులో మెదిలాయో అవే యధాతధం రాసాను.తప్పులుంటే సరిదిద్దమని, టీచర్ గారిని,ప్రిన్సిపాల్ సర్ ని కోరాను. అవసరంలేదని అదే పంపించారు.'మన ప్రయత్నలోపం లేకపోతే ఫలితం దానంతట అదేవస్తుంది'అని మీరు చెప్పిన ప్రతీవాక్యం నా ప్రతీ నోట్స్ మొదటిపేజీలో ఉంటుంది చిన్నాన్న."అంది సాత్విక.

ఆ బహుమతిని వాళ్ళ ప్రిన్సిపాల్ సార్ తో వెళ్లి ఢిల్లీలో తీసుకుని ఇంటికి వచ్చింది సాత్విక.

"సాత్విక తల్లికి నా హృదయపూర్వక దీవెనలు"అని సందేశం పంపించింది వదిన.

అది సాత్వికకి చూపించాను.

"ఎవరు చిన్నాన్న ఆ మేడం?"అని అడిగింది.

"నీకు చిన్నపుడు యూ.కె.జీ.లో క్లాస్ టీచర్ గుర్తున్నారా? ఆ మేడం."

"నేము బాగా చిన్న పిల్లని కదా...గుర్తు లేదు.పేరేంటి?"

"విజయలక్ష్మి"

"మళ్లీ చెప్పు"

"వి. జయలక్ష్మి. ఎందుకు అలా ఆడిగావు?"అన్నాను వత్తిపలుకుతూ.

"నేను ఆరోతరగతిలో ఉండగా ఒకఆవిడ మన ఇంటికి వచ్చింది కదా. ఆవిడని బామ్మ అలాంటి పేరుతో పిలిచినట్టు గుర్తు .ఆవిడేమో అని అడిగాను." అంది సాత్విక.

తాను చూడకుండా ఒకరి మొహం ఒకరం చూసుకున్నాం చంద్రిక నేను.

(మిగతా 30 వ భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama