మనసు చేసిన న్యాయం - 31వ భాగం.
మనసు చేసిన న్యాయం - 31వ భాగం.
మనసు చేసిన న్యాయం - 31వ భాగం.
ఆ రాత్రి అన్నయ్య నాకు ఫోన్ చేశాడు.
నేను మేడమీదకి వచ్చి మాట్లాడాను.
"ఒరేయ్ తమ్ముడు.. ఏమిట్రా ఇది.. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు...పదిసార్లు చదివాను. నేను ఎంత తప్పు చేశానో ఇపుడు అర్ధమవుతోందిరా." అన్నాడు అన్నయ్య కన్నీళ్లతో.
"నువ్వు బాధ పడతావని ఈ విషయాన్ని నేను పంపలేదన్నయ్యా. నా లాజిక్ నిజమో కాదో నాకు తెలియదు గానీ, మీ నిర్మలమైన దాంపత్యంలో మన కుటుంబంలో పూసిన ఒక స్వర్ణకమలం 'సాత్విక'.ఆతర్వాత అనుమానాలతో అపార్ధాలతో మనసులు కలుషితమైతే ఆ పుట్టే పిల్లలూ అలాంటి లక్షణాలతో పుడతారేమో. అన్యోన్యదాంపత్యంగా మలగిన మీ ఇద్దరికి పుట్టిన ఒక పరిపూర్ణమైన అనురాగంఫలం సాత్విక తల్లి .అందుకే కాబోలు .. పెళ్లయిన మొదటి సంవత్సరమే ఒక పాపనో, బాబునో కనేయండో అని పెద్దలంటారు." అని వదినను నేను హైద్రాబాద్ లో ఎలా కలిశానో అన్ని వివరాలు అన్ని పూర్తిగా చెప్పాను.
"ఈ విషయాలు అమ్మ, నాన్నగారికి తెలుసా? అడిగాడు వాడు.
" తెలుసు."
" నేను చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుందామన్నా చేతులు కూడా ఖాళీగా లేవురా నాకు" అన్నాడు అన్నయ్య.
" చూడు అన్నయ్య .ఓర్పు, సహనంగల నువ్వు ఈ వదినకు చేస్తున్న సేవే, నువ్వు తప్పు చేశాను అనుకుంటున్న తప్పుకి పాపపరిహారం అనుకో. ఆ వదిన కూడా నీతో కాపురం చెయ్యడానికి సిద్ధంగా లేదు. ఆమె బాధ్యత ఆమెకు ఉంది "అని ప్రణవసాయి విషయం చెప్పాను.
"తనతప్పుకి ఆమె కూడా శిక్ష అనుభవిస్తోందన్నమాట."అని విరక్తిగా ఫోన్ కట్ చేసాడు అన్నయ్య.
******
రెండేళ్లు కాలగర్భంలో రెండు పేజీలు తిప్పినట్టు ముందుకెళ్లిపోయాయి.
నాన్నగారు విశ్రాంత ఉద్యోగిగా మారారు.
సాత్విక ఇంటర్ 98 శాతం మార్కులతో పాసై ఎం సెట్ లో మొదటి పది రాంకుల్లో నిలిచింది.
మా ఊరికి దగ్గరలో మొదటి పది ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటిగా నిలిచిన కాలేజీలో బి.టెక్.లో చేరింది సాత్విక.
నా పిల్లలు ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల విద్యలో చేరారు..
ఇదివరలో సాత్విక చదువుకుంటే వాళ్ళు పోటీ పడి చదువుకునేవారు.ఇప్పుడు చంద్రిక, నేను వాళ్ళ కోరికలకు అదుపు చేయలేకపోతున్నాం.
ప్రతీదానికి పేచీలు ఎక్కువయ్యాయి.
''కాలేజీలో నువ్వేం చేసావో నేను నాన్నగారితో చెప్పనా?''అని నా కూతురు నా కొడుకుని బెదిరిస్తే-
"నువ్వేం చేసావో నేను అమ్మతో చెబుతాను" అని నా కొడుకు - అక్క తమ్ముడు ఇద్దరు ఒకరిని ఒకరు బెదిరించుకోవడం పరిపాటి అయిపోయింది. అయితే ఇద్దరు ఏ విషయమూ చెప్పేవారు కాదు . తోడుదొంగలిద్దరు.
ఒక రోజు సాత్విక కల్పించుకుంది.
" తప్పు నాన్న. అలా మీలో మీరు దెబ్బలాడుకుంటే బయటివాళ్లకు లోకువ. అక్క కి నువ్వు తోడు. నీకు తోడు అక్క.నాతో ఇదివరకు చక్కగా చదువుకునే వారు కదా..ఇపుడేమైంది?" అని సర్ది చెప్పడానికి సాత్విక ప్రయత్నించింది.
" నీకంటే అమ్మ లేదు. మీ నాన్న ఎంత డబ్బు కావాలన్నా తాతగారి పంపిస్తాడు. ఆ డబ్బులతో తాతగారు నీకు ఏం కావలసినా కొని ఇస్తారు. మేము ఏమి అడిగినా ఏదో కారణం చెబుతారు అమ్మ, నాన్న. అక్కలా బాగా చదువుకుంటే మీరే స్వంతంగా కొనుక్కోవచ్చు మీ డబ్బులతోటి అంటారు.
ఇదంతా నీవల్లనే. నీకు ఎలాగూ అమ్మ లేదు.మీ నాన్నదగ్గరకి వెళ్లిపోవచ్చు కదా?"అనేసాడు ఒకరోజు నా కొడుకు రోషంగా.నేను, చంద్రిక అవాక్కైపోయాం.
"నా చదువైపోతే నేను మా అమ్మ దగ్గరకి వెళ్లిపోతాను.అపుడు మీకు నా వల్ల ఇబ్బంది ఉండదు"అన్న సాత్వికను "అమ్మా..సాత్వికా" అని చంద్రిక పిలుస్తున్నా నెమ్మదిగా నాన్నగారి వాటాలోకి వెళ్ళిపోయింది ముభావంగా.
చంద్రిక నేను పిల్లలిద్దరిని కూర్చోపెట్టుకున్నాం.
"చూశారా మీరిద్దరూ అన్న మాటలు అక్క మనసుని బాధపెట్టినా తాను దూరంగా వెళ్ళిపోతాను అందే గానీ మీతో దెబ్బలాట పెట్టుకోలేదు. కానీ మీ ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు. దీన్ని బట్టి చెప్పండి. మీ ఇద్దరి మనసు గొప్పదా? అక్క మనసు గొప్పదా?"అడిగాను నేను.
" పొండి డాడీ! మీరు ఎప్పుడు సాత్విక అక్క పక్షానే మాట్లాడుతారు. ఒకొక్కప్పుడు అసలు మేమిద్దరం మీ పిల్లలమేనా అని అనుమానం వస్తుంది నాకు" అంది నా కూతురు.
" అలాగా ! నీది కానీ వస్తువును నీ దగ్గర ఉంచుకుంటావా? అది ఎవరిది అయితే వాళ్ళకి ఇచ్చేస్తావా?" అడిగింది చంద్రిక
"ఒకళ్ళ వస్తువులు అంటే నాకు చిరాకు. నాది కాని వస్తువు నా దగ్గర అసలు ఉంచుకోను." అంది నా కూతురు.
" దీన్నిబట్టి అర్థం అయింది కదా - మీ ఇద్దరిని మా దగ్గరే ఉంచుకున్నాము అంటే మీరిద్దరే మా పిల్లలని! మరో విషయం.సాత్విక అక్కని చిన్నతనం నుంచి తాతగారు మామ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంచుకుని పెంచారు.అంటే అక్క మా వస్తువు కాదు అనేగా." అన్నాను నేను.
నా సమాధానం వాళ్ళిద్దరికీ అర్ధమై నవ్వేశారు.
"సారీ డాడీ!"అన్నాడు నా కొడుకు.
"అది చెప్పాల్సింది డాడికి కాదు. సాత్విక అక్కకి."చంద్రికని అనుకరిస్తూ చెప్పింది నా కూతురు.
"అర్ధమైంది వదిలెయ్యవే బాబు"అన్నాడు నా కొడుకు.
*******
ఆ సాయంత్రం డాబా మీద నడుస్తున్న నాదగ్గరకు సాత్విక వచ్చింది.
" చిన్నాన్న !మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను"
"ఏమిటమ్మా అది?"
" మీరు మళ్లీ హైదరాబాద్ ఎప్పుడు వెళ్తారు?"
" నాకు ఇపుడు పని ఏమీ లేదు. ఏం ఎందుకని ఆడిగావు అలాగా?"
ఒక్కక్షణం నా కళ్లలోతుల్లోకి చూస్తూ అడిగింది
"అమ్మని చూడాలి" ఉలిక్కిపడ్డాను నేను.
"అమ్మ... అమ్మ ఎవరు?"
"మా అమ్మ విజయలక్ష్మి" అంది వణుకుతున్న కంఠంతో.
"అమ్మా సాత్వికా..మీ అమ్మ హైదరాబాద్ లో ఉందని నీకెలా తెలుసు?" నా మనసులో ఆరాటం, కన్నుల్లో కంగారుతో అడిగాను
సాత్విక వచ్చి నా చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది.
"అమ్మా..plz...ఏడవద్దు...అమ్మా సాత్వికా"నాకు దుఃఖం పొంగుకొచ్చేసింది.
"అమ్మ నన్ను కౌగలించుకుని ఎలా ఏడవాలనుకుందో....నాకూ... అమ్మని అలాగే కౌగలించుకుని ఏడవాలని ఉంది చిన్నాన్న. 'నన్ను ఎందుకు చిన్నప్పుడే వదిలేశావమ్మా?'అని ఒక్కసారి అడగాలని ఉంది చిన్నాన్న! అంది వెక్కుతూ.
నాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
"ఆడది తెలియక తప్పే చేసిందనుకో చిన్నాన్న. ఆమెకు భర్తగా 'నువు చేస్తున్నది తప్పు'అని సర్ది చెప్పుకోలేకపోతే అతను భర్త ఎలా అవుతాడు చిన్నాన్న? వాళ్ళు చేసిన తప్పుకి నేను ప్రశ్నింపబడాలా చిన్నాన్న?"కన్నీళ్లతో అడుగుతున్నది సాత్వికలా అనిపించలేదు నాకు.
న్యాయదేవత కళ్ళకు గంతలు విప్పుకుని వేలెత్తి ప్రశ్నిస్తున్నట్లుంది.
నాదగ్గర ఆమె ప్రశ్నకు సమాధానం లేదు. అయోమయంగా కళ్ళు తుడుచుకోవడం మర్చిపోయి నిలబడిపోయాను.
"చిన్నాన్న! ఇవన్నీ నాకెలా తెలిసాయి? అని మీ అనుమానం కావచ్చు. దానికి సమాధానం నా దగ్గర ఉంది. కాని నేను మిమ్మల్ని కోరేదొకటే. ఒక్కసారి ఎలాగైనా నాకు అమ్మని చూపించండి. అమ్మను చూస్తే నాకు పట్టుదల పెరుగుతుంది. నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకునేలా చదువుకుంటాను. మీరు ఏం చేస్తారో... తాతగారికి ఏం చెబుతారో మీఇష్టం. రెండో సెమిస్టర్ ప్రారంభం కాకముందే ఒక్కసారి నాకు అమ్మ ను చూపించండి .ఇది నా కోరిక.... కాదు ...విన్నపం...అది కూడా కాదు...నా ప్రార్థన"అని నమస్కరించి సాత్విక కళ్ళు తుడుచుకుని కిందకి వెళ్ళిపోయింది.
నేను కళ్ళు తుడుచుకోవడం మర్చిపోయి కొయ్యబొమ్మలా నిలబడిపోయాను.
సాత్విక నా ఫోన్ గానీ చూసిందా?
(మిగతా 32 వ భాగంలో )
