మనసు చేసిన న్యాయం - 28వ భాగం
మనసు చేసిన న్యాయం - 28వ భాగం
మనసు చేసిన న్యాయం - 28వ భాగం
చదవడం పూర్తి చేసిన నేను ఒక్కసారిగా దోసిలిలో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోదిస్తూ ఉండిపోయాను. ఎంతసేపు అలా ఉండిపోయానో నాకే తెలియలేదు.
మనసు నిండా గుండెల్ని పిండేస్తున్న బాధ.
ఎంత దారుణం? భగవంతుడు జీవితాలతో ఎంత దారుణంగా ఆడుకుంటాడు? ఇదంతా ఆయన లీలా?
లేక ఎవరికి వాళ్ళు తాము చేసుకున్న పూర్వజన్మ ఖర్మమా?
ఇక్కడ తప్పు ఎవరిది?
అత్తయ్యగారిని గారం చేసిన ఆమె తండ్రిదా?
ఆడింది ఆటగా పాడింది పాటగా సాగించుకున్న అత్తయ్యగారిదా?
భార్యని అదుపులో పెట్టుకోలేక తనవంతు పెద్దకూతురి కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకుని తానేస్వయంగా వదినని కాపురానికి పంపించిన మామయ్యగారిదా?
అల్లుడు చేసిన అవమానానికి కక్షతీర్చుకోవాలన్న తల్లికి ఎదురు చెప్పుకోలేక బిడ్డను, భర్తను చేజేతులారా దూరం చేసుకున్న వదినదా?
మూడు నెలల పాటు భార్యతో అన్యోన్యంగా కాపురం చేసి, తనకు వచ్చిన లేఖలను ఆధారంగా వదినను దోషిని చేసి, కొత్త సమస్యలు సృష్టించుకోలేక దూరంగా పారిపోయిన అన్నయ్యదా ?
వదిన అభం శుభం తెలియని పసిగుడ్డును మూడు సార్లు అత్తవారింట్లో వదిలేసి, కన్నతల్లి దగ్గరకు వెళ్లిపోయినా, ఆ పాపకు తామే అమ్మానాన్నలై పెంచుతున్న అమ్మానాన్నలదా?
ఎవరిది ఈ విషయంలో తప్పు?
ఎవరిదీ కాదేమో! ఎందుకంటే ఎవరి 'మనసు (నిర్ణయం) చేసిన న్యాయం' ప్రకారం వారు ప్రవర్తించారు.
కానీ ఇందులో బలైపోయింది మాత్రం ఇద్దరు స్త్రీమూర్తులు...కన్నతల్లి ప్రేమకు నోచుకోని వదిన, వదిన ప్రేమను పొందలేకపోయిన 'సాత్విక' తల్లి.
అన్నయ్య ఇక వదినను క్షమించినా దగ్గరకు చేర్చుకోలేని పరిస్థితి...కారణం..అన్నయ్య పెళ్ళిచేసేసుకున్నాడు.
సాత్వికను నా పిల్లలతో పాటు ఎంత ప్రేమగా చూసినా 'నేను కన్నతండ్రిని' కాలేను. చంద్రిక 'కన్నతల్లి' కాలేదు.
కనీసం సాత్వికకు అయినా కన్నతల్లి ప్రేమను దక్కేలా చేస్తే? అందుకు అమ్మ నాన్న ఒప్పుకుంటారా?
అన్నయ్యకు తన కూతురిమీద హక్కు వుంది కాబట్టి అన్నయ్య అందుకు ఒప్పుకోకపోతే?
''కానీ నా జీవితంలో ఒకే ఒక్క చివరి కోరిక?'' అని అన్న వదిన డైరీలో ఆఖరి వాక్యానికి అర్ధం? ఏమిటి వదిన ఆఖరి కోరిక? అన్నయ్యని, అమ్మ నాన్నను ఒప్పించి సాత్వికను తనతో తీసుకువెళ్లిపోవడమా? లేదా క్షమించమని అన్నయ్యను అడగడమా?
ఏంచేస్తే వదిన, సాత్విక కలుస్తారు? ఎంత ఆలోచించినా నాకు ఏ ఆలోచన తట్టలేదు. వరండాలో లైటు, ఫాన్ తీసేసి పుస్తకాన్ని భద్రంగా నా పుస్తకాలమధ్య పెట్టి నడుం వాల్చాను.
*******************
ఆదివారం కావడంతో నేను వదిన ఇంటికి బయల్దేరాను ఆమె ఇచ్చిన పుస్తకం ఇచ్చేద్దామని. వస్తున్నట్టు ముందే ఫోన్ చేసి చెప్పడంతో వదిన ఇంట్లోనే ఉంది.
'' రా బుజ్జీ..రా...''అంటూ ఆహ్వానించింది.
ఆమెకు పుస్తకం అందించాను.
''నేను ఈ పుస్తకం నీకు ఎందుకు ఇచ్చానో వూహించగలవా?' అడిగింది వదిన.
''చాలా ఆలోచించాను వదినా...కానీ వూహించలేకపోయాను.''
'' పిల్లలున్న ప్రతీ పెద్దవాళ్ళు తాము తొందరపడి జీవితానికి సంబంధించిన ఏ తప్పు చేసైనా, సమాజానికి యాంటీ ఎలెమెంట్స్ ని అందించినట్లే. అందుకు నా జీవితమే ఒక ముఖ్య ఉదాహరణ. పంతాలకు, పట్టింపులకు పోయి పెద్దలు పెద్దలు దెబ్బలాడుకుంటే భవిష్యత్తు లేనివాళ్ళు పిల్లలే అవుతారు. అది నీలాంటి విజ్ఞులు గ్రహించి తీరాలి బుజ్జీ. జరిగిన తప్పులో నాది కూడా కొంత ఉంది అని నువ్వు అర్ధంచేసుకోవడానికి, వాస్తవ పరిస్థితి నాకు జ్ఞానం ఉన్నంతవరకు రాయగలిగాను. '' అంది వదిన.
''ఈ పుస్తకాన్ని నాకిస్తే నేను నాన్నగారికి, అమ్మకి, అన్నయ్యకి చూపిస్తాను వదినా...''అన్నాను,
''అదేదో సినిమాలో చెప్పినట్లు సిఫార్సులతో కాపురాలు చక్కబడవు బుజ్జీ. నీకు నామీద ఉన్న గౌరవానికి చాలా కృతజ్ఞురాలిని. ఆ ఉత్తరాలు నేను రాసినవి కావు అన్న ఒక్క ముక్క మీ ఇంట్లో అందరూ నమ్మగలిగితే నాకు ఎంతో సహాయం చేసిన వాడివవుతావు బుజ్జీ.''
'' తప్పకుండా వదినా...నిజంగా ఈ శిక్షణకు నేను రాకపోయి ఉంటే మిమ్మల్ని కలిసే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయిఉండేవాడిని. మిమ్మల్ని ఒక్క మాట అడగవచ్చా?''
''అడుగు''
''అసలు ఈ పుస్తకం రాయాలని మీకు ఎందుకు అనిపించింది?''
''మంచి ప్రశ్న వేశావు బుజ్జీ. నేను బామ్మగారి వూరిలో ఉండగా మా బామ్మ రోజూ ఒక పుస్తకం చదువుకునేది. ఆరోజుల్లో ఆమె వాళ్ళ వూరిలో ఏడవ తరగతి వరకు చదువుకుంది. వివాహమైన సంవత్సరం పూర్తయిన మొదటి వార్షికోత్సవంనాడు మా తాత ఒక డైరీ ఆమె చేతిలో పెడుతూ ''పెళ్ళైన ఈ ఏడాదిలో మన ఇద్దరి మధ్యన గడచినా మధురమైన అనుభూతుల్ని జ్ఞాపకాలని దీనిలో పొందుపరిచాను. రేపు పిల్లలు పుట్టాకా దీన్ని ఎలాగూ చదవడం కుదరదు. కాబట్టి నేను పగలు ఉద్యోగానికి పోయినపుడు మధ్యాహ్నం మన గదిలో దూరి చదువుకో..'' అని ఇచ్చాడట. అది ఏమిటా అని బామ్మ లేని సమయంలో చదువుతుంటే బామ్మ వచ్చి నన్ను తిట్టి ఆ పుస్తకం దాచేసుకుంది.
'అది ఏమిటి బామ్మా...'' అని అడిగాను.
దాన్ని డైరీ అంటారనీ...అలా జీవితంలో ముఖ్యమైన సంఘటనలు దానిలో రాసుకుంటే వృద్ధాప్యంలో ఆ డైరీ, 'గడిపిన జీవితానికి ' అందమైన అనుభూతిలా మిగులుతుందని దాని ప్రాముఖ్యత చెప్పి, 'రేపు నీ పెళ్లి అయ్యాకా కూడా ఇలాగే రాసుకుని దాచుకో' అని సలహా ఇచ్చింది. మా బామ్మ దగ్గర పొందిన ప్రేమానురాగాలు పెళ్లి తరువాత మీఇంట్లో లభించడంతో మీ అన్నయ్యని ' ఒక పాత వాడని డైరీ' ఉంటే ఇవ్వండి అని అడుగుదామనుకున్నాను. కానీ భయం వేసింది. ఒకరోజు నువుకాలేజీకి వెళ్ళినప్పుడు నీ పుస్తకాలన్నీ వెతికితే రెండు పేజీలు మాత్రమే రాసి ఆపేసిన ఈ నోట్స్ కనిపించింది. నిజానికి నాకు డైరీ రాయడం రాదు. కానీ నాకు తోచింది ఆ రోజునుంచి రాయడం మొదలెట్టాను. అదీ సంగతి.'' చెప్పింది వదిన.
''మరి ఆ పుస్తకంలో నా చిట్టచివరి కోరిక ....అని ఆపేసారు. అదేమిటో రాయలేదు. అది రాయకూడనిదా..?'' అడిగాను.
వదిన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి ఆమె చెంపలమీద జల జలా రాలిపోయాయి.
'నేను కంగారు పడిపోయాను. ఆదుర్దాగా అడిగాను.
''వదినా..నేను తప్పుగా మాట్లాడానా? లేక అడగకూడనిది అడిగానా?''
''నిన్ను చూసాకా నాకు ఒక ఆశ కలిగింది బుజ్జీ. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది.''
'' అన్నయ్యని, మిమ్మల్ని అయితే నేను కలపలేను వదినా...ఎందుకంటే అన్నయ్య రెండో పెళ్లి చేసేసుకున్నాడు.''
'' నాకు ఉన్నవి రెండు కోరికలయ్యా..... ఒకటి... మీఇంటి పెద్దల ముగ్గురి కాళ్ళమీద పడి మనస్ఫూర్తిగా 'క్షమించమని' కోరడం...రెండవది...నా బిడ్డకు నేను చేసిన అన్యాయానికి సాత్వికని ఒక్కసారి మనసారా కౌగలించుకుని ''అమ్మా'' అని పిలిపించుకుని నా మనసులోనే 'ఈ అమ్మను క్షమించరా' అని కోరుకోవాలని. మొదటిది జరిగినా జరగకపోయినా రెండవది జరిగే అవకాశం ఉంది. సాత్వికకు చెప్పి తనను కలిసే అవకాశం ఈ జీవితంలో ఒక్కసారి కలిగించమని చిన్నవాడివైనా నిన్ను అర్ధిస్తున్నాను బుజ్జీ.'' అంది వణుకుతున్న కంఠంతో
''బాధపడకండి వదినా..డైరీలో మీరు ఈ రెండో కోరికని రాసి ఉంచుకోండి.దానిని నెరవేర్చడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వదినా..రేపు శుక్రవారం రాత్రి వెళ్ళిపోతున్నాను వదినా.మళ్ళీ వచ్చి కనిపించే అవకాశం రాకపోవచ్చు...కానీ తప్పకుండా మీ 'మనసు కోరుకున్న న్యాయం' నేను నెరవేర్చే ప్రయత్నం చేస్తానని మాట ఇస్తున్నాను.'' అని పల్లవి మేడం గారిని, వాళ్ళ అమ్మగారిని పలకరించి అక్కడనుంచి బయట పడ్డాను.
(మిగతా 29 వ భాగంలో)
