మనసు చేసిన న్యాయం - చివరి (33 వ) భాగం
మనసు చేసిన న్యాయం - చివరి (33 వ) భాగం
మనసు చేసిన న్యాయం - చివరి (33 వ) భాగం
ఈ ప్రపంచంలో ఒక కన్నతల్లికి బిడ్డకి మధ్య గల అద్భుతమైన బంధాన్ని మించినది మరొకటి ఉండదేమో. తల్లిపట్ల ఆ బిడ్డ ప్రేమ ఈ ప్రపంచంలో 'అసాధ్యమైన దేనినైనా సాధించాలి' అనే అజేయమైన శక్తిని ఇస్తుంది అని చెప్పడానికి సాత్విక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పక తప్పదు.
"నువు కోరినట్టుగా అమ్మని చూపించాను.మరి ఇక నీ మాట నువ్వే నిలబెట్టుకోవాలి"అన్నాను.
"నా జీవితంలో మీరు నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి నిన్నటిరోజు చిన్నాన్న. ఇక నా శక్తిని ఉపయోగించి నా లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంటాను చిన్నాన్న"అంది సాత్విక.
"పెళ్లి బాగా జరిగిందిరా అబ్బాయ్?"నాన్నగారు అడిగారు.
"చాలాబాగా తాతగారు. నాకు డ్రెస్ మెటీరియల్ కూడా పెట్టారు"అంటూ చూపించింది సాత్విక.
**********************
అంతే.
సాత్విక వెనుతిరిగి చూడలేదు. బి.టెక్.మొదటి సంవత్సరంలో 98.8 శాతం మార్కులతో తాను చదువుకున్న కళాశాల పేరును దేశంలోని విజయఢంకా మోగించింది. యాజమాన్యం ఆమెను ఘనంగా సత్కరించింది.పత్రికలు ఆమె ప్రతిభను వేనోళ్ళ కొనిఆడాయి.
ఆ విజయోత్సవ సభ అయ్యాకా ఇంటికి వచ్చిన సాత్విక తలమీద ముద్దుపెట్టుకుంటూ అన్నాను.
"సాధించావురా నాన్న.నువ్వు నా కడుపున పుట్టకపోవడం నా దురదృష్టం."అన్నాను.
సాత్విక సున్నితంగా నా నోరు మూసేసింది.
"పొరపాటున కూడా అలా అనవద్దు చిన్నాన్న. నా ఈ చదువుకు పునాది వేసిన అక్షరబ్రహ్మ మీరు. ఇంకా మూడు సంవత్సరాలు కష్టపడాలి. కష్టపడతాను. అమ్మని సాధించుకోవడం కోసం తప్పకుండా కష్టపడతాను."అంది దృఢసంకల్పంతో.
"నీ లక్ష్యమే అది అయితే నీకు ఒక 'అమ్మ'కన్నా అపురూపమైన కానుక ఇస్తాను. కావాలా మరి?"అన్నాను.
"అమ్మ"నే కానుకగా ఇచ్చావు చిన్నాన్న. అంతకన్నా గొప్ప కానుకా!..నెవర్. ఇవ్వలేరు చిన్నాన్న" అంది ధీమాగా.
"ఇస్తే?ఒకవేళ ఇవ్వగలిగితే?" రెట్టించాను.
"ఓడిపోయాను అని ఒప్పుకుంటాను" అనబోతుంటే తన నోరు మూసేసాను.
"నీ జీవితంలో నీ నిఘంటువులో ఆ పదం ఉండకూడదు అని కోరుకునే మొదటివాడిని నేనేనమ్మా. కళ్ళు మూసుకో"అన్నాను.
సాత్విక కళ్ళుమూసుకుంది.
ఆ బహుమతిని ఆమె చేతిలో పెట్టాను.
"వావ్ 5జీ నా. ఫోన్ ఉంటే చదువు పాడవుతుంది చిన్నాన్న. అయినా మీరిచ్చారు కాబట్టి తీసుకుంటాను."
"ఇది నీ మొదటి సంవత్సరం ఫలితానికి.రాబోయే మూడేళ్ల ఫలితాన్ని నిర్ణయించే బహుమతి లోపల వెతుక్కో.."అన్నాను నవ్వుతూ.
రెండు క్షణాలలో పట్టేసింది ఆ బహుమతిని సాత్విక.
దాన్ని చూస్తూనే విభ్రమంగా నాకేసి చూసి నాకు నమస్కరించింది.
ఒక్కసారిగా నా తొడమీద తలవాల్చి పడుకుని తనువుతీరా ఆ వీడియోని చూసుకుంది.
"సహజంగా కన్నబిడ్డకు తల్లి చిన్నతనంలో గోరుముద్దలు తినిపిస్తుంది.ఆ అదృష్టం ఈ జన్మకే కోల్పోయాను అనుకున్న నాకు నిజంగా అమ్మకన్నా అపురూపమైన కానుక ఇచ్చారు చిన్నాన్న.మళ్లీ జన్మలో మీ కూతురిగా పుట్టి రుణం తీర్చుకుంటాను చిన్నాన్న" అంది సాత్విక.... వదిన తన కళ్ళలోకి ప్రేమతో చూస్తూ పూరీ తినిపిస్తున్న వీడియోను తన్మయంగా చూసుకుంటూనే ఉంది.
********
ఈ ప్రపంచంలో కాలం సృష్టించే అద్భుతాలు ఊహించలేనివి...
"ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.."అని సినీ కవి రాసినట్టుగా కాలమహిమను ఎవరూ ఊహించలేరు.
మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుడంతటి పాత్రచేతే 'కాలమహిమ'అనిపించారు చిత్ర దర్శకులు.
ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ బి.టెక్.ఆఖరి సెమిస్టర్ లోకి వచ్చింది సాత్విక.
దేశంలో మొదటి పది స్తానాలలో ఉన్న ఒక ప్రముఖ ఎం.ఎన్.సి.కంపెనీ నిర్వహించిన కాంపస్ ఇంటర్వ్యూ లో 22 లక్షల ప్యాకేజీ తో సాత్విక ఉద్యోగానికి ఎన్నుకోబడింది.
కష్టపడి చదువుకున్న ఒక ఆడపిల్ల జీవితానికి ఆర్ధిక స్వాతంత్య్రం ఒక ప్రధాన ఆలంబన అయితే పెళ్లి పరిపూర్ణతను సిద్ధింపచేసే మరో ఆలంబన.
సాత్విక తన ఆఖరి సంవర్సరపు పరీక్షలు పూర్తి చేసింది. యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది.
నాకొడుకు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులో జాయిన్ అయితే కూతురు డాక్టర్ కోర్సులో జాయిన్ అయింది.
ఇన్ని మంచి విషయాలలో చిన్న అపశృతి దొర్లింది.అదే కాలమహిమ.
షుగర్ 540 పాయింట్లకు చేరి రెండురోజులు నరకయాతన పడి అన్నయ్య చేతుల్లోనే చివరకు రెండో వదిన మరణించింది. అన్నయ్య మళ్లీ ఒంటరివాడయ్యాడు.
నాన్నగారు అటు డబ్బు, ఇటు పలుకుబడి ఉపయోగించి అన్నయ్యని మావూరుకి బదిలీ చేయించేశారు.అన్నయ్యచేత నెలరోజులపాటు మెడికల్ లీవ్ పెట్టించేశారు నాన్నగారు.
అన్నయ్యని అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉద్యోగంలో చేరే క్షణంకోసం ఎదురుచూస్తోంది సాత్విక తల్లి.
కళాశాల వార్షికోత్సవ సభలో కేంద్ర మానవవనరుల సహాయమంత్రిణి చేతులమీదుగా ఏభైవేలరూపాయల కాష్ బహుమతితో సత్కరించబడింది. ఆరోజు మా అందరికీ అతి పెద్ద పండుగ.
"బుజ్జీ. నా కూతురని నాకు చెప్పకుండా దాని ప్రేమను రుచి చూపించావు.ఎపుడో ఆరవ తరగతిలో చూసిన నేను తాను నా సాత్విక తల్లి అని ఈరోజు టీవీ లోను, వార్తాపత్రికలలోను చూసి గుర్తించాను. నీపిల్లలతో సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా నీ మనసు నాకూతురికి చేసిన న్యాయానికి ఆ భగవంతుడు నిన్ను నీ కుటుంబాన్ని సర్వదా కాపాడతాడయ్యా !" అని వదిన సందేశం పంపింది.
*******
సాత్వికకు ఉద్యోగంలో చేరమని ఉత్తర్వులు వచ్చాయి.
తన స్నేహితురాలు ప్రమోషన్ కోసం వస్తోందని ఆమెను తీసుకురావడానికి స్టేషన్ కి వెళ్ళింది సాత్విక. అటువంటి స్నేహితురాలు ఎవరబ్బా అని నేను ఆశ్చర్యంగా ఎదురుచూడసాగాను.
సాత్విక వెనుక వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యం, ఆనందం, సంతోషం,ఉవ్వెత్తున ఎగసిన ప్రేమ,..వీటన్నిటి సంయుక్త భావాలతో లోపలికి ఆహ్వానించారు అమ్మ, నాన్న...వదినను. వెనుక ప్రణవసాయి...ఇంకా పెద్దవాడయ్యాడు.
వదిన, అమ్మ నాన్నగార్ల పాదాలపై కన్నీటి అభిషేకమే చేసింది.
"అత్తయ్య..నన్ను..నన్ను క్షమించండి."వదిన కంఠం పూడుకుపోయింది.
వారి ముగ్గురి కళ్ళల్లో గంగ, యమున,కావేరీలు పోటీపడుతున్నాయి.
అది చూసి నా కళ్ళలో గోదారి పెల్లుబికింది.
ఆ సన్నివేశపు విలువ బాధపడ్డవాళ్ళకి, బాధను అనుభవించినవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
ఆవేదన స్థిరపడ్డాక అందరమూ అన్నయ్య గదిలోకి వెళ్ళాము. అన్నయ్య అటుతిరిగి పడుకుని ఉన్నాడు.
వదినను అన్నయ్య ముందు నిలబెట్టింది సాత్విక. అన్నయ్య నెమ్మదిగా లేచి కూర్చున్నాడు.
అప్పటికే కన్నీళ్లతో వేల గంగాస్నానాలు చేసిన వదిన అన్నయ్య పాదాలకు నమస్కరించి
"నన్ను క్షమించమని కోరే అర్హత నాకు లేదండీ. నేను ఇక్కడ ఉండటానికి కూడా రాలేదు. కానీ ...కానీ నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను అని ఒక్కసారి చెప్పండి .వెళ్ళిపోతాను.'' అని చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది.
సాత్విక సైగతో మేమంతా వాళ్ళిద్దరినీ వదిలేసి కిందికి వచ్చేసాము.
మరో పావుగంటలో అన్నయ్య వదిన కిందికి వచ్చారు. అన్నయ్య నన్ను గాఢంగా కౌగలించుకున్నాడు.వదిన చంద్రిక చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. మనసులు చెప్పలేని భావాలు వారి చూపుల్లో ఊసులాడుకుంటున్నాయి.
''తమ్ముడూ.. ఇన్ని మనసులకు న్యాయం చేయాలనుకున్న నీ 'మనసు చేసిన న్యాయం' ఉందే ...దాని లక్ష్యానికి నా ఆశీసులురా...'' అన్నాడు అన్నయ్య ఎన్నో ఏళ్లతర్వాత నిర్మలమైన నవ్వు నవ్వుతూ .
*********
నంబర్ వన్ రైల్వే ప్లాట్-ఫార్మ్ అంతా ఎంతో కోలాహలంగా ఉంది.
తమ ఊరి కళాశాలలో చదువుకున్న టాప్ రాంకర్ ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్తోంది అన్న ఆనందం అక్కడ ఉన్న ప్రతీవారిలో కనిపిస్తోంది. సాత్విక కళాశాల అధ్యాపకులలో కొందరు, వైస్ ప్రిన్సిపాల్ గారు సాత్వికను అభినందించి వెళ్లిపోయారు. స్నేహితులు, స్నేహితురాళ్ళు నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
మా ఊరి చైర్మన్ తన మందీ మార్బలంతో రాజకీయ అట్టహాసం చేస్తూ వచ్చి సాత్వికను అభినందించి 'మన వూరు పేరు నిలబెట్టావు తల్లీ..నీలాంటి పిల్లలను కన్న మీ అమ్మా నాన్నలు అదృష్టవంతులు' అని అన్నయ్య, వదిన, అమ్మ నాన్నలను అభినందించి తనదైన ఫక్కీలో నిష్క్రమించారు.
అందరి ఆనందాన్ని, సంతోషాన్ని తానూ పంచుకోవాలన్నట్టు రైలు వచ్చి ఆగింది.
సాత్విక ఏ.సి.కంపార్ట్మెంట్లోకి ఎక్కి అన్నయ్యకి, వదినకి చేతులు అందించింది. వెనుకగా ప్రణవ సాయి...లగేజీ అంతా లోపల సర్దేశాడు పోర్టర్.
అందరమూ హర్షధ్వానాలతో వీడ్కోలు చెబుతుండగా -
ఆ కుటుంబ త్రివేణీ సంగమాన్ని మోసుకుంటూ రైలు తూర్పుదిక్కుగా సాగిపోవడానికి కదిలి వేగం పుంజుకుంది.
సమాప్తం
కొత్తపల్లి ఉదయబాబు!
