STORYMIRROR

kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం 32 వ భాగం

మనసు చేసిన న్యాయం 32 వ భాగం

3 mins
35


మనసు చేసిన న్యాయం 32 వ భాగం


ఏది ఏమైనా సాత్విక కోరిక తీర్చడం సమంజసం అనిపించింది నాకు. ఇప్పుడు తను చిన్నపిల్ల కాదు. 18 ఏళ్లు దాటిన చదువుకుంటున్న ఆడపిల్ల. ఆ మాటే చంద్రికతో అన్నాను


"ఒకసారి తీసుకెళ్లి చూపించండి. ఇరవై ఒక్క రోజులు మీరు ఆ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు పిల్లలు మీకోసం ఎంతగా అల్లాడిపోయారో నాకు తెలుసు. అలాంటిది జ్ఞానం వచ్చాక కన్నతల్లి బతికి ఉందని తెలిస్తే ఆ బిడ్డ మనసు ఎంతగా కుమిలిపోతోందో పాపం. ఏదో ఒక వంకతో తీసుకెళ్లి వాళ్ళ అమ్మ ని చూపించండి" అని చంద్రిక కూడా సలహా ఇవ్వడంతో ఆ శనివారం రాత్రి బయలుదేరి వెళ్లి మళ్లీ ఆదివారం రాత్రి తిరిగి వచ్చేలా రిజర్వేషన్ చేశాను.


వదినతో హైద్రాబాద్ వస్తున్నానని వీలైతే వచ్చి కలుస్తాను అని చెప్పాను.


" ఇంట్లోనే ఉంటాను తప్పనిసరిగా రా! చాలా ఏళ్ళయింది నిన్ను చూసి"అంది వదిన.


ఒక స్నేహితుడి కుమారుడి పెళ్ళికి విశాఖపట్నం వెళ్తున్నానని, సాత్వికను నాతో తీసుకువెళ్తున్నానని అమ్మకు, అబద్ధం చెప్పాను.


శనివారం రాత్రి బయల్దేరి ఆదివారం ఉదయం నేను సాత్వికతో వదిన వాళ్ళ వీధి మొదట్లో ఆటో దిగాను.పల్లవి మేడంకి ఫోన్ చేసాను.


ఆమె వచ్చి సాత్వికని తనతో తీసుకుని లోపలికి వెళ్లిపోయారు.


నేను వదిన వాటా ముందు నిలబడి తలుపు కొట్టాను.


"వచ్చేసావా...రా బుజ్జీ.అంతా బాగున్నారా సాయి నాన్నా.అంకుల్ ని నీరూమ్ లోకి తీసుకెళ్లు. నేను ఈలోగా కాఫీ పెడతాను."అని ఆహ్వానించింది.


సాయి నన్ను తన గదిలోకి తీసుకువెళ్ళాడు.నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. వదిన కాఫీ ఇచ్చి టిఫిన్ చేయడానికి వెళ్లారు.సాయి నేను కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము.


పావుగంట తర్వాత పల్లవి మేడం "విజయా"అంటూ లోపలికి వచ్చారు. నన్ను చూస్తూనే పలకరించారు.


"హాయ్ వైభవ్..ఎప్పుడు వచ్చావు?అంతా బాగున్నారా?"


"బాగున్నారు మేడం"అన్నాను.


వదిన లోపలినుంచి వచ్చారు.


"విజయా. నిన్న నీకు చెప్పాను కదా. నా స్నేహితురాలు ఒక ఆమె చిన్నతనంలోనే తన కూతుర్ని వదిలేసి వెళ్లిపోయిందని, ఆ అమ్మాయి మా ఇంటికి వస్తుంది అని చెప్పాను కదా. నువు కూడా అదే స్థితిలో ఉన్నావు కదా.ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడి ఓదార్చగలవా?" ఆ మాట వింటూనే వదిన మొహం వాడిపోయిన పువ్వు అయిపోయింది.


"అలాగా. తప్పకుండా మేడం.తీసుకురండి.ఆ అమ్మాయిని చూడాలని ఉంది.పాపం.తల్లి ప్రేమ లేక ఎంతగా బాధపడుతోందో? నాలుగు మంచి మాటలు చెబుతాను."


"అయితే నువ్వలా కూర్చో. మళ్లీ పనిలోకి వెళ్లిపోకు.జస్ట్ రెండు నిముషాలు."అంటూ మేడం బయటకు వెళ్లి సాత్వికను లోపలికి తీసుకొచ్చారు.


గుమ్మంలోకి అడుగుపెడుతున్న అరవిరిసిన గులాబీలా ఉన్న సాత్వికను చూస్తూనే చివ్వున లేచి నిలబడ్డారు వదిన.


వదినను చూస్తూనే సాత్విక కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.ఆపాదమస్తకం వదినను చూస్తూనే ఒక నిముషంపాటు అలా ఉండిపోయింది.


అది చూసిన వదినలో బిడ్డపట్ల ప్రేమతో కాబోలు చేతులలో సన్నగా కంపనం మొదలవగా "పాపా"అని చేతులు చాచింది.


నిజమైన రక్తసంబంధపు స్పర్శ ఒక దేహంనుంచి మరో దేహానికి ప్రవహించి ఒకరిపట్ల ప్రేమ మరొకరిలోకి మమేకమవుతూ లీనమవసాగింది. ఇద్దరి కళ్ళ వెంట కన్నీటిధారలు ఆగకుండా స్రవిస్తూనే ఉన్నాయి.


నేను పల్లవి మేడం కు సైగ చేసాను.


"అరె.ఏమిటిది విజయా..ఆ పిల్ల అంటే చిన్నపిల్ల. తనకి నాలుగు ఓదార్పు మాటలు చెబుతావని నిన్ను పిలిస్తే నువ్వే అంతగా బాధపెడితే ఎలా విజయా?ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్."అన్నారు మేడం వారిద్దరిని విడదీస్తూ.


" సారీ మేడం ! రియల్లీ వెరీ సారీ ! ఏమిటో .. తనని ఓదార్చే ప్రయత్నంలో నేను బరస్ట్ అయిపోయాను.''అంటూ తన కళ్ళను తుడుచుకుని, సాత్విక కళ్ళను తుడిచింది వదిన.

>

''అన్నట్టు టిఫిన్ చేశాను...తెస్తాను ఆగమ్మా.'' అంటూ కిచెన్లోకి వెళ్ళబోయింది వదిన. 


'' భలేదానివే విజయా.. నేను టిఫన్  తీసుకొస్తాను. నువ్వు ఆ పాపతో కబుర్లు చెప్పు. సాయీ ఇలా రా నాన్నా..'' అంటూ పల్లవి మేడం సాయితో కిచెన్ లోకి వెళ్లారు.


వదిన సాత్వికను సోఫాలో తనపక్కనే కూర్చోబెట్టుకుంటూ '' నీ పేరేమిటమ్మా? నీ వివరాలు చెప్పు...నాకు వినాలని ఉంది.'' అని అడిగింది.


''నాపేరు లక్ష్మి'' అండి అని మొదలు పెట్టి . వదిన తన వివరాలు అడుగుతుంటే సాత్విక నేను చెప్పమన్నట్టే అన్నీ చెప్పింది. 


ఇంతలో పల్లవి మేడం వదిన చేసిన పూరీలు, కూర, పళ్ళాలలో సర్ది  ట్రే లో పెట్టి తీసుకువచ్చారు.  


ఒక ప్లేట్ అందుకుని ''నీకు నేను తినిపిస్తానమ్మా...'' అంటూ సాత్వికకు తినిపించింది వదిన. ఆ దృశ్యాన్ని వీడియో తీశాను నేను. 


అందరూ టిఫిన్లు తింటుంటే వదిన, సాత్విక ఎన్నోకబుర్లు చెప్పుకున్నారు. 


పల్లవి మేడమ్ ముందుగా లేస్తూ...''ఈపూట అందరి భోజనాలు మా ఇంట్లోనే.నేను ఆ పనిలో ఉంటాను.'' అని తమ వాటాలోకి వెళ్లిపోయారు.


 వదిన, సాత్విక నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం చూసి నేను, సాయి వదినతో చెప్పి సరదాగా బయటకు తిరగడానికి వెళ్ళాము.   


************   


భోజనాలు అయ్యాకా ''ఇక నేను వెళ్తాను మేడం.'' అంది సాత్విక లేస్తూ.


''మేడం ఏమిటి? అమ్మ అని పిలిచినా నాకు ఇష్టమే. ఉండు. ఇపుడే వస్తాను. '' అని లోపలి వెళ్లి కొత్త డ్రెస్ మెటీరియల్ తెచ్చి బొట్టు పెట్టి సాత్వికకు ఇచ్చింది. 


''ఇవన్నీ నాకెందుకమ్మా?'' అంది సాత్విక. 


'' నా సంతృప్తి కోసం.'' అంది వదిన. ఈ వూరు వచ్చినప్పుడల్లా నాదగ్గరకు వస్తూ ఉండు. ఈ అమ్మను మర్చిపోకు. ఇంతకీ ఎలా వెళ్తావు?'' అడిగింది వదిన.


''నేను తీసుకువెళ్లి బస్ ఎక్కిస్తానులే విజయా. అన్నట్టు ఈరోజు ఆదివారం. నీకు ఒక మేడం విజిటింగ్ కార్డు ఇచ్చాను కదా పాలసీ చేస్తాను అన్నారని. ఆవిడ ఇంట్లోనే ఉంటాను అని చెప్పారు. నువ్వెళ్ళి ముందు ఆ పని చూడు.నేను తనని పంపిస్తాను.'' అన్నారు పల్లవి మేడం. 


''సరే. వస్తాను తల్లీ.జాగ్రత్త'' అని సాత్విక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, నాకు సాయికి చెప్పి బాగ్ భుజాన వేసుకుని కంగారుగా వెళ్ళిపోయింది వదిన. 


మరో పది నిముషాలలో పల్లవి మేడం వీధి చివరకు వచ్చి నన్ను, సాత్వికను ఆటో ఎక్కించారు. 


*************    


''సంతృప్తిగా ఉందా?'' అడిగాను సాత్వికను.


'' ఏం చెప్పను చిన్నాన్నా? అమ్మ ఎంత మంచిది? నేను ఏం చెప్పినా నమ్మేసింది పాపం. ''అంది సాత్విక.


''ఇప్పుడైనా చెబుతావా అమ్మగురించి నీకు ఎలా తెలిసిందో?'' ఏదోగాను.


''మీరు అమ్మ డైరీ విషయాలు నాన్నకు పంపారట కదా.. ఆవివరాలు తాతగారికి తెలియవేమో అని డాడీ ఆయనకు పంపారట. నా స్నేహితురాలు నాకు పంపిన నోట్స్ కోసం తాతగారి ఫోన్ వెతుకుతుంటే ఆ డైరీ పేజీలు కనిపించాయి. వాటిని ప్రింట్ తీసి దాచుకున్నాను,'' చెప్పింది సాత్విక. 


నేను సాత్వికను ఇక అంకుల్ ఇంటికి తీసుకువెళ్ళలేదు. ముఖ్యమైన ప్రదేశాలు కొన్ని చూపించాను. సాయంత్రం అయిదు గంటలు దాటాకా బిర్లా టెంపుల్ కి మాత్రం తీసుకువెళ్లాను. 


''స్వామిని మనసారా కోరుకో...నీకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చేలా చేయమని.'' అన్నాను.


'' అలాగే చిన్నాన్న...'' అని కళ్ళుమూసుకుని స్వామికి నమస్కరించుకుంది సాత్విక. అక్కడ ఎక్కువ సేపు గడిపి, టిఫిన్ చేసి స్టేషన్ కి వచ్చి రైలు ఎక్కేసాము. 


(మిగతా తరువాయి భాగంలో)



Rate this content
Log in

Similar telugu story from Drama