మనసు చేసే న్యాయం - 24 వ భాగం
మనసు చేసే న్యాయం - 24 వ భాగం
మనసు చేసే న్యాయం - 24 వ భాగం
"నాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో నాతమ్ముడు ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడు. పక్క బెడ్ లో ఉన్న ఆమెతో 'తాను నాలుగు రోజులపాటు డ్యూటీకి వెళ్తున్నానని, కొంచెం మా అక్కని కనిపెట్టి గా ఉండండి ఆంటీ' అని కోరాడు. ఆవిడే పల్లవి మేడం వాళ్ళ అమ్మగారు. అప్పుడు మేము వేరే చోట ఉండే వాళ్ళం. ఇంట్లో తరచూ అమ్మ, తమ్ముడు చాలా గొడవలు పడుతూ ఉండేవారు.తను చెప్పినట్లే చేయాలని అమ్మ, తనమాట నెగ్గాలని మా మరదలు... ఆ గొడవలు, అరుపులు పడలేక ఇంటివాళ్ళు ఖాళీ చేసేయమన్నారు. అప్పుడు పల్లవి మేడం వాళ్ళ అమ్మగారు, తమకు తోడుగా ఉండడం కోసం మాకు ఈ వాటా అద్దెకు ఇచ్చారు." అంది వదిన.
"మీరేమీ అనుకోనంటే అత్తయ్యగారి గురించి నేను తెలుసుకోవచ్చా?"అడిగాను.
" వినడానికి నువ్వు భయపడకపోతే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు బుజ్జీ. మా తాతగారి పిల్లలలో అమ్మ పెద్దది. గత మూడు తరాల తరువాత ఇంట్లో లేక లేక పుట్టిన మొదటి ఆడపిల్లట మా అమ్మ. కావలసినంత పొలం, మహారాజ భవనంలాంటి పెద్దఇల్లు, కావలసినంతమంది పని వాళ్ళు,పాలేర్లు... అమ్మని నేలమీద కాలు పెట్టకుండా పెంచారట తాతయ్య. ఆమె చెప్పిందే శాసనం, చేసేదే విధానమట. ఆమె చేసిన పనిని విమర్శించిన వెంటనే ఇంట్లో ఏదో ఒక వస్తువు సర్వనాశనమైపోయేదట. అది ఎంత ఖరీదైన వస్తువైనా సరేనట.
అటువంటి పెంపకంలో పెరిగిన అమ్మ వయసు వచ్చాక ఒకటి రెండుసార్లు పాలేర్ల మీద,ఇంట్లో పనివాళ్ళమీద చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.
ఉన్న ఊరిలోనే పదవ తరగతి వరకు చదివించారట తాతగారు. తర్వాత పక్కన ఉన్న పట్టణానికి గుర్రపుబండిలో పంపించి ఇంటర్, డిగ్రీ పూర్తి చేయించారట.
రైల్వేలో ఇంజనీరుగా పనిచేస్తున్న తన అక్క కొడుకు అయిన నాన్నగారికిచ్చి పెళ్లి చేసారట తాతయ్య.
స్వయానా తన బావే తన భర్త కావడంతో అమ్మ ఇంకా రెచ్చిపోయిందట. మేము నలుగురు పిల్లలు పుట్టాము. నాన్నగారికి రైల్వేలో మంచి ఉద్యోగం కావడంతో అమ్మకి ఆడింది ఆట పాడింది పాట. ఆఫీస్లో పని వాళ్లలో ఇద్దరు ఎపుడూ మా ఇంట్లో అలా గుమ్మంలో కూర్చుని ఉండేవారు.
నాన్నగారు ఉద్యోగ నిమిత్తం ఎక్కడికి బదిలీ అయితే మా కుటుంబానికి అక్కడ క్వార్టర్స్ ఇచ్చేవారు . ఆ ఊళ్లలో సొసైటీలో పెద్ద పెద్ద అధికారుల భార్యలతో అమ్మ పరిచయం పెంచుకొనేది. లేడీస్ క్లబ్ లో జాయిన్ అయేది. అమ్మతో గొడవ పడ్డ ఒకరిద్దరు ఉన్నా ఎక్కువ మంది అమ్మ వెనకాల ఉండేవారు.
నేను ఐదో తరగతి వరకు అమ్మ దగ్గర ఉన్నాను.అమ్మ దగ్గర ఉంటే అమ్మ లక్షణాలే నాకు వస్తాయి అనుకున్న నాన్నగారు నన్ను మా నానమ్మ గారు ఊర్లో చేర్పించారు. తనకున్న హడావుడి పనులలో ఒక అమ్మాయి పనిభారం అయినా తగ్గినట్టే అని అమ్మ కూడా అందుకు ఒప్పుకుంది. ఇంటర్ కు నేను మా ఇంటికి వచ్చేసాను.
ఇంటికి వచ్చాకా అమ్మదగ్గర తల్లిప్రేమ దొరుకుతుందనుకున్న నా ఆశ అడియాసే అయింది.
మేము పెద్దఅయ్యాక నాన్నగారు మా చదువుల నిమిత్తం విజయవాడలో స్థిరనివాసం ఏర్పాటు చేసేసి ఆయన మాత్రం ఎంత దూరమైనా వెళ్లి డ్యూటీ చేసి ఏ వారానికో పదిరోజులకో వచ్చేవారు. ఇంట్లో పని వాళ్ళు, డబ్బు ఉండడంతో మాకు దేనికి ఇబ్బంది ఉండేది కాదు.
అయితే అమ్మ ఒక్క విషయంలో కూడా రాజీపడేది కాదు.అది చూసి నాన్నగారు డ్యూటీ మీద డ్యూటీ వేయించుకొని సాధ్యమైనంత వరకూ ఇంటికి దూరంగా ఉండేవారు.పండుగల్లో ఖచ్చితంగా ఇంట్లో ఉండేవారు.ఇంతలో అనుకోకుండా మీ అన్నయ్య గారి సంబంధం వచ్చింది.
'మనది అయిన సంబంధమే.అయినా ఏనాడు మన దాంపత్యంలో నువ్వు నా మాట వినలేదు.కాబట్టి అమ్మాయికి బయట సంబంధం చేద్దామ'ని నాన్నగారు ఎంతో మొత్తుకున్నారు.
'దూరపు బంధువుల అయితే ఏమైనా తేడాలు వస్తే నచ్చచెప్పుకుని అమ్మాయి అల్లుడు సుఖంగా ఉండేలా చూసుకోవచ్చు' అంది అమ్మ.
అలా మగపెళ్లి వారింట్లో కూడా తను పెత్తనం చెల్లుతుంది అనుకుంది అమ్మ.
నేను ఆశించిన అమ్మ ప్రేమ మీ అమ్మగారిలో, నన్ను పొదువుకున్న ప్రేమ మీ అన్నయ్యలో చూసి ఎంతో పొంగిపోయాను. అది భరించలేకపోయింది.నాద్వారా అల్లుడిని, తద్వారా మీ కుటుంబాన్ని సాధించాలన్న అమ్మ 'చీర గొడవతో 'అంకురార్పణ చేసింది.
ఆమె జీవితంలో మొట్టమొదటిసారి ఎదిరించి మాట్లాడింది మీ అన్నయ్యే. ఆమె మాట చెల్లకపోతే ఎవరనీ చూడదు.ఆ రోజునే నా సంసార సర్వనాశనానికి బీజం వేసుకుంది ఆవిడ. ఆ తర్వాత జరిగిన సంఘటనలు అన్నీ నీకు తెలుసు.
ఈ ఇంట్లోకి వచ్చాక పల్లవి మేడం, వాళ్ళ అమ్మగారు, ఉపేంద్ర అంకుల్ ఎంతో అండగా ఉండి మమ్మల్ని ఎన్నో విధాల ఆదుకున్నారు, సహాయం చేశారు .అటు అమ్మ ఇటు తమ్ముడు ఇద్దరు పోయిన బాధ నుంచి నేను చాలా కాలం బయటికి రాలేకపోయిన నాకు ఎల్ఐసి ఏజెన్సీ ఇప్పించి నన్ను మనుషుల్లో పడేసారు. ఈ వేళ అదే నాకు ప్రధానమైన వ్యాపకం.
అన్నట్టు నువ్వు ఏదో పని మీద వస్తే ఇవన్నీ చెప్పి నీ మనసు బాధ పెట్టి ఉంటాను. ముందు పాలసీ సంబంధించిన కాగితాలు అన్నీ ప్రింట్లు తీసుకుంటాను. ఆ ఫారాలన్నీ నా మెయిల్ కి పంపు."అంది వదిన.
నేను పంపిన పాలసీకి సంబంధించిన కాగితాలు అన్నీ ప్రింట్ అవుట్ తీసుకుంది ఆమె.
సాత్విక పేరున పాలసీ తీసుకోవడం చూసి వదిన ఆశ్చర్యపోయింది.
"నా ఇద్దరు పిల్లల పేర పాలసీలు ఆల్రెడీ చేయించాను వదిన. సాత్విక పేరు కూడా ఒక పాలసీ తీసుకోవడం నా బాధ్యత వదినా!" అన్నాను .
వదిన అన్ని వివరాలు పూర్తిచేసింది.ఆన్లైన్ ద్వారా ప్రీమియం సొమ్ము ట్రాన్సర్ చేసాను వదిన ఖాతాకు.
" నువ్వు.... నువ్వు ఎంతవరకు ఉంటావు ఈ ఊళ్ళో?" అని అడిగింది.
" ఇంకొక పదిరోజులు పైన" అన్నాను.
వదిన లోపలికి వెళ్లి ఒక ఒక 200 పేజీల బైండ్ బుక్ తీసుకొచ్చినా చేతికి ఇచ్చింది.
(మిగతా 25వ భాగంలో)
