మనసు చేసిన న్యాయం - 25వ భాగం
మనసు చేసిన న్యాయం - 25వ భాగం
మనసు చేసిన న్యాయం - 25వ భాగం
"బుజ్జి! ఈ పుస్తకం చాలా జాగ్రత్త! ఈ పుస్తకం చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. రేపు ఆదివారం వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఈ పుస్తకం జాగ్రత్తగా తెచ్చి పెట్టు ఎందుకంటే నేను ఏ పని చేయబోతున్నా నన్ను దారిలో పెట్టే భగవద్గీత అది .అందుకని ."
అంది వదిన.
''సరే వదినా...ఒక వేళ మళ్ళీ వారం రాలేకపోతే వెళ్ళేలోపు తప్పనిసరిగా వస్తాను. మీకు ఏమైనా అవసరం అయితే ఫోన్ చెయ్యండి.'' అన్నాను.
''బుజ్జీ...చేసిన తప్పు అనుక్షణం వెన్నులో ఛెళ్ళున కొడుతుంటే అప్రమత్తంగా ఎలా ఉండాలో జీవితం బాగా నేర్పింది బుజ్జీ. నిన్ను ఒక్కటి అడగాలి.''
''అడగండి వదినా...''
''ఇపుడు కాదు. నువ్వు వెళ్ళేలోపు వస్తానన్నావే.... ఆరోజు ...ఆరోజు అడుగుతాను.''వదిన కంఠం చివరలో తడిగా అవడం నేను గమనించాను.
''మరి వెళ్ళిరానా?'' అంటూ లేచాను.
'' ఏమిటీ ...అయ్యాయా వదినా మరుదుల కబుర్లు? '' అంటూ లోపలి వచ్చారు పల్లవి మేడం.
''నాలో ఉత్సాహాన్ని నింపి జీవితం పట్ల ఒక బాధ్యతని తెలియచేసిన దేవత పల్లవి మేడం.'' అంటూ వదిన ఆమె చేతులు పట్టుకుని ఆప్యాయంగా అంది.
''నాకు బజారులో కూర దొరకనప్పుడు మీ వదిన దగ్గరకు వచ్చి కూర్చుంటానయ్యా. అపుడు బోలెడు ములక్కాడలు కోసుకుని అదేదో సినిమాలో వెంకటేష్లాగా... ఆరోజు అన్ని ఐటమ్స్ ములక్కాడలతోనే...'' అన్నారు పల్లవి మేడం పక పకా నవ్వుతూ.
''ఓ... అలా వచ్చారా?'' అంది వదిన
''లేకపోతే ఏమిటి విజయా... నన్ను ములగచెట్టు ఎక్కించేస్తే ఎలా? మనిషికి సాటి మనిషికి సాయం చేసుకోవడం ఒక గొప్ప విషయమా చెప్పు? ఈవేళ ఒక విషయంలో నేను నీకు సాయపడి ఉండవచ్చు. నాకు నీ సహాయం అవసరం అవసరమైనప్పుడు నువు సాయపడతావేమో?ఎవరికి తెలుసు? నేను టిఫిన్ చేసి మీఇంట్లో అడుగు పెట్టబోయాను. కానీ మీరిద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుకుంటుంటే అంతరాయం కలిగించడం భావ్యం కాదని బయటికి వెళ్లి వచ్చాను. నీకు ఇంకో పాలసీదారుని పాలసీ చేయడానికి ఒప్పించి వచ్చాను. నీకు సహాయం చేస్తే నాకు నేను సహాయం చేసుకున్నట్టే." అన్నారు పల్లవి మేడం.
"థాంక్యూ మేడం."ఆప్యాయంగా పల్లవి చేతులు నొక్కి వదిలింది వదిన.
"మరి నేను బయలుదేరుతాను వదినా. వస్తాను మేడం. మళ్లీ మా ఊరు వెళ్లబోయే లోపల ఒకసారి వచ్చి కలుస్తాను. అంకుల్ ని కూడా వచ్చి కలుస్తాను అని చెప్పండి." అనేసి వదిన ఇచ్చిన పుస్తకం తీసుకుని నేను మళ్ళీ నా స్థావరానికి తిరిగి వచ్చేసాను.ఆ పుస్తకం ప్రాముఖ్యత గురించి చెప్పిన వదిన మాటలు గుర్తుపెట్టుకొని పెట్టెలో నా బట్టల అడుగున భద్రంగా దాచాను.ఆ తరువాత ఆ విషయమే మర్చిపోయాను.
*****
సి.సి.ఆర్.టి. శిక్షణా కార్యక్రమంలో ఉదయం తొమ్మిది గంటలనుంచి సాయంత్రం ఆరు గంటలవరకు మన దేశం సంస్కృతీ , ప్రాచీన కళలు, ఆనాటి చారిత్రిక నిర్మాణాలు...ఇలా ఎన్నెన్నో విజ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాలలో భాగంగా ఎమినెంట్ అధ్యాపకులచే ప్రసంగాలు, వివిధ భాషలలో జాతీయ సమైక్యతా గీతాలు, ఏదైనా ఒక ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ మేము గమనించిన విషయాలల్ని, విజ్ఙానాన్ని మరునాడు అసైన్మెంట్ షీట్ పూర్తి చేసి నిర్వాహకులకు అప్పగించడం, రూమ్ కి వచ్చాకా మా బట్టలు మేము ఉతికి ఆరేసుకోవడం...
ఇలాంటి పనులతో మళ్ళీ శనివారం రాత్రి వచ్చేసింది. ఉతుక్కున్న బట్టలు మడత పెట్టి మళ్ళీ పెట్టెలో పెట్టుకోబోతుంటే అప్పుడు కనిపించింది వదిన ఇచ్చిన 200 పేజీల బైండ్ బుక్.
రూమ్ మేట్స్ కి గుడ్ నైట్ చెప్పేసి విశ్రాన్తిగా చదవడం మొదలు పెట్టాను. నిజానికి అది నేను రెండు పేజీలు రాసి వదిలేసిన బైండ్ బుక్ . ఆ రెండు పేజీలు చింపేసి...మూడవ పేజీలో ...
'' నా వైవాహిక జీవితం....'' అని అందంగా రాసి ఉంది అందులో. ఆసక్తిగా అనిపించింది.
*******
* పదహారు రోజుల పండుగ అయ్యాకా మంచి రోజు చూసి అమ్మ నాన్న నన్ను కాపురానికి పంపారు. అత్తయ్యగారింట్లో అందరూ నన్ను అభిమానంగా చూడటం, ఆత్మీయంగా మాట్లాడటం నాకెంతో ఆనందాన్ని కలుగచేసింది. పట్నం చదువులు చదివినా అత్తవారింట్లో కొత్త కోడలు ఎలా నడుచుకుంటే మంచి పేరు తెచ్చుకోవచ్చో అంతా బామ్మా చెప్పినట్టు ఆచరించడం నేర్చుకున్నాను.
మూడు నెలలు శ్రీవారి ప్రేమానురాగాలతో తడిసి ముద్దయ్యాను. ఆయనకు కొంచెం కోపం ఎక్కువ గానీ, నా దగ్గరకు వచ్చినపుడు మాత్రం ప్రశాంతతతో ఉండేవారు. ఒక అనురాగ దాంపత్యంగా ఒక జంట మనాలంటే ఆ గీతనే ఆధారంగా చేసుకుని ఎవరి నియంత్రణలో వారు ఉంటూనే (అపుడపుడు కొద్దిగా అటుగాని ఇటూగానీ అయినా మళ్ళీ గీతమీదకు వచ్చేస్తూ) నమ్మకపు నావమీద జీవితం కొనసాగించడమే...అని అనుభవంలోకి వచ్చింది నాకు.
* మూడు నెల సంసార నావ ప్రశాంతంగా సాగిపోతుంటే ఒక అల ఎదురొచ్చి తాకినట్టుగా అమ్మ మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చింది. ఆయన నాకు కొన్న చీరలు సంతోషంతో చూపించాను. వాటిలో నాకు బాగా నచ్చిన చీర అమ్మ బాగ్ లో పెట్టుకుని కొత్త చెప్పులు వేసుకుని వెళ్ళిపోయింది.
మళ్లీ 15 రోజులు తర్వాత అమ్మ వచ్చింది ఈసారి తమ్ముడు నీ చెల్లెల్ని వెంటబెట్టుకుని వచ్చింది. ఆయన నాకోసం కోసం ముచ్చటపడి కొన్న ఆ చీర కట్టుకువచ్చింది.
వస్తూనే నన్ను కన్యాదానం చేసిన బంగారు గొలుసు తానే తీసుకుని తన మెడలో పెట్టుకుంటూ చెల్లెళ్ళకి అదే మోడల్ గొలుసులు చేయిస్తానని, మళ్లీ వచ్చినప్పుడు ఇచ్చేస్తానని చెప్పింది.నేను కాదన్నా, వాదించినా ఎంత పెద్ద గొడవ చేస్తుందో తెలుసు. ఆ సందిగ్ధంలో ఆగిపోయాను.
చీర తీసుకెళ్లినందుకు తప్పు పట్టారాయన. ఆయనకు చాలా కోపం వచ్చింది.
" ఆ చీర నా భార్యని సినిమాకి తీసుకెళ్లడం కోసం కొన్నాను.ఇప్పుడు మీరు కట్టుకున్నారు కదా!మీరు వస్తారా !"అని ఆయన అడిగారు.
అమ్మ కోపంతో నా పాతచీర కట్టుకుని,తన పాత చెప్పులు వేసుకుని కనీసం అన్నం కూడా తినకుండా తమ్ముడిని, చెల్లెళ్ళని తీసుకుని వెళ్లి పోయింది.
ఏదో జరగబోతోంది...అమ్మ మనస్తత్వం తెలిసిన నాకు...పిచ్చి ఆలోచనలు మొదలయ్యాయి.
(26వ భాగంలో)
