STORYMIRROR

kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం - 26వ భాగం

మనసు చేసిన న్యాయం - 26వ భాగం

3 mins
10

మనసు చేసిన న్యాయం - 26వ భాగం

*నేను గర్భవతిని అన్న భగవద్గీతా ప్రబోధంలాంటి శుభవార్త స్త్రీ జీవితంలో మరొకటి ఉండదేమో.

ఆ ఆనందంలో ఉండగా ఈసారి అమ్మ డాడీ, తాతయ్య, పెదనాన్నలతో వచ్చింది .తాతయ్య అమ్మతరపున మాట్లాడుతూనే ఏవో నాలుగు రాజీ మాటలు చెప్పారు. అమ్మ పెద్దగా మాట్లాడలేదు.నాన్నగారు ఇక్కడే సీమంతం జరిపించి నన్ను పురిటికి తీసుకువెళ్లేందుకు ముహూర్తం పెట్టించుకు వచ్చారు.

* సీమంతం ఘనంగా జరిగింది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో నుంచి ఒక నియంతృత్వ వాతావరణంలోకి వెళుతున్నాను అన్న భయం. ముఖ్యంగా ఏదో శక్తి నన్ను నా కుటుంబం నుంచి బలవంతంగా లాక్కుపోతున్నట్టుగా అనిపించింది.

*ఇంటికి వచ్చాకా అమ్మ ముందు నన్ను డాక్టర్ కి చూపించింది. నన్ను బయట కూర్చోబెట్టి ఆమెతో నాగురించి చాలా చర్చించింది.

డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు అమ్మ ట్రీట్మెంట్ కూడా నాకు మొదలైంది.

ఆరోజు మధ్యాహ్నం అలసటగా ఉండి పడుకున్నాను. నేను నిద్ర పోయాను అనుకుని అమ్మ ఇంట్లోనే మాతో ఎపుడూ ఉండే పని వాళ్ళతో మాట్లాడుతోంది. అమ్మ అడిగిన దానికి వాళ్ళు వినయంగా సమాధానం చెబుతున్నారు.

"మీరేం అనుమానపడకండి మేడం. ఆ ఊళ్లో రైల్వేలో పనిచేసే జట్టుకూలివాళ్ళు మనకి బోలెడుమంది స్నేహితులు ఉన్నారు. మీరు వివరాలు, డబ్బు ఇవ్వండి చాలు. పని పూర్తిచేయించే బాధ్యత నాది.ప్రాణం పోకుండా దెబ్బలు కొట్టించే బాధ్యత మాది." అంటున్నారు.

అమ్మ లోపలికొచ్చి నన్నొకసారి కదిపి చూసి బీరువా తెరిచి కొంత డబ్బు కట్ట తీసుకెళ్లి వాళ్ళకిచ్చింది. ఎవడికో మూడింది అనుకున్నాను.

* అమ్మకి ఈ మధ్య లేడీస్ క్లబ్ లో ఒక వర్ధమాన రచయిత్రి పరిచయం అయ్యారట. ఆవిడ నన్ను చూడడానికి వచ్చినపుడు అమ్మ ఆమెతో అంది.

"నేను మీకు ఒక సన్నివేశం చెబుతాను. ఆ సన్నివేశానికి తగ్గట్టు మీరు ఒక ఉత్తరం రాయగలరా మేడం?" అని అడిగింది.

అంగీకరించారు ఆవిడ.అమ్మ ఒక సన్నివేశం చెప్పింది.

ఒక పంజాబీ అబ్బాయి తమ క్వార్టర్స్లో ఉండే ఆంధ్ర అమ్మాయిని ప్రేమిస్తాడు. అది ఆ అమ్మాయి తల్లికి నచ్చదు. అతను తన కూతురికి రాసిన ఉత్తరాల ఆధారంగా ఆ కుర్రాడి మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తుంది వాళ్ళ అమ్మ. అప్పుడు ఆ పిల్లాడి తండ్రి డబ్బు,పలుకుబడితో తన కొడుకుపై ఉన్న కేసును మాఫీ చేసి సింగపూర్ పంపించేస్తాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లి దగ్గర బంధువుల కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. అప్పుడు ఆ కుర్రాడు కక్షతో సింగపూర్ నుంచి ఆ అమ్మాయి భర్తకు ఉత్తరం రాస్తాడు. అలాంటి ఉత్తరాన్ని ఒకదాన్ని మీరు రాసి సాయంత్రం లోపు నాకు ఇవ్వండి.

ఆవిడ కంగారు పడింది.

"సాయంత్రంలోగా అంటున్నారు నాకు ఏమీ ప్రమాదం రాదు కదా"అడిగిందావిడ.

"భలే వారు మేడం మీరు నాకు ఉపకారం చేస్తే నేను మీకు అపకారం చేస్తానా మేడం.ఇది కేవలం మీ సామర్ధ్యానికి పరీక్ష.ఇందులో మీరు నెగ్గితే మీకు మన క్లబ్ లో సన్మానం చేయిస్తాను"అంది.

అమ్మ చెప్పినట్టుగానే ఆవిడ ఆ సాయంత్రానికి ఉత్తరం తయారుచేసి పట్టుకొచ్చి అమ్మకి చదివి వినిపించడం చూసాను.ఆవిడ వెళ్ళాక అమ్మ దానిని పోస్ట్ చేయించింది.

* డెలివరీ తేదీ దగ్గరపడుతోంది.అమ్మ డాక్టర్ గారు కొన్ని కాగితాలు సంతకం పెట్టించమన్నారని చెప్పి తనే దగ్గరుండి ఇంటి గుర్తు ఉన్న చోట నాచేత సంతకాలు పెట్టించింది.

మరునాడు ఇంట్లో ఉండే రైల్వే పనివాడితో "మొన్న మీ వాళ్ల చేత చక్కగా పని చేయించావ్.దాని ఫలితం కనపడినట్టు తెలిసింది. ఇది అమ్మాయి గారు వాళ్ళ ఆయనకి రాసిన ఉత్తరం. జాగ్రత్తగా పట్టుకెళ్ళి పోస్ట్ చేయ్.చేరాలిసుమా... అర్థమైందా"అని కవరు ఇచ్చింది అతనికి.

నేను నవ్వుకున్నాను..ఆయనకి నేనెప్పుడు ఉత్తరం రాసానా అని.

* డెలివరీ అయి పాప పుట్టింది. పాపని చూసాను.ఆయన ప్రతిరూపం అరవిరిసిన కలువలా..నా చేతుల్లో పుత్తడిబొమ్మలా..!

*మళ్లీ రెండు రోజులవరకు పాప నాకు కనపడలేదు.నాకు వక్షోజాలలో ఏదో భరించలేని నొప్పి.అమ్మ ఏవేవో మందులు మింగించింది. వాటిల్లో నల్లటి ఉండలాంటి మందు కూడా ఉండేది. రాను రాను ఎపుడూ ఎక్కువగా నిద్ర పోవాలనిపించేది.మెలకువగా ఉన్నా మత్తుగా ఉండేది. ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా నేను చూస్తున్నాను. కానీ దేనికి స్పందించడానికి శక్తి లేనట్టుగా నీరసంగా కూర్చుండిపోయేదాన్ని.


నేను మెలకువగా ఉన్నప్పుడల్లా అమ్మ నాకు ఒకే విషయం రామనామంలా చెబుతూ ఉండేది. 


''అమ్మ..విజయా..నువ్వు ఎక్కడకు వెళ్ళినా తిరిగి మన ఇంటికే వచ్చేయాలి సుమా...మా అత్తవారింటికి వెళ్ళినపుడు ఎవరు ఏమి అడిగినా నీకేం తెలియనట్లు కూర్చోవడం... లేదా నిద్రపోవడం. అంటే తప్ప మరో మాట మాట్లాడకూడదు. లేకపోతే నువ్వు కోలుకోలేవట..''అని చెప్పేది. అది మాత్రం బాగా మనసులో ముద్రపడింది అనుకుంటా.


*మూడు నెలలు గడిచాకా నన్ను అమ్మ, పిన్ని అత్తవారింట్లో సారెతో దిగబెట్టారు. ఉదయమే లేచి చూస్తే నాపక్కన అమ్మ లేదు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి..''ఎక్కడకు వెళ్లినా మన ఇంటికి క్షేమంగా వచ్చెయ్యమ్మా'' అని...నేను రైలెక్కి ఇంటికి వచ్చేసాను. 


* తరువాత ఏ రోజో ...అమ్మ, పిన్ని మళ్ళీ నన్ను తీసుకుని మా వారింటికి వచ్చారు. వాళ్ళూ వాళ్ళూ ఏదో అరుచుకున్నారు.  అమ్మావాళ్లు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లిపోయారు.


*తరువాత ఒకరోజు రాత్రి నాన్నగారు, అమ్మ ...పిల్లలు అంటా టీవీ చూస్తున్నారు. పాప ఏడుపు విని నేను హాల్లోకి వచ్చాను. నాన్నగారి ఒళ్ళో పాప ఉంది. అమ్మని నాన్నగారు అమ్మని చాలా గట్టిగా కోప్పడుతున్నారు. నేను పాపతో ఆడుకోవాలని పాపని నా గదిలోకి తెచ్చేసుకున్నాను.


*మళ్ళీ ఒకరోజు నాన్నగారు అమ్మ లేకుండా నన్ను, పాపను మాత్రమే మావారింటికి తీసుకువచ్చారు. 


ఆయన అవేవో ఉత్తరాలు నన్ను చదవమని ఇచ్చారు... అమ్మ ఆవిడెవరో రచయిత్రిగారితో రాయించిన ఉత్తరం లాంటిది చదివాను.ఇంకో ఉత్తరం ఆయనకు నేను రాశానట..నాకు గుర్తులేదు గానీ..కింద నా సంతకంలాగానే ఉంది. నన్ను నాన్నగారు ఆ ఉత్తరం ఎపుడు రాశావని అడిగారు...నాకు తెలీదు డాడీ..నేను రాయలేదు అన్నాను. నాన్నగారు నాకు ఏవేవో మంచిమాటలు చెప్పి అన్నంతిని వెళ్లిపోయారు.


* పొద్దున్నే లేచి చూస్తే నాకు అమ్మ కనపడలేదు. మళ్ళీ అమ్మ మాటలు గుర్తొచ్చి రైలెక్కి ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేసరికి నాన్నగారు డ్యూటీకి వెళ్లిపోయారు.వచ్చాకా మళ్ళీ అమ్మ నాన్న దెబ్బలాట..బలేగా ఉండేది నాకు.


*ఇంక అమ్మ నన్ను మళ్ళీ మా వారింటికి తీసుకెళ్లలేదు. నాతో ఆడుకోవడానికి ఇంట్లో పాపకూడాలేదు.


(మిగతా భాగం 27 విభాగంలో ...)


Rate this content
Log in

Similar telugu story from Drama