మనసు చేసిన న్యాయం - 30 వ భాగం
మనసు చేసిన న్యాయం - 30 వ భాగం
మనసు చేసిన న్యాయం - 30 వ భాగం
మర్నాడు ఉదయం నాన్నగారు అమ్మ హఠాత్తుగా గుంటూరు ప్రయాణమయ్యారు.
"ఏమైందండీ" నాన్నగారిని అడిగాను .
"మీ వదినకి ఒంట్లో బాగుండదట రా. ఆ అమ్మాయికి బి.పి.,చక్కెర వ్యాధి ఎక్కువగా ఉన్నాయట.రోజూ చెక్కరవ్యాధికి ఇంజక్షన్ కూడా చేయించుకుంటుందట.
15 రోజులక్రితం నిలబడి కూరగాయలు కోస్తుంటే చాకు జారి కాలి బొటనవేలు మీద పడి రక్తం వచ్చిందట. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు కదా ఇన్ఫెక్షన్ గా మారిందట. నువ్వు హైదరాబాదులో ట్రైనింగ్ లో ఉన్నావని, నీకు తెలిస్తే బాధపడతావని అన్నయ్య చెప్పవద్దన్నాడు.సాత్విక జాగ్రత్త నాన్నా. రెండు రోజుల్లో వచ్చేస్తాం. సాత్విక జాగ్రత్త! వెళ్ళాకా ఫోన్ చేస్తా" అని తమ వాటా తాళం చెవులు ఇచ్చి నాన్నగారు అమ్మ ఊరికి వెళ్ళిపోయారు.
నాకెందుకో సత్యం మావయ్య గుర్తుకు వచ్చాడు. మావయ్య అంటే అమ్మకి పెత్తల్లి కొడుకు. అతనికి పెళ్లయింది. మొదటి భార్యవల్ల పిల్లలు కలుగలేదు... పైగా ఉమ్మడి కుటుంబంలో ఇంట్లోవాళ్ళకి, వచ్చేపోయే చుట్టాలకి కట్టెలపొయ్యిమీద వంటలు వండి చాకిరీ చేసి టీ.బీ.వల్ల మరణించింది. పెద్దవాళ్ళు పోరుపెట్టి మామయ్యకి రెండోపెళ్లి చేశారు. ఈవిడకి నలుగురు పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరుమగపిల్లలు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. మావయ్య అదృష్టం ఏమో కానీ,ఈమె కూడా మొట్ట మొదటిసారి గుండెపోటు రావడంతో డాక్టర్ గారు వచ్చేలోపలే మరణించింది. మగ పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు కాలేదు. మావయ్య పిల్లలకి వండిపెడుతూ బతుకుతున్నాడు. 'మళ్లీ పెళ్లి చేసుకోరా'అని ఎవరో సలహా ఇస్తే 'ఆవిడకి కూడా నేను వండి పెట్టడానికా...చచ్చు సలహాలివ్వకు" అని మొహాన తలుపు వేసేసాడట.
కొంతమంది జీవితానికి అదేం శాపమో ఏమో తెలియదు.. ఎన్నాళ్ళు గడిచినా,ఎన్నేళ్ళు గడిచినా వాళ్ళు సుఖపడటం జీవితంలో చూడలేము అనిపించింది నాకైతే.
రెండు రోజుల తర్వాత నాన్నగారు, అమ్మ ఇంటికి వచ్చేసారు విషణ్ణ వదనాలతో. నాన్నగారు చెప్పిన వార్త విని కొయ్యబారిపోయాను.
" ఏం చెప్పమంటావురా! కొంతమందికి జీవితంలో పెళ్లి అచ్చిరాదేమోరా. మీ పెద్ద వదినతో వాడి జీవితం అలా అయిపోయింది.ఏదో మళ్లీ పెళ్లిచేసుకున్నాడు అనుకుంటే ఈ అమ్మాయికి ఆ గాయం ఇన్ఫెక్షన్ అయి పాదం వరకు పాకి మోకాలి వరకు కుడికాలు తీసేశారు.ఇది జరిగి వారమైందట. ఓ పక్క ఆమెకు సేవ చేసుకుంటూ, డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు మీ అన్నయ్య" అన్నారు నాన్నగారు బాధగా!
నేను అన్నయ్యకి ఫోన్ చేశాను.
" ఏంటి అన్నయ్యా అలా జరిగిందట?" అని.
" చదువుకున్నవాడినై ఉండి కూడా మీ పెద్ద వదినకి నేను చేసిన అన్యాయానికి ఫలితం రా. ఆరోజు కొద్దిగా నా కోపాన్ని నిగ్రహించుకొని ఉంటే అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. తమ్ముడూ... నాకు ఒక మాట ఇస్తావా!" అడగలేక అడిగాడు అన్నయ్య.
" చెప్పన్నయ్యా.నీకు ఏ సాయం కావాలన్నా చేసే పూచీ నాదీ.అడుగు."
"ఒకవేళ నాకు ఏదైనా అయితే సాత్విక తల్లి బాధ్యత నీదేరా.ఈ ఒక్క సాయం చేసి పెట్టు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డగా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను" అన్నాడు అన్నయ్య కన్నీళ్లతో.
" అవే మాటలురా. నీకేం కాదు. సాత్విక మన కుటుంబంలో పుట్టిన మహాలక్ష్మి. చదువులతల్లి సరస్వతి. తన కాళ్లమీద తాను నిలబడి ఉద్యోగం సంపాదించాకనే నీ కూతురిని నీకు అప్పుడు ఇస్తాను. సరేనా? నీకు ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చెయ్" అని వదినకు ఒకసారి ఫోన్ ఇవ్వమని ధైర్యం కలిగించే నాలుగు మాటలు చెప్పి, చంద్రిక చేత మాట్లాడించాను.
" ఒకసారి వెళ్లి చూసొద్దామండి. అలా వెళ్లి రావడం మన ధర్మం" అంది చంద్రిక
ఆ ఆదివారం సాత్వికను తీసుకుని మా కుటుంబంతో గుంటూరు వెళ్లి అన్నయ్యని వదినను చూసి ఆ సాయంత్రానికే వచ్చేసాము. దానికి కారణం ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే సాత్వికకి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం.
******
"ఎలా రాశావమ్మా?"ప్రతీ పరీక్ష రాసివచ్చాకా నేను అడిగే ప్రశ్న.
"ఒకటి గాని, అరమార్కు గాని తగ్గుతుంది చిన్నాన్న" ఆమె ఆత్మవిశ్వాసపు సమాధానం.
నా పిల్లలూ ఆమె మార్గంలో నడుస్తున్నందుకు నాకు చాలా సంతోషమేసింది.
ఫలితాలు వచ్చేలాగా ఖాళీగా ఉండకుండా అటు కంప్యూటర్ కోర్సు, ఇటు తనకెంతో ఇష్టమైన డ్రాయింగ్, వీణ, పాలిటెక్నిక్, ఏపీ ఆర్ జె సి కార్యక్రమాలలో తనను తాను బిజీగా చేసుకుంది సాత్విక.
అన్నికార్యక్రమాలలో తన స్థాయి మార్కును నిలబెట్టుకుంటూ బిజీ అయిపోయింది.
*******
సాత్విక పరీక్ష ఫలితాలు వచ్చాయి. సాత్విక జిల్లా మొదటి రాంక్ సాధించింది. కలెక్టర్ గారితో సన్మానాలు, బహుమతులు, రాయితీతో సాత్విక పేరు స్థానిక పత్రికలలో పతాకశీర్షికగా నిలిచింది.
ఎన్నో కార్పొరేట్ కళాశాలలు తమ కాలేజిలో చదవమని ఇంటికి వచ్చి మరి కోరారు. వాటిని సున్నితంగా తిరస్కరించి సాత్విక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ తీసుకుంది. ఆమె ఏ క్షణాన తమ కాలేజీకి కోచింగ్ కోసం వచ్చినా తాము స్వాగతిస్తామని వారు మాట ఇచ్చి వెళ్లారు.
ఆ పేపర్ కట్టింగ్స్ అన్ని ఒక అందమైన ఫైల్ గా చేసుకోవడం సాత్వికకి 6వ తరగతిలోనే నేర్పేసినందువల్ల తనకు తానే ఆ ఫైల్ ని మరింత అందంగా మలుచుకుంది.
వదినకు మాత్రం ఎప్పటికప్పుడు సాత్విక విషయాలు తెలియచేస్తుంటే ఆమెలో మాతృప్రేమ ఉప్పొంగుతోందని ఆమె నాకు పెట్టే సందేశాలవల్ల తెలుస్తోంది.
అన్నయ్య ఆనందానికి కూడా హద్దేలేదు.
"అమ్మా. నిన్ను ఒక్కసారి కూడా ప్రేమగా దగ్గరకు తీసుకోని ఈ దౌర్భాగ్యు తండ్రిని మన్నించమ్మా"అన్నాడట ఫోన్లో.
"అదేం మాట నాన్న. నేను బతికిఉన్నదే మీవల్ల. అమ్మ నన్ను వదిలేసినట్టు మీరు నన్ను ఏ అనాధాశ్రమంలోనో, ఏ పెంటకుప్పలోనో వదిలేసి ఉంటే ఎక్కడ ఉండేదాన్నో. మీ తరువాతే నాకు ఎవరైనా.మీ ఆశీర్వాదఫలమే ఈ విజయానికి కారణం.ఇంకోసారి అలా మాట్లాడకండి.మీరు పిన్ని జాగ్రత్త."అని ఫోన్ నాకిచ్చేస్తూ అంది సాత్విక...నాతో!
"నేను తప్పు మాట్లాడానా చిన్నాన్న?"
సమాధానంగా ఆమె తలను నా గుండెలకదుముకుని ప్రేమగా నిమురుతూ నోటమాట రాక ఉండిపోయాను.
అప్పటివరకు నా ఫోన్ లో దాచుకున్న వదిన డైరీ ఫోటోలను అన్నయ్యకు పంపుతూ
"ఇవి కేవలం నిజాలు తెలుసుకునేటందుకే అన్నయ్యా. అంతకు మించి ఆలోచిస్తే నామీద ఒట్టే."అని సందేశం పెట్టాను.
(మిగతా 31 వ భాగంలో)
