SATYA PAVAN GANDHAM

Abstract Drama Inspirational

4.0  

SATYA PAVAN GANDHAM

Abstract Drama Inspirational

" పట్టణంలో పెద్దాయన - 2 "

" పట్టణంలో పెద్దాయన - 2 "

4 mins
162



" పట్టణంలో పెద్దాయన ! - 1 "

కి కొనసాగింపు ...

" పట్టణంలో పెద్దాయన ! - 2 "


కాసేపటికి ఆ వెయిటర్ ...

"ఒక పెద్ద గిన్నె నిండా అన్నం,

మూడు రకాల కూరలు,

రెండు రకాల పచ్చళ్ళు,

ఒక గిన్నెలో వేపుడు,

మరొక గిన్నెలో సాంబార్,

ఇంకో గిన్నెలో పెరుగు,

కొన్ని వడియాలు తెచ్చి

ఆ పెద్దాయన ముందు పెట్టాడు.

అవన్నీ చూసిన ఆ పెద్దాయనకి వాటి మీద ఆకలి మక్కువ ఉన్నా ...

ఆత్మగౌరవం అడ్డు రావడంతో...

"నేను 20 రూపాయలకి సరిపడా అన్నం మాత్రమే తీసుకు రమ్మని చెప్పాను కదా బాబు !

మరి ..!" అంటూ ఆ పెద్దాయన ఆ భోజనం వంక, ఆ వెయిటర్ వంక ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంటే ...

ఆ యజమాని ఆ పెద్దాయన వెనుక నుండి...

" ఈ క్షణం నుండి మా హోటల్ లో ఒక ఆఫర్ పెట్టాం బాబాయ్ ...

నీ లాంటి కష్టాన్ని నమ్ముకున్న వృద్దులకు ఇక నుండి భోజనం ఖరీదు 20 రూపాయిలు మాత్రమే !

పైగా ఎంత రైస్ కావాలంటే అంత రైస్ ఇన్ని రకాల కూరలతో తినొచ్చు !" అంటూ అతనికి నచ్చ చెప్తాడు.

ఆ పెద్దాయన ...

కాదు కూడదు అని వారిస్తున్నా

ఆ యజమాని మాత్రం బలవంత పెడతాడు.

చివరికి ఆ పెద్దాయన ఇక ఆ యజమాని మాట కాదనలేక అతని మాటలకి సంతోష పడి చాలా సంతృప్తిగా ఆ భోజనాన్ని ఆరగిస్తాడు.

ఇక నేను మాత్రం ...

ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ సగం తిని,

ఆ సన్నివేశాన్ని తదేకంగా అలానే చూస్తూ వుండిపోయాను.

ఇక ఆ పెద్దాయన అలా భోజనం చేస్తుండగా...

ఆ హోటల్ యజమాని అతని పక్కనే కూర్చుని,

"బాబాయ్ ..!

మిమ్మల్ని చూస్తుంటే నాకు భిక్షాటన చేసే వారిలా కనిపించలేదు.

మీరు ఇందాక ఆ విషయం చెప్పకముందే నాకు అది అర్ధం అయ్యింది.

పైగా మెనూ కార్డ్ నీ తీక్షణంగా పరిశీలించిన మిమ్మల్ని చూస్తుంటే కొంచెం చదువుకున్న వారి లాగానే కనిపిస్తున్నారు.

కానీ, మీలాంటి వారి కి ఇలాంటి దుర్బర పరిస్థితి రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా ? " అంటూ అతన్ని అడిగాడు

అప్పుడు ఆ పెద్దాయన చిన్నగా నవ్వుతూ ....

" హుమ్...

నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం డబ్బు !

హా డబ్బే ...

ఆ డబ్బు మీద ఏర్పడిన ఆశ !

ఆ ఆశ సృష్టించిన పరిస్థితులు !! "

అంటూ తన గతాన్ని తలుచుకుంటూ సమాధానం ఇస్తాడు.

దానికి ఆ యజమాని ఏం అర్థం కాక,

ఆశ్చర్యంగా ఆ పెద్దాయన వైపు చూస్తాడు...

విషయం ఆ పెద్దాయనకి అర్ధమయ్యి...

" నా పేరు సత్యనారాయణ !

మాది ఈ సిటీ కి దగ్గరలోనే

ఒక చిన్న పల్లెటూరు.

నేను ఒక పెద్ద భూస్వామిని.

15 ఎకరాలు పొలం సాగు చేస్తూ..

ఇదిగో ఇప్పుడు నాకు దొరక్కుండా పోయిన ఈ అన్నాన్ని (ధాన్యం) పండించేవాడిని.

నా కష్టం చూసి ఊరిలో పెద్దరికం దానికదే వచ్చి పడింది.

ఆ పెద్దరికంతో ఇల్లంతా చుట్టూ పని వాల్లతో, ఇంటికి వచ్చే జనంతో నిత్యం చాలా సందడిగా ఉండేది.

నాకు భార్యా, ముగ్గురు కొడుకులు...

నాలాగా నా కొడుకులు వ్యవసాయం అంటూ కష్ట పడకూడదని, మంచి మంచి ఉన్నత చదువులు చదివించాను. అలా వాళ్ల గొప్ప గొప్ప చదువులు కోసం పట్నం పంపించాను.

ఒక్క ముక్కలో చెప్పాలంటే

వాళ్ల 16 ఏళ్ల చదువుల కోసం,

100 ఏళ్ల భవిష్యత్తు కోసం

నా 40 ఏళ్ల కష్టాన్ని ఖర్చు పెట్టాను.

ఇక వాళ్ళు కూడా వాళ్ల చదువులు పూర్తి చేసి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించారు.

ఆ ముగ్గురూ కూడా...

నా ముగ్గురు కొడుకులూ వాళ్ళు ఇష్ట పడినట్లే కులం, మతం లాంటివి పట్టించుకోకుండా వాళ్ళకి ప్రేమ పెళ్ళిళ్ళు చేశాను.

అది కూడా అవతలి వైపు నుండి ఏమి ఆశించకుండా ... "

అలా ఆ పెద్దాయన చెప్తుంటే,

అది వింటున్న నేను,

"అంతా బాగానే ఉంది కదా !

మరి ఇంకేంటి ఈయన సమస్య ?" అంటూ నా మనసులో అనుకుంటున్నాను నేను.

నేను మనసులో అనుకున్న ఆ మాటలు

ఆ యజమాని చెవిలో పడిందో ఏమో కానీ,

వెంటనే ఆ యజమాని ఆ పెద్దాయనతో...

" అంతా బాగానే ఉంది కదా బాబాయ్ !

మరి...?" అంటూ ఆ యజమాని మాట పూర్తయ్యే లోపు...

ఆ పెద్దాయన...

"ఇక్కడి వరకూ బాగానే ఉంది.

ఇక ముందే ఉంటుంది అసలు కథ !" అంటూ కొంచెం నిరాశగా తన తల దించి కథను కొనసాగిస్తున్నాడు ఆ పెద్దాయన.

మరొక పక్క నేను కూడా ఆసక్తి గానే వింటున్నా...

" అలా ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యి, పిల్లలు కూడా పుట్టారు.

అసలే ఈ పట్నంలో ఉంటున్న వాళ్ళు...

ఎప్పుడో ఒకసారి పండక్కి వచ్చి నన్నూ, నా భార్యని చూసి వెళ్తుండేవాళ్లు...

అలా వచ్చినప్పుడల్లా వాళ్ళు సంపాదించిన దాంట్లో పదో పరకో మా చేతుల్లో పెడుతుంటే నేను వద్దని వారించేవాడిని,

ఎంతైనా సొంతిల్లు వదిలేసి ఉద్యోగం కోసం ఎక్కడో పట్నంలో బ్రతుకుతున్న వాళ్ళు కదా ...

వాళ్ళు సంపాదించిన డబ్బుతో నాకంటే వాళ్ళకే చాలా అవసరం ఉంటుంది అనేది నా ఆలోచన.

పైగా ...

మాకు,

నాకున్న వ్యవసాయం మీద వచ్చే రాబడితో కాలం కదిలిపోతుంది కదా అన్న ధీమా !

నా జీవితంలో నా భార్యే నాకు పెద్ద ఆస్తి ...

అలా సాఫీగా సాగిపోతున్న నా జీవితాన్ని ఆ భగవంతుడు పరీక్షించాలనుకున్నాడో ఏమో కానీ,

నాకున్న ఆ ఆస్తిని (భార్యని) ఒక్కసారిగా నాకు దూరం చేసి, నాకు తీరని ద్రోహం చేశారు.

అనుకోకుండా వచ్చిన గుండె నొప్పితో నా భార్య కాలం చేసింది.

అక్కడ నుండే నా జీవిత చక్రం మరో మలుపు తిరిగింది.

అలా భార్య దూరమై ఒంటరి వాడైనా నన్ను,

" ఒంటరిగా ఇక్కడే ఈ పల్లెటూరిలో ఎలా ఉంటారు ?

మాతో పాటు పట్నం వచ్చేయండి

అక్కడే అందరం కలిసి ఉందాం !" అంటూ నా కొడుకులు కోడళ్ళు బలవంత పెట్టారు.

కానీ, నేనేమో పట్నపు వాతావరణంలో అంటే పెద్దగా ఇమడలేను. అందుకని వాళ్ల మాటకి అడ్డుతగిలాను.

"ఒంటరిగా ఇక్కడ ఉండడం కంటే, అక్కడే అయిన వాళ్ళతో ఉండడమే మంచిది ! " అంటూ

చుట్టు పక్కల వాళ్ళు, నా స్నేహితులు కూడా నన్ను సముదాయించడంతో వాళ్ళతో కలిసి పట్నం రాక తప్పలేదు.

ఇక్కడికి వచ్చాకే తెలిసింది అందరూ (ముగ్గురు కొడుకులు) ఒకేచోట ఉంటున్నారని అనుకున్న నాకు అది తప్పని, వాళ్ళందరూ వేరు వేరు చోట్ల, విడివిడిగా ఉంటున్నారని...

పట్నం వచ్చిన కొన్ని రోజులకి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాను.

కానీ, తర్వాత వాళ్ళలో ఉన్న దుర్బుద్ధి ఒక్కోటిగా బయటపడసాగాయి.

అప్పుడే అనిపించింది వాళ్ళకి నేను భారంగా మారుతున్నానని

అలా ఒకరోజు నా పెద్ద కొడుకు ఇంట్లో నేను ఉండగా..

నా మిగిలిన కొడుకులు వాళ్ల భార్యలతో వచ్చి..

నాతో ఒక విషయం చర్చించాలని కోరారు.

తన కొడుకులు , కోడళ్ళు ఆ పెద్దాయనతో ఏ విషయం చర్చించారో తర్వాతి భాగం " పట్టణంలో పెద్దాయన ! - 3 " లో తెలుసుకుందాం.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్



Rate this content
Log in

Similar telugu story from Abstract