SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4.5  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

పట్టణంలో పెద్దాయన 3

పట్టణంలో పెద్దాయన 3

5 mins
254


" పట్టణంలో పెద్దాయన ! - 2 " కి

కొనసాగింపు...

" పట్టణంలో పెద్దాయన ! - 3 "

ఆ చర్చించాల్సిన విషయమేంటని ఆశ్చర్యంతో నేను వాళ్ళని అడగ్గా...

దానికి సమాధానంగా ,

నా పెద్ద కొడుకు...

" అదేం లేదు నాన్న ... !

ఇక్కడ అద్దె ఇళ్లలో ఉండడం మా ముగ్గురికి చాలా కష్టంగా ఉంటుంది.

నువ్వే చూస్తున్నావ్ గా ఎవరికి వాళ్ళం ఇక్కడ ఇంటి ఓనర్స్ తో ప్రతి చిన్న విషయానికి మాట పడాల్సి వస్తుంది.

అందుకని,

అందుకని... "

అంటూ వాడు మిగిలినది పూర్తి చేయడానికి సంకొచిస్తుంటే,

"హా...

అందుకని

చెప్పరా !

అలా ఆగిపోయి సంకొచిస్తావే ?" అంటూ నేను కాస్త రెట్టించి అడిగాను.

"అదే నాన్న...

మా ముగ్గురకి కూడా ఎవరిది వాళ్ళకి సొంతిల్లు ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన లో ఉన్నాం.

అదే ఈ సిటీలో ..." అంటూ నా రెండో కొడుకు దాన్ని పూర్తి చేశాడు.

" ఇప్పటికిప్పుడు ఈ సిటీ లో ఇల్లు కొనాలంటే ? " అంటూ నేను సందేహంగా అడగ్గా,

"అదే నాన్నా .. " అంటూ పెద్ద కొడుకు మళ్ళీ ఏదో నాన్చుతుండగా...

"మీరు ఉండండి ,

మీరు ఏది నేరుగా చెప్పలేరు !

ప్రతీ దానికీ నాన్చుతూ ఉంటారు" అంటూ ఈసారి నా పెద్ద కోడలు,

అదే వాడి భార్య అంది పుచ్చుకుని,

"అదే మావయ్య గారు ...

ఎలాగో మీరు కూడా మాతో పాటే ఇక్కడే ఉంటున్నారు.

ఊళ్ళో ఉన్న

పొలాలు...

ఇల్లు...

స్థలాలు చూసుకోవడానికి కూడా మనకి అక్కడ ఎవరూ లేరు.

అందుకని,

అందుకని " అని ఈసారి ఆమె కూడా విషయం పూర్తి చేయకుండా నాన్చగా

"పర్లేదు విషయం ఏంటో నేరుగా చెప్పమ్మా !" అంటూ ఆమెకు కొంచెం ధైర్యం ఇచ్చాను.

" అదే మావయ్య గారు...

మీ పేరిట ఉన్న ఆ ఆస్తులు అమ్మేసి ...

వచ్చిన డబ్బుతో ఇక్కడే తలొక ఇల్లు కొనుక్కుని అందరం సంతోషంగా ఉండొచ్చు కదా ! " అని నా పెద్ద కోడలు తన ఉద్దేశ్యాన్ని చెప్పగా...

నేను తల పైకెత్తి కొంచెం కోపంగా ఆమె వైపు చూసాను.

దానికి ఆమె భయపడుతూ, మరింత కంగారు పడుతూ

"అబ్బెబ్బే...

ఇది నా ఒక్కదాన్ని ఉద్దేశ్యం మాత్రమే కాదు మావయ్య గారు.

మేమందరం కూడా అదే అనుకుంటున్నాం !" అంటూ నా పెద్ద కోడలు మిగిలిన కొడుకులు కోడళ్ళు వైపు చూస్తూ వాళ్ళందరి మనసులో నలుగుతున్న మాటను నాతో ముక్కు సూటిగా చెప్పేసింది. వాళ్ల ముఖ కవళికలు కూడా ఆమె మాటతో ఏకీభవిస్తున్నట్టే ఉన్నట్టు అనిపించాయి.

" వాళ్ల ఆ ఆశకి ఒకసారిగా ఖంగుతిన్న నేను ,

తరతరాల నుండి సంక్రమిస్తున్న ఆస్తిని అమ్మదలచి వస్తుందనే రోజు వస్తుందని గ్రహించలేని ఆవేదనతో కాసేపు ఏం మాట్లాడలేకపోయాను.

పక్కనే గ్లాసులో ఉన్న మంచి నీళ్ళు తాగుతుంటే, వాళ్ల అడిగిన దానికి ఆ మంచినీళ్ళ చుక్క కూడా గొంతు దిగడం భారంగా మారింది !

కాసేపటికి తేరుకున్న నేను...

"ఆ ఇల్లు, ఆ పొలం, స్థలాలు...

మాకు తరతరాలుగా మా పూర్వీకుల నుండి వస్తున్న ఆస్తి...

ఇప్పటికిప్పుడు వాటిని అమ్మడం అంటే ?" అంటూ నాలో నేను మధనపడుతూనే వాళ్ళకి బదులు ఇవ్వగా,

ఇంతలో నా మూడో కోడలు...

"తరతరాలుగా సంక్రమిస్తున్న ఆస్తే మావయ్య గారు !

అదేమైనా మీరు పరాయి వాళ్ళకి ఇస్తున్నారా ఏంటి ?

మీ కొడుకులకే కదా !

వాళ్ళు కూడా మీ వారసులే కదా !

మీరు ఇంతా కష్టపడి సంపాదించింది వాళ్ల భవిష్యత్తు కే కదా !పైగా,

మీ తదనంతరం ఆ అస్తి మీద మీ ముగ్గురు కొడుకులకే కదా దాని మీద హక్కుండేది !

ఆ ఆస్తేదో ఇప్పుడే పంచేస్తే అసలు ఏ గొడవ ఉండదు కదా ! " అంటూ తను ఇంకొక్క అడుగు ముందుకేసి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా అడిగేసింది.

మిగిలిన నా కొడుకులు, కోడళ్ళు కూడా ఆ చిన్న కోడలకి వత్తాసు పలుకుతూ నన్ను బలవంతం పెట్టారు ఆ అస్తి పంపకాలకి.

బ్రతికుండగానే నన్ను చంపేసినట్టయ్యింది వాళ్ల చర్చలతో...

కొంతసేపు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత

"ఎంతైనా వారసులే కదా.

సిటీలో ఇల్లు అంటే మంచి భవిష్యత్తు ఉంటుందేమో అన్న ఉద్దేశ్యంతో వాళ్ల మాటల్లో కూడా నిజం ఉందనిపించింది.

చేసేదేం లేక, ఆస్తి పంపకాలకు సరే అన్నాను.

అలా ముగ్గురికి సరి సమానంగా ఆస్తి పంపకాలు చేసేసాను.

నా దగ్గర ఒక్క చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా....

అలా నా నుండి వాళ్ళకి సంక్రమించిన ఆస్తితో

ముగ్గురూ ఒక్కొక్కరూ తమకి నచ్చినట్టుగా ఒక్కోచోట ఒక్కో ప్లాట్ కొనుక్కున్నారు.

ఆస్తులు మాత్రమే కాదు

చివరికి వాళ్ళు నన్ను కూడా పంచుకున్నారు.

నాలుగు నెలలకి ఒక్కొక్కరింటికి చొప్పున...

కొన్ని రోజులకు నా కొడుకులకు నా మీద ప్రేమ, నా కోడళ్లకి నా మీద గౌరవం పూర్తిగా తగ్గిపోయాయి.

ఎంతైనా వాళ్ళకి కావల్సింది వాళ్ళకి దక్కింది కదా !

ఇక రేపో మాపో పోయేటోడిని, నాతో ఏం అవసరం ఉంటుంది ?

వాళ్ల ఇండ్లలో పెంపుడు కుక్కలకు ఇచ్చే గౌరవం, వాటికి పడేసే ముద్ద కూడా నాకు ఒక్కోసారి దక్కేది కాదు.

కోడళ్ళు , కొడుకులు పెద్దగా పట్టించుకోక పోయినా మనమలు, మనుమరాలు మాత్రం నాతో చాలా ఆప్యాయంగానే ఉండేవాళ్ళు...

కానీ, అది కూడా నా కొడళ్లకి నచ్చేది కాదు ఎందుకో మరి !

నాతో కబుర్లు చెప్తూ , ఆడుకునే వాళ్ళని నాకు దూరంగా తీసుకుని వెళ్ళిపోయేవారు.

నన్ను మరింతగా చీదరించుకుంటూ...

అయినా రేపో మాపో పోయేటోడిని, అయిన వాళ్ళే కదా అని ఆత్మాభిమానం చంపుకుని సర్దుకుపోయేవాడిని

అలా ఒక సంవత్సరం గడిచింది.

ఒక్కొక్కరూ ఈ మనిషిని నాలుగేసి నెలలు భారంగానే భరించారు.

అలా తిరిగి మళ్ళీ నా పెద్ద కొడుకు ఇంటికి చేరుకుని, వాడి ఇంట్లో ఉండగా ...

నా పెద్ద కోడలు వాళ్ల పుట్టింటి వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉండడం నా చెవిన పడింది.

"ఈ ముసలాడితో వేగలేక చస్తున్నానే అమ్మా !

సిటీలో ఉన్నాం అన్న మాటే కానీ,

అసలు మొగుడు పిల్లలతో కలిసి ఒక సరదా లేదు, సంతోషం లేదు. ఇతను ఇక్కడున్న ప్రతీ సారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు ఉంటుంది.

అయినా ...

ఇంత వయసు వచ్చింది.

" భార్య పిల్లలతో కలిసి కాపురం చేసుకుంటున్న వీళ్లతో ఉంటే, వీళ్ళ సంతోషానికి ఏమైనా అడ్డు పడతానేమో ?" అన్న కనీస ఆలోచన, ఇంగిత జ్ఞానం వుండక్కర్లేదు ఈ పెద్ద మనిషికి ?

తుమ్మితే పోయే ప్రాణమే కదా !

ఏ వృద్దా శ్రమంలోనే తల దాచుకొవచ్చు కదా మమ్మల్ని ఇలా ఏడిపించకపోతే

ఛీ..

ఛీ..." అంటూ నా వల్ల ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులను హాల్లో కూర్చున్న నాకు కూడా వినిపించేటంతగా బిగ్గరగా అరిచి వాళ్ల అన్నకి ఫోన్లో చెప్తుంది.

అది విన్నందుకు ఒక బాధ అయితే,

అక్కడే ఆమె పక్కనే ఉన్న నా పెద్ద కొడుకు

ఆమె మాటలకు అడ్డు చెప్పకపోవడం ఆ బాధని మరి కాస్త పెంచేసి రెట్టింపు చేసింది.

అది విన్న నా మనుమలు కూడా జాలిగా నా వైపు చూస్తుంటే, వాళ్ల ముందు చిన్న బుచ్చు కావాల్సి వచ్చింది..

ఇక అక్కడ ఉండాలనిపించలేదు.

వెంటనే పెట్టే బేడా సర్దుకుని రెండో కొడుకు ఇంటికి ప్రయాణం అయ్యాను.

వెళ్ళేటప్పుడు నా పెద్ద కొడుక్కి చెప్తే,

"అదేంటి నాన్న ...!

ఇంత సడెన్ గా వెళ్లిపోవాల్సిన అవసరం ఏముంది ?"

అన్న మాట వాడి నోటి నుండి రాలేదు సరికదా...

పైగా నేను చెప్తుంది విన్న నా పెద్ద కోడలు...

"ఉన్నట్టుండి రెండో కొడుకు మీద ప్రేమ పొంగుకొచ్చినట్టు ఉంది ఈయన గారికి !" అంటూ నన్ను దెప్పి పొడిచింది.

అయినా నా పెద్ద కొడుకు భర్త మారు మాట్లాడలేదు.

ఆ క్షణం నాకు అర్థమైంది ఏంటంటే,

"అప్పటికే నా కొడుక్కి నాపై లేనిపోనివి చెప్పి ,

వాడి మనసు విరిచేసి, నా నుండి దూరం చేసి, తన చెప్పు చేతల్లో పెట్టుకుందని"

ఒకపక్క నేనంటే ఆప్యాయంగా ఉండే నా మనవడు, మనవరాలు (పెద్ద కొడుకు కొడుకు, కూతురు) నన్ను వెళ్ళొద్దంటూ అడ్డు తగులుతుంటే,

వాళ్ల మీద కళ్ళెర్రజేస్తూ ...

ఒక్క చూపుతో వాళ్ళని భయపెట్టేసింది నా పెద్ద కోడలు.

అదంతా గమనిస్తున్న నేను మాత్రం

అలానే గుండెంతా నిండిన దుఃఖంతో

బయట పడని కన్నీటితో అక్కడ నుండి బయటకి వచ్చేసాను.

అనుకున్నట్టుగానే ఆ పెద్దాయన తన రెండో కొడుకు ఇంటికి వెళ్ళాడా?

లేదా ?

తర్వాతి భాగం " పట్టణంలో పెద్దాయన ! - 4 " లో తెలుసుకుందాం.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్



Rate this content
Log in

Similar telugu story from Abstract