SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"పట్నంలో పెద్దాయన ! - 5 "

"పట్నంలో పెద్దాయన ! - 5 "

5 mins
24


" పట్టణంలో పెద్దాయన ! - 4 " కి

కొనసాగింపు...

" పట్టణంలో పెద్దాయన ! - 5 "


ఇక మూడో కోడలు వీళ్ళ కన్నా ఇంకొంచెం కరుకు...

ఇలాంటి సంఘటన అక్కడ కూడా జరిగితే,

ఇక నేను చచ్చిన శవంతో సమానం అని భావించి, అలా రోడ్డు మీదే తిరుగుతూ ఉన్న నన్ను నా మూడో కొడుకు చూసాడు.

"ఏం జరిగిందని !" నన్ను వాడు అడగ్గా ...

జరిగిన విషయాలు దాచి ఉపయోగం లేదని భావించి జరిగిందంతా వాడికి చెప్పాను.

వాడు అర్థం చేసుకుని నన్ను వాడి ఇంటికి తీసుకెళ్లాడు.

వద్దని ఎంత వారించినా సరే వినకుండా !

అలా మూడోవాడి ఇంటికి కూడా వెళ్ళిన నాకు ...

అక్కడ చిన్న కోడలి దగ్గర నుండి కూడా సరైన స్వాగతం లభించలేదు.

" రండి నాన్న ... !" అంటూ చిన్నోడు ఇంట్లోకి స్వాగతం పలికాడే కానీ,

వాడి భార్య మాత్రం అసలేం పట్టనట్టు అలానే హాల్లో టీవీ చూస్తూ తన లోకంలో తను ఉంది.

"సంధ్యా ..!

నాన్న వచ్చారు.

వెళ్లి కొంచెం మజ్జిగ తీసుకురా !" అంటూ వాడు వాడి భార్యను ఆర్డర్ వేయగా

" ఇందాకే భోజనం చేసినప్పుడు మొత్తం వేసుకుని తినేసా !

ఇంట్లో మజ్జిగ లేదు." అంటూ తను కూడా కరుగ్గానే సమాధానం ఇచ్చింది.

వాడు నేరుగా వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళి

" ఏంటిది సంధ్య !

ఇంటికి నాన్న వచ్చారు.

నువ్వు ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నావ్ !

సమాధానం కూడా చాలా పొగరుగా చెప్తున్నావ్...!

అసలే, నాన్న ఎండన పడి వచ్చారు.

నువ్విలా ఉంటే ఆయన ఎంత బాధ పడతారో తెలుసా !

నీ పద్దతి నాకేం నచ్చలేదు."

అంటూ చిన్నోడు ఆమె ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆమె పై కొప్పడుతున్న దృశ్యం నాకు కనిపించకపోయినా...

నాకు వినపడ కూడదు అన్నట్టు ఆమెను తిడుతున్న తిట్లు మాత్రం సన్నగా నా చెవులను చేరుతూనే ఉన్నాయి.

"నా బిహేవియర్ ఏం బాలేదు నీకు...

ఇందుకేనా నన్ను లవ్ మారేజ్ చేసుకున్నావ్ !

ఇలా నన్ను అనరాని మాటలు అనడానికేనా నా వెంట తిరిగావ్ !

నిన్నటి వరకూ ఏమన్నా సరే,

నా కొంగు పట్టుకుని తిరిగావ్ కదా...!

ఇప్పుడేమో మీ నాన్న రాగానే నీకు నా బిహేవియర్ నచ్చకుండా పోయిందా !

ఛీ..! ఛీ...!

నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ !

ఆ రోజు ప్రపోజ్ చేసినప్పుడే నో చెప్పేసి ఉంటే

నా లైఫ్ వేరేలా ఉండేది."

అంటూ వాడితో గొడవకి దిగింది.

వాళ్ల మధ్యలోకి వెళ్దాం అనుకున్నా కానీ,

ఇంతకు ముందు రెండో వాడి ఇంట్లో జరిగిన సంఘటన గుర్తొచ్చి ఆగిపోయాను.

వాడు మాత్రం...

"మెల్లగా

మెల్లగా

నాన్న వింటారు ! "

అంటూ ఆమెను సముదాయిస్తున్నాడు.

"హా...

వింటే వినని

ఎవరికి ఎక్కువ ! " అంటూ ఆమె వాడి మాటలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు.

"ఇప్పుడు నేనేం అన్నానని ఇంత రాద్దాంతం చేస్తున్నావ్ సంధ్య !" అంటూ వాడు ఒక పక్క

"నాది రాద్దాంతమా !

నాది రాద్దాంతమా !!" అంటూ వాడి మీద గట్టిగా అరుస్తూ ఆమె మరొక పక్క.

" అది కాదు సంధ్య..!

నాన్నని...

అన్నయ్య వదిన వాళ్ళు నానా మాటలు అనడంతో ఆయన అక్కడి నుండి బయటకి వచ్చేసి రోడ్డు మీద తిరుగుతుంటే,

నేనే ఇక్కడికి తీసుకొచ్చాను.

అప్పటికి ఆయన రాను అంటున్నా కూడా వినకుండా బలవంతంగా నేనే తీసుకొచ్చాను..." అంటూ వాడు జరిగింది చెప్తుంటే

"ఓహో...

ఇంత జరిగిందా !

మీ అన్నయ్య , వదిన వాళ్ళు ఈయన గారిని భరించలేక ఇంటి నుండి గెంటేస్తే మీరు నెత్తిన ఎక్కించుకున్నారు అన్న మాట !

బాగుంది , చాలా బాగుంది !!" అంటూ వాడితో వాదిస్తుంది వాడి భార్య.

"అది కాదు సంధ్య,

కొంచెం అర్థం చేసుకో..!" అంటూ వీడు ఆమెను కన్విన్స్ చేయబోతుంటే

"ఏంటి అర్థం చేసుకునేది,

మీకు ఇది వరకే చెప్పాను...

నా మీద ఆయన చూపు అదోలా ఉంటుందని,

అసలే మీ అమ్మ గారు పోయి ఒంటరిగా ఉంటున్నారు ఆయన,

మీరు లేనప్పుడు నన్నేమైన చేస్తే ఎవరిది బాధ్యత ! " అంటూ ఆమె నా గుణం గురించి మరింత నీచంగా మాట్లాడుతుంటే,

అంత నీచంగా మాట్లాడుతున్న ఆమెను అడ్డుకోవాల్సింది పోయి, బ్రతిమాలుతున్న నా కొడుకుని చూసి వాడి పై జాలేసింది. ఆమెపై కోపం వచ్చింది. అంతకు మించి నా పై నాకే అసహ్యం వేసింది.

ఈ వయసులో నేను అలా చేస్తానా ?

పైగా కూతురు లాంటి అమ్మాయి...

కొడుకు భార్యతో...

ఛీ... ఛీ...

ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ?

ఆ క్షణమే నేను చచ్చిపోయాను. కేవలం దేహం మాత్రమే సిగ్గులేకుండా ఈ భూమ్మీద భారంగా మిగిలిపోయింది.

నాలో అక్కడ రకరకాలుగా ఏర్పడుతున్న ఆ జాలికి, కోపానికి, ద్వేషానికి మధ్య నలుగుతూ ఇమడలేక ఇక అక్కడ నుండి

ఆ క్షణమే బయటకి వచ్చేశాను...

నేనలా బయటకి వచ్చేస్తుంటే,

" నాన్న...

నాన్న ..." అంటూ నా కొడుకు తన గుమ్మం దగ్గర నుండే పిలిచాడు తప్ప,

గుమ్మం దాటి బయటకు వచ్చి, నా వెనుక పడలేకపోయాడు.

ఇక అలా బయటకి వచ్చేసి నేను

సొంత ఊరికి వెళ్దాం అనుకున్నా...

కానీ, అక్కడ కూడా నాకు ఏ ఆసరా లేదు.

స్నేహితులు ఆలనా పాలనా చూస్తాం అంటారు.

కానీ, వాళ్ళకి ఇలాగే కొడుకులు కోడళ్ళు ఉంటారు గా...

నా సొంత వాళ్ళే పరాయి వాళ్ళు అయిపోయారు. ఇక పరాయి వాళ్ళు సొంత వాడిలా ఎలా చూస్తారు.

పైగా నేను అక్కడికి వెళ్తే

నన్ను కొడుకులు, కోడళ్ళు సరిగ్గా చూడడం లేదు కాబట్టే నేను పట్నం నుండి సొంతూరికి తిరిగి వచ్చేసాను అని నలుగురు నానా రకాలుగా అనుకుంటారు.

అసలే పెళ్ళాం బిడ్డలతో బ్రతుకుతున్న వాళ్ళకి ఎందుకు ఈ చెడ్డ పేరు అని ఆ ప్రయత్నం కూడా విరమించుకున్నాను..

అయినా ఒకప్పుడు అక్కడ పెద్దరికం చేసినవాడిని కదా..

ఇప్పుడు అక్కడ పేదరికంలో బ్రతకలేక ఇక్కడే ఉండిపోయాను.

*******


పెద్దోడు కి చేసిన అమ్మాయిది చాలా పేదరికం.

ప్రేమించాడు కదా అని రూపాయి కూడా కట్నం తీసుకోకుండా ఆ అమ్మాయిని మా వాడికి ఇచ్చి పెళ్లి చేశాను.

ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసాకా వాళ్ళు ధనవంతులు అయిపోయారు. నేను పేదవాడిని అయిపోయాను. అందుకే నన్ను భరించలేక, నాకు తిండి పెట్టలేక నన్ను ఇంట్లో నుండి గెంటేశారు వాళ్ళు.

రెండో వాడికి పెళ్ళైన తర్వాత ...

అమ్మాయి తండ్రికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేస్తే,

ఆతనికి కొడుకులు లేరని, హాస్పిటల్ ఖర్చుకు వెనకాడకుండా అన్నీ నేనే భరించాను.

ఆమెకు ఏ మాత్రం విశ్వాసం లేకుండా నన్ను ఒక దొంగగా నన్ను నిలబెట్టేసింది.

ఇక మూడో వాడిది కులాంతర వివాహం...

అమ్మాయి తరుపు వాళ్ళు ఇంట్లో వాళ్ల పెళ్లికి ఒప్పుకోకపోతే,

మా వాడు, ఆ అమ్మాయి ఇద్దరి బాధ చూస్తూ ఊరుకోలేక

నేను మా ఆవిడ

అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి, వాళ్ళ తల్లిదండ్రులని బ్రతిమాలి

పెళ్లికి ఒప్పించాం !

ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆమె నాపైన నీచమైన అభాండాలు మోసింది. నన్నొక స్త్రీ లోలుడుగా చిత్రీకరించింది.

అయినా కోడళ్లను అని ఏం లాభం...

నా కొడుకులది పాత్ర ఉంది.

చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి, మరెంత గారాబం చేసి వాళ్ళని పెంచానో...

వాళ్ల భవిష్యత్ కోసం మరెంత తపించానో...

అన్ని తెలిసి ఉండి, వాళ్ల భార్యలు అంతలా దూషిస్తూ ఉంటే వాళ్ల మాటలకి అడ్డు తగలకపోకపోయే సరికి

తప్పు నాదే అన్నట్టు వాళ్ళు కూడా ఒప్పుకున్నట్లు ఉంది.

అక్కడే జీవశ్చంలా మిగిలిపోయాను.

కట్టుకున్న భార్య తోడు కోల్పోయిన నేను

పెద్ద కొడుకుకి భారం అయిపోయాను

రెండో కొడుకు ఇంట్లో దొంగనయ్యాను

మూడో కొడుకు ఇంట్లో దుర్మార్గుడినయ్యాను.

*********

ముగింపు :

ఒక్కప్పుడు ఊరికి పెద్దరికం చేసినొడినే, ఇప్పుడు ఇక్కడ పేదొడిగా మిగిలిపోయాను.

రైతుగా పది మందికి అన్నం పెట్టినోడినే, ఆకలికి బానిసనై ఒక్క మెతుకు కోసం భిక్షగాడిని అయ్యాను.

ఇదంతా కేవలం డబ్బు ఆడించే ఒక నాటకం

రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే

"అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను.

తండ్రీకొడుకులను విడదీస్తాను.

స్నేహితుల మధ్య చిచ్చు పెడతాను." అని అంది అంట

అలా సంపాదన అనే పద్మవ్యూహంలో చిక్కుకున్న మనిషి ఎప్పుడో పైసాకి బానిస అయిపోయాడు. బంధాలను, బంధుత్వాలను కాలరాసేసాడు.

డబ్బును ప్రేమించడం మొదలు పెట్టిన మనిషి, మనుషులను ద్వేషించడం మొదలు పెట్టాడు.

కన్న బిడ్డలు పట్టించుకోని నాలాంటి వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ, అలా చేస్తే...

హమ్...

కొన్ని రోజులకు కేవలం ఈ దేశంలో వృద్ధాశ్రమాలు మాత్రమే ఉంటాయి.

నా కొడుకులు నన్ను వదిలేసినట్లు,

దగ్గర నుండి ఇది చూసిన వారి కొడుకులు రేపు వాళ్ళకి ఇలాంటి దుస్థితి కలిగించరు అని నమ్మకం ఏంటి ?

దీనికి ఒక్కటే పరిష్కారం ...

పిల్లలకి చదువుతో పాటు, కొంచెం సంస్కారం కూడా చిన్నపాటి నుండి అలవాటు చెయ్యాలి. ఉద్యోగం పేరుతో ఎంత దూరం వెళ్ళినా... తల్లిదండ్రులతో కొంచెం సమయం గడపడానికి వారి సమయాన్ని కేటాయించాలి. ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం తాపత్రయ పడేవాల్లు... రేపు అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక చేతికి అందకుండా పోతే తమ భవిష్యత్తు ఏంటని ఆలోచన చెయ్యాలి."

అంటూ ఆ పెద్దాయన తన కథను ముగించాడు.

ఆ కథ విన్న...

ఆ హోటల్ యజమానికి, ఆ పనివారికి, నాకు కళ్ళు చెమ్మగిల్లాయి.

ఇక ఆ పెద్దాయన కథ ముగించి తన దగ్గరున్న డబ్బులు ఆ హోటల్ యజమాని చేతిలో పెట్టీ వెళ్లిపోతుంటే...

ఆ పెద్దాయన్ని ఆపిన ఆ హోటల్ యజమాని

ఆయనకేం అభ్యంతరం లేకపోతే తనకి వద్దే క్యాషియర్ గా పనిచేయాలని కోరాడు. అందుకు తగిన జీతం, తన కనీస అవసరాలు తానే చూసుకుంటానని అతడు మాటిచ్చాడు.

దానికి ఆ పెద్దాయన కూడా సుముఖత వ్యక్తం చేశాడు.

ఇంతటితో పట్నంలో పెద్దాయన అనే ఈ కథ సమాప్తం.

గమనిక : కథ వరకే ఆ పెద్దాయనిది. చివర్లో ముగింపు మాటలు మాత్రం నా కల్పితం. దయచేసి అర్థం చేసుకోగలరు.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️Rate this content
Log in

Similar telugu story from Abstract