SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

" పట్టణంలో పెద్దాయన - 1 "

" పట్టణంలో పెద్దాయన - 1 "

4 mins
230ఆ రోజు మధ్యాహ్నం కావొస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్లిన నాకు బాగా ఆకలిగా అనిపించి, చుట్టూ ఏదైనా ఓ పెద్ద రెస్టారంట్ ఏమైనా ఉంటుందేమొనని చాలా సేపు వెతికాను.

అసలే బయట హోటల్స్ లలో చికెన్ బిర్యానీ తప్ప మామూలు భోజనం రుచించదు మనకి.

ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్టు మాట.

అలా ఎంతసేపు వెతికినా చిన్న చిన్న భోజన హోటల్స్ తప్ప, పెద్ద హోటల్స్ ఏం కనిపించడం లేదు నాకు. అందులో మామూలు భోజనం తప్ప, బిర్యానీ ఉండదేమోనన్న సందేహం !

అలా తిరిగి తిరిగి అలసిపోయి నేను, ఆకలికి తట్టుకోలేక చివరికి ఓ చిన్న భోజన హోటల్ కి తప్పక వెళ్ళాను.

వెళ్లాల్సి వచ్చింది !

ఇక ఆకలి పెట్టే టార్చర్ భరించలేక, అక్కడే ఒక టేబుల్ పై కూర్చుని వెయిటర్ ఇచ్చిన మెనూ చూస్తుంటే, అందులో నాకిష్టమైన చికెన్ బిర్యానీ ఐటెం కనిపించగానే ఇంకో ఐటెం వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెంటనే అది ఆర్డర్ ఇచ్చేశాను.

కొద్ది సేపటికి నా ఆర్డర్ రావడంతో ...

తీరిగ్గా దాన్ని ఆస్వాదిస్తూ తినడం మొదలు పెట్టాను.

అలా అది సగం పూర్తయ్యేసరికి,

నా పక్కనే మరో టేబుల్ లో

దాదాపు ఒక అరవై ఏళ్ళు పై బడిన ఒక పెద్దాయన వచ్చి కూర్చున్నాడు.

మాసిన గడ్డం, చెదిరిన జుట్టూ, చిరిగి, నలిగిన బట్టలు, బక్క పలచని శరీరంతో చాలా మురికిగా ఉన్న అతన్ని చూస్తుంటే బిక్షాటన చేసే వాడిలా ఉన్నాడు.

ఆ పెద్దాయన అలా వచ్చి కూర్చున్నాడో లేదో ....

వెయిటర్ చాలా వేగంగా వచ్చి,

" హేయ్ ..!

ఎవరు నువ్వు !!

ఇక్కడికొచ్చి కూర్చున్నావేంటి ?

పో..!

బయటకి పో ..!! " అంటూ తన చూపుడు వేలితో ఆ పెద్దాయనికి బయటకి దారి చూపుతూ

" ఈ అడుక్కునే వాళ్ళకి పనీ పాటా లేకుండా పోయింది

నేరుగా లోపలికి వచ్చేసి ఇక్కడే కూర్చుని తింటున్నారు.

మా హోటల్ కి వచ్చే కస్టమర్స్ ఏమనుకుంటారు (నన్ను చూస్తూ )" అంటూ ఆ పెద్దాయన్ని ఒకటే తిడుతూ గట్టిగా, మరింత బిగ్గరగా అతనిపై అరుస్తున్నాడు.

ఒక పక్క ఆ పెద్దాయన మాత్రం

" బాబు...

బాబు... " అంటూ అతన్ని ప్రాధేయపడుతూ బ్రతిమాలుతున్నాడు.

అయినా సరే ఆ వెయిటర్ మాత్రం ఆ పెద్దాయన మీద తన అరుపులు ఆపడం లేదు. అతను చెప్పేది అసలు వినడం లేదు.

ఆ వెయిటర్ యొక్క అరుపుల ధాటికి

ఆ హోటల్ యజమాని, మరికొంత మంది సిబ్బంది అక్కడికి వచ్చారు.

యజమాని ఆ వెయిటర్ వైపు చూస్తూ...

"ఏమైంది రవి !

ఎందుకలా అరుస్తున్నావ్ ! "

అంటూ అతన్ని అడిగాడు

"చూడండి సార్ !

ఈ అడక్కు తినేవాళ్ళు ఎంత చెప్పినా వినకుండా డైరెక్ట్ గా లోపలికి వచ్చేసి అడుక్కుంటున్నారు !" అంటూ ఆ పెద్దాయన వైపు చూస్తూ, అతన్ని మరింత ఛీదరుంచుకుంటూ ఆ యజమానికి సమాధానం ఇచ్చాడు ఆ వెయిటర్ రవి.

"పోనీలే పాపం !

అసలే ఆకలి మీద ఉన్నట్టున్నాడు.

పైగా వయసు మళ్ళిన వాడు.

ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే వచ్చిన నష్టమేమిటి ?" అంటూ ఆ యజమాని మాత్రం పాపం అతనిపై చాలా జాలి చూపిస్తాడు.

అసలు ఏ మాత్రం కనికరం లేని ఆ వెయిటర్ మాత్రం !

" అదేంటి సార్...

అలా అంటారు !

అసలు మన కస్టమర్స్ ఏమనుకుంటారు !

ఇలాంటి వాళ్ళతో కూర్చుని భోజనం చేయడానికి ఎవరైనా ఇష్ట పడతారా !

మన హోటల్ లోకి రావడానికి ఇబ్బంది పడరా !" అంటూ చాలా దురుసుగా మాట్లాడతాడు.

(యజమాని మెప్పు పొందడానికేమో ?)

అప్పటివరకూ కొంచెం సహనంతో ఉన్న యజమానికి కూడా కోపం వచ్చి,

" హేయ్ రవి !

ఏంటా అహంకారం !

బుద్ధి లేదూ ...

వృద్దులంటే మర్యాద లేదూ...

ఒక పక్క నేను చెప్తున్నా కూడా చాలా దురుసుగా మాట్లాడుతున్నావు !

ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో !

కాసేపు నా కంటికి కనిపించకు ..."

అంటూ వెయిటర్ రవిని గట్టిగా గదుముతాడు ఆ యజమాని.

" అది కాదు సార్ ! "

అంటూ వెయిటర్ ఏదో చెప్తుంటే,

యజమాని మాత్రం

"ఇక్కడి నుండి పొమ్మన్నానా !

వెళ్తావా ! వెళ్ళవా !!" అంటూ మరొక్క సారి గట్టిగా గదుముతాడు.

దాంతో ఆ వెయిటర్ రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఇక ఆ యజమాని, ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లి,

" బాబాయ్ ...

మీకు ఏం కావాలి !"

అంటూ ఆ పెద్దాయన భుజంపై చెయ్యి వేసి చాలా ఆప్యాయంగా అడుగుతాడు ..

ఇక అప్పటివరకూ అతన్ని నానా మాటలు అన్న ఆ వెయిటర్ మాటలకో, లేక ఏ బంధుత్వం లేకపోయినా తన లాంటి వాడిని ఇలా ఆ హోటల్ యజమాని బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచినందుకో మరి !

ఆ పెద్దాయన కంట్లో నుండి ఒక్కొక్కటిగా కన్నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతున్నాయి.

అతని బాధ అర్థం చేసుకున్న యజమాని ...

ఆ పెద్దాయన భుజం మీద వేసిన చేతితో తడుతూ...

" క్షమించండి బాబాయ్...

కుర్రోడు ...

కొంచెం తొందర ఎక్కువ !

ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడేసాడు.

ఆకలితో ఉన్న వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదనేంత పరిపక్వత కానీ, పరిజ్ఞానం కానీ అతనికి లేదు.

అతని మాటలు మీరేం పట్టించుకోకండి .

మీకు ఏది కావాలంటే అది తినండి !" అని బరోసా ఇస్తాడు.

దానికి ఆ పెద్దాయన తన కళ్ళు తుడుచుకుంటూ...

"ఇక్కడ భోజనం ఖరీదు ఎంత ?" అని ఆ యజమానిని అడుగుతాడు..

దానికి ఆ యజమాని

"అవన్నీ తర్వాత చూసుకుందాం లే బాబాయ్ !

ముందు మీకేం కావాలో తినండి !" అంటూ ఆ పక్కనే ఉన్న వెయిటర్ ని పిలుస్తాడు.

ఇంతలో ఆ పెద్దాయన, ఆ టేబుల్ మీద ఉన్న మెనూ కార్డ్ తీసుకుని ప్రతీ ఐటెం యొక్క రేట్స్ చూస్తూ ఉంటాడు.

దాన్ని ఆ యజమాని కూడా గమనిస్తాడు.

అలా కొన్ని క్షణాల తర్వాత ఆ పెద్దాయన...

తన జేబులో నుండి 20 రూపాయిల నోటు ని తీసి,

దాన్ని అక్కడున్న ఆ యజమాని చేతిలో పెడుతూ ...

" ఇక్కడ భోజనం ఖరీదు 70 రూపాయిలు అని ఉంది.

నా దగ్గర ఈ 20 రూపాయిలు తప్ప ఇంకేం లేవు.

ఈ ఇరవై రూపాయిల కి ఎంత అన్నం వస్తె అంతే పెట్టండి !

ఒట్టి అన్నమైనా పర్లేదు, అదే మహా ప్రసాదం అనుకుని తింటాను" అంటూ ఆ యజమానితో అంటాడు.

ఆ పెద్దాయన మాటలు ఆ యజమానిని మనసుని చాలా బలంగా తాకాయి.

దాంతో ఆ యజమాని...

" అరేయ్ బాబాయ్..!

ఈ హోటల్ నాదే,

దీనికి నేనే యజమానిని ,

నేనిక్కడ ఎంత చెప్తే అంత !

ఇంతకుముందు జరిగిందేమి మీరు పట్టించుకోకండి ! " అంటూ అతన్ని కొంచెం ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

"ఉచితంగా వచ్చేది ఏదైనా తీసుకు చిన్ననాటి నుండి నాకు అలవాటు లేదు. అలా చేస్తే నా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది.

నా ఆకలి తీర్చుకోవడం కోసం నేను నా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేను.

ఈ ఇరవై రూపాయిలు కూడా నేను కష్ట పడి సంపాదించివే.

భిక్షాటన చేసి ఉచితంగా పొందినవి కావు.

రెండ్రోజులుగా అన్నం లేక అలమటిస్తున్నాను ...

ఇంకొన్ని రోజులైనా ఉండగలను, కానీ కాసేపటి క్రితం ఒక యువకుడికి సామాను మోయాడంలో సహాయ పడ్డాను. ఆ సహాయాన్ని అతడు డబ్బుతో కొని, నా చేతిలో ఈ ఇరవై రూపాయిలు పెట్టీ వెళ్ళిపోయాడు. వద్దన్నా వినలేదు.

ఆ శ్రమ వలన ఈ ఆకలి ఇంకొంచెం ఎక్కువైంది !" అంటూ ఆ పెద్దాయన ఆ హోటల్ కి రావడం గల కారణం చెప్పాడు.

ఇక ఆ పెద్దాయన మాటలకు ..

యజమానికే కాదు, నాకు కన్నీళ్లు తెప్పించాయి.

ఇంతలో యజమాని వెయిటర్ ను దగ్గరకి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు.

మిగిలిన కథ తర్వాత భాగంలో...

గమనిక : ఇదొక మానవతా విలువలను తెలియజెప్పే కథ మాత్రమే. కథ కొంచెం పెద్దదిగా ఉండడం చేత దీన్ని భాగాలుగా విడగొట్టి రాయడం జరిగింది. దయచేసి పాఠకులు గమనించగలరు.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్Rate this content
Log in

Similar telugu story from Abstract