SATYA PAVAN GANDHAM

Abstract Drama Crime

4.5  

SATYA PAVAN GANDHAM

Abstract Drama Crime

"ది ఎఫైర్ - 6"

"ది ఎఫైర్ - 6"

6 mins
383


"ది ఎఫైర్ (ruins a human life) - 5" కి

కొనసాగింపు ...

"ది ఎఫైర్ (ruins a human life) - 6"

అలా ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్...

శివరాం ఇంటి వైపుగా కదిలారు.

వాళ్ళు అనుమానించినట్టుగానే, శివరాం ఇంటి గుమ్మం దగ్గర ఎవరివో ఒక మగతని చెప్పులు కనిపించాయి వాళ్ళకి.

దాంతో ఎస్ ఐ అనుమానం మరింత బలపడింది.

లోపలి నుండి లాక్ చేసి ఉన్న డోర్ ని నాక్(కొట్టడం) చేయడం మొదలుపెట్టాడు కానిస్టేబుల్ శ్రీనివాస్.

అలా ఒక ఐదారు సార్లు నాక్ చేసిన పిదప లోపల నుండి తలుపు తెరుచుకుంది.

అలా తెరుచుకున్న తలుపు మాటున ఉంది నాగమణి.

కొంచెం అనుమానం మరియు సీరియస్ లుక్స్ తో కలగలిసిన ఆమెను తదేకంగా చూస్తున్నారు కానిస్టేబుల్ మరియు ఎస్ ఐ.

నాగమణి మాత్రం ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ శ్రీనివాస్ లను చూసి ఒక్కసారిగా షాకయ్యింది.

తన పైట కొంగును రెండు చేతుల మధ్య పట్టుకుని,

ఆ రెండు చేతులతో ఆ కొంగును పదే పదే నలుపుతూ, కొంచెం కంగారు పడుతూ ...

"సార్ ...!

ఎస్ ఐ గారు ...

మీరా ?

ఇలా వచ్చారేంటి సార్ !" అంటూ నీళ్ళు నములుతూ చెమటలు కక్కుతున్న మొహంతో తను కూడా ఆశ్చర్యంతో అడిగింది నాగమణి.

నాగమణిని అలా చూసిన కానిస్టేబుల్ శ్రీనివాస్...

"ఎందుకమ్మా ...

అంతలా టెన్షన్ పడుతున్నారు ?

ఇప్పుడు అంత కొంపలు మునిగిపోయే విషయం ఏం జరిగింది !" అంటూ ఆమె కంగారుకి గల కారణాలను ఆమె నోటి ద్వారానే తెలియ చెప్పించాలనుకున్నాడు.

దానికి నాగమణి షాక్ నుండి తేరుకుని,

"హా ...

అదేం లేదు కానిస్టేబుల్ గారు...

ఈ వేళప్పుడు...

అది కూడా ఆదివారం పూట...

పైగా ఇంత హఠాత్తుగా వచ్చారేంటా ?

అని కొంచెం కంగారు అంతే " అంటూ నుదుట, మెడ భాగంలో పట్టిన చెమటలను తన పైట కొంగుతో తుడుచుకుంటూ బదులిచ్చింది నాగమణి.

"బయట నుండే వివరించమంటారా?

లేక, లోపలికి రావచ్చా?" అంటూ గంభీరమైన స్వరంతో సూటిగా అడుగుతాడు ఎస్ ఐ, నాగమణిని

"అయ్యో...

క్షమించాలి...

నేనేదో కంగారులో మిమ్మల్ని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను.

రండి !

రండి !!

లోపలికి రండి !!" అంటూ వాళ్ళని గుమ్మం లోపలికి ఆహ్వానించింది నాగమణి.

అలా లోపలికి వస్తున్న ఎస్ ఐ మరియు కానిస్టేబుల్

సరిగ్గా అప్పుడే, ఎదురుగానున్న బెడ్ రూం నుండి ఒక తెల్లటి చాయ కలిగి, పొడవాటి, కొంచెం గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి రావడం గమనించారు .

ఆ ఇంట్లో అతను ముందే ఉన్నాడని తెలిసిన పోలీసులు

(వాళ్ళు కూడా అతని కోసమే వచ్చారు లే) అతన్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు.

కానీ, అతను బెడ్ రూం లో నుండి రావడం మాత్రమే వాళ్ళని కొంచెం విస్మయానికి గురిచేసింది.

ఆ పోలీసులు చూపు ఆ వ్యక్తి పై పడడం గమనించిన నాగమణి

అప్పటికే తను ఈ గ్యాప్ లో సిద్దం చేసుకొన్న స్క్రిప్ట్ ప్రకారం...

"ఆ...

అతను నా కాలేజ్ ఫ్రెండ్ ఎస్ ఐ గారు.

నాకూ, మావారికి చాలా క్లోజ్.

మావారు పోయిన విషయం తనకి ఈ మధ్యనే తెలిసిందంటా !

అందుకే, నేను ఒంటరిగా ఎలా ఉంటున్నానోనని, నన్ను పలకరిద్దాం అని వచ్చాడు కొద్ది సేపటి క్రితమే !" అంటూ పోలీసులు అసలు అతని గురించి ఏం అడక్కుండానే కంగారు కంగారుగా తడుముకుంటూ అతని గురించి చెప్పడం మొదలు పెట్టింది.

ఆమె సమాధానాలు విని పోలీసులు సైతం విస్తుపోతున్నారు.

ఇక ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం లోపల బెడ్ రూం నుండి వచ్చీ రావడంతోనే...

"సరే నాగు !

ఇక నేను వెళ్ళొస్తాను !!" అంటూ అక్కడి నుండి కొన్ని క్షణాల్లోనే చక చకా జారుకునే ప్రయత్నం చేశాడు.

అతన్ని ఆపుదామని, కానిస్టేబుల్ శ్రీనివాస్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.

కానీ, ఆ ఎస్ ఐ

"అతన్ని వెళ్లనివ్వు !" అని చెప్పడంతో శ్రీనివాస్ కూడా ఇక అతన్ని వదిలేస్తాడు.

(ఈ టైం, ఈ ప్లేస్ లో అతన్ని విచారించడం సరికాదని, విచారిస్తే అది ఇంటి చుట్టు పక్కల వాళ్ళకి తెలిసి పెద్ద ఇష్యూ అవుతుందని ఎస్ ఐ ఉద్దేశ్యం)

వెంటనే ఎస్ ఐ, నాగమణి వైపు చూడగా...

ఆ అజ్ఞాత వ్యక్తి పోలీసులు వదిలేయడంతో ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు గమనిస్తాడు.

"ఏంటి మేడం !

ఇప్పుడు చాలా రిలాక్స్ అవుతున్నట్టున్నారు !!" అంటూ

ఆ ఎస్ ఐ ఆమెను చాలా కూల్ గా అడగ్గా...

వెంటనే మళ్ళీ నాగమణి కంగారు పడుతూ...

"అదేం లేదు ఎస్ ఐ గారు,

ఆహా..!

అసలు వచ్చినప్పటి నుండి మిమల్ని "ఏం తీసుకుంటారని" అడగడమే మర్చిపోయాను.

కూల్ డ్రింక్ ఆర్ కాఫీ, టీ "అంటూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది.

దానికి ఎస్ ఐ...

"పోలీసులకి కావల్సింది ఆతిధ్యాలు కాదు మేడం

ఎవిడెన్స్? " అంటూ

వాళ్ళు ఉన్న హాల్ అంతా పరిశీలనగా చూస్తూ...

వాళ్ల బెడ్ రూంలోకి వెళతాడు.

అక్కడ బెడ్ మీద పక్క చిందర వందరగా ఉండడం గమనించిన ఎస్ ఐ కి, అక్కడకి వచ్చిన అజ్ఞాత వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం మరింత బలపడుతుంది.

ఆ రూంలో శివరాం ఏమైనా సాక్ష్యాలు విదిపిచిపెట్టాడేమోనన్న ఉద్దేశంతో... ఆ రూం అంతా వెతకమని కానిస్టేబుల్ శ్రీనివాస్ కి చెప్తాడు ఎస్ ఐ.

"అదేంటి ఇంతకు ముందు ఒకసారి వచ్చి రోజంతా సెర్చ్ చేసి వెళ్లారు కదా !

మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఏంటి ?" అంటూ ఆశ్చర్యపోతూ నాగమణి పోలీసులను అడగ్గా...

"మాకు కేసు ఓ కొలిక్కి వచ్చేవరకూ తరుచూ విచారణ చేస్తూనే ఉంటాం. ఇది మా డ్యూటీ !

మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మా పై అధికారులకి చెప్పుకోవచ్చు లేదా కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకోవచ్చు !" అంటూ ఎస్ ఐ సమాధానం ఇస్తాడు.

కోర్టు అనే సరికి, గుటకలు మింగుతూ...

మారు మాట్లాడకుండా నిశబ్ధంగా ఉండిపోతుంది నాగమణి.

కానిస్టేబుల్ శ్రీనివాస్ మాత్రం...

ఆ ఎస్ ఐ చెప్పినట్టు రూం అంతా అణువణువునా పరిశీలిస్తాడు.

"అవునూ...!

మీకొక పాప ఉంది కదా

ఎక్కడ ?

ఈ రోజు ఆదివారం, పైగా స్కూల్ కూడా ఉండదు !" అంటూ ఎస్ఐ తన కనురెప్పలు పైకి ఎగరేస్తూ నాగమణిని చూస్తూ అడుగుతాడు.

"ప..

పాప..

పక్క గదిలో నిద్ర పోతుంది !" అంటూ సమాధానమిస్తుంది నాగమణి.

"పక్క గదిలో పాపను నిద్ర పుచ్చి ఇక్కడ రంకు మొగుడితో సరసాలు ఆడతున్నావా ?

పైగా భర్త చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ?" అంటూ ఆ ఎస్ మరియు కానిస్టేబుల్ ఇద్దరూ మనసులో అనుకుంటూ ఆమెను ఒక సీరియస్ లుక్ తో చూస్తారు.

పోలీసుల మనసులో భావం ...

వాళ్ల మోహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వాళ్ళని తదేకంగా చూస్తున్న నాగమణి కి.

ఇక ఎస్ ఐ పక్క గదిలోకి వెళ్లి,

అక్కడ కూడా తను ఆ రూం అంతా అణువణువునా వెతుకుతాడు, నిద్రపోతున్న ఆ పాపను ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా...

ఇక ఎస్ ఐ కి కూడా ఆ రూం లో ఏం లభించవు.

ఈ లోపు పక్క గదిలో నుండి కానిస్టేబుల్ వచ్చి

"ఆ రూం లో ఎంత వెతికినా ఎలాంటి ఆధారాలు లభించలేదు సార్ !" అంటూ ఎస్ ఐ చెప్తాడు.

"హమ్ సరే !

ఇక వెళ్దాం పదా!" అంటూ ఎస్ ఐ, కానిస్టేబుల్ తో పాప ఉన్న గది నుండి బయటకు వచ్చేస్తుండగా...

అక్కడే తలుపుకి వేలాడతూ ఒక స్కూల్ బ్యాగ్ కనిపిస్తుంది.

అది పాపది.

వెంటనే ఎస్ ఐ కి,

శివరాం రాసిన కవితలు, కథలు గుర్తుకువస్తాయి. అతను తన రచనలు రాసిన పేపర్స్ తన పాప పుస్తకాల లోనివి కదా అని.

ఆ స్కూల్ బ్యాగ్ తడుముతూనే,

పక్కనున్న కానిస్టేబుల్ తో ఎస్ ఐ

"శ్రీనివాస్..!

శివరాం తన కథలు, కవితలు ఈ పాప పుస్తకాల్లో ఉన్న పేజీలలోనే రాశాడు కదా !" అంటూ అతన్ని అడుగుతాడు.

"అవును సార్ !" అంటూ బదులిస్తాడు శ్రీనివాస్.

అలా ఆ పాప స్కూల్ పుస్తాకాలు తడుముతున్న అతనికి ఒక పుస్తకం మధ్య పేజీలలో

"సూసైడ్ నోట్ -1 (ఒక ఫెయిల్యూర్ పర్సన్ కథ) " అనే ఒక కథ కనిపించింది.

దాంతో షాక్ తిన్న ఎస్ ఐ...

దాన్ని చదవడం ప్రారంభించాలి అనుకున్నాడు...

కానీ, తనకి అక్కడ అది అనువైన ప్లేస్ లా కనిపించలేదు. అందుకే దాన్ని మూసి, బయటకి ఆ బుక్ తీసుకుని వచ్చాడు ఎస్ ఐ.

బయట హాల్లో ఉన్న నాగమణి, ఆ ఎస్ ఐ తన చేతిలో ఉన్న పాప బుక్ ని, బయటకు వస్తున్న ఎస్ ఐ ని చూస్తూ

"ఏమైనా ఆధారాలు లభించాయా సార్ !" అంటూ అడిగింది.

దానికి ఎస్ ఐ తన చేతిలో ఉన్న బుక్ చూపిస్తూ...

"ప్రస్తుతానికి ఈ బుక్ !

అదే...

యదావిధిగా శివరాం ఎప్పుడూ తన పాప బుక్ లో రాసిన ఏదో కథ అయ్యింటుంది !" అంటూ చెప్పాడు.

(అది ఒక సూసైడ్ నోట్ అనే విషయాన్ని ఆమె దగ్గర దాస్తూ...

ఎందుకంటే...

ఒకవేళ ఆ సంగతి తెలిస్తే, ఆమె జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి)

"ఆ బుక్ లో దేని గురించి రాశారు !

అంటే, నా ఉద్దేశ్యం కథా ?

కవితా ?

ఎలాంటివి ?" అంటూ కొంచెం భయపడుతూ అడిగింది నాగమణి ఆ ఎస్ ఐ ని

"మేము కూడా పూర్తిగా చదవలేదు.

చదివిన తర్వాత అన్ని విషయాలు బయట పడతాయి " అంటూ ఆ ఎస్ ఐ గంభీరంగా అనగానే

నాగమణి భయం మరి కొంచెం ఎక్కువైంది.

అది గమనించిన ఎస్ ఐ...

"అదే...

అది ఎలాంటి కథో ?

ఎలాంటి కవితో ? అన్న విషయం బయట పడుతుంది అంటున్నా !" అంటూనే

ఆ బుక్ నుండి ఆమె దృష్టిని మరల్చడానికి...

"అవును ...

ఆరోజు విచారణలో మీదీ, మీ భర్తది లవ్ మ్యారేజ్ అన్నారు.

మరి మీ అన్నయ్య, నాన్న గారు ఏంటి...

మీరు వేరే ఎవరినో ప్రేమిస్తే,

తప్పనిసరి పరిస్థితుల్లో శివరాం తో పెళ్ళి చేశాం అంటున్నారు ?

ఇందులో ఏది నిజం !" అంటూ ఆమెను ముక్కు సూటిగా ప్రశ్నిస్తాడు ఎస్ ఐ.

మళ్ళీ చెమటలు పడుతుంటాయి నాగమణికి,

"అది అది

మాది లవ్ మ్యారేజ్ సార్ !

కానీ, ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేదు. మా ఆయనంటే, మా అన్నయ్యకి అస్సలు పడదు. ఎక్కడ నలుగురికి తెలిసి కుటుంబ పరువు పోతుందేమోనని మీతో అలా చెప్పి ఉంటారు సార్ !" అంటూ కంగారు పడుతూ మరింత తడబడతూ చెప్పింది నాగమణి.

"పరువుల కోసం, పరుపుల కోసం నిజాన్ని దాస్తే,

నష్టపోయేది నిందితులు మాత్రమే.

చట్టం దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు !" అంటూ

"ఇక మేము వెళ్ళొస్తాం మేడం !" అంటూ అక్కడి నుండి ఆ బుక్ తమతో తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు.

బయటకి కొంత దూరం వచ్చాకా !

కానిస్టేబుల్ శ్రీనివాస్, ఎస్ ఐ తో

"అదేంటి సార్ !

వలలో చిక్కిన చేపను అలా వదిలేశారు !" అంటూ అడుగుతాడు.

దానికి ఎస్ ఐ ఆశ్చర్యంతో...

"అర్థం అయ్యేట్టు చెప్పు శ్రీనివాస్ ...!

నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ !" అంటూ అడుగుతాడు ఎస్ ఐ

"అదే సార్

నాగమణి ఇంటికి వస్తున్నాడే, వాడి గురించి !"

అంటూ శ్రీనివాస్ చెప్పగా

"వాడి మొహం వాడెక్కడికి తప్పించుకోగలడు !

అయినా...

ఇప్పుడు మన దగ్గర ఏ ఆధారం లేకుండా వాడిని విచారించడం కరెక్ట్ కాదు. విషయం మనకి తెలిసిందని తెలిస్తే, తప్పించుకునే అవకాశం కూడా ఉంది.

చూసీ చూడనంత వరకూ వాడు కూడా భయపడకుండా ఇక్కడిక్కడే మసులుతూ ఉంటాడు.

ఆల్రెడీ ఆమె తన క్లోజ్ ఫ్రండ్ అని చెప్పింది కదా !

డిటైల్స్ అవే వస్తాయి లే." అంటూ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు.

ఆ బుక్ లో శివరాం రాసింది నిజంగా సూసైడ్ నోట్ ఆ ?

లేక తన రచనలో భాగమైన ఒక కల్పిత కథా ?

ఆ అజ్ఞాత వ్యక్తిని పెట్టుకోకుండా పోలీసులు తప్పు చేశారా ?

అసలు ఆ బుక్ లో శివరాం ఏం రాశాడు ?

లాంటి విషయాలు "ది ఎఫైర్ (ruins a human life) - 7" లో తెలుసుకుందాం.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️Rate this content
Log in

Similar telugu story from Abstract